వరి పోరాటం ఏమైంది.. ఢిల్లీలో కేసీఆర్ పనేంటీ?
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఢిల్లీ వెళ్లారు. ఒకటి రెండురోజుల్లో కేంద్ర ప్రభుత్వంతో వడ్ల పంచాయతీ తేల్చుకుని, వచ్చే యాసంగి పంటల పై క్లారిటీ ఇస్తానని డెల్లి వెళ్ళీ ముందు ముఖ్యమంత్రి స్వయంగా చెప్పారు. అయితే ముఖ్యమంత్రి, మంత్రులు ఢిల్లీ వెళ్లి మూడు రోజులు అయినా ఇంతవరకు, కేంద్ర మంత్రులు ఎవరినీ కలవ లేదని సమాచారం. ఆదివారం సాయంత్రం ఢిల్లీ చేరిన ముఖ్యమంత్రి బృందం సోమవారం క్యాంప్ ఆఫీసుకే పరిమితమయ్యారు. తుగ్లక్ రోడ్ 23లోని సీఎం అధికారిక నివాసంలో రెస్ట్ తీసుకున్నారు. అలాగే, కేసీఆర్ వెంట ఢిల్లీ వెళ్ళిన మంత్రులు నిరంజన్ రెడ్డి, గంగుల కమలాకర్, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి, వారికంటే ముందు రోజే ఢిల్లీ చేరుకున్న మంత్రి కేటీఆర్, ఇతర నేతలు సీఎంతోనే ఉన్నారు.
కేంద్రంపై యుద్దాన్ని ప్రకటించి ఢిల్లీ వెళ్ళిన ముఖ్యమంత్రి మూడు రోజులు అయినా, ఇంకా శంఖారావం పూరించక పోవడం ఏమిటని రాజకీయ వర్గాల్లో చర్చ మొదలైంది. హైదరాబాద్’లో వరసగా ప్రెస్ కాన్ఫరెన్సులు పెట్టి కేంద్ర ప్రభుత్వాన్ని, బీజేపీని తీవ్రంగా విమర్శించి, చూపిస్తా తడాఖా అంటూ ఢిల్లీ వెళ్ళిన ముఖ్యమంత్రి, రెండురోజులు ఎందుకు మౌనంగా ఉన్నారని రాజకీయ వర్గాల్లో, ముఖ్యంగా అధికార ప్రతి వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. చివరకు కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ అప్పాయింట్మెంట్ ఇచ్చినట్లే ఇచ్చి లేదు పొమ్మన్నా, ముఖ్యమంత్రి కేసేఅర్, మంత్రి కేటీఆర్ ఎందుకు మౌనంగా ఉన్నారని ప్రతిపక్షాల నాయకులు ప్రశ్నిస్తున్నారు.
అయితే ప్రధాని మోడీ, కేంద్ర ఆహర, పౌర సరఫరాల శాఖ మంత్రి పీయూష్ గోయల్, జలశక్తి శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ ల అపాయింట్మెంట్ ముఖ్యమంత్రి కార్యాలయం కోరినట్లు అధికార వర్గాలు చెప్తున్నాయి. అలాగే, ఒకటి రెండురోజుల్లో ప్రధాని, కేంద్ర మంత్రులు అపాయింట్ మెంట్ వస్తుందిని తెరాస నేతలు అంటున్నారు. కాగా, ఢిల్లీలో ఉన్న రాష్ట్ర మంత్రులు, సీఎస్, ఆయా శాఖ ఉన్నతాధికారులతో సీఎం కేసీఆర్ వివిధ అంశాలపై సమీక్ష చేసినట్టు సమాచారం. ఫుడ్ అండ్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సెక్రటరీతో సీఎస్ భేటీ అయ్యారు. కేంద్ర ఫుడ్ అండ్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సెక్రటరీ సుధాన్ష్ పాండేతో రాష్ట్ర చీఫ్ సెక్రటరీ సోమేశ్ కుమార్ భేటీ అయ్యారు. ఢిల్లీలోని కృషి భవన్ లో జరిగిన సమావేశంలో స్పెషల్ చీఫ్ సెక్రటరీ ఫైనాన్స్ రామకృష్ణారావు, స్పెషల్ చీఫ్ సెక్రటరీ అగ్రికల్చర్, సివిల్ సప్లైయర్స్ కమిషనర్ అనిల్ కుమార్, ఢిల్లీ తెలంగాణ భవన్ రెసిడెంట్ కమిషనర్ గౌరవ్ ఉప్పల్ పాల్గొన్నారు. వడ్ల కొనుగోలు కోటా పెంచాలని కోరినట్లు సమాచారం.40 లక్షల టన్నులకు బదులుగా 90 లక్షల టన్నుల బియ్యం కొనాలని, గతంలో చేసిన విజ్ఞప్తినే మళ్ళీ చేశారు.
రాష్ట్రంలో రైతులు ముఖ్యమంత్రి రాకకోసం ఎదురు చూస్తున్నారు. యాసంగిలో వారి వేయాలా వద్దా అనే విషయంలో ముఖ్యమంత్రి వచ్చి క్లారిటీ ఇస్తారని, అదే విధంగా వర్షాలలో తడిసి ముద్దాయి పోతున్న వర్షాకాలం పంట కొనుగోలు వేగం పుంజుకుని తమకు కొంత ఊరట లభిస్తుందని ఆశిస్తున్నారు. అయితే, ముఖ్యమంత్రి ఢిల్లీ నుంచి ఎప్పుడొస్తారనే దానిపై అధికారులు కూడా ఏమీ చెప్పలేక పోతున్నారు. ప్రధాని, మంత్రులు అప్పాయింట్మెంట్ ఇచ్చేవరకు అక్కడే ఉంటారా లేక ఢిల్లీ వెళ్ళిన స్వకార్యం పూర్తి చేస్కుని వేనుతిరుగుతారా అనేది అధికారులు కూడా చెప్పలేక పోతున్నారు.