అమరావతికి బీజేపీ సంపూర్ణ మద్దతు.. అంగుళం కూడా కదలబోదన్న సోము
posted on Nov 21, 2021 @ 12:41PM
కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఇచ్చిన క్లాస్ తో ఆంధ్రప్రదేశ్ బీజేపీ నేతలకు జ్ఞానోదయం అయింది. తమ పార్టీ అమరావతి మద్దతుగా తీర్మానం చేసినా.. ఇంత కాలం ఉద్యమానికి మద్దతు ఇవ్వలేదు ఏపీ బీజేపీ నేతలు. రాజధాని రైతుల నుంచి తీవ్ర విమర్శలు వచ్చినా వాళ్లలో చలనం రాలేదు. కాని అమిత్ షా సమావేశంతో సీన్ మారిపోయింది. అమరావతి రాజధానికే కట్టుబడి ఉన్నామన్న అమిత్ షా ఆదేశాలతో సోము వీర్రాజు బృందం పరుగులు పెడుతోంది. ఇప్పటి వరకూ అమరావతి ఉద్యమానికి దూరంగా ఉన్న బీజేపీ ఇప్పుడు సంపూర్ణ మద్దతు పలికింది.
ఏపీ బీజేపీ చీఫ్ సోము వీర్రాజుతో పాటు ముఖ్య నేతలు అమరావతి రైతుల పాదయాత్రలో పాల్గొని సంఘీభావం తెలిపారు. ఆదివారం ప్రకాశం జిల్లా నుంచి నెల్లూరు జిల్లాలోకి ఎంటరైంది పాదయాత్ర. విజయవాడ నుంచి పురందేశ్వరితో కలిసి వెళ్లిన సోము వీర్రాజు.. నెల్లూరు సరిహద్దులో అమరావతి రైతులను కలిశారు. వారికి మద్దతు తెలుపుతూ కొంత సేపు పాదయాత్రలో పాల్గొన్నారు. సోము వీర్రాజు, పురంధేశ్వరితో పాటు బీజేపీ నేతలు, కార్యకర్తలు అమరావతి రైతులతో కలిసి నడిచారు. ఇక ఎంపీ సుజనా చౌదరి గన్నవరం విమానాశ్రయం నుంచి ర్యాలీగా ఈ యాత్రకు బయలుదేరారు. బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు కన్నా లక్ష్మీనారాయణ కాజా నుంచి ఈ యాత్రలో పాల్గొంటుండగా.. మరో ఎంపీ సీఎం రమేష్ నేరుగా నెల్లూరు జిల్లా కావలి వద్ద నుంచి రైతులతో కలిసి నడవనున్నట్లు పార్టీ నేతలు తెలిపారు.
రాజధాని అమరావతికి బీజేపీ కట్టుబడి ఉందని ఆ పార్టీ నాయకురాలు పురందేశ్వరి, సోము వీర్రాజు తెలిపారు. అమరావతి నుంచి రాజధాని అంగుళం కూడా కదలదని చెప్పారు. అమరావతికి తాము కట్టుబడి ఉన్నామని గతంలోనే పార్టీ తీర్మానం చేసి తమ అభిప్రాయాన్ని వెల్లడించామని వివరించారు. ఇప్పుడు ప్రత్యక్షంగా రైతుల మహాపాదయాత్రలో పాల్గొంటూ వారికి మరింత అండగా నిలుస్తామని చెప్పారు. శాంతియుతంగా తమ నిరసన తెలియజేస్తోన్న అమరావతి ప్రాంత రైతులపై పోలీసుల ఆంక్షలు, దౌర్జన్యాలు సరికాదన్నారు.
రాజధాని చుట్టూ కేంద్ర ప్రభుత్వం అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టింది.. అభివృద్ధి చేస్తోందన్నారు పురందేశ్వరి. అమరావతి అభివృద్ధికి కేంద్రం రూ.1500 కోట్లు కేటాయించిందని గుర్తు చేశారు. బీజేపీ సహకరించడం లేదనే మాటలు అవాస్తవమని తెలిపారు. ఏపీకి ఇచ్చే హామీల విషయంలో కేంద్రం ఎక్కడా మడమ తిప్పలేదని, కేంద్రం నిధులతోనే ఏపీలో అభివృద్ధి జరుగుతుందని చెప్పుకొచ్చారు.ఎవరూ ఊహించని విధంగా కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి అనేక విధాలుగా సహకరిస్తోందని తెలిపారు. రాష్ట్రానికి బీజేపీ సహకరించడం లేదనే మాట అవాస్తవమని వారు చెప్పారు.
తిరుపతి పర్యటనకు వచ్చిన కేంద్ర మంత్రి అమిత్ షా బీజేపీకి చెందిన హేమాహేమీలతో ప్రత్యేకంగా సమావేశమై రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులను తెలుసుకోవడంతో పాటు.. పార్టీ బలోపేతం ముఖ్యంగా అమరావతి ఉద్యమం గురించి నిశితంగా చర్చించారు. అనంతరం రైతుల పాదయాత్రలో పాల్గొని సంఘీభావం తెలిపాలని రాష్ట్ర నాయకత్వానికి ఆయన ఆదేశించారు. దీంతో బీజేపీ నేతలు ప్రత్యక్షంగా అమరావతి రైతుల పాదయాత్రలో పాల్గొంటున్నారు.