వరదల్లో జనం చస్తుంటే..పెళ్లి వేడుకల్లో సీఎం! ఏపీకి దిక్కెవరు..?
posted on Nov 21, 2021 @ 4:40PM
ఆంధ్రప్రదేశ్ ను వరదలు ముంచెత్తుతున్నాయి. చిత్తూరు, కడప, నెల్లూరు జిల్లాలు భారీ వర్షాలకు అతలాకుతలమవుతున్నాయి. ఇంకా పలు గ్రామాలు జలదిగ్బంధంలోనే ఉన్నాయి. రోడ్లు కోతకు గురవుతున్నాయి. వంతెనలు కూలిపోతున్నాయి. ప్రాణ, ఆస్తుల నష్టాలతో పలు ప్రాంతాలవారు క్షణమొక యుగంలా గడుపుతున్నారు. పంట పొలాలు మునిగాయి. గ్రామాల్లో అంథకారం అలుముకుంది. బాధితులు కట్టుబట్టలతో మిగిలారు. ఇళ్లల్లోని వస్తువులు వరద నీటితో కలిసిపోయాయి. భారీ వర్షాలతో ఇప్పటి వరకు 27మంది మరణించారు. వరదల కారణంగా పలువురు గల్లంతయ్యారు. వారి కోసం గాలింపుచర్యలు కొనసాగుతున్నాయి.
కడప జిల్లాలో అధికారిక లెక్కల ప్రకారం 24 మంది గల్లంతు కాగా 12 మృతదేహాలు గుర్తించారు. అయితే సుమారు 100 మందికి పైగా ప్రాణాలు కోల్పోయినట్లు గ్రామాల ప్రజలు చెపుతున్నారు. భారీగా ఆస్తులు, వేల ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయి. వరద ముంపు ప్రాంతాల్లో బాధితులకు మంచినీరు, ఆహారం అందడంలేదు. అధికారులు, వాలంటీర్లు పట్టించుకోవడంలేదు. వంతెనలు కొట్టుకుపోవడంతో వందలాది గ్రామాలకు.. ఇతర ప్రాంతాలతో సంబంధాలు తెగిపోయాయి. మరమత్తులు ఎప్పుడు పూర్తి అవుతాయో కూడా తెలియని పరిస్థితి. దీంతో జల దిగ్బంధంలో చిక్కుకున్న గ్రామాల ప్రజలు తీవ్ర ఆందోళన చెందుతున్నారు.
రాయలసీమలో ఇంతటి దారుణ పరిస్థితులు ఉంటే ప్రభుత్వం ఏ మాత్రం పట్టించుకోవడం లేదనే విమర్శలు వస్తున్నాయి. తన సొంత జిల్లా అతలాకుతలం అవుతున్నా జగన్ కనీసం కనికరించడం లేదని అంటున్నారు. ఇదిలా ఉండగానే హైదరాబాద్ లో జరిగిన పెళ్లి వేడుకకు సీఎం జగన్మోహన్ రెడ్డి హాజరుకావడం తీవ్ర దుమారం రేపుతోంది. వరదలతో జనాలు అల్లాడుతుంటే పట్టించుకోకుండా వివాహానికి జగన్ హాజరుకావడంపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. పెళ్లికి వెళ్లడమే కాదు.. అక్కడ తెలంగాణ ముఖ్యమంత్రితో మంతనాలు సాగించారు జగన్మోహన్ రెడ్డి.
తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి మనవరాలు స్నిగ్ధారెడ్డి పెళ్లి వేడుక శంషాబాద్ కొత్తగూడలోని వీఎన్ఆర్ ఫామ్స్‌లో వివాహం జరిగింది. ఏపీ సీఎం జగన్ వద్ద ప్రత్యేకాధికారిగా పని చేస్తున్న కృష్ణమోహన్ రెడ్డి కుమారుడైన రోహిత్ రెడ్డితో స్నిగ్ధారెడ్డి మూడు ముళ్లు వేయించుకున్నారు. ఈ పెళ్లికి కేసీఆర్, జగన్ హాజరయ్యారు. ఇద్దరూ చాలా సేపు పక్కపక్కనే కూర్చుని చాలాసేపు కబుర్లు చెప్పుకున్నారు. ఇదే ఇప్పుడు రచ్చగా మారింది. సీఎం జగన్ పై విపక్షాలు తీవ్రంగా మండిపడుతున్నాయి. రాయలసీమ వరదల్లో ఉంటే ముఖ్యమంత్రి కులాసాగా పెళ్లికి వెళ్లడం దారుణమంటూ టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ట్వీట్ చేశారు.కేసీఆర్ తో కలిసి జగన్ వివాహ వేడుకల్లో పాల్గొన్న ఫోటోను తన పోస్టుకు జత చేసిన లోకేష్.. ఘాటు వ్యాఖ్యలు చేశారు.
వరదల్లో చిక్కుకుని ప్రజలు ప్రాణాలు రక్షించాలని వేడుకుంటున్నారని లోకేష్ అన్నారు. జనాలను ఆదుకోవడంలో విఫలమైన ముఖ్యమంత్రి.. తీరిగ్గా పెళ్లిళ్లకు వెళుతున్నారని కామెంట్ చేశారు. సేవ్ ఆంధ్రప్రదేశ్ అంటూ పోస్ట్ చేశారు నారా లోకేష్. సీఎం జగన్ తీరుపై సోషల్ మీడియాలోనూ పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఏపీని దేవుడే కాపాడాలంటూ కొందరు నెటిజన్లు పోస్టులు పెడుతున్నారు. హుదూద్ తుపాను సమయంలో విశాఖలో చంద్రబాబు చేసిన పనులు వివరిస్తూ మరికొందరు పోస్టులు పెట్టారు. చంద్రబాబు, జగన్ ను పోల్చుతూ చాలా మంది నెటిజన్లు తమదైన శైలిలో కామెంట్లు చేస్తున్నారు.