ఢిల్లీకి చేరిన వరి యుద్ధం.. మోడీతో తేల్చుకుంటానంటున్న సీఎం
posted on Nov 20, 2021 @ 6:43PM
తెలంగాణలో కొన్ని రోజులుగా ప్రకంపనలు రేపుతున్న వరి ధాన్యం కొనుగోలు యుద్దం ఢిల్లీకి చేరుతోంది. తెలంగాణ వరి ధాన్యం కొంటారో లేదో చెప్పాలంటూ కేంద్రానికి రెండు రోజుల డెడ్ లైన్ విధించిన కేసీఆర్.. ఆ గడువు ముగియడంతో మరోసారి మీడియా ముందుకు వచ్చారు. తమ డిమాండ్ పై కేంద్రం నుంచి స్పందన రాలేదని చెప్పారు. యాసంగిలో ధాన్యం కొనుగోలుతో కేంద్రంతో తేల్చుకుంటామని సీఎం కేసీఆర్ ప్రకటించారు. చివరి ప్రయత్నంగా ఆదివారం ఢిల్లీకి వెళ్లి కేంద్రమంత్రులను కలుస్తామని ప్రకటించారు. అవకాశం ఉంటే ప్రధాని మోదీని కూడా కలుస్తామని తెలిపారు.
వరి ధాన్యం కొనుగోళ్లపై కేంద్రం సరైన స్పష్టత ఇవ్వడం లేదని సీఎం కేసీఆర్ అన్నారు. ఎన్నిసార్లు డిమాండ్ చేసినా కేంద్రం స్పందించడం లేదని దుయ్యబట్టారు. ధాన్యం కొనుగోళ్లపై కేంద్రం వైఖరిని ఎండగట్టారు గులాబీ బాస్. తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన వరిధాన్యం కొనుగోలు మీద జరుగుతున్న వ్యవహారంలో ఎన్నిసార్లు నిరంతరంగా డిమాండ్ చేసినా కేంద్రం నుంచి ఉలుకూ లేదు పలూకు లేదని చెప్పారు. ఎటువంటి సమాధానం కూడా వస్తలేద్ననారు. అన్ని రాష్ట్రాల నుంచి ధాన్యం సేకరించినట్లే తెలంగాణ నుంచి సేకరించాలని అన్నారు కేసీఆర్. వచ్చే సంవత్సరం టార్గెట్ వెంటనే ఇవ్వాలన్నారు, కేంద్రం ఇచ్చే టార్గెట్ ను బట్టి రాష్ట్రంలో సర్దుబాటు చేయాల్సి ఉంటుందని కేసీఆర్ చెప్పారు. దీనిపై కేంద్రానికి ఎన్ని సార్లు చెప్పినా సరైన పద్ధతుల్లో రావడం లేదన్నారు.
సాగు చట్టాలను వెనక్కి తీసుకోవడంపై కేసీఆర్ సంతోషం వ్యక్తం చేశారు. అయితే పై ప్రధాని మోడీ క్షమాపణ చెప్తే సరిపోదన్నారు. రైతులపై పెట్టిన కేసులను తక్షణమే ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. చనిపోయిన రైతుల కుటుంబాలకు కేంద్ర సర్కార్ రూ.25 లక్షల ఎక్స్‌గ్రేషియో ఇవ్వాలని కేసీఆర్ డిమాండ్ చేశారు. తెలంగాణ ప్రభుత్వం నుంచి చనిపోయిన ఒక్కో రైతు కుటుంబానికి మూడు లక్షల రూపాయల ఎక్స్ గ్రేషియా ప్రకటించారు కేసీఆర్.