తిరుపతికి ముగ్గురు మొనగాళ్లు.. అమరావతి కోసం అరుదైన కలయిక..
posted on Dec 16, 2021 @ 4:18PM
తిరుపతిలో అమరావతి. శుక్రవారం భారీ బహిరంగ సభ. ఏపీ రాజధాని అమరావతి పరిరక్షణ మహోద్యమ సభ. పెద్ద ఎత్తున ఏర్పాట్లు. వేలాదిగా అమరావతి మద్దతుదారులు. అందుకే, ఇప్పుడు అన్నిదారులూ తిరుపతి వైపే మళ్లుతున్నాయి. తిరుపతిలో అమరావతి నినాదం మారుమోగుతోంది. ఇక, రాజధాని రైతుల సభ.. అరుదైన రాజకీయ కలయికగా మారుతోంది. టీడీపీ-జనసేన-వైసీపీ ప్రముఖులు వేదికను పంచుకోనున్నారు. సుదీర్ఘ విరామం తర్వాత.. టీడీపీ అధ్యక్షులు చంద్రబాబు, జనసేనాని పవన్ కల్యాణ్‌లు ఒకే సభలో ప్రసంగించనున్నారు. వీరికి వైసీపీ రెబెల్ ఎంపీ రఘురామ సైతం తోడవుతుండటం.. తిరుపతి సభ ముగ్గురు మొనగాళ్ల సభగా మారనుందని అంటున్నారు.
చంద్రబాబు + పవన్‌కల్యాణ్‌ల కలయికపైనే అందరి ఆసక్తి. 2014లో టీడీపీకి జనసేన మద్దతు ఇచ్చింది. చంద్రబాబు గెలుపు కోసం పవన్‌కల్యాణ్ కృషి చేశారు. జగన్‌ను చిత్తుగా ఓడించారు. ఆ తర్వాత మారిన సమీకరణాల నేపథ్యంలో టీడీపీ నుంచి జనసేన దూరం జరిగింది. బీజేపీతోనూ కటీఫ్ చేసుకుంది. పవన్ దెబ్బకి.. 2019లో వైసీపీని విజయం వరించింది. నవ్యాంధ్ర భవిష్యత్తు అంథకారమయమైంది. రెండేళ్లుగా చంద్రబాబు-పవన్‌ల మధ్య ఎలాంటి వైరం లేదు. సానుకూలతే ఉంది. బాబు నివాసంపై వైసీపీ దాడికి యత్నించడం, టీడీపీ ఆఫీసు విధ్వంసం, అసెంబ్లీలో భువనేశ్వరిపై అసంబద్ధ వ్యాఖ్యల వివాదం.. ఇలా పలు అంశాల్లో పవన్‌కల్యాణ్ చంద్రబాబుకు బాసటగా నిలిచారు. వైసీపీ తీరును తీవ్ర స్థాయిలో తప్పుబట్టారు. ఇక, స్థానిక సంస్థల ఎన్నికల్లో అనధికారికంగా టీడీపీ + జనసేన అభ్యర్థులు, కార్యకర్తలు పరస్పరం సహకరించుకున్నారు. ఉమ్మడి శత్రువు జగన్‌ను ఓడించేందుకు ఆ రెండు పార్టీలు క్షేత్ర స్థాయిలో కలిసిపోయాయి. అధినేత లెవెల్‌లో మాత్రం ఆ సఖ్యత ఇంకా బహిరంగం కాలేదు. తాజాగా, తిరుపతిలో అమరావతి రైతుల సభావేదికను చంద్రబాబు, పవన్‌కల్యాణ్‌లు కలిసి పంచుకోవడం సర్వత్రా ఆసక్తికరంగా మారింది. ఏడేళ్ల కిందటి జ్ఞాపకాలను గుర్తుకు తెస్తున్నాయి.
చంద్రబాబు, పవన్‌కల్యాణ్‌లే కాదు.. జగన్‌కు, విజయసాయిరెడ్డికి కంట్లో నలుసుగా మారిన రెబెల్ ఎంపీ రఘురామ కృష్ణరాజు సైతం తిరుపతి సభకు వర్చువల్ విధానంలో అటెండ్ కానుండటం ఇంట్రెస్టింగ్ పాయింట్. ప్రతీరోజూ ప్రెస్‌మీట్లతో, కోర్టులో బెయిల్ రద్దు పిటిషన్లతో, పార్టమెంట్‌లో ప్రస్తావనతో, కేంద్ర పెద్దలకు ఫిర్యాదులతో.. జగన్ సర్కారుకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నారు రఘురామ. నవరత్నాలను నలగ్గొడుతున్నారు. సీఐడీ కస్టడీతో రఘురామను కట్టడి చేయాలనుకున్న ప్రభుత్వ కుతంత్రాన్ని సమర్థవంతంగా అడ్డుకొని.. ఏమాత్రం అదరక, బెదరక.. గోడకు కొట్టిన బంతిలా మరింత దూకుడుగా జగన్‌కు చుక్కలు చూపిస్తున్నారు రఘురామ. అలాంటి రఘురామ కృష్ణరాజు తిరుపతి సభలో వర్చువల్‌గా ప్రసంగించనున్నారు. అమరావతికి, రాజధానికి మొదటి నుంచీ స్ట్రాంగ్ సపోర్టర్‌గా ఉన్న రఘురామ.. చంద్రబాబు, పవన్‌లతో పాటే తిరుపతి వేదికగా తన గళాన్ని బలంగా వినిపించనుండటం సంచలనంగా మారనుంది. ఇలా.. ముగ్గురు మొనగాళ్లలాంటి చంద్రబాబు- పవన్ కల్యాణ్- రఘురామ కృష్ణంరాజులు.. తిరుపతి సభకు సెంటరాఫ్ అట్రాక్షన్‌గా నిలుస్తున్నారు. ఈ పరిణామం అమరావతి రైతుల్లో ఉత్సాహం.. జగన్ ప్రభుత్వంలో కలవరం.. నింపుతోంది. తిరుపతి సభతో తాడేపల్లి ప్యాలెస్‌లో డేంజర్ బెల్స్ మోగుతున్నాయని అంటున్నారు.