చెన్నైలోనూ చుక్కెదురు? గులాబీ బాస్ పై నమ్మకం పోయిందట?
posted on Dec 15, 2021 @ 6:43PM
తెలంగాణ ముఖ్యమంత్రి, తెరాస అధ్యక్షుడు కేసీఆర్ కు ఇప్పుడు ఎదురు దెబ్బల సీజన్ నడుస్తోందా? ఒకప్పుడు పట్టిందల్లా బంగారంగా, ఎదురన్నదే లేదన్నట్లుగా సాగిన ఆయన రాజకీయ ప్రస్థానం ఇప్పుడు పట్టాలు తప్పిందా? ఇప్పుడు ఆయన అడుగడుగునా అవరోధాలను ఎదుర్కుంటున్నారా? అంటే అవుననే, అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. నవంబర్ నెల చివరి వారంలో, ముఖ్యమంత్రి కేసీఆర్ వరి ధాన్యం కొనుగోలు విషయంగా కేంద్ర ప్రభుత్వం పై యుద్ధం ప్రకటించారు.మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలను వెంటపెట్టుకుని ఢిల్లీకి వెళ్ళారు. నాలుగు రోజులు అక్కడే ఉంది వట్టి చేతులతో వనక్కి వచ్చారు.
నిజానికి, కొని తెచ్చుకున్న హుజూరాబాద్ ఉప ఎన్నిక మొదలు, కేసీఆర్ ఆలోచనలకు అవరోధాలు ఏర్పడుతున్నాయి. అందుకే,ఆయన ఎప్పటికప్పుడు వ్యూహాన్ని మార్చుకుంటూ కొత్త దారులు వెతుక్కుంటున్నారని పరిశీలకులు అంటున్నారు. ఇలా ఓ వంక రాజకీయంగా ఎదురు దెబ్బలు తప్పడం లేదు. హుజూరాబాద్ తర్వాత తాడును చూసి పామని భయపడవలసి వస్తోంది. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో అదే జరిగింది.సొంత బలం ఉన్నా, క్యాంపు రాజకీయాలు చేయక తప్పలేదు .ఏకగ్రీవంగా ఆరు, ఎన్నికలు జరిగిన ఆరు,మొత్తం 12 స్థానల్లో తెరాస అభ్యర్ధులు గెలిచినా, ఏదో వెలితి వెంటాడుతోంది.
అదలా ఉంటే ముఖ్యమంత్రి సకుటుంబ సమేతంగా సాగించిన మూడు రోజుల తమిళనాడు యాత్ర కూడా ఆశించిన ఫలితం ఇవ్వలేదని, తమిళ నాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్, కాంగ్రెస్’తో తెగతెంపులు చేసుకుని తాడు బొంగరం లేని దక్షిణాది రాష్ట్రాల కూటమిలో చేరేందుకు సిద్దంగా లేరు. అదే విషయం ఆయన కేసీఆర్’కు సున్నితంగా చెప్పారని సమాచారం. .తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ కుటుంబం, కేసీఆర్ కుటుంబానికి చక్కని ఆతిధ్యం ఇచ్చారు. కానీ, రాజకీయాల విషయం వచ్చేసరికి,చేతులు కలిపేందుకు మొహమాటం లేకుండా సారీ అని చెప్పేశారని సమాచారం. విశ్వనీయ సమాచరం మేరకు, దక్షిణాది రాష్ట్రాల విషయంలో కేంద్ర ప్రభుత్వం చూపిస్తున్న వివక్షపై కేసీయార్ తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ తో సుదీర్ఘంగా చర్చించారు. కేంద్రంపై తన పోరాటానికి మద్దుతు కావాలని కోరారు, అయితే, స్టాలిన్ కేంద్రంతో కయ్యానికి సిద్దంగా లేనని, అదే సమయంలో కేంద్రం తేల్చుకోవలసిన అంశాలుంటే కాంగ్రెస్ సారధ్యంలోని యూపీఏ కూటమి ద్వారా పోరాటం చేస్తామని కుండబద్దలు కొట్టినట్లు సమాచారం. ఒక్క మాటలో చెప్పాలంటే కేసీఆర్ తో చెలిమికి స్టాలిన్ నో. అనేశారు.
అంతే కాకుండా, కేసీయార్ ట్రాక్ రికార్డు తెలిసిన స్టాలిన్, గులాబీ బాస్ కు ఎంత దూరంగా ఉంటే అంత మంచిదనే భావంతో ఉన్నట్లు డిఎంకే వర్గాల సమాచారం. ఈ సందర్భంగా స్టాలిన్ సన్నిహిత సహచరుడు ఒకరు, తెలంగాణ ముఖ్యమంత్రి గతంలోనూ ప్రధాని మోడీకి వ్యతిరేకంగా ఒడిస్సా సీఎం నవీన్ పట్నాయక్, పశ్చిమబెంగాల్ సీఎం మమతాబెనర్జీతో భేటీ అయ్యారు. ఆ తర్వాత ఏమైందో తెలీదు కానీ వాళ్ళిద్దరూ కేసీయార్ తో చేతులు కలపలేదని, గుర్తు చేశారు. నిజానికి, కేసీఆర్’ రాష్ట్రంలోనే కాదు దేశం మొత్తంలో కూడా విశ్వసనీయతను కోల్పోయారు. అందుకు కారణం లేక పోలేదు ఆయన హైదరబాద్ లో ఒక మాట ఢిల్లీలో ఇంకొక మాట చెప్పటం అందరూ గమనిస్తున్నారు. మొన్నటికి మొన్న హైదరాబాద్ లో వరసగా రెండు రోజులు రచ్చచేసి, ఆ తర్వాత మౌనంలోకి వెళ్ళారు. అంతకు ముందు కూడా మోడీతో ఇక యుద్ధమే అని హైదరాబాద్ లో ప్రకిటించిమ ఢిల్లీ వెళ్ళి మోడీకి నమస్కారం పెట్టి వచ్చారనే ప్రచారం జరిగింది.ఇలా నిలకడలేకుండా ఏ ఎండకు ఆ గొడుగు అన్నట్లుగా వ్యవహరించడం వల్లనే కేసీయార్’ను ఎవరు విశ్వసించడం లేదని అంటున్నారు. అందుకే, మొన్న నవీన్ పట్నాయక్, మమతా బెనర్జీ, నిన్న స్టాలిన్ ...సారీతో సరి పెట్టారని అంటున్నారు.