టీమిండియాతో కోహ్లీ వెళ్లలేదా? బీసీసీఐలో రచ్చ ముదురుతోందా?
posted on Dec 16, 2021 @ 3:17PM
టీమిండియాలో కొనసాగుతున్న రచ్చ మరింత ముదురుతోంది. వన్డే కెప్టెన్సీ నుంచి తొలగిస్తున్నట్లు తనకు ముందుగా చెప్పలేదంటూ విరాట్ కోహ్లీ చేసిన కామెంట్లు తీవ్ర దుమారం రేపుతున్నాయి. కోహ్లీ వ్యాఖ్యలపై మాజీ క్రికెటర్లు స్పందిస్తున్నారు. బీసీసీఐలో జరుగుతున్న పరిణామాలు బాధాకరంగా ఉన్నాయని, వెంటనే ఈ వివాదానికి తెర దించాల్సిన అవసరం ఉందని చెబుతున్నారు.
ఈ వివాదం సాగుతుండగానే ఊహించని, ఇబ్బందికర పరిణామాల మధ్య టీమిండియా జట్టు దక్షిణాఫ్రికా టూర్ కు బయల్దేరింది. కరోనా నేపథ్యంలో ప్రత్యేక విమానంలో క్రికెటర్లు బయల్దేరారు. విమానంలో ఆటగాళ్లు ప్రయాణిస్తున్న ఫొటోలను బీసీసీఐ ట్విట్టర్ లో షేర్ చేసింది. అయితే ఈ ఫొటోల్లో కోహ్లీ కనిపించడం లేదు. దీంతో సౌతాఫ్రికా టూర్ వెళ్లిన టీమిండియా సభ్యుల్లో విరాట్ కోహ్లీ ఉన్నాడా లేదా అన్న అనుమానం వస్తోంది. అయితే బీసీసీఐ వర్గాలు మాత్రం టీమిండియా సభ్యుల వెంట కోహ్లీ కూడా ఉన్నారని చెబుతున్నారు. మరీ బీసీసీఐ పోస్టు చేసిన ఫోటోలో కోహ్లీ ఎందుకు లేడన్నది మరో వివాదంగా మారింది. బీసీసీఐ తీరుపై పై కోహ్లీ అభిమానులు మండిపడుతున్నారు. విమానంలో కోహ్లీ ఎక్కడున్నాడో మీకు కనిపించలేదా? అని ప్రశ్నిస్తున్నారు.
సౌతాఫ్రికా సిరిస్ లో మొదట ఇండియా మూడు టెస్టుల సిరీస్ ఆడుతుంది. టెస్టుకు కోహ్లీ కెప్టెన్ గా వ్యవహరించనున్నాడు. ఆ తర్వాత జరిగే వన్డే సిరీస్ కు రోహిత్ శర్మ నాయకత్వం వహిస్తాడు. అయితే గాయం కారణంగా టెస్ట్ సిరీస్ నుంచి రోహిత్ శర్మ తప్పుకున్నాడు. అయితే కోహ్లీ కెప్టెన్సీలో ఆడటం ఇష్టం లేకనే రోహిత్ శర్మ టెస్ట్ సిరీస్ నుంచి తప్పుకున్నాడనే వార్తలు వస్తున్నాయి.
కోహ్లీని కెప్టెన్సీ నుంచి తప్పించిన వివాదంపై తాజాగా కపిల్ దేవ్ స్పందించారు. కోహ్లీ సహా ఎవరికీ చెప్పాల్సిన పని లేదంని అన్నారు. చెప్పకుండా తొలగించడం షాక్ కు గురిచేసిందని శరణ్దీప్ సింగ్ అన్నారు. వివాదంపై బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ నోరు విప్పాలని సునీల్ గవాస్కర్ అన్నారు. అప్పుడే వివాదంపై స్పష్టత వస్తుందని చెప్పారు. ఇద్దరి మధ్యా భేదాభిప్రాయాలు ఎలా వచ్చాయో చెప్పాల్సిన ఆవశ్యకత ఉందన్నారు. అసలు వివాదం ఎందుకు వచ్చిందో తెలియాలన్నారు గవాస్కర్. వన్డేలకు కెప్టెన్ గా తప్పిస్తున్నామని చీఫ్ సెలెక్టర్ చెబితే అందులో ఎలాంటి తప్పు లేదని, వారికి అన్ని విధాలా ఆ హక్కు ఉంటుందని స్పష్టం చేశారు. కెప్టెన్ అనేవాడు జస్ట్ కో–ఆప్టెడ్, నాన్ ఓటింగ్ సభ్యుడు మాత్రమేనని తేల్చి చెప్పారు.