ఈటల కాంగ్రెస్ లో చేరబోతున్నారా? బండి సంజయ్ తో వైరమా?
posted on Dec 16, 2021 @ 2:05PM
హుజురాబాద్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి ఈటల రాజేందర్ బీజేపీకి గుడ్ బై చెప్పబోతున్నారా? కాంగ్రెస్ లో చేరేందుకు ఆయన సిద్ధమవుతున్నారా? కొన్ని రోజులుగా జరుగుతున్న ప్రచారం ఇది. వామపక్ష భావజాలంతో రాజకీయంగా ఎదిగిన రాజేందర్.. బీజేపీలో ఇమడలేకపోతున్నారనే ప్రచారం జరుగుతోంది. తాజాగా ఈ అంశంపై ఈటల రాజేందరే క్లారిటీ ఇచ్చారు. తాను పార్టీ మారుతున్నట్లు జరుగుతున్న ప్రచారంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
హుజురాబాద్ లో ఎమ్మెల్యేగా గెలిచిన ఈటల రాజేందర్ ను తెలంగాణ జర్నలిస్ట్ యూనియన్ హైదరాబాదులో సన్మానించింది. అనంతరం ఆ యూనియన్ నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడిన ఈటల రాజేందర్.. తనకు పార్టీ మారే ఆలోచనే లేదన్నారు. తాను పార్టీలు మారే రకం కాదన్నారు. టీఆర్ఎస్ నుంచి తనంతట తానుగా బయటికి రాలేదని, వాళ్లే తనను సస్పెండ్ చేశారని చెప్పారు. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసేలా చేశారన్నారు. తాను కాంగ్రెస్ లో చేరుతున్నట్లు కేసీఆర్ వర్గమే కావాలని ప్రచారం చేస్తుందని క్లారిటీ ఇచ్చారు ఈటల రాజేందర్.
బీజేపీ అధిష్టానం ఆదేశిస్తే కేసీఆర్‌పై పోటీకి సిద్ధమని ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ స్పష్టం చేశారు. టీఆర్ఎస్‌తో కొట్లాటే.. తెలంగాణలో అధికారం బీజేపీదే అని ధీమా వ్యక్తం చేశారు. ఆత్మగౌరవానికి ఖరీదు కట్టిన ఏకైక వ్యక్తి కేసీఆర్ అని విమర్శించారు. మెజార్టీ టీఆర్‌ఎస్ నేతలు బీజేపీతో టచ్‌లో ఉన్నారని తెలిపారు. ఇక టీఆర్‌ఎస్‌కు భవిష్యత్ లేదని అక్కడి నేతలే అంటున్నారు. థర్డ్ ఫ్రంట్ సంగతి అటుంచి.. ముందు రాష్ట్రాన్ని కేసీఆర్ చక్కదిద్దాలని ఎమ్మెల్యే హితవు పలికారు.బీజేపీలో గ్రూపులు లేవని... బండి సంజయ్‌తో వైరం లేదని తేల్చిచెప్పారు ఈటల రాజేందర్. ఏడున్నరేళ్లలో ఒక్క ఉద్యోగ నోటిఫికేషన్ కూడా ఇవ్వలేదన్నారు. ఎస్సీలపై ప్రేమ ఉంటే ఇప్పుడు దళితబంధు అమలు చేయాలని ఈటెల రాజేందర్ డిమాండ్ చేశారు.
టీఆర్ఎస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు రాజేందర్. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన రాజకీయ పార్టీతోనే సాధ్యమని టీఆర్ఎస్‌ను పెట్టారని, ప్రత్యేక రాష్ట్రం కోసమే ఆ పార్టీతో కలిసి పనిచేశానని తెలిపారు. తెలంగాణ ప్రజల గుండెల్లో చోటు సాధించానని ఈటల రాజేందర్ అన్నారు. 2014లో రాష్ట్ర సాధించుకున్నామని, అనంతరం ఆర్థిక మంత్రిగా బాధ్యతలు స్వీకరించానని గుర్తు చేశారు. తన శక్తి మేరకు పనిచేశానని తెలిపారు. 2018లో మళ్లీ గెలిచి ఆరోగ్య శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించానని, కరోనా సమయంలో ఆరోగ్య శాఖలో కష్టపడి పనిచేశానని ఈటల రాజేందర్ అన్నారు.