మరో రత్నం మాయం.. మూడు రాజధానుల పేరుతో మోసం..
posted on Dec 16, 2021 @ 11:18AM
సబ్జెక్ట్‌లేని సీఎం జగన మూడు రాజధానులు అంటూ కాలక్షేపం చేస్తుంటే కంపెనీలన్నీ ఇతర రాష్ట్రాలకు క్యూ కడుతున్నాయని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ మండిపడ్డారు. టీడీపీ హయాంలో ఆర్థిక రాజధానిగా, ఐటీ హబ్ గా మారిన విశాఖ ఇప్పుడు వెలవెలబోతోందని.. 15 ఏళ్ళ నుండి ఉత్తరాంధ్ర యువతకి వేలాదిగా ఉద్యోగ అవకాశాలు కల్పించిన HSBC మూతపడటం బాధాకరమంటూ నారా లోకేశ్ ట్వీట్ చేశారు. విశాఖ మకుటంలో మరోరత్నం మాయం.. అంటూ HSBC శాఖ మూత పడిందనే వార్తా కథనాన్ని తన ట్వీట్‌కు జత చేశారు లోకేశ్.
రాష్ట్ర ప్రభుత్వం నియంత నిర్ణయాలు, బెదిరింపులకు భయపడి ఇప్పటికే అనేక కంపెనీలు సైలెంట్‌గా ఇతర రాష్ట్రాలకు తరలిపోయాయన్నారు లోకేశ్. ఇప్పుడు విశాఖకే తలమానికంగా నిలిచిన హెచ్‌ఎస్‌బీసీ కూడా మూతపడటం రాష్ట్ర ప్రభుత్వ అసమర్ధతకి నిదర్శనమని మండిపడ్డారు. మూడు రాజధానుల పేరుతో చేసిన మోసంచాలని దుయ్యబట్టారు.
విశాఖని దోచుకోవడం ఆపి అభివృద్ధిపై దృష్టి సారించాలని వైసీపీ ప్రభుత్వానికి హితవు పలికారు లోకేశ్. ఉన్న కంపెనీలు ఇతర రాష్ట్రాలకు వెళ్లిపోకుండా చూడాలని లోకేష్ డిమాండ్ చేశారు.