జనవరిలో ఒమిక్రాన్ విలయం! యూరప్ లో నిండిపోతున్న హాస్పిటల్స్..
posted on Dec 16, 2021 @ 3:58PM
అనుకున్నదంతా అవుతోంది.. భయపడుతున్నదే జరుగుతోంది. కొవిడ్ కొత్త వేరియంట్ ఒమిక్రాన్ అత్యంత వేగంగా వ్యాపిస్తోంది. ప్రపంచ దేశాలన్ని వణికిస్తోంది. ఈ ఏడాది ఆరంభంలో ప్రపంచాన్ని వణికించిన కరోనా డెల్టా వేరియంట్ కంటే వేగంగా ఒమిక్రాన్ వేరియంట్ విస్తరిస్తోంది. ఈ విషయాన్ని అమెరికాకు చెందిన సెంటర్ ఆఫ్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ (సీడీసీ) అధికారికంగా వెల్లడించింది.ప్రపంచ వ్యాప్తంగా 75 దేశాల్లో కొత్త వేరియంట్ కేసులు వెలుగు చూశాయని సీడీసీ డైరెక్టర్ రోచెల్ వాలెన్స్కీ తెలిపారు. కేవలం రెండు రోజుల వ్యవధిలో ఒమిక్రాన్ కేసులు రెట్టింపయ్యాయని చెప్పారు.
డెల్టా ప్లస్ వేరియంట్ ను డామినేట్ చేసే ఆధిపత్య జాతిగా ఒమిక్రాన్ పురోగమిస్తుందని సీడీసీ సైంటిస్టులు హెచ్చరించారు. 2022 తొలి రెండు నెలల్లో ఒమిక్రాన్ అత్యంత ప్రబలంగా వ్యాప్తి చెందుతుందని యూరోపియన్ హెల్త్ కమిషనర్ స్టెల్లా కిరియాకిడ్స్ తెలిపారు. పండుగ సమయాల్లో అందరూ అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.అమెరికాలో ప్రస్తుతం ఉన్న కరోనా కేసుల్లో ఒమిక్రాన్ కేసులు 3 శాతం ఉన్నాయని తెలిపింది. మిగిలిన కేసులు డెల్టా ప్లస్ వేరియంట్ రకానికి చెందినవని చెప్పింది.
ఇక కొవిడ్ ధాటికి ఐరోపా దేశాలు అల్లాడిపోతున్నాయి. కొత్త వేరియంట్ ఒమిక్రాన్ ఇప్పటికే అక్కడ పలు దేశాలకు వ్యాపించింది. కొవిడ్‌తో ఆసుపత్రుల్లో చేరుతున్నవారి సంఖ్య పెరుగుతోంది. ఒమిక్రాన్ ఏ మేరకు ప్రభావం చూపుతుందోనని అక్కడి ప్రభుత్వాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ప్రస్తుతం బ్రిటన్‌లో గతంలో ఎన్నడూ లేని విధంగా రికార్డు స్థాయిలో కరోనా కేసులు వెలుగుచూశాయి. ఫ్రాన్స్‌లో కొవిడ్ బాధితులకు చికిత్స అందించలేక వైద్యులు అలసిపోతున్నారు. టీకా తీసుకోని బాధితుల పట్ల వైద్యులు అసహనం వ్యక్తం చేస్తున్నారు.
బ్రిటన్‌లో రికార్డు స్థాయిలో కేసులు నమోదవుతున్నాయి. కరోనా మహమ్మారి ప్రారంభమైన దగ్గరి నుంచి బ్రిటన్‌లో బుధవారం రికార్డు స్థాయిలో కొత్త కేసుల బయటపడ్డాయి. బుధవారం ఒక్కరోజే 78,610 మందికి వైరస్ సోకింది. ఈ జనవరిలో అత్యధికంగా 68 వేల మందికి పైగా కరోనా బారినపడగా.. ఈ దఫా ఉద్ధృతిలో ఆ సంఖ్య 78 వేలకు చేరింది. ఇప్పటి వరకు ఆ దేశంలో కోటి 10 లక్షల మందికిపైగా వైరస్ బారినపడ్డారు. ఇప్పటికే అక్కడ కొత్త వేరియంట్ వేగంగా వ్యాప్తి చెందుతోంది. ఒమిక్రాన్ భారీ అల వలే ముంచుకొస్తోందని బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ ఇటీవల జాతినుద్దేశించి వ్యాఖ్యానించారు. గత వేరియంట్లతో పోలిస్తే.. ఒమిక్రాన్ పట్ల మరింత అప్రమత్తత అవసరమని అక్కడి వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.
ఫ్రాన్స్ కూడా కొవిడ్ కొత్త వేరియంట్ తో ఉక్కిరిబిక్కిరి అవుతోంది. కొవిడ్ వార్డుల్లో చికిత్స అందించలేక వైద్యులు అలిసిపోతున్నారు. వ్యాక్సిన్లు తీసుకోని వారిపై తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. వైరస్ భారిన పడిన వారిలో ఎక్కువ మంది యువతే. వారంతా వ్యాక్సిన్ తీసుకోనివారే. దీంతో టీకా తీసుకోని వారి పట్ల వైద్య సిబ్బందికి కోపం, చిరాకు ఉందని వైద్యులు చెబుతున్నారు. ఆ బాధితుల్లోనే తీవ్ర లక్షణాలు కనిపిస్తున్నాయన్నారు. అందుకే చాలా మంది ఇక్కడ ఉద్యోగాలను వదులుకొని, ఇతర ప్రాంతాలకు తరలి వెళ్తున్నారని చెప్పారు.