జిల్లాల పర్యటనకు కేసీఆర్.. ముందస్తు ఎన్నికలు ఖాయమేనా?
posted on Dec 16, 2021 @ 9:40AM
తెలంగాణలో మళ్లీ ముందస్తు ఎన్నికలు రాబోతున్నాయా? టీఆర్ఎస్ నేతలకు ఇప్పటికే సిగ్నల్ వచ్చేసిందా ? అంటే తెలంగాణ భవన్ వర్గాల నుంచి అవుననే సమాధానమే వస్తోంది. ప్రగతి భవన్ లేదా ఫౌంహౌజ్ కే పరిమితం అవుతారనే విమర్శలు ఎదుర్కొంటున్న సీఎం కేసీఆర్.. ఒక్కసారిగా రూట్ మార్చారు. జిల్లాల పర్యటనలకు సిద్ధమవుతున్నారు. అంతేకాదు పార్టీ నేతలతో కీలక సమావేశాలు నిర్వహించబోతున్నారు. పాలన పరుగులు పెట్టేలా కలెక్టర్లతోనూ చర్చలు జరపబోతున్నారు. కేసీఆర్ కు సంబంధించి తాజాగా విడుదలైన షెడ్యూల్ తో తెలంగాణలో ఏదో జరగబోతుందన్న చర్చ సాగుతోంది.
కేసీఆర్ శుక్రవారం మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, జిల్లా పరిషత్ చైర్‌పర్సన్లు, కార్పొరేషన్ల చైర్మన్లు.. ఇలా జిల్లా సహకార బ్యాంకు చైర్మన్లతో పాటు రాష్ట్ర కార్యవర్గం సంయుక్త సమావేశాన్ని నిర్వహిస్తున్నారు. వివిధ పథకాలను ప్రజల వద్దకు తీసుకెళ్లేలా ఆయన దిశానిర్దేశం చేయనున్నారు. రాజకీయంగా క్రియాశీలం కావాలని పార్టీ నేతలను కేసీఆర్ ఆదేశిస్తారని చెబుతున్నారు. శనివారం అన్ని జిల్లాల కలెక్టర్లు, మంత్రులతో ప్రగతి భవన్‌లో సమీక్ష నిర్వహించనున్నారు. దళితబంధు పథకాన్ని హుజురాబాద్‌తో పాటు మరో నాలుగు మండలాల్లో వంద శాతం అమలు చేస్తారు. వచ్చే మార్చికల్లా అన్ని నియోజకవర్గాల్లో వంద మందికి చొప్పున ఇవ్వాలని నిర్ణయించారు. ఈ అంశాలపై కలెక్టర్లు, అధికారులకు కేసీఆర్ దిశానిర్దేశం చేస్తారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ జిల్లాల పర్యటనను చేపట్టనున్నారు. ఆయన పర్యటనకు షెడ్యూల్ ఖరారైంది. ఈనెల 19 నుంచి ఆయన పర్యటన ప్రారంభమవుతుంది. వనపర్తి జిల్లా నుంచి తన పర్యటనను కేసీఆర్ ప్రారంభించనున్నారు. 19న వనపర్తి జిల్లాలో ఆయన పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభిస్తారు. డబల్ బెడ్రూమ్ ఇళ్లు, కర్నె తాండ ఎత్తిపోతల పథకం, వేరుశనగ పరిశోధన కేంద్రం, కొత్త కలెక్టరేట్, సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలను ఆయన ప్రారంభించనున్నారు. ఈ నెల 20న జనగామ జిల్లాలో కేసీఆర్ పర్యటించనున్నారు. ఈ జిల్లాలో కూడా ఆయన పలు అభివృద్ధి పనులను ప్రారంభించనున్నారు. ఆ తర్వాత నాగర్ కర్నూల్, జగిత్యాల, నిజామాబాద్, వికారాబాద్ తో పాటు మరికొన్ని జిల్లాల్లో పర్యటించనున్నారు. కేసీఆర్ జిల్లాల పర్యటన నేపథ్యంలో పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నెలకొంది.
తెలంగాణ ఇక ఎలాంటి చిన్న చిన్న ఎన్నికలు వచ్చే అవకాశం లేదు. ఇక వచ్చేది పూర్తి స్థాయి అసెంబ్లీ ఎన్నికలే. షెడ్యూల్ ప్రకారం 2023 చివరిలో జరగాల్సి ఉంది. కానీ కేసీఆర్ ఓ ఏడాది త్యాగం చేసి.. మరో ఐదేళ్లు ఎక్స్ టెన్షన్ పొందేందుకు వచ్చే ఏడాది చివరిలో ముందస్తుకు వెళ్తారన్న గట్టి అంచనాల్లో తెలంగాణ రాజకీయవర్గాలు ఉన్నాయి. దానికి తగ్గట్లుగానే ఆయన దళిత బంధు పథకం అమలు.. ఇతర వ్యవహారాలను ఖచ్చితంగా వచ్చేఏడాది ఆగస్టులోపు పూర్తయ్యేలా షెడ్యూల్ ఖరారు చేసుకుంటున్నారు. అభివృద్ధి పనులూ ఆ లోపు కొలిక్కి తెస్తున్నారని అంటున్నారు, కేసీఆర్ ఈ తీరిక లేని పర్యటనలు… ఇక ఎన్నికలు ఎప్పుడు జరిగితే అప్పటి వరకూ జరిగే అవకాశం ఉందని టీఆర్ఎస్ వర్గాలు అంచనాకు వస్తున్నాయి.