బస్సు ప్రమాదానికి అసలు కారణం ఇదా? ఈ పాపం ఎవరిది?
posted on Dec 15, 2021 @ 8:04PM
పశ్చిమ గోదావరి జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో కొత్త అంశం వెలుగులోకి వచ్చింది. వాగులో బోల్తా పడిన ఆర్టీసీ బస్సుకు 20 రోజులుగా మెయింటెనెన్స్ లేదని తెలుస్తోంది. జంగారెడ్డిగూడెం డిపోలో ఈ ఆర్టీసీ బస్సు స్టీరింగ్ పట్టేస్తుందంటూ డ్రాఫ్ట్ షీట్‌లో నమోదు చేశారు. మరమ్మతులు చేయాలంటూ ఎన్నోసార్లు విన్నవించినా అధికారులు పట్టించుకోలేదని ఆర్టీసీ సిబ్బంది ఆరోపణలు చేస్తున్నారు. డ్రైవర్ చిన్నారావు మృతికి బస్సు మెయింటెనెన్స్ లోపమే కారణమంటూ ఆర్టీసీ జోన్ చైర్ పర్సన్ తాతినేని పద్మావతికి సిబ్బంది ఫిర్యాదు చేశారు. ఆర్టీసీ బస్సు ప్రమాద సమయంలో డ్రైవర్‌కు గుండెపోటు వచ్చినట్లు ప్రచారం జరుగుతోంది. డ్రైవర్ ఆరోగ్య పరిస్థితిపై విచారణ జరుపుతామని ఆర్టీసీ ఉన్నతాధికారులు తెలిపారు.
జంగారెడ్డిగూడెం సమీపంలో ఆర్టీసీ బస్సు అదుపుతప్పి జల్లేరు వాగులో పడింది. బస్సు రెయిలింగ్‌ను ఢీకొనడంతో ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 10 మంది ప్రయాణికులు మృతి చెందగా... పలువురు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మృతుల్లో ఎక్కువ మంది మహిళలు ఉన్నారు. ప్రమాద సమయంలో బస్సులో 49 మంది ప్రయాణికులు ఉన్నారు. వాగులో కొట్టుకుపోతున్న వారిని స్థానికులు కాపాడటంతో మృతుల సంఖ్య భారీగా తగ్గింది.
బస్సు ప్రమాద జనసేన అధినేత పవన్ కల్యాణ్ స్పందిస్తూ తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. ఈ దుర్ఘటన తనను కలచివేసిందని చెప్పారు. మృతి చెందిన వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. మృతుల కుటుంబాలకు ప్రభుత్వం వెంటనే పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. ప్రమాదంపై విచారణకు ఆదేశించాలని అన్నారు. ప్రమాదంలో గాయపడినవారికి మెరుగైన చికిత్స అందించాలని కోరారు.
బస్సు ప్రమాద ఘటనపై ప్రధాని మోదీ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఘటనలో ప్రాణనష్టం సంభవించడం కలచివేస్తోందని చెప్పారు. ప్రమాదంలో మరణించిన వారి కుటుంబాలకు రూ. 2 లక్షల చొప్పున ఎక్స్ గ్రేషియాను ఆయన ప్రకటించారు. పీఎంఎన్ఆర్ఎఫ్ నిధుల నుంచి ఈ మొత్తాన్ని అందించనున్నారు. మరోవైపు మృతుల కుటుంబాలకు ముఖ్యమంత్రి జగన్ రూ. 5 లక్షల చొప్పున పరిహారాన్ని ప్రకటించారు.