అమ్మాయిల కనీస వివాహ వయసు 21 ఏళ్లు!
posted on Dec 16, 2021 @ 3:32PM
అమ్మాయిల కనీస వివాహ వయస్సును 18 నుంచి 21 ఏళ్లకు పెంచుతూ చట్ట సవరణ ప్రతిపాదనను కేంద్ర కేబినెట్ ఆమోదించింది. బాల్య వివాహాల నిరోధక చట్టం 2006, ప్రత్యేక వివాహ చట్టం, పర్సనల్ లా, హిందూ వివాహ చట్టం 1955లకు సవరణలు తీసుకొచ్చేందుకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. దేశ రాజధాని ఢిల్లీలోని ఎర్రకోట నుంచి ప్రధాని నరేంద్ర మోదీ స్వాతంత్ర్య దినోత్సవ ప్రసంగంలో ఈ అంశంపై ప్రస్తావించిన ఏడాది తర్వాత ప్రభుత్వం చర్యలు చేపట్టడం గమనార్హం. ఆరోగ్య సమస్యలు, పోషకాహార లోపం నుంచి అమ్మాయిలను కాపాడాల్సిన ఆవశ్యకత ఉందని ప్రధాని మోదీ ఆనాటి ప్రసంగంలో ప్రస్తావించారు.
ఇప్పటి వరకు అమ్మాయిలకు కనీస వివాహ వయస్సు 18 ఏళ్లుగా ఉంది. అబ్బాయిలకు అయితే 21 ఏళ్లు కనీస వివాహ వయస్సుగా నిర్ధారించారు. ఈ ఆధునిక సమాజంలో అమ్మాయిలు- అబ్బాయిల కనీస వివాహ వయస్సులో తేడా ఎందుకనే దానిపై కొంతకాలంగా చర్చ జరుగుతోంది. ఈ అంతరాన్ని తొలగించాలంటూ అభ్యర్థనలు, డిమాండ్లు వెల్లువెత్తుతున్నాయి. దీంతో తాజాగా అమ్మాయిలకు కూడా వివాహ కనీస వయస్సును 21 ఏళ్లకు పెంచే ప్రతిపాదనకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపినట్లు విశ్వసనీయ సమాచారం.
అమ్మాయిల కనీస వివాహ వయస్సు తక్కువగా ఉండడం వల్ల వారి కెరీర్కు అవరోధం అవుతోందని పలు మహిళా సంఘాలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. అంతే కాకుండా 18 ఏళ్లకే పెళ్లయితే చిన్న వయస్సులోనే గర్భం దాల్చి, అమ్మాయిలు ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నారని ఆయా సంఘాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. అందుకే అమ్మాయిల కనీస వివాహ వయస్సును 21 ఏళ్లకు పెంచాలనే డిమాండ్లు వచ్చాయి. సంఘాల డిమాండ్లను పరిగణనలోకి తీసుకున్న కేంద్ర కేబినెట్ ఇప్పుడు అమ్మాయిల కనీస వివాహ వయస్సును పెంచే ప్రతిపాదనను ముందుకు తెచ్చింది.
అమ్మాయిలకు కనీస వివాహ వయస్సు పెంపుపై గత ఏడాది జూన్ లో జయా జైట్లీ నేతృత్వంలో నీతి ఆయోగ్ టాస్క్ ఫోర్స్ ఏర్పాటైంది. నిపుణులు డాక్టర్ వీకే పాల్, ఆరోగ్య, స్త్రీ, శిశు సంక్షేమశాఖ, న్యాయ మంత్రిత్వశాఖల సీనియర్ అధికారులు ఈ టాస్క్ ఫోర్స్ లో సభ్యులుగా వ్యవహరించారు. ఈ టాస్క్ ఫోర్స్ కమిటీ దేశ వ్యాప్తంగా సర్వేలు నిర్వహించింది. పలు వర్గాల నుంచి అభిప్రాయాలు సేకరించింది. ఆ అభిప్రాయాలన్నింటినీ క్రోడీకరించి కొన్ని ప్రతిపాదనలు చేసింది.
అమ్మాయిలు మొదటిసారి గర్భం దాల్చే నాటికి వారి వయస్సు కనీసం 21 సంవత్సరాలు ఉండాలని టాస్క్ ఫోర్స్ కమిటీ సూచించింది. 21 ఏళ్లకు అమ్మాయిలకు పెళ్లి చేస్తే.. ఆమె పుట్టింటిపై ఆర్థికంగా, సామాజికంగా సానుకూల ప్రభావం చూపుతుందని టాస్క్ ఫోర్స్ కమిటీ వివరించింది. ఈ ప్రతిపాదనకే కేంద్ర కేబినెట్ ఇప్పుడు ఆమోదం తెలిపినట్లు విశ్వసనీంగా తెలిసింది.