బీహార్‌కు ప్రత్యేక హోదా!.. మరి, ఏపీకి? జగనన్న వల్ల కావట్లేదా..?
posted on Dec 16, 2021 @ 5:06PM
ప్రత్యేక హోదాపై అప్పటి సీఎం చంద్రబాబు చేసినంత పోరాటం ఇంకెవరూ చేయలేదు. స్పెషల్ స్టేటస్ కోసం ఢిల్లీపై ధర్మపోరాటం చేశారు. టీడీపీ ఎంపీలు రాజీనామాలు చేశారు. బీజేపీతో తెగదెంపులు చేసుకున్నారు. తాజాగా, మరోసారి రాజీనామాలకు రెడీ అన్నారు. ఇక, పవన్ కల్యాణ్ స్పెషల్ స్టేటస్‌పై పార్ట్‌టైమ్ పాలిటిక్స్ చేశారు. మరి, జగనన్న ముఖ్యమంత్రిగా ప్రత్యేక హోదా కోసం ఏం చేశారు? తనవంతుగా ఎలాంటి ప్రయత్నం చేశారు? అంటే.. ఏమీ చేయలేదనే చెప్పాలి. ఏపీకి హోదా కోసం కేంద్రాన్ని గట్టిగా అడిగింది లేదు.. పార్లమెంట్‌లో ఆ పార్టీ ఎంపీలు ఒక్క ప్లకార్డు పట్టుకున్నదీ లేదు.. మోదీని, అమిత్‌షాను నిలదీసిందీ లేదు. వైసీపీ ప్రభుత్వ చేతగానితనం వల్లే.. ఏపీకి విభజన హక్కు అయిన ప్రత్యేక హోదాను అటకెక్కించేశారని అంటున్నారు.
ఇక, స్పెషల్ స్టేటస్‌పై కేంద్రం సైతం డబుల్ గేమ్ ఆడుతోందని అంటున్నారు. ఏపీ సహా మరే ఇతర రాష్ట్రానికీ ప్రత్యేక హోదా ఇవ్వడానికి 14వ ఆర్థిక సంఘం సిఫారసులు అంగీకరించవని కేంద్రం గతంలో పలుమార్లు చెప్పింది. కానీ, తాజాగా బీహార్‌కు స్పెషల్ స్టేటస్ ఇచ్చే అంశాన్ని నీతి అయోగ్ పరిశీలిస్తోందని తెలుస్తోంది. ఈ విషయంపై సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ ట్విటర్‌లో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
బీహార్ కు ప్రత్యేక హోదా అంశాన్ని నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ పరిశీలిస్తున్నారంటూ మీడియాలో వార్తలు వస్తున్నాయని వెల్లడించారు. ఏపీకి ప్రత్యేక హోదా కల్పించడానికి 14వ ఆర్థిక సంఘం అడ్డంకి కాదనే వాస్తవాన్ని ఈ విషయం నిరూపిస్తోందని తెలిపారు. ఈ అంశంపై గౌరవనీయ సీఎం జగన్, అన్ని పార్టీల నేతలు వెంటనే దృష్టి సారించాలని లక్ష్మీనారాయణ సూచించారు.
ప్రత్యేక హోదాపై బీజేపీ, జేడీయూ మధ్య ప్రచ్ఛన్నయుద్ధం ప్రారంభం అయింది. తాజాగా కేంద్రం విడుదల చేసిన రాష్ట్రాల ర్యాంకుల ఆధారంగా ప్రత్యేక హోదా బీహార్ కు ఇవ్వాలని సీఎం నితీష్ కేంద్రానికి లేఖ రాశారు. అయితే, బీహార్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా అవసరంలేదని బీజేపీకి చెందిన డిప్యూటీ సీఎం రేణుదేవి అంటున్నారు. తమ స్టేట్‌కి ప్రత్యేక హోదా అవసరమని 2009 ఎన్నికల నుంచి నితీష్ కుమార్ పలుమార్లు డిమాండ్ చేశారు. తాజాగా విడుదలైన ర్యాంకు ఆధారంగా ప్రత్యేకహోదా డిమాండ్ ను మళ్లీ తెరమీదకు తీసుకొచ్చారు.
బీహార్‌కు స్పెషల్ స్టేటస్ కోసం ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి నితీష్‌కుమార్ తమకు మిత్రపక్షమైనప్పటికినీ.. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీపై అంతలా పోరాడుతుంటే.. అందులో ఆవగింజంత వంతు పోరాటమైనా ఏపీ సీఎం జగన్ చేయకపోతుండటంపై ఆంధ్రులంతా మండిపడుతున్నారు. కేంద్రం ఇచ్చేదీ లేనిదీ తర్వాతి మాట. ముందు మనవంతుగా.. మన విభజన హక్కుగా.. ప్రత్యేక హోదాపై కేంద్రాన్ని గట్టిగా నిలదీయాలిగా? ఏపీ వాయిస్‌ను కేంద్రం దగ్గర బలంగా వినిపించాలిగా? మరి, మాట వరుసకైనా వైసీపీ ప్రభుత్వం హోదాపై గళం విప్పకపోవడం దారుణమంటున్నారు. బీహార్ ఎపిసోడ్‌తో.. ఏపీకి స్పెషల్ స్టేటస్ అంశం మరోసారి తెరమీదకు వస్తోంది. జగన్ తీరుపై మరోసారి చర్చ జరుగుతోంది.