ఓటర్ కార్డుతో ఆధార్ లింక్! రాజకీయ పార్టీలకు షాక్..
posted on Dec 16, 2021 9:21AM
నకిలీ ఓటరు కార్డులను నిరోధించడం కోసం ఓటర్ కార్డుతో ఆధార్ నంబర్‌ను అనుసంధానం చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇందు కోసం ప్రజా ప్రాతినిధ్య చట్టంలో సవరణలు చేయనుంది. దీనికి సంబంధించిన బిల్లుకు బుధవారం కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. అయితే కేంద్ర ప్రభుత్వం ఇక్కడా చిత్తశుద్ధితో లేదు. పూర్తి స్థాయిలో ఆధార్‌తో లింక్ చేయడానికి ఇష్టపడటం లేదు.తాజా బిల్లు ప్రకారం ఓటర్ కార్డుతో ఆధార్ లింక్ అనేది స్వచ్ఛందం. ప్రజలు ఇష్టమైతే లింక్ చేసుకోవచ్చు. లేకపోతే లేదు. ఈ పార్లమెంట్ సమావేశాల్లోనే ఈ బిల్లును ఆమోదించుకునే అవకాశం ఉంది.
ఒకే వ్యక్తి పేర వేర్వేరు ప్రాంతాల్లో వేర్వేరు ఓటరు కార్డులు ఉండటంపై చాలా కాలం క్రితమే ఎన్నికల సంఘం దృష్టిసారించింది. బోగస్ కార్డుల నిరోధానికి ఓటర్ కార్డును ఆధార్‌తో లింక్ చేయాలని నిర్ణయించింది. అప్పట్లో కొంత వరకూ ఓటర్ కార్డులో ఆధార్ కార్డులు లింక్ చేశారు. అయితే అప్పట్లో సుప్రీంకోర్టులో పిటిషన్లు పడ్డాయి. ప్రజా ప్రాతినిధ్య చట్టానికి సవరణలు చేయకుండా ఆధార్ నంబర్లు సేకరించడానికి ఈసీకి అధికారం లేదని స్పష్టం చేసింది. దీంతో చట్ట సవరణ చేయాలని కేంద్రప్రభుత్వానికి ఈసీ ప్రతిపాదించింది. ఈ కారణంగానే తాజా బిల్లు తెచ్చారు.
ఓటర్ జాబితాలో పేరు నమోదుకు ఏటా నాలుగు కటాఫ్ తేదీలు ఉండేలా కేంద్రం వెసులుబాటు కల్పించింది. ఇప్పటివరకు ఏడాదిలో ఒక్కసారి మాత్రమే ఓటర్ జాబితా సవరణ చేసే వారు. ఇకపై జనవరి 1, ఏప్రిల్ 1, జూలై 1, అక్టోబర్ 1లను కటాఫ్ తేదీలుగా పేర్కొంది. సర్వీస్ ఓటర్లకు సంబంధించిన నిబంధనలు కూడా మార్చివేశారు. రక్షణ రంగంలో పనిచేసేవారు పురుషులా, స్త్రీలా అన్నది సంబంధం లేకుండా వారి భాగస్వాములను సర్వీస్ ఓటర్లుగా పరిగణించనున్నారు. దీని కోసం చట్టంలో ‘భార్య’ అన్న స్థానంలో ‘భాగస్వామి’ అని మార్చారు.
ఓటర్ కార్డుతో అనుసంధానం సగం మంది చేసుకుని.. సగం మంది చేసుకోకపోతే.. గందరగోళం ఏర్పడుతుంది. మొత్తంగా ఒకే విధానం ఉంటే.. ఎన్నికల అక్రమాలకు చెక్ పెట్టినట్లు అవుతుంది. ఇప్పటికే జరుగుతున్న ఎన్నికల్లో దొంగ ఓటర్ల ఆరోపణలు తీవ్రంగా వస్తున్నాయి. వీటన్నింటికి చెక్ పెట్టాలంటే ఆధార్ కార్డుతో లింక్ చేయడమే పరిష్కారమని నిపుణులు చెబుతున్నారు. కానీ నిర్బంధం చేయకుండా ఎందుకు స్వచ్చందం అంటున్నారో ఎవరికీ అర్థం కాని విషయం. లింక్ చేసుకోని ఓటర్లే .. ఫలితాలను తేల్చేసే పరిస్థితి మన దేశంలో ఉంటుంది. ఏ పని చేసినా పూర్తి స్థాయిలో ఉపయోగపడేలా చేస్తేనే ప్రయోజనం ఉంటుంది.