పీఆర్సీ పంతం.. మరోరత్నం మాయం.. టికెట్ కట్.. టాప్‌న్యూస్ @ 1pm
posted on Dec 16, 2021 @ 11:56AM
1. పీఆర్సీపై ఏపీ ప్రభుత్వ కసరత్తు కొనసాగుతోంది. సీఎం జగన్‍తో ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‍రెడ్డి, ప్రభుత్వ సలహాదారుడు సజ్జల రామకృష్ణారెడ్డి భేటీ అయ్యారు. బుధవారం ఉద్యోగ సంఘాలతో జరిగిన చర్చల వివరాలను సీఎం జగన్‌కు మంత్రి బుగ్గన, సజ్జల వివరించారు. ప్రభుత్వ తీరుపై, పీఆర్సీపై ఉద్యోగులంతా ఆగ్రహంగా ఉన్నారని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లారు.
2. ఏపీలో సినిమా టికెట్ల వ్యవహారంపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. థియేటర్ల యజమాన్యాలు టికెట్ ధరల ప్రతిపాదనలను జాయింట్ కలెక్టర్ ముందుంచాలని.. ఆయనే నిర్ణయం తీసుకుంటారని సూచించింది. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం కమిటీని ఏర్పాటు చేయాలని ఆదేశించింది.
3. సబ్జెక్ట్‌లేని సీఎం జగన మూడు రాజధానులు అంటూ కాలక్షేపం చేస్తుంటే కంపెనీలన్నీ ఇతర రాష్ట్రాలకు క్యూ కడుతున్నాయని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ మండిపడ్డారు. టీడీపీ హయాంలో ఆర్థిక రాజధానిగా, ఐటీ హబ్ గా మారిన విశాఖ ఇప్పుడు వెలవెలబోతోందని.. 15 ఏళ్ళ నుండి ఉత్తరాంధ్ర యువతకి వేలాదిగా ఉద్యోగ అవకాశాలు కల్పించిన HSBC మూతపడటం బాధాకరమంటూ నారా లోకేశ్ ట్వీట్ చేశారు.
4. తిరుపతి బహిరంగ సభకు.. "ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి పరిరక్షణ మహోద్యమ సభ" అని నామకరణం చేశారు రైతులు. సభా ప్రాంగణంలో భూమి పూజ చేశారు. శుక్రవారం మధ్యాహ్నం తిరుచానూరు సమీపంలోని దామినీడు దగ్గర సభ జరగనుంది. పలువురు కీలక రాజకీయ నేతలు, ప్రజాసంఘాల నాయకులు బహిరంగ సభకు హాజరుకానున్నారు.
5. బీజేపీకి బీసీలపై ప్రేమ లేదని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి మండిపడ్డారు. బీసీ కులాల జన గణనను కేంద్రం తిరస్కరించడం సరికాదన్నారు. దేశంలో బీసీల జనాభా 50 శాతానికి పైగా ఉందన్నారు. బీసీల మనోభావాలను గౌరవించని బీజేపీ.. భవిష్యత్‌లో భారీ మూల్యం చెల్లించుకోక తప్పదని రేవంత్‌రెడ్డి ట్వీట్ చేశారు.
6. మంచిర్యాల జిల్లాలోని ఇందారం-1ఏ బొగ్గు గనిపై మావోయిస్టు పోస్టర్ కలకలం రేపుతోంది. గని అధికారులను, పలువురు కార్మికులను హెచ్చరిస్తూ మావోయిస్టు మంగిలాల్ పేరిట పోస్టర్ వెలిసింది. అవినీతికి పాల్పడుతున్న వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. పోస్టర్‌లో పలువురి పేర్లు ప్రస్తావనకు వచ్చాయి. అయితే పోస్టర్ వేసింది మావోయిస్టులు కాదని పోలీసులు భావిస్తున్నారు.
7. గుంటూరు జిల్లాలోని ఎయిడెడ్ విద్యాసంస్థలను కొనసాగించాలంటూ ఆర్జేడీ కార్యాలయం దగ్గర టీఎన్ఎస్ఎఫ్ ఆధ్వర్యంలో విద్యార్థులు ధర్నా చేపట్టారు. జీవో 42, 50, 51 వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఎయిడెడ్ విద్యాసంస్థల నుండి తీసుకున్న ఉపాధ్యాయులను వెనక్కి పంపాలన్నారు. ఎయిడెడ్ విద్యాసంస్థల స్థలాలను కొట్టేసేందుకే ప్రభుత్వం కుట్ర చేస్తోందని ఆరోపించారు. ప్రభుత్వం స్పందించకుంటే అధికారుల ఇళ్లను ముట్టడిస్తామని హెచ్చరించారు.
8. తూర్పుగోదావరి జిల్లాలో ఇంజనీరింగ్ విద్యార్థిని కిడ్నాప్ కలకలం సృష్టిస్తోంది. రాజానగరం మండలం తోకాడకు చెందిన ఇంజనీరింగ్ విద్యార్థిని అపహరణకు గురైంది. ఐదు లక్షలు ఇస్తే వదిలేస్తానని.. డబ్బులు ఇవ్వకపోతే చంపేస్తానంటూ యువతి తండ్రికి కిడ్నాపర్ ఫోన్ చేసి బెదిరింపులకు దిగాడు. ఆందోళన చెందిన యువతి తండ్రి పోలీసులను ఆశ్రయించాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
9. కోనసీమలో ఒమైక్రాన్ కలకలం చెలరేగింది. విదేశాల నుంచి వచ్చిన ముగ్గురికి కొవిడ్ పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. వైద్యాధికారులు వారి నుంచి శాంపిల్స్‌ను సేకరించి ఒమైక్రాన్ నిర్ధారణ కోసం హైదరాబాద్‌లోని సీసీఎంబీకి పంపించారు. రిపోర్టు వచ్చిన తర్వాత ఒమైక్రానా, కాదా అనేది తేలుతుందని చెబుతున్నారు.
10. చీఫ్స్ ఆఫ్ స్టాఫ్ (CoSC) కమిటీ ఛైర్మన్‌గా ఆర్మీ చీఫ్ జనరల్ ఎంఎం నరవణె బాధ్యతలు చేపట్టారు. ఇప్పటి వరకు ఈ పదవిలో ఉన్న సీడీఎస్ జనరల్ బిపిన్ రావత్ ఆకస్మిక మరణంతో ఆ స్థానంలో నరవణెను నియమించారు. ఆర్మీ, నేవీ, ఎయిర్‌ఫోర్స్ అధిపతుల్లో నరవణెనే సీనియర్ కావడంతో ఆయనకు చీఫ్స్ ఆఫ్ స్టాఫ్ బాధ్యతలు అప్పగించారు.