బాబు పాదయాత్ర రూట్ మ్యాప్ ఖరారు

మహాత్మాగాంధీ పుట్టిన రోజు కంటే మంచి రోజు లేదని, అందుకే రాష్ట్రంలో పాదయాత్రను అక్టోబర్ 2నుంచి ప్రారంభించనున్నట్లు టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు తెలిపారు. పార్టీ వ్యవస్థాపకులు, స్వర్గీయ ఎన్టీరామారావు ప్రాతినిథ్యం వహించిన అనంతపురం జిల్లా, హిందూపురం నుంచి పాదయాత్ర ప్రారంభించనున్నట్లు తెలిపారు. 'మీకోసం...వస్తున్నా'' అనే పాదయాత్ర పేరు ఖరారు చేసినట్లు తెలిపారు. బాబు పాదయాత్ర రాప్తాడు, పెనుగొండ, గుత్తి మీదుగా కర్నూలులోకి ప్రవేశిస్తుంది. అనంతలో 13 రోజులు పాటు పాదయాత్ర కొనసాగుతుంది. 117 రోజులు రోజుకు సుమారు 15 కి.మీ. నుండి 20 కి.మీ. వరకు పాదయాత్ర చేసేలా ప్రణాళిక సిద్ధం చేశారు. చంద్రబాబు ఆరవై నాలుగేళ్ల వయస్సులో కూడా ప్రజల కోసం ఈ పాదయాత్ర చేపడుతున్నారని టిడిపి నేత పెద్దిరెడ్డి అన్నారు. టిడిపి తర్వాత రాష్ట్రంలో అభివృద్ధి ఆగిపోయిందని, దీనిని ప్రజలకు తెలియజేస్తామని, బాబుకు విల్ పవర్ ఉందన్నారు.

అమ్మాయి పై 11 మంది అత్యాచారం

ప్రేమించిన అమ్మాయిని 11 మందితో కలిసి సామూహిక అత్యాచారం చేసిన దుర్ఘటన చండీగఢ్‌లో జరిగింది. ఈ సంఘటన జరిగిన పదిరోజుల తరువాత బాధితురాలు ఈ విషయం కుటుంబసభ్యులకు చెప్పగా, మరుసటి రోజే తన తండ్రి గుండె పోటుతో మరణించాడు. అమ్మాయిని ప్రేమించిన మహేందర్ కోసం పోలీసులు గాలిస్తున్నారు. అమ్మాయి చెప్పిన ప్రకారం పటేల్‌నగర్‌కు బయలు దేరిన ఆమెను దారిలో మహేందర్ కలిశాడు. ఆమెతో మాట్లాడుతుండగా మహేందర్ స్నేహితులు 12 మంది వారిద్దరిని చుట్టుముట్టారు. అందరు కలిసి ఆమెను చెరకు తోటలోకి తీసుకొని వెళ్లి అత్యాచారాని పాల్పడ్డారు. అపస్మారక స్థితిలో ఉన్న ఆమెను పటేల్‌నగర్‌లోని బంధువు ఇంటికి దగ్గర్లో పడేసిపోయారు. ఈ సంఘటనపై గ్రామంలోని దళిత కుటుంబ సభ్యులు ఆందోళన చేపట్టారు. మహేందర్ బృందంలోని వాడిగా భావిస్తున్న శీతూను పోలీసులు ఆదివారం అదుపులోకి తీసుకున్నారు. మిగతా వారి కోసం పోలీసులు గాలిస్తున్నారు.

విమలక్క అరెస్ట్ ను ఖండించిన ఎర్రబెల్లి

విమలక్క అరెస్ట్‌పై పలు సంఘాల నేతలు నిరసన వ్యక్తపరిచారు. టీయూఎస్ నేతలు, టీ.టీడీపీ నేత ఎర్రబెల్లి, అరుణోదయా సమాఖ్య, టీ.జేఎసీ నేతలు, కేకే తీవ్రంగా ఖండించారు. తెలంగాణ కోసం ఎటువంటి త్యాగానికైనా సిద్ధమని తెలంగాణ రాజకీయ జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం, ఎమ్మెల్యే దిలీప్ కుమార్ హెచ్చరించారు. ఈ సమయంలో విమలక్కను అరెస్ట్ చేయడం తెలంగాణవాదులను రెచ్చగొట్టడమే అని కేకే పేర్కొన్నారు. కాసు బ్రహ్మానందరెడ్డి విగ్రహం ధ్వంసం కేసులో తెలంగాణ యునైటెడ్ ఫ్రంట్ నేత విమలక్కతో పాటు మరో ఇద్దరిని పోలీసులు అరెస్టు చేశారు. వివిద సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. ఆ తర్వాత వారిని సీసీఎస్ పోలీస్ స్టేషన్కు తరలించారు. అంతకు ముందు విమలక్క అరెస్ట్ను తెలంగాణవాదులు అడ్డుకున్నారు. దాంతో అక్కడ కొద్దిసేపు ఉద్రిక్తత ఏర్పడింది. విమలక్క స్వయంగా తామే విగ్రహాన్ని ధ్వంసం చేశామని ప్రకటించారు.

ఇంగ్లాండ్ ను ఆటాడుకున్న భారత స్పిన్నర్లు

  టి-20 ప్రపంచ కప్ గ్రూప్- ఎ చివరి మ్యాచ్‌లో టీమిండియా ఇంగ్లాండ్ ను ఓ ఆటాడుకుంది. ఇంగ్లాండ్ పై 90 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించింది. భారత బౌలర్ల ధాటికి 14.4 ఓవర్లలో 80 పరుగులకే కుప్పకూలారు. అంతర్జాతీయ టి-20ల్లో ఇంగ్లండ్‌కిదే అత్యల్ప స్కోరు. వెటరన్ ఆఫ్ స్పిన్నర్ హర్భజన్ (4/12) ఏడాది తర్వాత ఘనంగా రీ ఎంట్రీ ఇ చ్చాడు. చావ్లా (2/13), ఇర్ఫాన్ (2/17) అద్భుత ప్రదర్శన కనబరిచారు. దీంతో బ్రాడ్‌సేన పెవిలియన్‌కు క్యూ కట్టారు. జట్టులో కీస్వెట్టర్ 35పరుగులతో టాప్ స్కోరర్గా నిలిచారు. అంతకుముందు టాస్ఓడి బ్యాటింగ్‌కు దిగిన ధోనీసేన పూర్తి ఓవర్లలో నాలుగు వికెట్లకు 170 పరుగులు సాధించింది. రోహిత్ శర్మ 33 బంతుల్లో 5 ఫోర్లు, సిక్సర్‌తో 55 పరుగులు చేయగా, గంభీర్ 38 బంతుల్లో 5 ఫోర్లతో 45, విరాట్ కోహ్లీ 32 బంతుల్లో 6 ఫోర్లతో 40 పరుగులతో దూకుడుగా ఆడారు. ఫిన్ రెండు వికెట్లు తీయగా, స్వాన్ 1వికెట్ తీసి పొదుపుగా బౌలింగ్ చేశాడు.

విమలక్క అరెస్ట్, ఉద్రిక్తత

కాసు బ్రహ్మానందరెడ్డి విగ్రహం ధ్వంసం కేసులో తెలంగాణ యునైటెడ్ ఫ్రంట్ నేత విమలక్కతో పాటు మరో ఇద్దరిని పోలీసులు అరెస్టు చేశారు. వివిద సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. ఆ తర్వాత వారిని సీసీఎస్ పోలీస్ స్టేషన్కు తరలించారు. అంతకు ముందు విమలక్క అరెస్ట్ను తెలంగాణవాదులు అడ్డుకున్నారు. దాంతో అక్కడ కొద్దిసేపు ఉద్రిక్తత ఏర్పడింది. విమలక్క స్వయంగా తామే విగ్రహాన్ని ధ్వంసం చేశామని ప్రకటించారు. గతంలో లాంకో హిల్స్ భవనాల వద్ద, ఎమ్.ఆర్. సంస్థ కార్యాలయం వద్ద కూడా వీరు ఆందోళనలు నిర్వహించారు. కాగా సెప్టెంబర్ 17న తెలంగాణ విమోచన దినోత్సవం రోజున గుర్తు తెలియని దుండగులు హైదరాబాదులోని కెబిఆర్ పార్క్ వద్ద ఉన్న కాసు బ్రహ్మానంద రెడ్డి విగ్రహాన్ని ఈ రోజు తెల్లవారు జామున ధ్వంసం చేసిన విషయం తెలిసిందే. అంతేకాకుండా విగ్రహంపై టైర్లు వేసి నిప్పు పెట్టారు. స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ధ్వంసమైన విగ్రహం కన్పించకుండా తెల్లని వస్త్రాన్ని చుట్టారు. సంఘటనా స్థలంలో తెలంగాణ జన ప్రతిఘటన పేరుతో కరపత్రాలు వదలి వెళ్లారు.

డీజిల్ ధరల పెంపుతో ఆర్టీసీ ఛార్జీల బాదుడు

డీజిల్ ధరల్ని పెంచుతూ యూపీఏ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం అమల్లోకి వచ్చీరాకముందే రాష్ట్రంలో సామాన్యులపై భారం పెరిగిపోయింది. ఆర్టీసీ చార్జీల పెంపురూపంలో రాష్ట్ర ప్రజలనెత్తిన ఇంకా కాస్త బరువుని కాంగ్రెస్ ప్రభుత్వం బలవంతంగా మోపింది. పెరిగిన ఆర్టీసీ చార్జీలు ఆదివారం అర్థరాత్రినుంచే అమల్లోకొచ్చాయి. డీజిల్ ధరలు పెరగడంవల్ల ఆర్టీసీమీద అదనపు భారం పడిందని, నష్టాల్లో ఉన్న సంస్థను కాపాడేందుకు ఛార్జీలు పెంచక తప్పడం లేదని ప్రభుత్వం వివరణ ఇచ్చింది. పల్లెవెలుగు బస్సులకు 25 కిలోమీటర్ల వరకు ఒక రూపాయి, 45 కి.మీ. వరకు రూ.2, ఆపై ప్రతి కి.మీ. ఐదు పైసలు, డీలక్స్, ఎక్స్ ప్రెస్ బస్సులకు కి.మీ.కు 10 పైసలు, సూపర్ లగ్జరీ బస్సులకు కి.మీ.కు 12 పైసలు చార్జీలు పెరిగాయి. ఇంద్ర, గరుడ, వెన్నెల ఏసీ బస్సుల చార్జీల్లో ఎలాంటి మార్పూలేదు. నెలవారీ సిటీ బస్‌ పాస్ లపై  వందరూపాయల భారం అదనంగా పడింది. విద్యార్థుల బస్ పాస్ చార్జీల్నిమాత్రం పెంచలేదు. 

ములాయం రాజీకీయ చాతుర్యం

తృణమూల్‌ కాంగ్రెస్‌ యుపిఎకు మద్దతు ఉపసంహరించుకున్న నేపథ్యంలో సర్కారుకు సమాజ్‌వాది పార్టీ తమ మద్దతు ఎప్పటిలాగే బయటినుండి మద్దతు కొనసాగిస్తామని, మతతత్వశక్తులు అధికారంలోకి రాకూడదన్న ఉద్దేశంతోనే యుపిఎ వెంట ఉంటున్నామని తెలిపారు. అలాగే చిల్లర వరక్తంలోకి ఎఫ్‌డిఐలను అనుమతించబోమని, దానికి తాము పూర్తిగా వ్యతిరేకమని, డీజిల్‌ ధరల పెంపు, వంటగ్యాస్‌ పరిమితి, ఎఫ్‌డిఐలకు వ్యతిరేకంగా పోరాడుతామన్నారు. చాలా బావుంది! వీటికి ఒప్పుకోని కారణంగానే తృణమూల్‌ తన మద్దతును ఉపసంహరించుకుందని తెలుస్తుంటే.. ఆ సమస్యలపైనే మేము సర్కార్‌కు వ్యతిరేకంగా పోరాడతామని, మద్దతు బయటినుండి ఇస్తామని చెప్పడం చూస్తుంటే.... ఆయన సర్కార్‌నుండి ఏం ఆశిస్తున్నారో అన్న అనుమానం సామాన్యులకు కలుగుతోంది. ‘పైన చెప్పిన అన్నిటిమీదా వ్యతిరేకంగా సర్కార్‌పై పోరాడుతాం. కాని మద్దతు ఇస్తాం’ అన్న ములాయంగారి మాటలు ‘పాము చావదు, కర్రా విరగదు’ అన్నట్లుగా వుంది. రాజకీయాలంటే ‘రాజ’భోగాల తాళం తియ్యాలంటే అధికారమే అసలు ‘కీ’ కాబట్టి, దానికై నైతికతను సైతం ‘యం’చక్కా వదిలేయడమే. ఇప్పుడు దేశంలో చాలా పార్టీలు చేస్తున్న పని అదే.

ఉమాభారతి కడిగేస్తుందట!

గంగానదిని కాలుష్య రహితం చేయాలని, జాతీయ వారసత్వ హోదాను కల్పించాలనే లక్ష్యంతో బిజెపి నేత ఉమాభారతి ‘గంగా సమగ్ర యాత’ను ప్రారంభించారు. ఇది రాజకీయాలతో సంబంధంలేని యాత్ర అని, ఇందులో అన్నివర్గాలకు, రాజకీయపార్టీలకు చెందినవారు పాల్గొనవచ్చునని అని కూడా ఆమె చెప్పారు. బావుంది. గంగానదిని కాలుష్యరహితంగా చేయాలని కోట్లు ఖర్చు పెడుతోంది ప్రభుత్వం చాలా సంవత్సరాలుగా. అయినా ఇంకా గంగానది కాలుష్య రహితం కాలేదు! కనీసం ఉమాభారతి వంటి రాజకీయనేత రాజకీయాలకు అతీతంగా చేపట్టానని చెబుతున్న ఈ గంగా సమగ్ర యాత్రను హర్షించవలసిందే. రాజకీయాలకు అతీతమని చెప్పినా ప్రారంభించిందే ఓ రాజకీయనేత కనుక ఆ ముద్రపడక తప్పదు. ఇక గంగ కాలుష్య రహితమంటారా? మనసుల్లో చిత్తశుద్ధిలేకుండా కాలుష్యాన్ని నింపుకుని గంగను కాలుష్యరహితంగా మారుస్తామని ఎన్ని కోట్లు ఖర్చుపెట్టి ఏం లాభం? ముందు గంగానది కాలుష్య రహితం చేయాలన్న ఆశయంకోసం శ్రమించే నిజమైన వారికి ఆ పని అప్పగిస్తే మేలు? అదేమీ లేకుండా ప్రతి ఏడాది కాలుష్య రహితంకోసం ఇన్ని కోట్లు వెచ్చిస్తున్నాం..అంటూ న్రకటనలు ఎందుకు? అసలు ప్రకృతి కాలుషితం చేసేదే మనిషి? మనిషిలో కొద్దిగా కనిపించే ఆ కాలుష్యాన్ని మరింతగా పెంచుతున్నాయి రాజకీయాలు? ఎన్నో సంవత్సరాలు అయినా ఇంకా కాలుష్యం తగ్గలేదంటే అసలు కాలుష్యం వున్నది గంగానదిలోనా...? నేతల చేతల్లోనా?

కొండా లక్ష్మణ్ బాపూజీ అంటే కేసీఆర్ కి లెక్కలేకుండా పోయిందా?

తెలంగాణ కోసం సర్వస్వాన్నీ ధారపోసిన సాటిలేని మేటి పోరాటయోధుడు, కొండా లక్ష్మన్ బాపూజీ. ఈ విషయాన్ని అందరూ ఒప్పుకుంటారు. ప్రాంతీయ తత్వాలకతీతంగా ఈ తెలగాణ సాయుధపోరాట యోధుడికి అంతా ఘన నివాళి అర్పించారు. కానీ.. తెలంగాణకోసం తెగ పాటుపడుతున్నానంటూ ఢంకా బజాయించుకుంటూ తిరిగే బొబ్బిలి వలసదొరమాత్రం కొండా బాపూజీ అంత్యక్రియలకు హాజరు కాలేదు. కొండా బాపూజీ కేవలం స్వాతంత్ర సమరయోధుడు, తెలంగాణ సాయుధ పోరాట యోధుడు మాత్రమే కాదు, తెలంగాణ రాష్ట్ర సమితి పేరుతో ఓ పార్టీ ఆవిర్భావానికి నాందీ పలికిన వ్యక్తి. ప్రత్యేక రాష్ట్రంకోసం ఆఖరు శ్వాసవరకూ తపించిన శక్తి. ఆఖరికి టిఆర్ ఎస్ కోసం తన ఇంటిని కూడా ధారాదత్తం చేసిన మహోన్నత వ్యక్తిత్వం ఆయనది. అలాంటి మహా మనీషికి నివాళి అర్పించడానిక్కూడా కేసీఆర్ కి గానీ, కేసీఆర్ కుటుంబ సభ్యులకు గానీ తీరికా, ఓపికా లేకుండా పోయాయ్.   టిఆర్ ఎస్ పార్టీ కొండా లక్ష్మణ్ బాపూజీ ఇల్లు జలదృశ్యంలోనే పురుడు పోసుకుంది. ఆ పార్టీకోసం బాపూజీ తను ఉంటున్న ఇంటిని కూడా ఖాళీ చేసి మరో చోటికెళ్లారు. తర్వాత ఆ స్థలంలో టిఆర్ ఎస్ పార్టీ కార్యాలయాన్ని కట్టుకుంది. అది ఆక్రమిత స్థలమంటూ ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది. ఇవన్నీ నిజంగా కేసీఆర్ కి గానీ, ఆయన కుటుంబ సభ్యులకుగానీ గుర్తులేవా..? లేక కావాలనే కొండా లక్ష్మణ్ బాపూజీ అంత్యక్రియలకు హాజరు కాలేదా అన్న సందేహం ఇప్పుడు తెలంగాణవాదులందరి మదిలోనూ కలుగుతోంది. కొండా లక్ష్మణ్ బాపూజీ అంత్యక్రియల్లో ఎక్కడ చూసినా, ఏ పక్కన విన్నా ఒకటే మాట.. “కేసీఆర్ రాలేదా...?” అని పక్కవాళ్లని అడగనివాళ్లూ, కనీసం మనసులోనైనా అనుకోనివాళ్లూ లేరు. కొద్ది రోజులుగా బొబ్బిలి వలసదొర, ఢిల్లీ పెద్దల చేతుల్లో బందీ అయినట్టుగా చాలామంది చెప్పుకుంటున్నారు. తెలంగాణ ఇస్తామని ఒక్క మాట చెప్పండి చాలు, ఒక్క ప్రకటన చేయండి చాలు.. నా పార్టీని కాంగ్రెస్ పార్టీలో కలిపేస్తా అంటూ వలసదొర ఢిల్లీలో సోనియా మేడం కాళ్లావేళ్లా పడుతున్నారని అభిజ్ఞానవర్గాల భోగట్టా. మేడం సోనియా.. కేసీఆర్ కి అప్పాయింట్ మెంట్ ఇవ్వకుండా, తిరిగి రాష్ట్రానికి వెళ్లకుండా ఆయన్ని అడకత్తెరలో పెట్టి నొక్కుతున్నారని కాంగ్రెస్ నేతలుకూడా చెప్పుకుంటున్నట్టు సమాచారం. మేడం కరుణాకటాక్షవీక్షణాలకోసం గుమ్మంముందు పడిగాపులు పడుతూ కొండా లక్ష్మణ్ బాపూజీ అంత్యక్రియలకు హాజరుకావాలన్న ఆలోచనకూడా దొరవారు చేయలేకపోయారని టిఆర్ ఎస్ శ్రేణులే బాహాటంగా చెప్పుకుంటున్నట్టు వినికిడి. పైకి మాత్రం వాళ్లు చెప్పుకుంటున్న కారణం వేరేగా ఉంది. ఢిల్లీలో బసచేసిన కేసీఆర్ కి బాగా జలుబు పట్టుకుందట. ఎన్ని మందులు వేసుకున్నా పడిశెం తగ్గక చేసేదేం లేక రెస్ట్ తీసుకుంటున్నారని, ఆదివారంకూడా సారు రెస్ట్ లోనే ఉంటారని, అందుకే కొండా లక్ష్మణ్ బాపూజీ అంత్యక్రియలకు హాజరు కాలేకపోయారనీ ప్రచారం సాగుతోంది. లోగుట్టు మాత్రం వేరే ఉందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. తెలంగాణ మార్చ్ జరిగితే ఇప్పటికే తనచేతుల్లోంచి జారిపోయే స్థితిలో ఉన్న ఉద్యమం పూర్తిగా కోదండరామ్ చేతుల్లోకి వెళ్లిపోతుందన్న విషయం కేసీఆర్ కి స్పష్టంగా తెలుసుగనక, ఈ లోపుగానే మేడంని బతిమిలాడో బామాలో ఓ ప్రకటన చేయించుకుని ఈ గండంనుంచి గట్టెక్కుదామన్న ఆలోచనలో దొరగారు ఉన్నారని వాళ్లు చెబుతున్నారు. ఏది ఎలా ఉన్నా కొండా లక్ష్మణ్ బాపూజీ లాంటి మహోన్నత వ్యక్తి చనిపోతే కనీసం శ్రద్ధాంజలి ఘటించకుండా కేసీఆర్ కుటుంబం తన నైజాన్ని చాటుకుందని చాలామంది తెలంగాణ వాదులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎంతగా పనుల ఒత్తిడిలో ఉన్నా జైపాల్ రెడ్డి హైదరాబాద్ కొచ్చి కొండా లక్ష్మణ్ బాపూజీకి ఘన నివాళి అర్పించడం చాలా మంది తెలంగాణ వాదులకు సంతోషాన్ని కలిగించింది.   

అర్ధరాత్రి యువతిపై సామూహిక అత్యాచారం

తూర్పుగోదావరి జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. మోరంపూడి వద్ద ఓ యువతిపై ముగ్గురు వ్యక్తులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. శనివారం రాత్రి బంధువుల ఇంట్లో జరిగిన శుభకార్యానికి వెళ్ళి తిరీగి అర్ధరాత్రి దాటిన తర్వాత తన బాబాయితో కలిసి మోరంపూడికి బయలుదేరింది. వారిద్దరూ ఓ ఆటో ఎక్కారు. కొద్దిదూరం వెళ్లిన తర్వాత ఆటో డ్రైవర్‌కు సంబంధించిన ఇద్దరు యువకులు ఆటో ఎక్కారు. మరి కొంత దూరం వెళ్ళిన తర్వాత వారు ఆ యువతి చిన్నాన్నను ఆటోలో నుండి కిందకు తోసేశారు. అనంతరం ముగ్గురు కలిసి ఆ యువతిపై సామూహిక అత్యాచారం జరిపారు. యువతి చిన్నాన్న బొమ్మూరు పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి బయలుదేరారు. తీవ్రంగా గాయపడిన యువతిని ఆసుపత్రిలో అత్యాచారానికి పాల్పడిన యువకులు తప్పించుకొని పారిపోయారు. పోలీసులు నిందితులను ముగ్గురిని పట్టుకోవడానికి స్థానిక ఆటో డ్రైవర్లను, పరిసర ప్రాంతాల వారిని విచారిస్తున్నారు.

తెలంగాణా లేఖ ఇవ్వరా?

తెలంగాణాకు అనుకూలంగా తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు రాస్తానన్న లేఖ ఇక బయటకు రాదని తెలంగాణావాదులు నమ్ముతున్నారు. ఆయన లేఖ రాసి తీరుతారని తెలంగాణాలోని తెలుగుతమ్ముళ్లు నమ్మబలుకుతుంటే వారితో ఇతర తెలంగాణావాదులు వాదనకు దిగుతున్నారు. అసలు లేఖ ఇచ్చే ఉద్దేశం ఉంటే చంద్రబాబు ముందుగా అనుకున్నట్లు తెలంగాణా నుంచి పాదయాత్ర ప్రారంభించాలి కదా! మరెందుకు అనంతపురం జిల్లా హిందుపురం నుంచి జనచైతన్యపాదయాత్రలు ప్రారంభిస్తున్నారు? అని తెలంగాణావాదులు ప్రశ్నిస్తున్నారు. ముందుగా అనుకున్నట్లు వరంగల్‌ జిల్లా పరకాల, అదిలాబాద్‌, మహబూబ్‌నగర్‌ జిల్లాల నుంచి బాబు పాదయాత్రలు ఎందుకు ప్రారంభించటం లేదని తెలుగుతమ్ముళ్లను నిలదీస్తున్నారు. దీంతో ఏమి సమాధానం చెప్పాలో తెలియని స్థితిలో తెలుగుతమ్ముళ్లు ఇరకాటంలో పడ్డారు. వారి వాదన కొంత వరకూ కరెక్టే అని పరిశీలకులు అంటున్నారు.    కాంగ్రెస్‌ కేంద్ర నాయకత్వం తెలంగాణా ఇచ్చేయటానికి, టిఆర్‌ఎస్‌ విలీనానికి తెర లేపటంతో బాబు ఊహించని పరిణామం ఇది. అనుకోకుండా ఏలూరులో రైతుసభ పేరిట సమైక్యాంధ్రాసభ జరిగింది. ఈ సభలో తెలుగుదేశం పార్టీ నేతలు పాల్గొని సమైక్యాంధ్రకు అనుకూలంగా ఆందోళనలకు సిద్ధమయ్యారు. దీంతో ఎటూ తేల్చుకోలేని స్థితిలో బాబు పడ్డారు. సమైక్యాంధ్రకు మద్దతును వదులుకోవటానికి బాబు సిద్ధంగా లేరు. అందుకే లేఖ ఇవ్వాలో వద్దో తేల్చుకోలేకపోతున్నారని ఆయన సన్నిహితులు సైతం అంగీకరిస్తున్నారు. దీనికి తోడు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి బైర్రెడ్డి రాజశేఖరరెడ్డి ప్రత్యేకరాయలసీమ రాష్ట్రం గురించి బాబు మద్దతు కోరుతున్నారు. తెలంగాణాకు అనుకూలంగా లేఖ ఇస్తే ప్రత్యేకసీమ కోసం ఎందుకు ఇవ్వరని రాజశేఖరరెడ్డి డిమాండు చేస్తున్నారు. సీమకు కూడా లేఖ ఇచ్చేస్తే ఇక రాష్ట్రంలో మిగిలిన ప్రతిపాదనలకు కూడా మద్దతు ఇవ్వాల్సి ఉంటుందని బాబు భావిస్తున్నారు. అందుకనే కొంచెం వెనక్కి తగ్గితే కేంద్రం బయటపడిరది కాబట్టి దానికి వ్యతిరేకంగా ప్రతిపక్షంగా నిలబడొచ్చని చంద్రబాబు రాజకీయ ఎత్తుగడ వేశారని తెలుస్తోంది. కాంగ్రెస్‌ కనుక తెలంగాణాకు వ్యతిరేకంగా నిలబడితే తాను అనుకూలం అనిపించుకునేందుకే లేఖ ఇస్తానని బాబు అన్నారని తెలంగాణాలో ప్రచారమైంది. కాంగ్రెస్‌ అనుకూలమైతే ప్రతిపక్షంగా వ్యతిరేకించాల్సిందేనని బాబుపై ఒత్తిడి కూడా పెరుగుతోంది. ఏదేమైనా లేఖ రాస్తానని ప్రకటించటం చంద్రబాబు మెడకు గుదిబండగా చుట్టుకున్నట్లే. ఇప్పటిదాకా అడపాదడపా కొన్ని సీట్లయినా తెలంగాణాలో వచ్చేది. ఈసారి లేఖ ఇవ్వకపోతే బాబుకు వ్యతిరేక ప్రచారం తప్పదు. 2014లో దీని ప్రభావం కనిపిస్తుందని పరిశీలకులు భావిస్తున్నారు.

ఐసీసీ ట్వంటీ-20, వెస్టిండీస్‌పై ఆస్ట్రేలియా గెలుపు

ఆస్ట్రేలియా రెండో వరుస విజయంతో టి-20 ప్రపంచ కప్ సూపర్-8 దశకు దూసుకెళ్లింది. గ్రూప్-బిలో భాగంగా వెస్టిండీస్‌తో శనివారం జరిగిన డే/నైట్ మ్యాచ్‌లో ఆసీస్ 17 పరుగులతో విజయం సాధించింది. వాట్సన్ 24 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్సర్లతో 41 నాటౌట్తో ఆల్‌రౌండ్ షోతో వీరంగం సృష్టించాడు. 192 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన కంగారూలు వర్షం వచ్చేసరికి 9.1 ఓవర్లలో వికెట్ నష్టానికి 100 పరుగుల చేశారు. వర్షం తెరిపినివ్వకపోవడంతో డక్‌వర్త్ లూయీస్ పద్ధతి ప్రకారం ఆసీస్‌ను విజేతగా ప్రకటించారు. ఆ సమయానికి కంగారూలకు 83 పరుగులు కావాల్సివుండగా, 17 పరుగులు ఆధిక్యంలో ఉన్నారు. వాట్సన్‌తో పాటు మైక్ హస్సీ 19 బంతుల్లో 3 ఫోర్లు, సిక్సర్‌తో 28 నాటౌట్, వార్నర్ 14 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్సర్లతో 28 దూకుడుగా ఆడారు. అంతకుముందు టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన విండీస్ నిర్ణీత ఓవర్లలో ఎనిమిది వికెట్లకు 191 పరుగులు సాధించింది. క్రిస్ గేల్ 33 బంతుల్లో 5 ఫోర్లు, 4 సిక్సర్లతో 54, శామ్యూల్స్ 32 బంతుల్లో 3 ఫోర్లు, 4 సిక్సర్లతో 50 మెరుపులు మెరిపించగా, డ్వెన్ బ్రావో 21 బంతుల్లో 27తో  ఆకట్టుకున్నారు. స్టార్క్ మూడు, వాట్సన్ రెండు వికెట్లు తీశాడు. వాట్సన్‌కు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ దక్కింది.  

ఆమె అందాలను టచ్ చేసిన డైరెక్టర్

  హాలీవుడ్ బ్యూటీ సల్మా హాయక్ అందచందాలు చూసి ఓలివెర్ స్టోన్ మతిపోగోట్టుకున్నాడు. హాలీవుడ్ మూవీ ‘సావేజెస్' మంచి విజయం సాధించిన నేపథ్యంలో ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ కి సల్మా హాయక్ అదిరిపోయే విధంగా తయారై వచ్చింది. ఆమె అందాలను చూసి ఉద్రేకం ఆపుకోలేక పోయిన సావేజెస్' మూవీ డైరెక్టర్ ఓలివెర్ స్టోన్ ఫోటోగ్రాఫర్ల ముందే ఆమె అందాలను టచ్ చేసాడు. దీంతో ఏం చేయాలో తోచని సల్మా హాయక్ కవర్ చేసుకోవడానికి కంటిన్యూస్‍‌గా స్మైల్ ఇస్తూ ఏదో ఫన్నీ ఇన్సిడెంట్ అన్నట్లు కలరింగ్ ఇచ్చింది. ఏది ఏమైనా ఆ ముసలి డైరెక్టర్ అలా టచ్ చేయడం ఏమిటని సల్మా హయక్ అభిమానులు మండి పడుతున్నారు.

ఆస్కార్ కి బర్ఫీ సినిమా ఎంపిక

  బర్ఫీ సినిమా ఆస్కార్ అవార్డ్స్ 2012 సంవత్సరానికిగానూ నామినేట్ అయింది. ఈ విషయాన్ని ఫిల్మ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఆస్కార్ జ్యూరీ చైర్‌పర్సన్ మంజు బోరా హైదరాబాద్‌లో ప్రకటించారు. "ఆస్కార్‌కు భారతీయ చిత్రంగా 'బర్ఫీ'ని నామినేట్ చేస్తున్నాం. సినిమాలోని విషయం, నాణ్యత ఆధారంగా ఈ చిత్రాన్ని ఎంపిక చేశాం'' అని ఆమె చెప్పారు. ఈ సారి హిందీ, గుజరాతి, మరాఠీ, మలయాళం, తమిళ్, తెలుగు నుంచి 20 సినిమాలొచ్చాయి. తెలుగు నుంచి 'ఈగ'ను కూడా పరిశీలించాం. మేం చూసిన 20 సినిమాల్లో దాదాపు 18 మనసుకు నచ్చాయి. మా సభ్యులందరూ కలిసి చర్చించి 'బర్ఫీ'ని నామినేట్ చేయాలని నిర్ణయించుకున్నాం.'' అని మంజు బోరా అన్నారు.

తెలంగాణపై త్వరలో నిర్ణయం

రాష్ట్ర విభజనపై కాంగ్రెస్ పార్టీ తన వైఖరిని వెల్లడించిన తర్వాత, కేంద్రం తన నిర్ణయాన్ని ప్రకటిస్తుందని సీఎం చెప్పారు. కేంద్రం ఎప్పుడు తన నిర్ణయాన్ని ప్రకటిస్తుందన్న తేదీ, సమయాలను తాను చెప్పలేనన్నారు.ఎప్పుడు తన నిర్ణయాన్ని ప్రకటిస్తుందన్న తేదీ, సమయాలను తాను చెప్పలేనన్నారు. "తెలంగాణ కఠినమైన, సున్నితమైన అంశం. దీనిపై నిర్ణయం తీసుకోవడం సులువు కాదు. నిర్ణయం తీసుకునేముందు అందరితోనూ మాట్లాడాలి. దీనిపై కాంగ్రెస్ నేతలతోనూ మాట్లాడాలి. కాంగ్రెస్ నేతల అభిప్రాయాన్ని తీసుకున్న తర్వాత ఇతర పార్టీల అభిప్రాయాలను తెలుసుకునే యత్నాన్ని కేంద్రం చేస్తుంది. అందరితో మాట్లాడాకే కేంద్రం సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకుంటుంది'' అని వివరించారు. తుది నిర్ణయం తీసుకునే సమయంలో సీఎంగా తన అభిప్రాయాన్ని అధిష్ఠానం తెలుసుకుంటుందని, తన అభిప్రాయాన్ని కోరితే తప్పకుండా చెబుతానని కిరణ్ వివరించారు.

కాంగ్రెస్ మంత్రులు రాజీనామా

కేంద్రంలోని యుపీఏ ప్రభుత్వానికి తృణమూల్ కాంగ్రెస్ మద్దతు ఉపసంహరించుకున్న నేపథ్యంలో పశ్చిమబెంగాల్‌లోని మమతా సర్కార్ నుంచి వైదొలగాలని ఆ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది. తృణమూల్ సర్కార్‌లోని ఆరుగురు మంత్రులు శనివారం తమ పదవులకు రాజీనామా చేశారు. తమ రాజీనామా లేఖలను ఈ సాయంత్రం మమతా బెనర్జీకి ఇవ్వనున్నట్లు పశ్చిమబెంగాల్ కాంగ్రెస్ పీసీసీ అధ్యక్షుడు ప్రదీప్ భట్టాచార్య తెలిపారు. ఈ మేరకు ముఖ్యమంత్రి మమతా అపాయింట్ కోరినట్లు పేర్కొన్నారు. అయితే 294 మంది సభ్యులున్న అసెంబ్లీలో తృణమూల్ కాంగ్రెస్‌కు 185 మంది ఎమ్మెల్యేల పూర్తి మెజారిటీ ఉంది. 42 మంది సభ్యులు ఉన్న కాంగ్రెస్ మద్దతు ఉపసంహరించుకున్నప్పటికీ మమత సర్కార్‌కు ఎలాంటి ఢోకా లేదు.

శాసనసభ నిరవధిక వాయిదా

శాసనసభ వర్షాకాల సమావేశాలు తొలి రోజు నుంచి చివరి రోజువరకు వాయిదాలతో ముగిశాయి. శాసనసభ సమావేశాల్లో ఏ ఒక్క సమస్యపై కూడా చర్చలు జరగలేదు. అసెంబ్లీ వర్షాకాల సమావేశాల ఆఖరి రోజు కూడా అదే పరిస్థితి నెలకొంది. శనివారం ఉదయం సభ ప్రారంభమైన పది నిమిషాలకే వాయిదా పడింది. వివిధ పార్టీలు పలు అంశాలపై ఇచ్చిన వాయిదా తీర్మానాలను స్పీకర్‌నాదెండ్ల మనోహర్ తిరస్కరించారు. టీఆర్ఎస్ సభ్యులు స్పీకర్‌పోడియం వద్ద దూసుకెళ్లి ఫ్లకార్టులు ప్రదర్శించి నిరసన తెలిపారు. ప్రశ్నోత్తరాలు రద్దు చేసి విద్యుత్‌పై చర్చకు స్పీకర్ అనుమతించినప్పటికీ సభ్యుల్లో మార్పు లేకపోవడంతో సభను మరో గంటపాటు వాయిదా పడింది. సభ వాయిదా అనంతరం టీఆర్ఎస్ నేతలు స్పీకర్ పోడియం వద్ద నిరసన కొనసాగిస్తున్నారు. నరసనలు సద్దుమణగకపోవడంతో సభను నివధికంగా వాయిదా వేశారు. అయితే రైతు సమస్యలపై చర్చ చేపట్టనందుకు తెలుగుదేశం పార్టీ నేత పయ్యావుల కేశవ్ శాసనసభలో ఉరితాడు ప్రదర్శించి నరసన తెలిపారు.

ఆర్థిక సమ్మేళనంలో ప్రధానికి చేదు అనుభవం

  ప్రధాని మన్మోహన్ సింగ్ కి శనివారం చేదు అనుభవం ఎదురైంది. అంతర్జాతీయ ఆర్థిక సమ్మేళనంలో ప్రధాని ప్రసంగిస్తుండగా ఓ వ్యక్తి చొక్కా విప్పి నిరసన వ్యక్తం చేశాడు. అతనిని పోలీసులు అదుపులోకి తీసుకొని, న్యాయవాదిగా గుర్తించారు. చిల్లర వర్తంలోకి ప్రత్యక్ష పెట్టుబడులను ఆహ్వానిస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై వ్యతిరేకత వ్యక్తం చేస్తూ ఆ వ్యక్తి నిరసనకు దిగినట్లు తెలుస్తోంది. ప్రధానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ చొక్కా విప్పి నిరసన తెలిపిన 33 ఏళ్ల సంతోష్ కుమార్ సుమన్ సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్‌లో న్యాయవాదిగా పేరును నమోదు చేసుకున్నాడు. అతన్ని అదుపులోకి తీసుకున్న ప్రత్యేక రక్షణ దళానికి చెందిన గార్డులు తుగ్లక్ రోడ్డులోని పోలీసు స్టేషన్‌లో ప్రశ్నించారు. ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టాల్సిన అందరిపై ఉందని ఆయన అన్నారు. ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయాల్సిన అవసరం ఏర్పడిందని ఆయన అన్నారు. ఆర్థిక సంస్కరణలపై సానుకూలంగా స్పందించాలని ఆయన కోరారు.