బాబే లక్ష్యంగా చిరు మెగారోల్?
తెలుగుదేశం పార్టీ అథ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు పాదయాత్రలు, టూర్ ఎదుర్కోవడమే లక్ష్యంగా చేసుకుని రాజ్యసభ సభ్యుడు, సినీనటుడు చిరంజీవి మెగారోల్ పోషించనున్నారు. రాజకీయతెరపై తన ప్రత్యర్థిగా చంద్రబాబును చిరంజీవి ఎంచుకున్నారు. పీఆర్పీ(ప్రజారాజ్యంపార్టీ) వ్యవస్థాపకునిగా గత అసెంబ్లీ ఎన్నికల్లో చంద్రబాబుపై తనదైన శైలిలో వాగ్భాణాలు వదిలిన చిరు తన పార్టీని విలీనం చేశాక కూడా కాంగ్రెస్ పార్టీ తరుపున ఆ బాధ్యత భుజాన్న మోస్తున్నారు. కాంగ్రెస్‌పార్టీకి తానేమి చేశానని ప్రశ్నించకుండా చిరంజీవి జాగ్రత్తపడబోతున్నారు. చంద్రబాబు పర్యటన డైరీ(వివరాలు) సేకరించి దానికి కొంచెం ముందస్తుగా ఆరోగ్యయాత్రను చేపడుతున్నారు.
తన అభిమాన సంఘాలను, తన సామాజిక వర్గమైన కాపులను కలుపుకుపోయేందుకు ఈ యాత్రను ఉపయోగించుకోవాలని చిరంజీవి తహతహలాడుతున్నారు. తన సామాజిక నేతలే అభిమానసంఘాల్లో కీలకభూమిక నిర్వహిస్తున్నందున ఈ యాత్ర ద్వారా వారిలో ఉత్సాహం నింపాలని చిరు ప్రయత్నం. ఇప్పటికే తన సామాజికవర్గ నేతలు చిరంజీవి ఏమి పలకరించటం లేదని విసుగును వ్యక్తం చేస్తున్నారు. అలానే కాంగ్రెస్ పార్టీలో విలీనాన్నీ వ్యతిరేకించి మౌనంగా ఉన్నారు. అందుకని ఈ యాత్ర నిర్వహించి వారందరినీ కలుపుకుంటూ పోతే తన బలం పెరుగుతుందని సన్నిహితుల సూచనలను చిరు పాటిస్తున్నారు. ఇటీవల కుటుంబపరంగా కూడా సామాజికవర్గానికి చిరు దూరమయ్యారు. తన కుమారుడు రామ్‌చరణ్‌తేజకు అపోలో అధినేత కుమార్తెను ఇచ్చినందుకు కొందరు కాపులు వ్యతిరేకించటం చిరంజీవి గమనించారు. దీంతో సామాజికవర్గానికి దగ్గరగా వెళ్లి ఆరోగ్యయాత్ర పేరుతో అభిమానులను కూడగట్టుకోవాలని చిరంజీవి ప్రణాళిక వేసుకున్నారు.
అందుకే గతంలో ఎన్నడూ లేనట్లుగా ఈసారి యాత్రలో మెగామెడికల్‌క్యాంపులను ఏర్పాటు చేస్తున్నారు. ఈ క్యాంపుల ద్వారా ఒకవైపు ప్రజలకు, మరోవైపు అభిమానులకు, ఇంకోవైపు బ్లడ్‌బ్యాంకు నిర్వాహకస్థాయిలో ఉన్న నేతలకు దగ్గర అయ్యేందుకు వ్యూహరచన చేశారు. అంతేకాకుండా చిరంజీవి తన యాత్రలో బస కూడా సామాజికవర్గనేతల ఇళ్లు ఎంచుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. దాంతో పాటు కాంగ్రెస్‌పార్టీ కార్యక్రమాలకు కూడా హాజరుకావాలని చిరంజీవి భావిస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా పలుజిల్లాల్లో విషజ్వరాలు ఎక్కువగా ఉన్నందున ఆ ప్రాంతాలను కూడా ఎంపిక చేసుకునేందుకు చిరంజీవి కసరత్తులు చేస్తున్నారు. ఈ యాత్రలో ముందస్తుగా కాంగ్రెస్ అందించే సామాజికపథకాలను కూడా ప్రచారం చేస్తారు. అంతేకాకుండా చంద్రబాబు వల్ల పెద్దగా ఒనగూరే ప్రయోజనం ఉండదన్న భావన తన మెడికల్ క్యాంపు పరిసర ప్రాంతాల్లో కలిగించేందుకు చిరు కొంత శిక్షణ సన్నిహితుల నుంచి పొందారని సమాచారం. ఆరోగ్యం, అభివృద్థి అనే రెండు నినాదాలు కాంగ్రెస్‌కు రెండు కళ్లు అని చెబుతూనే చంద్రబాబు పెద్ద మోసగాడని చిరంజీవి తన ఆరోగ్యయాత్రలో చాటనున్నారు.
చిరంజీవి రాజకీయతెరపై ఈ తరహా ప్రయత్నం చేపట్టడమే తొలిసారి అని పీఆర్పీ నేతలు, కాంగ్రెస్ సీనియర్లు అభిప్రాయపడుతున్నారు. ఈ నేపథ్యంలో చిరంజీవికి అవసరమైన సహాయం అందించేందుకు ప్రభుత్వపరంగా కూడా సిద్ధంగా ఉన్నారని తెలుస్తోంది. పర్యటనలో అభిమానులు స్పందించకపోతే అధికారుల సహకారం పొందేందుకు సైతం చిరంజీవి వెనుకాడరని సన్నిహితులు అంటున్నారు. ఏమైనా చిరంజీవి కాంగ్రెస్ పెద్దగా పోషించే ఈ రోల్ సక్సెస్‌పై ఆయన రాజీకీయ భవిష్యత్తు ఆధారపడి ఉంది. చంద్రబాబును ఎండగట్టడంలో విజయవంతమైనా, మెగామెడికల్‌క్యాంపుల్లోనూ, అభిమానులను చేరదీయటంలోనూ సఫలీకృతమైనా కేంద్రమంత్రి పదవి ఖాయమని సన్నిహితులు అభిప్రాయపడుతున్నారు. ఏమీ చేయకుండానే పదవి ఆశించే బదులు ఇంత చేశామనిపించుకునేందుకు చిరంజీవి చేస్తున్న కృషికి అభిమానుల నుంచి మాత్రం బెస్టాఫ్‌లక్ అని మెసేజ్‌లు వస్తున్నాయట. ఈ యాత్ర చిరు భవిష్యత్తును మారిస్తే వారి మెసేజ్‌లు నిజంగానే బెస్టాఫ్‌లక్ అవ్వొచ్చు.