తెలంగాణా లేఖ ఇవ్వరా?
posted on Sep 23, 2012 @ 1:28PM
తెలంగాణాకు అనుకూలంగా తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు రాస్తానన్న లేఖ ఇక బయటకు రాదని తెలంగాణావాదులు నమ్ముతున్నారు. ఆయన లేఖ రాసి తీరుతారని తెలంగాణాలోని తెలుగుతమ్ముళ్లు నమ్మబలుకుతుంటే వారితో ఇతర తెలంగాణావాదులు వాదనకు దిగుతున్నారు. అసలు లేఖ ఇచ్చే ఉద్దేశం ఉంటే చంద్రబాబు ముందుగా అనుకున్నట్లు తెలంగాణా నుంచి పాదయాత్ర ప్రారంభించాలి కదా! మరెందుకు అనంతపురం జిల్లా హిందుపురం నుంచి జనచైతన్యపాదయాత్రలు ప్రారంభిస్తున్నారు? అని తెలంగాణావాదులు ప్రశ్నిస్తున్నారు. ముందుగా అనుకున్నట్లు వరంగల్ జిల్లా పరకాల, అదిలాబాద్, మహబూబ్‌నగర్ జిల్లాల నుంచి బాబు పాదయాత్రలు ఎందుకు ప్రారంభించటం లేదని తెలుగుతమ్ముళ్లను నిలదీస్తున్నారు. దీంతో ఏమి సమాధానం చెప్పాలో తెలియని స్థితిలో తెలుగుతమ్ముళ్లు ఇరకాటంలో పడ్డారు. వారి వాదన కొంత వరకూ కరెక్టే అని పరిశీలకులు అంటున్నారు.
కాంగ్రెస్ కేంద్ర నాయకత్వం తెలంగాణా ఇచ్చేయటానికి, టిఆర్‌ఎస్ విలీనానికి తెర లేపటంతో బాబు ఊహించని పరిణామం ఇది. అనుకోకుండా ఏలూరులో రైతుసభ పేరిట సమైక్యాంధ్రాసభ జరిగింది. ఈ సభలో తెలుగుదేశం పార్టీ నేతలు పాల్గొని సమైక్యాంధ్రకు అనుకూలంగా ఆందోళనలకు సిద్ధమయ్యారు. దీంతో ఎటూ తేల్చుకోలేని స్థితిలో బాబు పడ్డారు. సమైక్యాంధ్రకు మద్దతును వదులుకోవటానికి బాబు సిద్ధంగా లేరు. అందుకే లేఖ ఇవ్వాలో వద్దో తేల్చుకోలేకపోతున్నారని ఆయన సన్నిహితులు సైతం అంగీకరిస్తున్నారు. దీనికి తోడు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి బైర్రెడ్డి రాజశేఖరరెడ్డి ప్రత్యేకరాయలసీమ రాష్ట్రం గురించి బాబు మద్దతు కోరుతున్నారు. తెలంగాణాకు అనుకూలంగా లేఖ ఇస్తే ప్రత్యేకసీమ కోసం ఎందుకు ఇవ్వరని రాజశేఖరరెడ్డి డిమాండు చేస్తున్నారు. సీమకు కూడా లేఖ ఇచ్చేస్తే ఇక రాష్ట్రంలో మిగిలిన ప్రతిపాదనలకు కూడా మద్దతు ఇవ్వాల్సి ఉంటుందని బాబు భావిస్తున్నారు.
అందుకనే కొంచెం వెనక్కి తగ్గితే కేంద్రం బయటపడిరది కాబట్టి దానికి వ్యతిరేకంగా ప్రతిపక్షంగా నిలబడొచ్చని చంద్రబాబు రాజకీయ ఎత్తుగడ వేశారని తెలుస్తోంది. కాంగ్రెస్ కనుక తెలంగాణాకు వ్యతిరేకంగా నిలబడితే తాను అనుకూలం అనిపించుకునేందుకే లేఖ ఇస్తానని బాబు అన్నారని తెలంగాణాలో ప్రచారమైంది. కాంగ్రెస్ అనుకూలమైతే ప్రతిపక్షంగా వ్యతిరేకించాల్సిందేనని బాబుపై ఒత్తిడి కూడా పెరుగుతోంది. ఏదేమైనా లేఖ రాస్తానని ప్రకటించటం చంద్రబాబు మెడకు గుదిబండగా చుట్టుకున్నట్లే. ఇప్పటిదాకా అడపాదడపా కొన్ని సీట్లయినా తెలంగాణాలో వచ్చేది. ఈసారి లేఖ ఇవ్వకపోతే బాబుకు వ్యతిరేక ప్రచారం తప్పదు. 2014లో దీని ప్రభావం కనిపిస్తుందని పరిశీలకులు భావిస్తున్నారు.