తెలంగాణా మార్చ్ పై కాంగ్రెస్ లో కలవరం ....

తెలంగాణా  మార్చ్ కు గడువు దగ్గరపడింది. కాంగ్రెస్ నేతల్లో కలవరం పెరుగుతోంది. మార్చ్ విషయంలో ఎ వైఖరిని అవలంభించాలో టి.కాంగ్రెస్ నేతలు తలలు పగలగొట్టుకుంటున్నారు. మార్చ్ ని ఎలాగైనా వాయిదా వేయించాలని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి గట్టి పట్టుదలపై ఉన్నారు. ఈ వ్యవహారాన్ని దామోదర రాజనర్సింహ కు అప్పగించేశారు. బయో డైవర్సిటీ సదస్సు, గణేష్ నిమజ్జనోత్సవం ఉన్నందున మార్చ్ ని వాయిదా వేసుకోవాలని ఉప ముఖ్యమంత్రి తెలంగాణావాదులను కోరుతున్నారు. తెలంగాణా మార్చ్ విషయంలో తెలంగాణా నేతల్లో కూడా భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఖచ్చితంగా మార్చ్ ను నిర్వహించాలని అందరూ కోరుకుంటున్నప్పటికీ ప్రస్తుత పరిస్థుతుల్లో మార్చ్ జరపడం అంతా శ్రేయస్కరం కాదని కొందరు గట్టిగా వాదిస్తున్నారు. తెలంగాణా మార్చ్ హింసాత్మకంగా మారితే, ఆంధ్రుల ఆస్తులపై దాడులు జరిగితే సీన్ మొత్తం మారిపోతుందని చాలామంది ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికే ఉస్మానియాలో విద్యార్థుల ముసుగులో అరాచకశక్తులు ఉద్యమాన్ని రూల్ చేసేందుకు ప్రయత్నిస్తున్నాయని వార్తలు గట్టిగా వస్తున్న నేపథ్యంలో జరగరానిది ఏదైనా జరిగితే ఒరిగేదానికంటే అప్రతిష్టని మూటగట్టుకోవలసిన పరిష్టితి ఎదురౌతుందేమోనని చాలామంది భయపడుతున్నారు. ఆరునూరైనా తెలంగాణా మార్చ్ ను వాయిదా వేయించాలన్న పట్టుదలతో ఉన్న ప్రభుత్వం ఉపముఖ్యమంత్రి ద్వారా జానారెడ్డి లాంటి సీనియర్ తెలంగాణా నేతలపై గట్టిగా ఒత్తిడిని తీసుకొస్తోంది.

తెలంగాణఫై చంద్రబాబు లేఖ అపర చాణక్యం

చంద్రబాబు అపర చాణక్యాన్ని ప్రదర్శించారు. కర్రా విరగకుండా పామూ చావకుండా ఉండే మార్గాన్ని తెలంగాణ విషయంలో అవలంబించారు. ప్రస్తుతానికి అసలు తమ వైఖరేంటో చెప్పకపోయినా నెపాన్ని కాంగ్రెస్ మీదికి నెట్టిపారేసి చేతులు దులుపుకున్నారు. దీనివల్ల ఆయనకు రెండు లాభాలు. ఒకటి తెలంగాణ కోసం లేఖ ఇవ్వాలని గట్టిగా పట్టుబడుతున్న తెలుగుదేశంలోని తెలంగాణావాదుల్ని సంతృప్తి పరచడం మొదటిదైతే, స్పష్టమైన వైఖరిని ప్రదర్శించకుండా ఉండడంవల్ల సీమాంధ్ర ప్రాంతం నేతల అభిమానాన్ని కూడా చూరగొనడం రెండో లాభం. రేపటికి రాజెవడో రెడ్డవడో..? అయ్యేది కాకమానదు. జగబోయేదాన్ని ఎలాగూ అపలేం.. కానీ మన చేతుల్లో ఉన్న ప్రజాభిమానాన్ని మాత్రం పోగొట్టుకోకూడదన్న సత్యం చంద్రబాబుకి ఇప్పటికి స్పష్టంగా బోధపడినట్టుగా అనిపిస్తోంది. అటు సీమాంధ్ర నేతలకూ, ఇటు తెలంగాణ నేతలకూ పార్టీలో సమ ప్రాధాన్యం ఇవ్వడంవల్ల రేపన్న రోజు ఏం జరిగినా ఇద్దరి మద్దతూ తనకుంటుందన్న ధోరణిలో చంద్రబాబు శరవేగంతో దూసుకెళ్తున్నారు. ముఖ్యంగా పాదయాత్ర చేపట్టిన నేపధ్యంలో బాబు లేఖ ఓ రకంగా తెలంగాణ ప్రాంతంలో పర్యటించడానికి వీఐపీ పాస్ లా పనికొస్తుందని కొందరు రాజకీయ విశ్లేషకుల అంచనా. కేసీఆర్ లాంటివాళ్లో, లేక ఆవేశం చల్లారక ఎగిరెగిరిపడే కొందరు తెలంగాణ నేతలో విమర్శలు గుప్పించినంత మాత్రాన లేఖ విషయంలోగానీ, మరే ఇతర విషయాల్లోగానీ చంద్రబాబుకి వచ్చిన నష్టమేమీ లేదు. పైగా “గోపి” ధోరణివల్ల లాభాలే తప్ప అణువంతైనా నష్టం లేదుగాకు లేదు. కేవలం చంద్రబాబు వల్లే తెలంగాణ వెనక్కి పోయిందని ఆరోపిస్తున్న కేసీఆర్ మాటల్ని ఇప్పుడు ఎవరూ పట్టించుకునే స్థితిలో లేరు. కాంగ్రెస్ గోల కాంగ్రెస్ దే. ఎటొచ్చీ వచ్చే ఎన్నికల్లో ఎలా ఓట్లు రాబట్టుకోవాలా అన్న అంశంమీదే ఇప్పుడు బాబు పూర్తిగా దృష్టిని కేంద్రీకరిస్తున్నారు. పిల్లిపోరు పిల్లిపోరు పిట్ట తీర్చిందన్న సామెతను నిజంచేస్తూ కాంగ్రెస్, వైకాపాల మధ్య రగులుతున్న ( అంతా పైపైకేలా అనే వాళ్లూ కొందరున్నారు) చిచ్చుని తెలుగుదేశం ఓటుబ్యాంక్ కిందకి మార్చుకోవాలన్నదే చంద్రబాబు తాపత్రయం. చూద్దాం.. ఏం జరుగుతుందో..  

బాబు లేఖపై చిందులు తొక్కిన కేసీఆర్

తెలంగాణాపై టిడిపి అధ్యక్షుడు చంద్రబాబు రాసిన లేఖ అంటా అభూతకల్పన అంటూ కేసీఆర్ మండిపడ్డారు. తెలంగాణా విషయంలో తన వైఖరేంటో ఈ లేఖ ద్వారా బాబు మరోసారి బయట పెట్టుకున్నారని విమర్శించారు. ప్రధానికి రాసిన లేఖద్వారా చంద్రబాబు రెండు నాల్కల ధోరణి అందరికీ తెలిసిపోయిందన్నారు. కొత్తగా అఖిలపక్షం పెట్టడంద్వారా ఒరిగేదేం లేదని ఏదో చేస్తున్నట్టు జనాన్ని మభ్యపెట్టడానికే చంద్రబాబు ఇలాంటి ప్రయత్నాలు చేస్తున్నారని వ్యాఖ్యానించారు. తెలంగాణా అంశాన్ని కేంద్రం జటిలం చేస్తుందంటూ వ్యాఖ్యలు చేస్తున్న బాబు అసలు తెలంగాణాకు తనే అడ్డుగా ఉన్నారన్న విషయాన్ని ఒప్పుకునితీరాల్సిన రోజు త్వరలోనే వస్తుందన్నారు. లేఖద్వారా చంద్రబాబు తెలంగాణా ప్రజలనే కాక తెలంగాణా టిడిపి ఫోరం సభ్యుల్ని కూడా ఎమార్చారని ఆగ్రహం వ్యక్తం చేసారు. కేంద్రం తెలంగాణాను ప్రకటించాక యూ టర్న్ తీసుకుని చంద్రబాబే తెలంగానా అంశాన్ని జటిలం చేశారన్న విషయం మొత్తం తెలంగాణా ప్రజలు గుర్తించారన్న విషయాన్ని బాబు తెలుసుకోవాలన్నారు.

తెలంగాణ మార్చ్ లో సీమాంధ్రులపై దాడులు జరుగొచ్చంటున్న డిజి

పొలిటికల్ జెఎసి తలపెట్టిన తెలంగాణ మార్చ్ లో సీమాంధ్రుల ఆస్తులపై దాడులు జరగొచ్చని, ఉద్రిక్తత తలెత్తే ప్రమాదాన్ని కొట్టిపారేయలేమని శాంతి భద్రతల డిజి హుడా చెబుతున్నారు. గణేష్ నిమజ్జనం, జీవ వైవిధ్య సదస్సు, తెలంగాణ మార్చ్ ఒకేసారి రావడంవల్ల టెన్షన్ బాగా పెరిగిపోతోందని ఆయన అన్నారు. భద్రతకోసం అదనపు బలగాల్ని రంగంలోకి దించుతున్నామని చెప్పారు. గతంలో మిలియన్ మార్చ్ లో జరిగిన ఘటనల్ని దృష్టిలో పెట్టుకుని ఇప్పుడు తెలంగాణ మార్చ్ కి అనుమతివ్వలేదని హుడా చెప్పారు. గణేష్ నిమజ్జనం ముసుగులో దూర ప్రాంతాలనుంచి హైదరాబాద్ కొచ్చి తెలంగాణ మార్చ్ లో పాల్గొనాలని చూసేవాళ్లకు కూడా చెక్ పెట్టేందుకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తున్నామని శాంతి భద్రతల డిజి తెలిపారు. సాధ్యమైంనంతవరకూ శాంతి యుతంగానే నిరోధించే ప్రయత్నం చేస్తామని, శాంతి భద్రతలకు విఘాతం కలిగితే తప్పనిసరి చర్యలు చేపట్టక తప్పదని హుడా హెచ్చరించారు.

గీతిక ఆత్మహత్య కేసులో గోపాల్ కందాకి జ్యుడిషియల్ కస్టడీ

మాజీ ఎయిర్ హోస్టెస్ గీతిక శర్మ ఆత్మహత్య కేసులో ప్రథాన నిందితుడైన హర్యానా మాజీ మంత్రి గోపాల్ కందాకి న్యాయస్థానం జ్యుడిషియల్ రిమాండ్ ని ఆక్టోబర్ ఆరో తేదీవరకూ పొడిగించింది. కొంతకాలంగా కందాని అధికారులు గట్టిగానే విచారించి చాలా విషయాలు రాబట్టారు. ఈ సారి గోపాల్ కందా నిజాల్ని పూర్తిగా కక్కకుండా తప్పించుకునే అవకాశాలు ఏమాత్రం లేవని అధికారులు చెబుతున్నారు. ఇదే కేసులో అరుణ్ ఛద్దా జ్యుడిషియల్ కస్టడీనికూడా న్యాయస్థానం అక్టోబర్ ఆరు వరకూ పొడిగించింది. సెప్టెంబర్ 20వ తేదీన గోపాల్ కందా పెట్టుకున్న బెయిల్ పిటిషన్ ని కోర్ట్ కొట్టేసింది. అరుణ్ ఛద్దా తాను ఢిల్లీ హైకోర్టులో దాఖలు చేసుకున్న బెయిల్ పిటిషన్ ని వెనక్కి తీసుకోవడం మరో విశేషం.

కాటికి చేరిన భూమన కరుణాకర్ రెడ్డి

తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి ఇక లేరు. తిరుపతి శ్మశానంలో పడుకోబెట్టిన ఆయన పార్థివ దేహాన్ని చూడండి. పక్కనే కాలుతున్న మరో చితి. చుట్టూ కరుణాకర్ రెడ్డి అభిమానులు విషణ్ణ వదనాలతో శవ జాగారం. అభిమాన నేత ఇకలేరు అన్న నిజాన్ని జీర్ణించుకోలేక, బాధని దిగమింగుకుంటూ, గుడ్లనీరు కుక్కుకుంటూ చాలామంది అలా భూమన శవాన్ని చూస్తూ రాత్రంతా గడిపేశారు. “అరే.. సాయంత్రం దాకా ఆయన బానే ఉన్నారే. సాయంత్రమే మాకు కనిపించారే.. ఇంతలో ఏంటిలా?“ అని చాలామంది ఆశ్చర్యపోయారు. ఎవరేమనుకుంటే ఏం లాభం జరగాల్సింది జరిగిపోయింది. బతికినన్నాళ్లూ.. శ్మశానంలో తనని పూడ్చిపెట్టడానికి ఆరడుగుల జాగా దొరుకుతుందో లేదో అన్న బాధ ఒక్క కరుణాకర్ రెడ్డినేకాదు, తిరుపతిలో చాలామందిని రాత్రనకా పగలనకా వేధిస్తోంది. చాలా రోజులుగా శ్మశానంకోసం స్థలాన్ని కేటాయించాలని ఎన్ని అర్జీలు పెట్టుకున్నా లాభం లేకపోయింది. చివరికి తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి శవాన్నికూడా ఇరుకుగా.. కాలుతున్న మరో చితిపక్కనే ఉంచి, రాత్రంగా వేచిచూడాల్సొచ్చింది. కంగారు పడకండి.. నిజానికి మీరు చూస్తున్న ఈ సీన్ కి కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం అంతా కరుణాకర్ రెడ్డిదే. తిరుపతి వాసులకు వెంటనే శ్మశానాన్ని కేటాయించాలని డిమాండ్ చేస్తూ చాలాసార్లు చేసిన ఆందోళనలు ఫలితాన్నివ్వకపోవడంతో చివరికి ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు. నేరుగా అర్థరాత్రి శ్మశానానికెళ్లి కాలుతున్న ఓ చితిపక్కన శవాసనమేసి తీవ్రస్థాయిలో నిరసన తెలియజేశారు. చుట్టూ అభిమానులుకూడా గుమికూడడంతో.. ఈ చిత్రాన్ని చూసినవాళ్లకు.. భూమన నిజంగా పోయారేమోనని కంగారుపుట్టింది. మామూలుగా బతికుండగానే చనిపోయిన సీన్లలో నటించి లైఫ్ ఆప్టర్ డెత్ ఎలా ఉంటుందో చూసుకునే అవకాశం సినిమా వాళ్లకు మాత్రమే ఉంటుందని ఇన్నాళ్లూ జనం అనుకునేవాళ్లు. ఆ అభిప్రాయాన్ని భూమన కరుణాకర్ రెడ్డి పూర్తిగా మార్చి పారేశారు. జనం కోసమే చేసినా.. సినిమా వాళ్లకు మాత్రమే దక్కే అరుదైన అనుభూతిని ఆయన సొంతం చేసుకున్నారు. మెచ్చుకుని తీరాల్సిందే.. ఏమంటారు..?

దొరవారు చివరికి చేతులూపుకుంటూ వస్తారా?

తెలంగాణ విషయంలో ఓ ప్రకటన చేయిస్తానంటూ బీరాలు పలికి హస్తినలో మకాం వేసిన వలసదొర పరిస్థితి ప్రస్తుతం చాలా దారుణంగా ఉందని కాంగ్రెస్ వర్గాలు చెవులుకొరుక్కుంటున్నాయ్. తెలంగాణ ఏర్పాటు ప్రక్రియను మొదలుపెడుతున్నామనో, లేక తెలంగాణ ఇస్తామనో సూచన ప్రాయంగా ఓ ప్రకటన చేస్తే చాలు టీఆర్ ఎస్ ని కాంగ్రెస్ లో కలిపేస్తానంటూ దొరవారు బేరం పెట్టినా ఆయన వైపు చూసేవాళ్లే కరువయ్యారని సీనియర్ కాంగ్రెస్ నేతలు బాహాటంగా చెప్పుకుంటున్నారు. వాయలార్ రవిని రెండుసార్లు కలిసినా ఈ విషయంలో పెద్దగా ప్రయోజనమేమీ కనిపించకపోగా.. అసలు తెలంగాణ అంటే ఏంటి అన్నట్టుగా ఆయన ఫోజివ్వడంతో వలసదొరవారి ఫీజులెగిరిపోయాయని గట్టి ప్రచారమే జరుగుతోంది. దింపుడు కళ్లం ఆశనుకూడా పరీక్షించుకున్నాక తిరుగు ప్రయాణమవ్వాలని కేసీఆర్ యోచిస్తున్నట్టు తెలుస్తోంది. ప్రకటన చేస్తే తెలంగాణ మార్చ్ ని వాయిదా వేయిస్తా అంటూ పెట్టిన మరో బేరం కూడా అస్సలు పారలేదట.  ఈ నెలాఖరు వరకు కాదుకదా వచ్చే ఏడాది నెలాఖరు వరకూ కేసీఆర్ ఢిల్లీలోనే మకాం వేసి ప్రయత్నించినా కూడా ఇప్పట్లో తెలంగాణ విషయంలో కేంద్రం ప్రకటన చేసే అవకాశమేలేదని తేలిపోయిందని,  గప్పాలుకొట్టుకుంటూ ఢిల్లీకి పోయిన సారువాడు.. ఉత్త చేతులు ఊపుకుంటూ తిరిగి రాక తప్పదని రాజకీయ విశ్లేషకులంటున్నారు.

రామ్ దేవ్ బాబా ఆశ్రమంపై మెరుపుదాడి

  హరిద్వార్ లోని రామ్ దేవ్ బాబా పతంజలి యోగాపీఠంమీద హఠాత్తుగా దాడి జరిగింది. అధికారులు చకచకా లోపలికి చొరబడ్డారు. అక్కడ తయారవుతున్న మందుల్ని తీసుకుని ల్యాబ్ లో టెస్ట్ చేయించారు. వాటిలో ఏమాత్రం నాణ్యత లేదని తేల్చేశారు. ఎక్కడో తయారుచేసిన ఉత్పత్తుల్ని పతంజలి ఆశ్రమానికి తీసుకొచ్చి అమ్ముతున్నారని, జనాన్ని మోసం చేస్తున్నారని అభియోగాలు నమోదయ్యాయి. మూడురోజుల్లోగా వివరణ కోరుతూ రామ్ దేవ్ బాబా పీఠానికి నోటీసులు జారీ చేశారు. యూపీయే ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలపై బాహాటంగా విమర్శిస్తున్నందుకు, అవినీతిపై ప్రత్యక్ష పోరుకి దిగినందుకే తనపై కేంద్ర సర్కారు ఇలా కక్ష సాధిస్తోందని రామ్ దేవ్ బాబా ఆరోపిస్తున్నారు. పాపం రామ్ దేవ్.. ఇప్పుడాయన చేయగలిగిందికూడా అంతకంటే ఏం లేదుగా మరి..

భారీ బందోబస్తుకి లాఠీలే గతి

ఉగ్రవాదుల్ని ఎదుర్కోవడానికి లాఠీలే  లేటెస్ట్ ఆయుధాలు. ఇదీ.. గణేష్ నిమజ్జనోత్సవంకోసం రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలనుంచి బందోబస్తుకోసం హైదరాబాద్ కొచ్చిన ఖాకీల పరిస్థితి. గతంలో మూడుసార్లు ఉగ్రవాదులు నేరుగా బందోబస్తులో ఉన్న పోలీసులపై కాల్పులు జరిపారు. ఆ కాల్పుల్లో గాయపడ్డ కానిస్టేబుళ్లు ఇప్పటికీ జీవచ్ఛవాల్లా బతుకుతున్నారు. గతంలో ఉగ్రవాదులు తెగబడ్డ ప్రాంతాలకు ఇప్పటికైనా కళ్లు తెరిచి భారీ ఆయుధాలను, సిబ్బందిని బందోబస్తుకోసం సమకూర్చాల్సిన పోలీస్ శాఖ ఇప్పటికీ పూర్తి నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. కేవలం చేతుల్లో లాఠీలు పట్టుకుని తిరుగుతూ గణేష్ నిమజ్జనంకోసం వచ్చిన ఆదనపు బందోబస్తు బలగాలు పహారా కాస్తున్నాయ్. మళ్లీ అవే స్థలాల్లో ఉగ్రవాదులు మరో సారికూడా కాల్పులు జరిపినా పట్టించుకునే దిక్కే లేదు. బైటి ప్రాంతాలనుంచి బందోబస్తుకోసం రాజధానికొచ్చిన పోలీసుల ప్రాణాలంటే సర్కారుకి లెక్కే లేదు. అంతా దైవాధీనం మోటార్ సర్వీస్ లా నడుస్తోంది. ఓ పక్క గణేష్ నిమజ్జనం, మరోపక్క బయోడైవర్సిటీ సదస్సు, మూడోవైపునుంచి తెలంగాణ మార్చ్ హడావుడి; ఎప్పుడేం జరుగుతుందోనని హైదరాబాద్ వాసులు భయంతో ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకుంటున్నారు.

ధర్మానకేమో బెయిల్, మోపిదేవికి జైలా?

జగన్ అక్రమాస్తుల కేసు విచారణలో తమ నాయకుడి పట్ల ప్రభుత్వం అనుసరిస్తున్న తీరుపై మాజీ మంత్రి మోపిదేవి వెంకటరమణ అనుచరులు గుర్రుగా ఉన్నారు. మోపిదేవిని జైలుకి పంపిన ప్రభుత్వం ధర్మానకి ముందస్తు బెయిల్ ఎందుకిప్పించిందో చెప్పాలని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒకే కేసులో ఆరోపణలు ఎదుర్కుంటున్న ఇద్దరు వ్యక్తులకు వేరు వేరు న్యాయాన్ని అమలుచేసి చోద్యం చూస్తున్నారంటూ బాహాటంగానే విమర్శిస్తున్నారు. ఈ కేసులో మోపిదేవి వెంకటరమణతో ఎందుకు బలవంతంగా రాజీనామా చేయించారో, ఎందుకు ఇప్పటివరకూ ధర్మాన రాజీనామాని ముఖ్యమంత్రి ఆమోదించకుండా ఉన్నారో జనం చూస్తూనే ఉన్నారంటూ మోపిదేవి అనుచరులు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. మోపిదేవిని అరెస్టు చేసిన సీబీఐ ధర్మాన విషయంలో ఆచితూచి అడుగులేస్తోందని ఆరోపించారు. ధర్మానకు ముందస్తు బెయిల్ మంజూరు చేయడాన్ని తప్పుబడుతున్నారు. ఇదే కేసులో ఆరోపణలు ఎదుర్కొన్న వారికి ఎవరికీ మందస్తు బెయిల్ మంజూరు చేయకుండా ధర్మానకు మాత్రం ముందస్తు బెయిల్ ఇవ్వడంలో ఉన్న ఆంతర్యం.. కేవలం మోపిదేవి వెంకటరమణ బలహీన వర్గాలకు చెందిన నేత కావడమేనంటూ అభిమానులు మండిపడుతున్నారు.

తెలంగాణ మార్చ్ కి పర్మిషన్ లేదు

తెలంగాణ మార్చ్ కు అనుమతి ఇవ్వడం కుదరదని హైదరాబాద్  పోలీస్ కమిషనర్ అనురాగ్ శర్మ తెలంగాణ పొలిటికల్ జెఎసి చైర్మన్ కోదండరామ్ కి తేల్చిచెప్పారు. జీవ వైవిధ్యంపై అంతర్జాతీయ సదస్సును, వినాయక నిమజ్జనాన్ని చూసుకోవాలిగనుక ఇలాంటి నిరసన ప్రదర్శనలకు అనుమతి ఇచ్చే ప్రసక్తే లేదని నగర పోలీస్ కమిషనర్ గట్టిగా చెప్పేయడంతో పొలిటికల్ జెఎసి నేతలు ఖంగుతిన్నారు. పోలీసుల అనుమతి దొరకడం కష్టమే అని ముందుగానే ఊహించిన కోదండరామ్ “సాగరహారం “ పేరుతో తెలంగాణ మార్చ్ ని జరిపేందుకు కొత్త ప్రణాళికల్ని సిద్ధం చేసుకుంటున్నారు. తనిఖీల పేరుతో పోలీసులు ఉద్దేశపూర్వకంగా తెలంగాణ నేతల్ని, ప్రజల్ని ఇబ్బంది పెడుతున్నారని ఆయన ఆరోపించారు.

బెయిల్ స్కామ్ కేసులో గాలికి 11 రోజులు రిమాండ్

బెయిల్ ఫర్ సేల్ స్కామ్ కేసులో గాలి జనార్ధన్‌రెడ్డి మంగళవారం ఉదయం నాంపల్లి ఏసీబీ కోర్టుకు హాజరయ్యారు. ఈ కేసు సంబంధించి పలు అంశాలపై కోర్టు విచారణ జరపి గాలి జనార్ధన్‌రెడ్డికి 11 రోజులు రిమాండ్ విధించింది. తదుపరి విచారణను అక్టోబర్ 5కు వాయిదా వేసింది. అయితే గాలిని కస్టడీకి ఇవ్వాలని ఏసీబీ అధికారులు కోరగా కోర్టు నిరకరించింది. బెంగళూర్ జైలులో ఉన్న గాలిని హైదరాబాదుకు తీసుకుని వచ్చిన విషయం తెలిసిందే. అలాగే కుటుంబసభ్యులతో మాట్లాడటానికి అనుమతి ఇవ్వాలని గాలి జనార్ధన్‌రెడ్డి కోరగా పది నిమిషాల సమయాన్ని కోర్టు కేటాయించింది. కనీసం అర్ధగంట సమయాన్ని ఇవ్వాలని గాలి తరపు న్యాయవాదులు కోరడంతో కోర్టు అంగీకరించింది. గాలి కేసు సందర్భంగా ఆయన అనుచరులు పెద్ద ఎత్తున కోర్టుకు తరలివచ్చారు. బళ్లారి ఎమ్మెల్యే శ్రీరాములు, రాయచూర్ ఎంపీ ఫకీరప్ప కోర్టుకు వచ్చారు. వారిని చూసిన గాలి కోర్టులో కంటతడిపెట్టుకున్నారు. కుటుంబసభ్యులతో మాట్లాడిన అనంతరం గాలిని చంచల్‌గూడా జైలుకు తరలించారు.

ధర్మానకు జగన్ షేక్‌హ్యాండ్

జగన్ అక్రమాస్తుల కేసులో తదుపరి విచారణను నాంపల్లి కోర్టు అక్టోబర్ 9కి వాయిదా వేసింది. మంగళవారం ఉదయం ఈ కేసుపై విచారణ జరపిన కోర్టు జగన్ సహా పలువురికి వచ్చేనెల తొమ్మిది వరకు రిమాండ్ విధించింది. ఈ ఉదయం చంచల్‌గూడా జైలు నుంచి వైఎస్ జగన్, మోపిదేవి వెంకటరమణ, నిమ్మగడ్డ ప్రసాద్, బ్రహ్మానందరెడ్డిలను పోలీసులు కోర్టులో హాజరుపర్చారు. పలువురు ఐఏఎస్ అధికారులు కోర్టుకు హాజరయ్యారు. ఈ కేసులో మొత్తం 14 మంది నిందితులుగా సీబీఐ నాలుగో చార్జిషీట్‌లో పేర్కొంది. ఇదే కేసుకు సంబంధించి మంత్రి ధర్మానను తదుపరి విచారణకై వచ్చేనెల 9 న హాజరు కావల్సిందిగా కోర్టు ఆదేశించింది. రూ.25 వేల నగదు, ఇద్దరు వ్యక్తుల పూచీకత్తును ధర్మాన కోర్టుకు సమర్పించారు. కాగా అక్రమాస్తుల కేసులో కోర్టుకు హాజరైన జగన్ ఇదే కేసులో కోర్టుకు వచ్చిన ధర్మానను పలకరించారు. ఆపై ధర్మానతో కరచాలనం చేశారు.

ఇస్రోను బురిడీ కొట్టించిన మహిళ

  భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ఇస్రో) ఉపగ్రహ నిర్మాణ కేంద్రంలోకి నకిలీ గుర్తింపు కార్డుతో ఒక మహిళ అధికారులకు దొరికిపోయింది. అత్యంత పటిష్టమైన భద్రత ఉన్న ఇస్రోను ఆ మహిళ బురిడీ కొట్టించి నకిలీ గుర్తింపు కార్డుతో ఇస్రోలో మూడు రోజులు మకాం వేసింది. అంతరిక్ష భవనంలో జరుగుతున్న అధికారుల సమావేశానికి వెళ్లడానికి ప్రయత్నిస్తుండగా ఆమెను పట్టుకుని పోలీసులకు అప్పగించారు. కోర్ట్ ఆమెకు అక్టోబర్ 6వ తేదీ వరకు జ్యుడిషియల్ కస్టడీకి పంపారు. ఈ విషయం తెలుసుకున్న ఆమె భర్త అలెక్స్ వచ్చి ఆమెకు మతిస్థిమితం లేదని, మానసిక వైద్యులచే చికిత్స ఇప్పిస్తున్నానని చెప్పాడు. పోలీసులు ఈ కేసుపై దర్యాప్తు చేస్తున్నారు.

నాంపల్లి కోర్ట్ కి మంత్రి ధర్మాన

జగన్ అక్రమ ఆస్తుల కేసులో మంత్రి ధర్మాన ప్రసాదరావు నేడు నాంపల్లి సీబీఐ కోర్టు ఎదుట హాజరు కానున్నారు. ఆయనతోపాటు సీనియర్ ఐఏఎస్‌లు మన్మోహన్‌సింగ్, శామ్యూల్ కూడా కోర్టుకు రానున్నారు. ఇదే కేసులో ఇప్పటికే చంచల్‌గూడ జైల్లో ఉన్న వైఎస్ జగన్, నిమ్మగడ్డ ప్రసాద్, మోపిదేవి వెంకట రమణలను కూడా పోలీసులు కోర్టు ఎదుట హాజరు పరచనున్నారు. ఇక, ఓఎంసీ అక్రమాల కేసులో గాలి జనార్దన రెడ్డిని పోలీసులు కోర్టులో హాజరు పరిచే అవకాశం ఉంది. దీంతో, నాంపల్లి సీబీఐ కోర్టులో మంగళవారం రోజంతా కేసుల హడావుడి కొనసాగనుంది.'ప్రముఖులు' అంతా ఒకేరోజు కోర్టుకు హాజరు కానుండడంతో పోలీసులు కూడా పటిష్ఠ భద్రతా ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు.

విమలక్కకు బెయిల్, ఈరోజు జైల్లోనే

తెలంగాణ యునైటె డ్ ఫ్రంట్ నేత విమలక్కకు షరతులతో కూడిన బెయిల్‌ను నాంపల్లి కోర్టు సోమవారం సాయంత్రం మంజూరు చేసింది. ఐదువేల రూపాయల డిపాజిట్, ఇద్దరు వ్యక్తుల పూచీకత్తుతో కూడిన బెయిల్‌ను కోర్టు మంజూరు చేసింది. అయితే బెయిల్‌కు సంబంధించిన పేపర్లు రావడం ఆలస్యం కావడంతో విమలక్క మంగళవారం బయటకు వచ్చే అవకాశముంది. ప్రస్తుతం ఆమె చంచల్‌గూడ మహిళా విభాగం జైల్లో ఉన్నారు. కాసు బ్రహ్మానందరెడ్డి విగ్రహం ధ్వంసం కేసులో తెలంగాణ యునైటెడ్ ఫ్రంట్ నేత విమలక్కతో పాటు మరో ఇద్దరిని పోలీసులు అరెస్టు చేశారు. వివిద సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. ఆ తర్వాత వారిని సీసీఎస్ పోలీస్ స్టేషన్కు తరలించారు. అంతకు ముందు విమలక్క అరెస్ట్ను తెలంగాణవాదులు అడ్డుకున్నారు. విమలక్కకు నాంపల్లి కోర్టు అక్టోబర్ 8 వరకు రిమాండ్ విధించింది. దీంతో విమలక్క ఆదే కోర్టులో బెయిల్ పిటిషన్‌ను దాఖలు చేశారు.

బస్సు చార్జీలు తక్కువే పెంచాం : బొత్స

ఆర్టీసి ఛార్జీల పెంపుదలను రవాణా శాఖ మంత్రి, పిసిసి అద్యక్షుడు బొత్స సత్యనారాయణ సమర్దించుకున్నారు. డీజిల్ ధర ఒక రూపాయి పెరిగితే సంస్థపై రూ. 65 కోట్ల భారం పడుతుందని, ప్రస్తుతం డీజిల్ ధర పెంపు కారణంగా సంస్థపై రూ. 330 కోట్ల భారం పడుతుందని బొత్స వివరించారు. ఆర్టీసీ ఏడాదికి 56 వేల కోట్ల లీటర్ల డీజిల్‌ను వినియోగిస్తున్నట్లు చెప్పారు. రాబోయే కాలంలో సంస్థ మనుగడను దృష్టిలో ఉంచుకుని బస్సు చార్జీలు పెంచినట్లు బొత్స వివరించారు. పెంచిన ఆర్టీసీ చార్జీలపై ప్రజలు పెద్ద మనసుతో ఆలోచించాలని బొత్స కోరారు. ఆర్టీసీ సంస్థ అభివృద్ధిని రాజకీయ పార్టీలు కూడా అర్ధం చేసుకోవాలని సూచించారు. చార్జీల పెంపుపై రాజకీయం చేయడం తగదని అన్నారు. ఎప్పుడూ లేని విధంగా రూ. 200 కోట్లు బడ్జెట్‌లో ఆర్టీసీకి కేటాయించినట్లు ఆయన పేర్కొన్నారు. ఈ ఏడాది రెండువేల కొత్త బస్సులను కొనుగోలు చేయాలని ఆర్టీసీ నిర్ణయించినట్లు బొత్స తెలిపారు.