రాహుల్ గాంధీపై నరేంద్ర మోడీ సెటైర్లు
“రాహుల్ గాంధీ అంతర్జాతీయ స్థాయి నేత. ఆయన ఇటలీలో ఎన్నికల్లో నిలబడితే భారీ విజయం సాధిస్తారు. భారత్ కంటే, ఇటలీకే ఆయన అవసరం ఎక్కువగా ఉంది. అవసరమనుకుంటే రాహుల్ ఇటలీలోకూడా పోటీ చేయగలరు. ఇటీవల ఓ కాంగ్రెస్ నేత నేను స్థానిక నాయకుణ్ణని, రాహుల్ గాంధీ జాతీయ స్థాయి నాయకుడని ప్రకటించాడు. నిజమే.. ఆయన చెప్పింది నిజమే.. రాహుల్ గాంధీ నిజంగా అంతర్జాతీయ స్థాయి నేతే. ఆయన అర్హతల్ని మనదేశం అందిపుచ్చుకోలేదు. నన్ను లోకల్ లీడర్ అని కాంగ్రెస్ నేతలు సంభోదించడం చాలా గర్వకారణంగా ఫీలవుతున్నా. గుజరాత్ లో పుట్టి పెరిగినందుకు నేను చాలా గర్వపడుతున్నా.” ఇవి.. రాహుల్ గాంధీపై బిజెపి సీనియర్ నేత నరేంద్రమోడీ.. రాహుల్ గాంధీపై సంధించిన వ్యంగ్యాస్త్రాలు. స్వామి వివేకానంద యువజన సదస్సులో రాహుల్ గాంధీ తల్లి విదేశీయతపై నరేంద్రమోడీ నిప్పులు చెరిగారు. వచ్చే ఎన్నికల్లో ప్రథాని పదవికి పోటీ రాహుల్, మోడీ మధ్యే ఉంటుందన్న ఊహాగానాలపై స్పందించిన కాంగ్రెస్ నేతలకు ఇలా.. మోడీ దీటైన జవాబు చెప్పారు. తనకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన ప్రథాని మన్మోహన్ కి ధన్యవాదాలు చెప్పిన అరక్షణంలోపే మోడీ ఆయనపై కూడా విరుచుకు పడ్డారు. యూపీఏ ప్రభుత్వం ఎన్నికల వాగ్దానాల్ని తుంగలో తొక్కిందని, 2004 ఎన్నికల మ్యానిఫెస్టోలో కోటి మంది యువతకు ఉద్యోగావకాశలు కల్పిస్తామన్న మాటను పూర్తిగా మర్చిపోయిందని ధ్వజమెత్తారు. గుజరాత్ ప్రభుత్వం ఉపాధి అవకాశాలు కల్పనలో ముందుందని మోడీ చెప్పుకొచ్చారు. ఎనిమిదేళ్ల పాలనలో అమెరికాతో పౌర అణు ఒప్పందం, విదేశీ పెట్టుబడులకు తలుపులు బార్లా తెరవడం, విదేశాలకు ప్రయోజనం కలిగించే విధానాల్ని అమలు చేయడమే ప్రథాని సాధించిన ఘనతలని మోడీ విమర్శించారు. తన 63వ జన్మదినోత్సం సందర్భంగా మోడీ గుజరాత్ వాసులకు చాలా వరాలిచ్చారు. జామ్‌నగర్ జిల్లాలోని వించియ పట్టణానికి తాలూకా హోదా ప్రకటించారు. ప్రభుత్వ ఉద్యోగాల్లో చేరడానికి వయోపరిమితిని 25 నుంచి 28కి 28 నుంచి 30 సంవత్సరాలకు పొడిగించారు. సదస్సులో బిజెపి సీనియర్ నేతలు అద్వానీ, సుష్మాస్వరాజ్, రాజ్ నాథ్ సింగ్ లతోపాటు ఒలింపియన్ గగన్ నారంగ్, క్రికెటర్లు పుజారా, రవీద్ర జడెజా, జయదేవ్ షా, బిసిసిఐ ఉపాధ్యక్షుడు నిరంజన్ షా పాల్గొన్నారు.