డీజిల్ ధరల పెంపుతో ఆర్టీసీ ఛార్జీల బాదుడు
posted on Sep 23, 2012 @ 11:30PM
డీజిల్ ధరల్ని పెంచుతూ యూపీఏ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం అమల్లోకి వచ్చీరాకముందే రాష్ట్రంలో సామాన్యులపై భారం పెరిగిపోయింది. ఆర్టీసీ చార్జీల పెంపురూపంలో రాష్ట్ర ప్రజలనెత్తిన ఇంకా కాస్త బరువుని కాంగ్రెస్ ప్రభుత్వం బలవంతంగా మోపింది. పెరిగిన ఆర్టీసీ చార్జీలు ఆదివారం అర్థరాత్రినుంచే అమల్లోకొచ్చాయి. డీజిల్ ధరలు పెరగడంవల్ల ఆర్టీసీమీద అదనపు భారం పడిందని, నష్టాల్లో ఉన్న సంస్థను కాపాడేందుకు ఛార్జీలు పెంచక తప్పడం లేదని ప్రభుత్వం వివరణ ఇచ్చింది. పల్లెవెలుగు బస్సులకు 25 కిలోమీటర్ల వరకు ఒక రూపాయి, 45 కి.మీ. వరకు రూ.2, ఆపై ప్రతి కి.మీ. ఐదు పైసలు, డీలక్స్, ఎక్స్ ప్రెస్ బస్సులకు కి.మీ.కు 10 పైసలు, సూపర్ లగ్జరీ బస్సులకు కి.మీ.కు 12 పైసలు చార్జీలు పెరిగాయి. ఇంద్ర, గరుడ, వెన్నెల ఏసీ బస్సుల చార్జీల్లో ఎలాంటి మార్పూలేదు. నెలవారీ సిటీ బస్ పాస్ లపై వందరూపాయల భారం అదనంగా పడింది. విద్యార్థుల బస్ పాస్ చార్జీల్నిమాత్రం పెంచలేదు.