కేజ్రీవాల్ కి వార్నింగిచ్చిన సల్మాన్ ఖుర్షీద్
posted on Oct 18, 2012 @ 11:19AM
అరవింద్ కేజ్రీవాల్ ని చంపుతానని అర్థం వచ్చే వాడి వేడిమాటలతూటాలను ప్రయోగించి కేంద్ర న్యాయశాఖ మంత్రి సల్మాన్ ఖుర్షీద్ తనకు తానుగా మరో వివాదంలో ఇరుక్కున్నారు. దమ్ముంటే యూపీలోని తన సొంత నియోజకవర్గం ఫరీదాబాద్ కొచ్చి నిరసన తెలపాలంటూ కేజ్రీవాల్ కి సవాల్ విసిరిన ఖుర్షీద్ అలా జరిగితే కేజ్రీవాల్ తిరిగి వెనక్కెళ్లే అవకాశమే లేదంటూ సంచలనకరమైన వ్యాఖ్యలు చేశారు. ఫరీదాబాద్ నుంచి ఎలా తిరిగి వెళ్తాడో చూస్తాననడం తనని చంపుతానంటూ బాహాటంగానే బెదిరించడమేనని కేజ్రీవాల్ అంటున్నారు. ఖుర్షీద్ మంత్రిలా కాక మాఫియా డాన్ లా మాట్లాడుతున్నారని విమర్శించారు. తాను న్యాయశాఖమంత్రిని కాబట్టి కలంతో పనిచేయాల్సొస్తోందని, లేకుంటే కత్తితో పనిచేసే తరీఖాకూడా తెలుసని ఖుర్షీద్ చేసిన వ్యాఖ్యల్ని ప్రముఖ టీవీ ఛానెళ్లు విస్తృతంగా ప్రసారం చేశాయ్. ఖుర్షీద్ వ్యాఖ్యల్ని పరిశీలిస్తే తనకు ప్రాణహాని తలపెట్టాలన్న ఉద్దేశం ఆయనకు ఉందన్న విషయం స్పష్టమౌతుందని కేజ్రీవాల్ అంటున్నారు. తన మరణం దేశాన్ని జాగృతం చేయగలిగితే వందలాదిమంది కేజ్రీవాల్ లు దేశంకోసం ప్రాణాలర్పించేందుకు సిద్ధపడతారని ఆయన అన్నారు.