నామినేటెడ్ పోస్టుల భర్తీకి రంగం సిద్ధం
posted on Oct 18, 2012 @ 2:01PM
కాంగ్రెస్ లో పదవుల పందేరానికి రంగం సిద్ధమయ్యింది. చాలాకాలంగా నామినేటెడ్ పోస్టుల కోసం ఆశగా ఎదురుచూస్తున్న నేతలు భారీ స్థాయిలో లాబీయింగ్ మొదలుపెట్టారు. కేబినెట్ విస్తరణకు నో చెప్పిన హై కమాండ్ నామినేటెడ్ పోస్ట్ ల భర్తీకి సరే అనడంతో చాలామంది గట్టిగానే ఆశలు పెట్టుకున్నారు. ఢిల్లీ పర్యటనలో సీఎం కిరణ్ కుమార్ రెడ్డి ప్రథానితో ఈ విషయంలో గట్టిగానే మాట్లాడి మాట తీసుకున్నారని కాంగ్రెస్ నేతలు అనుకుంటున్నారు. వై.ఎస్ తొలిసారి ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చున్నప్పుడు కొంతమందికి కొన్ని పదవులు ఇచ్చారు. తర్వాతికాలంలో నామినేటెడ్ పోస్ట్ ల ఊసే లేదు. రెండోసారి ఆయన సీఎంగా బాధ్యతలు చేపట్టాకకూడా ద్వితీయ శ్రేణి నేతలకు నామినేటెడ్ పోస్టుల వ్యవహారాన్ని పరిశీలించనేలేదు. రోశయ్య సీఎం అయ్యాక కొంతమందికి ఛాన్స్ దక్కింది. కిరణ్ సీఎం కుర్చీలో కూర్చున్నతర్వాత ఇంతవరకూ నామినేటెడ్ పోస్ట్ ల వ్యవహారం ఓ కొలిక్కి రాలేదు. ఇప్పుడు హై కమాండ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాక ఇన్నాళ్లుగా నానుతూ వచ్చిన వ్యవహారంమీద ఓ క్లారిటీ కనిపిస్తోందని పార్టీ నేతలు అనుకుంటున్నారు.