ఎమ్మెల్యే కన్నబాబు ఇంటిపై ఏసీబీ దాడులు
posted on Oct 17, 2012 @ 1:53PM
విశాఖజిల్లా యలమంచిలి ఎమ్మెల్యే కన్నబాబు ఇంటిపై ఏసీబీ దాడులు జరిపింది. ఆదాయానికి మించిన ఆస్తులున్నాయన్న కేసులో ప్రాథమిక ఆధారాలున్నాయి కనక విచారణ జరపాలని ఏసీబీ న్యాయస్థానం డిఎస్పీకి ఆదేశాలు జారీచేసింది. కోర్ట్ ఆదేశాలను అందుకున్న వెంటనే స్పందించాల్సిన అధికారులు కాస్త ఆలస్యంగా కదిలారు. ఈ లోపుగానే కన్నబాబు తనపేరిటఉన్న ఆస్తుల్ని బినామీ పేర్లమీదికి బదలాయించారన్న వార్తలుకూడా బైటికొచ్చాయి. అక్టోబర్ 19వ తేదీలోపున కేసు వివరాల్ని కోర్టుకి సమర్పించాల్సి ఉన్నందున ఏసీబీ అధికారులు విస్తృతస్థాయిలో దాడులు నిర్వహించారు. సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో కూడా సోదాలు జరిపి వీలైనంతమేరకు ఆధారాలు సంపాదించేందుకు ఏసీబీ అధికారులు గట్టి ప్రయత్నాలే చేస్తున్నారు. ఎస్ ఈ జెడ్ ల పేరుతో అక్రమంగా రైతుల దగ్గర్నుంచి భూముల్ని చవగ్గా కొట్టేసి డీ నోటిఫై చేసి అధిక ధరలకు అమ్ముకుని లాభపడ్డారని కన్నబాబుపై అభియోగాలు నమోదయ్యాయి. కన్నబాబు స్వగ్రామం రాంబిల్లిలోకూడా సోదాలు జరిపిన ఏసీబీ పలు కీలక డాక్యుమెంట్లని స్వాధీనం చేసుకుంది.