కాంగ్రెస్ లో పదవుల పందారం
posted on Oct 23, 2012 @ 9:37AM
కాంగ్రెస్ పార్టీలో నామినేటెడ్ పోస్ట్ ల పందారం మొదలయ్యింది. అధికార భాషాసంఘం అధ్యక్షుడి కుర్చీలో మండలి బుద్ధప్రసాద్ ని కూర్చోపెట్టేందుకు రంగం సిద్ధమయ్యింది. రెండు రోజుల్లో ఉత్తర్వులు జారీ అయితే బాధ్యతలు చేపట్టేందుకు ఆయన పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేసుకుంటున్నారు. మహిళా కమిషన్ చైర్ పర్సన్ పదవికి నేదురుమల్లి రాజ్యలక్ష్మి పేరు పరిశీలనలో ఉంది. ఐదేళ్లనుంచీ మరుగునపడిపోయిన నామినేటెడ్ పోస్ట్ ల భర్తీ వ్యవహారం ఎన్నికలు దగ్గరపడుతున్న నేపధ్యంలో తెరమీదికొచ్చింది. ఈ రెండు పోస్టులూ భర్తీ అయితే నామినేటెడ్ పోస్ట్ ల భర్తీ ప్రక్రియ పూర్తి స్థాయిలో మొదలైనట్టే లెక్కని కాంగ్రెస్ వర్గాలు భావిస్తున్నాయ్. కావాల్సిన పదవులను చేజిక్కించుకునేందుకు పార్టీలో లాబీయింగ్ మరింతగా ఊపందుకుంది. ఆఖరు క్షణంలో అనుకున్న వ్యక్తి పేరు మారిపోయి కొత్త వ్యక్తికి కుర్చీ దక్కినా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదన్నంతగా నామినేటెడ్ పోస్ట్ ల కోసం ఢిల్లీ స్థాయిలో భారీ లాబీయింగ్ జరుగుతోందని పార్టీలో సీనియర్లు అంటున్నారు. ఏకాభిప్రాయం ఉన్నచోట్ల గతంలోనే పోస్టుల్ని భర్తీ చేసినా, పోటీ గట్టిగా ఉన్నచోట్ల లేనిపోని ఇబ్బందులు కొనితెచ్చుకోవడం ఎందుకన్న ధోరణిలో పోస్ట్ లు భర్తీని పార్టీ వాయిదా వేస్తూ వచ్చింది. వేడిలోవేడికింద ఆ పోస్టుల్నికూడా భర్తీ చేసేస్తారన్న ప్రచారం ఊపందుకోవడంతో నేతలు గట్టిగా తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు.