అరెస్టు చేయడం దుర్మార్గం: కోదండరాం
posted on Oct 22, 2012 @ 5:49PM
చంద్రబాబు పాదయాత్రకు నిరసన తెలియజేసేందుకు వెళ్ళిన తెలంగాణ రాజకీయ జేఏసీ నేతలు పొ. కోదండరాం, స్వామిగౌడ్, శ్రీనివాస్‌గౌడ్ తదితరులను జిల్లాలోని శాంతినగర్ వద్ద సోమవారం పోలీసులు అడ్డుకుని అరెస్టు చేశారు. జెఏసి నేతల అరెస్టును పలువురు తెలంగాణవాదులు అడ్డుకునే ప్రయత్నాలు చేశారు. దీంతో అక్కడ కాసేపు ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. ఈ సందర్భంగా కోదండరామ్ నిప్పులు చెరిగారు. తమను అరెస్టు చేయడం దుర్మార్గమన్నారు. శాంతియుతంగా నిరసన తెలియజేయాలని తాము భావిస్తే అరెస్టు చేయడమేమిటని ప్రశ్నించారు. తెలంగాణపై టిడిపి వైఖరి చెప్పమని ప్రశ్నిస్తే తప్పేమిటన్నారు. తాము బాబు యాత్రను అడ్డుకుంటామని చెప్పలేదని, నిరసన మాత్రమే తెలియజేస్తామని చెప్పామన్నారు. పోలీసుల వైఖరిని నిరసిస్తూ జేఏసీ నేతలు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. రోడ్డుపై బైఠాయించి ఫ్లకార్డులతో నిరసనలు తెలిపారు.