ఎపీపీఎస్సీలో అంతా గందరగోళం
posted on Oct 23, 2012 @ 10:03AM
ఏపీలో చదువుకున్న కుర్రాళ్లకు గవర్నమెంట్ కొలువులు భారీగా ఇస్తామంటూ ప్రభుత్వం ఊదరగొట్టింది. లక్షల్లో ప్రభుత్వ ఉద్యోగాలు ఖాళీ అవుతున్నాయంటూ ప్రచారం జోరుగా సాగింది. ఏపీపీఎస్సీ నోటిఫికేషన్లమీద నోటిఫికేషన్లు జారీ చేస్తూ యమా స్పీడ్ తో పరీక్షలు నిర్వహించింది. తర్వాత ఉన్నట్టుండి ఏపీపీఎస్సీ స్పీడ్ జీరోకి పడిపోయింది. కారణం.. పరీక్షల నిర్వహణలో దొర్లిన పొరపాట్లే.. బోర్డ్ తాను చేసిన తప్పుల తడకల్ని సరిదిద్దుకుని మళ్లీ లేచ్చి గట్టిగా నిలబడే ప్రయత్నంలో ఉన్నట్టు గట్టి సమాచారం. పరీక్షల్లో జరిగిన అవకతవకలపై అభ్యర్ధులు ట్రిబ్యునల్ ని ఆశ్రయిస్తుండడంతో బోర్డ్ మెంబర్ల పరిస్థితి దారుణంగా తయారయ్యింది. నిర్వహించిన పరీక్షలన్నింటికీ బోర్డ్ మెంబర్లు ట్రిబ్యునల్ ముందు చేతులుకట్టుకుని నిలబడక తప్పని పరిస్థితి కనిపిస్తోంది. మరోవైపు ఏపీపీఎస్సీ బోర్డ్ నిర్వహిస్తున్న ఇంటర్వూల్లో పూర్తి స్థాయిలో అవినీతి రాజ్యమేలుతోందని విస్తృతస్థాయిలో ప్రచారం జరుగడంతో ప్రభుత్వం ఇంటర్వూలను పూర్తిగా రద్దుచేసింది. ఈ పరిణామం బోర్డ్ మెంబర్లకు పూర్తిగా తలవంపులు తెచ్చినట్టే.. చైర్ పర్సన్ రేచల్ చటర్జీ పదవీకాలం డిసెంబర్ తో పూర్తవుతుంది. కార్యదర్శి పూనం మాలకొండయ్ సెలవులో వెళ్లడంతో ప్రస్తుతం ఏపీపీఎస్సీ పరిస్థితి గాల్లో దీపంలో కనిపిస్తోందని అభ్యర్ధులు అంటున్నారు.