అబ్దుల్ కలామ్ కాదు... అద్బుత కమాల్!

ఆయన పేరు కమాల్ కాదు! కలామ్! కాని, చేసిన కమాల్ అంతా ఇంతా కాదు! దేశపు చిట్ట చివరి చిరు గ్రామంలో పుట్టినా సరే... ఢిల్లీ దాకా వెళ్లాడు. రాష్ట్రపతిభవన్ లో కాలుమోపాడు. అంతకంటే ముందే పాకిస్తాన్ సరిహద్దులోని ప్రోఖ్రాన్ ఎడారి దాకా వెళ్లి వచ్చాడు! అక్కడ మన దేశం పేల్చిన అణుబాంబులో తన గర్జన శత్రు దేశానికి వినిపించాడు! నిజమైన భారతీయుడే కాదు... నిజమైన భారతీయ ముస్లిమ్ ఎలా వుంటాడో కూడా పాకిస్తాన్ కు చాటి చెప్పాడు! ఆయనే... అవుల్ పకీర్ జైనులాబ్దీన్ అబ్దుల్ కలామ్... మనందరి ఏపీజే కలామ్! 1931 అక్టోబర్ 15న కలామ్ రామేశ్వరంలో పుట్టారు. యుగయుగాలుగా మహా శైవ క్షేత్రంగా అదెంత ప్రఖ్యాతో చెప్పక్కర్లేదు కదా! కాని, కలామ్ పుట్టాక రామేశ్వరం జ్యోతిర్లింగం వల్ల మాత్రమే కాదు... జ్ఞాన జ్యోతి లాంటి కలామ్ జన్మస్థలంగా కూడా ఫేమస్ అయిపోయింది! ఇప్పుడు మతాలకతీతంగా రామేశ్వరం అందరికీ యాత్రా స్థలం అయిపోయింది! తన జీవితాంతం నిరాడంబర గురువుగానే గడిపిన కలామ్ చనిపోయే క్షణంలో కూడా విద్యార్థులకి బోధిస్తూనే జీవిత యాత్ర ముగించారు. 83 ఏళ్ల వయస్సులో జులై 27న మేఘాలయ రాష్ట్రంలో ఆయన చనిపోయారు. అంటే... దక్షిణ తీరంలో వున్న రామేశ్వరంలో మొదలై ఈశాన్యంలో వున్న మేఘాలయ వరకూ ఆయన యావత్ భారతదేశాన్ని చుట్టేశారు, ఒక జీవిత కాలంలో! ఇది నిజంగా ఒక రాష్ట్రపతి స్థాయి వ్యక్తికి తగిన విషయం! అంతగా భారతదేశంతో మమేకం అయిన మరో ప్రెసిడెంట్ మనకు ఎవరున్నారు? అందుకే, ఆయన్ని మాత్రమే... పీపుల్స్ ప్రెసిడెంట్ అంటుంటారు ఇప్పటికీ! అబ్దుల్ కలామ్ జన్మదినాన్ని యూఎన్ ఓ అంతర్జాతీయ విద్యార్థి దినోత్సవంగా ప్రకటించింది. ఇది దివంగత కలామ్ కి కాదుగాని... మనందరికీ ఎంతో గర్వకారణం! ఆయన చాలా ఉన్నత విద్యాసంస్థల్లో బోధించి వుండవచ్చు. కాని, ఆయన పేరున ఏ మిసైల్స్ డేనో, టెక్నాలజీ డేనో పెట్టకుండా స్టూడెంట్స్ డేనే ఎందుకు పెట్టారు? ఆయన టీచర్ కాబట్టి అలా నిర్ణయించేశారా? కానే కాదు! విద్యార్థుల పట్ల కలామ్ కు వున్న అపార నమ్మకం, ప్రేమే ఆయన జయంతి విద్యార్థి దినోత్సవంగా మారేలా చేసింది...  ఒక్కసారి అయిదేళ్ల పాటూ దేశపు అత్యున్నత స్థానాన్ని అలంకరించాక ఎవరైనా ఏం చేస్తారు? అడపాదడపా మీటింగులకి అటెండ్ అవుతూ , ఆత్మ కథ రాసుకుంటూ ఖాళీగా కాలం వెళ్లదీస్తారు. గత రాష్ట్రపతుల్ని ఎవర్నీ చూసినా ఈ విషయం ఇట్టే చెప్పేయోచ్చు. చాలా మంది ప్రెసిడెంట్ గా రిటైర్ అయ్యాక పుణ్యక్షేత్రాలు దర్శిస్తూ శేష జీవితం గడుపుతారు. కాని, కలామ్ తన కలాన్ని వదల్లేదు. కలనీ వదల్లేదు. ఇండియా భవిష్యత్ అంతా స్టూడెంట్స్ చేతుల్లోనే వుందని ఆయన భావించారు. విశ్వసించారు. అందుకే, వాళ్లకు తన అపార జ్ఞానాన్ని పంచటం కోసమే గురువుగా అఖరు నిమిషం వరకూ కొనసాగారు! అటువంటి ఆయనకు తన జన్మదినాన్ని స్టూడెంట్స్ గా పరిగణించటం నిజమైన నివాళి.... నిజమైన శాంతి... ఊరికే అహింస అంటూ శత్రు దేశాల ముందు పిరికిపందల్లా చులకనైతే రాదు! మన వ్రతం అహింసే అయినా యుద్ధం చేయకపోవటం, చేయలేకపోవటం మన బలహీనత కాకూడదు. ఈ ఆలోచనకి కార్యరూపమే కలామ్ తన సుదీర్ఘ కెరీర్ లో రూపొందించిన అనేక మిసైల్ ప్రొగ్రామ్స్. ఇవాళ్ల సర్జికల్ స్ట్రైక్స్ చే్స్తూ భారత్ పాకిస్తాన్ గుండెల్లో నిద్రపోతోంది అంటే అందుకు ఈ మిసైల్ మ్యాన్ ఆఫ్ ఇండియా ఎంతో కారణం. వాజ్ పేయి టైంలో జరిగిన అణు పరీక్షల్లో కూడా కలామ్ కమాల్ ఎంతో వుంది! మొత్తంగా, లెక్కకు ఒక సైంటిస్ట్ , టీచర్ అయినప్పటికీ ఇండియాకు ఆయన ఆర్మీ యూనిఫామ్ వేసుకోని... ఒకానొక సైన్యాదిపతి! అంతలా ఆయన అందించిన మిసైల్స్, ఇరత టెక్నాలజీ మన రక్షణ వ్యవస్థను పటిష్టం చేసింది! కలామ్ గొప్పతనం కేవలం చదవులు చెప్పటం, ఆయుధాలు, అణు బాంబులు తయారు చేయటం వరకే పరిమితం కాలేదు. పుట్టుకతో ముస్లిమ్ అయినప్పటికీ హిందూ సంప్రదాయాల్ని, సనాతన దర్మాన్ని, భారతీయతని ఆయన క్షణ క్షణం గౌరవించారు. ఆపాదించుకున్నారు. అదే ఆయనకు బీజేపీ నుంచీ కాంగ్రెస్ వరకూ ఆరెస్సెస్ తో సహా అందరి మద్దతూ సాధించి పెట్టింది! శత్రువుల గుండెలు చీల్చే మిసైల్స్ తయారు చేసినా... ఒక్క శత్రువూ లేకుండా చేయగలిగింది!   

నెహ్రు భారత్ ని... నవ భారత్ గా మార్చిన... భారత రత్నం!

  మనకో పద్యం వుంది... చాలా పాతది! దాంట్లో కంచు మోగినట్టు కనకంబు మోగునా అంటాడు కవి! నిజమే కంచులా కనకం మోగదు. కాని, నిశ్శబ్ధంగా వుండే కనకానికే విలువ ఎక్కువ. కంచుతో కంటికి పెద్దగా కనిపించే పాత్రలు బోలెడు చేసుకోవచ్చు. కాని, కనకంతో ఓ చిన్న నెక్లెస్సో, ఉంగరమో చేసుకుంటాం. కనకం విలువ అలాంటిది! మన మాజీ ప్రధాని పీవీకి ఈ కనకం పోలిక అద్భుతంగా సరిపోతుంది...   దేశాన్ని ఏలిన కాంగ్రెస్ ప్రధానుల్లో గాంధీ కుటుంబానికి చెందని అత్యంత వివాదాస్పదుడు పీవీ. ఆయన హయాంలోనే బాబ్రీ కూలటంతో కాంగ్రెస్ సైలెంట్ గా తనని పక్కన పెట్టింది. అంతే కాదు, గాంధీలకు పీవీ అంటే పడకపోవటం కూడా పబ్లిక్ సీక్రెట్టే! ఆయన చనిపోతే ఢిల్లీలో సమాధి కూడా లేకుండా చేసిన ఘనత సోనియా నేతృత్వంలోని యూపీఏది. కాని, కాంగ్రెస్ పార్టీలో పీవీ ఎంతగా అవమానాలు ఎదుర్కొన్నారో... అంతే గొప్ప పేరు పార్టీకి బయట తెచ్చుకున్నారు. ఆయన చనిపోయి ఒక్కో సంవత్సరం గడుస్తున్న కొద్దీ ఆ దార్శనికుడి గొప్పతనం అంతకంతకూ ఇనుమడిస్తోంది!   ఈ మధ్యే... 1991 - హౌ పీవీ నరసింహారావు మేడ్ హిస్టరీ అనే పుస్తకం విడుదలైంది. దాన్ని రాసింది మన తెలుగు వాడు సంజయ్ బారు. పీవీకి సలహాదారుగా పని చేసిన ఆయనకు మాజీ ప్రధాని గురించి చాలా విషయాలు తెలుసు. అందుకే, ఆయన రాసిన పుస్తకం గురించి దేశ వ్యాప్తంగా చర్చ జరుగుతోంది. మాజీ ఆర్బీఐ గవర్నర్ రంగరాజన్ కూడా బారు పుస్తకంపై స్పందించారు. ఇవాళ్ల మనం ప్రత్యక్షంగా చూస్తోన్న ఈ అభివృద్ధి, ఆర్దిక ప్రగతి అంతా పీవీదేనని తేల్చి చెప్పారు!   రంగరాజన్ లాంటి ఆర్దికవేత్తలే కాదు పీవీ గురించి ఇప్పుడు చాలా మంది పాజిటివ్ గా మాట్లాడుతున్నారు. అందుక్కారణం నిజంగా ఆయన 1991లో దేశాన్ని ఆర్దిక పాతాళం లోంచి పైకెత్తటమే. అప్పట్లో భారత్ తన వద్ద వున్న బంగారు నిల్వలు కూడా తాకట్టు పెట్టుకుని దిగుమతులు చేసుకునే దివాలా స్థితికి దిగజారిపోయింది. నెహ్రు కాలం నుంచీ చేస్తూ వచ్చిన సొషలిస్టు ప్రయోగాలన్నీ బెడిసి కొట్టి ప్రమాదం అంచున నిలుచున్నాం. సరిగ్గా అప్పుడు కాంగ్రస్ స్థంభం పగులకొట్టుకుని బయటకొచ్చిన నరసింహారావు మనల్ని పీడిస్తున్న హిరణ్యకశ్యపుడి లాంటి ఆర్దిక విధానాల్ని చీల్చి చెండాడారు. అదీ అరకొర మద్దతున్న తన మైనార్జీ ప్రభుత్వంతోనే! విదేశీ పెట్టుబడులకు దార్లు తెరుస్తూనే గ్రామీణాభివృద్ధి మీద కూడా ఆయన ఎంతో దృష్టి పెట్టారు. 1991లో పీవీ తీసుకున్న పలు కీలక నిర్ణయాలే ఇవాళ్టికీ మన పాలకుకలకి ఆదర్శంగా నిలుస్తున్నాయి.   ఆర్దికంగా దేశాన్ని పైకెత్తిన పీవీ నరసింహారావు ఫారిన్ పాలసీ కూడా సమూలంగా మార్చేశారు. ఇండియా నెహ్రు కాలం నుంచీ దూరంగా వుంటూ వస్తోన్న చాలా దేశాలకి ఆయన కాలంలో దగ్గరైంది. అంతర్జాతీయంగా మనకు కొత్త శకం మొదలైంది. ఇన్ని చేసినా గత రెండు దశాబద్దాల్లో పీవీకి ఏ మాత్రం తగినంత ప్రాముఖ్యత దక్కలేదు. పేరు రాలేదు. కాంగ్రెస్ పార్టీనే ఆయనపై కక్ష్య కట్టి స్కాముల్లో పేరు వినిపించేలా చేసింది. గాంధీలు ఆగ్రహంతో ఆయనకు భారత రత్న ఇవ్వకుండా ఊరుకున్నారు. బాబ్రీ కూలటానికి కేవలం పీవీ ఒక్కడిదే బాధ్యత అన్నట్టు ముస్లిమ్ ల ముందుర ఆయన్ని విలన్ని చేశారు. ఇన్ని చేసినా నిజం నిలకడగా బయటకొస్తూనే వుంది. సంజయ్ బారూ పుస్తకం ఆ కోవలోనే వచ్చిన తాజా వాంగ్మూలం...   ప్రతీ ప్రధాని కాలంలో ఏదో ఒక అపఖ్యాతి కలిగించే సంఘటన జరుగుతుంది. కాని, అది మరిచిపోయి అతడి కాలంలో జరిగిన మంచిని గుర్తు చేసుకోవటమే సంస్కారం. నెహ్రు కాలంలో మన నేల చైనాకు పోయింది! ఇందిర కాలంలో ఎమర్జెన్సీ వచ్చింది! వాజ్ పేయి కాలంలో కాందహార్ హైజాక్ ఉదంతం దెబ్బతీసింది! అలాగే పీవీ టైంలో బాబ్రీ కూల్చివేత జరిగింది. కాని, అంతకు మించి చాలా మంచి జరిగింది. ఇవాళ్ల దేశ వ్యాప్తంగా కోట్లాది ఉద్యోగాలు చేసుకుంటున్న యువత ఎవరి వల్ల సమరోత్సాహంతో వుంది? సమాధానం ... పీవీ నరసింహారావు!  

వార్ ని నివారించలేమా?

విజయదశమి విజయవంతంగా ముగిసింది. ఇక ఇప్పుడు అందరి దృష్టీ దీపావళి మీద. కాని, దీపావళి బాంబుల కంటే ప్రస్తుతం అందర్ని ఎక్కువగా ఆకర్షిస్తున్నవి...  నిజమైన బాంబులు! కారణం ప్రధాని మోదీనే స్వయంగా చేసిన కామెంట్!  మోదీ దసరా సందర్భరంగా రావణ దహనం కార్యక్రమంలో పాల్గొన్నారు. లక్నోలో ఆయన జై శ్రీరామ్ అంటూ ఉపన్యాసం మొదలు పెట్టడం సహజంగానే సెక్యులర్ నేతలకు కావాల్సినంత పని అప్పజెప్పింది. కాని, మోదీ స్పీచ్ లో అత్యంత ముఖ్యమైంది జై శ్రీరామ్ నినాదం కాదు. అవసరమైతే యుద్ధం చేసి తీరుతాం అన్న హెచ్చరిక! ఇది ఖచ్చితంగా పాకిస్తాన్ కు కలవరం కలిగించేదే...  నియంత్రణ రేఖ దాటి సర్జికల్ స్ట్రైక్స్ చేశాక పాక్ పై మనది పై చేయి అయింది. అందుకే, ఆ దేశం లోలోన కుతుకుత ఉడికిపోతోంది. ఎలాగైనా దెబ్బ తీయాలని తహతహలాడుతోంది. రోజూ ఉగ్రవాదుల చొరబాటుకు తనవంతు సాయం చేస్తూనే వుంది. కాల్పుల విరమణ ఉల్లంఘించి పదే పదే రెచ్చగొడుతోంది. అందుకు మన ఆర్మీ కూడా తీవ్రంగా స్పందిస్తూ కాల్పులు జరుపుతూనే వుంది. ఉగ్రవాదుల్ని ఎక్కడికక్కడ వెదికి పట్టి వేటాడుతోంది...  బార్డర్ లో వుండే వాళ్ల దృష్టిలో అయితే పాక్ తో యుద్ధం ఇప్పటికే మొదలైపోయింది. కాని, మనలా దూరంగా వున్న వాళ్లకు ఆ పరిస్థితి అర్థం కావటం లేదు. అయితే, మన జవాన్లు ఆల్రెడీ దసరా కూడా జరుపుకోకుండా యుద్ధ రంగంలోకి దిగిపోయారు. ఏ ఉగ్రవాదినీ వదలకుండా ఎన్ కౌంటర్లు చేస్తున్నారు. మోదీ కామెంట్ ఈ పరిస్థితికే అద్దం పడుతుంది. ఇంత వరకూ ఊరుకున్నట్టు ఇక పై మౌనం ప్రదర్శించేది లేదని మోదీ స్పష్టంగా సందేశం ఇచ్చేశారు. పాకిస్తాన్ ఎంతగా రెచ్చగొడితే అంతే తీవ్రంగా మన సైన్యం జవాబిస్తుంది. ఆ క్రమంలో పూర్తి స్థాయి యుద్దం అయినా వెనక్కి వెళ్లేది లేదన్నది ఇప్పుడు క్లియర్...  మోదీ ఒక వైపు యుద్ధం అనివార్యం అంటూనే అది మన కోరిక కాదని కూడా చెప్పారు. అయితే, పాక్ చర్యలు చూస్తుంటే తెగే దాకా లాగాలన్నట్టుగానే వుంది దాని ప్రవర్తన. తాజాగా పాక్ ఆర్మీ ఔట్ పోస్ట్ లపై రెడ్ ఫ్లాగ్స్ దర్శనమిచ్చాయి. అంటే ఎప్పుడైనా ముందస్తు సమాచారం లేకుండా కాల్పులు జరిపే అవకాశం వుందని అర్థం. ఇటు భారత్ కూడా రెడ్ ఫ్లాగ్స్ పైకెత్తింది. కాల్పులు మొదలైతే ఇటు నుంచి కూడా భీకర కాల్పులతోనే జవాబు వుంటుందని దానర్థం. అంతే కాదు, ఆయుధ తయారీదారులకి ఇప్పటికే మన ప్రభుత్వం యుద్ధం వస్తే ఉత్పత్తికి సిద్ధంగా వుండాలని సూచించింది...  జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే... మోదీ తాజా ప్రకటన కూడా యుద్ధం తప్పకపోవచ్చని తేల్చేయటం... కొంత ఆందోళన కలిగించే విషయమే. ఎందుకంటే, యుద్ధం రెండు దేశాలకీ నష్టమే. కాని, పాకిస్తాన్ ఏర్పడ్డ నాటి నుంచీ దాని ప్రవర్తన హింసను అనివార్యం చేస్తోంది. సీమాంతర ఉగ్రవాదంతో ఆ దేశం మనల్ని నిరంతరం వేధిస్తోంది. కాబట్టి ఎప్పుడో ఒకప్పుడు అంతిమ యుద్ధంతో పాక్ కు బదులు ఇవ్వాల్సిందే. అందుకు, బీజేపికి 282సీట్లున్న మోదీ ప్రభుత్వం తప్ప మరింత గొప్ప సువర్ణావకాశం మనకు అస్సలు రాదు! పాకిస్తాన్ ను వీలైనన్ని ముక్కలు చేయటానికి ఇదే సరైన సమయం!  సాటి దేశాన్ని ఛిన్నాభిన్నం చేయటం నైతికంగా సరైంది కాకున్నా ఆత్మరక్షణ కోసం ఏ దేశం ఏం చేసినా తప్పేం కాదు. ఎందుకంటే, ఇన్ లవ్ అండ్ వార్ నథింగ్ ఈజ్ రాంగ్!   

RSS... దసరా నాడు ప్రారంభమైన దేశభక్తుల ఫ్యాక్టరీ!

అరెస్సెస్ ... అంటే రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్!ఈ పేరు వినగానే ముందు ఖాకీ నిక్కర్, తెల్ల చొక్కా, చేతిలో కర్రా గుర్తుకు వస్తాయి. కాని, ఆ వెంటనే కాంగ్రెస్, ఎంఐఎం, కమ్యూనిస్టులు, ఇతర సెక్యులర్ పార్టీలు చేసే ఆరోపణలు గుర్తుకు వస్తాయి. దేశంలో ఏ చిన్న మతకలహం జరిగినా ఆరెస్సెస్ కారణం అనే రెడీమేడ్ స్టేట్మెంట్ వాళ్ల దగ్గర వుంటుంది! అసలు తమని తాము సెక్యులర్ నాయకులమని చెప్పుకునే కొందరైతే ప్రతీ దానికి అరెస్సెస్సే మూలమంటారు. ఆ మధ్య ముంబైపై పాకీ ఉగ్రవాదులు ఘోరమైన దాడి చేస్తే కాంగ్రెస్ నాయకుడు దిగ్విజయ్ సింగ్ ఆరెస్సెస్ చేసిందని అన్నాడు! అంతలా ఆరెస్సెస్ పై అవాకులు, చెవాకులు పేలుతుంటారు మన వాళ్లు! కాని, అసలింతకీ ఆరెస్సెస్ అంటే ఏంటి?  ఆరెస్సెస్ గురించి తెలుసుకోటానికి దసర సమయమే చాలా సరైంది! ఎందుకంటే, ఇప్పటికి 92ఏళ్ల కింద సరిగ్గా విజయదశమి నాడే కేశవ్ బలీరామ్ హెడ్గేవార్ ఆరెస్సెస్ ను స్థాపించారు. విజయదశమి నాటి ఆ బీజం నిజంగా విజయవంతమై ఇవాళ్ల ప్రపంచపు అతి పెద్ద స్వచ్ఛంద సంస్థగా రూపుదాల్చింది! చాలా మందికి ఆరెస్సెస్ అంటే మత సంస్థ అన్న ఫీలింగ్ వుంటుంది. కాని, అది నిజం కాదు. హిందూత్వ వినిపించే జనాల సమూహమే అయినప్పటికీ ఆరెస్సెస్ ప్రదానంగా స్వచ్ఛంద సంస్థ. దేశ వ్యాప్తంగా లక్షల మంది స్వయం సేవక్ లు వున్న ఎన్జీవో. ఎక్కడ వరదలొచ్చినా, ఎక్కడ భూకంపం సంభవించినా ఆరెస్సెస్ వాళ్లే ముందుంటారు. అయితే, మరో వైపు ఆరెస్సెస్ మత కలహాలకు కారణమని కూడా పదే పదే వినిపిస్తూ వుంటుంది. కాని, ఇంతవరకూ ఏనాడూ ఆ విషయం నిరూపించబడలేదు... ఆరెస్సెస్ అధికారికంగా తనని తాను రాజకీయ సంస్థ కాదనే చెప్పుకుంటుంది. అయినా కూడా నాగపూర్ లోని ఆ సంస్థ హెడ్ ఆపీస్ కి ఢిల్లీ పీఠం పై తిరుగులేని ఆధిపత్యం వుందన్నది బహిరంగ రహస్యం. ఆరెస్సెస్ ప్రస్తుత సర్ సంఘ్ చాలక్ మోహన్ భాగవత్ ఫోన్ చేసి పిలిస్తే ప్రధాని మోదీ కూడా వెంటనే ఆయన ముందు వాలిపోతారు. ఇది నిజమే. అయితే అంతకంటే నిజం ఏంటంటే ఏవో కొన్ని సలహాలు, సూచనలు వరకూ మాత్రమే ఆరెస్సెస్ పరిమితం అవుతూ వుంటుంది. అంతే కాని, ఒకప్పటి వాజ్ పేయ్, అద్వానీలు, ఇప్పటి మోదీ తమ సంఘం మనుషులు కాబట్టి నానా యాగీ చేయాలనుకోదు. మరీ ముఖ్యంగా, గత రెండున్నర ఏళ్ల నుంచీ నరేంద్ర మోదీ పీఎం అయ్యాక ఆయన పనుల్లో, నిర్ణయాల్లో ఆరెస్సెస్ పెద్దగా జోక్యం చేసుకోకపోవటం అందరికీ తెలిసిందే. ప్రతి పక్ష నేతలు రొటీన్ గా ఆరెస్సెస్ ను టార్గెట్ చేయటం పెద్దగా పట్టించుకోవాల్సిన విషయం కాదు...  ఒక దేశానికి ప్రధానిని సైతం అందించగలగటం ఒక సంస్థకు మామూలు విషయం కాదు. కాని,ఆరెస్సెస్ 90ఏళ్ల సుదీర్థ ప్రయాణంలో ఆ విజయం సాధించింది. స్వాతంత్ర్యానికి ముందే హిందువుల కోసం, హిందూత్వ భావజాలం కోసం అది ఏర్పడ్డప్పటికీ ఏనాడూ రాజకీయం, అధికారం అన్నవాటికి దగ్గర వెళ్లలేదు. కనీసం ఆరాటపడటం కూడా జరగలేదు. 1981 తరువాత బీజేపీ పూర్తిస్థాయి రాజకీయ పార్టీగా అస్థిత్వంలోకి వచ్చాకే ఆరెస్సెస్ కు రాజకీయ అధికారం కొద్దికొద్దిగా చేరువవుతూ వచ్చింది. అయినప్పటికీ దేశంలోని ఎన్ని రాష్ట్రాల్లో కాషాయ దళం అధికారంలో వున్నా ఏనాడూ ఆరెస్సెస్ మైనార్టీల్ని వేధించటానికి దాన్ని ఉపయోగించుకోలేదు. ఆరోపణలు బోలెడు వున్నా కోర్టుల్లో మాత్రం ఎప్పుడూ, ఎవ్వరూ నిరూపించలేకపోయారు. గాంధీ హత్య మొదలు గోద్రా అల్లర్ల వరకూ ప్రతీ దానికి ఆరెస్సెస్ ను ముందుకు తీసుకురావటం మన దేశంలో పరిపాటినే. కాని, తాజాగా సుప్రీమ్ కోర్టు రాహుల్ గాంధీ చేత ఆరెస్సెస్ కు క్షమాపణ చెప్పించటం వరకూ ఏనాడూ చట్టబద్ధంగా ఈ హిందూ సంస్థని ఎవ్వరూ డికొట్టలేకపోయారు. అయితే, ఆరెస్సెస్ అనుబంధ సంస్థలు వీహెచ్ పీ, బజరంగ్ దళ్, ఇంకా బోలెడు పదే పదే కేసుల్లో ఇరుక్కుంటూ వస్తున్నాయి. వాటికి సంబంధించిన కొందరు కార్యకర్తలు శిక్షలు కూడా అనుభవిస్తున్నారు...  లక్షల మందితో నడిచే ఒక సంస్థ ఆరోపణలు ఎదుర్కోవటం, కేసుల్లో ఇరుక్కోవటం ఆశ్చర్యకరమేం కాదు. పైగా యావత్ రాజకీయ వ్యవస్థ, మేధావులు, మీడియా వంటి అన్నీ అంశాలు వ్యతిరేకంగా వున్నప్పుడు ఇబ్బందులు రావటం మరింత సహజం. అయినా కూడా వందేళ్ల దిశగా పరుగులు పెడుతూ కూడా ఏమాత్రం విచ్ఛిన్నం కాకపోవటం ఆరెస్సెస్ ఘనత. దానిపై మనకు ఎలాంటి అభిప్రాయం వున్నా ఆ సక్సెస్ సీక్రెట్ మాత్రం గుర్తించాల్సిందే. వాళ్ల క్రమశిక్షణని, అంకితభావాన్ని అభినందించాల్సిందే!  దసరా దసరాకు మళ్లీ మళ్లీ భరతమాత సేవకు అంకితమయ్యే ఆరెస్సెస్ స్వయం సేవక్ లు మిగతా ఎలాంటి ప్రేరణా ఇవ్వకున్నా... దేశభక్తి అనే తపన మాత్రం కలిగిస్తారు. అది అందరూ నేర్చుకోవాలి!    

మన అమ్మవార్లు రాతి విగ్రహాలేనా?

  శరన్నవరాత్రి ఉత్సవాలు అయిపోవస్తున్నాయి. జనం దసరా కోసం ఉత్సహంగా సిద్ధమైపోతున్నారు. ఈ హడావిడిలో... నిజంగా హిందూ మతంలోని శక్తి ఆరాధన వెనుక వున్న రహస్యం ఏంటి? ఎవరన్నా ఆలోచిస్తున్నారా? సాధారణ జనం పూజలు, పునస్కారాల కోలాహలంలో అసలు మర్మం మరిచిపోతుంటారు. అమ్మవారి అలంకారాలు, కుంకుమ పూజలు, దాండియాలు ఇవన్నీ తప్పు కాకపోయినా, అంతా శాస్త్రబద్ధమే అయినా... మన ఋషులు ఏ మూలమైన ఆలోచనతో శక్తి పూజించటం మొదలుపెట్టారో అది మనం పూర్తిగా పట్టించుకోవటమే లేదు. పైపైన ఆచారాలు, సంప్రదాయాలతో సరిపెట్టేస్తున్నాం...  అమ్మవార్ని అంగరంగ వైభవంగా ఆరాదించటం మనకు ఎవ్వరూ చెప్పక్కర్లేదు. అది ఎలాగూ చేస్తాం. కాని, అందులోని తాత్విక కోణం ఇప్పుడోసారి చూద్దాం. మన వాళ్లు శక్తిని సృష్టికి మూలంగా భావించారు. శక్తి అంటే ఎనర్జీ. ఎనర్జీ లేకుంటే మ్యాటర్ దేనికీ పనికిరాదు. అందుకే, శక్తి లేకుంటే శివుడు సృష్టి చేయలేడంటుంది వేదం. ఆ శక్తికి ప్రతిరూపమే పార్వతి దేవీ. సతీ దేవీ అన్నా, దాక్షాయణి అన్నా, గౌరీ అన్నా అన్నీ ఆమే. శివుడికి అర్థాంగి అయిన ఆ అమ్మ మొత్తం సృష్టిలోని శక్తి. ఆమె వల్లే కణాలు, అణువులు మొదలు అండ, పిండ, బ్రహ్మండాలు నిలిచేది, కదిలేది, వ్యాపించేది, కుంచించుకుపోయేది! అసలు శక్తి ఎప్పుడైతే తనని తాను ఒక దేహం నుంచి ఉపసంహరించుకుంటుందో అప్పుడే ఆ శరీరం శవమైపోతుంది. దానిలోని అప్పటి వరకూ వున్న చూతన్యమే శక్తి! ఆ శక్తి శాశ్వతం అంటుంది సనాతన ధర్మం. అంతే కదా... పదార్థం పుడుతుంది, మరణిస్తుంది. సృజింపబడుతుంది. మాయమైపోతుంది. కాని, సృష్టి, స్థితి, లయాలకి కారణమైన శక్తి శాశ్వతంగా మిగిలే వుంటుంది.  మొత్తం విశ్వాన్ని ఆవరించిన, ఆవహించిన శక్తినే కాదు ఇంకా అనేక ప్రకృతి అంశల్ని కూడా భానతీయ సంస్కృతి స్త్రీగానే భావిస్తుంది. ఎందుకంటే, స్త్రీ మాత్రమే సృష్టికి, పుష్టికి కారణం. అది చంటి బిడ్డైనా, పండు ముసలి అయినా అమ్మ రూపంలోనో, అమ్మవారి రూపంలోనో స్త్రీ నుంచే ప్రతీ జీవి ప్రాణ రక్షణ పొందుతుంది. అందుకే, మన పెద్దలు స్త్రీ ఆరాధనకి ఎనలేని ప్రాముఖ్యత ఇచ్చారు. మనం జీవిస్తున్న భూమిని కూడా మన వాళ్లు భూమాత అన్నారు. ఎందుకని? భూమి తల్లి లాగే మనకు కావాల్సిన సమస్తం ఇస్తుంది. ఆమె ఇవ్వనిది ఏదీ మనకు లేదు. ఆమె ఇవ్వకుంటే అది లేనట్లే! తినే తిండి, తాగే నీరు, వాడుకునే చెట్లు, చేమలు, కొండలు, లోయలు, గుహలు, ఖనిజాలు అన్నీ భూదేవీ ఇచ్చేవే. అందుకే, భూమిని విశ్వ రూపుడైన విష్ణువుకి భార్య అన్నారు. సహచరి అన్నమాట. పొద్దున్న లేస్తే భూదేవీకి క్షమాపణ చెప్పమని కూడా అంటారు పెద్దలు. అంటే... మనకు సర్వం, సమస్తం ఇచ్చే భూదేవికి మనం కృతజ్ఞతతో వుండాలన్నది భావం అన్నమాట...  శివుడి భార్యలని చెప్పే అన్నపూర్ణా, గంగలు కూడా ప్రకృతి అంశలే! అన్నం పరబ్రహ్మ స్వరూపమని చెప్పే వేదం... ఆ అన్నానికి అధిదేవత అన్నపూర్ణేశ్వరి అంటుంది. అన్నపూర్ణ వద్ద ఆది భిక్షువు పరమశివుడు ఆహారం భిక్షగా స్వీకరిస్తాడు. అంటే అమ్మ అవసరం, అన్నం అవసరం సాక్షాత్తు శివుడికి కూడా వుందని చెప్పటమే దీనిలోని లౌకికమైన భావం. ఇంకా ఆధ్యాత్మిక కోణాలు అనేకం వున్నా... మనిషికి అత్యంత ప్రధానమైన అన్నం స్త్రీ వల్లే సమకూరుతుంది. ఆమె లేకపోతే అఖిల జగాలు ఆకలితో అలమటిస్తాయి.... గంగ అంటే నీళ్లు. భారతీయులు నదుల్ని, సముద్రాల్ని పూజించటం ఈ మధ్య కొందరు మూఢ నమ్మకాలని అనుకుంటున్నారు. కాని, ప్రకృతిలోని నీరు, చెట్టు, చేమా అన్నీ దైవాంశలని భావించటం మహోన్నతమైన ఆధ్యాత్మికత. అది వేల ఏళ్లు పటిష్టంగా వుండటం వల్లే భారతదేశంలోని నదులు, అడవులు, అద్బుత ప్రకృతి సురక్షితంగా వుంటూ వచ్చింది. ఆధునిక కాలంలో ప్రాణాధారమైన నీటిని కూడా ఓ సహజ వనరుగా మాత్రమే భావించి ఇష్టానుసారం దుర్వినియోగం చేసేశారు. దాని ఫలితమే గంగా నది లాంటి నదులు కాలుష్యమయం అయిపోవటం. కాని, గంగను అమ్మగా భావిస్తే , నిజంగా ఆరాధిస్తే వేల ఏళ్లు పవిత్రంగా వున్నట్టే ఇప్పుడూ వుండేవి...  సృష్టిలోని శక్తి, భూమి, అన్నం, నీరు... ఇలాంటి అంశలే కాదు... మనిషికి వ్యక్తిగతంగా అవసరం అయ్యే సహజ శక్తులు కూడా స్త్రీ రూపంలో దర్శించారు మన ఋషులు. అన్ని సుఖాలు, సౌక్యాలు, సంతోషాలకు మూలమైన సంపద, ఐశ్వర్యం లక్ష్మీ దేవీ అన్నారు. ఎంత ఆస్తి, పాస్తులున్నా , ఇంకా ఏం వున్నా జ్ఞానం అవసరం. అది వుంటేనే మనఃశాంతిగా, దైర్యంగా వుండగలిగేది.  ఆ జ్ఞానాన్ని కూడా సరస్వతి రూపంలో కొలిచారు భారతీయులు. ఇక డబ్బు, జ్ఞానం లాగే మనిషికి అత్యంత అవసరమైంది ప్రేమ. ఆ ప్రేమకు ప్రతిరూపం శ్రీకృష్ణుని ప్రియురాలైన రాథ.  భారతీయ సంస్కృతి శృంగారాన్ని కూడా ఎప్పుడూ తప్పుగా చూడలేదు. బ్రహ్మచర్యాన్ని బోధించిన మన శాస్త్రాలే రతి దేవీని కూడా ఆరాధించాయి. ఆమె మనుషుల్లోని కోరిక అనే శక్తికి అధిదేవత అన్నాయి. ఇక రంభ లాంటి అప్సరసల్ని అందానికి సంకేతంగా వాడారు. అది కూడా జీవితంలో ఎంతో ప్రధానమైన అంశమని అనేక పురాణ కథల ద్వారా తెలియజేశారు....  ఇలా వేద, పురాణ, ఇతిహాసాల్ని తరిచి చూస్తే మనకు సంతోషానికి అధిదేవతగా సంతోషిమాత, విఘ్నేశ్వరుడి భార్యలుగా సిద్ది, బుద్ది, సుబ్రమణ్యుని దేవేరులుగా శ్రీవల్లి, దేవసేన... అందరూ ప్రకృతి అంశలే! హిందువులు ఎంతో ఉన్నతంగా భావించే గాయత్రి దేవి కూడా సృష్టిలోని సమస్తమైన సాత్విక శక్తికి సంకేతం!  నవరాత్రి ఉత్సవాలు చేసుకుంటూనే మన ఋషులు, మునులు ఎంతో నిగూఢంగా ఆలోచించి ఏర్పాటు చేసిన స్త్రీ దేవతారాధన, శక్తి ఉపాసన ధార్మిక మర్మాల్ని కూడా మనం తెలుసుకోవాలి! అందులోని  తాత్విక రహస్యం అవగాహన చేసుకోవాలి... 

కాపుగాసి... లోకేష్ పై దాడి చేశారా?

కులం గాలి లాంటిది... అది లేకపోతే రాజకీయాలు బతకలేవు! అలాగని ఆ గాలి ఎక్కువై... దుమారంగా మారితే... అప్పుడు అన్ని పాలిటిక్సూ కొట్టుకుపోతుంటాయి! ఇదీ కులంతో వచ్చిన సమస్య! నవ్యాంధ్రని ఏలుతోన్న టీడీపికి ఇప్పుడు కులం సమస్యే వచ్చినట్టు కనిపిస్తోంది. అభివృద్ధి, ప్రాజెక్ట్ లు, ఉద్యోగాలు లాంటివి అడిగే వారికన్నా కులాల క్యాలికులేషన్స్ చేసుకునేవారు ఎక్కువైపోయారు. సింధు సిల్వర్ మెడల్ గెలిస్తే ఆమె కులం ఏదీ అని గూగుల్ సెర్స్ చేశారంటే... మనోళ్ల కుల పిచ్చి ఎంతో అర్థం చేసుకోవచ్చు! ఇప్పుడు ఈ వీక్ పాయింటేనే ప్రతి పక్షాలు, వాటి అనుబంధ మీడియాలు, పోషల్ మీడియా శూరులు క్యాష్ చేసుకుంటున్నట్టు కనిపిస్తోంది! ఇంతకీ ఏమైందంటే...  వున్నట్టుండీ సోషల్ మీడియా సైట్లలో ఓ ఫోటో ప్రత్యక్షం అయింది. దాంట్లో ఆంధ్రా డిప్యుటి సీఎం నిమ్మకాయల చినరాజప్ప వేదిక కింద నిల్చుని వుంటారు. వేదిక మీద చిన బాబు లోకేష్ కనిపిస్తుంటారు. ఆయన వేలెత్తి చూపుతూ ఏదో మాట్లాడుతుంటారు. కాని, అది మౌనంగా వుండే ఫోటో కదా... అందుకే లోకేష్ ఏమన్నారో, చినరాజప్ప ఏమనిపించుకున్నారో మనకు తెలియదు. కాని, కొందరు కులోన్మాద రాక్షసులకు మాత్రం దాంట్లో ఎన్నో మాటలు వినిపించాయి. వెంటనే ఫేస్బుక్ లాంటి వేదికల్లో ప్రచారం మొదలైంది. ఇన్ ఫ్యాక్ట్, విష ప్రచారం స్టార్టైంది...  కాపు సామాజిక వర్గానికి చెందిన చిన రాజప్ప వయసులో పెద్దాయన. పైగా సౌమ్యుడని పేరుంది. ఆ కులం వారికి ఆయనంటే అభిమానం కూడా. సరిగ్గా ఈ పాయింట్ ని వాడుకునే ఎజెండా సిద్దం చేసుకున్నారు యాంటీ టీడీపీ బ్యాచ్. లోకేష్ ఫలానా మీటింగ్ లో చిన రాజప్పని తిట్టాడు. దారుణంగా అవమానించాడు. ఎంతగా అంటే, డిప్యుటీ సీఎం కళ్ల నీళ్లు పెట్టుకునేంతగా! ఇలా సాగింది నెగటివ్ క్యాంపైన్! మరి దీనికంతటికీ ఆధారం... ఒక్క ఫోటో మాత్రమే. అందులో చినరాజప్ప లోకేష్ ముందు నిలబడి వుంటారు. అంతకు మించి అందులో ఏముండదు. అయినా దుష్ప్రచారం మాత్రం ఆగలేదు. సోషల్ మీడియాలో వైసీపీ వర్గాలు, కాపు యూత్ గ్రూపులు ఇష్టానుసారం షేర్లు చేసేశాయి. వీలున్నంత వరకూ కాంగ్రెస్ వాళ్లు కూడా దీన్ని జనంలోకి పంపే ప్రయత్నం చేశారు! డిప్యుటీ సీఎంను లోకేష్ తిట్టాడన్న ప్రచారం ఎందుకు జరిగింది? దాని వెనుక కారణాలు ఏంటి? ఎవరున్నారు? వాళ్లకి దీని వల్ల కలిగే లాభం ఏంటి? ఇలా బోలెడు ప్రశ్నలు. ఒక్కోటి చూద్దాం. కాని, అంతకంటే ముందు మనం స్టోరీలో బాగా వెనక్కి వెళ్లాలి. ఫ్లాష్ బ్యాక్ లో ఏమైందో కూడా తెలుసుకోవాలి! పవన్ కళ్యాణ్ కూడా చినరాజప్పలా కాపు సామాజిక వర్గానికి చెందిన ప్రముఖుడు. లోకేష్ లాగే పరిటాల కూడా టీడీపీ తరుఫున జనంలో విపరీతమైన గుర్తింపు వున్న నేత! వాళ్లిద్దరి మధ్య లేని గొడవని రాజేశారు చాన్నాళ్ల కింద!  పవన్ కళ్యాణ్ కి పరిటాలకి ఏదో విషయంలో గొడవ జరిగిందనీ, పవర్ స్టార్ కి పరిటాల గుండు గీయించారనీ... అప్పట్లో అదేపనిగా దుష్ప్రచారం జరిగింది. అది తప్పుడు ప్రచారం అని ఈజీగా చెప్పొచ్చు. ఎందుకంటే, తనకు అన్యాయం జరిగితే బెదిరిపోయి కిక్కురుమనకుండా వుండిపోయే నైజం పవన్ కళ్యాణ్ ది కాదు. మరి అటువంటప్పుడు పరిటాల రవితో ఆయనకు గొడవైతే సైలెంట్ గా ఊరుకుంటాడా? అంతకు మించి పరిటాల దాడి చేశాడని రాసిన డెక్కన్ క్రానికల్ పేపర్ వారి ఆపీస్ ముందు ధర్నా చేస్తాడా? ఇలా ఇప్పుడు వెనక్కి తిరిగి ఆలోచిస్తే అంతా ఉట్టిదేనని అర్థమైపోతుంది! అయినా అప్పుడు ఎందుకని ఆ గాసిప్ వ్యాపింపజేశారు? లాజిక్ చాలా సింపుల్... టీడీపికి దగ్గరయ్యే చాన్స్ వున్న కాపుల్ని ఆ పార్టీకి దూరం చేయటమే లక్ష్యం! దాన్ని పరిటాల, పవన్ ల మధ్య శత్రుత్వంగా చీత్రీకరించి సక్సెస్ అయ్యారు. టీడీపికి కాపు ఓట్లు తరువాతి ఎన్నికల్లో అస్సలు పడలేదు! మరి దీని వల్ల లాభపడింది ఎవరు? కాపు ఓట్లు కొల్లగొట్టిన కాంగ్రెస్! ఇప్పుడు కూడా కాపుల్ని తమ వైపు తిప్పుకోటానికి కొన్ని దుష్ట రాజకీయ శక్తులు కాపుగాస్తున్నాయి. వాటి కుటిల కుల తంత్రాలే పదే పదే ఎగిసిపడుతోన్న నిరసన జ్వాలలు. చంద్రబాబు ఎన్నికల ముందు అనివార్యమై హామి ఇచ్చిన కాపుల రిజర్వేషన్ అంశం... ఇప్పుడు బాగా పనికొస్తోంది ప్రత్యర్థులు తమ 'ముద్ర' వేయటానికి! అవును... కాపుల ఆత్మాభిమానంపై తమదైన ముద్రవేసి వార్ని టీడీపికి దూరం చేసే జగన్నాటకం నడుస్తోంది! ఆ మధ్య జరిగిన కాపు గర్జన సభ అనూహ్యమైన హింసకు దారి తీసింది. ఓ రైలు మొత్తం తగులబెట్టారు. కాని, అసలు గతంలో కాపుల్ని బీసీల్లో చేర్చమని జరుగుతోన్న ఉద్యమం ఏనాడైనా హింసాత్మకం అయిందా? మరెప్పుడూ కానిది తునిలో మాత్రం ఎందుకు అయింది? నిజానికి అవ్వలేదు... చేశారు! అధికారం కోసం కాపు కాచుకుని కూర్చున్న వారు... కాపులపై కపట ప్రేమ ఒలికిస్తూ విధ్వంసానికి కారణం అయ్యారు...  2014లో కాపులు వన్ సైడెడ్ గా టీడీపికి జైకొట్టారు. ఇది చాలా మందికి మింగుడుపడటం లేదు. అందుకే, వచ్చే ఎన్నికల నాటికి ఆ సామాజిక వర్గాన్ని తెలుగుదేశానికి దూరం చేయాలని విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. అందులో భాగమే లోకేష్ , చినరాజప్పల ఉదంతం! పవన్ కళ్యాణ్, పరిటాల ఎపిసోడ్ తో ఒకప్పుడు చేసినట్టే ఇప్పుడూ చేద్దామని దుర్భుద్ధి గల వాళ్లు ఆలోచిస్తున్నారు. డిప్యుటి సీఎంని... కాబోయే సీఎం అన్న ప్రచారం వున్న లోకేష్... తిట్టాడని కట్టుకథలు చెప్పి కాపుల ఆత్మాభిమానం దెబ్బతిస్తున్నారు. నిజంగా మాత్రం అసలక్కడ ఏమీ జరగలేదేన్నది టాక్! టీడీపీలోని అత్యంత విశ్వసనీయ వర్గాల ప్రకారం చినరాజప్ప ఏదో మాట్లాడినప్పడు ఆయనకు మామూలుగానే లోకేష్ సమాధానం ఇస్తుంటే సదరు ఫోటో తీశారు. పక్కనున్న వాళ్ల ఎక్స్ ప్రెషన్లు చూస్తే కూడా లోకేష్ డిప్యుటీ సీఎంని కటువుగా ఏమీ అనటం లేదని మనకు అర్థమైపోతుంది! ప్రభుత్వంలో భాగం కాని లోకేష్ నిజంగా ఉప ముఖ్యమంత్రి స్థాయిలోని నేతను ఏమన్నా అంటే అది తప్పే. కాని, ఏమీ జరగకుండానే దుష్ప్రచారం జరిగిపోయింది. పైగా వైరల్ అయిన ఆ ఫోటోను సోషల్ మీడియా దొంగలు లోకేష్ ఫేస్బుక్ పేజ్ లోంచే తీసుకున్నారట! ఆయన పర్సనల్ సోషల్ మీడియా టీమ్ దాన్ని పొరపాటున అప్ లోడ్ చేసిందట. మళ్లీ తీసేసేలోపు డౌన్ లోడ్ చేసుకున్న ప్రబుద్ధులు... ఫోటో చుట్టూ కథ అల్లేశారు. కాపులకి అవమానం అంటూ గావుకేకలు పెట్టారు! నెటిజన్స్ చాలా వరకూ నమ్మేశారు. అయితే, లోకేష్ భవిష్యత్ లో పార్టీనే నడిపించే అవకాశం వున్న వాడిగా చాలా జాగ్రత్తగా మసలు కోవాలి. ఆయన టీమ్ లోని వారికి రాజకీయ పరిణతి, అంకిత భావం లాంటివి వున్నయా అని చూసుకోవాలి. లేదంటే వాళ్లు చేసే పొరపాట్లు ఇలా ఒక కులం మొత్తాన్నీ దూరం చేసే ప్రమాదం వుంది. ఇక చంద్రబాబు కూడా కాపుల కోసం , బ్రాహ్మణుల కోసం కార్పోరేషన్లు పెడుతూ కుల ఒత్తిళ్లకు తలొగ్గకపోతే చాలా బెటర్. ఎందుకంటే, వాటి వల్ల ఆయా కులాలకు కలిగే లాభం కన్నా ఇతర కులాల వారికి కలిగే మనస్తాపం ఎక్కువ. కాపుల్ని బీసీల్లో చేర్చటం అనే దానిపై త్వరగా తేల్చి... ఏపీ సీఎం అందరికీ అభివృద్ధి అనే ఆదర్శవంతమైన లక్ష్యం వైపు దూసుకెళితే చాలా బావుంటుంది! లేదంటే గతంలో టీడీపీ కాపులకి దూరమై ఎంతో నష్టపోయినట్టే ఇప్పుడూ ఇబ్బంది పడాల్సి వస్తుంది. కారణం... కాపు ఓటర్ల కోసం కాపుగాసిన తోడేళ్లు బోలేడు వుండటమే!  

ఇంటర్నెట్ లో షాపింగ్... ఇంటికే పార్సిల్... ఇదో కొత్త అడిక్షన్!

చాలా దేశాల్లో అమ్మే సత్తా వ్యాపరస్థులకి వుంటుంది. కాని, కొనే తాహతూ, ఓపిక జనానికి వుండదు. అందుకే, దేశదేశాల్లో పెద్ద పెద్ద బిజినెస్ ఔట్ లెట్స్ బిచానా ఎత్తేస్తుంటాయి. కాని, ఇండియాలో పరిస్థితి డిఫరెంట్. ఇక్కడ లాసొచ్చి దుకాణాలు మూసుకునే బిజినెస్ మెన్ చాలా మందే వున్నా కోట్లు కొల్లగొడుతున్న తెలివైన కార్పోరేట్స్ కూడా వున్నారు. అసలు మన దేశంలో అమ్మేవాడు అమ్మాలేగాని ఏదైనా కొనటానికి జనం రేడీ.విమానం టిక్కెట్లు కూడా ఓ మంచి ఆకర్షణీయమైన ఆఫర్ ప్రకటించి మార్కెట్లోకి వదిలితే... మన వాళ్లు బస్సు టిక్కెట్లలా కొనేస్తారు! ఇక స్మార్ట్ ఫోన్ల లాంటివైతే పల్లికాయలు కొన్నంత విరివిగా పర్చేస్ చేసేస్తారు! షాపింగ్ పై మనోళ్ల వ్యామోహం అలాంటిది! ఆహార పదార్థాలు ఏ ఆఫర్ ప్రకటించాల్సిన అవసరం లేకుండానే అమ్ముడుపోతాయి. సమస్యల్లా సుఖాలు, సౌఖ్యాలు, సరసాలకు సంబంధించిన లగ్జరీ, ఫ్యాన్సీ గూడ్స్ తోనే! అందుకే ఆయా వస్తువుల అమ్మకం దార్లు రోజుకో ప్రకటనతో తో ఆకట్టుకుంటుంటారు. నెలకో ప్రకటనతో  మైమరిపిస్తుంటారు! ఉదాహరణకి చీరల షోరూం వాళ్లనే తీసుకోండి... ఎవరో ఒక కొత్త హీరోయిన్ని తీసుకొచ్చి రిబ్బన్ కట్టింగ్ చేయించింది మొదలు కస్టమర్స్ జేబులకి బాగానే కటింగ్ పెడుతుంటారు. ఆషాఢం ఆఫర్ అంటారు. దాని వెంటనే శ్రావణం సేల్ అంటారు. ఇలా పన్నెండు నెలలూ నిజం చెప్పో, అబద్ధం చెప్పో అయినకాడికి అమ్మేస్తుంటారు! ఉట్టి చీరలే కాదు దేశం మొత్తంలో బోలెడు వస్తువులు ఈ రకంగానే కంపెనీలు అమ్మేస్తున్నాయి. సబ్బులు, షాంపులు, పర్ఫ్యూమ్ లు వంటి వాటి సంగతైతే సరే సరి!  టీవీలు, పేపర్లు, ఇంటర్నెట్ లో వచ్చే వేలాది యాడ్స్ ని ఒక్కసారి మనసు పెట్టి చూడండి... కట్ డ్రాయర్లు మొదలు కాస్ట్ లీ కార్ల వరకూ అన్నీ దొరికేస్తున్నాయి. బంగారంతో సహా అన్నిట్నీ... మా ప్రాడక్ట్ బంగారం అంటూనే అమ్మేస్తున్నారు జనానికి. ఇక ఇప్పుడు మరో కొత్త మార్కెట్ కూడా కొనుగోలుదారులకి వెర్రిక్కిస్తోంది! అదే ఆన్ లైన్ షాపింగ్...  కాస్త వయస్సు పెరిగిన వాళ్లు కాదుగాని... యూత్ అండ్ టీనేజర్స్ ఎవరి నోట విన్నా ఇప్పుడు ఫ్లిప్ కార్ట్, అమేజాన్ లాంటి పదాలే వినిపిస్తున్నాయి. ఇలాంటి వెబ్ సైట్స్ కూర్చున్న దగ్గర జనానికి వస్తువుల వర్షం కురిపిస్తున్నాయి. వేలాది ప్రాడక్ట్స్, పైగా ఎక్కడికో వెళ్లాల్సిన పని లేదు, ఇంటిలోకే, ఇంటర్నెట్ లోకే వచ్చేస్తాయి! ఇంకేం కావాలి? హాయిగా ఏసీలో  కూర్చుని కావాల్సిన ఐటెం ఫోటోలు, ధరలు అన్నీ చూసుకుని కొనుక్కోవచ్చు! అందుకే, భారతీయులు ఇప్పుడు ఆన్ లైన్ సాపింగ్ కు ఎగబడుతున్నారు...  కొన్నాళ్ల కింది వరకూ ఆన్ లైన్ షాపింగ్ అంటే సరైన వస్తువు డెలివరీ అవుతుందో లేదో, రీప్లేస్మెంట్ సమస్యలు వుంటాయి కదా అని భయపడేవారు. కాని, రాను రాను ఆన్ లైన్ సేల్స్ సై నమ్మకం పెరుగుతోంది. అంతే కాదు, ట్రాఫిక్ లో వెళ్లడాలు, షోరూముల్లో గంటల తరబడి సమయం వృథా చేసుకోడాలు, రేట్ల విషయంలో బేరాలు ఆడటాలు... ఇలాంటివేవీ ఆన్ లైన్ షాపింగ్ లో వుండవు. అందుకే, రోజు రోజుకు మరింత ఎక్కువ మంది ఇంటర్నెట్ షాపింగ్ దిశగా వచ్చేస్తున్నారు.  భారతీయులు సంవత్సరం మొత్తం చేసే షాపింగ్ ఒక ఎత్తైతే దసరా టైంలో సృష్టించే కొనుగోలు సునామీ మరో ఎత్తు! బట్టలు, ఎలక్ట్రానిక్ ఉపకరణాలు, బంగారం, వాహనాలు... ఇలా వేట్నీ వదిలిపెట్టరు. మరి ఇంత మంచి బంగారు బాతు లాంటి దసరా సీజన్ని ఆన్ లైన్ రీటైల్ కంపెనీలు ఎలా వదిలిపెడతాయి? రకరకాల పేర్లతో రంగంలోకి దిగాయి! బిగ్ బిలియన్ డేస్ అని ఒక సైట్ వాళ్లు హడావిడి చేస్తుంటే, గ్రేట్ ఇండియన్ సేల్ అంటూ మరో సంస్థ కలకలం సృష్టిస్తోంది! పైగా ఏదో వందల సంఖ్యలో , వేల సంఖ్యలో వస్తువులు అమ్ముకుని సంతృప్తుని పడటం లేదు. కంకణం కట్టుకుని మిలియన్ల కొద్దీ యూనిట్లు అమ్మేస్తున్నాయి ఈ ఆన్ లైన్ కంపెనీలు. ముఖ్యంగా, స్మార్ట్ ఫోన్స్, టీవీల వంటివి ఆకు కూరలు, ఆలుగడ్డల్లా అమ్మేస్తున్నాయి. ఏకంగా కొన్ని గంటల వ్యవధిలో వందల కోట్ల వ్యాపారం చేసేస్తున్నాయి! ఈ మొత్తం ఇండియన్ ఆన్ లైన్ సేల్స్ అద్భుతం... నిజంగా ఒక ఆశ్చర్యమే! అయితే, ఇది ఒకవైపు మన భారతీయ మార్కెట్ కు వున్న అపారమైన దమ్మును చూపిస్తుంటే... మరో వైపు జనం అవసరం వున్నా లేకున్నా మార్కెట్ మాయలో పడి అవసరం లేని ఉత్పత్తుల్ని కూడా కొనేస్తున్న వైనాన్ని కళ్లకు కడుతుంది! మరీ ముఖ్యంగా, ఇప్పటి ఆల్ న్యూ జనరేషన్ కి ఆన్ లైన్ షాపింగ్... డ్రింకింగ్, స్మోకింగ్, పార్టీయింగ్ లా మరో పోష్ అడిక్షన్ అయిపోయింది!     

ఆర్మీని సాక్ష్యాలు కోరేవారు... దేశద్రోహానికి నిలువెత్తు సాక్ష్యాలు!

కొన్ని సార్లు మన ప్రతి పక్షం కన్నా పాకిస్తానే బెటర్ అనిపిస్తుంటుంది! ఎందుకంటే, పాక్ వెలుపలి శత్రువు. ప్రతిపక్షం అంతర్గత శత్రవు. పాకిస్తాన్ ను తలుచుకుంటే భీకర యుద్ధం చేసి తుడిచి పెట్టేయవచ్చు. కాని, మన దేశ ద్రోహానికి సైతం వెనుకాడని ప్రతి పక్షాన్ని ఏ యుద్ధం చేసినా కూడా తట్టుకోలేము. ఎందుకంటే, మీడియా, మేధావులు, ప్రజాస్వామ్యం ముసుగులో గెరిల్లా పోరాటాలు చేస్తుంటాయి మన ప్రతిపక్ష పార్టీలు.  ఇండియా సర్జికల్ స్ట్రైక్స్ తరువాత ప్రపంచం ఒక్కసారి అలెర్ట్ అయింది. పాక్ కు దిమ్మతిరిగింది. బంగ్లాదేశ్, అఫ్గనిస్తాన్ లాంటి చిన్న దేశాలు మొదలు అమెరికా, రష్యా, జర్మనీ లాంటి సూపర్ పవర్స్ వరకూ అన్నీ మోదీని శభాష్ అన్నాయి! కాని, ఇప్పుడు ఇదే మన నేతల కడుపునొప్పికి కారణమైంది! సర్జికల్ స్ట్రైక్స్ నిజంగా జరిగాయా అంటూ ప్రశ్నించే దాకా పైత్యం ప్రకోపించింది! సాధారణంగా సర్జికల్ స్ట్రైక్స్ లాంటి రహస్య మిలటరీ ఆపరేషన్స్ ఎవ్వరూ పబ్లిగ్గా చెప్పరు. చెప్పినా వీడియో ఆధారాలు చూపించరు. అందుకే, మన డీజీఎంఓ పాక్ పై దాడి చేసినట్టు ప్రకటించగానే మొత్తం ప్రపంచం మరో ఆలోచన లేకుండా నమ్మేసింది. అఖరుకు పాకిస్తాన్ కూడా మొదట్లో గట్టిగా దాడులు జరగలేదని అనలేకపోయింది! దీనికి కారణం భారత ఆర్మీకి వున్న విశ్వసనీయత. చరిత్రలో మనం వాళ్లు ఎప్పుడూ చేయని దాడులు చేశామని చెప్పుకోలేదు. దాడి చేస్తే దొడ్డి దారిన ఆపరేషన్లు నిర్వహించలేదు. అందుకే, మొత్తం ప్రపంచం ఇండియా మాటని నమ్మింది... కేవలం మన అరవింద్ కేజ్రీవాల్ , అతడి దేశ ద్రోహ బ్యాచీ తప్పా! తమ ఆధీనంలో వున్న భూభాగంలో భారత్ దాడులు చేసిందని పాక్ ఎలా ఒప్పుకుంటుంది? అంగీకరించలేదు. అది సహజం. పైగా అంతర్జాతీయ మీడియాని తీసుకొచ్చి ఏమీ కాలేదని నమ్మబలికింది. అదీ సహజమే. కాని, ఇక్కడ అసహజం ఏంటంటే, భారతీయ ఓటర్ల మద్దతుతో ఢిల్లీ సీఎం అయిన కేజ్రీ ఇంగితం కోల్పోయి సాక్ష్యాలు అడగటం! చాలా తెలివిగా మోదీని ప్రశంసిస్తూనే పాక్ ను దోషిగా చేసేందుకు ప్రూఫ్స్ కావాలన్నాడు! ఒక సీక్రెట్ మిలటరీ ఆపరేషన్ సాక్ష్యం అడగటం అంటే ఏంటి అర్థం ? మోదీని కార్నర్ చేస్తున్నట్టు కాదు... ఇండియన్ ఆర్మీని అనుమానిస్తున్నట్టు! ఇంత కామన్ సెన్స్ కూడా లేకుండా పోయింది మిష్టర్ ఏకేకి! అరవింద్ కేజ్రీవాల్ దేశం కోసం పోరాడుతోన్న ఇండియన్ ఆర్మీనే అనుమానించి సాధించింది ఏంటి? మోదీని ఏ మాత్రం తగ్గించలేకపోయాడు! తాను మాత్రం పాకిస్తానీ మీడియా, మేధావులు, జనంలో హీరో అయ్యాడు! అక్కడి సోషల్ సైట్స్ లో గొప్పగా ట్రెండ్ అయ్యాడు! అసలు ఉప్పు, కారం తినే ఒక భారతీయుడికి ఇంతకంటే అవమానకరం ఇంకేం వుంటుంది?  అరవింద్ కేజ్రీవాల్ మోదీని టార్గెట్ చేసి ఎక్కడ మైలేజీ కొట్టేస్తాడోనని 125ఏళ్ల కాంగ్రస్ భయపడింది. వెంటనే వెనకా ముందు ఆలోచించకుండా తానూ సాక్ష్యాలు కోరింది! అంతే కాదు, చిదంబరం లాంటి సీనియర్, మేధావి పంచె ఎగజెక్కుకుని వచ్చి ఆధారాలు కావాలన్నాడు! పనిలో పనిగా కాంగ్రెస్ హయంలో కూడా సర్జికల్ స్ట్రైక్స్ అయ్యాయని సెలవిచ్చాడు. అదే నిజమైతే అప్పుడెందుకు యూపీఏ సాక్ష్యాలు బయటపెట్టలేదు? కాంగ్రెస్ ప్రూఫ్స్ చూపకపోతే దౌత్య నీతి... మోదీ చూపించకపోతే... సర్జికల్ స్ట్రైక్సే అబద్ధం! ఇంతకంటే దుర్మార్గమైన ప్రతిపక్షం ప్రపంచంలో మరెక్కడా వుండదు!  కాంగ్రెస్ లోనే మరో నేత సంజయ్ నిరుపమ్ మరీ నిస్సిగ్గుగా దాడులు జరగలేదని తేల్చేశాడు. అంతా మోదీ సెల్ఫ్ డబ్బా అనేశాడు. ఇలాంటి పనికి మాలిన మాటలు ఎన్నికల సమయంలో బావుంటాయి కాని శత్రు దేశంతో యుద్ధానికి సిద్ధంగా వున్నప్పుడు కాదు! ఇక ఆర్మీ వైపు నుంచీ చూస్తే మన వీర జవాన్లు ఉరికే పీఓకేలోకి పోవటమే కాదు... ఉగ్రవాదుల్ని వేటాడుతూ వీడియో కూడా తీశారు. దాన్ని బయటపెట్టేందుకు తాము ఎప్పుడూ రెడీ అంటున్నారు!  ఒకడు పదో తరగతి పాసై వేరే పని చేయలేని వారు ఆర్మీలో చేరతాడని అంటాడు. ఇంకొకడు ఆర్మీలో చేరి చావమని మేం అడిగామా అంటాడు. ఇలాంటి బరితెగించిన దేశంలో ఆర్మీకి వీడియో ఆధారాలు చూపించుకోవటం తప్ప మరో మార్గం లేదు. కాని, ఇక్కడ అసలు ట్విస్ట్ ఏంటంటే... చిదంబరం అంతటి మొనగాడు, ఏకే ఆంథోని అంతటి ధీరుడు యూపీఏ టైంలో కూడా సర్జికల్ స్ట్రైక్స్ అన్నారు. కాని, అసలేం జరగలేదని తేల్చి చెప్పాడు, అప్పటి డీజీఎంఓ వినోద్ భాటియా. స్వయంగా ఆనాటి ఆర్మీ అధికారే దాడులు జరగలేదని చెప్పాక... కాంగ్రెస్ సర్కార్ తాలూకూ ఉత్తర కుమార ప్రగల్భాలు ప్రత్యేకంగా మాట్లాడుకోవాలా?  ఇప్పుడే కాదు... మన విపక్షాలకు, వాటి నేతలకు , కొందరు మేధావులకు ... గతంలో కూడా మోదీ వ్యతిరేకతకి , దేశ గౌరవానికి మధ్య తేడా తెలియకుండా పోయింది. మోదీ అమెరికా పర్యటించకూడదని కక్ష్యగట్టి ఏకంగా ఒబామానే బతిమాలుకున్నారు! మా దేశం నుంచి మోదీ అనే సాటి భారతీయుడు వస్తాడు... ఆయన్ని మీ దేశంలోకి రానీయకండీ... అంటూ నిస్సిగ్గుగా విజ్ఞప్తి చేసి సంతకాలు పెట్టారు! అలాంటి వారు ఇప్పుడు సాక్ష్యాలు కోరటం... ఆశ్చర్యమేముంది?   

ఆమెగా కాక... అమ్మగా చూడటమే... భారతీయ సంస్కృతి!

నవరాత్రులు నడుస్తున్నాయి. దసరాని తీసుకురాబోతున్నాయి. కాని, దసరా అంటే ఒక కొత్త జత బట్టలు, రెండు పూటలా పిండి వంటలు, మూడు , నాలుగు రోజుల హడావిడి... ఇంతేనా! ఖచ్చితంగా కాదు. భారతీయ సంస్కృతిలో నవరాత్రులు, వాటి చివర్న వచ్చే దసరా స్త్రీ శక్తికి సాష్టాంగ నమస్కారం! సమున్నత సత్కారం....     దసరా అంటే సరదానే! కాని, సరదా మాత్రమే కాదు! దసరా అంటే దశ మార్చేది! దిశ నిర్ధేశించేది! కొత్త ప్రయాణం ప్రారంభింపజేసేది! అన్నిటికంటే ముఖ్యంగా, భారతదేశంలో యుగయుగాలుగా వస్తోన్న స్త్రీ ఆరాధనకి అతి పెద్ద సంబరం! అసలు ఇవాళ్ల మనం సూటిగా మాట్లాడుకుంటే మొత్తం ప్రపంచంలో స్త్రీ శక్తిని దైవంగా ఆరాధించటం కేవలం మన దేశంలో మాత్రమే జరుగుతోంది. హిందూ మతంలో మాత్రమే వుంది. ప్రపంచంలోని ఇతర ప్రముఖ మతాలైన ఇస్లాం, క్రిస్టియానిటి, బౌద్ధం వంటి వాటిల్లో స్త్రీ దేవతలు వుండరు. వున్నా వారికి తగినంత ప్రాముఖ్యత కనిపించదు.  దసరా అంటే విజయదశమి. అది తొమ్మిది రొజుల పాటూ సాగిన శరన్నవరాత్రి ఉత్సవాలకి పరాకాష్ట! రోజుకో రూపంలో పూజలందుకున్న అమ్మవారు విజయదశమి నాటితో మహిషాసుర సంహారం పూర్తి చేసి విజయానికి ప్రతీకగా నిలుస్తుంది! నిజంగా కూడా సృష్టిలో స్త్రీయే అసలు సిసలు విజయ సంకేతం!  ఆమె ప్రత్యేకంగా కోట్లు సంపాదించాల్సిన అవసరం లేదు. బంగాళాలు కట్టాల్సిన అగత్యం లేదు. వ్యాపారాలు చేసి తాపత్రయపడాల్సిన కారణమూ లేదు. తాను తనలా వుంటే చాలు విజయం సాధించినట్టే! ఎందుకంటే, స్త్రీ... పురుషుడు చేయలేని అతి గొప్ప కార్యమైన జన్మనివ్వటం అనే పని చేస్తుంది! తద్వారా ఈ యావత్ మానవజాతి విజయవంతంగా మనగలగటానికే ఆమె విజయ రహస్యం అవుతోంది! ఇక పుట్టిన బిడ్డ ఎన్నో నెలలు, ఏళ్ల పాటూ తల్లి మీదే ఆధారపడతాడు. తిండి కోసం, దాహం కోసం, రక్షణ కోసం, శిక్షణ కోసం... అన్నిటికి తల్లి మీదే బాధ్యత వేస్తుంది శిశువు! అయినా ఎంతో ప్రేమతో, మమకారంతో స్త్రీ పిల్లల్ని ఓపిగ్గా పెంచి పెద్ద చేస్తుంది. ఈ ఒక్క కర్తవ్యం ఆమెను అమ్మని చేస్తుంది. ఆ అమ్మని .... అమ్మలగన్నమ్మాగానూ చేస్తుంది! నిత్య జీవితంలో మన చుట్టూ వుండే ఆడవాళ్ల బాధ్యతలు, త్యాగాలు, గొప్పతనాలే సనాతన ధర్మంలో స్త్రీ దేవతల ఆవిర్భావానికి కారణాలు. మన వేదాలు, ఇతిహాసాలు, పురాణాలు స్త్రీని రతి దేవీ నుంచి కాళికా దేవీ వరకూ అన్ని కోణాల్లోనూ ఆవిష్కరించాయి. మహిళ అంటే కేవలం అందం, శృంగారం మాత్రమే కాదన్నది మన దేశంలో అనాదిగా వస్తోన్న అభిప్రాయం. అందుకు చక్కటి ఉదాహరణ రతీ, రంభా అంటూ స్త్రీలని చిత్రీకరించిన మన పురాణ కథలే లక్ష్మీ, సరస్వతి, కాళీ అంటూ కూడా చెప్పాయి. ఒకవైపు అందం, సున్నితత్వం, మోహం, మాయా వంటి వాటికి ఆడవార్ని సంకేతం చేసినప్పటికీ అదే స్త్రీని అమ్మగా చూడటం కూడా మన పెద్దలు చెప్పారు. ఐశ్వర్యానికి కూడా స్త్రీనే అధిష్టాన దైవంగా నిర్ణయించారు! లక్ష్మిగా సకల సంపదలు ఇచ్చేది అమ్మే!  సంపదలకి, శుభాలకి స్త్రీనే ముఖ్యమని మనుస్మృతి కూడా చెబుతోంది. చాలా మంది ఎన్నో రకాల ఆరోపణలు చేసే మనుస్మృతిలో యత్ర నార్యంతు పూజ్యంతే అంటూ చెప్పాడు మనవు. దానర్థం నారి పూజింపబడితేనే దేవతలు నివసిస్తారనీ! దేవతలు అంటే శుభాలు, సంతోషాలు అనే! ఇంట్లో ఆడవాళ్లు దుఃఖిస్తూ వుంటే ఎంతటి ధనవంతుడైనా సుఖంగా, మనః శాంతితో వుండలేడు. అందుక్కారణం మగవాడి ఆనందం తల్లి, భార్య, కూతురు, తోబుట్టువుల రూపంలో వున్న స్త్రీయే! ఆమె లేకుంటే ఇల్లు నాలుగు గొడలుగా మాత్రమే మిగులుతుంది. స్త్రీ పురుషుడితో కలిసినప్పుడే అది కుటుంబం అవుతుంది. ఈ కారణం చేతనే మన వాళ్లు ఆడవార్ని గృహ లక్ష్మీ అన్నారు! భారతదేశంలో స్త్రీ ఆరాధన జరుగుతోంది కాబట్టి, నవరాత్రులు అవుతున్నాయి కాబట్టి ఇక్కడందరూ చాలా భద్రంగా వున్నారని ఎవ్వరం అనలేం. కాని, నిర్భయ లాంటి దారుణాలు జరిగే మన దేశంలోనే సింధు లాంటి అమ్మాయిలు విశ్వ విజేతలుగా నిలిచి వస్తున్నారు. దీనికి కారణం మన సంస్కృతిలో అనాదిగా ఇమిడి వున్న శాక్తేయమే. అప్పుడప్పుడు చరిత్రలో ఆడవారి పట్ల అమానుషాలు జరుగుతూనే వున్నాయి. అది కాదనలేని సత్యం. ఒక దశలో సతీ లాంటి దురాచారాలు మహిళల్ని నిలువునా బలితీసుకుంటే ఇప్పుడు అత్యాచారాలు, గృహ హింస లాంటివి రాజ్యమేలుతున్నాయి. అయినా కూడా మిగతా ప్రపంచంతో పోల్చుకున్నప్పుడు భారతీయ సంస్కృతి స్త్రీకి ఇచ్చిన మహోన్నత స్థానం అద్భుతమైంది. చాలా దేశాలు, ప్రాంతాల కంటే ఇక్కడ ఆడవారు కొనసాగించే జీవితం మేలైంది. ఒకవైపు మధ్య ప్రాచ్య దేశాలు, ఇస్లాం ప్రాబ్ల్యం వున్న దేశాలు, కొన్ని ఆఫ్రికా దేశాల్లో ఆడవారికి కనీస మానవ హక్కులు వుండటం లేదు. అటు పాశ్చాత్య దేశాల్లో మహిళల్ని పూర్తిగా మార్కెట్ వస్తువులుగా మార్చేస్తున్నారు. స్వేచ్ఛ వున్నా వెస్టన్ కంట్రీస్ లో స్త్రీ పట్ల ఆరాదన భావం తక్కువ.  భారతదేశంలో స్త్రీకి దక్కే గౌరవం, స్వేచ్ఛ ఎంతో సంతృప్తికరం. అలాగని మనం ఆడవారి పట్ల అనుసరిస్తున్న కొన్ని విధానాలు మార్చుకునే పనిలేదని చెప్పటం ఇక్కడ ఉద్దేశం కాదు. కాకపోత, మనం మాతృ స్వరూపిణి అయిన స్త్రీ పట్ల మరింత గొప్పగా వ్యవహరించటానికి మనకు ప్రేరణంతా వేదాలు, పురాణాలు, ఇతిహాసాల్లోనే వుందని గ్రహించటమే ముఖ్యం! విద్యలకు అధిదేవతగా సరస్వతిని మన సంస్కృతిని చెబుతోంది. మరలాంటప్పడు ఆడపిల్లలకు చదువు వద్దని అనటం ఎంత అమానుషం! అలాగే, ప్రేమ స్వరూపం రాథా దేవీ. అటువంటి ప్రేమ స్వరూపిణి అయిన ఆడదాన్ని ఆడపిల్లగా వుండగానే భ్రణహత్యకు పాల్పడటం ఎంత కిరాతకం! ఇక శక్తికి మూలం దుర్గా, పార్వతి, గౌరీ, కాళీ అంటూ ఎన్నో పేర్లతో పిలవబడే అమ్మవారు! ఆమె లేకుంటే శివుడంతటి వాడు కూడా స్థబ్ధుగా, నిశ్చలంగా వుండిపోతాడంటోంది వేదాంతం! అంటే, ఈశ్వరుడిలోని సత్తువ కూడా ఆ అమ్మే! ఆ అన్నపూర్ణే! ఆమె లేకుంటే మనకు ఏం వుంటుంది? ప్రాణం మొదలు జీవితం వరకూ ఏదీ వుండదు! అయితే, మనం అర్థం చేసుకోవాల్సింది ఒక్కటుంది... ఈ మొత్తం విశ్వాన్ని నడిపే విశ్వ శక్తి అయిన విశాలాక్షి మరెవరో కాదు... భూమ్మీది ప్రతీ మనిషికీ జన్మనిస్తూ అమ్మ అనిపించుకుంటోన్న ఆడదే! 'ఈమె'ని 'ఆమె'లా చూడటమే... అసలైన భారతీయ సనాతన సంస్కృతి!  

ఓ సైనికుడి లేఖ... ఇది దేశద్రోహులకి మాత్రమే!

మన యువ సైనికులు సరిహద్దు దాటారు. ఉగ్రవాదులపై దాడులు చేశారు. విజయవంతంగా తిరిగి వచ్చారు. యావత్ దేశం ఆనందంతో ఉప్పొంగింది. యావత్ దేశం... కేవలం కొంత మంది తప్పా!ఫవాద్ ఖాన్ ని పాకిస్తాన్ కి తిప్పి పంపితే ఉగ్రవాదం ఆగిపోతుందా అన్న ధర్మ సందేహం వస్తుంది కరణ్ జోహర్ కి! మహేష్ భట్ వెంటనే అతడికి జత కలుస్తాడు. ''ఉగ్రవాదం ఆపండి... చర్చలు కాదు'' అంటూ సెలవిస్తాడు! పాక్ ఏం చేసినా మాట్లాడుతూనే వుండాలని అతడి ఫీలింగ్! క్రికెట్ బోర్ట్ పాకిస్తాన్ తో క్రికెట్ ఆడుతూనే వుంటుంది. కొన్ని వ్యాపార సంస్థలు పాక్ తో యధావిధిగా వ్యాపారాలు చేస్తూనే వుంటాయి. ఇవన్నీ ఎప్పుడు జరుగుతున్నాయి? సరిహద్దులో మన సైనికులు ఆత్మ త్యాగాలు చేస్తుంటే! పాకిస్తానీ నటుల్ని వెనక్కి పంపటం, పాకిస్తాన్ తో క్రికెట్, వ్యాపారం మానేయటం... వీటి వల్ల నిజంగా ఉగ్రవాదం అంతం అవుతుందా? కాదు... ఎంత గింజుకున్నా అవ్వదు కూడా. కాని, సంఘీభావం అంటూ  ఒకటి వుంటుంది కదా! అసలు ఏమీ కానట్టు సినిమాలు రూపొందిచుకుంటూ, క్రికెట్ ఆడుకుంటూ, వ్యాపారం చేసుకుంటూ వుండలేం కదా. ఎందుకంటే, ఏమీ కాకుండా వుండటం లేదు కదా! ఒకవేళ అలా చేస్తూపోతే, చివరకు మన జవానుకు ''నేనే ఎందుకు ఈ యుద్ధ భారం మొత్తం మొయ్యాలి'' అనే ఆలోచన వచ్చేస్తుంది! ప్రస్తుతం ఇండియా, పాకిస్తాన్ మధ్య జరుగుతోన్న సంఘర్షణ... సైనికుడి వ్యక్తిగత యుద్ధం అస్సలు కాదు. అతను మన కోసం ఛస్తున్నాడు. చంపుతున్నాడు. కాని, కరణ్ జోహర్, మహేష్ భట్ లాంటి వాళ్లు చేస్తున్న పనులకి ఆ సైనికుడు ఎలా ఫీలవుతాడు? ఒక్కసారి ఆలోచించండి! అతను తన ఉన్నతాధికారి వద్దకి పోయి ''రెండు దేశాల మధ్యా అంతా మామూలుగానే నడుస్తుంటే... నేనుందుకు లైన్ ఆఫ్ కంట్రోల్ దగ్గర మరణించాలి సార్?'' అంటాడా? అనడా?  మహేష్ భట్ పాకీలతో చేతులు కలిపినట్టే... ఒక భారతీయ సైనికుడు కూడా వెళ్లి పాకిస్తాన్ సైనికుడితో షేక్ హ్యాండ్ ఇస్తే... మీకు ఎలా అనిపిస్తుంది? ఏ... అతనొక్కడే ఎందుకు ఆత్మ త్యాగం చేయాలి? మిగతా అందరూ హాయిగా మజా చేస్తుంటే? మన సైనికులు అలాంటి దేశ ద్రోహానికి పాల్పడరు. అలాంటి ఆలోచన వారికి రావటానికి ముందే వారు యుద్ధంలో వీరమరణం పొందుతుంటారు... అసలు దేశభక్తి, త్యాగం... ఇవ్వి కేవలం సైనికుడి బాధ్యతలేనా? ఈ దేశం ఎంతగా సైనికుడిదో... అంతే మహేష్ భట్ ది కూడా!  మాస్కోలో జరిగిన ఒలంపిక్స్ ని అమెరికా 1980లో బహిష్కరించింది. అందుకు జవాబుగా 1984 లాస్ ఏంజెలిస్ ఒలంపిక్స్ ను రష్యన్లు బహిష్కరించారు. జాతీయ శ్రేయస్సు అన్నిటికంటే ముఖ్యం అనుకున్నప్పుడు అలాంటి నిర్ణయాలు జరుగుతాయి! మన దేశంలో కూడా ఇప్పుడు అదే జరగాలి.గడిచిన 70ఏళ్లలో పాకిస్తాన్ ఎంతో మంది భారతీయుల్ని చంపింది. అయినా మనకు సినిమాలు తీసుకోవటం, క్రికెట్ ఆడుకోవటమే ముఖ్యమా? మనకు రోదనలతో నిండిపోయిన అమరులైన సైనికుల ఇళ్లు కనిపించవా? పద్దెనిమిది సైనిక కుటుంబాలు అద్దంలా బద్ధలైపోయాయి! అయినా మన బాలీవుడ్ మహారాజావార్ల నుంచీ ఒక్క మాటా రాలేదు. కాని, ఫవాద్ ఖాన్ తిరిగి పాకిస్తాన్ కు వెళ్లిపోతే మాత్రం భరించలేనంత నొప్పి పుట్టింది! పాకిస్తానీ కళాకారులకి మద్దతుగా ఓ ట్వీట్ రాసేయటం తప్పనిసరైపోయింది! పాకిస్తాన్ నుంచి రాహత్ ఫతే అలీ ఖాన్ ఇక్కడకు వచ్చి పాడక ముందు హిందీ సినిమాలో గొప్ప సంగీతమే వుండేది కాదన్నట్టు భ్రమ కల్పిస్తుంటారు కొందరు బాలీవుడ్ దర్శక, నిర్మాతలు. అటు క్రికెట్ బోర్డుకు డబ్బులు సంపాదించుకోవటమే పని. దానికి ఒక చనిపోయిన సైనికుడి భార్య చేసే మౌన రోదన, ఒక అనాథ బిడ్డ చేసే ఆక్రందన అస్సలు పట్టదు. ఎంతసేపూ ఇండియా , పాకిస్తాన్ మధ్య డే అండ్ నైట్ మ్యాచ్ లే ముఖ్యం. పైగా యాషెస్ కంటే ఇండియా పాక్ మ్యాచే ఎక్కువగా చూస్తారని గొప్పగా చెప్పుకుంటుంటారు! మరి సైనికులు? వెలుగు జిలుగుల బాలీవుడ్ స్టూడియోలకు, టేక్ చెక్కతో అందంగా మెరిసిపోయే బీసీసీఐ బోర్డ్ రూంలకు దూరంగా ... వాళ్లు ఎక్కడో వేరే గ్రహంపై వుంటారని కొందరి ఫీలింగ్! రక్తం, ధూళీ, అరుపులు, పేలిపొతుండే మందుగుండు... ఇవన్నీ వాళ్లకు చాలా దూరం, చాలా అసౌకర్యవంతం!. లైనాఫ్ కంట్రోల్ కు వెయ్యి మైళ్ల దూరంలో కూర్చుని శాంతి కావాలని కోరుకోవటం చాలా తేలిక. అంతే కాదు, సాయంత్రమైతే ఏ పార్టీకి వెళ్లాలి? తరువాతి సినిమాకు ఎక్కడ్నుంచి ఫైనాన్స్  తెచ్చుకోవాలి? ఇవే మీ సమస్యలైనప్పుడు శాంతి కావాలని అడగటం మరింత తేలిక! కాని, శాంతి అంటే పంచ్ డైలాగ్ కాదు. అది యుద్ధం ముగిశాక వచ్చే అంతిమ ఫలితం! స్టాప్ టెర్రరిజమ్... నాట్ టాక్స్ అన్న మహేష్ భట్ కంటే పదేళ్ల పిల్లలు కూడా పరిణతితో ఆలోచిస్తారు!                                                        - మేజర్ గౌరవ్ ఆర్య

మీడియాగిరి అనబడు... గూండాగిరి, దాదాగిరి!

మీకు గూండాగిరి తెలుసు... దాదాగిరి తెలుసు... చెంచాగిరి కూడా తెలుసు! అలాగే పాజిటివ్ గా గాంధీగిరి కూడా ఈ మధ్య అందరూ వాడేస్తున్నారు! కాని, మీడియాగిరి తెలుసా? అదేంటి అంటారా? మీడియాగిరి అంటూ కొత్తగా ఒకటి స్టార్టైంది..మీడియా అంటే సినిమా మొదలు ఫేస్బుక్, ట్విట్టర్ లాంటి సోషల్ సైట్స్ వరకూ అన్నీ వస్తాయి. అయితే, వాటన్నిటిలో న్యూస్ పేపర్స్, న్యూస్ ఛానల్స్ తీరే వేరు! అవి అదో టైపు! వీట్నే ఇంగ్లీషులో మెయిన్ స్ట్రిమ్ మీడియా అంటుంటారు! సాధారణంగా మీడియా అనగానే అందరూ గుర్తు చేసుకునేది కూడా పేపర్లు, ఛానల్స్ నే! కాకపోతే, ఫోర్త్ ఎస్టేట్ అని గొప్పగా చెప్పుకునే ఈ వ్యవస్థ మొత్తం ఇప్పుడు ఫోర్స్ డ్ బిజినెస్ గా మారిపోయింది!  మీడియా కాస్తా మాఫియాలా మారిపోయి మీడియాగిరి చేస్తూ సమాజంలోని అన్ని వర్గాల్ని బెంబేలెత్తించే విలన్ లా తయారైంది! ఈ స్టేట్మెంట్ కాస్త తప్పుగా అనిపించినా చాలా వరకూ కరెక్టే! ఇప్పటికీ జర్నలిజం విలువలకి కట్టుబడి అన్యాయాన్ని ఎదురిస్తున్న మీడియా ఖచ్చితంగా వుంది. అలాగే మన దేశంలో రొటీన్ గా పుట్టే వేల కోట్ల విలువైన స్కాంలు దాని వల్లే వెలుగు చూస్తున్నాయి. లక్షల కోట్లు దోచుకునే నేతలు... మీడియా వల్లే జనం ముందు దోషులుగా నిలబడుతున్నారు. అయినా కూడా మీడియాకి మరో కోణం వుంది! అదే మీడియాగిరి...  మీ పుట్టిన రోజుకి ఎవరైనా మీకు శుభాకాంక్షలు చెబితే ... మీరు డబ్బులు అడుగుతారా? అడగరు కదా? మన మీడియా అడుగుతుంది! ఈ మధ్య కొన్ని పత్రికలు, కొన్ని ఛానల్స్ తమ వార్సికోత్సవాలకు యాడ్స్ దండుకుంటున్నాయి. ఓ సంవత్సరం గడిచి కొత్త సంవత్సరంలోకి కాలుపెడుతోంది సదరు పత్రికో, ఛానలో అయితే ఎక్కడెక్కడో వున్న కంపెనీలు, షో రూంలు, వ్యాపార సంస్థలు అడ్వర్టైజ్ మెంట్లు ఇస్తుంటాయి! ప్రైవేట్ సంస్థలు, ప్రైవేట్ వ్యక్తులు అయితే ఫరవాలేదు... మరీ దారుణంగా ప్రజల సొమ్ముతో యాడ్స్ ఇచ్చే గ్రామపంచాయితీలు కూడా మీకు కనిపిస్తుంటాయి! సర్పంచ్ లు పనిగట్టుకుని ఈ పేపర్లకి, ఛానల్స్ కి యాడ్స్ ఇచ్చేస్తుంటారు! అసలు ప్రజల సొమ్ము యాడ్స్ రూపంలో మీడియా పాలు చేయటం ఏంటి?  పత్రికలకు , ఛానల్స్ కు బర్త్ డే విషెస్ చెప్పే యాడ్స్ ఎలాంటివంటే... కొందరు కమర్షియల్ స్వామీజీలు, బాబాల వద్దకి వెళితే భక్తులు వాళ్ల కాళ్లపై పడి వారికే దక్షిణ సమర్పించుకోవాలి! ఇదీ అలాంటిదే! కాకపోతే, స్వామీజీలకు దక్షిణ ఇస్తే చేతిలో బూడిద ప్రసాదంగా పోస్తారు! ఇక్కడ మన మీడియాలోని కొన్ని సంస్థలు ... తమకు యాడ్స్ ఇవ్వకపోతే బూడిద చేసిపారేస్తాయి! అవును... హెడ్ ఆఫీస్ నుంచి వచ్చే ఆదేశాలకు, టార్గెట్ లకు అనుగుణంగా జిల్లాల్లోని రిపోర్టర్లు, స్ట్రింగర్లు గన్నుల్లాంటి తమ గన్ మైక్ లు పట్టుకుని పిట్టల దొరల్లా బయలుదేరిపోతారు. బతిమాలో, బెదిరించో, బెంబేలెత్తించో యాడ్స్ పడుతుంటారు! అది పత్రికా, ఛానల్ తాలూకూ వార్షికోత్సవం కానియండీ, దసరా, దీపావళి, ఎన్నికల ప్రకటనలు కానివ్వండి! ప్రతీ సందర్భంలో మీడియా ఎంటరై మీడియాగిరి మొదలుపెడుతుంది! పనిలో పనిగా సంస్థ తరుఫున గొట్టం పట్టుకుని వచ్చిన రిపోర్టరో, స్ట్రింగరో కూడా నాలుగు కాసులు జేబులో వేసుకుంటాడు! తిల పాప హరం ... తల పిడికెడు అన్నట్టు వుంటుంది వ్యవహారం...  మీడియా మొత్తం మీడియాగిరి చేస్తూ బిజినెస్ మెన్ని, పొలిటీషన్స్ ని, అఖరుకి స్వామీజీల్ని, బాబాల్ని, కమర్షియల్ జ్యోతిష్యుల్ని... ఇలా అందర్నీ అల్లాడిస్తోందని చెప్పలేం. ఉదాహరణకి ఈనాడు గ్రూప్ నే తీసుకోండి... వారి పేపర్, ఛానల్స్ లో ఎక్కడా వార్షికోత్పవ శుభాకాంక్షలు కనపడవు! అంటే ఈనాడు , ఈటీవీ అంటే ఎవ్వరికీ అభిమానం లేదనా? వుంది కాని... ఈనాడు వాళ్లు వెళ్లి బెదిరించి ఆ అభిమానాన్ని యాడ్స్ గా మార్చుకోవటం లేదు. కాని, మిగతా కొన్ని పత్రికలు , ఛానల్స్ ఈ పని విచ్చలవిడిగా చేసేస్తున్నాయి! దీన్నే చెప్పేవి శ్రీరంగ నీతులు... దూరేవి... అంటారేమో! మీడియాగిరిలోని ఇంకో కోణం కూడా వుంది. అది సినిమా ఇండస్ట్రీ కోణం! సినిమా వాళ్లు తమకు చేతనైనంత అందంగా మొత్తం ప్రపంచాన్ని మాయ చేస్తే... వాళ్లని చావగొట్టి చెవులు మూసేది మీడియా! మళ్లీ ఇక్కడా అంతే... మొత్తం మీడియా సినిమా వాళ్లని బ్లాక్ మెయిల్ చేయటం లేదు. కాని, కొన్ని పత్రికలు , ఛానల్స్ యాడ్స్ ఇస్తేనే సినిమా గురించి మంచిగా రాస్తాయి. లేదంటే ఎంత మంచి సినిమా తీసినా తమ రివ్యూలతో రక్తం కక్కిస్తాయి!  సినిమా వాళ్లని బ్లాక్ మెయిల్ చేసే విషయంలో కొన్ని పేపర్లు, ఛానల్స్ మాత్రమే కాదు... కొన్ని గ్రేట్ వెబ్ సైట్ల సంగతి కూడా చర్చించాలి. వెబ్ సైట్లు పెట్టడం పేపర్, ఛానల్ కన్నా చీప్ కాబట్టి బోలెడు పోర్టల్స్ తయారయ్యాయి. అన్నిటికీ అల్లాడించే సీన్ వుండకపోయినా కొన్ని మాత్రం బాగానే పాప్యులర్ అయ్యాయి. ఆ పాప్యులారిటి అడ్డం పెట్టుకుని నిన్న మొన్నటి వరకూ బూతు వార్తలు రాసుకుంటూ వచ్చేవి. ఏ హీరోయిన్ కి ఎవరితో లింక్ వుంది, ఎవరు ఎవరితో కాంప్రమైజ్ అయిపోయి తిరిగేస్తున్నారు అంటూ పర్వర్టెడ్ వార్తలు రాసేవి. కాని, ఇండస్ట్రీలో కొంత పేరొచ్చాక రివ్యూల బాంబులు బయటకు తీస్తుంటాయి ఈ వెబ్ సైట్లు! పాకిస్తాన్ ఇండియా మీద అణు బాంబు వేస్తామని బెదిరించినట్టు ఈ వెబ్ సైట్లు రివ్యూల్ని రాస్తామని భయపెడతాయి! డబ్బులు ఇస్తే సినిమా సూపర్ అని, ఇవ్వకపోతే సినిమా చూడటం కంటే సుయిసైడ్ చేసుకోటం మేలని చెబుతాయి! తమ ఇష్టానుసారం... పాయింట్ ఫై, ప్రో పాయింట్ ఫై అంటూ రేటింగ్ లు కూడా ఇస్తుంటాయి ... ఈ పాయింట్ ఫై వెబ్ సైట్లు! దీన్ని మనం ఇంటర్నెట్ మీడియాగిరి అనొచ్చు...  ఒకప్పటి దూరదర్శన్ కాలం కాదిప్పుడు. ఎవ్వరికి డబ్బుంటే వారు పేపరో, ఛానలో, వెబ్ సైటో పెట్టేసుకునే మీడియాగిరి టైమ్స్! అందుకే, సమాజాన్ని బాగుచేస్తాం అంటూ ఇబ్బడిముబ్బడిగా మీడియా పుట్టుకొస్తోంది! చివరకు, సమాజాన్ని బాగుచేయటం అటుంచి తాను మాత్రం చక్కగా బాగుపడుతోంది! యాడ్స్ గిరి, మీడియాగిరి చేస్తూ గూండాగిరి, దాదాగిరికి కొత్త రూపం ఇస్తోంది... 

మహాత్ముడితో పుట్టిన మహానుభావుడు!

మోహన్ దాస్ కరమ్ చంద్ గాంధీ... ఈ పేరుకి ఇండియాలో ఇంట్రడక్షన్ అక్కర్లేదు! మన మనీ నోట్ల మీద మొదలు మనస్సుల్లో దాకా ఆయన అంతటా వుంటారు! మహాత్ముడిగా మనకు తరతరాలకు సరిపడా ప్రేరణనిచ్చారు. అలాగే జాతిపితగా... గాంధీ భారతీయతలో అవిభాజ్యమైన అంతర్భాగం అయ్యారు! అసలు ఒక్కసారి ఆలోచించండి... గాంధీ పేరు చెప్పకుండా ఆధునిక భారత చరిత్ర మీరేం చెబుతారు? కుదరని పని...  అక్టోబర్ రెండు అనగానే మనకు ఠక్కున గాంధీ జయంతి జ్ఞాపకం వస్తుంది. అది సంతోషకరమే! కాని, గాంధీ పుట్టిన రోజునే మరో గాంధేయవాది జన్మించిన సంగతి చాలా మందికి తెలియదు. పైగా గాంధీతో బర్త్ డే షేర్ చేసుకున్న ఆయన నిఖార్సైన గాంధేయవాది కూడా! అసలు ఒక్కమాటలో చెప్పాలంటే... గాంధీ మాటలతో ఏం చెప్పాడో, ఎలా వుండమన్నాడో.. అలా ఆజన్మాంతం ఆచరించిన ఆదర్శ పురుషుడు! అతనే మాజీ భారత ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి!  లాల్ బహదూర్ శాస్త్రి కేవలం మహాత్ముడు పుట్టిన అక్టోబర్ రెండున పుట్టిన వాడు మాత్రమే కాదు. ఆ మహాత్ముడితో సమానమైన మహానుభావుడు కూడా! తన పేరులోని శాస్త్రి ఊరికే కులం ఆధారంగా ఆయన పెట్టుకోలేదు. ఆ శాస్త్రి అన్నది లాల్ బహదూర్ కఠిక దారిద్ర్యాన్ని జయించి సాధించిన విద్యార్హత వల్ల వచ్చింది! అవును, ఆయన చదివిన ఉన్నత చదువుల కారణంగా శాస్త్రి బిరుదు ఆయనకు వచ్చింది!  లాల్ బహదూర్ శాస్త్రి చిన్న నాటి కథనం ఒకటి ప్రచారంలో వుంది. ఆయన స్కూలుకి వెళ్లే కాలంలో నది దాటి వెళ్లాల్సి వచ్చేది. అందుకు పడవ వాడికి రోజుకు కొంత మొత్తం చెల్లించాల్సి వచ్చేది. కాని, చాలా మంది గొప్ప వాళ్లలాగే శాస్త్రిజీ కూడా పుట్టుకతో కఠిక పేదరికం అనుభవించారు. అందుకే ఓ రోజు నది దాటేందుకు పడవ వాడికి ఇవ్వాల్సిన డబ్బులు ఆయన వద్ద లేకపోయాయి. మళ్లీ ఇస్తానంటే నది దాటించే వాడు అవమానకరంగా మాట్లాడాడు. దాంతో ఆత్మాభిమానం కలిగిన లాల్ బహదూర్ శాస్త్రి మళ్లీ ఏనాడూ... ఏళ్ల తరబడి... పడవ ఎక్కనే లేదు! ప్రతీ రోజు నది ఈదుకుంటూ వెళ్లి చదువుకుని వచ్చేవాడు! అంతటి ఆత్మభిమానం , పట్టుదల వున్న వాడు కాబట్టే ఆయన తరువాతి కాలంలో దేశ ప్రధాని కాగలిగారు, పాక్ పీచమణచగలిగారు! అత్యంత పేద కుటుంబం నుంచి వచ్చిన లాల్ బహదూర్ శాస్త్రి పీఎం అయ్యాక కూడా చాలా సాదాసీదాగా వుండేవారని అంటారు! ఎంతగా అంటే , తన బట్టలు తానే పిండుకునేవారట ఆయన! ఇక నెహ్రు కాలంలో అప్పటికే దెబ్బతిన్న పాకిస్తాన్ తన వక్ర బుద్ది పోనించుకోక దండెత్తి వచ్చింది శాస్త్రిగారి శకంలో కూడా! అప్పడే భీకర యుద్దం జరుగుతుండగా ఆయన జై జవాన్...జై కిసాన్ చారిత్రక నినాదం ఇచ్చారు!  శాస్త్రి జీ ఇచ్చిన స్వేచ్ఛతో తన అస్త్ర, శస్తాలన్నీ బయటకు తీసి విజృంభించింది భారత ఆర్మీ. ఫలితంగా మన సేనలు పాక్ చేతిలో వున్న కార్గిల్ ప్రాంతం స్వాధీనం చేసుకోవటమే కాకుండా లాహోర్, కరాచీల్ని కూడా కంట్రోల్ లోకి తెచ్చుకున్నాయి. అయినా అప్పటి సూపర్ పవర్ రష్యా కొద్దిగా పాక్ వైపు రాజకీయం నడిపి లాహోర్, కరాచీల్ని తిరిగి ఆ దేశానికి ఇప్పించేసింది! మన కార్గిల్ కూడా తిరిగి ఇవ్వాలని సోవియట్ చెప్పింది. అందుకు శాస్త్రి ఎంత మాత్రం ఒప్పుకోలేదు. కాని, అనూహ్య పరిణామాల మధ్య ఆయన రష్యాలోని తాష్కెంట్లో హఠాత్తుగా మరణించారు! దీని వెనుక కుట్ర వుందని భావించే వారు ఇప్పటికీ చాలా మంది వున్నారు.  లాల్ బహదూర్ శాస్త్రి మరణం కొంత మిస్టరీనే అయినా ఆయన జీవితం మాత్రం గొప్ప హిస్టరీ! ఆయన పాక్ పైన తీసుకున్న స్టాండ్ ఇప్పటి మోదీకి కూడా ఇన్ స్పిరేషన్ అనవచ్చు! ఇప్పుడు నమో చేసినట్టే పాకిస్తాన్ ను ఆయన అప్పట్లో గడగడలాడించారు! కాకపోతే, దురదృష్టకరంగా హఠాన్మరణం పాలయ్యారు. అయినా కూడా గాంధీ పుట్టిన తేదీనే పుట్టిన ఆయన గాంధేయ వాదానికి అసలు సిసలు నిదర్శనం! గాంధీయవాదం, అహింస అంటే శత్రవులకి భయపడుతూ, వాళ్లకి లొంగి వుండటం కాదనీ, మనల్ని మనం రక్షించుకుంటూ పక్క వాళ్లని ఇబ్బంది పెట్టకపోవటమేనని.. లాల్ బహదూర్ బహు గొప్ప నిరూపించారు! అదే ఇప్పటికీ, ఎప్పటికీ భారతీయులందరికీ గొప్ప పాఠం! 

రీల్ హీరోలకు... రియల్ హీరోలు కనిపించటం లేదా?

మసూద్ అజర్... వీడెవడో ఇండియన్స్ అందరికీ తెలుసు! వాజ్ పేయ్ ప్రభుత్వం వున్నప్పుడు మన విమానం హైజాక్ అయింది. వంద మందికి పైగా మరణిస్తారనే ఆలోచనతో అప్పటి ఇండియన్ గవర్నమెంట్ ఈ కుక్కని మన జైల్లోంచి వదిలింది. వెంటనే వీడు తోకాడించుకుంటూ పోయి పాకిస్తాన్ లో నక్కాడు. ఇక అక్కడ్నుంచీ అప్పుడప్పుడూ మొరుగుతూనే వుంటాడు!  తాజాగా మసూద్ యురీ ఉగ్ర ఘాతుకం తరువాత మొరిగాడు. ఏమన్నాడంటే... బారత్ పాకిస్తాన్ లోకి చొరబడి దాడి చేయటం కాని పని అన్నాడు. అలా బాలీవుడ్ సినిమాల్లో మన హీరోలు మాత్రమే చే్స్తారట! ఇండియన్ ఆర్మీకి అంతా సీన్ లేదన్నాడు! కాని, మసూద్ నోటికి వచ్చినట్టు మొరిగిన వారం తిరగకుండానే మోదీ చేతిలో పాక్ ఉగ్రవాదులకి మూడింది! మసూద్ సినిమా హీరోలే వచ్చి దాడి చేసి పోతారన్న మాటని అబద్ధం చేస్తూ మన రియల్ ఆర్మీ హీరోస్ అక్కడికి వెళ్లి సినిమా చూపించారు! కుక్కల్ని కుక్క చావు చచ్చేలా చేసి... సింహాల్లా తిరిగొచ్చారు! పాక్ మీద ఇండియా సర్జికల్ స్ట్రైక్స్ చేసింది బాగానే వుంది... బాలీవుడ్ హీరోల్లాగే మన నిజమైన హీరోలు చెలరేగిపోయారు. ఇంకా బావుంది. కాని, ఇదంతా జరుగుతుంటే మన మేకప్ హీరోలు ఏం చేస్తున్నారు? బాలీవుడ్లోళ్లు కాస్త నయం! అక్షయ్ కుమార్ లాంటి చాలా మంది ట్విట్టర్ లో ఇండియన్ ఆర్మీకి జైకొట్టారు! రవీనా టాండన్ లాంటి మాజీ హీరోయిన్ గర్వంగా భారత సైన్యాన్ని మెచ్చుకుంది! కాని, తెలుగు హీరోలు, హీరోయిన్స్ ఏమైపోయారు? అసలు వున్నారా? చచ్చారా? ఇలాంటి డౌట్ వచ్చేలా నిశ్శబ్దం! ఆడియో రిలీజ్ లు అయితే ''మేం ఈ సినిమా కోసం బాగా కష్టపడ్డాం. లుంగీలు కట్టుకుని రెండు కాళ్లు లేపి గాల్లోకి ఎగిరి అద్భుతమైన ఫీట్స్ చేశాం'' ఇలాంటి సొల్లు చెబుతారు! హీరోయిన్స్ అయితే వచ్చీరాని తెలుగుతో... ఎందుకు వచ్చాం రా దేవుడా అన్నట్టు '' హీరో పోటుగాడు, దర్శకుడు కేటుగాడు, నిర్మాత బీటుగాడు'' అంటూ పొగిడేసి వెళ్లిపోతారు. సినిమా రిలీజ్ కి వారం ముందు, వారం తరువాత వద్దన్నా ఇంటర్వ్యూలు ఇచ్చి ఇరిటేట్ చేస్తారు. కాని, అదేంటో దేశం యుద్ధం చేసే విషమ క్షణంలో వుంటే ఎవ్వరూ కనిపించి చావటం లేదు! కనీసం ట్విట్టర్ లో కూడా నాలుగు ముక్కలు రాసినోడు లేడు! వారం వారం సినిమాలు రీలీజ్ అయితే మాత్రం ఒకడి సినిమాను ఒకడు తెగ మెచ్చుకుంటాడు. అచ్చం... బార్బర్ షాపులో పని చేసేవాళ్లు ఒకడి గడ్డం ఒకడు గీసుకున్నట్టు! అసలు మన సినిమా వాళ్లకు, ముఖ్యంగా లక్షల మంది అభిమానుల్ని సంపాదించుకున్న బాబులకి సామాజిక బాధ్యత వుందా? పది రోజుల కింద యూరీ దారుణం జరిగింది. ఇంచుమించూ ఇరవై మంది జవాన్లు బలైపోయారు! అయినా కూడా ... సినిమాల్లో అద్దెకు తెచ్చిన ఆర్మీ డ్రస్సు వేసుకుంటేనే గొంతు చించుకుని అరిచి అరిచి డైలాగ్లు చెప్పే మన హీరోలు ఒక్క మాట మాట్లాడలేదు! ఇక ఇప్పుడు పాక్ పై మన వాళ్లు విరుచుకుపడి ప్రతీకారం తీర్చుకుంటే కూడా... ఎక్కడ్నుంచీ చప్పుడు లేదు! తమ లాగా కాక డూపుల సాయం లేకుండా రియల్ ఫైటింగ్ చేసిన రియల్ హీరోల గురించి మన రంగు బాబులు మాట్లాడరా? దేశం, దేశ భద్రత, జవాన్లు, వాళ్ల ప్రాణాలు, వాళ్లు సాధించే విజయాలు వీళ్లకి పట్టవా?  పాకిస్తాన్ పై భారత్ దాడి తరువాత ఫేస్బుక్, ట్విట్టర్లు ఇండియన్స్ చేస్తున్న పోస్టులతో భగ్గున మండిపోతున్నాయి. కాని, గణపతి తలని శివుడు ఎందుకు నరికాడని అడిగే మన మేధావి దర్శకులు మాత్రం కిక్కురుమనటం లేదు! ప్రత్యేక హోదా కోసం పనిగట్టుకుని పాటలు పాడిన వారు ఇప్పుడు అసలు ఏం చేస్తున్నారో కూడా తెలియదు! అయినా ఒక దర్శకుడు, ఒక హీరో, ఒక హీరోయిన్ అని కాదు... టాలీవుడ్ లోని ఏ ఒక్కరూ పాకిస్తాన్ గురించి, ఉగ్రవాదుల గురించి ఏమీ మాట్లాడకపోవటం ఎలా అర్థం చేసుకోవాలి? బహుశా, వీళ్లకు థమ్సప్ తాగితే తుఫాన్ వస్తుంది, నవరతన్ రాసుకుంటే సమస్యలు తీరిపోతాయి అని చెప్పినందుకు డబ్బులు ఇస్తారు కదా... అలా ముట్టజెప్పాలేమో! బట్టల దుకాణాల రిబ్బన్ లు కట్ చేసినందుకు బరువైన చెక్ లు ఇస్తుంటారు కదా... అలా అందిస్తే... అప్పుడు దేశం గురించి, దేశ సమస్యలు, సైనికుల గురించి మాట్లాతారేమో! థూ దీనమ్మా జీవితం! హీరోలు, సినిమా వాళ్లు మాట్లాడకుంటే ఏం కాదు. కాని, మీ ఒక్క మాటతో రక్తాలు దానం చేసేవాళ్లు, రక్తాలు కారేలా కొట్టుకు చచ్చేవాళ్లు అవతల వున్నారు. ఆ అభిమానులకి దేశంపై ప్రేమ కలగటానికి మీకు ఎంత ఒళ్లు బద్ధకమైనా దేశం గురించి మాట్లాడాలి. ట్వీట్ లు చేయాలి. భారత్ మాతాకీ జై అనాలి! లేకపోతే, భారతదేశం అంటే మీకు కేవలం బాక్సాఫీస్ మాత్రమే అని ఫీలింగ్ వుందని మేం అర్థం చేసుకోవాల్సి వస్తుంది.... టేక్ కేర్!       

హృదయం గురించి... మనసు పెట్టి ఆలోచించాల్సిందే!

సెప్టెంబర్ 29... వాల్డ్ హార్డ్ డే! అంటే... ఇదేదో ప్రేమకు, రొమాన్స్ కు సంబంధించింది అనుకోకండి! ప్రపంచ గుండె దినం అంటే మానవ హృదయంపై అవగాహన కలిగించేందుకు ఉద్దేశించిన రోజు! నిజానికి గుండెను జాగ్రత్తగా చూసుకోకుంటే ఏ రోజు కూడా మనది కాదు. ప్రతీ ఒక్క రోజూ చక్కగా గడవాలంటే గుండె బలంగా, భద్రంగా వుండాల్సిందే! కాని, జరుగుతున్నది మాత్రం అంతా వ్యతిరేకమే..  భారతదేశం వేగంగా అభివృద్ధి చెందటం ఆనందకరమే అయినా ఆ అభివృద్ధికి మనం చెల్లిస్తున్న మూల్యం గుండెలు గుభేలుమనిపిస్తుంది! మారుతున్న జీవనశైలి, తినే ఆహారపు అలవాట్లు, పెరిగిపోతున్న ఒత్తిళ్లు...ఇవన్నీ కలిసి గుండెను పిండేస్తున్నాయి! మరీ ముఖ్యంగా, హృదయ సంబంధమైన రోగాలు సిటీల్లో విపరీతంగా పెరిగిపోతున్నాయి. మొత్తం ప్రపంచం అంతా ఇదే ట్రెండ్ కొనసాగుతోంది. అయితే, భారత్ లాంటి అభివృద్ధి చెందుతున్న దేశాల్లో తీవ్రత మరింత ఎక్కువగా వుంది. 25 నుంచి 40 ఏళ్ల లోపు యువత నగరాల్లో భారీగా గుండెపోట్ల బారీన పడుతున్నారు...  గుండె జబ్బు అనగానే హార్ట్ ఎటాక్ మాత్రమే కాదు. ఇంకా అనేక రకాలుంటాయి. వాటిల్లో ఇండియాలో ప్రబలుతున్న ప్రధాన రోగం కొరోనరీ ఆర్టరీ డిజీస్. షార్ట్ గా క్యాడ్ అనే రకం గుండె జబ్బు వల్ల మనిషి త్వరగా చనిపోయే ప్రమాదం వుంది. ఒక్కోసారి హఠాత్తుగా గుండె ఆగిపోయి మరణిస్తున్నారు కూడా. అసలు క్యాడ్ అంటే గుండెకు రక్తం తీసుకువచ్చే నాళాలు క్రమ క్రమంగా మూసుకుపోవటం. దీనికి కారణం ఆధునిక కాలంలో పెరిగిపోతున్న కాలుష్యాలు, ఆహారంలో వచ్చిన హానికరమైన మార్పులు, ఒంట్లో బ్యాడ్ కొలెస్ట్రాల్ పెరిగిపోవటం మొదలైనవన్నీ. వీటితో పాటూ నగరాల్లో శారీరిక శ్రమ అంతకంతకూ తగ్గిపోతోంది. ఇందుకు కారణం మారిపోయిన లైఫ్ స్టైలే. ఉద్యోగాల్లో, ఇంట్లో ప్రతీ చోటా మనిషి కూర్చునే వుంటున్నాడు. శారీరిక శ్రమ మరీ తక్కువైపోయింది. అలాగే, రకరకాల ప్రాసెస్ట్ ఫుడ్, ఫాస్ట్ ఫుడ్ ల వల్ల ఒంట్లో కొవ్వు పెరిగిపోతోంది. బ్లడ్ పెషర్, డయాబెటిస్ లాంటివి కూడా ముదురుతున్నాయి. అన్నీ కలిసి మనిషి ఉనికికే మూలమైన గుండెపై దాడి చేస్తున్నాయి.  నగరాల్లో ఎప్పటికప్పుడు హృద్రోగుల సంఖ్య పెరిగిపోతున్నా గ్రామాల్లోనూ ఏమంత ఆశాజనకంగా లేదు. అక్కడ కూడా కాలుష్యాలు, శారిరిక శ్రమ తగ్గటం లాంటివి దుష్ప్రభావం చూపుతున్నాయి. గుండెకు రక్తాన్ని మోసుకెళ్లే నాళాలు హానికరమైన కొవ్వుతో బరువెక్కటం, మూసుకుపోవటం వల్ల రక్త ప్రసరణ దెబ్బతింటుంది. ఫలితంగా గుండెకు ఆక్సిజన్ సరిగ్గా అందక హార్ట్ ఎటాక్స్ కు దారితీస్తోంది. ఈ కారణంగానే ఎప్పడూ లేని విధంగా ఈ మధ్య యువత గుండె పోట్లకు గురవుతోంది. ఒకప్పుడు హృద్రోగాలు కేవలం ముసలివారికి పరిమితం అయ్యేవి. ఇప్పుడు అన్ని వయస్సుల వారు గుండెలు అరిచేతిలో పెట్టుకునే బతకాల్సి వస్తోంది. ప్రపంచ గుండె దినం సందర్భంగా నిపుణులు చెబుతున్నది ఏమిటంటే... హానికరమైన ఆహారం తినకపోవటం, శారీరిక శ్రమ చేయటం, ఒత్తిడి లేకుండా వుండటం వంటివన్నీ అర్జెంట్ గా చేయాలి. అప్పుడే గుండె భద్రంగా వుండేది! మరోలా చెప్పాలంటే... ఆధునిక జీవనశైలికి సాధ్యమైనంత దూరంగా వుంటూ సహజంగా బ్రతకాలి! అదే హృదయానికి శ్రీరామ రక్ష!   

హోలీ డిప్ మాత్రమే కాదు... హెల్తీ డిప్ కూడా!

రాముడి వంశంలో భగీరథుడు అనే రాజు. ఆయన తన పూర్వీకులకు పుణ్యగతులు వచ్చేందు కోసం కఠోర తపస్సు చేశాడు! తరువాత ఏమైంది? గంగ భూమ్మీదకి వచ్చింది. ఆ గంగా ప్రవాహం చనిపోయిన వారి బూడిద కుప్పల మీద నుంచి ప్రవహించే సరికి వాళ్లకి ఉర్ద్వలోకాలు ప్రాప్తించాయి! ఈ కథ మనందరికీ తెలిసిందే. దీని కారణంగానే భగీరథ ప్రయత్నం అనే మాట కూడా వచ్చింది!  నిజంగా గంగ పరమ పావనమైందా? బతికున్న వారి, చనిపోయిన వారి పాపాలు అది కడిగేస్తుందా? ఇవన్నీ విశ్వాసాల మీద ఆధారపడ్డవి! కాని, గంగ మిగతా నదుల్లాంటి మామూలు నది మాత్రం కాదన్నది ఇప్పుడు అధికారికం కాబోతోంది! అదెలా అంటారా?  గంగా నది హిందువులకి యుగయుగాలుగా పవిత్రమైంది. అయితే, ఆధునిక కాలంలో అందర్నీ పావనం చేసే గంగకే అపవిత్రత అంటుకుంటోంది. కాలుష్యం కారణంగా గంగ విషపూరితం అవుతోంది. మోదీ సర్కార్ వచ్చాక జలవనరుల శాఖా మంత్రి ఉమా భారతి అత్యంత ప్రతిష్టాత్మకంగా గంగను శుద్ధి చేసే కార్యక్రమం చేపట్టారు! దాని పలితాలు ఎలా వున్నాయో మనకు తెలియదుగాని గంగ మాత్రం గొప్పతనం మరోసారి ఋజువు చేసుకుంది! గంగా నది మిగతా నదుల్లాంటి మామూలు జలాశయం కాదంటున్నారు ఇన్ స్టిట్యూట్ ఆఫ్ మైక్రోబియల్ టెకాల్నజీ ( ఇంటెక్ ) వారు. ఛంఢీఘడ్ లో వున్న ఈ ప్రభుత్వ రంగ సంస్థ గంగ నీటిపై అధ్యాయనం చేసింది. ఇంటెక్ శాస్త్రవేత్తలు నైరుతీ ఋతు పవనాల ముందు తరువాత గంగా నదిలోని నీటి శ్యాంపుల్స్ సేకరించారు. ఒక్క చోట కాకుండా అనేక చోట్ల గంగలోని నీటిని సేకరించారు. వాటిని ల్యాబ్ లో చెక్ చేస్తే ఆసక్తికర సత్యాలు వెలుగు చూశాయి! గంగా నది నీటిలో హిమాలయాల నుంచి కిందకు వస్తున్నప్పుడు శాస్త్రవేత్తలకు కొన్ని వైరస్ లు కనిపించాయి. ఇవ్వి మనిషికి మేలు చేసేవి. రకరకాల రోగాలు తెచ్చిపెట్టే బ్యాక్టీరియాని ఈ గంగా నీటిలోని వైరస్ లు హరించి వేస్తాయి! తద్వారా గంగా నది జలం ఎన్ని రోజులైనా పాడవకుండా వుంటుంది! అంతే కాదు, తాగిన వారికి, స్నానం చేసిన వారికి ఎంతో మేలు చేస్తుంది! క్షయ, టైఫాయిడ్, న్యూమోనియా, క్లోరియా , డీసెంట్రీ, డయేరియా, మెనింజైటిస్‌ వ్యాధులకు విరుగుడుగా గంగా జలాల్ని వినియోగించవచ్చన్నారు ఇంటెక్ నిపుణులు. ఈ శక్తి గంగా ప్రవాహానికి వుండటానికి కారణం అందులోని ఉపయోగకరమైన వైరస్ లే అంటున్నారు వారు. ముందు ముందు యమునా, నర్మదా నది నీళ్లతో గంగా నది నీళ్లను పోల్చి చూసి మరిన్ని పరిశోధనలు చేస్తామని కూడా చెబుతన్నారు. ఈ పరిశోధనల ఫైనల్ రిపోర్ట్ ఈ సంవత్సరం డిసెంబర్ లోనే  ప్రభుత్వం ముందుకు  రానుంది! గంగలో మునిగితే పుణ్యం వస్తుందో లేదో తెలియదుగాని ఆరోగ్యం వస్తుంది. ఇది ఇప్పుడు తాజా ప్రయత్నాలతో నిరూపితమైంది. అంతే కాదు, మన పెద్దలు గంగలో స్నానం తప్పకుండా చేయమని చెప్పింది కూడా ఊరికే కాదని అర్థమవుతోంది! కొందరు ఆధునికులు ప్రచారం చేసినట్టు గంగలో మునగటం అంటే... మన తెలివితేటల్ని గంగపాలు చేయటమేం కాదు! గంగా స్నానం మూఢ నమ్మకం కాదు! అసలది కేవలం హోలీ డిప్ మాత్రమే కాదు... హెల్తీ డిప్ కూడా!  

సిక్స్ త్ ఫింగర్ లా మిగిలిపోతున్నా యూఎన్ఓ!

ఐక్యరాజ్య సమితి... అంటే యూఎన్ఓ... ఇది మనకు చాలా పెద్ద సంస్థ కావొచ్చు. ప్రపంచ దేశాలన్నీ సభ్యులుగా వున్న అతి ప్రభావవంతమైన శక్తి కావొచ్చు. కాని, సింపుల్ గా మాట్లాడుకుంటే అదో అంతర్జాతీయ రచ్చబండ! ఊళ్లో రచ్చబండ వద్ద ఏమవుతుందో అక్కడా అదే అవుతుంది! ప్రపంచ దేశాలన్నీ అక్కడ పంచాయితీలు పెట్టుకుంటాయి. పరస్పర చర్చలతో సామారస్యంగా పరిష్కారాలు వెదుక్కుంటాయి. 1945 నుంచీ ఇలాగే జరుగుతోంది కూడా..  ఊళ్లో రచ్చబండ దగ్గర కేవలం పంచాయితీలు మాత్రమే వుండవు. అక్కడ రాజకీయాలు వుంటాయి. ఐరాస లోనూ అదే జరుగుతుంటుంది. గ్రామంలో పెద్దలుగా చలామణి అయ్యేవారు రచ్చబండ వద్ద తమ పంతం నెగ్గించుకుంటూ వుంటారు. తమ పరపతి, శక్తి, డబ్బు ఉపయోగించి మామూలు జనాన్ని లొంగదీసుకుంటుంటారు. పైగా దానికి ఊరంతటి అమోదం కూడా రచ్చబండ వద్ద వేయించుకుంటుంటారు! యూఎన్ఓ లో జరిగేది, జరుగుతున్నది అచ్చంగా ఇదే! అమెరికా లాంటి అగ్రదేశాల రచ్చబండలా మారిపోయింది ఐక్య రాజ్య సమితి! ఇక్కడే అసలు ఆందోళనకర పరిణామాం చొటు చేసుకుంటోంది...  ఒకప్పుడు ఐరాస అంటే ప్రపంచ దేశాలు బాగానే గౌరవం ఇచ్చేవి. చిన్న చిన్న దేశాలైతే భయపడేవి కూడా. కాని, ఇప్పుడు పరిస్థితి మారిపోయింది. యూఎన్ఓ ఏ దేశంలోకి వచ్చి మానవ హక్కుల ఉల్లంఘన విషయాన్ని పరిశీలిస్తానన్నా అందరూ ముఖం మీదే తలుపులు వేస్తున్నారు. ఈ పని చేస్తోంది ప్రపంచంలోని శక్తివంతమైన దేశాలో, భారత్ , చైనా లాంటి అభివృద్ధి చెందుతున్న దేశాలో కాదు! అత్యంత అనామక దేశాలు, పేద దేశాలు, చిన్న దేశాలు యూఎన్ ని డోంట్ కేర్ అంటున్నాయి.  వెనెజుల, పాకిస్తాన్, సిరియా, ఉత్తర కొరియా... ఇలా బోలెడు దేశాలు తమ భూభాగంలో మానవ హక్కుల ఉల్లంఘనకి పాల్పడుతున్నాయి. అమాయకుల్ని కిరాతకంగా చంపేస్తున్నాయి.   ఉదాహరణకి పాకిస్తాన్ నే తీసుకుంటే బలూచిస్తాన్ విషయంలో అమానుషంగా ప్రవర్తిస్తోంది. సామూహిక హత్యాకాండ, కిడ్నాప్ లు, అత్యాచారాలు, విషప్రయోగాలు... ఇలా పాక్ చేయని రాక్షస కృత్యం లేదు బలూచిస్తాన్లో. అయినా ఐక్యరాజ్య సమితి ఏమీ చేయలేకపోతోంది. కారణం పాక్ ఐక్యరాజ్య సమితిలో సభ్య దేశం అయి వుండి కూడా మాటవినకపోవటమే. ఇప్పటి వరకూ పాకిస్తాన్ లాగా మానవహక్కుల ఉల్లంఘనకు పాల్పడుతున్న చాలా దేశాలు యూఎన్ ప్రతినిధుల్ని తమ నేలపై కాలు పెట్టనివ్వటం లేదు.  భారత్ కూడా ఐక్యరాజ్య సమితిని పక్కకు పెట్టిన సందర్భాలున్నాయి. కాశ్మీర్లో మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతోందని ఐరాస అంటే అది మా అంతర్గత అంశమని ఇండియా బదులిచ్చింది! నిజంగా చాలా చోట్ల జరుగుతున్న మానవ హక్కుల ఉల్లంఘన కంటే కాశ్మీర్లో జరుగుతున్నది అత్యంత అప్రస్తుతం. అయినా కూడా రాను రాను ఐక్యరాజ్య సమితిని దేశాలు పట్టించుకోవటం లేదనే దానికి భారత్ ప్రవర్తన కూడా ఒక ఉదాహరణ!  అసలు ప్రపంచ పటంలోని చిన్న చిన్న దేశాలు కూడా ఐరాసను ఎందుకు పట్టించుకోవటం లేదు? కారణం ఇంతకు ముందు చెప్పుకున్నట్టే... పెద్ద దేశాల స్వార్థం. అమెరికా, బ్రిటన్ లాంటి దేశాలు పదే పదే యూఎన్ మాటను బేఖాతరు చేస్తుంటాయి. లేదా తమకు కావాల్సినట్టు తీర్పులు, తీర్మానాలు చేయించుకుంటాయి! ఇరాక్ మీద యుద్ధం సమయంలో ఇదే జరిగింది. యూఎన్ లో ఎన్ని దేశాలు వద్దన్నా అమెరికా, బ్రిటన్ , ఫ్రాన్స్ లు తమ పంతం నెగ్గించుకున్నాయి. ఇరాక్ పై దాడి చేశాయి. ఇదే మిగతా దేశాలకు ఐరాస పై గౌరవం, భయం తగ్గేలా చేస్తోంది...  ఇలాగే ఐక్యరాజ్య సమితి బలహీనపడితే తీవ్ర ఆందోళనకర పరిణామాలే చోటు చేసుకుంటాయి. ఇప్పటికే ఉగ్రవాదం, ఆయుధాల, అణు బాంబుల రేస్ లో తలమునకలైన ప్రపంచం ఏదో ఒక రోజు మూడో ప్రపంచ యుద్ధం ముంగిట్లో నిలుస్తుంది. దాన్ని అడ్డుకునేందుకే ఒకప్పుడు యూఎన్ ఏర్పాటు జరిగింది. కాని, ఇప్పుడు దాని పరిస్థితి చూస్తుంటే ఆ ఉద్దేశ్యం నెరవేర్చేలా అస్సలు కనిపించటం లేదు... 

గ్రహాంతరవాసులు ఆగ్రహిస్తే... మన గతేంటి?

మీరు హాలీవుడ్ సైన్స్ ఫిక్షన్ సినిమాలు చూస్తారా?చూసేవారైతే మీకు ఏలియన్స్ గురించి ఎంతో కొంత తెలిసే వుంటుంది!ఏలియన్స్ అంటే గ్రహాంతరవాసులు.వారి గురించి పాళ్చాత్యులకి ఎక్కడలేని ఆసక్తి.ఊరికే ఎంటర్టైన్మెంట్ కోసం సినిమాలు తీయటమే కాదు సైంటిపిక్ గా స్టడీ కూడా చేస్తుంటారు!నాసా లాంటి సంస్థల పెద్ద పెద్ద ఆశయాల్లో గ్రహాంతరవాసులతో సంబంధాలు పెట్టుకోవటం ఒకటి... గ్రహాంతరవాసులు నిజంగా వుంటారా?ఖచ్చితంగా వుంటారని ఈ మధ్య ఖగోళ శాస్త్రవేత్తలు చెబుతున్నారు.స్టీఫెన్ హాకింగ్ లాంటి మేధావులు పదే పదే ఏలియన్స్ గురించి ప్రస్తావిస్తున్నారు. ఇందుకు కారణం లేకపోలేదు. ఒకప్పుడు సైన్స్ ఎదుగుతున్న క్రమంలో శాస్త్రవేత్తలు భూమిని దాటి ఆకాశంలోకి తమ చూపు పోనిచ్చారు.అప్పుడు వారికి వున్న ఆవగాహన పరిమితం.సూర్యుడి చుట్టూ వున్న సౌర కుటుంబం గురించే పెద్దగా ఏమీ తెలిసేది కాదు.కాని, గడిచిన వందేళ్లలో పరిస్థితి మొత్తం మారిపోయింది.చంద్రుడిపై కాలుపెట్టడంతో పాటూ అంగారకుడి వైపు దూసుకుపోతున్నాం.అదే సమయంలో నిజంగా మనముంటోన్న విశ్వం ఎంతటి అనంతమైందో మెల్ల మెల్లగా తెలుస్తోంది! శాస్త్రవేత్తలు మొదట మన భూమీ, ఇతర గ్రహాలకు పరిమితం అయినా రాను రాను ఇతర నక్షత్రాలు, వాటి చుట్టూ తిరిగే భూమి వంటి గ్రహాలపై చూపు పెట్టారు.దీని వల్ల గత కొంత కాలంగా సైంటిస్టులందరికీ కలిగిన ఏకాభిప్రాయం ఏంటంటే సృష్టిలో మనిషి మాత్రమే తెలివైన జీవి కాడు.ఇంకా అనేక గ్రహాల్లో అనేకానేక ఇంటలిజెంట్ జాతులు వున్నాయి.వారితో మనకు, మనతో వారికి ప్రస్తుతానికి సంబంధాలు లేవు. అంతే...  విశ్వంలో ఎక్కడో ఓ చోట గ్రహాంతర వాసులు వుంటారని శాస్త్రవేత్తలకు నమ్మకం కలిగాక వాళ్లని కనుక్కొనే దిశగా ప్రయోగాలు మొదలయ్యాయి. అమెరికా లాంటి దేశాలు ఇప్పటికే బలమైన టెలిస్కోపులతో , వ్యోమ నౌకలతో గ్రహాంతరవాసుల్ని గుర్తించే ప్రయత్నాలు చేస్తున్నాయి.ఒకవేళ వాళ్లలో ఎవరైనా మన లాంటి తెలివైనా వారో, లేక మనకంటే ఎక్కువ తెలివైన వారో అయితే మనం వున్నామని పసిగట్టేలా బలమైన కిరణాలు విశ్వంలోకి వెదజల్లుతున్నారు.రకరకాల శక్తివంతమైన రేస్ ని ఇప్పటికే సైంటిస్టులు ఆకాశంలోకి గురి పెట్టి పంపుతున్నారు. ఇవ్వి ఒకవేళ ఎక్కడో వున్న నాగరికులైన గ్రహాంతరవాసులకి తారసపడితే వాళ్లు రీసీవ్ చేసుకుని మనల్ని కాంటాక్ట్ చేస్తారని ఖగోళవేత్తల అభిప్రాయం...  గ్రహాంతరవాసులతో కమ్యూనికేషన్... ఇది పైకి వినటానికి బాగానే వున్నా... చాలా పెద్ద ప్రమాదమని హెచ్చరిస్తున్నాడు స్టీఫెన్ హాకింగ్!బ్లాక్ హోల్స్ గురించి ఎన్నోసంచలన విషయాలు చెప్పిన ఆయన గ్రహాంతరవాసులు బోలెడు మంది వుంటారని అంటున్నాడు. కాకపోతే, వారితో వెనుకా ముందు ఆలోచించకుండా కాంటాక్ట్ చేసే ప్రయత్నం చేస్తే మానవ నాగరికతకే ప్రమాదం రావొచ్చని అభిప్రాయపడుతున్నాడు.గ్రహాంతరవాసులు మనకంటే వైజ్ఞానికంగా ఉన్నతమైన స్థితిలో వుంటే... అంతకుమించి వారు మనతో మంచిగా వుంటారనే గ్యారెంటీ ఏంటి? ఇదీ స్టీఫెన్ హాకింగ్ ప్రశ్న.ఒకప్పుడు ఉత్తర,దక్షిణ అమెరికాల్లోని స్థానికులు ప్రశాంతంగా బతుకుతుంటే యూరోపియన్లు ఆ ప్రాంతానికి వెళ్లారు. ఆ తరువాత అక్కడి స్థానికుల్ని హింసాయుతంగా నిర్మూలించేశారు. అదే గ్రహాంతరవాసుల విషయంలో కూడా జరగొచ్చని స్టీఫెన్ హాకింగ్ అంటున్నాడు.వాళ్లు మనకంటే తెలివైన, బలమైన వాళ్లైతే మనల్ని క్షేమంగా వుండనిస్తారని గ్యారెంటీ లేదంటున్నాడు! స్టీఫెన్ హాకింగ్ చెప్పినట్టు... నిజంగా గ్రహాంతర వాసులు మన మీద దాడులు చేస్తారా చేయరా ఇప్పుడే చెప్పలేం.కాని, ఏలియన్స్ ని కలుసుకోవాలన్న తాపత్రయం మాత్రం ఎప్పటికప్పుడు సరి చూసుకుంటూ వుండాలి. ఎందుకంటే, భూమ్మీద మనలో మనకి కోటి విబేదాలు వుండవచ్చు. కాని, ఎక్కడ్నుంచో వచ్చిన గ్రహాంతర జీవికి మనమంతా ఒకేలా కనిపిస్తాం. మానవ ఆకారంలో వున్న శత్రువులం. కాబట్టి ఏలియన్స్ ని మనల్ని ఏమైనా చేయవచ్చు!సో కేర్ ఫుల్ గా ముందుకు పోవాలన్నమాట!  

వీర హిందుత్వ V/S అరివీర సెక్యులరిజమ్!

ఇల్లు కాలి ఒకడు ఏడుస్తుంటే... మరొకడొచ్చి మంటల్లో ఇంకేదో కాల్చుకున్నాడట!అలాగే వుంది ఇప్పుడు కొందరు రాజకీయ నేతల వ్యవహారం!ఒకవైపు యూరి ఉగ్రదాడి... దాదాపు ఇరవై మంది జవాన్లు అమరులయ్యారు.దేశం మొత్తం కోపంతో రగిలిపోతుంది.పాక్ పై యుద్ధం చేయాల్సిందేనంటోంది.కాని,ఇంత సందడి మధ్యలోనే కొందరు నడేమియాలు తయారయ్యారు!వాళ్లకు కావాల్సిన పొలిటికల్ బిస్కెట్ల కోసం వాళ్లు తమ వంతుగా మొరగటం మొదలు పెట్టారు...  ఈ మధ్య బాలీవుడ్లోకి పాకిస్తానీ కళకారులు రావటం ఎక్కువైంది.వీణా మలిక్ లాంటి ఐటెంగాళ్స్ మొదలు ఫవాద్ ఖాన్ లాంటి హీరోల వరకూ చాలా మందే ఇక్కడికొచ్చి తిష్ఠవేస్తున్నారు.దీని వెనుక రహస్యం ఏంటో మనకు తెలియదుగాని బాలీవుడ్ పిల్మ్ మేకర్స్ కూడా ఈ పాకీ హీరోలు,హీరోయిన్స్,సింగర్లను నెత్తిన పెట్టుకుంటున్నారు.అత్యంత సింపుల్ లాజిక్ అయితే వీళ్ల ద్వారా పాకిస్తాన్లో మన హిందీ సినిమాల్ని అమ్ముకోవచ్చు.పాకిస్తానీ నటులు, సింగర్లు వుంటే ఇంకాస్త ఎక్కువగా చూస్తారు అక్కడి జనం. కాకపోతే,ఎవరూ లేకున్నా మన బాలీవుడ్ స్టార్టకే అక్కడ బోలెడు క్రేజ్ వుంది.అయినా కూడా పాకీల్ని తెచ్చి ఇక్కడ సినిమాల్లో చూపించటం వెనుక మరో వాదన కూడా వుంది. బాలీవుడ్ సినిమాలకు పెద్ద ఎత్తున మాపియా సొమ్ము అక్రమంగా వస్తుంటుందని, అది పాక్ నుంచే వస్తుందని అంటారు.కాబట్టి మాపియా వాళ్లు చెప్పిన పాకిస్తానీ హీరో,హీరోయిన్స్ ని బాలీవుడ్ సినిమాల్లో పెట్టుకోవటం అనివార్యం అవుతోంది.అలా వచ్చిన వారి కోసం ఇక్కడ గొడవలు కూడా ఈ మధ్య  సర్వసాధారణం అయిపోయాయి.కొందరు పాకిస్తాన్ వాళ్లు మనకు వద్దంటే మరికొందరు కావాలంటారు. అమన్ కీ ఆశా లాంటి పిచ్చి పిచ్చి స్లోగన్స్ ఇస్తూ పాకిస్తానీ కళాకారుల్ని నెత్తిన పెట్టుకునే మేధావులు, మీడియా వాళ్లు,బాలీవుడోళ్లు పెద్ద సంఖ్యలోనే వున్నారు.వీళ్లకి వ్యతిరేకంగా రంగంలోకి దిగుతారు వీర జాతీయవాదులు! కొన్నాళ్ల కిందటి దాకా ముంబైలో అరివీర జాతీయ వాదం అంటే శివసేన గుర్తుకు వచ్చేది.పాకిస్తాన్ అంటే ఆగ్రహంతో ఊగిపోయే వారు బాల్ థాక్రే కార్యకర్తలు.క్రికెట్ పిచ్ లు తోడేయటం లాంటి పనులు చేసి దేశభక్తి చాటుకునే వారు.కాని, పెద్దాయన చనిపోయాక శివసేన చల్లబడింది.మంచికో చెడుకోగాని మహరాష్ట్ర నవనిర్మాణ సేన రంగంలోకి దిగింది.ఈ మధ్య ఎవర్ని కొట్టాలన్నా, తన్నాలన్నా రాజ్ థాక్రే వాళ్ల ఎంఎన్ఎస్ వంతే! పాక్ తో యుద్ధం వరకూ పరిస్థితి రావటంతో రాజ్ థాక్రే తన వంతుగా చెలరేగిపోయాడు. రెండు రోజుల్లో బాలీవుడ్లోని పాకిస్తానీ నటులు, టెక్నీషియన్స్ ఇంటికి వెళ్లకపోతే తామే గెంటేస్తామని అన్నాడు!ఇలాంటి మాటలు ఎంఎన్ఎస్ నిజంగా పాకిస్తాన్ పై కోపంతో అంటే సంతోషించవచ్చు.కాని,ఇది ఆ పార్టీ రెగ్యులర్ వ్యూహం. వయోలెంట్ గా హెచ్చరికలు చేయటం, దాడులు చేయటం వారికి అలవాటైపోయింది. దీర్ఘకాలంలో వాళ్లు దేశం కోసం చేస్తున్నది ఏమీ లేదు. ఊరికే భయానక పరిస్థితులు సృష్టించి మరో వర్గానికి కావాల్సినంత పని కల్పిస్తారు! శివసేన,ఎంఎన్ఎస్ లాంటి అతి వాద హిందూ సంస్థలకి బద్ధ వ్యతిరేకం సమాజ్ వాది పార్టీ, ఎంఐఎం, ఆర్జేడీ, జనతాదళ్ లాంటి సెక్యులర్ ముఠాలు. వీరు ముస్లిమ్ ల కోసమే బతికి వున్నట్టు కలరింగ్ ఇస్తూ రచ్చ చేస్తుంటారు.ఇండియన్ ముస్లిమ్ ల గురించే కాదు పాకిస్తాన్ గురించి ఏమన్నా వీరికే పొడుచుకు వస్తుంది. తాజాగా రాజ్ థాక్రే పాకిస్తానీ కళాకారుల్ని టార్గెట్ చేస్తే సమాజ్ వాది అధినేత ములాయం కోపంతో ఊగిపోయాడు.ఎంఎన్ఎస్ అధినేత కళాకారుల్ని పాక్ కు పంపేయటం కాదు ఆ దేశానికి మానవ బాంబుల్ని పంపాలి అని స్టేట్మెంట్ ఇచ్చాడు. ఒక ప్రజాస్వామ్య పార్టీకి అధ్యక్షుడు అయి వుండి ఆయన అలా మాట్లాడటం సబబా? అడిగే వాడే లేడు!  ఒకవైపు వీర హిందూత్వ వినిపించే పార్టీలు , మరో వైపు మైనార్టీల కోసమే బతికే అరివీర పార్టీలు... ఈ రెండూ వీలున్నప్పుడల్లా రచ్చ చేస్తూనే వున్నాయి. ఈ గొడవల వల్ల దేశానికి లాభం లేకపోగా హిందూ, ముస్లిమ్ ల మధ్య దూరం మరింత పెరిగే అవకాశం వుంది.అంతకంటే మించి అంతర్జాతీయ సమాజం ముందు భారత్ పరువు పోయే ప్రమాదం ఖచ్చితంగా వుంది!  

కూర్చునే కుర్చీలే... సమాధులైపోతున్నాయి!

కుర్చీకి అతుక్కుపోవటం ఒకప్పుడు రాజకీయ నేతలకే పరిమితం అయ్యేది! అధికారం పోతుందన్న భయంతో వాళ్లు కుర్చుని వదిలేవారు కాదు! ఇప్పుడూ పొలిటీషన్స్ అలానే వున్నారు! వాళ్ల కుర్చీ వ్యామోహం ఏ మాత్రం తగ్గలేదు! కాని, బాధాకరమైన విషయం ఏంటంటే... కుర్చీ బలహీనత ఇప్పుడు సామాన్య జనానికి కూడా ఎక్కువైపోయింది! ఎంతగా అంటే .. అది ప్రాణాంతకంగా  మారిపోయింది!. కుర్చీ ఎందుకు కావాలి? కూర్చోటానికి! అవును... కూర్చోటమే ఇప్పుడు కొంపలు ముంచుతోంది! కూర్చుంటే చచ్చిపోతున్నారని చెబుతున్నాయి తాజా సర్వేలు! ఇది వినటానికి నమ్మశక్యంగా లేకున్నా పచ్చి నిజం!  ఆధునిక జీవన శైలిలో మనిషి కూర్చోవటం ఎక్కువైంది. ఒకప్పుడు మనిషి లేచింది మొదలు పడుకునే దాకా అన్ని పనులు తిరిగి చేసుకునేవాడు. ఇప్పుడు స్మార్ట్ ఫోన్ ల కాలంలో ప్రతీ పనీ కుర్చీలోనే చేసేస్తున్నాడు! ఒక్క క్లిక్ తో తినటానికి తిండి కూడా టేబుల్ ముందుకు వచ్చేస్తోంది! అంటే , కనీసం హోటల్ కి వెళ్లే శారీరిక శ్రమ కూడా వుండటం లేదన్నమాట! వంట వండుకుని తినటం సంగతైతే దేవుడికే ఎరుక!  తినటమే కాదు మొత్తం అన్ని పనులు కుర్చీలకే అత్తుకుని చేసేస్తున్నారు ఈ ఆధునిక కాలం కంప్యూటర్ మానవులు. ఫలితంగానే సృష్టిలోని ఏ జీవికి లేని ఒబెసిటీ ప్రాబ్లం మనిషికి వచ్చేసింది! దాంతో పాటూ బోలెడన్ని శారీరిక , మానసిక సమస్యలు కూడా వచ్చిపడుతన్నాయి. ఇప్పుడు అన్నిటికంటే మించి ఆందోళన పరిచే సత్యాలు బయటకొచ్చాయి ఓ సర్వేలో.. స్పెయిన్ లో ఓ యూనివర్సిటి వాళ్లు చేసిన పరిశోధనలో ఎక్కువగా కూర్చునే వారు తొందరగా చనిపోయే ప్రమాదం ఎక్కువగా వుందని తేలింది. ఊరికే కూర్చుంటే చనిపోతారని అర్థం కాకపోయినప్పటికీ కూర్చుంటే అనేక సమస్యలు వచ్చి చావుకి దగ్గరవుతారని భావం! 54దేశాల్లో 2002 నుంచి 2011 వరకూ జరిపిన పరిశోధనల్లో దాదాపు 60 శాతం మంది రోజుకు మూడు గంటల కంటే ఎక్కువ సేపు కూర్చుంటున్నారని తేలింది! అంతే కాదు, ప్రతీ సంవత్సరం చనిపోతున్న వారిలో 3.8శాతం మంది కదలకుండా కూర్చునే మరణిస్తున్నారట! ప్రపంచం మొత్తం మీద ఈ కుర్చీ చావులు ఎక్కువ అవుతూనే వున్నా లెబనాన్ లో మరీ ఎక్కువగా వున్నాయట. మెక్సికోలో మరీ తక్కువగా వున్నాయి. మన దేశం సంగతి రీసర్చర్స్  పట్టించుకున్నట్టు లేదు! కాకపోతే ఇండియాలోనూ ఉబకాయం సర్వసాధారణం అయిపోయింది. అందుక్కారణం కుర్చీలకు అతుక్కుపోవటమే! చేసే ఉద్యోగాల వల్లో, అందుబాటులోకి వచ్చిన సౌకర్యాల వల్లో ఆధునిక మానవుడు అవసరానికి మించి రెస్ట్ తీసుకుంటున్నాడు! దాని ఫలితంగానే ఆనారోగ్యంతో అరెస్ట్ అవుతున్నాడు! కాబట్టి కులాసాగా వుండాలంటే తక్షణ కర్తవ్యం.. కుర్చీల్ని వదిలి కుందేళ్లలా పరుగులు తీయటమే!