హృదయం గురించి... మనసు పెట్టి ఆలోచించాల్సిందే!
posted on Sep 29, 2016 @ 2:26PM
సెప్టెంబర్ 29... వాల్డ్ హార్డ్ డే! అంటే... ఇదేదో ప్రేమకు, రొమాన్స్ కు సంబంధించింది అనుకోకండి! ప్రపంచ గుండె దినం అంటే మానవ హృదయంపై అవగాహన కలిగించేందుకు ఉద్దేశించిన రోజు! నిజానికి గుండెను జాగ్రత్తగా చూసుకోకుంటే ఏ రోజు కూడా మనది కాదు. ప్రతీ ఒక్క రోజూ చక్కగా గడవాలంటే గుండె బలంగా, భద్రంగా వుండాల్సిందే! కాని, జరుగుతున్నది మాత్రం అంతా వ్యతిరేకమే..
భారతదేశం వేగంగా అభివృద్ధి చెందటం ఆనందకరమే అయినా ఆ అభివృద్ధికి మనం చెల్లిస్తున్న మూల్యం గుండెలు గుభేలుమనిపిస్తుంది! మారుతున్న జీవనశైలి, తినే ఆహారపు అలవాట్లు, పెరిగిపోతున్న ఒత్తిళ్లు...ఇవన్నీ కలిసి గుండెను పిండేస్తున్నాయి! మరీ ముఖ్యంగా, హృదయ సంబంధమైన రోగాలు సిటీల్లో విపరీతంగా పెరిగిపోతున్నాయి. మొత్తం ప్రపంచం అంతా ఇదే ట్రెండ్ కొనసాగుతోంది. అయితే, భారత్ లాంటి అభివృద్ధి చెందుతున్న దేశాల్లో తీవ్రత మరింత ఎక్కువగా వుంది. 25 నుంచి 40 ఏళ్ల లోపు యువత నగరాల్లో భారీగా గుండెపోట్ల బారీన పడుతున్నారు...
గుండె జబ్బు అనగానే హార్ట్ ఎటాక్ మాత్రమే కాదు. ఇంకా అనేక రకాలుంటాయి. వాటిల్లో ఇండియాలో ప్రబలుతున్న ప్రధాన రోగం కొరోనరీ ఆర్టరీ డిజీస్. షార్ట్ గా క్యాడ్ అనే రకం గుండె జబ్బు వల్ల మనిషి త్వరగా చనిపోయే ప్రమాదం వుంది. ఒక్కోసారి హఠాత్తుగా గుండె ఆగిపోయి మరణిస్తున్నారు కూడా. అసలు క్యాడ్ అంటే గుండెకు రక్తం తీసుకువచ్చే నాళాలు క్రమ క్రమంగా మూసుకుపోవటం. దీనికి కారణం ఆధునిక కాలంలో పెరిగిపోతున్న కాలుష్యాలు, ఆహారంలో వచ్చిన హానికరమైన మార్పులు, ఒంట్లో బ్యాడ్ కొలెస్ట్రాల్ పెరిగిపోవటం మొదలైనవన్నీ. వీటితో పాటూ నగరాల్లో శారీరిక శ్రమ అంతకంతకూ తగ్గిపోతోంది. ఇందుకు కారణం మారిపోయిన లైఫ్ స్టైలే. ఉద్యోగాల్లో, ఇంట్లో ప్రతీ చోటా మనిషి కూర్చునే వుంటున్నాడు. శారీరిక శ్రమ మరీ తక్కువైపోయింది. అలాగే, రకరకాల ప్రాసెస్ట్ ఫుడ్, ఫాస్ట్ ఫుడ్ ల వల్ల ఒంట్లో కొవ్వు పెరిగిపోతోంది. బ్లడ్ పెషర్, డయాబెటిస్ లాంటివి కూడా ముదురుతున్నాయి. అన్నీ కలిసి మనిషి ఉనికికే మూలమైన గుండెపై దాడి చేస్తున్నాయి.
నగరాల్లో ఎప్పటికప్పుడు హృద్రోగుల సంఖ్య పెరిగిపోతున్నా గ్రామాల్లోనూ ఏమంత ఆశాజనకంగా లేదు. అక్కడ కూడా కాలుష్యాలు, శారిరిక శ్రమ తగ్గటం లాంటివి దుష్ప్రభావం చూపుతున్నాయి. గుండెకు రక్తాన్ని మోసుకెళ్లే నాళాలు హానికరమైన కొవ్వుతో బరువెక్కటం, మూసుకుపోవటం వల్ల రక్త ప్రసరణ దెబ్బతింటుంది. ఫలితంగా గుండెకు ఆక్సిజన్ సరిగ్గా అందక హార్ట్ ఎటాక్స్ కు దారితీస్తోంది. ఈ కారణంగానే ఎప్పడూ లేని విధంగా ఈ మధ్య యువత గుండె పోట్లకు గురవుతోంది. ఒకప్పుడు హృద్రోగాలు కేవలం ముసలివారికి పరిమితం అయ్యేవి. ఇప్పుడు అన్ని వయస్సుల వారు గుండెలు అరిచేతిలో పెట్టుకునే బతకాల్సి వస్తోంది.
ప్రపంచ గుండె దినం సందర్భంగా నిపుణులు చెబుతున్నది ఏమిటంటే... హానికరమైన ఆహారం తినకపోవటం, శారీరిక శ్రమ చేయటం, ఒత్తిడి లేకుండా వుండటం వంటివన్నీ అర్జెంట్ గా చేయాలి. అప్పుడే గుండె భద్రంగా వుండేది! మరోలా చెప్పాలంటే... ఆధునిక జీవనశైలికి సాధ్యమైనంత దూరంగా వుంటూ సహజంగా బ్రతకాలి! అదే హృదయానికి శ్రీరామ రక్ష!