వేళ్ల అంచుల్లో కొత్త వ్యసనం...విషాదమే పర్యవసానం...

  ఫేస్బుక్,ట్విట్టర్,వాట్సప్,ఇన్ స్టాగ్రామ్ వగైరా వగైరా...ఇవి లేకుండా ప్రపంచాన్ని ఇప్పుడు మనం ఊహించలేం.పొద్దున్న లేస్తే వాష్ రూంలోకి వెళ్లి వచ్చిన విషయం మొదలు గుడ్ నైట్ చెప్పేసి...ఇక పండుకుంటున్నా...అనేంత వరకూ అన్నీ సోషల్ మీడియాలో షేర్ చేసుకోవటం చాలా మందికి మామూలైపోయింది.ఒకవేళ ఏ కారణంతోనైనా సోషల్ నెట్ వర్కింగ్ సైట్లన్నీ వారం రోజులు అందుబాటులో లేకపోతే ఎంత మందికి పిచ్చేక్కేస్తుందో! మందు,సిగరెట్,గుట్కా లాంటి వ్యసనంగా మారిపోయింది ఇంటర్నెట్ కూడా.మరీ ముఖ్యంగా సోషల్ మీడియాలో టైంపాస్ చేయటం కోట్ల మందికి దురలవాటుగా మారిపోయింది.దీని వల్ల విలువైన సమయం వృథా కావటమే కాదు ఇంకా అనేక నష్టాలు నెత్తిన పడుతున్నాయి.అసలు సోషల్ మీడియా పిచ్చితో ప్రాణాలే పోతున్నాయంటే ఎవరైనా షాకవుతారు.కాని,ఇది ఇప్పుడొక ఆధునిక నిజం.  పూణేలో ఓ ఎంబీఏ గ్రాడ్యుయేట్ తన భార్యని గొంతు నులిమి చంపేశాడు.తరువాత తాను కూడా ఉరేసుకుని ప్రాణం తీసుకున్నాడు.కారణం ఫేస్బుక్కే!అందులో తన భార్య విపరీతంగా పర్సనల్ విషయాలు పంచుకుంటోందని అతడి ఫ్రస్ట్రేషన్.బహుశా చాలా సార్లు ఆ విషయం ఆమెకు చెప్పి కూడా వుండవచ్చు.అయినా 28ఏళ్ల ఆ మాజీ ఐటీ ఎంప్లాయి వినలేదు.సోషల్ మీడియాలో తమ వ్యక్తిగత విషయాలు విచ్చలవిడిగా బయటపెట్టింది.ఉన్మాదానికి,ఆవేశానికి లోనైన 34ఏళ్ల భర్తకి హత్య,ఆత్మహత్య తప్ప మార్గం కనిపించలేదు! భార్య చేసిన పొరపాటుకి ఆ భర్త విధించిన శిక్ష అస్సలు సమర్థనీయం కాదు.కాని,తాను కూడా ప్రాణం తీసుకున్న అతనిపై పడ్డ ఒత్తిడి గురించి మనం ఆలోచించాలి.సొషల్ మీడియా వినియోగం హద్దులు దాటితే జీవితాలు ఎలా ఛిద్రం అవుతాయో గ్రహించాలి.ఫేస్బుక్,ట్విట్టర్ లాంటివన్నీ మాయా,భ్రమ.అక్కడి మనుషులు,మాటలు,భావాలు ఏవీ నిజం కాదు.ఇంటిలో వున్నట్టుగా ఇంటర్నెట్లో జనం వుండరు.అందంగా వుంటారు.తియ్యగా మాట్లాడతారు.కాని,ఆ నటన వెనుక హిపోక్రసీ దాగుంటుంది.అది అర్థం చేసుకోకుండా సోషల్ మీడియా కోసం ఫ్యామిలీని,రియల్ ఫ్రెండ్స్ ని దూరం చేసుకోవద్దు.కాని,ఇప్పుడు చాలా మంది గంటల తరబడి కంప్యూటర్లు,స్మార్ట్ ఫోన్లకు హతుక్కుపోయి అదే చేస్తున్నారు... ప్రకృతిలో సహజంగా వచ్చే అన్నమే తక్కువగా తింటే ఆకలేస్తుంది!ఎక్కువగా తింటే ఆయాసం కలుగుతుంది!ఇక కృత్రిమమైన సోషల్ మీడియా లాంటి ఆకర్షణలకి లోనైతే చెప్పేదేముంది?వాట్ని వాడకపోతే మనం వెనకబడిపోతాం.ఎక్కువగా వాడితే పాడుబడిపోతాం.అందుకే,నెట్ వర్కింగ్ సైట్స్ ని మనం మన అవసరం మేరకే వాడుకోవాలి.వాటికి ఆవల వున్న నిజమైన ప్రపంచాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ పణంగా పెట్టకూడదు...  

ఫేస్బుక్ రౌడీలు.. ట్విట్టర్ గూండాలు!

  రౌడీలు, గూండాలు అంటే మనకు ఒక ఊహ వుంటుంది. వారు భారీ ఆకారాలతో, భీకరమైన పనులతో, వెంట ఓ ముఠాని వేసుకుని తిరుగుతూ వుంటారని అనుకుంటాం. ఇంత కాలం అదే నిజం కూడా. కాని, సోషల్ మీడియా శకం మొదలయ్యాక రౌడీ, గూండా అనే మాటలకు అర్థాలు మారిపోయాయి! ఈ సోషల్ మీడియా గూండాలు, రౌడీలు, పోరంబోకులు కళ్లకు కనిపించరు. వినిపించరు. కేవలం ఫేస్బుక్, ట్విట్టర్ లాంటి సైట్లలో కామెంట్లు పెడుతూ, ఇబ్బంది పెడుతూ, బెంబేలెత్తిస్తుంటారు. వీళ్లు ఈ మతం ఆ మతం అని కాదు... అన్ని మతాల వారూ వుంటుంటారు! కొన్ని మతాల్లోని ఛాందసవాదులు మరింత ఎక్కువ దాదాగిరి, గూండాగిరి చేసేస్తుంటారు. ఎంతగా అంటే సెలబ్రిటీలు సైతం వీళ్ల బారినపడి అల్లాడిపోవాల్సిందే. బెదిరిపోవాల్సిందే.   ఇంటర్నెట్ దౌర్జన్యానికి తాజా ఉదాహరణ దంగల్ చిత్రంలో నటించిన బాలనటి జయిరా వాసిమ్ ఉదంతమే. ఆమెకి జస్ట్ పదహారేళ్లు. దంగల్ చిత్రంలో ఆమీర్ కూతురిగా నటించింది. గీతా ఫోగట్ అనే రెస్లర్ చిన్న నాటి పాత్రలో జయిరా కనిపించింది. ఆ పాత్రకి బాగా పేరు రావటంతో ఆమె జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీని గౌరవపూర్వకంగా కలిసింది. జయిరాది కాశ్మీరే. అయితే, దంగల్ లాంటి చిత్రంలో గొప్ప పాత్ర చేసినందుకు కాశ్మీర్ సీఎం జయిరాను మెచ్చుకుంది. ట్విట్టర్ లో తాను ఎంతో మందికి రోల్ మోడల్ అని కీర్తించింది. అది నిజం కూడా!   తన స్వంత రాష్ట్ర ముఖ్యమంత్రి బాగా పొగిడితే ఎవరికి మాత్రం ఆనందం కలగదు? కాని, జయిరా మాత్రం మెహబూబాను కలిసిన కొన్ని రోజులకి ఓ పెద్ద క్షమాపణ లేఖ షేస్బుక్ లో పోస్ట్ చేసింది. తాను కొందరిని కలిసి తప్పు చేశానని, తాను ఎవరికీ రోల్ మోడల్ కాననీ, ఇంకా చాలా మంది గొప్పవారు వున్నారని జయిరా చెప్పుకొచ్చింది. తనని క్షమించమని వేడుకొంది. ఇదంతా ఎందుకు చేయాల్సి వచ్చింది? మనం ఇందాకా మాట్లాడుకున్న ఇంటర్నెట్ రౌడీ మూకల వల్ల! జయిరా దంగల్ లో నటించటం, మెహబూబాను కలుసుకోవటం కాశ్మీర్ లోని వేర్పాటువాదులకి నచ్చలేదు. వాళ్ల తమ ఛాందసవాదం అంతా బయటకి తీసి పదహారేళ్ల జయిరాపై సోషల్ మీడియాలో విషంగక్కారు. కామెంట్సు, బెదిరింపులు, బూతులతో బిక్కచచ్చిపోయేలా చేశారు. దాని ఫలితమే జయిరా వాసిమ్ క్షమాపణ లేఖ. అయితే, ఆమె సారీ చెబుతూ పెట్టిన పోస్ట్ కొంత సేపటికే డిలీట్ చేసేసింది. తరువాత ఈ గొడవని ఇక్కడితో వదిలేయండని మనవి చేసింది!   దంగల్ లో నటించి పాప్యులర్ అయిన బాలనటి సోషల్ మీడియాలో దాడి ఎదుర్కోవడం ఆమీర్ సహించలేదు. తాను అండగా వుంటానని చెప్పాడు. జయిరా తప్పు చేయలేదని, తనకు కూడా ఆమె రోల్ మోడల్ అని చెప్పాడు. కాని, ఆశ్చర్యకరంగా మిష్టర్ పర్ఫెక్షనిస్ట్ ఆమీర్... సోషల్ మీడియాలో జయిరాను భయపెట్టిన ఛాందసవాదుల్ని మాత్రం పల్లెత్తు మాటనలేదు. ఆమీర్ బాటలోనే ఇప్పుడు చాలా మంది ప్రముఖులు జయిరాకి జైకొడుతున్నారు కాని అసలు రౌడీల్ని, గూండాల్ని మాత్రం విమర్శించలేకపోతున్నారు!   జయిరా వాసిమ్ మాత్రమే కాదు ఈ మధ్య కాలంలో సోషల్ మీడియా వేదికగా క్రికెటర్ మహ్మద్ షమీ కూడా హీట్ ఎదుర్కొన్నాడు. ఆయన భార్యతో దిగిన ఫోటో షేర్ చేస్తే ఛాందసవాద నెటిజన్లు తిట్టిపోశారు. బురఖా లేకుండా గ్లామరస్ దుస్తులు ఆమె వేసుకున్నందుకు ఆగ్రహఃతో ఊగిపోయారు. ఇక మరో క్రికెటర్ మహ్మద్ కైఫ్ సూర్య నమస్కారాలు చేస్తూ ఫోటోలు పెట్టాడు. వాట్ని కూడా సోషల్ మీడియా అరాచకులు వదల్లేదు. కైఫ్ ని రోజుల తరబడి వెంటాడారు.ఇంటర్నెట్ లో తమకు నచ్చని వార్ని వేధించటం కేవలం ముస్లిమ్ ఛాందసవాదులే చేస్తారనుకోలేం. మిగతా మతాల వాళ్లు కూడా ఇలాంటి దాడికి దిగుతుంటారు. కాకపోతే, చేసింది ఎవరైనా ఈ ఆధునిక రౌడీయిజం వ్యక్తిగత స్వేచ్ఛకు తీవ్రంగా భంగం కలిగిస్తోంది. అందరూ దీనిపై పోరాడాల్సిన అవసరం వుంది.

మీడియా 4త్ ఎస్టేట్... సోషల్ మీడియా 5త్ ఎస్టేట్!

ప్రభుత్వం, చట్ట సభలు, న్యాయ వ్యవస్థ, అధికార గణం... ఇవన్నీ  దేశం చక్కగ నడవటానికి మూల కారణాలు. అయితే, వీటికి ఎప్పుడూ తోడుగా వుంటూ వస్తోంది మీడియా. ఒకప్పుడు పత్రికలు, తరువాత ఛానల్స్, ఇంకా తరువాత వెబ్ మీడియా ఎప్పటికప్పుడు తమ సత్తా చాటుతూనే వున్నాయి. కాని,ఇప్పుడు ఫోర్ట్ ఎస్టేట్ అయిన మీడియాకి తోడుగా, జోడుగా ఫిఫ్త్ ఎస్టేట్ తయారైంది! అదే సోషల్ మీడియా!   ఆ మధ్య ఈజీప్ట్ లో తమ నియంతకి వ్యతిరేకంగా జోరుగా నిరసనలు జరిగాయి. తరువాత అనేక దేశాల్లో అమాంతం ఉద్యమాలు చోటు చేసుకున్నాయి. అమెరికాలో వాల్ స్ట్రీట్ మొదలు మన ఢిల్లీ వీధుల్లో నిర్భయ నిరసనల దాకా ప్రపంచం అంతా అట్టుడికింది. వీటికంతటికీ సోషల్ మీడియానే కారణం అనేది ఒక వాదన! పైకి ఎవరికి వారు సరదాగానో, కాలక్షేపంగానో ఫేస్బుక్ , ట్విట్టర్ లలో తచ్చాడుతున్నట్టు కనిపిస్తున్నా సోషల్ మీడియా ఇప్పుడు మనిషి జీవితంలో అతి కీలకం అయిపోయింది. దాని ప్రభావం మనకు తెలియకుండానే మనపై తిరుగులేనంత పడుతోంది. ఇంతకు ముందులా ఇప్పుడు ఉద్యమాలు ఎవరి వల్ల వస్తాయి, ఎటు నుంచీ మొదలవుతాయి అని అర్థం కావటం లేదు. అసలు ఒక్కోసారి కొన్ని చారిత్రక ఉద్యమాలు కూడా ఎవ్వరూ ప్రత్యేకంగా పిలుపునివ్వకుండానే మొదలైపోతున్నాయి. మొత్తం వ్యవస్థని స్థంభింపజేసే వరకూ వెళుతున్నాయి.   ప్రస్తుతం చెన్నై మెరీనా బీచ్ లో జల్లికట్టు కోసం జనం మొండిపట్టుతో కూర్చున్నారు. దీనికి ఎవరు పిలుపునిచ్చారు? అన్నాడీఎంకే అధికారంలో వుంది కాబట్టి ప్రతిపక్ష డీఎంకే జనాల్ని రోడ్లపైకి రమ్మన్నదా? అలాంటిదేం జరగలేదు! రజినీకాంత్,కమల్ హసన్ లాంటి సెలబ్రిటీలు జల్లికట్టుకు తమ మద్దతు తెలిపారు. నిషేధం తప్పన్నారు. అయినా వారు కూడా ఎవ్వర్నీ మెరీనా బీచ్ కి రమ్మని చెప్పలేదు. కాని, రాత్రికి రాత్రి మెరీనా బీచ్ లో సముద్రంతో పోటీపడేలా జన  సముద్రం ఉప్పొంగింది! అదీ కాక ఇక్కడ మనం గుర్తించాల్సిన మరో విషయం వుంది.   వచ్చిన వారిలో అధిక భాగం స్మార్ట్ ఫోన్లు వాడే ప్రజెంట్ జెనరేషనే! సోషల్ మీడియాలో యాక్టివ్ గా వుండే యూత్, స్టూడెంట్స్, ఎంప్లాయిస్ వరదలా వచ్చేశారు. వీర్ని ఏకం చేసింది నిస్సందేహంగా సోషల్ మీడియానే! కేవలం కొన్ని గంటల వ్యవధిలో ఫేస్బుక్ స్టేటస్ లు, ట్విట్టర్ పోస్టులు అసాధ్యం సుసాధ్యం చేశాయి. ఎన్నికల ర్యాలీలకు కోట్లు కుమ్మరించినా రాని జనం క్షణాల్లో జల్లికట్టు కోసం వాలిపోయారు! ఒక్కసారి మనం జాగ్రత్తగా గమనిస్తే ఆ మధ్య జరిగిన నిర్భయ నిరసనల్లో కూడా సోషల్ మీడియా యూజర్సే ఎక్కువగా కనిపించారు. పైగా ఢిల్లీ కావటంతో నెటిజన్స్ నడివీధుల్లోకి అవలీలగా వచ్చేశారు. కొన్ని రోజుల పాటూ కేంద్రాన్ని కల్లోల పరిచారు. చాప కింద సునామీలా ఉప్పొంగుతున్నా సోషల్ మీడియా సత్తా అది!   సెల్ఫీలు తీసుకుని తమ టైం లైన్ పై పెట్టి లైక్ లు, కామెంట్స్ కోరుకునే యూజర్సే సోషల్ మీడియాలో చాలా మంది కనిపించవచ్చు. కాని, పైకి ప్రశాంతంగా కనిపించే సరస్సులా వున్నా లోలోపల బడబాగ్నితో రగిలిపోయే సముద్రం లాంటిది సోషల్ మీడియా. దాని వల్ల జల్లికట్టు ఉద్యమాల లాంటి శాంతియుత పరిణామాలు రావచ్చు... లేదంటే కాశ్మీర్ అల్లర్ల మాదిరి హింసాత్మక ధోరణులు కూడా చోటు చేసుకోవచ్చు. అందుకే, ప్రభుత్వాలు, జనం సోషల్ మీడియాను జాగ్రత్తగా ఉపయోగించుకోవాలి. అది రెండు వైపుల పదునున్న కత్తిలా మారిపోయిందిప్పుడు!

నాటోకి టాటా అంటున్న ట్రంప్!

  అమెరికాలో ట్రంప్ టైమ్స్ మొదలవన్నున్నాయి.మరి కొద్ది గంటల్లో డొనాల్డ్ ట్రంప్ వైట్ హౌజ్ లో కాలుమోపుతాడు.ఇది అమెరికా అంతరంగిక వ్యవహారం అని కొట్టిపారేయటానికి అస్సలు వీలు లేదు.ప్రపంచంలోని ఇతర దేశాల అధ్యక్షులు,ప్రధానులు,రాజులు అధికారం చేపట్టినట్టు కాదు అమెరికన్ ప్రెసెడింట్ మారటం అంటే.అది భూగోళంపై పెను ప్రభావం చూపే అత్యంత కీలకమైన పరిణామం.పైగా ఈసారి ట్రంప్ లాంటి టెంపర్ వున్న ప్రెసిడెంట్ ని అమెరికన్స్ ఎంచుకోవటం మరింత ఆసక్తి,ఆందోళన కలిగిస్తోంది! నథింగ్ అనుకున్న ట్రంప్ మెల్లెమెల్లగా సమ్ థింగ్ అయ్యాడు.ఎన్నికల్లో గెలిచి ఎనీథింగ్ అనిపించుకున్నాడు.ఇప్పుడు అధికారికంగా అధ్యక్షుడు అవ్వనున్న సమయంలో ఎవ్రీథింగ్ అన్నట్టు వ్యవహరిస్తున్నాడు.ఆయనొస్తే ఏదో కొన్ని ఉద్యోగాలు పోతాయిలే అనుకున్న వారు ఇప్పుడు అవాక్కయ్యే నిర్ణయాలు తీసుకుంటున్నాడు.దిమ్మతిరిగిపోయే కామెంట్స్ చేస్తున్నాడు.నిన్న మొన్నటి వరకూ ట్రంప్ అంటే మెక్సికో లాంటి దేశాలు మండిపడేవి.కారణం ఆయన అక్కడి నుంచి వలస వస్తోన్న జనాన్ని టార్గెట్ చేయటమే.మెక్సికో వలస జనాలను రాకుండానైతే,ఏకంగా గోడ కడతానని చెబుతున్నాడు ట్రంప్!కాని,ఆయన ఎక్స్ పరిమెంట్స్ అక్కడితో ఆగటం లేదు. బ్రిటన్, ఫ్రాన్స్, ఇటలీ లాంటి దేశాలకు కూడా మంట పుట్టిస్తున్నాయి...  అమెరికాలోని కంపెనీలు అమెరికన్స్ కే ముందుగా ఉద్యోగాలు ఇవ్వాలని బెదిరిస్తోన్న ట్రంప్ మిలటరీ విషయాల్లో కూడా దూకుడుగా వెళుతున్నాడు. ఒకప్పుడు అమెరికానే చొరవ చూపి సృస్టించిన నాటో ఇప్పుడు దండగ అనేస్తున్నాడు!నాటో అంటే యూరప్,అమెరికా ఖండాల్లోని వివిధ దేశాల సైనిక కూటమి.ఇరాక్,అఫ్గనిస్తాన్,సిరియా లాంటి అనేక దేశాలపై నాటో సేనలు దాడులు చేశాయి ఈ మధ్య కాలంలో.ఇలా చాలా సార్లు నాటో అమెరికా ఉద్దేశాలకు ఉపయోగపడుతూ వచ్చింది.కాని,ట్రంప్ ఎన్నికల ముందు నుంచే నాటోపై పెదవి విరుస్తున్నాడు.నాటో నిర్వహణ కోసం ఖర్చయ్యే వేల కోట్ల డాలర్లు కేవలం అమెరికానే భరిస్తోందని ఆయన వాదిస్తున్నాడు.మిగతా దేశాలు తక్కువ ఖర్చుతో సైనికంగా లాభాలు, రక్షణ పొందుతున్నాయని ట్రంప్ కంప్లైంట్! నాటో గురించి డొనాల్డ్ ట్రంప్ చేస్తున్న వాదన నిజమే.నాటో కోసం ఎక్కువగా ఖర్చు చేసేది అమెరికానే.కాని,ఇప్పుడు దాన్ని దండగ అంటూ ఒకవేళ అమెరికా అమాంతం పక్కకు తప్పుకుంటే మిగతా దేశాలకు పెద్ద షాకే తగులుతుంది.కెనడా లాంటి దేశాలు ఇప్పటికిప్పుడు తమ రక్షణ బడ్జెట్ ను భారీగా పెంచుకోవాల్సి వస్తోంది.ఇటలీ,జర్మనీ,ఫ్రాన్స్ లాంటి యూరప్ దేశాలు కూడా తమ సేఫ్టీ తాము చూసుకోవాల్సి వస్తుంది.అన్నిటికంటే ముఖ్యంగా,ట్రంప్ నాటో నుంచి వైదొలగాలని నిర్ణయిస్తే అది రష్యాకి పెద్ద లాభం.ఇదే ఇప్పుడు చాలా మందిని ఆందోళన పరుస్తోన్న అంశం... రెండవ ప్రపంచ యుద్ధం తరువాత నాటో ఏర్పాటుకు అసలు కారణం సోవియట్ రష్యా.దాన్ని అడ్డుకునేందుకే అమెరికా అనేక దేశాల మద్దతుతో నాటోను సృష్టించింది.కమ్యూనిస్ట్ రష్యాను విజయవంతంగా అడ్డుకుంది.కాని,ఇప్పడు కాలిక్యులేషన్స్ అన్నీ మారిపోయాయి.ట్రంప్ కు రష్యా అధ్యక్షుడు పుతిన్ చాలా క్లోజ్.అందుకే,డొనాల్డ్ గత అమెరికన్ ప్రెసిడెంట్ల మాదిరిగా కాకుండా రష్యా అంటే కొత్త ప్రేమ ప్రదర్శిస్తున్నాడు.సిరియా విషయంలో రష్యా జోక్యం చేసుకున్నందుకు విధించిన ఆంక్షలు కూడా అవసరం లేదంటూ వ్యాఖ్యలు చేస్తున్నాడు.ట్రంప్ ప్రదర్శిస్తోన్న ఈ రష్యన్ లవ్ ఎవ్వరికీ ఓ పట్టాన అంతు పట్టడం లేదు... ట్రంప్ తాను అనుకున్న విధంగా నాటో నుంచి అగ్ర రాజ్యాన్ని తప్పిస్తే ప్రపంచ సైనిక సమీకరణల్లో పెను మార్పు గ్యారెంటీ.రష్యా ఇప్పటి కంటే ఇంకా దూకుడుగా తన కండ బలం ప్రదర్శించే చాన్స్ వుంది.ఇంతకాలం పెద్దన్న అమెరికాను నమ్ముకుని నిశ్చింతగా వున్న వివిధ నాటో దేశాలు ఇకపై జాగ్రత్తగా తమని తాము కాపాడుకుంటూ ముందుకు సాగాలి.అదే సమయంలో ప్రపంచ వ్యాప్తంగా ఇంత కాలం కొనసాగుతూ వస్తోన్న అమెరికా సైనిక ఆధిపత్యానికి గండి పడే అవకాశం వుంది!

చిరంజీవికి రాజకీయంగా ఏమైనా ఉపయోగపడుతుందా?

సినిమాల్లో మెగాస్టార్... లైం లైట్ లో ఉన్నన్ని రోజులు తిరుగు లేని రారాజు... కానీ, రాజకీయాలు వచ్చేసరికి తన సత్తా చాటలేకపోయాడు చిరంజీవి. ఎంతో ఘనంగా ప్రారంభించిన సొంత పార్టీ ప్రజా రాజ్యం 2009 ఎన్నికల్లో బొక్క బోర్లా పడడంతో, దాన్ని కాస్తా తీసుకెళ్లి కాంగ్రెస్ లో కలిపాడు. ఈ విషయంలో పార్టీ కార్యకర్తలు, మరియు సొంత తమ్ముడు పవన్ కళ్యాణ్ నుండే వ్యతిరేకత వచ్చింది. ఇవేవి పట్టించుకోకుండా తనకి తోచింది లేదా తనకి అనుగుణంగా మాట్లాడిన వాళ్ళు చెప్పింది మాత్రమే విన్నాడు చిరు. అతడి త్యాగానికి గుర్తుగా, కాంగ్రెస్ రాజ్యసభ సీట్ ఇచ్చింది. కాంగ్రెస్ 2014  ఎన్నికల్లో అడ్రెస్ లేకుండా పోవడంతో, చేసేదేం లేక, చిరు సినిమాల్లోకి తిరిగొచ్చే దిశగా అడుగులు వేశాడు. తన కొడుకు రామ్ చరణ్ నటించిన బ్రూస్ లీ లో ప్రత్యేక పాత్రా చేసినా, అది ఎవరికీ ఉపయోగపడలేదు. ఇక ఇలా కాదని, కొడుకుని నిర్మాత చేసి తమిళంలో హిట్ అయినా కత్తి అనే సినిమా రీమేక్ హక్కులు కొన్నాడు. ఈ సినిమా కి దర్శకత్వం వహించే బాధ్యత వినాయక్ కి ఇచ్చాడు. అయితే, ఖైదీ నం 150 బాక్స్ ఆఫీస్ దగ్గిర ఎన్ని సంచలనాలు సృష్టిస్తుందో మనందరికీ తెలిసిందే. కొందరు మెసేజ్ ని పక్కకు పెట్టి, చిరు పైన ఎక్కువ ఫోకస్ చేసారు అని విమర్శిస్తే, మరి కొందరు చిరు సినిమాలో అవసరమైన అంశాలన్నీ ఉన్నాయి అని చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడు అంతటా జరుగుతున్న ప్రధాన చర్చ ఏంటంటే, ఖైదీ నం 150 చిరంజీవి పొలిటికల్ కెరీర్ కి ఎంత వరకు ఉపయోగపడుతుంది అని. నిజం చెప్పాలంటే, ఒక కమర్షియల్ సినిమాతో చిరంజీవి రైతులకి సంబంధించి సందేశం ఇవ్వడానికి గల ప్రధాన కారణం, పొలిటికల్ మైల్ ఏజ్ కోసమే అనే వాళ్ళు ఉన్నారు. సినిమా విశ్లేషకులు చెప్పేదేంటంటే, ప్రేక్షకులు ఖైదీ నం 150  ని సినిమా లాగే చూస్తున్నారు తప్ప, మెసేజ్ గురించి ఆలోచించే ఉద్దేశ్యం లో లేరు. దానికి తోడు, వచ్చే ఎన్నికల్లో, చిరంజీవి కి పవన్ కళ్యాణ్, బాలకృష్ణ లాంటి వాళ్ళ నుండి గట్టి పోటీ ఏర్పడనుంది. చూద్దాం, చిరు తన తదుపరి చిత్రాలకి ఎలాంటి కథల్ని ఎన్నుకుంటాడో!

నిషేధాన్ని నిషేధించటమే మార్గమా?

  నిషేధం.. ఈ మధ్య ఈ పదం తెగ వాడబడుతోంది! దేన్ని చూసినా నిషేధించాలని చెప్పేవారు ఎక్కువైపోయారు. అందుకు తగ్గట్టే నిషేధాన్ని నిషేదించేమనే అభ్యుదయవాదులు కూడా ఎక్కువైపోయారు. ఇక ఎప్పటిలాగే సంక్రాంతి రావటంతో మరోసారి నిషేధం గోల మొదలైంది. సుప్రీమ్ కోర్టే ఈ మొత్తం కలకలానికి కారణం కావటం ఇక్కడ మరో విశేషం. మన తెలుగు రాష్ట్రాల్లో కోళ్ల పందాలు చర్చకు దారి తీస్తే , తమిళనాడులో జల్లికట్టు పెద్ద రచ్చకే దారి తీసింది!   కోర్టు వద్దన్నా గోదావరి జిల్లాల్లో కోళ్ల పందాలు నిరాటంకంగా కొనసాగుతున్నాయి. అన్ని పేపర్లు, ఛానల్స్ ఇదే వార్తను జనానికి అందిస్తున్నాయి. మరి కోర్టు తీర్పుని అమల్లో పెట్టాల్సిన పోలీసులు ఏం చేస్తున్నారు? మొత్తానికి మొత్తంగా జనమంతా కోళ్ల పందాలకు అనుకూలంగా వుంటే వాళ్లు మాత్రం ఏం చేస్తారు? ప్రేక్షక పాత్రకి పరిమితం అవుతున్నారు. అటు తమిళనాట కూడా సేమ్ సిట్యుయేషన్. జల్లికట్టు వద్దని కోర్టు మూడేళ్ల కిందటే చెప్పినా యథావిధిగా కార్యక్రమం జరిగిపోతోంది. అంతే కాదు, కమల్ హసన్ లాంటి సెలబ్రిటీలు కూడా జల్లికట్టుకు మద్దతు పలుకుతున్నారు. జల్లికట్టు వద్దనే దాని కన్నా ముందు బిర్యానీ బంద్ చేయించాలని సూటిగా ప్రశ్నిస్తున్నారు! అదీ నిజమే... ప్రతీ రోజూ లక్షల కోళ్లు, మేకలు, గొర్రెలు, గోవులు చికెన్ , మటన్ షాపులు, కబేళాల్లో బలైపోతుంటే... సంవత్సరానికి ఒకసారి జరిగే సంప్రదాయ క్రీడల్లో జంతు హింస వుందనటం హాస్యాస్పదం! రెండో ముఖ్యమైన విషయం కొందరు హిందూత్వవాదులు చెబుతున్నట్టు అన్నీ నిషేధాలు, ఆజ్ఞలు మెజార్టీ జనాల పండుగలకేనా? బక్రీద్, మొహర్రం లాంటి పండుగలకి ఎలాంటి పిల్స్ వుండవు, కేసులుండవు, తీర్పులూ వుండవు. ఇది ఏకపక్షంగా వాదించే హిందూత్వవాదుల వాదనైనా... ఒక్కటి మాత్రం నిజం. కోర్టుల్ని ఆశ్రయించే వారు హిందువుల పండుగల్నే దృష్టిలో పెట్టుకుంటున్నారు. కోర్టులు కూడా మన పండుగల మీదే తీర్పులు ఇస్తున్నాయి. మిగతా మతాలు, వర్గాలు, సంస్కృతుల్లోని హింసని పట్టించుకున్న దాఖలాలు తక్కువ..   కోర్టు తీర్పుల్ని ఒక పరిధికి మించి ఎవ్వరూ విమర్శించటానికి వీలు లేదు కాబట్టి ఆ విషయం పక్కన పెడితే అసలు నిషేధాలు ప్రజాస్వామ్యంలో పని చేస్తాయా అన్నది పెద్ద చర్చనీయాంశం. కోర్టు కోళ్ల పందాలు, జల్లికట్టు వద్దన్నా జరుగుతూనే వున్నాయి. అలాగే ఆ మధ్య పోర్స్ సైట్లు కొన్ని బ్యాన్ చేస్తే కూడా అక్రమ మార్గాల్లో జనం చూడనే చూసేశారు. బీహార్, గుజరాత్ లాంటి రాష్ట్రాల్లో మద్య నిషేధం వుంటే ఏం జరుగుతు వుంటుందో కూడా మనకు తెలిసిందే. నిషేధం అనగానే దాన్ని తుంగలొ తొక్కే ఆలోచనలు కూడా చాలానే చేస్తుంటారు! పైగా భారతదేశం లాంటి అతి పెద్ద వ్యవస్థలో సంపూర్ణ నిషేధం దాదాపు అసాధ్యం. రాజకీయ నేతలకు ఓట్ల భయాలు, పోలీసులకి తగిన శక్తి, సామర్థ్యాలు లేని బాధలు ఇలా బోలెడు కారణాలు. ముఖ్యంగా, నిషేధం పట్ల ప్రజల్లోనే పెద్ద ఎత్తున విముఖత వున్నప్పుడు దాని ఆచరణ ఎంత మాత్రం సాధ్యం కాదు.   అమెరికా లాంటి దేశాలు కూడా ఒకప్పుడు మద్యం, జూదం నిషేధించాలని ప్రయత్నించి వెనక్కి తగ్గాయి. తక్కువ  జనాభ, ఎక్కువ వనరులున్న పాశ్చాత్య వ్యవస్థలే చట్ట బద్ధం చేసి నియంత్రణలో పెట్టినప్పుడు ఇండియా అ పని చేయటం తప్పేం కాదు. స్పెయిన్ లో బుల్ ఫైట్ లాగా జల్లికట్టు కూడా చట్ట బద్ధం చేయవచ్చు. అలాగే, కోళ్ల పందాలు లాంటివి కూడా కఠిన నియమాలు, నియంత్రణతో చట్ట బద్ధంగా అనుమతిస్తే నష్టం కొంతైనా తగ్గుతుంది. అలా కాకుండా తూతూ మంత్రపు నిషేధం అమలు చేస్తూ అన్నీ జరగనిచ్చేస్తే నష్టం మరింత పెరుగుతుంది. ప్రభుత్వాలకి కూడా ట్యాక్స్ రూపంలో నయా పైసా రాదు. ఇది జల్లికట్టు కోళ్ల పందాలు, జూదం లాంటి వాటి విషయంలోనే కాదు వ్యభిచారం కూడా కొన్న దేశాల్లో చట్టబద్ధం చేసింది ఇందుకే. మన దేశఃలో వ్యభిచారం చట్ట పరంగా నేరమైనా ముంబై, కోల్ కతా లాంటి నగరాల్లో దశాబ్దాలుగా దందా నడుస్తూనే వుంది. ఇలాంటివన్నీ ఋజువు చేసేది ఒక్కటే. నిషేధం దేన్ని నిషేధించలేదు. కాబట్టి నిషేధాన్ని నిషేధించి... నియంత్రణని నెత్తికెత్తుకోవాలి. అదే తెలివైన మార్గం... 

అమేజాన్ పైత్యం... సుష్మా వైద్యం!

  ప్రపంచంలోని అన్ని దేశాలకూ ఇలాంటి సమస్య వస్తుందో లేదోగాని మన భారతదేశానికి మాత్రం పదే పదే వస్తుంటుంది. ఓ సారి ఓ కంపెనీ లక్ష్మీ దేవీ బొమ్మని అవమానిస్తుంది. మరోసారి మరో విదేశీ కంపెనీ గణపతిని చులకన చేస్తుంది. తాజాగా అయితే అమేజాన్ డాట్ కామ్ వాడు భారత దేశ జెండాపైనే తన పైత్యం చూపాడు. కాళ్లు తుడుచుకునే డోర్ మ్యాట్స్ పై ఇండియా ట్రై కలర్ ఫ్యాగ్ ని ముద్రించాడు. ఇలాంటి అవమానం మనకు జరగటం ఇది మొదటి సారీ కాదు బహుశా చివరి సారి కూడా కాకపోవచ్చు. కాని, అసలు ఎందుకని భారతీయ సంస్కృతిని, మతాన్ని, దేవుళ్లని, ఆఖరుకి జాతీయ పతాకాన్నీ... ఈ పనికిమాలిన కంపెనీలు అవమానిస్తుంటాయి? అమేజాన్ ఇప్పుడు తన కెనడా అమ్మకాల్లో మన జాతీయ జెండాను డోర్ మ్యాట్స్ పై ముద్రించింది. అందుకు కోపగించిన విదేశాంగ శాఖా మంత్రి ట్విట్టర్ లో ఘాటుగా వార్నింగ్ ఇచ్చారు. ఆ దిక్కుమాలిన డోర్ మ్యాట్స్ వెనక్కి తీసుకోకపోతే ఇక మీద అమేజాన్ కంపెనీ ప్రతినిధులకి ఇండియాలోకి నో ఎంట్రీ అన్నారు. ఇప్పటికే ఇక్కడ వున్న ఆ కంపెనీ విదేశీ ప్రతినిధుల్ని కూడా వీసాలు రద్దు చేసి వెనక్కి వెళ్లగొడతామని బెదిరించారు. ఈ దెబ్బతో అమేజాన్ కు దెయ్యం అమాంతం దిగిపోయింది. త్రివర్ణ పతాకాన్ని అవమానించిన డోర్ మ్యాట్స్ వెనక్కి తీసేసుకుంది. అయితే, పదే పదే మన దేశం మీదా, మన దేవుళ్ల మీద, మన సెంటిమెంట్ల మీదా దాడులు ఎందుకు జరుగుతుంటాయో ఇక్కడే మనం కాస్త మనసు పెట్టి ఆలోచిస్తే సమాధానం దొరికిపోతుంది. సుష్మా స్వరాజ్ పిచ్చి పిచ్చి చర్చలు, విజ్ఞాప్తులు లాంటివి ఏం లేకుండా అమేజాన్ కు వారెంట్ ఇచ్చారు. ఆ వెంటనే ఆ కంపెనీ తన బలుపు తగ్గించుకుని దారికొచ్చింది. కాని, ఇంత కాలం మన ప్రభుత్వాల్లో ఇదే లోపించింది. ఏ దేశంలో భారత్ కు అవమానం జరిగిన మన ప్రభుత్వాలు నేరుగా రంగంలోకి దిగేవి కావు.  ఏవో అధికార వర్గాలు, లేదంటే స్వచ్ఛంద సంస్థలు పోరాటం చేసేవి. ప్రభుత్వ పెద్దలు నిమ్మకు నీరెత్తినట్టు వుండిపోయే వారు. అందుకే, బాత్రూంలలో , ప్యాంటీలపై మన దేవుళ్ల బొమ్మలు ముద్రించి కూడా గతంలో హాయిగా తప్పించుకున్నారు చాలా మంది సన్నాసులు. ఈ సారి మోదీ ప్రభుత్వం అమేజాన్ కు హై ఓల్టేజ్ షాక్ ఇవ్వటం సమస్యని అమాంతం పరిష్కరించింది. ఇక ముందు ఇలాంటి వెధవ పనులు ఎవరైనా చేయాలంటే కొంత ఆలోచించుకునే స్థితి తెచ్చింది. అయినా కొందరు మేధావులు, బ్రిటీష్ బానిస భావజాలన్ని వదలలేని జర్నలిస్టులు సుష్మా చర్యని తప్పుబడుతున్నారు. ఒక ప్రైవేట్ కంపెనీపై ఏకంగా కేంద్ర మంత్రి దాడి చేయటం అవివేకమని తమ స్వంత సిద్ధాంతాలు వక్కాణిస్తున్నారు. అసలు దేశ జెండాకు అవమానం కంటే ఇంకా పెద్ద నష్టం ఏం వుంటుందో వారికే తెలియాలి! ఆ అంశం కూడా పట్టించుకోకుండా విదేశాంగ శాఖా మంత్రి ఇంకేం చేయాలో? మన దేశంలో కొందరు ఖచ్చితంగా దేశభక్తి పేరు చెప్పుకుని దాదాగిరి చేస్తుండొచ్చు. కాని, వాళ్లున్నారు కాబట్టి, వారితో జతకట్టేస్తారేమోనని భయపడి... దేశానికి అవమానం జరుగుతుంటే కూడా పిరికిగా నోరు మూసుకుని కూర్చోవటం మాత్రం సరికాదు. సుష్మా స్వరాజ్ లాగే ముందు ముందు కూడా భారత ప్రభుత్వ మంత్రులు, అధికారులు,పౌరులు ఎవరైనా నిర్భయంగా జాతి గౌరవాన్ని కాపాడాలి. అందుకోసం కొంత కటువుగా ప్రవర్తించాల్సి వచ్చిన వెనుకంజ వేయకూడదు...

'ఖర్మ'ని పట్టించుకోవద్దన్న... 'కర్మ'యోగి!

జనవరి 12... భారత యువజన దినోత్సవం! అంటే మన యూత్ డే!ఈ విషయం చాలా మందికి తెలియకపోవటం విషాదమైతే... ఇప్పుడిప్పుడే చాలా మందికి తెలుస్తూ వుండటం ఆనందకరం. ఇంతకీ ఇవాళ్ల ఎందుకని యూత్ డే? యువతకి ఈ రోజుతో ఏం సంబంధం వుంది? 1863లో సరిగ్గా ఇదే రోజున బెంగాల్ లో ఒక ఆధ్యాత్మిక అగ్ని కణం రాజుకుంది! ఆ అగ్ని కణం తొలి వెలుగులు విరజిమ్మిన జయంతి దినోత్సవమే జనవరి పన్నెండు. భారత దేశ యువజన దినోత్సవం! జనవరి పన్నెండు స్వామి వివేకానంద జయంతి. ఆయన పుట్టుకతో వివేకానందుడు కాదు. నరేంద్రనాథ్ దత్తా. కాని, క్రమంగా ఆత్మాన్వేషణలో రామకృష్ణుల వారి పాదాలకి అంకితమై పరిపూర్ణ పరిణామం చెందాడు. స్వామి వివేకానందుడు అయ్యాడు. నిజానికి శ్రీరామకృష్ణ పరమహంస ఆయనకి పెట్టిన పేరులోనే ఎంతో అర్థం దాగి వుంది. వివేకం అంటే మంచిని, చెడుని, అబద్ధాన్ని, నిజాన్ని, మృత్యువుని, అమృతత్వాన్ని వేరు వేరుగా చూడగలగటం! అంతే కాదు, వివేకం అంటే అశాశ్వతమైనదాన్ని వద్దనుకుని శాశ్వతమైన దాన్ని ధైర్యంగా, స్థిరంగా ఎంచుకోవటం! అలా చేస్తే వచ్చేదే ఆనందం! కాబట్టి వివేకం వల్ల ఉత్పన్నమయ్యే శాశ్వత ఆనందానికి ప్రతి రూపమే స్వామి వివేకానంద. భారతదేశం యుగయుగాలుగా ప్రపంచానికి అందిస్తోన్న వివేకా, ఆనందాల సందేశానికి సజీవ రూపం ఆయన!  వివేకానందుడికి యువతకి చాలా పెద్ద సంబంధం వుంది. అందుకే, ఆయన జయంతిని వాజ్ పేయ్ ప్రభుత్వం జాతీయ యువజన దినోత్సవంగా ప్రకటించింది. కేవలం 39సంవత్సరాలు మాత్రమే భౌతికంగా జీవించిన ఆయన ఏనాడూ ముదుసలి భావాల్ని కూడా జోలికి రానీయలేదు. ఆయన చెప్పింది కూడా అదే. సాధారణ సాధువులు, సన్యాసుల మాదిరిగా జపం, తపం, ఉపవాసం వంటి వాటితో సరిపుచ్చలేదు. దేశం బ్రిటీషర్ల కర్కశ హస్తాల్లో నలిగిపోతోంటే వెన్నెముక అరిగిపోయేలా జాతి కోసం పని చేయమన్నాడు. అందుకు యువత మీదే తన నమ్మకం అన్నాడు. ప్రపంచం మారేది యువ శక్తి వల్లేనని స్వామీజీ విశ్వసించారు. బోధించారు.  వివేకానంద అనగానే ఇప్పుడు నాలుగు కొటేషన్లు వినిపించి కథ ముగించేస్తున్నారు. ఇంతకు ముందైతే అది కూడా వుండేది కాదు. ఎక్కడో చరిత్ర పుస్తకంలో పది లైన్లు మాత్రం ఆయన గురించి రాసి చేతులు దులుపుకునే వారు. అందుకే, స్వామీజీ గొప్పతనం ఆయన 153వ జయంతి నాడు కూడా చాలా మందికి తెలియటం లేదు. అసలాయన ఇప్పుడు బతికి వుంటే నేనాయన పాదాల వద్ద వాలిపోయేవాడ్ని అని సుభాష్ చంద్రబోస్ అన్నారంటే వివేకానందుడిలో ఎంతటి గొప్పతనం దాగి వుండి వుంటుంది? గాంధీ, ఠాగూర్, నెహ్రు, టాటా... ఇలా ఎందరో వివేకానందుడి వల్ల నేరుగా, పరోక్షంగా ప్రేరణ పొందారు. ఇప్పటికీ స్వామీజీ బోధనల్ని చదివి వేలాది మంది కర్తవ్య దీక్షతో రగిలిపోతున్నారు. సినిమా రంగం మొదలు రాజకీయ రంగం వరకూ అన్నిట్లో వివేకానందుడి ప్రేరణ పొందిన వారున్నారు. మన ప్రధాని మోదీ సహా ఈనాటి తరంలో వివేకానందుడి శిష్యులు ఎందరెందరో! వివేకాందుడు కొత్తగా ఏమీ చెప్పలేదు. ఒకప్పటి శ్రీకష్ణ,శంకరాచార్యుల మాదిరిగానే వేదం, ఉపనిషత్తుల్లో ఏముందో అదే మళ్లీ మళ్లీ ప్రవచించాడు.లే , మేలుకో, గమ్యం చేరేదాకా విశ్రమించకు అన్నదే ఆయన అన్ని బోధనల సారాంశం. దేవుడి పేరు చెప్పొ, మూఢ నమ్మకాల నెపంతోనో దౌర్భాగ్యంలో మునిగిపోవద్దని స్వామీజీ సందేశం. ఖర్మ అని వాపోకుండా కర్మతో తల రాత రాసుకొమ్మని ఆయన చెప్పారు. అదే సమయంలో పాశ్చాత్య ప్రపంచంలో కాలుమోపి భౌతిక సుఖాలకి ఆవల ఏముందో తెలుసుకొమ్మని తట్టి లేపాడు. ఇక్కడ మనకు ధైర్యం నూరిపోస్తే ... ఆక్కడ వారికి వివేకం ప్రబోధించాడు. ఏక కాలంలో భూమ్మీది రెండు ప్రపంచాలకి ఎక్కడ ఏం కావాలో అది అందించాడు. అదే వివేకానందుడి గొప్పతనం...  తనకి నిజాయితీపరులైన వంద మంది కష్టపడగలిగే యువతి యువకుల్ని ఇవ్వమంటాడు వివేకానందుడు. తాను ప్రపంచాన్నే మార్చేస్తానంటాడు! ఆయన కోరిన ఆ వంద మందిలో మనమూ ఒకరం అవ్వటమే ఇప్పటికిప్పుడు మన ఆత్మోద్ధరణకి, దేశోద్ధరణకి కావాల్సింది! ARISE, AWAKE AND STOP NOT TILL THE GOAL IS REACHED!  

పెద్దనోట్ల రాద్ధాంతం ఇంకెన్నాళ్లు

మోదీ పెద్దనోట్లని రద్దు చేసి ఇప్పటికి రెండు నెలలు దాటిపోయింది. కొత్త ఐదువందల నోట్ల సరఫరా విస్తృతం కావడంతో బ్యాంకుల పరిస్థితి కాస్త మెరుగయినట్లే కనిపిస్తోంది. పెద్దనోట్ల రద్దు నిర్ణయం ఉపయోగమా కాదా అన్న మీమాంశ మీద ఇప్పటికే రకరకాల అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. నల్లధనం రద్దు కోసమూ, నగదురహిత సమాజం కోసమూ ఈ చర్య తప్పలేదు అని ప్రభుత్వం వాదిస్తుండగా... ఈ నిరంకుశ నిర్ణయంతో బాధపడింది పేదవాడు మాత్రమే అన్నది విమర్శకుల మాట.   నిజం ఏదైతేనేం నిర్ణయం మాత్రం జరిగిపోయింది. కష్టమో, నష్టమో...  ఆ నిర్ణయాన్ని భరించాం. భవిష్యత్తు బాగుంటుందనో, ప్రభుత్వాన్ని ఎదిరించలేకనో... కారణం ఏదైతేనేం మనసు రాయి చేసుకుని నోట్ల కోసం క్యూలలో నిలబడ్డాం. 90 శాతం ప్రజలు నగదు లావాదేవీల మీద ఆధారపడే సమాజంలో 86 శాతం నగదుని రద్దు చేయడం అంటే ఏమంత తేలిక కాదు. మరో దేశం అయితే తప్పకుండా కుప్పకూలిపోయేది. దేశమే అస్తవ్యస్తమైపోయేది. అలాంటిది పంటిబిగువున ఈ నిర్ణయాన్ని సహించడం బహుశా మన దేశప్రజలకే సాధ్యమేమో!   అంతా సజావుగా సాగిపోతున్న సమయంలో మళ్లీ వెలువడుతున్న కథనాలు దేశాన్ని ఉలికిపాటుకి గురిచేశాయి. అమెరికా సూచనల మేరకే మోదీ పెద్దనోట్ల రద్దు చేశారంటూ ఆసియా పసిఫిక్‌ రీసెర్చ్‌.కాం విడుదల చేసిన ఈ నివేదికలో కళ్లు బైర్లు కమ్మే విశ్లేషణలు బయటపడ్డాయి. ఒబామా, మోదీ, రఘురామ్‌ రాజన్, అరుణ్‌జైట్లీలు కలిసి ఆడిన నాటకానికి పతాక సన్నివేశమే నోట్ల రద్దని ఆ పత్రిక చెబుతోంది. డిజిటల్ చెల్లింపుల పేరుతో మన దేశ ఆర్థికరంగం మీద నిరంతరం దృష్టి నిలిపేందుకు, ప్రపంచంలోని నగదు వ్యవస్థను తన ఆధీనంలోకి తీసుకువచ్చేందుకు అమెరికా ఈ పన్నాగం పన్నిందని ఆ పత్రిక ఆరోపిస్తోంది. సహజంగానే ఈ వేడి వేడి వార్తను మన పత్రికలు అందిపుచ్చుకున్నాయి. నల్లధనం, అవినీతి మీద యుద్ధం వంటి మారుపేర్లతో మోదీ ప్రజలను మోసపుచ్చారని దుమ్మెత్తిపోశాయి.   పెద్దనోట్ల నిర్ణయం వెనుక అమెరికా ప్రమేయం గురించిన వార్తలు ఊపందుకుంటుండగానే, అఖిలభారత ఉత్పత్తిదారుల సంఘం (AIMO) ప్రకటించిన నివేదిక ప్రజలను మరింత అయోమయానికి గురిచేసింది. చిన్న పరిశ్రమలలో ఇప్పటికే 35 శాతం ఉద్యోగాలు పోయాయనీ, మరో రెండు నెలల్లో ఏకంగా 60 శాతం ఉద్యోగాలు పోతాయనీ ఈ నివేదిక పేర్కొంది. ఇక అన్ని రకాల పరిశ్రమలూ దాదాపు 50 శాతం ఆదాయాన్ని కోల్పోయాయని పేర్కొంది. ఈ నివేదికలో పేర్కొన్న అంకెలతో మరోసారి పెద్దెత్తున దుమారం చెలరేగుతోంది.   పెద్దనోట్ల రద్దు వల్ల ఆర్థికస్థితి ఒక్క కుదుపుకి లోనైన మాట వాస్తవమే! రియల్ ఎస్టేట్‌, సినిమా వంటి రంగాలు ఏళ్ల తరబడి కోలుకోలేవన్న విశ్లేషణా వాస్తవమే! అయితే ప్రజల వద్దకి మళ్లీ నగదు చేరుకుంటుంటే రోజువారీ పరిస్థితులు చక్కబడక మానవు. కానీ ఏకంగా దేశమే శాశ్వతంగా నాశనమై పోయిందనే అంచనా అంత సహేతుకంగా తోచదు. కొనుగోలు శక్తి తిరిగి పుంజుకోగానే ఉత్పత్తులకు గిరాకీ ఏర్పడక మానదు. దాంతో లక్షలాది పరిశ్రమలు మూతపడనున్నాయన్న అంచనా నిరాశావాదంగానే గోచరిస్తోంది.   పత్రికలు, వివిధ సంస్థల విశ్లేషణలు ఈ తీరున ఉంటే... ప్రభుత్వం తీరు మరో రకంగా ఉంది. ఈ రెండు నెలల కాలంలో బ్యాంకులకు చేరుకున్న డబ్బు గురించి ప్రభుత్వం ఎలాంటి ప్రకటనా చేసే సాహసం చేయలేకపోతోంది. నగదురహితం వెనుక అమెరికా హస్తం మీద కూడా కేంద్రం నుంచి ఘాటైన స్పందన వినిపించలేదు. రోజూ తమ భుజాలు తాము చరుచుకోవడం, మోదీని అవతార పురుషునిగా వర్ణించడం మినహా కేంద్ర మంత్రుల నుంచి ముక్కలేవీ వినిపించడం లేదు. ఆఖరికి మోదీగారు కూడా ఈ అంశం మీద స్పష్టతని ఇస్తారనుకుంటే... ఆయన కూడా యూటర్న్ తీసుకుని జాతిని ఉద్దేశించి సంక్షేమపథకాలంటూ వేరే చరణాన్ని అందుకున్నారు. ఈ సమయంలో నిర్మాణాత్మక పాత్రని పోషించాల్సిన ప్రతిపక్షం ఏం చేస్తోందయ్యా అనే మాటని మాత్రం అడగకండి. రాహుల్‌గాంధీ మీద ఒట్టు.

ఎన్నికల సంస్కరణ సాధ్యమేనా!

  ప్రధానమంత్రి పెద్ద నోట్ల రద్దు మీద తన నిర్ణయాన్ని ప్రకటించిన తరువాత, సామాజికవేత్తల నుంచి వచ్చిన తొలి అభ్యంతరం- ముందు ఎన్నికలలో ప్రవహిస్తున్న నల్లధనాన్ని ఎందుకు కట్టడి చేయడం లేదు? అనే. రెండు నెలలు గడిచిపోతున్నా పెద్ద నోట్ల రద్దు వల్ల లాభం జరిగిందా వెతల కథలే మిగిలాయా అన్న సందేహం ఇంకా మిగిలి ఉండటంతో.... విమర్శకుల నోళ్లు మూయించేందుకు మోదీ ఎన్నికల సంస్కరణల గురించి కూడా మాట్లాడారు.   నిన్న జరిగిన భాజపా జాతీయ కార్యవర్గ సమావేశంలో ప్రసంగిస్తూ మోదీ ఎన్నికల సంస్కరణల గురించి కొన్ని కీలకమైన అభిప్రాయాలను వెల్లడించారు. మనకు నిధులు ఎక్కడి నుంచి వస్తున్నాయో తెలుసుకునే హక్కు ప్రజలకు ఉందని అంటూనే.... ఆ దిశగా జరిగే సంస్కరణలకి భాజపా మద్దతు ఉంటుందని ప్రకటించారు. ఈ విషయంలో అన్ని పార్టీల మద్దతు లభిస్తుందని ఆశించారు.   రాజకీయ పార్టీల విరాళాలకి సంబంధించి ఎన్నికల కమీషన్ ఇప్పటికే ఒక కీలక ప్రకటన చేసింది. రెండువేలకి మించి వివిధ పార్టీలకు అందే విరాళానికి సంబంధించి స్పష్టమైన వివరాలు ఉండేలా జాగ్రత్తలు తీసుకోమని ప్రభుత్వాన్ని సూచించింది. నిజానికి ఇరవై వేలకి మించి అందే వివరాలని అందించాలని ఇప్పటికే ఒక చట్టం ఉన్నప్పటికీ, రాజకీయ పార్టీలు వాటిని పాటిస్తున్న దాఖలాలు లేవు. ఇక ఆ పరిమితి రెండువేలకి దిగినప్పుడు, దాని నుంచి తప్పించుకునేందుకు పార్టీలు ఎలాంటి కుప్పిగంతులు వేస్తాయో చూడాలి.   రాజకీయ పార్టీలకీ నల్లధనానికీ అవినాభావ సంబంధం ఉన్న విషయం తెలిసిందే! ఎన్నికలలో ఎప్పుడైతే అభ్యర్థి ప్రతిభకంటే అతను వెదజల్లే డబ్బే కీలకంగా మారిపోతుందని తేలిందో డబ్బు కుప్పలు తెప్పలుగా ప్రవహించడం మొదలుపెట్టింది. నోటుకి వెయ్యి రూపాయలు ఇచ్చేందుకు కూడా వెనకాడటం లేదంటే పరిస్థితి ఎంతగా దిగజారిందో అర్థం చేసుకోవచ్చు. మరి ఇంత డబ్బు చేతుల్లోకి రావాలంటే, పార్టీలకు ఎవరో ఒకరు ఆర్థికంగా అండ నిలవాల్సిందే కదా!   సాధారణంగా లెక్కల్లోకి రానంతగా నల్లడబ్బుని కూడబెట్టుకున్న బడా పారిశ్రామికవేత్తలు, సారా కాంట్రాక్టర్లు, రియల్‌ ఎస్టేట్ వ్యాపారులు, మాఫియా లీడర్లు.. వంటి నానాజాతుల నుంచి ఈ డబ్బు అందుతూ ఉంటుంది. సహజంగానే వీరి డబ్బుతో అధికారంలోకి వచ్చి వ్యక్తులు, ఆ అధికారాన్ని తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దీంతో ఎన్నికలలో నల్లధనం మన ప్రజాస్వామ్య వ్యవస్థకే కాకుండా పాలనకి కూడా అడ్డుగా నిలుస్తోంది. సాక్షాత్తూ రిలయన్స్ వంటి సంస్థల నుంచి అనామత్తుగా కావల్సినంత విరాళాలు అందుతూ ఉండబట్టే, ప్రభుత్వం వాటకి అనుకూలంగా వ్యవహరిస్తోందన్న ఆరోపణలూ ఉన్నాయి.   అందుకనే ఎన్నికల విరాళాలకి సంబంధించిన సంస్కరణలను ప్రవేశపెట్టితీరాల్సిన అగత్యం ఉంది. కానీ ఇందుకు పార్టీలు ఏమేరకు సహకరిస్తాయన్నదే మిలియన్ డాలర్ల ప్రశ్న. ఎందుకంటే తమ ఉనికికి ఆటంకంగా తోచే ఏ విధానాన్నైతే వ్యతిరేకించడంలో మన పార్టీల మధ్య అధ్బుతమైన సమైక్యత ఉంటుంది. ఇప్పటివరకూ మహిళా రిజర్వేషన్‌ బిల్లుని ఆమోదించలేకపోవడమే ఇందుకు ఉదాహరణగా నిలుస్తుంది. మరి అలాంటి అడ్డంకులను దాటుకుని ఎన్నికలలో నల్లధన ప్రవాహాన్ని అరికట్టడంతో మొదీ సఫలీకృతులవుతారా! అదే కనుక జరిగితే పెద్దనోట్ల రద్దుతో సమానమైన సంస్కరణగా అది మిగిలిపోతుంది.

డబ్బుతోనే సంక్షేమం వస్తుందా!

కొన్నాళ్లుగా ఏ రోజు వార్తాపత్రికని చూసినా కూడా ప్రభుత్వం ఫలానా వర్గానికి మేలు జరిగేలా ఫలానా నగదు పథకాన్ని ప్రారంభించనుంది అంటూ వార్తలు వస్తున్నాయి. ఆఖరికి ప్రజలందరికీ కూడా నెలనెలా ఉచితంగా ఎంతో కొంత డబ్బుని ఇచ్చే ప్రతిపాదనని కూడా కేంద్ర పరిశీలిస్తోందనే విశ్లేషణలూ వినిపిస్తున్నాయి. ఇలా డబ్బులు పంచేయడం వల్ల ఎవరి జీవితాలూ కూడా మెరుగుపడలేదనీ, పైగా ప్రతి విషయానికీ ప్రజలు ప్రభుత్వం వైపు దృష్టి సారించాల్సిన దుస్థితి ఏర్పుడుతుందన్న విమర్శలు ఉన్నాయి. కాకపోతే వీటిని పట్టించుకునేవారే కరువయ్యారు. పైగా ఏదన్నా పథకాన్ని విమర్శిస్తే, సదరు వ్యక్తి సంక్షేమానికే వ్యతిరేకి అన్న అపవాదు ఎలాగూ తప్పడం లేదు. దాంతో సంక్షేమ పథకాలకు అడ్డూ అదుపూ ఉండాలని గొంతు విప్పేవారి సంఖ్య నానాటికీ తగ్గిపోతోంది. నిజంగానే డబ్బుని పంచడం వల్ల, విపరీతంగా రాయితీలను అందించడం వల్లనో, ఉచితంగా వస్తువులను ఇచ్చేయడం వల్లనో సంక్షేమం వస్తుందంటే దానిని కాదనే ధైర్యం ఎవరికీ ఉండదు. కానీ కొన్ని వర్గాల ఓట్లను దృష్టిలో ఉంచుకునో, ప్రజల సానుభూతిని పొందేందుకో, వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకో పార్టీలు ఇలాంటి వరాలను కురిపించడం మాత్రం బాధాకరమైన విషయం. పైగా అటుతరిగీ ఇటుతిరిగీ ఇలాంటి పథకాలకు కావల్సిన నిధులను, మధ్యతరగతి ప్రజల పన్నుల నుంచే వసూలు కావడం ఆ వర్గాన్ని నిస్తేజపరిచేసే అంశం. ఈ దేశంలో డబ్బున్నవాడు హాయిగా బతికేస్తాడు, పేదవాడు సంక్షేమ పథకాలతో బతికేస్తాడు.... కానీ మధ్యతరగతి ప్రజలు మాత్రమే త్రిశంకు స్వర్గంలో పాలుపోకుండా గడిపేస్తున్నాడు అన్నది ప్రతి ఇంట్లోనూ వినిపించే మాటే! ఇంతకీ దేశంలో ఉండే ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలంటే ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోవాలి అంటే దానికి సామాజికవేత్తల నుంచి స్పష్టమైన జవాబులే వినిపిస్తాయి. రోటీ, కపడా, మకాన్ అనేది చాలా పాత నినాదం. నిజానికి ఒక వ్యక్తికి తిండి సంపాదించుకునే ఉద్యోగం, అనారోగ్యంలో తోడుగా వైద్య సదుపాయమూ, తన తలరాతని మార్చుకునేలా విద్యా సౌకర్యమూ ఉండాలి. ఒంటికి కప్పుకోవడానికి బట్టా, తలదాచుకోవడానికి ఏదో ఒక నివాసమూ చూపిస్తే మంచిదే! మనిషి జీవితాన్ని తీర్చిదిద్దేలా శాశ్వతమైన పరిష్కారాలు చూపకుండా ఇవాల్టికి తిండి పెడతాము, ఉండటానికి ఇల్లు కట్టించి ఇస్తాము. నెలనెలా ఉచితంగా డబ్బులు ఇస్తాం అనే పథకాల వల్ల ఎవరో కొందరు మాత్రమే బాగుపడతారు. మనిషి బతికేందుకు అవసరమయ్యే వైద్యం, మనిషి మనిషిలా బతికేందుకు అవసరమయ్యే విద్యారంగాలలో ప్రభుత్వం ఈనాటికీ దారుణమైన వైఫల్యాలను చవిచూస్తోంది. మనకి రోగం వస్తే ప్రభుత్వ ఆసుపత్రికి పోయేందుకు భయపడుతున్నాం, మనకి చదువు కావాలంటే స్తోమతకి మించి అప్పులు చేసైనా సరే ప్రైవేటు కళాశాలల్లో విద్యని చెప్పిస్తాం. వర్షం కురవకపోతే రైతులు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి మారడం లేదు. వర్షం కురిస్తేనేమో నగరాలు చెరువులని తలపిస్తున్నాయి. తల్చుకుంటేనే కళ్లు బైర్లు కమ్మేలా ఇన్ని సమస్యలు మనల్ని వెన్నాడుతుంటే... వీటి మీద నిర్దిష్టమైన చర్యలు తీసుకోవడం మానేసి ఎవరో ఒకరికి నెలనెలా కాసిన డబ్బులిస్తానంటే, అవి కంటితుడుపు చర్యలు కాక మరేంటి!  

ప్రణబ్ ధిక్కార స్వరం

రాష్ట్రపతి పదవి తెల్ల ఏనుగుతో సమానం అని భారతీయుల ప్రగాఢ నమ్మకం. ప్రజల్లో ఈ నమ్మకం ఎక్కడ తొలగిపోతుందోనని ఆ పదవిని చేపట్టేవారు కూడా బహు జాగ్రత్త వహిస్తుంటారు. విదేశాల చుట్టూ గిరగిరా తిరగడం దగ్గర్నుంచీ వీలైనన్ని బహుమానాలు సేకరించడం వరకూ సాధారణ పౌరులకి ఈర్ష్య కలిగే స్థాయిలో వీరి చర్యలు సాగుతుంటాయి. ఎక్కడో అబ్దుల్ కలాం వంటి వారే దీనికి మినహాయింపుగా కనిపిస్తుంటారు. కాబట్టి పెద్ద నోట్ల రద్దు విషయంలో ప్రణబ్‌ చేసిన హెచ్చరిక ఇవాళ పతాక శీర్షికలలో నిలిచింది.   కాంగ్రెస్‌ కురువృద్ధుడైన ప్రణబ్‌ ముఖర్జీ రాజకీయవేత్తగా తలపండినవాడే. రక్షణ, ఆర్థిక, విదేశీ వ్యవహారాలు, వాణిజ్య శాఖలకు మంత్రిగా తనేమిటో నిరూపించుకున్నవాడే. ఒకదశలో ప్రణబ్‌ ప్రధానమంత్రి కాదగిన వ్యక్తిగా దేశం భావించింది. తనకి హిందీ సరిగా రాకపోవడంతో, ప్రధానమంత్రిని కాలేకపోయానంటూ ప్రణబ్‌ ఛలోక్తులు విసురుతుంటారు. ప్రధానమంత్రి కాకపోతనే ఏం! ఆ పదవిలో ఎవరున్నా కూడా ప్రభుత్వంలో నెం.2 స్థాయి వ్యక్తిగా ఆయన అధికారం బాగానే చెల్లింది. ఇక కాంగ్రెస్ అధికారాన్ని కోల్పోవడంతో రాష్ట్రపతి హోదాని సైతం అందుకున్నారు.   నిజానికి మన దేశ రాష్ట్రపతికి ఉండే అధికారాలు చాలా తక్కువ. ఆయన చట్టాన్ని ఆమోదించాల్సి ఉన్నా, తన నిర్ణయంతో ప్రభుత్వాన్ని ధిక్కరించే అధికారం లేదు. కీలకమైన నియామకాలు చేయవలసి ఉన్నా, అవన్నీ కూడా ప్రభుత్వ సలహా సూచనలతోనే సాగించాల్సి ఉంటుంది. అందుకనే ఆయన నుంచి దేశ ప్రజలు పెద్దగా ఆశించేది ఉండదు.   ప్రభుత్వాన్ని ధిక్కరించడం వల్ల రచ్చ కావడమే తప్ప తన మాట నెగ్గదన్న విషయమూ రాష్ట్రపతికి కూడా తెలుసు. అందుకనే అలంకార ప్రాయమైన తన పదవిని సుతారంగా కాపాడుకుంటూ ఐదేళ్ల కాలాన్ని ముగించేస్తుంటారు. ప్రణబ్‌కు కూడా ఈ విషయం ఎరుకే కనుక తన పరిధిని మీరి ఎప్పుడూ దూకుడుని ప్రదర్శించలేదు. అసలే నెహ్రూ కుటుంబానికి విధేయునిగా ఉన్నవాడు కనుక, తన పై వారితో ఏ తీరున మెలగాలో లౌక్యం తెలిసినవాడు. కానీ అవసరం వచ్చినప్పుడు తన వాణిని వినిపించేందుకు ఆయన వెనుకడుగు వేయలేదు. దేశం అంతటా అసహనం మీద చర్చ జరుగుతున్నప్పుడు, అసహనం పెరిగిపోతున్న మాట వాస్తవమే అంటూ ప్రణబ్ వ్యాఖ్యానించారు. దాంతో అధికార పక్షం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఇప్పుడు తాజాగా పెద్ద నోట్ల రద్దు మీద గళం విప్పిన ఆయన, దాని వలన పేదలు ఇబ్బందిపడే ప్రమాదం ఉందంటూ చేసిన హెచ్చరిక సంచలనంగా మారింది.   పెద్దనోట్ల రద్దు వల్ల ఆర్థిక రంగం మందగించే అవకాశం ఉందనీ, ఈ సందర్భంగా కష్టాల పాలవుతున్న నిరుపేదలను ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉందనీ ప్రణబ్‌ తేల్చి చెప్పారు. దీంతో ఇప్పటికే పెద్దనోట్ల రద్దు నిర్ణయం మీద విమర్శలు ఎదుర్కొంటున్న కేంద్రం మరోసారి తన చర్యను సమర్థించుకోవాల్సిన అవసరం ఏర్పడింది. ప్రణబ్‌ వ్యాఖ్యలను నిర్మాణాత్మక సూచనగా భావిస్తే నిజంగానే నోట్ల రద్దు వల్ల ఇక్కట్లు పడుతున్న పేదల కోసం ప్రభుత్వం మరిన్ని చర్యలు తీసుకోవచ్చు. ఎలా చూసినా కూడా ప్రణబ్ మాటల వల్ల ఆయన పదవికీ, ఇటు ప్రజాస్వామ్యానికీ కాస్తలో కాస్త ఊరట లభించినట్లయ్యింది.

మోదీ పాసవుతారా ఎన్నికల పరీక్ష

  ఎన్నికల నగారా మరోసారి మోగింది. ఫిబ్రవరి 4 నుంచి మార్చి 8 వరకు దేశంలోని ఐదు రాష్ట్రాలలో పలు దఫాలుగా ఎన్నికలు జరగనున్నాయి. కేంద్ర ప్రభుత్వ పనితీరు మీదా, పెద్ద నోట్ల రద్దు నిర్ణయం మీదా, ప్రధానమంత్రిగా మోదీ పనితీరు మీదా ఈ ఎన్నికలు ఓ రెఫరెండం అని భావిచేవారు లేకపోలేదు. జరగబోయే ఎన్నికలన్నీ కూడా భాజపాకు కీలకమైన ప్రాంతాలలో కావడమే దీనికి కారణం.   ఎన్నికల షెడ్యూల్ ప్రకటించగానే ముందుగా అందిచూపు ఉత్తర్ప్రదేశ్ వైపే తిరిగింది. అఖిలేష్ నేతృత్వంలోని అక్కడి సమాజ్వాదీ పార్టీ తిరిగి అధికారంలోకి వస్తుందని అందరూ భావించినా... తండ్రితో సాగుతున్న అఖిలేష్ వైరం చివరికి బీజేపీకే లాభించేట్లు కనిపిస్తోంది. పిట్ట పోరు పిట్ట పోరు పిల్లి తీర్చినట్లుగా తండ్రీకొడుకులు పార్టీని పంచుకునేందుకు సాగిస్తున్న కొట్లాట బీజేపీకి ఉపయోగపడుతోందని తాజా సర్వేలు తేలుస్తున్నాయి. అధికారంలో ఉన్న సమాజ్వాదీ పార్టీలో కనుక చీలిక తథ్యమైతే, బీజేపీ విజయం కూడా తథ్యమని విశ్లేషకులు ఘోషిస్తున్నారు.   ఉత్తర్ప్రదేశ్లో భాజపాకు అనుకూలంగా ఉన్న గాలి ఉత్తరాఖండ్లో మాత్రం సెగలు కక్కుతోంది. కేంద్ర ప్రభుత్వం అక్కడ అన్యాయంగా రాష్ట్రపతి పాలనని విధించిందని అక్కడి ప్రజలు అభిప్రాయపడుతున్నారు. సాక్షాత్తూ సుప్రీం కోర్టే జోక్యం చేసుకుని అక్కడి కేంద్ర పాలనని ఎత్తివేయడంతో, బీజేపీకి తలకొట్టేసినట్లయ్యింది. దీనికి తోడు ఎలాగైనా అక్కడి ప్రభుత్వాన్ని తొలగించాలనే పట్టుదలతో ఉత్తరాఖండ్ బీజేపీ ఎమ్మెల్యేలు పన్నిన తంత్రాలు కూడా అక్కడి ప్రజలకు ఏవగింపుని కలిగించాయి. శక్తిమాన్ అనే గుర్రం అక్కడి బీజేపీ చేతిలో బలైపోవడం కూడా వారి స్మృతిలో తాజాగానే ఉంది. దీంతో అక్కడ ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నా హరీష్ రావత్ తిరిగి అధికారంలోకి వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి.   గోవాలో ప్రస్తుతం భాజపానే అధికారంలో ఉంది. అయితే అక్కడ కూడా ఆ పార్టీకి ఏమంత అనుకూలమైన పరిస్థితులు కనిపించడం లేదు. తమిళనాడు ప్రజలకి మల్లే గోవా ప్రజలకి కూడా మార్చి మార్చి పార్టీని ఎన్నుకునే అలవాటు ఉంది. పైగా అక్కడి ప్రస్తుత ముఖ్యమంత్రి లక్ష్మీకాంత్ పర్సేకర్ ఏమంత సమర్థుడైన నాయకుడు కాదన్న అభిప్రాయం వినిపిస్తోంది. పేరుకి పర్సేకర్ ముఖ్యమంత్రే అయినా ఆ రాష్ట్రానికి చెందిన కేంద్ర మంత్రి మనోహర్ పారికర్ చేతిలో రాష్ట్ర ప్రభుత్వం కీలుబొమ్మలా మారిపోయిందన్న విమర్శలూ ఉన్నాయి.   ఒకవేళ అక్కడ బీజేపీ పెద్ద పార్టీగా అవతరించినా కూడా హంగ్ అసెంబ్లీ ఏర్పడే సూచనలు కనిపిస్తున్నాయి.పంజాబ్లో కూడా బీజేపీ పరిస్థితి అగమ్యగోచరంగానే కనిపిస్తోంది. ప్రస్తుతం అధికారంలో ఉన్న బీజేపీ- అకాలీదళ్ కూటమి మరోసారి విజయాన్ని సాధిస్తుందా లేదా అన్నది అనుమానంగానే ఉంది. కొన్ని సర్వేలు బీజేపీకి అనుకూలంగా వినిపిస్తున్నా, ఆమ్ ఆద్మీ పార్టీ నుంచి గట్టి పోటీ ఎదురవనుంది. ఇక మణిపూర్లో మరోసారి కాంగ్రెస్ జయకేతనం ఎగరవేయనుందంటూ స్పష్టమైన సంకేతాలు కనిపిస్తున్నాయి.   ఇదీ స్థూలంగా ఎన్నికలు జరగనున్న ఐదు రాష్ట్రాలలోని పరిస్థితి. నిజానికి అధికారపరంగా 2016 బీజేపీకి ఏమంతగా కలిసిరాలేదు. ఆ ఏడాది ఎన్నికలు జరిగిన తమిళనాడు, కేరళ, పశ్చిమబెంగాల్, పుదుచేరిలలో బీజేపీ ఓటమిపాలైంది. ఒక్క అసోంలో మాత్రమే కమలం వికసించింది. కాబట్టి ఎలాగొలా 2017లో జరగనున్న ఈ అసెంబ్లీ ఎన్నికలలో అయినా పట్టు బిగించాలని ఆ పార్టీ భావిస్తోంది.   అసలు పెద్ద నోట్ల రద్దు నిర్ణయం వెనుక ఈ రాష్ట్రాలలో ప్రవహించనున్న దనాన్ని అదుపు చేయడం కూడా ఒక వ్యూహమంటూ విశ్లేషణలు వినవచ్చాయి. డిసెంబరు 31న జాతిని ఉద్దేశించి చేసిన ప్రసంగంలో కురిసిన వరాల జల్లు కూడా ఈ ఎన్నికలను దృష్టిలో ఉంచుకునే అన్నవారూ లేకపోలేదు. ఇక ఎన్నికల షెడ్యూలు ప్రకటించిన తరువాత కూడా కేంద్రం తన బడ్జెటుని ప్రవేశపెట్టాలనుకోవడం కూడా బీజేపీకి లాభించే అంశమే! కేంద్రం ఊహించినట్లుగానే బడ్జెటుని ప్రవేశపెట్టే అవకాశం చిక్కితే అందులో ఇన్కమ్ టాక్స్ పరిమితుల పెంపు దగ్గర్నుంచీ సామాన్యులని ఊరించే సంస్కరణలు ఎన్నో కనిపించవచ్చు.

కేంద్రం, మమత – దొందూ దొందే!

ఫైర్ బ్రాండ్గా పేరుగాంచిన మమతాదీదీ ఎప్పుడే నిర్ణయం తీసుకుంటారో, ఎప్పుడెలాంటి వ్యాఖ్య చేస్తారో ఊహించడం కష్టం. కానీ తీసుకున్న నిర్ణయాలకు కట్టుబడి ఉంటారనీ, చేసిన వ్యాఖ్యలు ఘాటుగా ఉంటాయన్నది మాత్రం సందేహాతీతం. అందుకే నోట్ల రద్దు విషయంలో కేంద్రాన్ని ధిక్కరించేందుకు ప్రతిపక్షాలన్నీ వేచిచూస్తున్న వేళ, మమత మాత్రం మోదీని ఢీకొనే సాహసం చేశారు.   మోదీ,మమతల మధ్య మాటల తూటాలు పేలుతున్న సందర్భంలోనే పశ్చిమబెంగాల్లో కేంద్ర రక్షణదళాలు మోహరించడంతో... వీరి మధ్య వివాదం తారస్థాయికి చేరుకుంది. తృణమూల్ ప్రభుత్వాన్ని భయపెట్టేందుకే మోదీ ఈ చర్యకు ఆదేశించారంటూ మమత మండిపడ్డారు. ఆ వివాదం ఇంకా సద్దుమణగక ముందే తృణమూల్ పార్లమెంటరీ నేత సుదీప్ బందోపాధ్యాయని నిన్న సీబీఐ అరెస్టు చేసింది. దీంతో మీడియా ముందు మమత మరోసారి తనదైన శైలిలో విరుచుకుపడ్డారు. దమ్ముంటే తనని అరెస్టు చేసి చూడమంటూ సవాలు విసిరారు. అసలైన దొంగ మోదీయేనని మెటికలు విరిచారు.   అవడానికి సీబీఐ స్వయం ప్రతిపత్తి కలిగిన సంస్థే అయినా, కేంద్ర ప్రభుత్వం దానిని తన ఇష్టానుసారంగా వినియోగించుకుంటుందన్న ఆరోపణలు కొత్తేమీ కాదు. ప్రభుత్వానికి సంబంధించిన ఏ వ్యక్తి జోలికీ సీబీఐ పోకపోవడం, కీలక సమయాలలో ప్రతిపక్ష నేతల మీద విరుచుకుపడటం చూస్తే ఈ ఆరోపణల్లో నిజం లేకపోలేదనిపిస్తుంది. అలాగని పట్టుబడిన  సదరు సుదీప్ బందోపాధ్యాయులవారు నిష్టగరిష్టులా అంటే అందుకూ ఆధారాలు కనిపించడం లేదు. మరమరాలు నమిలినంత తేలికగా ప్రజల సొమ్ముని మింగేసిన రోజ్వ్యాలీ అనే చిట్ఫండ్ కంపెనీకి ఆయన అండగా నిలిచారన్న ఆరోపణలు ఉన్నాయి.   మన దేశంలో ఇప్పటిరకూ బయటపడిన నగదు కుంభకోణాలన్నింటిలోకీ రోజ్వ్యాలీ కుంభకోణం పెద్దదంటున్నారు. ఓ అంచనా ప్రకారం ఈ కుంభకోణంలో దాదాపు 60 వేల కోట్ల రూపాయలు స్వాహా అయ్యాయి. ఈ కుంభకోణం సజావుగా సాగేందుకు అధికార యంత్రాంగం యావత్తూ సహకరించిందన్న ఆరోపణలు ఉన్నాయి. సుదీప్ బందోపాధ్యాయులవారు రోజ్వ్యాలీ అందించిన అర్థికసాయంతో విదేశీయాత్రలు సైతం చేపట్టారని సీబీఐ వాదిస్తోంది. ఆ అంశం మీద సుదీప్ ఇచ్చిన వివరణ సహేతుకంగా తోచకపోవడంతో ఆయనను అరెస్టు చేసినట్లు ప్రకటించింది.   సీబీఐ చర్య మమతా దీదీకి ఏమాత్రం నచ్చలేదన్నది వేరే చెప్పాలా! నోట్ల రద్దు నిర్ణయం మీద తాము చేస్తున్న పోరాటాన్ని అణచివేసేందుకే ఈ అరెస్టు జరిగిందని ఆమె ఆరోపించారు. పార్లమెంటులో తమ గళాన్ని బలంగా వినిపించినందుకే తమ పార్లమెంటు సభ్యుని అరెస్టు చేసిందంటున్నారు. సుదీప్ నిర్దోషి అనీ, ఆయన్ని జైలుకి పంపినా కూడా పార్టీ ఆయనకు అండగా నిలుస్తుందనీ భరోసా ఇచ్చారు. మమత మాటల్ని పార్టీ శ్రేణులు కూడా తీవ్రంగానే పరిగణించినట్లు కనిపిస్తోంది.   అందుకనే దీనిని భాజపా ప్రతీకార చర్యగా భావిస్తూ ఆ పార్టీ కార్యకర్తలు కోల్కతాలో భీతావహ వాతావరణాన్ని సృష్టించారు.సీబీఐ వంటి అత్యున్నత సంస్థని కేంద్ర ప్రభుత్వం తన ఇష్టానుసారంగా ఉపయోగించుకోవడం, మమత వంటి నిబద్ధత కలిగిన నేతలు సైతం తమ పార్టీ నాయకులు తప్పు చేసినా వెనకేసుకురావడం... ఈ రెండూ కూడా ప్రజస్వామ్యానికి తప్పుడు సంకేతాలని అందిస్తున్నాయి. నానాటికీ దిగజారిపోతున్న ఈ రాజకీయ విలువలను చూస్తూ- ఓ మహాత్మా ఓ మహర్షి అంటూ గుడ్ల నీరు కక్కుకోవడం తప్ప ఏం చేయగలం!

బీసీసిఐకి సుప్రీం బౌన్సర్‌

  మన దేశంలో ఓ గొప్ప సుగుణం ఉంది. ఇక్కడ ఎంతటి నియంతలైనా సరే... సమాంతర రాజకీయాలను నడపడం సాధ్యం కాదు. ఏదో ఓ సందర్భంలో వారికి పౌరుల నుంచో న్యాయవ్యవస్థ నుంచో భంగపాటు తప్పదు. రాజ్యంగవ్యవస్థని ధిక్కరించి ‘మమ్మల్నేం చేసుకుంటారో చేసుకోండి...’ అని జబ్బలు చరిచే అవకాశం ఇక్కడ ఉండదు. బీసీసీఐ విషయంలో ఈ నిజం మరోసారి రుజువైంది.   ఒకప్పుడు బీసీసీఐ అంటే ఏమిటో ఎవరికీ తెలియదు.కానీ ఎప్పుడైతే 1983 ప్రపంచకప్‌ తరువాత మనదేశంలో క్రికెట్‌ వేళ్లూనుకోవడం మొదలైందో... అప్పటి నుంచి ఆ మీద ఆట మీద అధికారాన్ని చెలాయించేందుకు అటు రాజకీయ నేతలూ, ఇటు వ్యాపారవేత్తలూ తహతహలాడటం మొదలుపెట్టారు. 2001లో జగ్మోహన్‌ దాల్మియా అధ్యక్ష పదవిని చేపట్టాక బీసీసీఐ సంస్థ పక్కా ప్రొఫెషనల్‌ సంస్థగా మారిపోయింది. క్రికెట్‌ ఆటని ఒక బంగారు బాతుగా మర్చేసి, వ్యాపారమే పరమావధిగా పనిచేయడం మొదలుపెట్టింది.   ఒక వైపు టెండూల్కర్, గంగూలీ, ద్రావిడ్‌, లక్ష్మణ్‌ వంటి ఆటగాళ్లు క్రికెట్‌ ఆటకి గొప్ప ప్రాచుర్యాన్ని తీసుకువస్తే... మరోవైపు ఆ ప్రాచుర్యాన్ని తనకు అనుకూలంగా ఉపయోగించుకోసాగింది బీసీసీఐ. లలిత్‌ మోదీ, శరద్ పవార్‌, శశాంక్‌ మనోహర్, రాజ్‌సింగ్‌ దుంగాపూర్‌ వంటి వారు బీసీసీఐలో చేరి ఆటని శాసించడం మొదలుపెట్టారు. ఒక స్థాయిలో ప్రపంచ క్రికెట్‌నే శాసించగల స్థాయికి బీసీసీఐ చేరుకుంది. బీసీసీఐతో ఏదన్నా వివాదం వస్తే, అవతల ఏ దేశమైనాన సరే వెనక్కి తగ్గాల్సిన పరిస్థితి వచ్చింది. మ్యాచ్ వేదికలను నిర్ణయించాలన్నా, అంపైర్లను తొలగించాలన్నా బీసీసీఐ పంతమే నెగ్గేది.   బీసీసీఐ ఒక సమాంతర శక్తిగా ఎదగడం చూసి నిస్సహాయంగా ఉండిపోవడం తప్ప ఎవరూ నోరెత్తి ప్రశ్నించలేకపోయేవారు. బీసీసీఐకి మాత్రం వ్యతిరేకంగా మాట్లాడినా వారి క్రీడా జీవితం అగమ్యగోచరంగా మారిపోయేది. కపిల్‌దేవ్‌ వంటి మహామహలు సైతం బీసీసీఐకి వ్యతిరేకంగా మాట్లాడినందుకు అవమానాల పాలయ్యారు. భారతీయ క్రికెట్‌ జట్టులో ఎవరుండాలి? ఆటగాళ్లు ఎన్ని ఆటలు ఆడాలి? ఎవరికి ఎంత రుసుం లభించాలి? వంటి కీలకమైన విషయాలను తనకి ఇష్టం వచ్చిన రీతిలో నిర్ణయించసాగారు బీసీసీఐ పెద్దలు. ఇక ఐపీఎల్‌ కూడా మొదలవడంతో ఆటగాళ్లను కేవలం గెలుపు గుర్రాలుగా మార్చి అమ్మకాలు మొదలుపెట్టేశారు.   నానాటికీ పెరిగిపోతున్న బీసీసీఐ నియంతృత్వం మీద ఎట్టకేళకు సుప్రీం కన్నుపడింది. దేశంలో క్రికెట్‌ మీద అధికారం చెలాయిస్తున్న సంఘాల తీరుని సమూలంగా ప్రక్షాళన చేసేందుకు జస్టిస్‌ లోధా నేతృత్వంలో ఓ సంఘాన్ని ఏర్పాటుచేసింది. బీసీసీఐ ఎప్పటిలాగే తన తలపొగరుకి తిరుగులేదన్న భ్రమతో కాలాన్ని గడపసాగింది. సంస్కరణలను రూపొందించే సమయంలో లోధా తనని సంప్రదించలేదంటూ అనురాగ్‌ ఠాకూర్ దర్పాన్ని ప్రదర్శించారు. కానీ అసలు నిన్ను సంప్రదించాల్సిన ఖర్మేంటంటూ సుప్రీం తలంటడంతో ఆయనకు మొదటిసారిగా శృంగభంగమైంది.   జులై 2016లో సుప్రీం కోర్టు లోధా కమిటీ సూచించిన సంస్కరణలలో చాలా అంశాల పట్ల తన ఆమోదాన్ని తెలియచేసింది. వాటిని నాలుగు నెలలలో అమలు చేయాలంటూ బీసీసీఐని ఆదేశించింది. కానీ అనురాగ్‌ ఠాకూర్‌ నేతృత్వంలోని బీసీసీఐ అప్పుడు చూద్దాం, ఇప్పుడు చూద్దాం అంటూ నానుస్తూ వచ్చింది. పైగా 70 ఏళ్లకు పైబడిని క్రికెట్‌ సంఘాల నేతలని తొలగించాలనే లోధా సిఫార్సు అమలు సాధ్యం కాదని సన్నాయినొక్కులు మొదలుపెట్టింది. ఎందుకంటే ఈ సంస్కరణతో శరద్‌పవార్ వంటి జిత్తులమారి వృద్ధ నేతలంతా ఆట మీద చెలాయిస్తున్న అధికారాన్ని వదులుకోక తప్పదు.   అనురాగ్‌ కుప్పిగంతులను, అహంకారపూరిత వ్యాఖ్యలనూ చూస్తూ వచ్చిన సుప్రీం చివరికి ఆయనను తొలగించి పారేయడంతో బీసీసీఐలో కొత్త శకం ఆరంభమైనట్లుగా భావించవచ్చు. ఇక నుంచి చట్టం కనుసన్నలలోనే బీసీసీఐ ప్రవర్తించక తప్పని పరిస్థితి ఏర్పడింది. దీని వలన భవిష్యత్తులో క్రికెట్‌కు మరింత మేలు జరుగుతుందనే భావిద్దాము. బీసీసీఐలో సుప్రీం జోక్యం కారణంగా మున్ముందు ధనప్రవాహంలో మార్పులు వచ్చినా... అసలైన ఆటగాళ్లకి తగిన గుర్తింపు లభిస్తుందనీ, ఎలాంటి పక్షపాత వైఖరీ లేకుండా, ఆటే తొలి ప్రాధాన్యతగా బీసీసీఐ తీరు సాగుతుందనీ ఆశిద్దాం.

అఖిలేష్‌ – తండ్రిని మించిన తనయుడా!

  గత ఆర్నెళ్లుగా ఉత్తర్‌ప్రదేశ్‌లో జరుగుతున్న తతంగాన్ని గమనిస్తే... సెంటిమెంటు దట్టించిన సీరియళ్లు సైతం దిగదుడుపుగానే తోస్తున్నాయి. తరచి చూస్తే ఉత్తర్‌ప్రదేశ్‌లో తండ్రీకొడుకులు ఎందుకంతగా తగువులాడుతున్నారో ఓ పట్టాన బోధపడదు. సమాజ్‌వాదీ పార్టీలో కురువృద్ధుడైన ములాయం సింగ్‌ యాదవ్‌ సోదరులలో రాంగోపాల్‌, శివపాల్‌లే ఈ పోరులో కీలకంగా నిలుస్తున్నారు. శివపాల్ ములాయం వైపు నిలుస్తుండగా, రాంగోపాల్‌ అఖిలేష్‌కు మద్దతిస్తున్నారు. వీరి ఆధిపత్యానికి చెక్‌ పెట్టే క్రమంలోనే తండ్రీకొడుకులు తగవులాడుకుంటున్నారు.   ఐదేళ్ల క్రితం ఉత్తర్‌ప్రదేశ్‌లో సమాజ్‌వాదీ ప్రతినిధిగా అఖిలేష్‌ను నియమించినప్పుడు అంతా సవ్యంగానే ఉన్నట్లు తోచింది. దేశంలోనే అతిపిన్న వయసులో ఆ పదివిని చేపట్టినవాడిగా అఖిలేష్‌ చరిత్ర సృష్టించారు. అయితే అఖిలేష్‌ను ముందుంచి తామే సర్వాధికారులుగా వెలిగిపోదామనుకున్న ములాయం, శివపాల్‌ల ఆలోచనలు చెల్లలేదు. దాంతో ములాయం బహిరంగంగానే అఖిలేష్‌ మీద విమర్శలు గుప్పించడం మొదలుపెట్టారు. మొదట్లో ఇవి ఏవో పెద్దరికంతో కూడుకున్న హెచ్చరికలుగా భావించిన అఖిలేష్‌ వర్గం... క్రమేపీ వాటి వెనుక అమర్‌సింగ్, శివపాల్‌ల ప్రభావం ఉందని గుర్తించాయి. దాంతో శివపాల్‌ ప్రాభవాన్ని తగ్గించే ప్రయత్నాలు మొదలుపెట్టారు అఖిలేష్‌. శివపాల్‌ వర్గీయుల మీద వేటు వేయడంతో మొదలైన ఈ పోరు నెలలు గడిచేసరికి తారస్థాయికి చేరుకుంది.   గత కొద్ది నెలలుగా శివపాల్‌, అఖిలేష్‌లు ఏదో ఒక గొడవపడటం.... ములాయం జోక్యంతోనో, పెద్దల రాయబారాలతోనో అవి సద్దుమణగడం జరుగుతోంది. ములాయంగారి ఉద్వేగపూరితమైన హెచ్చరికలు, అఖిలేష్ కన్నీటి ప్రసంగాలని ఉత్తర్‌ప్రదేశ్‌ ప్రజలు పరమ ఆసక్తిగా ఆస్వాదించారు. కానీ ఈ వివాదాలలో తాను మాత్రం తమ్ముడు శివపాల్‌ పక్షమని ములాయం స్పష్టమైన సంకేతాలు ఇస్తూనే వస్తున్నారు. దానికి తోడుగా అఖిలేష్ సూచనలను పక్కనపెట్టి ఎప్పుడైతే పార్టీ అభ్యర్ధులను ప్రకటించారో, అప్పుడిహ చాటుమాటుగా సాగిన తండ్రీకొడుకుల పోరుకాస్తా రచ్చకెక్కింది.   తండ్రీకొడుకులు తాడోపేడో తేల్చుకునే కీలకదశలో పార్టీ యావత్తూ అఖిలేష్‌కు అండగా నిలబడటం ఆశ్చర్యకరమైన పరిణామం. శివ్‌పాల్‌ నియంతృత్వం మీద విద్వేషమో, ములాయం మొండిపట్టు మీద కినుకో, పదవిలో ఉన్న అఖిలేష్ మీద పక్షపాతమో... కారణం ఏదైతేనేం, పార్టీ ఇప్పుడు అఖిలేష్‌ వైపు ఉన్నదని తేలిపోయింది. 229 మంది ఎమ్మెల్యేలకు గాను 200 ఎమ్మెల్యేలు అఖిలేష్‌కు మద్దతు పలకడమే దీనికి పరాకాష్ట. పార్టీ మీద తనకు పట్టుందని తేలిపోవడంతో అఖిలేష్ మరో అడుగు ముందుకువేశారు. ములాయంను ఏకంగా జాతీయ అధ్యక్ష పదవి నుంచి తప్పించి, తననే ఆ పదవికి ఎంపికయ్యేలా తగు జాగ్రత్తలు తీసుకున్నారు. ఇక అమర్‌సింగ్‌, శివ్‌పాల్‌ యాదవ్‌లను పార్టీ నుంచి బహిష్కరించారు. ఈ హఠాత్పరిణామం తరువాత ములాయం ఎన్ని బింకాలు పోయినా, పార్టీ తన చేయి దాటిపోయిందని మాత్రం గ్రహించక తప్పలేదు.   ఇంతకీ ఈ పరిణామాలన్నీ రాబోయే ఎన్నికలలో ఎలాంటి ప్రభావం చూపుతాయన్నదే విశ్లేషించదగ్గ విషయం. అఖిలేష్ ప్రభుత్వం అద్భుతాలు చేయనప్పటికీ, ప్రజలు ఆయనకు మద్దతుగానే ఉన్నారని కొన్ని సర్వేలు తేల్చి చెబుతున్నాయి. యువకుడు కావడం, వ్యూహాలు పన్నే నేర్పు కలిగి ఉండటం, చురుగ్గా మెసలడం, మౌలిక వసతుల మీద దృష్టి పెట్టడం వంటి లక్షణాలతో అఖిలేష్ మీద అక్కడ సానుభూతి మెండుగానే ఉంది. అధికారం కోసం అదను చూస్తున్న బీఎస్పీ, బీజేపీలకు ప్రస్తుత పరిస్థితులు ఎలా స్పందించాలో పాలుపోవడం లేదు. ఎందుకంటే ప్రజల ఆసక్తి అంతా ఇప్పుడు ములాయం, అఖిలేష్‌ల మధ్య జరుగుతున్న పోరు మీదే నిలిచి ఉంది. ప్రజల దృష్టిని అలా మరల్చేందుకే తండ్రీకొడుకులు నాటకమాడుతున్నారని విమర్శిస్తున్నవారూ లేకపోలేదు. అసలే ఈసారి ఉత్తర్‌ప్రదేశ్‌లో ఎలాగైనా భాజపా పాగా వేయాలని మోదీ పట్టుదలగా ఉన్నారు. పెద్ద నోట్ల రద్దు నిర్ణయం వెనుక ఈ ఎన్నికలలో ఎస్పీ, బీఎస్పీలు సాగించే ధనప్రవాహాన్ని అడ్డుకోవాలన్న వ్యూహం కూడా ఉందని చెబుతున్నారు. పైగా మొన్నటికి మొన్న మోదీ తన ప్రసంగంలో కురిపించిన వరాల జల్లులు కూడా ఈ ఎన్నికలను దృష్టిలో ఉంచుకునే వెలువడ్డాయని విశ్లేషిస్తున్నారు.   ఒక పక్క మోదీ ప్రభంజనం, మరోపక్క అమర్‌సింగ్‌వంటి నేతల జిత్తులు, ఇంకోవైపు పంతం నెగ్గించుకునే పట్టుదలతో రగులుతున్న తండ్రి... వీటిన్నింటినీ దాటుకుని, మాయావతిని ఎదుర్కొని, ప్రభుత్వ వ్యతిరేకతను అధిగమించి అఖిలేష్ మరోమారు ఉత్తర్‌ప్రదేశ్‌ ముఖ్యమంత్రిగా ఎన్నికవుతారా? అదే కనుక జరిగితే అతని రాజకీయ చతురత చరిత్రలో నిలిచిపోతుంది.

మోదీ మాట – ఊరించిందా! ఉసూరుమనిపించిందా!

నవంబరు 8. పెద్దనోట్ల రద్దు నిర్ణయాన్ని ప్రకటిస్తూ, 50 రోజులు ఓపిక పడితే అద్భుతాలు జరుగుతాయని మోదీగారు మాటిచ్చారు. జనం నోరు తెరుచుకుని ఆ అద్భుతం కోసం ఎదురుచూశారు. ఏటీఎంల ముందు నిల్చొని మరీ ఆ అద్భుతం ఎక్కడి నుంచి ఊడిపడుతుందా అని ఆశలపల్లకి మోశారు. 50 రోజులలో నగదు పరిస్థితి ఎలాగూ మెరుగుపడలేదు. పైగా నగదురహిత సహాజం అనే కొత్త పల్లవిని కేంద్రం అందుకోవడంతో... అసలు లోటు నగదుని భర్తీ చేసే ఉద్దేశమే ప్రభుత్వానికి లేదని అర్థమైపోయింది. సో.. 50కి మరో 150 రోజులు గడిచినా కూడా నగదు కోసం క్యూలు కట్టక తప్పదని తేలిపోయింది. దాంతో మరింకే అద్భుతం జరగనుంది అన్న అనుమానం మొదలైంది జనాలకి. మోదీగారు జాతిని ఉద్దేశించి ప్రసంగించనున్నారు అన్న వార్త రావడంతో... ఆ అద్భుతమేదో ఆయన నోటి నుంచే విందామనుకున్నారు దేశప్రజలు. నిన్న జాతిని ఉద్దేశించి చేసిన ప్రసంగంలో, ప్రధాని నల్లధనం గురించి మాట్లాడలేదు. ఇన్నాళ్లుగా ఎంత ధనం పోగైంది? అందులో నల్లధనం ఎంత? దాని వలన ప్రభుత్వానికి ఉపయోగం ఎంత? ఆ ఉపయోగాన్ని ప్రజలకు ఎలా చేరవేస్తున్నారు? లాంటి సవాలక్ష ప్రశ్నలకు జవాబు ఇవ్వలేదు. నల్లధనం అదుపు కోసం ఇంకెలాంటి కఠినచర్యలు తీసుకుంటున్నారో తెలియచేయలేదు. గృహరుణాల మీద వడ్డీ తగ్గింపు, సీనియర్ సిటిజన్లకు అధిక వడ్డీ, గర్భిణీలకు ఆరువేల రూపాయలు, రైతు రుణాల మీద రెండు నెలల వడ్డీ మాఫీ, చిన్న పరిశ్రమలకు రుణాలు అంటూ తాయిలాలు ప్రకటించారు. ఇవన్నీ కూడా సంక్షేమ పథకాలే! ఇలాంటి పథకాల వల్లే దేశ ఆర్థిక వ్యవస్థ నిస్సత్తువగా మారిపోతోందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.   అర్థిక వ్యవస్థను పరిపుష్టం చేయాలంటే ప్రజల జీవనస్థాయిని మెరుగుపరచాలే కానీ... వారిని ప్రభుత్వం మీద ఆధారపడేలా చేయకూడదన్నది నిపుణులు తెగ మొత్తుకుంటున్నారు. ఇలాంటి పథకాల వల్ల ఓట్లు రావడం, ప్రభుత్వపు భుజకీర్తులు తళతళ్లాడటం తప్ప దీర్ఘకాలిక ప్రయాజనాలు ఉండవన్నది నిపుణుల మాట. కాబట్టి, దేశ అర్థిక రంగాన్ని ప్రక్షాళనం చేస్తానంటూ వాగ్దానం చేసిన కేంద్ర ప్రభుత్వం ఇలా యూటర్న తీసుకోవడం ఆర్థికవేత్తలను సైతం నివ్వెరపరిచింది. కానీ నల్లనోట్ల రద్దుతో కునారిల్లుతున్న రియల్ఎస్టేట్ రంగాన్ని, చిన్న పరిశ్రమలని ప్రోత్సహించేందుకే ఈ రాయితీలు ప్రకటించామన్నది ప్రభుత్వ వర్గాల వాదన. ఇక నిరంతరం రైతుల కష్టాల గురించి మాట్లాడే ప్రతిపక్షాలకు చెక్ చెప్పేందుకే రైతు రుణాలలో వెసులుబాటుని అందించినట్లు తెలుస్తోంది.   మరి ఇంతకీ మోదీ మనసులో ఏముందన్నది చెప్పడం కష్టం. నిజంగా ఏ ఉద్దేశంతో పెద్దనోట్లని రద్దు చేశారు. మున్ముందు దేశ ఆర్థిక వ్యవస్థను ఏ తీరున నడిపంచబోతున్నారన్నది ఊహకందని విషయం. కానీ ఏ నిర్ణయానికైనా ఆయన వెనుకాడరని, తన ప్రణాళికలకు అనుగుణంగానే ప్రభుత్వాన్ని నడిపించదల్చుకున్నారనీ తేలిపోయింది. దాంతో ఆయన తీసుకునే నిర్ణయాల వల్ల భవిష్యత్తు బాగుపడుతుందని ఆశించడం తప్ప చేయగలిగిందేమీ లేదు.

దేశాన్ని కుదిపేసిన మూడు సంఘటనలు

  2016- సంఖ్యాపరంగా 9ని సూచించే ఈ సంవత్సరంలో అంతా శుభాలే జరుగుతాయని అంతా ఆశించారు. శుభాల సంగతేమా కానీ ఊహించని సవాళ్లు మాత్రం ఎదురుపడ్డాయి. పక్క రాష్ట్రాల దగ్గర్నుంచి ప్రపంచ దేశాల వరకూ అనూహ్యమైన పరిణామాలెన్నో చోటు చేసుకున్నాయి. ఇంట్లో తన మానాన తను పడుండే మధ్యతరగతి స్థితప్రజ్ఞులను సైతం ఉలిక్కిపడేలా చేశాయి. వాటిలో ముచ్చటగా మూడు పరిణామాలు ఇవీ...   2016 సంవత్సరం ఇలా అడుగుపెట్టిందో లేదో, పఠాన్‌కోట్‌ వైమానిక స్థావరం మీద పాక్ ప్రేరేపిత మూకలు అలా విరుచుకుపడ్డాయి. ఇందులో జరిగిన ప్రాణనష్టం సంగతి అటుంచితే, ఉగ్రమూకలు ఏకంగా మన రక్షణ రంగం మీదే దాడి చేసి, మన భద్రతా వ్యవస్థని వెక్కరించినట్లయ్యింది. పఠాన్‌కోట్‌ సంఘటనకీ తమకీ సంబంధం లేదంటూ పాకిస్తాన్ ఎన్ని చిల్లర మాటలని వల్లించిందో భారతీయులు పంటిబిగువున గమనిస్తూనే వచ్చారు. భారతీయుల సహనాన్ని అలుసుగా తీసుకున్న పాక్‌ చెలరేగిపోయింది. కశ్మీర్‌లో విధ్వంసాన్ని సృష్టించి మూడు నెలల పాటు అక్కడి జనజీవనం స్తంభించిపోయేలా చేసింది. పాకిస్తాన్‌ విధేయగణం అక్కడి ఉరీ సెక్టారులోని సైనికు స్థావరం మీద విరుచుకుపడి విధ్వంసాన్ని సృష్టించారు. దాంతో మన సహనానికి కూడా హద్దుంటుందన్న విషయాన్ని పాక్ పాలకులకు గుర్తచేయక తప్పలేదు. ఉరీ దాడికి ప్రతీకారంగా భారత సైన్యం సరిహద్దులను దాటుకుని వెళ్లి మరీ పాక్‌ గడ్డ మీద పాలుపోసుకుంటున్న ఉగ్రవాదులను తుదముట్టించింది. మున్ముందు మన జోలికి వస్తే ఏం జరుగుతుందో పాకిస్తాన్‌తో పాటుగా ప్రపంచానికి కూడా ఈ సర్జికల్ దాడులు హెచ్చరికగా నిలిచాయి.   సర్జికల్‌ దాడుల తరువాత మన దేశాన్ని కుదిపివేసిన మరో అంశం పెద్ద నోట్ల రద్దు. నల్ల ధనాన్ని వెలికితీయడమే తన లక్ష్యమంటూ పదవిని చేపట్టిన మోదీ తీసుకున్న ఈ నిర్ణయంతో దేశం యావత్తూ నివ్వెరబోయింది. 90 శాతం మనుషులు నగదు కార్యకలాపాలకే అలవాటు పడిన దేశంలో, ఏకంగా 87 శాతం నగదుని రద్దుచేయడంతో జనమంతా బ్యాంకుల బాట పట్టారు. ముందస్తు జాగ్రత్తలు తీసుకోలేదన్న విమర్శలు వినిపించినా, సాహసోపేతమైన నిర్ణయం అంటూ ప్రశంసలు లభించినా... ఏది ఏమైనా జనం సర్దుకుపోక తప్పలేదు. ఈ నిర్ణయంతో నల్లధనం మీద అంతగా ప్రభావం లేదని తేలిపోవడంతో కేంద్రం నగదు రహిత సమాజం అంటూ కొత్త పల్లవిని అందుకుంది. ఏది ఏమైనా ఈ నిర్ణయంతో మున్ముందు అద్భుతాలు జరుగుతాయనే ఆశతో... మధ్య తరగతి జీవి మాత్రం ఏటీఎంల చుట్టూ తిరుగుతూ తన సహనానికి పదును పెట్టుకుంటున్నాడు. సర్జికల్‌ దాడులు, పెద్దనోట్ల రద్దు తరువాత భారతీయులంతా ఉలిక్కిపడేలా చేసిన మరో అంశం ట్రంప్‌గారి విజయం. అమెరికా అధ్యక్షపదవి పోటీలో ముందు నిలిచిన ట్రంప్‌ విజయం ఆ దేశ వాసులకే కొరుకుడుపడటం లేదు. మన దేశ రాజకీయ నాయకులలాగానే ట్రంప్ ఆ దేశవాసుల భావోద్వేగాలను జయించే చిట్కాలు ప్రయోగించడంతో ట్రంప్ అనూహ్యంగా అమెరికా అధ్యక్షపదవిని చేరుకున్నారు. దేశవాసులకే ఉద్యోగాలిస్తాను, పరమతస్తులను అణిచివేస్తాను అంటూ వదరిన ట్రంప్ వాచాలత్వం అక్కడి పౌరుల మీద బాగానే పనిచేసినట్లుంది. కానీ ఈ సాంకేతిక యుగంలో అమెరికా అభివృద్ధి కోసం అహర్నిశం తోడ్పడిన అక్కడి భారతీయుల పరిస్థితే అగమ్యగోచరంగా మారిపోయింది. అమెరికాలో అడుగుపెట్టడమే జీవితాశయంగా భావించే నిపుణులకీ ట్రంప్‌ విజయం అడ్డుగోడ కానుంది. వీటికి తోడు చపలచిత్తానికి పేరుగాంచిన ట్రంప్ చైనా, పాకిస్తాన్‌లకు అనుకూలంగా ప్రవర్తిస్తాడేమో అన్న అనుమానంతో రాజకీయ విశ్లేషకులు తలలు పట్టుకుంటున్నారు.

శశికళ వర్సెస్ మోదీ

  తమిళనాట మరో అధ్యాయం మొదలైంది. శశికళని అన్నాడీఎంకే పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఇందులో పెద్దగా ఆశ్చర్యం ఏమీ లేదు. జయలలిత ఉన్నన్నాళ్లూ తన నుంచి పది అడుగుల కింద వరకు కూడా మరో నేత చేరుకోలేని విధంగా జాగ్రత్త పడ్డారు. తాత్కాలిక ముఖ్యమంత్రిగా బాధ్యతలు వహించిన పన్నీర్‌సెల్వం సైతం ఇంచుమించుగా జయకు సేవకుని పాత్రనే పోషించారు. దాంతో జయకు ఏకైక నేస్తమైన శశికళ తప్ప ఆ పార్టీకి మరో దిక్కు తోచలేదు. కానీ ఇక్కడే జాతీయ ప్రభుత్వానికీ అన్నాడీఎంకేకూ మధ్య అగాధం మొదలైనట్లు తోస్తోంది.   శశికళ జయకి ప్రియ నెచ్చెలి కావచ్చు. ఆమె నిర్ణయాల వెనుక ఒక బలమైన కారణంగా ఉండి ఉండవచ్చు. కానీ జయకు ఉన్న ప్రతి వివాదంలోనూ శశికళ పేరు కూడా వినిపిస్తుండేది. ఒక సందర్భంలో జయను సైతం అదుపు చేసే ప్రయత్నం చేసినట్లు పుకార్లు షికార్లు చేశాయి. అందుకనే ఆమెను కొన్నాళ్ల పాటు జయ పార్టీ నుంచి బహిష్కరించారు కూడా. అదంతా గతం కావచ్చు. కానీ వర్తమానంలోనూ శశికళ శైలి జాతీయ ప్రభుత్వానికి ఏమంత నప్పేదిగా లేదన్నది పరిశీలకుల మాట. జయ ఆసుపత్రిలో చేర్పించినప్పటి నుంచీ కూడా ఆమె ప్రవర్తన అనేక అనుమానాలకు తావిచ్చేదిలా సాగింది. జయ చెంతకి ఆమె రక్తసంబంధీకులను సైతం రానీయకుండా జాగ్రత్త వహించడం, జయ ఆస్తులు అధికారాల విషయంలో వ్యూహాత్మకంగా పావులు కదపడం చూస్తుంటే... ఆమె చతురత ఏ స్థాయిలో ఉందో, కేంద్ర ప్రభుత్వానికి తెలిసిపోయింది.   శశికళ పట్ల తీవ్రమైన అనుమానాలను రేకెత్తించే అంశం మరొకటి కూడా ఉంది. జయ ఉన్నన్నాళ్లూ శశికళ భర్త నటరాజన్‌తో సహా ఆమె కుటుంబసభ్యులు ఎవ్వరినీ దరికి రానీయలేదు. కానీ ఎప్పుడైతే జయ తుదిశ్వాస విడిచారో, ఆమె భర్త నటరాజన్ వచ్చి వాలిపోయారు. దిల్లీలోనూ, చెన్నైలోనూ తెగ తిరుగుతూ చక్రం తిప్పేందుకు ఉత్సాహపడిపోయారు. ఇలాంటి వ్యక్తుల చేతిలో కనుక రాష్ట్రాన్ని ఉంచితే ఏం జరుగుతుందో ఊహించడం పెద్ద కష్టం కాదు. అందుకనే శశికళని అడ్డుకునేందుకు కేంద్రం శతధా ప్రయత్నిస్తోందన్న సూచనలు కనిపిస్తున్నాయి. శశికళకు హితుడైన శేఖర్‌రెడ్డి చుట్టూ ఉచ్చు బిగించడం, ఆమెకు సన్నిహితులైన వారందరి మీదా నిఘాని పెంచడంతో ఆమెకు తగిన హెచ్చరికలే అందాయి. ఇక జయ అంత్యక్రియలలో శశికళని ఓదార్చిన మోదీగారు, ఆమెను తిరిగి కలుసుకునేందుకు కూడా ఒప్పుకోకపోవడంతో... ఆమె పట్ల వారి వైఖరి చెప్పకనే చెప్పినట్లయ్యింది. దాంతో ఎలాగొలా ముఖ్యమంత్రి పీఠాన్ని చేజిక్కించుకుందామనుకున్న శశికళ వర్గం, ఇప్పుడు ప్రధాన కార్యదర్శి పదవితో సరిపెట్టుకోవాల్సి వచ్చింది.   కథ ఇక్కడితో ముగిసిపోయిందనుకోవడానికి లేదు. శశికళ కూడా మోదీ సవాళ్లకు దీటుగానే స్పందిస్తున్నట్లు కనిపిస్తోంది. వద్దు వద్దంటూనే పార్టీ ప్రధాన కార్యదర్శి పదవిని చేపట్టడంతో, మున్ముందు ఆమె పార్టీలో బలమైన శక్తిగా ఎదిగేందుకు సిద్ధంగా ఉన్నారన్న సూచనలు కనిపించాయి. శశికళ కాకున్నా, ఆమెను అడ్డుపెట్టుకుని ఉన్న నటరాజన్‌ వంటి కుటుంబసభ్యులు ప్రభుత్వ పాలనలో ఎలాంటి జోక్యం చేసుకుంటారో వేచి చూడాల్సిందే! మరి మోదీ కూడా ప్రేక్షక పాత్రను వహిస్తారా లేకపోతే శశికళ ప్రాభవాన్ని వీలైనంతగా నిర్వీర్యం చేసేందుకు తనదైన శైలిలో దూకుడుగా వ్యవహరిస్తారా అన్నది వేచి చూడాల్సిందే!