మురుగునీటికి మోక్షం..!
ప్రస్తుతం ప్రపంచదేశాలను ముంచెత్తుతున్న ప్రధాన సమస్య నగరీకరణ . అభివృద్ధికి మార్గంగా, ఒక పర్యాయపరంగా ఇది మారిపోయింది. అలాగే అవకాశాల మెరుగుదలకు, ఆర్థికాభివృద్ధి నగరాల్లో ఉండాలని ప్రజలు నమ్మే పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో గ్రామీణ ప్రాంతాల నుంచి ప్రజలు నగరాలకు చేరుకుంటున్నారు. వీరి రాకతో నగరాలు, పట్టణాల్లో మౌలిక వసతుల కొరత తీవ్రమవుతోంది..చివరకు నగర జీవితం అంతుచిక్కని, అర్థంకాని సమస్యల వలయంలోకి ప్రజలను తీసుకువెళుతోంది. ఇవ్వాళ..దేశంలో ప్రధాన నగరాలన్నీ మురికివాడల సమస్యతో సతమతమవుతున్నాయి. ఇరుకు సందులు, ప్రణాళిక లేని కట్టడాలతో గాలి, వెలుతురు కూడా సరిగా ప్రసరించని పరిస్థితుల్లో మురికివాడలన్నీ దుర్భరమైన జీవన పరిస్థితులకు సాక్షి భూతాలుగా నిలుస్తున్నాయి.
ఇది పక్కనబెడితే అస్థవ్యస్థమైన డ్రైనేజ్ వ్యవస్థ నగరజీవికి ప్రత్యక్ష నరకాన్ని చూపిస్తోంది. ఇటీవల చెన్నై, హైదరాబాద్‌లలో వచ్చిన వరదలు దీనికి ఉదాహరణ. నీళ్లమధ్య ద్వీపాలుగా మారిన అసంఖ్యాక అపార్ట్మెంట్లు గమనిస్తే చాలు..అంతులేని నిర్లక్ష్యం మాటున కబ్జాలు..కాసుల వేటలు కనిపిస్తాయి. చెరువులు, నాలాలు, నదీతీరాలు కబ్జాలకు గురైన తీరు కళ్లకు కట్టినట్లు కనిపిస్తుంది. ఇదంతా ఒక ఎత్తైతే సగటు మనిషి తాగడానికి కూడా నీరు లభించని స్థితిలో ఉన్నది..గుక్కెడు నీరు కోసం గంటల తరబడి పడిగాపులు కాసే పరిస్థితి ఉందంటే అర్థం చేసుకోవచ్చు. సమస్య తీవ్రతను గుర్తించిన కేంద్రప్రభుత్వం పరిష్కారం దిశగా చర్యలు ప్రారంభించింది. మురుగు సమస్యను తీర్చడంతో పాటు వాటిని రీసైక్లింగ్ చేసి తాగునీరుగా మార్చే ప్రణాళికలో భాగంగా అమృత్ పథకాన్ని తీసుకువచ్చారు ప్రధాని మోడీ. దీనిలో భాగంగా దేశవ్యాప్తంగా 500 పట్టణాలను అభివృద్ధి చేస్తారు.
ఎంపిక చేసిన నగరాల్లో మౌలిక సదుపాయాల కల్పన, మురుగు కాల్వల నిర్వహణ, రవాణా, మొక్కల పెంపకం, పార్కుల అభివృద్ధి వంటి వాటికి నిధులను కేటాయిస్తారు. కేంద్ర పథకాలను అన్ని రాష్ట్రాల కంటే బాగా వినియోగించుకుంటున్న ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ విషయంలోనూ ముందే ఉన్నారు. కేంద్రం సహకారంతో రాష్ట్రంలో మురుగునీటి శుద్ధి కార్యక్రమం చేపట్టనున్నారు. మురుగు రూపంలో వృథాగా పోతున్న1.08 కోట్ల లీటర్ల నీటిని శుద్ధి చేసి వాడుకుంటే భూగర్భ జలాల రక్షణతో పాటు, వ్యవసాయ అవసరాలకు ప్రతిసారి ఆకాశం వైపు చూడాల్సిన అవసరం ఉండదు.
తొలి దశలో రాష్ట్రంలోని 12 నగరాలు, పురపాలక సంఘాల్లో మురుగునీటి శుద్ధి ప్లాంట్లను ఏర్పాటు చేయనున్నారు. అవి శ్రీకాకుళం, రాజమండ్రి, కాకినాడ, ఒంగోలు కార్పోరేషన్లు, తెనాలి, మచిలీపట్నం, చిలకలూరిపేట, కావలి, మదనపల్లి, కడప, ధర్మవరం, గుంతకల్ పురపాలక సంఘాలున్నాయి. ఇప్పటికే ఈ 12 ప్రాంతాల నుంచి సమగ్ర నివేదికను కేంద్ర ప్రభుత్వానికి పంపించడం, వాటికి కేంద్రం నిధులు మంజూరు చేయడం కూడా పూర్తయ్యింది. మిగిలిన సాంకేతికపరమైన పనులు ముగించి, వచ్చే ఏడాదిలోపు టెండర్లు పిలిచేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఇప్పటికే మిగులు విద్యుత్తు రాష్ట్రంగా అవతరించిన ఏపీ ఈ ప్రయోగాన్ని విజయవంతం చేసి నీటి కరువును నివారించాలని చూస్తోంది. ఏదేమైనా నీటిబొట్టును సద్వినియోగం చేసుకుని దిశగా ముందడుగు వేయడం శుభపరిణామం.