కాపుగాసి... లోకేష్ పై దాడి చేశారా?
posted on Oct 8, 2016 @ 4:17PM
కులం గాలి లాంటిది... అది లేకపోతే రాజకీయాలు బతకలేవు! అలాగని ఆ గాలి ఎక్కువై... దుమారంగా మారితే... అప్పుడు అన్ని పాలిటిక్సూ కొట్టుకుపోతుంటాయి! ఇదీ కులంతో వచ్చిన సమస్య!
నవ్యాంధ్రని ఏలుతోన్న టీడీపికి ఇప్పుడు కులం సమస్యే వచ్చినట్టు కనిపిస్తోంది. అభివృద్ధి, ప్రాజెక్ట్ లు, ఉద్యోగాలు లాంటివి అడిగే వారికన్నా కులాల క్యాలికులేషన్స్ చేసుకునేవారు ఎక్కువైపోయారు. సింధు సిల్వర్ మెడల్ గెలిస్తే ఆమె కులం ఏదీ అని గూగుల్ సెర్స్ చేశారంటే... మనోళ్ల కుల పిచ్చి ఎంతో అర్థం చేసుకోవచ్చు! ఇప్పుడు ఈ వీక్ పాయింటేనే ప్రతి పక్షాలు, వాటి అనుబంధ మీడియాలు, పోషల్ మీడియా శూరులు క్యాష్ చేసుకుంటున్నట్టు కనిపిస్తోంది! ఇంతకీ ఏమైందంటే...
వున్నట్టుండీ సోషల్ మీడియా సైట్లలో ఓ ఫోటో ప్రత్యక్షం అయింది. దాంట్లో ఆంధ్రా డిప్యుటి సీఎం నిమ్మకాయల చినరాజప్ప వేదిక కింద నిల్చుని వుంటారు. వేదిక మీద చిన బాబు లోకేష్ కనిపిస్తుంటారు. ఆయన వేలెత్తి చూపుతూ ఏదో మాట్లాడుతుంటారు. కాని, అది మౌనంగా వుండే ఫోటో కదా... అందుకే లోకేష్ ఏమన్నారో, చినరాజప్ప ఏమనిపించుకున్నారో మనకు తెలియదు. కాని, కొందరు కులోన్మాద రాక్షసులకు మాత్రం దాంట్లో ఎన్నో మాటలు వినిపించాయి. వెంటనే ఫేస్బుక్ లాంటి వేదికల్లో ప్రచారం మొదలైంది. ఇన్ ఫ్యాక్ట్, విష ప్రచారం స్టార్టైంది...
కాపు సామాజిక వర్గానికి చెందిన చిన రాజప్ప వయసులో పెద్దాయన. పైగా సౌమ్యుడని పేరుంది. ఆ కులం వారికి ఆయనంటే అభిమానం కూడా. సరిగ్గా ఈ పాయింట్ ని వాడుకునే ఎజెండా సిద్దం చేసుకున్నారు యాంటీ టీడీపీ బ్యాచ్. లోకేష్ ఫలానా మీటింగ్ లో చిన రాజప్పని తిట్టాడు. దారుణంగా అవమానించాడు. ఎంతగా అంటే, డిప్యుటీ సీఎం కళ్ల నీళ్లు పెట్టుకునేంతగా! ఇలా సాగింది నెగటివ్ క్యాంపైన్! మరి దీనికంతటికీ ఆధారం... ఒక్క ఫోటో మాత్రమే. అందులో చినరాజప్ప లోకేష్ ముందు నిలబడి వుంటారు. అంతకు మించి అందులో ఏముండదు. అయినా దుష్ప్రచారం మాత్రం ఆగలేదు. సోషల్ మీడియాలో వైసీపీ వర్గాలు, కాపు యూత్ గ్రూపులు ఇష్టానుసారం షేర్లు చేసేశాయి. వీలున్నంత వరకూ కాంగ్రెస్ వాళ్లు కూడా దీన్ని జనంలోకి పంపే ప్రయత్నం చేశారు!
డిప్యుటీ సీఎంను లోకేష్ తిట్టాడన్న ప్రచారం ఎందుకు జరిగింది? దాని వెనుక కారణాలు ఏంటి? ఎవరున్నారు? వాళ్లకి దీని వల్ల కలిగే లాభం ఏంటి? ఇలా బోలెడు ప్రశ్నలు. ఒక్కోటి చూద్దాం. కాని, అంతకంటే ముందు మనం స్టోరీలో బాగా వెనక్కి వెళ్లాలి. ఫ్లాష్ బ్యాక్ లో ఏమైందో కూడా తెలుసుకోవాలి! పవన్ కళ్యాణ్ కూడా చినరాజప్పలా కాపు సామాజిక వర్గానికి చెందిన ప్రముఖుడు. లోకేష్ లాగే పరిటాల కూడా టీడీపీ తరుఫున జనంలో విపరీతమైన గుర్తింపు వున్న నేత! వాళ్లిద్దరి మధ్య లేని గొడవని రాజేశారు చాన్నాళ్ల కింద!
పవన్ కళ్యాణ్ కి పరిటాలకి ఏదో విషయంలో గొడవ జరిగిందనీ, పవర్ స్టార్ కి పరిటాల గుండు గీయించారనీ... అప్పట్లో అదేపనిగా దుష్ప్రచారం జరిగింది. అది తప్పుడు ప్రచారం అని ఈజీగా చెప్పొచ్చు. ఎందుకంటే, తనకు అన్యాయం జరిగితే బెదిరిపోయి కిక్కురుమనకుండా వుండిపోయే నైజం పవన్ కళ్యాణ్ ది కాదు. మరి అటువంటప్పుడు పరిటాల రవితో ఆయనకు గొడవైతే సైలెంట్ గా ఊరుకుంటాడా? అంతకు మించి పరిటాల దాడి చేశాడని రాసిన డెక్కన్ క్రానికల్ పేపర్ వారి ఆపీస్ ముందు ధర్నా చేస్తాడా? ఇలా ఇప్పుడు వెనక్కి తిరిగి ఆలోచిస్తే అంతా ఉట్టిదేనని అర్థమైపోతుంది! అయినా అప్పుడు ఎందుకని ఆ గాసిప్ వ్యాపింపజేశారు? లాజిక్ చాలా సింపుల్... టీడీపికి దగ్గరయ్యే చాన్స్ వున్న కాపుల్ని ఆ పార్టీకి దూరం చేయటమే లక్ష్యం! దాన్ని పరిటాల, పవన్ ల మధ్య శత్రుత్వంగా చీత్రీకరించి సక్సెస్ అయ్యారు. టీడీపికి కాపు ఓట్లు తరువాతి ఎన్నికల్లో అస్సలు పడలేదు! మరి దీని వల్ల లాభపడింది ఎవరు? కాపు ఓట్లు కొల్లగొట్టిన కాంగ్రెస్!
ఇప్పుడు కూడా కాపుల్ని తమ వైపు తిప్పుకోటానికి కొన్ని దుష్ట రాజకీయ శక్తులు కాపుగాస్తున్నాయి. వాటి కుటిల కుల తంత్రాలే పదే పదే ఎగిసిపడుతోన్న నిరసన జ్వాలలు. చంద్రబాబు ఎన్నికల ముందు అనివార్యమై హామి ఇచ్చిన కాపుల రిజర్వేషన్ అంశం... ఇప్పుడు బాగా పనికొస్తోంది ప్రత్యర్థులు తమ 'ముద్ర' వేయటానికి! అవును... కాపుల ఆత్మాభిమానంపై తమదైన ముద్రవేసి వార్ని టీడీపికి దూరం చేసే జగన్నాటకం నడుస్తోంది!
ఆ మధ్య జరిగిన కాపు గర్జన సభ అనూహ్యమైన హింసకు దారి తీసింది. ఓ రైలు మొత్తం తగులబెట్టారు. కాని, అసలు గతంలో కాపుల్ని బీసీల్లో చేర్చమని జరుగుతోన్న ఉద్యమం ఏనాడైనా హింసాత్మకం అయిందా? మరెప్పుడూ కానిది తునిలో మాత్రం ఎందుకు అయింది? నిజానికి అవ్వలేదు... చేశారు! అధికారం కోసం కాపు కాచుకుని కూర్చున్న వారు... కాపులపై కపట ప్రేమ ఒలికిస్తూ విధ్వంసానికి కారణం అయ్యారు...
2014లో కాపులు వన్ సైడెడ్ గా టీడీపికి జైకొట్టారు. ఇది చాలా మందికి మింగుడుపడటం లేదు. అందుకే, వచ్చే ఎన్నికల నాటికి ఆ సామాజిక వర్గాన్ని తెలుగుదేశానికి దూరం చేయాలని విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. అందులో భాగమే లోకేష్ , చినరాజప్పల ఉదంతం!
పవన్ కళ్యాణ్, పరిటాల ఎపిసోడ్ తో ఒకప్పుడు చేసినట్టే ఇప్పుడూ చేద్దామని దుర్భుద్ధి గల వాళ్లు ఆలోచిస్తున్నారు. డిప్యుటి సీఎంని... కాబోయే సీఎం అన్న ప్రచారం వున్న లోకేష్... తిట్టాడని కట్టుకథలు చెప్పి కాపుల ఆత్మాభిమానం దెబ్బతిస్తున్నారు. నిజంగా మాత్రం అసలక్కడ ఏమీ జరగలేదేన్నది టాక్! టీడీపీలోని అత్యంత విశ్వసనీయ వర్గాల ప్రకారం చినరాజప్ప ఏదో మాట్లాడినప్పడు ఆయనకు మామూలుగానే లోకేష్ సమాధానం ఇస్తుంటే సదరు ఫోటో తీశారు. పక్కనున్న వాళ్ల ఎక్స్ ప్రెషన్లు చూస్తే కూడా లోకేష్ డిప్యుటీ సీఎంని కటువుగా ఏమీ అనటం లేదని మనకు అర్థమైపోతుంది!
ప్రభుత్వంలో భాగం కాని లోకేష్ నిజంగా ఉప ముఖ్యమంత్రి స్థాయిలోని నేతను ఏమన్నా అంటే అది తప్పే. కాని, ఏమీ జరగకుండానే దుష్ప్రచారం జరిగిపోయింది. పైగా వైరల్ అయిన ఆ ఫోటోను సోషల్ మీడియా దొంగలు లోకేష్ ఫేస్బుక్ పేజ్ లోంచే తీసుకున్నారట! ఆయన పర్సనల్ సోషల్ మీడియా టీమ్ దాన్ని పొరపాటున అప్ లోడ్ చేసిందట. మళ్లీ తీసేసేలోపు డౌన్ లోడ్ చేసుకున్న ప్రబుద్ధులు... ఫోటో చుట్టూ కథ అల్లేశారు. కాపులకి అవమానం అంటూ గావుకేకలు పెట్టారు! నెటిజన్స్ చాలా వరకూ నమ్మేశారు. అయితే, లోకేష్ భవిష్యత్ లో పార్టీనే నడిపించే అవకాశం వున్న వాడిగా చాలా జాగ్రత్తగా మసలు కోవాలి. ఆయన టీమ్ లోని వారికి రాజకీయ పరిణతి, అంకిత భావం లాంటివి వున్నయా అని చూసుకోవాలి. లేదంటే వాళ్లు చేసే పొరపాట్లు ఇలా ఒక కులం మొత్తాన్నీ దూరం చేసే ప్రమాదం వుంది. ఇక చంద్రబాబు కూడా కాపుల కోసం , బ్రాహ్మణుల కోసం కార్పోరేషన్లు పెడుతూ కుల ఒత్తిళ్లకు తలొగ్గకపోతే చాలా బెటర్. ఎందుకంటే, వాటి వల్ల ఆయా కులాలకు కలిగే లాభం కన్నా ఇతర కులాల వారికి కలిగే మనస్తాపం ఎక్కువ.
కాపుల్ని బీసీల్లో చేర్చటం అనే దానిపై త్వరగా తేల్చి... ఏపీ సీఎం అందరికీ అభివృద్ధి అనే ఆదర్శవంతమైన లక్ష్యం వైపు దూసుకెళితే చాలా బావుంటుంది! లేదంటే గతంలో టీడీపీ కాపులకి దూరమై ఎంతో నష్టపోయినట్టే ఇప్పుడూ ఇబ్బంది పడాల్సి వస్తుంది. కారణం... కాపు ఓటర్ల కోసం కాపుగాసిన తోడేళ్లు బోలేడు వుండటమే!