నెహ్రు భారత్ ని... నవ భారత్ గా మార్చిన... భారత రత్నం!
posted on Oct 14, 2016 @ 10:59AM
మనకో పద్యం వుంది... చాలా పాతది! దాంట్లో కంచు మోగినట్టు కనకంబు మోగునా అంటాడు కవి! నిజమే కంచులా కనకం మోగదు. కాని, నిశ్శబ్ధంగా వుండే కనకానికే విలువ ఎక్కువ. కంచుతో కంటికి పెద్దగా కనిపించే పాత్రలు బోలెడు చేసుకోవచ్చు. కాని, కనకంతో ఓ చిన్న నెక్లెస్సో, ఉంగరమో చేసుకుంటాం. కనకం విలువ అలాంటిది! మన మాజీ ప్రధాని పీవీకి ఈ కనకం పోలిక అద్భుతంగా సరిపోతుంది...
దేశాన్ని ఏలిన కాంగ్రెస్ ప్రధానుల్లో గాంధీ కుటుంబానికి చెందని అత్యంత వివాదాస్పదుడు పీవీ. ఆయన హయాంలోనే బాబ్రీ కూలటంతో కాంగ్రెస్ సైలెంట్ గా తనని పక్కన పెట్టింది. అంతే కాదు, గాంధీలకు పీవీ అంటే పడకపోవటం కూడా పబ్లిక్ సీక్రెట్టే! ఆయన చనిపోతే ఢిల్లీలో సమాధి కూడా లేకుండా చేసిన ఘనత సోనియా నేతృత్వంలోని యూపీఏది. కాని, కాంగ్రెస్ పార్టీలో పీవీ ఎంతగా అవమానాలు ఎదుర్కొన్నారో... అంతే గొప్ప పేరు పార్టీకి బయట తెచ్చుకున్నారు. ఆయన చనిపోయి ఒక్కో సంవత్సరం గడుస్తున్న కొద్దీ ఆ దార్శనికుడి గొప్పతనం అంతకంతకూ ఇనుమడిస్తోంది!
ఈ మధ్యే... 1991 - హౌ పీవీ నరసింహారావు మేడ్ హిస్టరీ అనే పుస్తకం విడుదలైంది. దాన్ని రాసింది మన తెలుగు వాడు సంజయ్ బారు. పీవీకి సలహాదారుగా పని చేసిన ఆయనకు మాజీ ప్రధాని గురించి చాలా విషయాలు తెలుసు. అందుకే, ఆయన రాసిన పుస్తకం గురించి దేశ వ్యాప్తంగా చర్చ జరుగుతోంది. మాజీ ఆర్బీఐ గవర్నర్ రంగరాజన్ కూడా బారు పుస్తకంపై స్పందించారు. ఇవాళ్ల మనం ప్రత్యక్షంగా చూస్తోన్న ఈ అభివృద్ధి, ఆర్దిక ప్రగతి అంతా పీవీదేనని తేల్చి చెప్పారు!
రంగరాజన్ లాంటి ఆర్దికవేత్తలే కాదు పీవీ గురించి ఇప్పుడు చాలా మంది పాజిటివ్ గా మాట్లాడుతున్నారు. అందుక్కారణం నిజంగా ఆయన 1991లో దేశాన్ని ఆర్దిక పాతాళం లోంచి పైకెత్తటమే. అప్పట్లో భారత్ తన వద్ద వున్న బంగారు నిల్వలు కూడా తాకట్టు పెట్టుకుని దిగుమతులు చేసుకునే దివాలా స్థితికి దిగజారిపోయింది. నెహ్రు కాలం నుంచీ చేస్తూ వచ్చిన సొషలిస్టు ప్రయోగాలన్నీ బెడిసి కొట్టి ప్రమాదం అంచున నిలుచున్నాం. సరిగ్గా అప్పుడు కాంగ్రస్ స్థంభం పగులకొట్టుకుని బయటకొచ్చిన నరసింహారావు మనల్ని పీడిస్తున్న హిరణ్యకశ్యపుడి లాంటి ఆర్దిక విధానాల్ని చీల్చి చెండాడారు. అదీ అరకొర మద్దతున్న తన మైనార్జీ ప్రభుత్వంతోనే! విదేశీ పెట్టుబడులకు దార్లు తెరుస్తూనే గ్రామీణాభివృద్ధి మీద కూడా ఆయన ఎంతో దృష్టి పెట్టారు. 1991లో పీవీ తీసుకున్న పలు కీలక నిర్ణయాలే ఇవాళ్టికీ మన పాలకుకలకి ఆదర్శంగా నిలుస్తున్నాయి.
ఆర్దికంగా దేశాన్ని పైకెత్తిన పీవీ నరసింహారావు ఫారిన్ పాలసీ కూడా సమూలంగా మార్చేశారు. ఇండియా నెహ్రు కాలం నుంచీ దూరంగా వుంటూ వస్తోన్న చాలా దేశాలకి ఆయన కాలంలో దగ్గరైంది. అంతర్జాతీయంగా మనకు కొత్త శకం మొదలైంది. ఇన్ని చేసినా గత రెండు దశాబద్దాల్లో పీవీకి ఏ మాత్రం తగినంత ప్రాముఖ్యత దక్కలేదు. పేరు రాలేదు. కాంగ్రెస్ పార్టీనే ఆయనపై కక్ష్య కట్టి స్కాముల్లో పేరు వినిపించేలా చేసింది. గాంధీలు ఆగ్రహంతో ఆయనకు భారత రత్న ఇవ్వకుండా ఊరుకున్నారు. బాబ్రీ కూలటానికి కేవలం పీవీ ఒక్కడిదే బాధ్యత అన్నట్టు ముస్లిమ్ ల ముందుర ఆయన్ని విలన్ని చేశారు. ఇన్ని చేసినా నిజం నిలకడగా బయటకొస్తూనే వుంది. సంజయ్ బారూ పుస్తకం ఆ కోవలోనే వచ్చిన తాజా వాంగ్మూలం...
ప్రతీ ప్రధాని కాలంలో ఏదో ఒక అపఖ్యాతి కలిగించే సంఘటన జరుగుతుంది. కాని, అది మరిచిపోయి అతడి కాలంలో జరిగిన మంచిని గుర్తు చేసుకోవటమే సంస్కారం. నెహ్రు కాలంలో మన నేల చైనాకు పోయింది! ఇందిర కాలంలో ఎమర్జెన్సీ వచ్చింది! వాజ్ పేయి కాలంలో కాందహార్ హైజాక్ ఉదంతం దెబ్బతీసింది! అలాగే పీవీ టైంలో బాబ్రీ కూల్చివేత జరిగింది. కాని, అంతకు మించి చాలా మంచి జరిగింది. ఇవాళ్ల దేశ వ్యాప్తంగా కోట్లాది ఉద్యోగాలు చేసుకుంటున్న యువత ఎవరి వల్ల సమరోత్సాహంతో వుంది? సమాధానం ... పీవీ నరసింహారావు!