సిక్స్ త్ ఫింగర్ లా మిగిలిపోతున్నా యూఎన్ఓ!
posted on Sep 27, 2016 @ 12:30PM
ఐక్యరాజ్య సమితి... అంటే యూఎన్ఓ... ఇది మనకు చాలా పెద్ద సంస్థ కావొచ్చు. ప్రపంచ దేశాలన్నీ సభ్యులుగా వున్న అతి ప్రభావవంతమైన శక్తి కావొచ్చు. కాని, సింపుల్ గా మాట్లాడుకుంటే అదో అంతర్జాతీయ రచ్చబండ! ఊళ్లో రచ్చబండ వద్ద ఏమవుతుందో అక్కడా అదే అవుతుంది! ప్రపంచ దేశాలన్నీ అక్కడ పంచాయితీలు పెట్టుకుంటాయి. పరస్పర చర్చలతో సామారస్యంగా పరిష్కారాలు వెదుక్కుంటాయి. 1945 నుంచీ ఇలాగే జరుగుతోంది కూడా..
ఊళ్లో రచ్చబండ దగ్గర కేవలం పంచాయితీలు మాత్రమే వుండవు. అక్కడ రాజకీయాలు వుంటాయి. ఐరాస లోనూ అదే జరుగుతుంటుంది. గ్రామంలో పెద్దలుగా చలామణి అయ్యేవారు రచ్చబండ వద్ద తమ పంతం నెగ్గించుకుంటూ వుంటారు. తమ పరపతి, శక్తి, డబ్బు ఉపయోగించి మామూలు జనాన్ని లొంగదీసుకుంటుంటారు. పైగా దానికి ఊరంతటి అమోదం కూడా రచ్చబండ వద్ద వేయించుకుంటుంటారు! యూఎన్ఓ లో జరిగేది, జరుగుతున్నది అచ్చంగా ఇదే! అమెరికా లాంటి అగ్రదేశాల రచ్చబండలా మారిపోయింది ఐక్య రాజ్య సమితి! ఇక్కడే అసలు ఆందోళనకర పరిణామాం చొటు చేసుకుంటోంది...
ఒకప్పుడు ఐరాస అంటే ప్రపంచ దేశాలు బాగానే గౌరవం ఇచ్చేవి. చిన్న చిన్న దేశాలైతే భయపడేవి కూడా. కాని, ఇప్పుడు పరిస్థితి మారిపోయింది. యూఎన్ఓ ఏ దేశంలోకి వచ్చి మానవ హక్కుల ఉల్లంఘన విషయాన్ని పరిశీలిస్తానన్నా అందరూ ముఖం మీదే తలుపులు వేస్తున్నారు. ఈ పని చేస్తోంది ప్రపంచంలోని శక్తివంతమైన దేశాలో, భారత్ , చైనా లాంటి అభివృద్ధి చెందుతున్న దేశాలో కాదు! అత్యంత అనామక దేశాలు, పేద దేశాలు, చిన్న దేశాలు యూఎన్ ని డోంట్ కేర్ అంటున్నాయి.
వెనెజుల, పాకిస్తాన్, సిరియా, ఉత్తర కొరియా... ఇలా బోలెడు దేశాలు తమ భూభాగంలో మానవ హక్కుల ఉల్లంఘనకి పాల్పడుతున్నాయి. అమాయకుల్ని కిరాతకంగా చంపేస్తున్నాయి.
ఉదాహరణకి పాకిస్తాన్ నే తీసుకుంటే బలూచిస్తాన్ విషయంలో అమానుషంగా ప్రవర్తిస్తోంది. సామూహిక హత్యాకాండ, కిడ్నాప్ లు, అత్యాచారాలు, విషప్రయోగాలు... ఇలా పాక్ చేయని రాక్షస కృత్యం లేదు బలూచిస్తాన్లో. అయినా ఐక్యరాజ్య సమితి ఏమీ చేయలేకపోతోంది. కారణం పాక్ ఐక్యరాజ్య సమితిలో సభ్య దేశం అయి వుండి కూడా మాటవినకపోవటమే. ఇప్పటి వరకూ పాకిస్తాన్ లాగా మానవహక్కుల ఉల్లంఘనకు పాల్పడుతున్న చాలా దేశాలు యూఎన్ ప్రతినిధుల్ని తమ నేలపై కాలు పెట్టనివ్వటం లేదు.
భారత్ కూడా ఐక్యరాజ్య సమితిని పక్కకు పెట్టిన సందర్భాలున్నాయి. కాశ్మీర్లో మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతోందని ఐరాస అంటే అది మా అంతర్గత అంశమని ఇండియా బదులిచ్చింది! నిజంగా చాలా చోట్ల జరుగుతున్న మానవ హక్కుల ఉల్లంఘన కంటే కాశ్మీర్లో జరుగుతున్నది అత్యంత అప్రస్తుతం. అయినా కూడా రాను రాను ఐక్యరాజ్య సమితిని దేశాలు పట్టించుకోవటం లేదనే దానికి భారత్ ప్రవర్తన కూడా ఒక ఉదాహరణ!
అసలు ప్రపంచ పటంలోని చిన్న చిన్న దేశాలు కూడా ఐరాసను ఎందుకు పట్టించుకోవటం లేదు? కారణం ఇంతకు ముందు చెప్పుకున్నట్టే... పెద్ద దేశాల స్వార్థం. అమెరికా, బ్రిటన్ లాంటి దేశాలు పదే పదే యూఎన్ మాటను బేఖాతరు చేస్తుంటాయి. లేదా తమకు కావాల్సినట్టు తీర్పులు, తీర్మానాలు చేయించుకుంటాయి! ఇరాక్ మీద యుద్ధం సమయంలో ఇదే జరిగింది. యూఎన్ లో ఎన్ని దేశాలు వద్దన్నా అమెరికా, బ్రిటన్ , ఫ్రాన్స్ లు తమ పంతం నెగ్గించుకున్నాయి. ఇరాక్ పై దాడి చేశాయి. ఇదే మిగతా దేశాలకు ఐరాస పై గౌరవం, భయం తగ్గేలా చేస్తోంది...
ఇలాగే ఐక్యరాజ్య సమితి బలహీనపడితే తీవ్ర ఆందోళనకర పరిణామాలే చోటు చేసుకుంటాయి. ఇప్పటికే ఉగ్రవాదం, ఆయుధాల, అణు బాంబుల రేస్ లో తలమునకలైన ప్రపంచం ఏదో ఒక రోజు మూడో ప్రపంచ యుద్ధం ముంగిట్లో నిలుస్తుంది. దాన్ని అడ్డుకునేందుకే ఒకప్పుడు యూఎన్ ఏర్పాటు జరిగింది. కాని, ఇప్పుడు దాని పరిస్థితి చూస్తుంటే ఆ ఉద్దేశ్యం నెరవేర్చేలా అస్సలు కనిపించటం లేదు...