ఓ సైనికుడి లేఖ... ఇది దేశద్రోహులకి మాత్రమే!
posted on Oct 4, 2016 @ 3:13PM
మన యువ సైనికులు సరిహద్దు దాటారు. ఉగ్రవాదులపై దాడులు చేశారు. విజయవంతంగా తిరిగి వచ్చారు. యావత్ దేశం ఆనందంతో ఉప్పొంగింది. యావత్ దేశం... కేవలం కొంత మంది తప్పా!ఫవాద్ ఖాన్ ని పాకిస్తాన్ కి తిప్పి పంపితే ఉగ్రవాదం ఆగిపోతుందా అన్న ధర్మ సందేహం వస్తుంది కరణ్ జోహర్ కి! మహేష్ భట్ వెంటనే అతడికి జత కలుస్తాడు. ''ఉగ్రవాదం ఆపండి... చర్చలు కాదు'' అంటూ సెలవిస్తాడు! పాక్ ఏం చేసినా మాట్లాడుతూనే వుండాలని అతడి ఫీలింగ్! క్రికెట్ బోర్ట్ పాకిస్తాన్ తో క్రికెట్ ఆడుతూనే వుంటుంది. కొన్ని వ్యాపార సంస్థలు పాక్ తో యధావిధిగా వ్యాపారాలు చేస్తూనే వుంటాయి. ఇవన్నీ ఎప్పుడు జరుగుతున్నాయి? సరిహద్దులో మన సైనికులు ఆత్మ త్యాగాలు చేస్తుంటే!
పాకిస్తానీ నటుల్ని వెనక్కి పంపటం, పాకిస్తాన్ తో క్రికెట్, వ్యాపారం మానేయటం... వీటి వల్ల నిజంగా ఉగ్రవాదం అంతం అవుతుందా? కాదు... ఎంత గింజుకున్నా అవ్వదు కూడా. కాని, సంఘీభావం అంటూ ఒకటి వుంటుంది కదా! అసలు ఏమీ కానట్టు సినిమాలు రూపొందిచుకుంటూ, క్రికెట్ ఆడుకుంటూ, వ్యాపారం చేసుకుంటూ వుండలేం కదా. ఎందుకంటే, ఏమీ కాకుండా వుండటం లేదు కదా! ఒకవేళ అలా చేస్తూపోతే, చివరకు మన జవానుకు ''నేనే ఎందుకు ఈ యుద్ధ భారం మొత్తం మొయ్యాలి'' అనే ఆలోచన వచ్చేస్తుంది!
ప్రస్తుతం ఇండియా, పాకిస్తాన్ మధ్య జరుగుతోన్న సంఘర్షణ... సైనికుడి వ్యక్తిగత యుద్ధం అస్సలు కాదు. అతను మన కోసం ఛస్తున్నాడు. చంపుతున్నాడు. కాని, కరణ్ జోహర్, మహేష్ భట్ లాంటి వాళ్లు చేస్తున్న పనులకి ఆ సైనికుడు ఎలా ఫీలవుతాడు? ఒక్కసారి ఆలోచించండి! అతను తన ఉన్నతాధికారి వద్దకి పోయి ''రెండు దేశాల మధ్యా అంతా మామూలుగానే నడుస్తుంటే... నేనుందుకు లైన్ ఆఫ్ కంట్రోల్ దగ్గర మరణించాలి సార్?'' అంటాడా? అనడా?
మహేష్ భట్ పాకీలతో చేతులు కలిపినట్టే... ఒక భారతీయ సైనికుడు కూడా వెళ్లి పాకిస్తాన్ సైనికుడితో షేక్ హ్యాండ్ ఇస్తే... మీకు ఎలా అనిపిస్తుంది? ఏ... అతనొక్కడే ఎందుకు ఆత్మ త్యాగం చేయాలి? మిగతా అందరూ హాయిగా మజా చేస్తుంటే? మన సైనికులు అలాంటి దేశ ద్రోహానికి పాల్పడరు. అలాంటి ఆలోచన వారికి రావటానికి ముందే వారు యుద్ధంలో వీరమరణం పొందుతుంటారు... అసలు దేశభక్తి, త్యాగం... ఇవ్వి కేవలం సైనికుడి బాధ్యతలేనా? ఈ దేశం ఎంతగా సైనికుడిదో... అంతే మహేష్ భట్ ది కూడా!
మాస్కోలో జరిగిన ఒలంపిక్స్ ని అమెరికా 1980లో బహిష్కరించింది. అందుకు జవాబుగా 1984 లాస్ ఏంజెలిస్ ఒలంపిక్స్ ను రష్యన్లు బహిష్కరించారు. జాతీయ శ్రేయస్సు అన్నిటికంటే ముఖ్యం అనుకున్నప్పుడు అలాంటి నిర్ణయాలు జరుగుతాయి! మన దేశంలో కూడా ఇప్పుడు అదే జరగాలి.గడిచిన 70ఏళ్లలో పాకిస్తాన్ ఎంతో మంది భారతీయుల్ని చంపింది. అయినా మనకు సినిమాలు తీసుకోవటం, క్రికెట్ ఆడుకోవటమే ముఖ్యమా? మనకు రోదనలతో నిండిపోయిన అమరులైన సైనికుల ఇళ్లు కనిపించవా? పద్దెనిమిది సైనిక కుటుంబాలు అద్దంలా బద్ధలైపోయాయి! అయినా మన బాలీవుడ్ మహారాజావార్ల నుంచీ ఒక్క మాటా రాలేదు. కాని, ఫవాద్ ఖాన్ తిరిగి పాకిస్తాన్ కు వెళ్లిపోతే మాత్రం భరించలేనంత నొప్పి పుట్టింది! పాకిస్తానీ కళాకారులకి మద్దతుగా ఓ ట్వీట్ రాసేయటం తప్పనిసరైపోయింది!
పాకిస్తాన్ నుంచి రాహత్ ఫతే అలీ ఖాన్ ఇక్కడకు వచ్చి పాడక ముందు హిందీ సినిమాలో గొప్ప సంగీతమే వుండేది కాదన్నట్టు భ్రమ కల్పిస్తుంటారు కొందరు బాలీవుడ్ దర్శక, నిర్మాతలు. అటు క్రికెట్ బోర్డుకు డబ్బులు సంపాదించుకోవటమే పని. దానికి ఒక చనిపోయిన సైనికుడి భార్య చేసే మౌన రోదన, ఒక అనాథ బిడ్డ చేసే ఆక్రందన అస్సలు పట్టదు. ఎంతసేపూ ఇండియా , పాకిస్తాన్ మధ్య డే అండ్ నైట్ మ్యాచ్ లే ముఖ్యం. పైగా యాషెస్ కంటే ఇండియా పాక్ మ్యాచే ఎక్కువగా చూస్తారని గొప్పగా చెప్పుకుంటుంటారు!
మరి సైనికులు? వెలుగు జిలుగుల బాలీవుడ్ స్టూడియోలకు, టేక్ చెక్కతో అందంగా మెరిసిపోయే బీసీసీఐ బోర్డ్ రూంలకు దూరంగా ... వాళ్లు ఎక్కడో వేరే గ్రహంపై వుంటారని కొందరి ఫీలింగ్! రక్తం, ధూళీ, అరుపులు, పేలిపొతుండే మందుగుండు... ఇవన్నీ వాళ్లకు చాలా దూరం, చాలా అసౌకర్యవంతం!. లైనాఫ్ కంట్రోల్ కు వెయ్యి మైళ్ల దూరంలో కూర్చుని శాంతి కావాలని కోరుకోవటం చాలా తేలిక. అంతే కాదు, సాయంత్రమైతే ఏ పార్టీకి వెళ్లాలి? తరువాతి సినిమాకు ఎక్కడ్నుంచి ఫైనాన్స్ తెచ్చుకోవాలి? ఇవే మీ సమస్యలైనప్పుడు శాంతి కావాలని అడగటం మరింత తేలిక! కాని, శాంతి అంటే పంచ్ డైలాగ్ కాదు. అది యుద్ధం ముగిశాక వచ్చే అంతిమ ఫలితం!
స్టాప్ టెర్రరిజమ్... నాట్ టాక్స్ అన్న మహేష్ భట్ కంటే పదేళ్ల పిల్లలు కూడా పరిణతితో ఆలోచిస్తారు!
- మేజర్ గౌరవ్ ఆర్య