వార్ ని నివారించలేమా?
posted on Oct 12, 2016 @ 1:12PM
విజయదశమి విజయవంతంగా ముగిసింది. ఇక ఇప్పుడు అందరి దృష్టీ దీపావళి మీద. కాని, దీపావళి బాంబుల కంటే ప్రస్తుతం అందర్ని ఎక్కువగా ఆకర్షిస్తున్నవి... నిజమైన బాంబులు! కారణం ప్రధాని మోదీనే స్వయంగా చేసిన కామెంట్!
మోదీ దసరా సందర్భరంగా రావణ దహనం కార్యక్రమంలో పాల్గొన్నారు. లక్నోలో ఆయన జై శ్రీరామ్ అంటూ ఉపన్యాసం మొదలు పెట్టడం సహజంగానే సెక్యులర్ నేతలకు కావాల్సినంత పని అప్పజెప్పింది. కాని, మోదీ స్పీచ్ లో అత్యంత ముఖ్యమైంది జై శ్రీరామ్ నినాదం కాదు. అవసరమైతే యుద్ధం చేసి తీరుతాం అన్న హెచ్చరిక! ఇది ఖచ్చితంగా పాకిస్తాన్ కు కలవరం కలిగించేదే...
నియంత్రణ రేఖ దాటి సర్జికల్ స్ట్రైక్స్ చేశాక పాక్ పై మనది పై చేయి అయింది. అందుకే, ఆ దేశం లోలోన కుతుకుత ఉడికిపోతోంది. ఎలాగైనా దెబ్బ తీయాలని తహతహలాడుతోంది. రోజూ ఉగ్రవాదుల చొరబాటుకు తనవంతు సాయం చేస్తూనే వుంది. కాల్పుల విరమణ ఉల్లంఘించి పదే పదే రెచ్చగొడుతోంది. అందుకు మన ఆర్మీ కూడా తీవ్రంగా స్పందిస్తూ కాల్పులు జరుపుతూనే వుంది. ఉగ్రవాదుల్ని ఎక్కడికక్కడ వెదికి పట్టి వేటాడుతోంది...
బార్డర్ లో వుండే వాళ్ల దృష్టిలో అయితే పాక్ తో యుద్ధం ఇప్పటికే మొదలైపోయింది. కాని, మనలా దూరంగా వున్న వాళ్లకు ఆ పరిస్థితి అర్థం కావటం లేదు. అయితే, మన జవాన్లు ఆల్రెడీ దసరా కూడా జరుపుకోకుండా యుద్ధ రంగంలోకి దిగిపోయారు. ఏ ఉగ్రవాదినీ వదలకుండా ఎన్ కౌంటర్లు చేస్తున్నారు. మోదీ కామెంట్ ఈ పరిస్థితికే అద్దం పడుతుంది. ఇంత వరకూ ఊరుకున్నట్టు ఇక పై మౌనం ప్రదర్శించేది లేదని మోదీ స్పష్టంగా సందేశం ఇచ్చేశారు. పాకిస్తాన్ ఎంతగా రెచ్చగొడితే అంతే తీవ్రంగా మన సైన్యం జవాబిస్తుంది. ఆ క్రమంలో పూర్తి స్థాయి యుద్దం అయినా వెనక్కి వెళ్లేది లేదన్నది ఇప్పుడు క్లియర్...
మోదీ ఒక వైపు యుద్ధం అనివార్యం అంటూనే అది మన కోరిక కాదని కూడా చెప్పారు. అయితే, పాక్ చర్యలు చూస్తుంటే తెగే దాకా లాగాలన్నట్టుగానే వుంది దాని ప్రవర్తన. తాజాగా పాక్ ఆర్మీ ఔట్ పోస్ట్ లపై రెడ్ ఫ్లాగ్స్ దర్శనమిచ్చాయి. అంటే ఎప్పుడైనా ముందస్తు సమాచారం లేకుండా కాల్పులు జరిపే అవకాశం వుందని అర్థం. ఇటు భారత్ కూడా రెడ్ ఫ్లాగ్స్ పైకెత్తింది. కాల్పులు మొదలైతే ఇటు నుంచి కూడా భీకర కాల్పులతోనే జవాబు వుంటుందని దానర్థం. అంతే కాదు, ఆయుధ తయారీదారులకి ఇప్పటికే మన ప్రభుత్వం యుద్ధం వస్తే ఉత్పత్తికి సిద్ధంగా వుండాలని సూచించింది...
జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే... మోదీ తాజా ప్రకటన కూడా యుద్ధం తప్పకపోవచ్చని తేల్చేయటం... కొంత ఆందోళన కలిగించే విషయమే. ఎందుకంటే, యుద్ధం రెండు దేశాలకీ నష్టమే. కాని, పాకిస్తాన్ ఏర్పడ్డ నాటి నుంచీ దాని ప్రవర్తన హింసను అనివార్యం చేస్తోంది. సీమాంతర ఉగ్రవాదంతో ఆ దేశం మనల్ని నిరంతరం వేధిస్తోంది. కాబట్టి ఎప్పుడో ఒకప్పుడు అంతిమ యుద్ధంతో పాక్ కు బదులు ఇవ్వాల్సిందే. అందుకు, బీజేపికి 282సీట్లున్న మోదీ ప్రభుత్వం తప్ప మరింత గొప్ప సువర్ణావకాశం మనకు అస్సలు రాదు! పాకిస్తాన్ ను వీలైనన్ని ముక్కలు చేయటానికి ఇదే సరైన సమయం!
సాటి దేశాన్ని ఛిన్నాభిన్నం చేయటం నైతికంగా సరైంది కాకున్నా ఆత్మరక్షణ కోసం ఏ దేశం ఏం చేసినా తప్పేం కాదు. ఎందుకంటే, ఇన్ లవ్ అండ్ వార్ నథింగ్ ఈజ్ రాంగ్!