మీడియాగిరి అనబడు... గూండాగిరి, దాదాగిరి!
posted on Oct 3, 2016 @ 6:01PM
మీకు గూండాగిరి తెలుసు... దాదాగిరి తెలుసు... చెంచాగిరి కూడా తెలుసు! అలాగే పాజిటివ్ గా గాంధీగిరి కూడా ఈ మధ్య అందరూ వాడేస్తున్నారు! కాని, మీడియాగిరి తెలుసా? అదేంటి అంటారా? మీడియాగిరి అంటూ కొత్తగా ఒకటి స్టార్టైంది..మీడియా అంటే సినిమా మొదలు ఫేస్బుక్, ట్విట్టర్ లాంటి సోషల్ సైట్స్ వరకూ అన్నీ వస్తాయి. అయితే, వాటన్నిటిలో న్యూస్ పేపర్స్, న్యూస్ ఛానల్స్ తీరే వేరు! అవి అదో టైపు! వీట్నే ఇంగ్లీషులో మెయిన్ స్ట్రిమ్ మీడియా అంటుంటారు! సాధారణంగా మీడియా అనగానే అందరూ గుర్తు చేసుకునేది కూడా పేపర్లు, ఛానల్స్ నే! కాకపోతే, ఫోర్త్ ఎస్టేట్ అని గొప్పగా చెప్పుకునే ఈ వ్యవస్థ మొత్తం ఇప్పుడు ఫోర్స్ డ్ బిజినెస్ గా మారిపోయింది!
మీడియా కాస్తా మాఫియాలా మారిపోయి మీడియాగిరి చేస్తూ సమాజంలోని అన్ని వర్గాల్ని బెంబేలెత్తించే విలన్ లా తయారైంది! ఈ స్టేట్మెంట్ కాస్త తప్పుగా అనిపించినా చాలా వరకూ కరెక్టే! ఇప్పటికీ జర్నలిజం విలువలకి కట్టుబడి అన్యాయాన్ని ఎదురిస్తున్న మీడియా ఖచ్చితంగా వుంది. అలాగే మన దేశంలో రొటీన్ గా పుట్టే వేల కోట్ల విలువైన స్కాంలు దాని వల్లే వెలుగు చూస్తున్నాయి. లక్షల కోట్లు దోచుకునే నేతలు... మీడియా వల్లే జనం ముందు దోషులుగా నిలబడుతున్నారు. అయినా కూడా మీడియాకి మరో కోణం వుంది! అదే మీడియాగిరి...
మీ పుట్టిన రోజుకి ఎవరైనా మీకు శుభాకాంక్షలు చెబితే ... మీరు డబ్బులు అడుగుతారా? అడగరు కదా? మన మీడియా అడుగుతుంది! ఈ మధ్య కొన్ని పత్రికలు, కొన్ని ఛానల్స్ తమ వార్సికోత్సవాలకు యాడ్స్ దండుకుంటున్నాయి. ఓ సంవత్సరం గడిచి కొత్త సంవత్సరంలోకి కాలుపెడుతోంది సదరు పత్రికో, ఛానలో అయితే ఎక్కడెక్కడో వున్న కంపెనీలు, షో రూంలు, వ్యాపార సంస్థలు అడ్వర్టైజ్ మెంట్లు ఇస్తుంటాయి! ప్రైవేట్ సంస్థలు, ప్రైవేట్ వ్యక్తులు అయితే ఫరవాలేదు... మరీ దారుణంగా ప్రజల సొమ్ముతో యాడ్స్ ఇచ్చే గ్రామపంచాయితీలు కూడా మీకు కనిపిస్తుంటాయి! సర్పంచ్ లు పనిగట్టుకుని ఈ పేపర్లకి, ఛానల్స్ కి యాడ్స్ ఇచ్చేస్తుంటారు! అసలు ప్రజల సొమ్ము యాడ్స్ రూపంలో మీడియా పాలు చేయటం ఏంటి?
పత్రికలకు , ఛానల్స్ కు బర్త్ డే విషెస్ చెప్పే యాడ్స్ ఎలాంటివంటే... కొందరు కమర్షియల్ స్వామీజీలు, బాబాల వద్దకి వెళితే భక్తులు వాళ్ల కాళ్లపై పడి వారికే దక్షిణ సమర్పించుకోవాలి! ఇదీ అలాంటిదే! కాకపోతే, స్వామీజీలకు దక్షిణ ఇస్తే చేతిలో బూడిద ప్రసాదంగా పోస్తారు! ఇక్కడ మన మీడియాలోని కొన్ని సంస్థలు ... తమకు యాడ్స్ ఇవ్వకపోతే బూడిద చేసిపారేస్తాయి! అవును... హెడ్ ఆఫీస్ నుంచి వచ్చే ఆదేశాలకు, టార్గెట్ లకు అనుగుణంగా జిల్లాల్లోని రిపోర్టర్లు, స్ట్రింగర్లు గన్నుల్లాంటి తమ గన్ మైక్ లు పట్టుకుని పిట్టల దొరల్లా బయలుదేరిపోతారు. బతిమాలో, బెదిరించో, బెంబేలెత్తించో యాడ్స్ పడుతుంటారు! అది పత్రికా, ఛానల్ తాలూకూ వార్షికోత్సవం కానియండీ, దసరా, దీపావళి, ఎన్నికల ప్రకటనలు కానివ్వండి! ప్రతీ సందర్భంలో మీడియా ఎంటరై మీడియాగిరి మొదలుపెడుతుంది! పనిలో పనిగా సంస్థ తరుఫున గొట్టం పట్టుకుని వచ్చిన రిపోర్టరో, స్ట్రింగరో కూడా నాలుగు కాసులు జేబులో వేసుకుంటాడు! తిల పాప హరం ... తల పిడికెడు అన్నట్టు వుంటుంది వ్యవహారం...
మీడియా మొత్తం మీడియాగిరి చేస్తూ బిజినెస్ మెన్ని, పొలిటీషన్స్ ని, అఖరుకి స్వామీజీల్ని, బాబాల్ని, కమర్షియల్ జ్యోతిష్యుల్ని... ఇలా అందర్నీ అల్లాడిస్తోందని చెప్పలేం. ఉదాహరణకి ఈనాడు గ్రూప్ నే తీసుకోండి... వారి పేపర్, ఛానల్స్ లో ఎక్కడా వార్షికోత్పవ శుభాకాంక్షలు కనపడవు! అంటే ఈనాడు , ఈటీవీ అంటే ఎవ్వరికీ అభిమానం లేదనా? వుంది కాని... ఈనాడు వాళ్లు వెళ్లి బెదిరించి ఆ అభిమానాన్ని యాడ్స్ గా మార్చుకోవటం లేదు. కాని, మిగతా కొన్ని పత్రికలు , ఛానల్స్ ఈ పని విచ్చలవిడిగా చేసేస్తున్నాయి! దీన్నే చెప్పేవి శ్రీరంగ నీతులు... దూరేవి... అంటారేమో!
మీడియాగిరిలోని ఇంకో కోణం కూడా వుంది. అది సినిమా ఇండస్ట్రీ కోణం! సినిమా వాళ్లు తమకు చేతనైనంత అందంగా మొత్తం ప్రపంచాన్ని మాయ చేస్తే... వాళ్లని చావగొట్టి చెవులు మూసేది మీడియా! మళ్లీ ఇక్కడా అంతే... మొత్తం మీడియా సినిమా వాళ్లని బ్లాక్ మెయిల్ చేయటం లేదు. కాని, కొన్ని పత్రికలు , ఛానల్స్ యాడ్స్ ఇస్తేనే సినిమా గురించి మంచిగా రాస్తాయి. లేదంటే ఎంత మంచి సినిమా తీసినా తమ రివ్యూలతో రక్తం కక్కిస్తాయి!
సినిమా వాళ్లని బ్లాక్ మెయిల్ చేసే విషయంలో కొన్ని పేపర్లు, ఛానల్స్ మాత్రమే కాదు... కొన్ని గ్రేట్ వెబ్ సైట్ల సంగతి కూడా చర్చించాలి. వెబ్ సైట్లు పెట్టడం పేపర్, ఛానల్ కన్నా చీప్ కాబట్టి బోలెడు పోర్టల్స్ తయారయ్యాయి. అన్నిటికీ అల్లాడించే సీన్ వుండకపోయినా కొన్ని మాత్రం బాగానే పాప్యులర్ అయ్యాయి. ఆ పాప్యులారిటి అడ్డం పెట్టుకుని నిన్న మొన్నటి వరకూ బూతు వార్తలు రాసుకుంటూ వచ్చేవి. ఏ హీరోయిన్ కి ఎవరితో లింక్ వుంది, ఎవరు ఎవరితో కాంప్రమైజ్ అయిపోయి తిరిగేస్తున్నారు అంటూ పర్వర్టెడ్ వార్తలు రాసేవి. కాని, ఇండస్ట్రీలో కొంత పేరొచ్చాక రివ్యూల బాంబులు బయటకు తీస్తుంటాయి ఈ వెబ్ సైట్లు! పాకిస్తాన్ ఇండియా మీద అణు బాంబు వేస్తామని బెదిరించినట్టు ఈ వెబ్ సైట్లు రివ్యూల్ని రాస్తామని భయపెడతాయి! డబ్బులు ఇస్తే సినిమా సూపర్ అని, ఇవ్వకపోతే సినిమా చూడటం కంటే సుయిసైడ్ చేసుకోటం మేలని చెబుతాయి! తమ ఇష్టానుసారం... పాయింట్ ఫై, ప్రో పాయింట్ ఫై అంటూ రేటింగ్ లు కూడా ఇస్తుంటాయి ... ఈ పాయింట్ ఫై వెబ్ సైట్లు! దీన్ని మనం ఇంటర్నెట్ మీడియాగిరి అనొచ్చు...
ఒకప్పటి దూరదర్శన్ కాలం కాదిప్పుడు. ఎవ్వరికి డబ్బుంటే వారు పేపరో, ఛానలో, వెబ్ సైటో పెట్టేసుకునే మీడియాగిరి టైమ్స్! అందుకే, సమాజాన్ని బాగుచేస్తాం అంటూ ఇబ్బడిముబ్బడిగా మీడియా పుట్టుకొస్తోంది! చివరకు, సమాజాన్ని బాగుచేయటం అటుంచి తాను మాత్రం చక్కగా బాగుపడుతోంది! యాడ్స్ గిరి, మీడియాగిరి చేస్తూ గూండాగిరి, దాదాగిరికి కొత్త రూపం ఇస్తోంది...