ఆమెగా కాక... అమ్మగా చూడటమే... భారతీయ సంస్కృతి!
posted on Oct 5, 2016 @ 4:57PM
నవరాత్రులు నడుస్తున్నాయి. దసరాని తీసుకురాబోతున్నాయి. కాని, దసరా అంటే ఒక కొత్త జత బట్టలు, రెండు పూటలా పిండి వంటలు, మూడు , నాలుగు రోజుల హడావిడి... ఇంతేనా! ఖచ్చితంగా కాదు. భారతీయ సంస్కృతిలో నవరాత్రులు, వాటి చివర్న వచ్చే దసరా స్త్రీ శక్తికి సాష్టాంగ నమస్కారం! సమున్నత సత్కారం....
దసరా అంటే సరదానే! కాని, సరదా మాత్రమే కాదు! దసరా అంటే దశ మార్చేది! దిశ నిర్ధేశించేది! కొత్త ప్రయాణం ప్రారంభింపజేసేది! అన్నిటికంటే ముఖ్యంగా, భారతదేశంలో యుగయుగాలుగా వస్తోన్న స్త్రీ ఆరాధనకి అతి పెద్ద సంబరం! అసలు ఇవాళ్ల మనం సూటిగా మాట్లాడుకుంటే మొత్తం ప్రపంచంలో స్త్రీ శక్తిని దైవంగా ఆరాధించటం కేవలం మన దేశంలో మాత్రమే జరుగుతోంది. హిందూ మతంలో మాత్రమే వుంది. ప్రపంచంలోని ఇతర ప్రముఖ మతాలైన ఇస్లాం, క్రిస్టియానిటి, బౌద్ధం వంటి వాటిల్లో స్త్రీ దేవతలు వుండరు. వున్నా వారికి తగినంత ప్రాముఖ్యత కనిపించదు.
దసరా అంటే విజయదశమి. అది తొమ్మిది రొజుల పాటూ సాగిన శరన్నవరాత్రి ఉత్సవాలకి పరాకాష్ట! రోజుకో రూపంలో పూజలందుకున్న అమ్మవారు విజయదశమి నాటితో మహిషాసుర సంహారం పూర్తి చేసి విజయానికి ప్రతీకగా నిలుస్తుంది! నిజంగా కూడా సృష్టిలో స్త్రీయే అసలు సిసలు విజయ సంకేతం!
ఆమె ప్రత్యేకంగా కోట్లు సంపాదించాల్సిన అవసరం లేదు. బంగాళాలు కట్టాల్సిన అగత్యం లేదు. వ్యాపారాలు చేసి తాపత్రయపడాల్సిన కారణమూ లేదు. తాను తనలా వుంటే చాలు విజయం సాధించినట్టే! ఎందుకంటే, స్త్రీ... పురుషుడు చేయలేని అతి గొప్ప కార్యమైన జన్మనివ్వటం అనే పని చేస్తుంది! తద్వారా ఈ యావత్ మానవజాతి విజయవంతంగా మనగలగటానికే ఆమె విజయ రహస్యం అవుతోంది! ఇక పుట్టిన బిడ్డ ఎన్నో నెలలు, ఏళ్ల పాటూ తల్లి మీదే ఆధారపడతాడు. తిండి కోసం, దాహం కోసం, రక్షణ కోసం, శిక్షణ కోసం... అన్నిటికి తల్లి మీదే బాధ్యత వేస్తుంది శిశువు! అయినా ఎంతో ప్రేమతో, మమకారంతో స్త్రీ పిల్లల్ని ఓపిగ్గా పెంచి పెద్ద చేస్తుంది. ఈ ఒక్క కర్తవ్యం ఆమెను అమ్మని చేస్తుంది. ఆ అమ్మని .... అమ్మలగన్నమ్మాగానూ చేస్తుంది!
నిత్య జీవితంలో మన చుట్టూ వుండే ఆడవాళ్ల బాధ్యతలు, త్యాగాలు, గొప్పతనాలే సనాతన ధర్మంలో స్త్రీ దేవతల ఆవిర్భావానికి కారణాలు. మన వేదాలు, ఇతిహాసాలు, పురాణాలు స్త్రీని రతి దేవీ నుంచి కాళికా దేవీ వరకూ అన్ని కోణాల్లోనూ ఆవిష్కరించాయి. మహిళ అంటే కేవలం అందం, శృంగారం మాత్రమే కాదన్నది మన దేశంలో అనాదిగా వస్తోన్న అభిప్రాయం. అందుకు చక్కటి ఉదాహరణ రతీ, రంభా అంటూ స్త్రీలని చిత్రీకరించిన మన పురాణ కథలే లక్ష్మీ, సరస్వతి, కాళీ అంటూ కూడా చెప్పాయి. ఒకవైపు అందం, సున్నితత్వం, మోహం, మాయా వంటి వాటికి ఆడవార్ని సంకేతం చేసినప్పటికీ అదే స్త్రీని అమ్మగా చూడటం కూడా మన పెద్దలు చెప్పారు. ఐశ్వర్యానికి కూడా స్త్రీనే అధిష్టాన దైవంగా నిర్ణయించారు! లక్ష్మిగా సకల సంపదలు ఇచ్చేది అమ్మే!
సంపదలకి, శుభాలకి స్త్రీనే ముఖ్యమని మనుస్మృతి కూడా చెబుతోంది. చాలా మంది ఎన్నో రకాల ఆరోపణలు చేసే మనుస్మృతిలో యత్ర నార్యంతు పూజ్యంతే అంటూ చెప్పాడు మనవు. దానర్థం నారి పూజింపబడితేనే దేవతలు నివసిస్తారనీ! దేవతలు అంటే శుభాలు, సంతోషాలు అనే! ఇంట్లో ఆడవాళ్లు దుఃఖిస్తూ వుంటే ఎంతటి ధనవంతుడైనా సుఖంగా, మనః శాంతితో వుండలేడు. అందుక్కారణం మగవాడి ఆనందం తల్లి, భార్య, కూతురు, తోబుట్టువుల రూపంలో వున్న స్త్రీయే! ఆమె లేకుంటే ఇల్లు నాలుగు గొడలుగా మాత్రమే మిగులుతుంది. స్త్రీ పురుషుడితో కలిసినప్పుడే అది కుటుంబం అవుతుంది. ఈ కారణం చేతనే మన వాళ్లు ఆడవార్ని గృహ లక్ష్మీ అన్నారు!
భారతదేశంలో స్త్రీ ఆరాధన జరుగుతోంది కాబట్టి, నవరాత్రులు అవుతున్నాయి కాబట్టి ఇక్కడందరూ చాలా భద్రంగా వున్నారని ఎవ్వరం అనలేం. కాని, నిర్భయ లాంటి దారుణాలు జరిగే మన దేశంలోనే సింధు లాంటి అమ్మాయిలు విశ్వ విజేతలుగా నిలిచి వస్తున్నారు. దీనికి కారణం మన సంస్కృతిలో అనాదిగా ఇమిడి వున్న శాక్తేయమే. అప్పుడప్పుడు చరిత్రలో ఆడవారి పట్ల అమానుషాలు జరుగుతూనే వున్నాయి. అది కాదనలేని సత్యం. ఒక దశలో సతీ లాంటి దురాచారాలు మహిళల్ని నిలువునా బలితీసుకుంటే ఇప్పుడు అత్యాచారాలు, గృహ హింస లాంటివి రాజ్యమేలుతున్నాయి. అయినా కూడా మిగతా ప్రపంచంతో పోల్చుకున్నప్పుడు భారతీయ సంస్కృతి స్త్రీకి ఇచ్చిన మహోన్నత స్థానం అద్భుతమైంది. చాలా దేశాలు, ప్రాంతాల కంటే ఇక్కడ ఆడవారు కొనసాగించే జీవితం మేలైంది. ఒకవైపు మధ్య ప్రాచ్య దేశాలు, ఇస్లాం ప్రాబ్ల్యం వున్న దేశాలు, కొన్ని ఆఫ్రికా దేశాల్లో ఆడవారికి కనీస మానవ హక్కులు వుండటం లేదు. అటు పాశ్చాత్య దేశాల్లో మహిళల్ని పూర్తిగా మార్కెట్ వస్తువులుగా మార్చేస్తున్నారు. స్వేచ్ఛ వున్నా వెస్టన్ కంట్రీస్ లో స్త్రీ పట్ల ఆరాదన భావం తక్కువ.
భారతదేశంలో స్త్రీకి దక్కే గౌరవం, స్వేచ్ఛ ఎంతో సంతృప్తికరం. అలాగని మనం ఆడవారి పట్ల అనుసరిస్తున్న కొన్ని విధానాలు మార్చుకునే పనిలేదని చెప్పటం ఇక్కడ ఉద్దేశం కాదు. కాకపోత, మనం మాతృ స్వరూపిణి అయిన స్త్రీ పట్ల మరింత గొప్పగా వ్యవహరించటానికి మనకు ప్రేరణంతా వేదాలు, పురాణాలు, ఇతిహాసాల్లోనే వుందని గ్రహించటమే ముఖ్యం! విద్యలకు అధిదేవతగా సరస్వతిని మన సంస్కృతిని చెబుతోంది. మరలాంటప్పడు ఆడపిల్లలకు చదువు వద్దని అనటం ఎంత అమానుషం! అలాగే, ప్రేమ స్వరూపం రాథా దేవీ. అటువంటి ప్రేమ స్వరూపిణి అయిన ఆడదాన్ని ఆడపిల్లగా వుండగానే భ్రణహత్యకు పాల్పడటం ఎంత కిరాతకం! ఇక శక్తికి మూలం దుర్గా, పార్వతి, గౌరీ, కాళీ అంటూ ఎన్నో పేర్లతో పిలవబడే అమ్మవారు! ఆమె లేకుంటే శివుడంతటి వాడు కూడా స్థబ్ధుగా, నిశ్చలంగా వుండిపోతాడంటోంది వేదాంతం! అంటే, ఈశ్వరుడిలోని సత్తువ కూడా ఆ అమ్మే! ఆ అన్నపూర్ణే! ఆమె లేకుంటే మనకు ఏం వుంటుంది? ప్రాణం మొదలు జీవితం వరకూ ఏదీ వుండదు! అయితే, మనం అర్థం చేసుకోవాల్సింది ఒక్కటుంది... ఈ మొత్తం విశ్వాన్ని నడిపే విశ్వ శక్తి అయిన విశాలాక్షి మరెవరో కాదు... భూమ్మీది ప్రతీ మనిషికీ జన్మనిస్తూ అమ్మ అనిపించుకుంటోన్న ఆడదే! 'ఈమె'ని 'ఆమె'లా చూడటమే... అసలైన భారతీయ సనాతన సంస్కృతి!