కొడుకుల మోజులో కొంపలు మునుగుతున్నాయ్!

రాముడి కోసం దశరథుడు పుత్రకామేష్ఠి చేశాడు. అలాగే, కృష్ణుడ్ని తమ కొడుకుగా పొందేందు కోసం దేవకీ, వసుదేవులు అంతకు ముందు జన్మలో తీక్షణమైన తపస్సులు చేశారు. ఇలా మన పురాణాల్లో పూజలు, పునస్కారాలు అన్నీ కొడుకుల్ని కనేందుకే చేస్తుంటారు? మరి కూతుళ్లు వద్దా? కాస్త ఓపిక చేసుకుని  చదివితే మన పురాణాల్లో, ఇతిహాసాల్లో కూతుళ్ల కోసం తపస్సు చేసిన వారు కూడా కనిపిస్తారు. అలా ఎందరికో పార్వతీ, లక్ష్మీ వంటి అమ్మవార్లు వరమిచ్చి తామే స్వయంగా బిడ్డలుగా పుట్టారు కూడా!  ఇక భారతీయ సంస్కృతిలో పుత్రులకు మరీ ఎక్కువ ప్రాధాన్యం వుంది. అమ్మాయిలకు లేదనే అపవాదు కూడా వుంది. ఇది కూడా తప్పుడు ప్రచారమే. పుత్రుడు లేకపోతే పున్నమ నరకం వస్తుందని చెప్పిన మన శాస్త్రాలే కన్యా దానం చేస్తే కోటి అశ్వమేధ యాగాలు చేసినంత అని చెప్పాయి. అంటే పున్నమ నరకం కోసం పుత్రుడు, కన్యాదానం కోసం కూతురు అన్నమాట!. ఒకప్పుడు ఇప్పుడున్న ఫ్యామిలీ ప్లానింగ్స్ వంటివి లేకపోవటంతో కొడుకైనా, బిడ్డైనా దేవుడిచ్చిన వరంగా స్వీకరించే వారు మన వాళ్లు. కాని, ఇప్పుడు ఒకరు లేదంటే ఇద్దరు అన్న రూల్ కి లోబడి కొడుకుల కోసం తహతహలాడుతున్నారు. కడుపులో వున్నది ఆడ బిడ్డైతే అబర్షాన్ చేయించే దాకా వెళుతున్నారు. ఈ భ్రూణ హత్యల పర్వం ఎన్నో ఏళ్లుగా సాగుతూ దేశ భవిష్యత్ కే ప్రమాదంగా మారింది.    భారతదేశంలో కూతుళ్లపై వివక్ష ఎప్పుడూ వుంది. కాని, రోజు రోజుకి చదువుకున్న వాళ్లు పెరుగుతోన్న ఈ కంప్యూటర్లు, స్మార్ట్ ఫోన్స్ యుగంలో కూడా లింగ వివక్ష అధికమవుతూ వుండటం సిగ్గుపడాల్సిన విషయం. ఇప్పటికే మన దేశంలో అబ్బాయిల పెళ్లిల్లు అగ్ని పరీక్షగా మారుతున్నాయి. ఇందుకు కారణం కొన్నేళ్లుగా చేసుకుంటూ వస్తోన్న భ్రూణ హత్యలే. ఇంత ఇబ్బంది పడుతూ కూడా మన వాళ్లు గుణపాఠం నేర్చుకున్నట్టు లేదు. అందుకు తాజా గణాంకాలే నిదర్శనం...    2011 నుంచి 2013 వరకూ తీసిన లెక్కల ప్రకారం దేశంలో ప్రతీ వెయ్యి మంది అబ్బాయిలకు 909 మంది అమ్మాయిలు మాత్రమే పుట్టారు. కాని, అదే నిష్పత్తి 2012 నుంచి 2014 మధ్య కాలంలోకి వచ్చే సరికి 906కి పడిపోయింది. ఇది పైకి చూడటానికి మామూలుగా కనిపించినా భవిష్యత్ లో చాలా పెద్ద సంకటం తెచ్చిపెడుతుంది. ముందు ముందు అబ్బాయిలు వున్నా అమ్మాయిలు లేక పెళ్లిల్లు అవ్వటం దుర్భరం అవుతుంది. పెళ్లిల్లు కాకపోతే దానికి అనుబందంగా బోలెడన్ని సమస్యలు పుట్టుకొస్తాయి. మొత్తం సమాజమే కుదుపుకు గురికావచ్చు..  అమ్మాయిల పట్ల వివక్ష చూపటంలో ఉత్తరాది కన్నా దక్షిణాది కాస్త బెటర్. ఇక్కడ జననాల్లో అమ్మాయిల సంఖ్య కాస్త మెరుగ్గా వుంది. అయినా కూడా ఆందోళనకరంగానే వుంది. ఇక నార్త్ ఇండియాలో అయితే ఢిల్లీ లాంటి మహా నగరాలు సహా హర్యానా లాంటి రాష్ట్రాల మారు మూల గ్రామాల దాకా అంతటా ఆడపిల్లల పట్ల విముఖతే. అందుకే, ఉత్తరాదిలో రోజు రోజుకి అమ్మాయిల జననం తగ్గిపోతోంది. ప్రపంచంలో అమ్మాయిలు, అబ్బాయిల సగటు నిష్పత్తి వెయ్యికి 950గా వుంది. భారతదేశంలో ఏ రాష్ట్రమూ దీన్ని మించి లేదు. అంతటా ఆడపిల్లల సంఖ్య తక్కువగానే వుంటూ వస్తోంది. యేటేటా తగ్గుతోన్న ఆడపిల్లల జననాల సంఖ్య చూస్తుంటే మోదీ స్వయంగా ఇచ్చిన బేటీ బచావ్ లాంటి నినాదాలు కూడా ఏం ప్రయోజనం చూపుతున్నట్టు లేదు. అందుకే, ప్రభుత్వం, మేధావులు, సినిమా, టీవీ రంగాలు ఈ సమస్యపై దృష్టి పెట్టాలి. జనంలో చైతన్యం తేవాలి. స్త్రీని ఆది పరాశక్తి అంటూ పూజలు చేసే మనం అమ్మాయిలు లేకుండా బతికే ఒంటరి రోజులు రాకూడదని వాళ్లకి అర్థం అయ్యేలా తెల్పాలి...   

నేడు ప్రపంచ (అ)శాంతి దినం...

సెప్టెంబర్ 21... ఇంటర్నేషనల్ డే ఫర్ పీస్! వాడుక భాషలో చెప్పుకుంటే వాల్డ్ పీస్ డే! అంటే... ప్రపంచ శాంతి దినం అన్నమాట! సంవత్సరం పొడవునా వచ్చే అనేక అనసవర దినాల కంటే ఇది చాలా ముఖ్యమైందనే చెప్పుకోవాలి. అయినా ఇప్పుడున్న అరాచక హింసాయుత ప్రపంచంలో శాంతి కోసం ఒక రోజు కేటాయించుకోవటం సబబు కూడా! ప్రపంచ శాంతి దినోత్సవం 1982లో మొదలైంది. దీన్ని ఐక్యరాజ్య సమితే స్వయంగా ప్రకటించి జరుపుతూ వస్తోంది. ఒక్కో సంవత్సరం ఒక్కో అంశంతో ప్రపంచ శాంతిని ఎలా నెలకొల్పవచ్చో సమాలోచనలు చేస్తుంటారు. యూఎన్ ఓలోని సభ్య దేశాలన్నీ ఈ రోజు రకరకాల కార్యక్రమాలు చేపడతాయి. ఇండియా కూడా ఈ ఇంటర్నేషనల్ పీస్ డే వేడుకల్లో పాల్గొంటూనే వుంది. ప్రపంచ శాంతి దినోత్సవం నాడు భూమ్మీద ఎక్కడా యుద్ధం లేకుండా చూడటం ఒక లక్ష్యంగా కొనసాగుతూ వస్తోంది. కనీసం ఈ ఒక్క రోజన్నా హింస, ప్రాణ నష్టం వుండకుండా చర్యలు తీసుకుంటూ వుంటారు. అయితే, ఐఎస్ఐఎస్, బోకో హరామ్ లాంటి రాక్షస మూకల చేతుల్లో శాంతి ధ్వంసమవుతోన్న తరుణంలో ఎక్కడ ఎప్పుడు బాంబులు పేలుతాయో ఎవ్వరూ చెప్పలేని పరిస్థితి...  ఇండియా విషయానికి వస్తే ప్రపంచ శాంతిలో మన వంతు కృషి ఎంతో వుంది. పైగా మనం సగర్వంగా చెప్పుకోగల సత్యం... గత రెండు వేల ఏళ్లలో భారతీయులు ఏనాడూ మరో దేశంపైకి దండత్తలేదు. విషాదంగా ఎన్నో విదేశీ శక్తులు ఇండియా పైకే దండెత్తి వచ్చాయి. హింస, నష్టం కలిగిస్తూ వేయేళ్ల బానిసత్వం మన మీద రుద్దాయి. స్వాతంత్ర్యం తరువాత కూడా ఆదునిక భారతదేశం తనకు తాను దండెత్తలేదు. పాక్ తో మూడు సార్లు యుద్ధం జరిగినా అన్నీ దాయాది తప్పిదాల వల్లే జరిగాయి. చైనాతోనూ అనివార్య పరిస్థితుల్లోనే యుద్ధం సంభవించింది...  ఇండియా ఇతరులపై యుద్ధం చేయకున్నా ఉగ్రవాదం రూపంలో మనకు ఎంతో అమానుషం ఎదురవుతోంది. కాశ్మీర్ కారణంగా పాక్ మన మీద పగ పెంచుకుంటూ వరుస దాడులకు పాల్పడుతూనే వుంది. నిన్నగాక మొన్న యూరీలో మన సైనికుల్ని పొట్టన బెట్టుకున్నారు పాకీ ఉగ్రవాదులు. అయినా మనం పూర్తి స్తాయి యుద్ధం చేసే సూచనలు కనిపించటం లేదు. అది ఆర్దిక కారణాలు, ప్రాణ నష్టం దృష్ట్యా కూడా అంత మంచిది కాదు. అయితే, అన్నిటికంటే ముందు ఇండియా యుద్దంలోకి దిగటం ప్రపంచ శాంతికి తీవ్రమైన భంగమే. అందుకే మోదీ ఇంకా సంయమనం పాటిస్తున్నారు...  ఇండియా పాకిస్తాన్ మద్య వివాదం, ఇజ్రాయిల్, పాలస్తీనా మధ్య గొడవ, ఉత్తర, దక్షిణ కొరియాల మద్య కయ్యం.... ఇలాంటివన్నీ ప్రపంచ శాంతికి ప్రమాదకరంగా పరిణమిస్తున్నవే. దానికి తోడు ఉన్మాదంతో ఊగిపోతోన్న ఉగ్రవాద మూకలు అన్ని దేశాల్నీ యుద్ధం అంచున నిలబెడుతున్నాయి. ఇంత కాలం ముస్లిమేతర దేశాల్ని టార్గెట్ చేసిన టెర్రరిస్టులు ఇప్పుడు సౌదీ అరేబియా, పాకిస్తాన్ తో సహా అనేక ఇస్లామిక్ దేశాల్ని కూడా బాంబులతో దద్దరిల్లిపోయేలా చేస్తున్నారు. ఫలితంగా ప్రపంచ వ్యాప్తంగా శాంతి కరువవుతోంది. స్త్రీలు, పిల్లల మాన, ప్రాణాలకి దారుణమైన ప్రమాదం ముంచుకొస్తోంది...  ప్రపంచ శాంతి నెలకొనలాంటే ముందుగా జరగాల్సినవి రెండు. యుద్ధం, ఉగ్రవాదం, హింస వంటి అన్నిటికి కారణమైన మతాల్ని, వాటి బోధనల్ని, ఆ బోధనలు ఉపయోగించుకుని యువతని తప్పుదోవ పట్టిస్తున్న వాళ్లని గుర్తించాలి. ఎక్కడ గాయం వుందో అక్కడ మందు పెట్టాలి. అంతే తప్ప సత్యాన్ని గమనించని లౌకికవాద గ్రుడ్డితనం పనికి రాదు. రెండోది అమెరికా లాంటి అగ్ర దేశాలు తమ ఆయుధ వ్యాపారం కోసం రక్తపు క్రీడని ప్రొత్సహించ కూడదు. భూమ్మీద ఉన్మాది, వాడికి ఆయుధాలు అమ్మే వాడు... ఇద్దరు వున్నంత కాలం యుద్ధం, హింస ఎలా ఆగుతాయి? ప్రపంచ శాంతి దినోత్సవాలు జరుపుకోవటం తప్ప....    

గేమ్ తక్కువ... గోల ఎక్కువ!

ఆటలంటే ఆటలు కాదు! అవును... అంతర్జాతీయ స్థాయిలో ఆటలంటే ఆటలు కాదు. అందులో బోలెడంత శ్రమ, పట్టుదల, తపన వుంటాయి. కాని, వీటన్నిటితో పాటే కావాల్సినంత రాజకీయం వుంటుంది! ఇది ఏ క్రీడకూ అతీతం కాదు. దాదాపు అన్ని క్రీడల్లో బోలెడు పాలిటిక్స్ ప్లే చేస్తుంటాయి. సెలక్షన్స్ మొదలు సక్సెస్ వరకూ అంతటా రాజకీయమే సత్తా చాటుతుంటుంది. చాలా సార్లు ప్రతిభ కూడా రాజకీయానికి దాసోహం అనాల్సి వస్తుంది. ఒలంపిక్స్ లో అందరూ సింధు సిల్వర్ మెడల్ గురించే మురిసిపోయారు. ఆమెకే కోట్ల రూపాయలు గుమ్మరించి ప్రభుత్వాలు చేతులు దులుపుకున్నాయి. కాని, మరో వైపు మరో అద్బుతమైన క్రీడ రాజకీయాల క్రీనీడలో మగ్గిపోతోంది! అదే టెన్నిస్!   టెన్నిస్ అనగానే మనకు సహజంగానే సానియా గుర్తుకు వస్తుంది. ఆమె రీసెంట్ గా పేస్ ను ఉద్దేశించి ట్వీట్స్ చేసింది. విషపూరితమైన వ్యక్తితో ఆడటం కంటే ఆడకపోవటమే గెలుపని చెప్పుకొచ్చింది! దీనికి కారణం లియాండర్ పేస్ తాజాగా ముగిసిన డేవిస్ కప్ తరువాత చేసిన వ్యాఖ్యలే! ఆ టోర్నమెంట్లో బోపన్నతో కలిసి పేస్ పోటికి దిగాడు. ఇద్దరికీ ఒక్క క్షణం కూడా పడక దారుణంగా ఓడిపోయి ఇంటికి తిరిగొచ్చారు. పైగా ఓటమి తరువాత పేస్ రియో ఒలంపిక్స్ లో ఇండియా అట్టర్ ఫ్లాప్ కి కారణం తప్పుడు సెలక్షన్స్ అంటూ కామెంట్ చేశాడు. అందుకే, సానియా, బోపన్న ట్విట్టర్ లో పేస్ పై రగిలిపోయారు! రియో ఒలంపిక్స్ కి సానియా, బోపన్న జోడిగా వెళ్లారు. అక్కడ సెమీస్ దాకా వెళ్లి రిటర్న్ వచ్చారు. వాళ్లకి బదులు వేరే జోడీని పంపి వుంటే మెడల్ వచ్చేదన్నట్టు పేస్ కామెంట్ చేశాడు.   లియాండర్ పేస్ కి సానియా, బోపన్న వంటి వారికి పడకపోవటం ఇప్పటి రాజకీయం కాదు. ఎప్పట్నుంచో వీళ్లకి ఒకరంటే ఒకరికి పడదు. అటు భూపతి, పేస్ కూడా చాలా సార్లు గొడవలు పడ్డారు. అసలు సానియా, భూపతి, పేస్, బోపన్న లాంటి స్టార్ టెన్నిస్ ప్లేయర్స్ కి ఒకరంటే ఒకరికి ఎందుకు పడదు? ఈ ప్రశ్నకి సమాధానంగా బోలెడంత లోతుగా చర్చించుకోవాలి. కాని, అంతకంటే ముఖ్యం వీళ్ల ఈగోస్ కారణంగా దేశం ఒలంపిక్  మెడల్స్ సహా ఎన్నో అమూల్యమైన విజయాలు మిస్ అవుతోంది. ఈ స్టార్ టెన్నిస్ ప్లేయర్స్ తమ ఆట కేవలం తమ స్వంతం అనుకుంటున్నారు. తమ విజయంతో దేశ ప్రతిష్ఠ ముడిపడి వుందని గుర్తించటం లేదు. ఎప్పుడైనా టెన్నిస్ అసోసియేషన్ బలవంతంగా వీళ్లని డబుల్స్ ఆడిస్తే నిర్మొహమాటంగా ఓడిపోయి ఇంటికొస్తున్నారు. తమ కోపాలు, తాపాల కోసం దేశ కీర్తిని తాకట్టు పెడుతున్నారు! ఇది పరమ దుర్మార్గం...   లండన్ ఒలంపిక్స్ లో, రియో ఒలంపిక్స్ లో, తాజాగా జరిగిన డేవిస్ కప్ లో... ఇలా చెబుతూ పోతే గత కొన్ని ఏళ్లుగా ఎన్నోసార్లు మనం మిస్సైన టెన్నిస్ టోర్నమెంట్లు బోలెడు. అందుకు కారణం ప్రతిభ లేకపోవటం, ప్రోత్సాహం కరువవటం కాదు. అలాంటి పరిస్థితుల్లో మగ్గిపోతున్న హాకీ, కబడ్డీ లాంటి క్రీడలు దేశంలో చాలా వున్నాయి. కాని, టెన్నిస్ కి కావాల్సినంత డబ్బు, ప్రోత్సాహం అన్నీ వున్నా ప్లేయర్ల అమానుష ప్రవర్తన వల్ల విజయాలు దక్కకుండా పోతున్నాయి.  సానియా, బోపన్న, పేస్, భూపతి... ఇలాంటి వాళ్లలో ఎవరు కరెక్ట్ అన్నది పక్కన పెట్టి అర్జెంట్ గా టెన్నిస్ సమాఖ్య విజయాలు అందించగలిగే కొత్త ప్లేయర్లు, వాళ్ల మధ్య చక్కటి స్నేహపూరిత బంధం ఏర్పడేలా చూడాలి. అప్పుడు ఇలా ముగ్గురు నలుగురు పెట్టుకునే గిల్లికజ్జాల వల్ల దేశం పరువు పోకుండా వుంటుంది.   ఎందుకంటే, మన స్టార్ టెన్నిస్ ప్లేయర్లు ఇతర దేశాల ప్లేయర్లతో డబుల్స్ లో బాగానే ఆడుతున్నారు. మన దేశం వారితో జోడికట్టమంటేనే గొడవలు వస్తున్నాయి. అందుకే, 125కోట్ల మంది జనాభ వున్న దేశంగా మనం మరింత మంది క్రీడాకారుల్ని సృష్టించుకోవాల్సిన అవసరం వుంది. అంతే కాదు వాళ్లలో దేశభక్తి వుండేలా కూడా చూసుకోవాలి! ఆఫ్ట్రాల్... స్పోర్ట్స్ ఛాంపియన్స్ అంటే స్పాన్సర్స్ , కార్పోరేట్స్, బ్రాండ్ ఎండార్స్ మెంట్స్ ... ఇంతే కాదు కదా! దేశం పేరు నిలపటమే అసలైన క్రీడ! ఆ గేమ్ మన టెన్నిస్ ప్లేయర్లు ఏ మాత్రం ఆడుతున్నట్టు కనిపించటం లేదు.. 

పాక్ ను కొట్టాలంటే ఇండియాకూ 'ఉగ్రవాదులు' కావాలి!

దేశం రగిలిపోతోంది. సోషల్ మీడియా సెగలుగక్కుతోంది. పాకిస్తాన్ పై పగ తీర్చుకునేందు కోసం తహతహలాడిపోతోంది. యుద్ధం కావాలని అరిచే గొంతులు అంతకంతకూ ఎక్కువైపోతున్నాయి. ఈ మధ్యలోనే సంగట్లో సడేమియాలు మోదీని టార్గెట్ చేస్తున్నారు. కాంగ్రెస్ అధికారంలో వుంటే చేతకాని సర్కార్ అన్నారు కదా... ఇప్పుడు మీరేం చేస్తున్నారు? యుద్దం చేయండి! పాక్ ను ప్రపంచ పటంలో లేకుండా చేయండి! అని రెచ్చగొడుతున్నారు! ఇంతకీ పాకిస్తాన్ తో యుద్ధం తప్పనిసరా? యూరీలో జరిగిన ఉగ్రదాడి పరమ కిరాతకమైంది. ఇరవై మందికి పైగా మన జవాన్లని బలి తీసుకుంది. ఇంత దారుణమైన దాడి ఈ మద్య కాలంలో ఎప్పుడూ జరగలేదు. అంతే కాదు, ఇది మోదీ వచ్చాక జరిగిన మరో పెద్ద దారుణం. మొన్నటికి మొన్న పటాన్ కోట్ లో శత్రువులు మన కీలక స్థావరంలో చొరబడ్డారు. అది జరిగాక కూడా ఇలాగే గందరగోళం చెలరేగింది. మళ్లీ అంతా సద్దుమణిగింది. కాని, పాకిస్తాన్ ని మాత్రం మనం ఏం చేయలేకపోయాం! ఇండియాతో పోలిస్తే పాకిస్తాన్ చాలా చిన్న, బలహీన, పేద దేశం. ఇప్పటికే నాలుగు సార్లు మన చేతిలో చావుదెబ్బతిన్నది కూడా. అయినా ఇండియా ఎందుకు పాకిస్తాన్ పీడ విరగడ చేసుకోలేకపోతోంది? అంతర్గతంగా చెప్పుకుంటే మోదీ లాంటి పీఎం మనకు ఈ మధ్య కాలంలో లేకపోవటమే! అవును... ఇది కాస్త మోదీ భక్తుల భజనలా అనిపించినా చేదు నిజం. మోదీ ప్రధాని అయ్యాక దేశదేశాలు తిరుగుతూ ఇండియాని ఇంటర్నేషనల్ గా ధృడ పరిచే ప్రయత్నాలు జరుగుతున్నాయి. అవ్వి పదేళ్ల మన్మోహన్ కాలంలో పెద్దగా జరగలేదు. అంతకు ముందు వాజ్ పేయ్ హయంలోనూ ఇప్పటి మోదీ అంత స్పష్టమైన విధానం వుండింది కాదు. ఇక అంతకంటే ముందు కాంగ్రెస్ ప్రధానుల కాలంలో మన పరిస్థితి మరింత గందరగోళంగా వుండేది. ఒక్క ఇందిరా గాంధీ మాత్రం పాక్ కు ముచ్చెమటలు పట్టించింది. సగం దేశాన్ని విడదీసి బంగ్లాదేశ్ ను ఏర్పాటు చేసి చావు దెబ్బ కొట్టింది! ఇప్పుడు మోదీకి కూడా ఇందిర బాటే మంచి మార్గం! అప్పుడు బంగ్లాదేశ్ ఆవిర్భవిస్తే ఇప్పుడు బలూచిస్తాన్ రావాలి. అది ఇందిర నాటి కాలమంత ఈజీ కాదు. అయినా అసాధ్యం కూడా కాదు. పాకిస్తాన్ కు బలూచిస్తాన్ చాలా కీలకమైన ప్రాంతం. దాన్ని విడదీసే చర్యలు జరిగిన కొద్దీ పాక్ ఉక్కిరిబిక్కిరి అవుతుంది. అంతే కాదు, చైనా కూడా లక్షల కోట్లు బలూచిస్తాన్ ప్రాంతంలో గుమ్మరించింది. కాబట్టి డ్రాగన్ కూడా బలూచిస్తాన్ ఉద్యమం బలపడినకొద్దీ టెన్షన్ ఫీలవుతుంది. ఈ కారణాల కోసమే ఇండియా బలూచిస్తాన్ అంశాన్ని మరింత మరింత జటిలం చేస్తూ పాక్ ను అల్లాడించాలి. బలూచీల యుద్ధానికి డబ్బులు, ఆయుధాలతో సహా ఇంకా ఏమేం సాయం చేయగలమో చూసుకుని అన్నీ చేయాలి. ఒక్క మాటలో చెప్పాలంటే పాక్ మన భూభాగంపై కాశ్మీర్ వేర్పాటు వాదం ప్రొత్సహించినట్టే మనమూ బలూచిస్తాన్ ప్రాంతంలో ప్రత్యేక దేశ ఉద్యమం బలంగా నడపాలి! బలూచిస్తాన్ డిమాండ్ బలపరచటం కాకుండా ఇంకా చాలా పనులు చేయోచ్చు ఇండియా. మోదీ మంత్రి వర్గం తీర్మానించినట్టు పాక్ ను అంతర్జాతీయంగా ఒంటరిని చేయాలి. దాన్నో టెర్రరిస్టు దేశంగా నిరూపించాలి. ఇప్పటికే అమెరికా సహా దాదాపు అన్ని దేశాలు పాక్ ను దోషిగా అంగీకరించే స్థాయికి వచ్చేశాయి. కేవలం చైనా మాత్రమే తన దుర్బుద్దితో పాక్ ను వెనకేసుకొస్తోంది. కాబట్టి చైనాను మన వైపు తెచ్చుకోవాలి. వాళ్ల బాధంతా టిబెట్ , దక్షిణ చైనా లాంటి అంశాలు కాబట్టి వాటి మీద కొంత క్లారిటి ఇచ్చే ప్రయత్నం చేయాలి. అప్పటికీ చైనా తన కుక్క తోక ప్రదర్శిస్తే ఆర్దికంగా ఇబ్బంది పెట్టాలి. బీజింగ్ కి మన నుంచి లక్షల కోట్ల వ్యాపారం జరుగుతోంది. ఇండియన్స్ చైనీస్ ప్రాడక్ట్స్ కొనటం మానేయటం అంటే... చైనాలో వేలాది మంది రోడ్డున పడటమే! అందుకే, చైనాకు మన మార్కెట్స్ లో రెడ్ సిగ్నల్ చూపటం కూడా మంచి ఫలితాలు ఇస్తుంది! పాకిస్తాన్ కు చైనా సపోర్ట్ కూడా పోతే ఆక్సిజన్ ఆగిపోయినట్టే. ఎందుకంటే, గతంలో లాగా అమెరికా ఇప్పుడు ఆ దేశానికి వంత పాడటం లేదు. వున్నది కేవలం డ్రాగన్ అండ మాత్రమే. మోదీ ఆ కనెక్షన్ కూడా కట్ చేశాక యుద్దానికి వెళితే నష్టం తక్కువగా వుంటుంది. ఇప్పటికిప్పుడు వార్ అంటూ ఊగిపోతే చైనా కారణంగా తలనొప్పులు వచ్చే ఛాన్సే ఎక్కువ. అందుకే, యుద్ధానికి ఇంకా కొంత టైం వుందన్నది పచ్చి నిజం.  పాకిస్తాన్ మన సైనికుల్ని ఊచకోత కోస్తే కూడా మనం చేతకాని వాళ్లలా వుండాల్సిందేనా? అదే అంతర్జాతీయ ఒత్తిడి లాంటి పదాలు వాడుతూ కాలం గడపాలా? ఈ ప్రశ్నలు మనకు కలగటం సమంజసమే. కాని, పాక్ మన మీద అక్రమ ఉగ్రవాద మూకలతో దాడి చేస్తోంది. మనం అధికారిక ఆర్మీతో అటాక్ చేయాలి. ఇక్కడే అసలు లొసుగు వుంది. పాక్ ను మనం యుద్ధంతో ఎదురుకునే దాకా మనకూ ఓ అక్రమ కాదంటే అనధికారిక ఆర్మీ వుండాలి. వాళ్లతో పాక్ పని పట్టాలి. అక్రమ, అనధికారిక ఆర్మీ అంటే భారతీయ ఉగ్రవాదులు అని కాదు! పాకిస్తాన్ ఉగ్రవాద ముఠాలతో నిండిపోయిన టెర్రర్ మార్కెట్. అక్కడ డబ్బులు గుమ్మరిస్తే తమ స్వంత జనాన్ని కూడా మానవ బాంబులతో పేల్చేసే కిరాయి జిహాదీలు బోలెడు మంది వున్నారు. వాళ్లే తమ దేశంలోనే మసీదుల వద్ద, స్కూల్స్ వద్ద, మార్కెట్లలో, ఎక్కడ పడితే అక్కడ బాంబులు పేలుస్తుంటారు. పాక్ పూర్తిగా బలహీనపడే దాకా అలాంటి అల్లరి మూకల్ని ఇండియా పోషించాలి. ఇది కుట్ర అవ్వొచ్చు. కాని, నక్క లాంటి పాక్ ను ఎదుర్కొనే చీప్ అండ్ బెస్ట్ మార్గం అదే! అక్కడి కిరాయి ఉగ్రవాదుల్ని అక్కడే ఖరీదు చేసి అక్కడే బాంబులు పేల్పిస్తూ అతలాకుతలం చేయాలి. ఎప్పుడైతే పాక్ ఇక తన వల్ల కాదని చేతులు ఎత్తేస్తుందో... అప్పుడు చైనాను మ్యానేజ్ చేసి... బలూచిస్తాన్ వేర్పాటు పూర్తి చేయాలి! పాక్ ఆక్రమిత కాశ్మీర్ మన దేశంలో కలుపుకోవాలి. మిగిలిన అవశేష పాక్ ను ఓ కంట గమనిస్తూ అలా వదిలేయాలి. ఇదంతా చెప్పినంత ఈజీ కాదు. కాని, ఇంతకంటే ఈజీ మార్గం మాత్రం... నిస్సందేహంగా యుద్ధం కాదు! అది మనకు బోలెడంత అనవసర నష్టం తెచ్చే ప్రమాదం వుంది!   

పాపం పుణ్యం మోడీదేనా..?

పబ్లిసిటీ.. ఈ నాలుగు అక్షరాల కోసం మనిషి ఎంతదూరమైనా వెళతాడు..ఎంతైనా ఖర్చు పెడతాడు అనడానికి ప్రతిరోజు ఎన్నో ఉదాహరణలు. మామూలు మనుషుల దగ్గరి నుంచి వీవీఐపీల వరకు తాము అందరి దృష్టిలో పడాలని..అందరూ తమ గురించి మాట్లాడుకోవాలనే ఆశ కామన్. అయితే చెప్పింది చేస్తారు కొంతమంది..చేసేదే చెప్తారు మరికొంత మంది. చేసినా చేయకపోయినా చెప్పుకోవడం ముఖ్యమనుకుంటారు చాలా రాజకీయ పార్టీలు, రాజకీయ నాయకులు. కొత్త తరహా రాజకీయ పార్టీగా చెప్పుకొనే సామాన్యుడి పార్టీ అదేనండి మన ఆమ్ ఆద్మీ పార్టీ కూడా ఆ తాను ముక్కే అని ఇప్పటికే అనేకసార్లు రుజువైంది. ఢిల్లీలో అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ప్రకటనల కోసం ఆప్ సర్కార్ భారీగానే ఖర్చు చేస్తోంది.   తొలి ఏడాది మీడియా ప్రకటనల కోసం రూ.80 కోట్లు ఖర్చు చేయగా, గత ఏడాది అడ్వర్టయిజ్ మెంట్ల కోసం రూ.500 కోట్ల రూపాయలను ఏకంగా స్టేట్ బడ్జెట్‌లోనే కేటాయించింది. ఇక్కడ చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే ఈ ప్రకటనల్లో మెజారిటీ భాగమంతా ఢిల్లీ వెలుపల ఇచ్చిందే. దీనిపై దేశంలోని రాజకీయ వర్గాల్లో పెద్ద దుమారం రేగింది. ఢిల్లీలో ఓ వైపు శానిటేషన్ కార్మికులకు జీతాలు ఇవ్వడానికి డబ్బులు లేవు. కానీ ప్రకటనల కోసం ప్రభుత్వం కోట్లాదిరూపాయలు ఖర్చు చేస్తోందని ఢిల్లీ కాంగ్రెస్ ఛీఫ్ అజయ్ మాకెన్ విమర్శించారు. అక్కడితో ఆగకుండా ఈ ప్రకటనలపై ఆయన ఏకంగా సుప్రీంకోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారణ జరిపిన సుప్రీం ఆప్ ప్రకటనలపై కమిటీతో విచారణ జరపాల్సిందిగా కేంద్రాన్ని ఆదేశించింది. సుప్రీం ఆదేశాల మేరకు మాజీ కేంద్ర ఎన్నికల కమిషనర్ బీబీ.టాండన్ అధ్యక్షతన ముగ్గురు సభ్యుల కమిటీని నియమించింది కేంద్రం.   ఈ కమిటీ కేజ్రీవాల్ ప్రభుత్వం ప్రకటనల కోసం పెట్టిన ఖర్చు సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ మరియు సుప్రీంకోర్టు మార్గదర్శకాలకు అనుగుణంగా ఉందా లేదా అన్నది పరిశీలించి కేంద్రానికి నివేదిక ఇవ్వనుంది. నిబంధనలకు విరుద్ధంగా ప్రకటన ఖర్చు ఉన్నట్టు తేలితే కేజ్రీవాల్ సర్కార్ ఆ డబ్బును తిరిగి ప్రభుత్వ ఖాతాకు జమ చేయాలి. అయితే అధికారంలోకి వచ్చినప్పటి నుంచి తమపై బీజేపీ ప్రభుత్వం కక్ష్య సాధిస్తూనే ఉందని దానిలో భాగంగానే ఈ కమిటీని నియమించిందని ఆప్ ఆరోపిస్తోంది. కేంద్రానికి సహకరించనందునే ప్రధాని నరేంద్రమోడీ తమ ప్రభుత్వాన్ని కూలదోయటానికి ప్రయత్నిస్తున్నారని విమర్శించింది. సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలకు అనుగుణంగా కేంద్రప్రభుత్వం కమిటిని నియమించింది తప్పితే పనిగట్టుకుని కావాలని చేసింది కాదు.   ఇదంతా చూస్తుంటే అసలు ఆమ్‌ ఆద్మీ పార్టీ నేతలకు రాజ్యాంగమంటే ఎంటో తెలుసో లేదో అనిపిస్తుంది. ప్రభుత్వం ఎలా పనిచేస్తుందో..పాలన ఎలా జరుగుతుందో అసలు తెలియదు..అధికారంలోకి వచ్చి రెండేళ్లు గడుస్తున్నా ఢిల్లీ ప్రజలకు చేసిందేమి లేదు. అందుకే ప్రజల దృష్టిని మరల్చడానికి ప్రకటనల వర్షం కురిపిస్తోంది. సరే ఆ పబ్లిసిటీ ఢిల్లీ వరకే ఉండాలి కానీ దేశమంతా ప్రకటనలు ఎందుకు..? అంటే ఏం చేశారని ఈ సారి ఓట్లు పడతాయి..అసలు ఢిల్లీ ప్రజల వద్దకు ఏ ముఖం పెట్టుకుని వెళతారు. అందుకే ఇక్కడ మిస్సయినా వేరే చోట బలం పుంజుకోవడానికే నార్త్, సౌత్ అని తేడా లేకుండా కోట్లు తగలేసి యాడ్స్ ఇచ్చారట. పార్టీలు ప్రచారం చేసుకోవడంలో తప్పు లేదు..దానికి పార్టీ నిధులు కాకుండా సర్కారీ నిధులను వాడాల్సిన పనేమొచ్చింది. ఇప్పుడు కేంద్రం నియమించిన కమిటీ ఈ నిజాలన్ని బయటకు తీస్తే అసలే అంతంత మాత్రంగా ఉన్న ఆప్ పరువు యమునా నదిలో కలిసిపోతుంది. అందుకే కేంద్రప్రభుత్వం పైనా, ప్రధాని నరేంద్ర మోడీ పైనా విమర్శలు చేస్తోంది. అయిన దానికి కాని దానికి కేంద్రంపై పడి ఎడవటం తప్పితే అసలు ఏ విషయం ఎందుకు జరుగుతుందో ఆప్ అధినాయకత్వం ఆలోచిస్తే మంచిది.

హైదరాబాద్‌ నీళ్లపాలు

  ఎక్కడైనా వరదలొస్తేనో, తుపానులు చెలరేగితేనో బీభత్సం చెలరేగుతుంది. కానీ అదేం విచిత్రమో కానీ హైదరాబాదులో మాత్రం ఓ అయిదు సెంటీమీటర్ల వర్షం కురిస్తే చాలు జీవితం తల్లికిందులైపోతుంది. ఆ మూల కూకట్‌పల్లి నుంచి ఈ మూల ఉన్న హయత్‌నగర్‌ వరకూ ఊరు ఊరంతా సముద్రంగా మారిపోతుంది. ఒక్క కిలోమీటరు దూరం కదలడానికి గంట పడుతుంది. ఈ దారుణం ప్రతిసారీ ఉండేదే... కానీ కారణాలకు నివారణ మాత్రమే కనిపించడం లేదు!   అస్తవ్యస్తమైన రోడ్ల నిర్వహణ మన కేటీఆర్‌గారు అర్ధరాత్రులు అధికారులను ఊళ్లో తిప్పి, గుంతలన్నీ చూపించి ఎన్ని క్లాసులు పీకినా... రోడ్ల పరిస్థితి నానాటికీ తీసిబొట్టుగానే మిగిలిపోతోందనేది వాస్తవం. పాత సినిమాల్లోని రాక్షసుడిలాగా ఒకచోట మాయమైతే పదిచోట్ల కనిపిస్తూ ఉంటాయి ఈ గుంతలు. నిరంతరం లక్షల మంది తిరిగే రోడ్లని ఇంత లక్షణంగా ఎందుకు నిర్మిస్తున్నారన్నది అసలైన ప్రశ్న. కాబట్టి అసలు సమస్య నిర్మాణంలోనే ఉంది. అలా నిర్మించిన రోడ్లకి ఎన్ని బ్యాండెయిడ్లు వేసినా ఉపయోగం లేకుండా పోతోంది. దశాబ్దాల గడుస్తున్నా కూడా ఇంకా విద్యుత్‌, డ్రైనేజి, టెలిఫోన్‌ వంటి శాఖల మధ్య సమన్వయం లేకపోవడంతో తలా ఓ పలుగూ పారా తీసుకుని రోడ్ల మీదకి వచ్చేస్తున్నారు. ఫలితం మనుషులు రోడ్ల మీద కాకుండా గుంతలగుండా ప్రయాణించాల్సి వస్తోంది.   అదిగో మెట్రో వేల కోట్లతో, వందల కిలోమీటర్ల చుట్టుకొలతతో... లక్షలాదిమంది ప్రయాణికులకు సేవలందిస్తమంటూ ఊరించింది హైదరాబాదు మెట్రో సంస్థ. అసలే అస్తవ్యస్తంగా ఉండే నగరాన్ని పొడిపొడి చేసిపారేసింది. ఇంకేముంది ఓ రెండేళ్లు ఓపికపడితే చాలు, జీవితాంతం సుఖపడిపోదామనుకున్నారు నగరవాసులు. కానీ మరో రెండేళ్లు గడిచినా కూడా ఈ నిర్మాణాలు ఒక కొలిక్కి వచ్చే సూచనలు కనిపించడం లేదు. స్థల సమీకరణ, రాజకీయ జోక్యం వంటి కారణాలతో సుల్తాన్‌బజారు వంటి కొన్న ప్రాంతాలలో అయితే ఇంకా మెట్రో అడుగే ముందుకు పడటం లేదు. కానీ మెట్రో నిర్మాణం వల్ల నగర ప్రజలు పడుతున్న ఇబ్బందలు అన్నీఇన్నీ కావు. ఎడాపెడా తవ్విపారేసిన రోడ్లలో నీళ్లు నిలిచిపోతున్నాయి. ఆ ప్రాంతాల్లోని డ్రైనేజీ తీరు అస్తవ్యస్తంగా మారిపోయింది. మధ్యలోంచి మెట్రో సాగడంతో చిక్కిసగమైపోయిన రోడ్ల మీద ట్రాఫిక్ నరకప్రాయంగా సాగుతోంది. వెరసి మెట్రో కూత సంగతేమో కానీ, మన బతుకు మాత్రం మోతెక్కిపోయింది.   అడ్డదిడ్డమైన విస్తరణ  హైదరాబాద్ ఒకప్పుడు ప్రణాళికాబద్ధంగా నిర్మించిన నగరం. నాలుగువందల సంవత్సరాల ఘన చరిత్ర దీని సొంతం. కానీ అభివృద్ధితో పాటే అడ్డగోలుతనమూ పెరిగిపోయింది. చెరువులు మొదలుకొని రహదారుల వరకూ ప్రతి ఉమ్మడి సొత్తునీ కబ్జా చేసిపారేశారు. ఇక నిర్మాణ నిబంధనలకు విరుద్ధంగా అడ్డదిడ్డంగా ఏర్పడిన కట్టడాల సంఖ్య లెక్కకు మిక్కిలిగా ఉంటాయి. క్రమబద్ధీకరణ పేరుతో ప్రభుత్వం వీటన్నింటినీ చట్టబద్ధం చేయడం మరో విచిత్రం. వెరసి నగరంలో పడ్డ నీటి చుక్క బయటకు పోయే పరిస్థితి లేదు. ఇంకుడుగుంతలు, మొక్కల పెంపకం, చెరువుల పునరుద్ధరణ వంటి పథకాలు హైదరాబాదుకు తప్ప తెలంగాణ మొత్తానికీ వర్తిస్తున్నాయన్న ఆరోపణలు ఉన్నాయి. ఇక నగర శివార్లలో ఇప్పటికీ డ్రైనేజీ సదుపాయాలు లేదంటే ఆశ్చర్యం కలగక మానదు.    ఆటవికుడికైనా ఆధునికజీవికైనా నీరే జీవనాధారం. ఈ నీటిని వీలైనంతగా ఒడిసిపోట్టుకోవాల్సింది పోయి, అదే నీటిలో ఈతకొట్టాల్సిన పరిస్థితి రావడం ఎంత బాధాకరం. ఈ మాత్రం సాధించలేని నగరం ‘స్మార్ట్‌ సిటీ’ అన్న పేరు ఎలా నిలుపుకోగలుగుతుంది. ఇలాంటప్పుడు కేటీఆర్‌ ఏమన్నా మాట్లాడితే సంతోషం! ఏదన్నా ఆచరణాత్మక ప్రణాళికను ప్రకటిస్తే మరీ సంతోషం!

కాంగ్రెస్ చేసిందంటే..మీరు చేసినట్లు కాదా..?

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ విభజన జరిగిన వెంటనే..కాంగ్రెస్ పార్టీ ఏపీలో తుడిచిపెట్టుకుపోయింది. ఇక కాంగ్రెస్‌లో ఉంటే తమ గతి అధోగతి అని భావించిన ఏపీ కాంగ్రెస్ సీనియర్లు, జూనియర్లు అంతా మూకుమ్మడిగా తలో ఒక పార్టీలో చేరిపోయారు. చాలా మంది టీడీపీ అధికారంలోకి రాగానే దానిలోకి జంప్ అయ్యారు. తెలుగుదేశంలో బెర్త్ దొరకని వారు బీజేపీలో చేరిపోయారు. అలా చేరిన వారిలో పురందేశ్వరి, కావూరి ఉన్నారు. వీరు బీజేపీలోకి వెళ్లారు గానీ అక్కడ వీరిని పట్టించుకునే వారే లేరు. అయినా కమలంలోనే కొనసాగుతూ తమ వంతు వచ్చినపుడు మీడియాలో మాట్లాడుతూ కాలం గడిపేస్తున్నారు. పురేందేశ్వరి ప్రత్యేకహోదాపై ఆడపాదడపా మాట్లాడుతున్నారు, కానీ పాపం కావూరికి ఏ ఛాన్స్ రావడం లేదు. పార్టీలో చేరి దాదాపు రెండేళ్లు గడుస్తున్నా..తగిన ప్రాధాన్యం లేదని బాధపడుతున్న కావూరికి ఈ మధ్య బీజేపీ ఫుల్ ప్రయారిటీ ఇస్తోంది.   ఆయన తరచూ మీడియా ముందుకు వస్తూ కాంగ్రెస్ పార్టీని ఏకీపారేస్తున్నారు. విభజన పాపం కాంగ్రెస్‌దే..జరగుతున్న అనర్థాలకు కారణం కాంగ్రెస్సేనని ఆయన విమర్శలు సంధిస్తున్నారు. బీజేపీలో చేరిన కొత్తల్లో టీడీపీపైనా, ఆ పార్టీ అధినేత చంద్రబాబుపైనా తీవ్రస్థాయిలో మండిపడిన కావూరికి సడెన్‌గా కాంగ్రెస్ ఎందుకు గుర్తుకొచ్చింది. విభజన పాపంలో కాంగ్రెస్‌కు ఎంత భాగం ఉందో..బీజేపీకి అంతే భాగముంది..ఇప్పటికే ప్రత్యేకహోదా విషయంలో బీజేపీ వైఖరి ఏపీ ప్రజల్లో ఆగ్రహాన్ని కలిగించింది. ఈ నేపథ్యంలో ప్రజల దృష్టిని మళ్లించడానికి, విభజన పాపం కాంగ్రెస్‌దేనని జనంలోకి తీసుకెళ్లడం ద్వారా హోదా అంశాన్ని అటకెక్కించాలని కమలనాథులు డిసైడ్ అయ్యారు. అందుకే వేరే ఎవరితోనో కాంగ్రెస్‌పై విమర్శలు చేయిస్తే బాగుండదని విభజన సమయంలో కేంద్రమంత్రిగా వ్యవహరించిన కావూరిని అందుకు ఎంపిక చేసినట్లున్నారు. కావూరి కూడా తనపై ఉంచిన నమ్మకాన్ని ఏమాత్రం వమ్ము చేయకుండా కాంగ్రెస్‌పై బాగానే విమర్శలు చేస్తున్నారు.   కావూరి కానీ పురంధేశ్వరి కానీ మరొ కాంగ్రెస్ నేతకానీ ఆనాడు ఆంధ్రప్రదేశ్‌ని విడగొట్టడానికి సోనియా ప్రయత్నాలు చేస్తున్నపుడు నోరు మెదపని వీరు ఇవాళ కాంగ్రెస్‌ని తెగ తిట్టేస్తున్నారు. తెలంగాణలో కేసీఆర్‌నూ, ఏపీలో జగన్‌ సపోర్ట్‌తోనూ తన కొడుకుని ప్రధానిగా చేయ్యడానికి సోనియా తెరలేపిన రాజకీయ క్రీడలో వీరంతా పాత్రలు పోషించారు తప్పితే ఒక్కరంటే ఒక్కరు కూడా రాష్ట్రానికి అన్యాయం జరుగుతుంటే అడ్డుకున్న పాపాన పోలేదు. రాహుల్ కోసం విభజన చేశారని ఇప్పడు కావూరి గొంతు చించుకుంటున్నాడు. మరి ఈయన గారు కాంగ్రెస్ అధికారంలో ఉండగా కేంద్రమంత్రి పదవిని కూడా వెలగబెట్టాడు.   రాష్ట్ర విభజన సమయంలో ఏపీ కాంగ్రెస్ నేతలు కేంద్రంలో పదవులు అనుభవిస్తూ సోనియా ఏం చెబితే దానికి తలలూపి ఇప్పుడేమో అంతా సోనియా చేసింది అంటున్నారు. మరి ఇంత తెలిసిన వారు అప్పుడే విభజనకు అడ్డుపడి ఉంటే పరిస్థితి మరోలా ఉండేది. కానీ అడ్డు చెబితే ఎక్కడ పదవులు ఊస్టింగ్ అవుతాయోనని మేడం ముందు తలలాడించారు. నేతలారా..మీరు ఇక్కడో లాజిక్ మిస్సాయ్యారు..కాంగ్రెస్ విభజించింది అంటే మీరు విభజించినట్లే..మీరు పార్టీ మరినంత మాత్రాన చేసిన పాపం ఉరికే పోదు. ఎవరు మరచిపోయినా...మర్చిపోకపోయినా ప్రజలకు అంతా గుర్తే. అప్పుడు చేసిన పాపాన్ని కడిగేసుకోవడానికి బీజేపీపై ఒత్తిడి తెచ్చి ఏపీ పరిస్థితిని చక్కదిద్దితే అదే చాలు.

తెలుగుపై "చంద్ర" దృష్టి

కుటుంబంతోనో..స్నేహితులతోనో ఏ బేగంబజారుకో, ఏ బీసెంట్‌రోడ్డుకో షాపింగ్‌కు వెళ్లినపుడు షాపుల వైపో..మాల్స్ వైపో ఓ లుక్కేస్తే వాటి పేర్లు ఇంగ్లీష్‌లోనే కనిపిస్తాయి. తెలుగునేలపై ..తెలుగు ఖాతాదారులతో..తెలుగులోనే మాట్లాడుతూ ఇలా దుకాణాల పేర్లు మాత్రం ఇంగ్లీష్‌లో పెట్టడమేంటిరా బాబూ అని అనుకోని తెలుగువాడు ఉండడు. కానీ ఏం చేస్తాం..మన ప్రభుత్వాలు పట్టించుకోవు, మన నేతాశ్రీలకు అసలు అవసరమే లేదు. అందుకే అమ్మభాషకు ఇంతటి దుర్గతి. కానీ ఇకపై ఈ ఆటలు ఏపీలో కుదరవు. తెలుగుభాషను బతికించడం కోసం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇకపై రాష్ట్రంలో ఏర్పాటు చేసే శిలాఫలకాలు, శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాల్లో పేర్లు తెలుగులో మాత్రమే ఉండాలంటూ ఆదేశాలు జారీ చేశారు. అంతేకాదు..దుకాణాల పేర్లు కూడా తెలుగులోనే ఉండాలని, వీటి విషయంలో యజమానులు శ్రద్ద తీసుకోవాలని ఏపీ కార్మికశాఖ ఉత్తర్వులు జారీ చేసింది.   ఈ ఆదేశాలు ఇప్పుడు కొత్తగా వచ్చినవి కావు. ఉమ్మడి రాష్ట్రంలో ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో తెలుగు భాష పరిరక్షణకు చర్యలు తీసుకున్నారు. ఆంధ్రప్రదేశ్ దుకాణాలు, సంస్థల చట్టం 1988 ప్రకారం దుకాణాలు, వ్యాపార సంస్థలు, ఇతర సంస్థల బోర్డులు, నామఫలకాలు తెలుగులోనే ఉండాలి. దీనిని అతిక్రమించిన వారిపై జరిమానా విధించడంతో పాటు కేసులు నమోదు చేసేందుకు ఈ చట్టం వెసులుబాటు కల్పించింది. అప్పట్లో కొన్నాళ్లు ఈ చట్టం కఠినంగా అమలు జరిగినా ఆ తర్వాత దీనిని ప్రజలు పట్టించుకోలేదు..ప్రభుత్వం అంతకన్నా.? జనం సంగతి పక్కన బెడితే అధికారులు తీరు కూడా ఇందుకు మినహాయింపు కాదు. జనమంతా తెలుగులోనే మాట్లాడాలంటారు. తెలుగులోనే రాయాలంటారు. తెలుగుకు మించిన భాషే లేదంటారు. కాని - వారు మాత్రం తెలుగులో రాయరు. తెలుగులో మాట్లాడరు. అసలు సర్కార్ ఉత్తర్వులనే పట్టించుకోరు. అధికార భాష అమలు బాధ్యతంతా జనంపైనే పెట్టిన అధికారులు తమ భాషను మాత్రం మార్చుకోలేకపోతున్నారు.   అధికారభాష అయిన తెలుగుకి ప్రభుత్వ ప్రోత్సాహం కరువైంది. రాష్ట్ర అధికార భాషాసంఘం అంటే ఉత్తర ప్రత్యుత్తరా లు, సర్క్యూలర్‌లు, జి.ఓ.లు సైతం తెలుగులోకే వెలురించాలని అన్ని ప్రభుత్వశాఖలకి విజ్ఞప్తి చేస్తున్నాగాని అమలు సక్రమంగా జరగటం లేదు. ప్రభుత్వరంగ సంస్థలు, ప్రభుత్వశాఖలన్నింటికి కంప్యూటర్లు సరఫరా చేశారు. కొన్ని చోట్ల ప్రత్యేకంగా ఆపరేటర్లను నియమించలేదు. అనేక కార్యాలయాలలో కంప్యూటర్లు ఉన్నాగాని తెలుగు సాప్ట్‌వేర్‌ లేదు. మనతో పోలిస్తే తమిళులు, కన్నడిగులకు వారి భాష ప్రాణప్రదం. అక్కడ ప్రభుత్వ, ప్రైవేట్ కార్యాలయాలకు ఆయా భాషల్లోనే పేర్లు ఉంటాయి. వారిలో వారికి పరస్పర అభిప్రాయ భేదాలున్నా భాషా సంస్కృతుల విషయంలో వారంతా ఏకమై ఇతరులపై తిరగబడతారు.   తెలుగుతో సహా కన్నడ, మళయాళ, ఒరియా భాషలకు ప్రాచీన భాష హోదా ఇవ్వడంపై తమిళనాడులోని కొందరు మద్రాస్ హైకోర్టులో పిటిషన్ వేశారు. దీనిపై సుధీర్ఘ విచారణ అనంతరం మద్రాస్ హైకోర్టు తుదితీర్పును ఇచ్చింది. తెలుగు, కన్నడ, మళయాళ, ఒరియా భాషలకు వాటి అర్హతల ఆధారంగానే ఆ హోదా లభించిందని పిటిషన్ కొట్టివేసింది. ఈ తీర్పుపై తెలుగు భాషాభిమానులు సంతోషం వ్యక్తం చేసినా మాతృభాషకు జరిగిన అవమానాన్ని వారు జీర్ణించుకోలేకపోయారు..దీనిపై వారు తీవ్ర అగ్రహాన్ని, అసంతృప్తిని వ్యక్తం చేయటం స్పష్టంగా కనిపించింది. తాజాగా అలాంటి విమర్శలకు, నిరసనలకు తాను మినహాయంపు ఇవ్వాలని భావించిన సీఎం చంద్రబాబు సంచలన నిర్ణయాన్ని తీసుకున్నారు. ఆయన నిర్ణయం ఫలితంగా తెలుగు భాష అమలు విషయంలో కఠినంగా వ్యవహరించాలని ప్రభుత్వం జీవో జారీ చేసింది. ఎన్ని జీవోలు జారీ చేసినా మరేంతగా ఒత్తిడి తెచ్చినా..కేవలం ప్రభుత్వం సహకారం వల్లే భాషాసాహిత్యం ప్రోత్సహించడం సాధ్యం కాదు. తెలుగు భాషను పరిరక్షించుకోవాల్సిన బాధ్యత, తెలుగు సాహిత్యాన్ని ప్రోత్సహించుకోవాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రజలందరిపైనా ఉంది. 

గాయాన్ని గుర్తుచేస్తుందా..? చల్లారుస్తుందా..?

సినిమా..రెండున్నర గంటలపాటు ప్రేక్షకుల మనుసుల్ని సేదతీర్చే ఒక సమ్మోహనం. ఎన్నో ఒత్తిడిల మధ్య సతమతమయ్యే మనిషికి కాసేపు విశ్రాంతినిచ్చే సాధనం. భారతీయ సినిమా తన ప్రయాణంలో ఎన్నో లక్షల కథలను ఇప్పటికే ప్రేక్షకులకు వండి వర్చింది. చేసేందుకు కొత్తగా ఏమీ లేకపోవడంతో నిజ జీవిత కథలను వెండితెరపై ఆవిష్కరిస్తున్నారు భారతీయ సినీ ప్రముఖులు. వాటిలో భాగంగానే ఒక మేరీకోమ్, భాగ్‌ మిల్కా భాగ్ ఈ కోవలో ఎన్నో..మరెన్నో వస్తూనే ఉన్నాయి. కేవలం వ్యక్తుల కథలే కాదు..దేశాన్ని మలుపు తిప్పిన ఉదంతాలు భారతదేశ చరిత్రలో కోకొల్లలు..వాటిని వదల్లేదు మన దర్శకులు. స్వతంత్ర భారతదేశ చరిత్రలో చీకటి కోణంగా చెప్పుకునే పంజాబ్‌లోని ప్రత్యేక ఖలిస్తాన్ ఉద్యమం, ఆపరేషన్ బ్లూస్టార్‌ గురించి మనలో ఎంతమందికి తెలుసు.   సిక్కులకు ప్రత్యేక దేశమే లక్ష్యంగా జర్నాల్‌సింగ్ బింద్రన్ వాలే లేపిన ఉద్యమమే ప్రత్యేక ఖలిస్తాన్ ఉద్యమం. ఈ ఉద్యమం శాంతియుత పద్ధతుల్లో కాకుండా హింసాత్మకంగా మారడంతో ప్రతిరోజూ వేల మంది ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. ఈ నేపథ్యంలో అమృత్‌సర్‌లోని ప్రఖ్యాత స్వర్ణదేవాలయాన్ని ఆక్రమించిన ఉద్యమకారులు ప్రజలను బంధించారు. దీనిపై ఆగ్రహించిన నాటి భారత ప్రధాని ఇందిరాగాంధీ ఉగ్రవాదులను ఏరివేరేసేందుకు సైనిక చర్యకు ఆదేశించారు. ఇది ఆపరేషన్ బ్లూస్టార్‌గా చరిత్రలో నిలిచిపోయింది. ఈ ఆపరేషన్‌లో ఉగ్రవాదులతో పాటు వేలాది మంది ప్రజలు మరణించగా..అనంతరం జరిగిన అల్లర్లలో మరిన్ని వేల మంది ప్రాణాలు విడిచారు. నాటికి..నేటికి..ఏనాటికి దేశాన్ని నీడలా వెంటాడుతున్న ఈ నెత్తుటి చరిత్ర నేపథ్యంతో తాజాగా విడుదలైన ఒక సినిమా ఆ తరం వారికి ఆ నాటి గుర్తులను, నేటీ తరం వారికి చరిత్రను అందిస్తోంది.   ఆ సినిమా చౌథీ కూత్... రెండే రెండు గంటల నిడివి ఉన్న చిన్న పంజాబీ సినిమా. పేరున్న ఆర్టిస్గులెవ్వరూ లేని సినిమా. ఆ సినిమా తీసిని దర్శకుడు గుర్విందర్‌ సింగ్‌కు కేవలం రెండో సినిమా. కానీ ఇప్పుడు ఈ సినిమా అందరి దృష్టినీ ఆకర్షిస్తోంది. విదేశాల్లో స్థిరపడ్డ పంజాబీ రచయిత వర్యమ్‌సింగ్ సంధు రాసిన చౌథీ కూత్, హో మై ఠీక్-ఠాక్ హా కథల ఆధారంగా అల్లుకున్న స్క్రిప్ట్-ఈ సినిమా. ఇటు ఖలిస్తానీ తీవ్రవాదులకూ, అటు భద్రతా దళాలకూ మధ్య పంజాబ్ ప్రజలు చిక్కుకుపోయిన పరిస్ధితుల్ని ఈ చౌథీకూత్ చిత్రం ద్వారా ప్రేక్షకుల అనుభవంలోకి తెచ్చారు. అయితే, సినిమాలో ఎక్కడా తెర మీద ఒక్క రక్తపు చుక్క కూడా కనిపించదు.   దేహాన్ని ఛిద్రం చేసే బుల్లెట్లు కనిపించవు. ఉపన్యాసాలు, అరుపులు, కేకలుండవు. కానీ పరిస్థితి మొత్తం మనకు అర్థమయ్యేలా చేస్తాడు దర్శకుడు. అంతా బాగానే ఉంది కానీ ఇప్పుడిప్పడే దేశప్రజలు ముఖ్యంగా పంజాబ్ ప్రజలు నాటి చీకటి గాయాన్నిమరచిపోతున్న సమయంలో ఈ సినిమా పంజాబ్‌తో తిరిగి ఉద్రేకాలను రేపుతుందేమోనని కాస్త ఆందోళన నెలకొంది. ఎందుకంటే కొన్ని సిక్కు రాడికల్ గ్రూపులు తాజాగా యాక్టివ్ అవుతుండటమే ఆ కాస్త ఆందోళనకు కారణం. మొత్తం మీద ఒక సామాజిక బాధ్యతగా సినిమాలు రూపొందించి మంచి విషయాలు, విలువలు నేటీ యువతకు అందించాలని భావించడం మంచి విషయం.

వందేళ్ల వార్‌కి ముగింపు లేదా..?

కావేరీ జలాల వివాదం కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల్లో భారీ విధ్వంసానికి దారి తీస్తోంది. రెండు రాష్ట్రాల్లో ఆందోళనకారులు పరస్పరం దాడులకు పాల్పడుతున్నారు. బెంగళూరు, చెన్నై, రామేశ్వరం ఇలా ప్రాంతమేదైనా జనం రగిలిపోతున్నారు. అసలు వివాదం తమిళనాటే మొదలైందంటున్నారు..కాదు కాదు, కన్నడీగులే మొదలుపెట్టారనే మాట వినిపిస్తోంది. అసలు వివాదం ఎలా మొదలైందంటే. కర్ణాటక రాష్ట్రంలోని కొడుగు జిల్లాలోని తలకావేరిలో పుట్టింది కావేరి నది. 765 కిలోమీటర్ల పరీవాహక ప్రాంతంతో దక్షిణ భారతదేశంలోని అతిపెద్ద నదుల్లో ఒకటిగా ఖ్యాతిగాంచింది. అప్పట్లో కర్ణాటకలో ఎలాంటి ప్రాజెక్టులు లేవు. అయితే తమిళనాడులోని తంజావూరు జిల్లాలో చాళుక్యరాజులు నిర్మించిన గ్రేటర్ ఆనకట్ట ద్వారా లక్షలాది ఎకరాలు సాగేయ్యేవి. కావేరికి నదికి ఇరువైపులా వాగులు, చెరువుల ద్వారా కొంత ఆయుకట్టును కర్ణాటక సాగు చేసేది. నీటి వినియోగంపై 1892లో అప్పటి మద్రాస్ ప్రెసిడెన్సీ, మైసూర్ స్టేట్ మధ్య మొదటి వివాదం తలెత్తింది. దీనిపై మద్రాస్ ప్రెసిడెన్సీ, మైసూర్ మహారాజా మధ్య ఒప్పందం కుదిరినా ఇరు వర్గాలు దానిని పాటించలేదు.   అలా మొదలైన గొడవ ఇప్పటికీ రగులుతూనే ఉంది. మొదటి ఒప్పందాన్ని తుంగలో తొక్కడంతో 1924లో అప్పటి ప్రభుత్వం ఇరువర్గాల మధ్య రాజీ కుదిర్చడంతో మరో ఒప్పందం జరిగింది. దీని ప్రకారం కావేరి జలాల్లో 75 శాతాన్ని తమిళనాడు, పుదుచ్చేరి, 23 శాతం కర్ణాటక, మిగిలిన 2 శాతం నీటిని కేరళకు కేటాయించారు. ఆ ప్రకారంగా కావేరిపై కృష్ణరాజసాగర్ డ్యాంను మైసూర్ ప్రభుత్వం నిర్మించింది. 50 సంవత్సరాల పాటు ఎలాంటి ఇబ్బందులు రాలేదు, అయితే స్వాతంత్ర్యానంతరం రాష్ట్రాల పునర్వ్యస్థీకరణ తర్వాత వివాదం మరింత రాజుకుంది. ఒప్పందానికి తూట్లు పొడిచి కర్ణాటక డ్యామ్‌లు నిర్మించడాన్ని తమిళనాడు తీవ్రంగా వ్యతిరేకించడంతో వివాదం మళ్లీ మొదటికొచ్చింది. 1924లో చేసుకున్న వివాదానికి కాలదోషం పట్టిందని నది పుట్టింది మా రాష్ట్రంలోనే కాబట్టి నదీ జలాలపై తమకే ఉందన్న వాదనను కర్ణాటక తెరపైకి తెచ్చింది. బ్రిటీష్ పాలకులు, మైసూర్ మహారాజుకు మధ్య జరిగిన ఒప్పందాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించే ప్రసక్తేలేదని తేల్చిచెప్పడంతో తమిళనాడు ఆందోళనకు దిగింది.   దీంతో అప్పటి కేంద్ర జలవనరుల శాఖ మంత్రి కె.ఎల్‌.రావు సమక్షంలో 1970 ఫిబ్రవరి 19న రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశం జరిగింది. తర్వాత కూడా అనేక సమావేశాలు జరిగాయి. 1972లో కేంద్రం నిపుణులతో ఓ నిజ నిర్ధారణ కమిటీని కూడా ఏర్పాటు చేసింది. తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల ముఖ్యమంత్రులతో కేంద్రం 13 సార్లు సమావేశమైంది. 1985లో జరిగిన ముఖ్యమంత్రుల సమావేశంలో.. కనీసం 360 టీఎంసీలు కేటాయించాలని కర్ణాటక కోరింది. 60 టీఎంసీలతో చేపట్టాలనుకొంటున్న ప్రాజెక్టులను మాత్రం నిలిపివేస్తామని పేర్కొంది. దీన్నిబట్టి మొత్తం నీటిని కర్ణాటక వినియోగించుకోవడానికి ప్రయత్నిస్తుందని తమిళనాడు ఆరోపించడంతో, 1986లో మరోసారి ముఖ్యమంత్రుల సమావేశం జరిగింది. ఇక్కడ కూడా రాజీ కుదరలేదు. శతాబ్దాలుగా సాగులో ఉన్న ఆయకట్టు దెబ్బతింటుందని, తంజావూరు జిల్లాలోని డెల్టా ప్రాంతంలో రెండు పంటలు పండే చోట ఒక పంటకే పరిమితం అవుతున్నామని తమిళనాడు ఆందోళన వ్యక్తంచేసింది. రెండు రాష్ట్రాల మధ్య ఓ అంగీకారం కుదిర్చేందుకు 16 సంవత్సరాలు కేంద్రం ప్రయత్నించినా ఫలితం లేకపోవడంతో జల వివాద ట్రైబ్యునల్‌ను ఏర్పాటు చేయాలని కేంద్రం నిర్ణయించింది.   1990 జూన్‌ రెండున జస్టిస్‌ చిత్రతోష్‌ ముఖర్జీ ఛైర్మన్‌గా కావేరి జలవివాద ట్రైబ్యునల్‌ ఏర్పాటైంది. తమవద్ద కనీస నీటి లభ్యత కూడా ఉండటం లేదన్న తమిళనాడు ఫిర్యాదుకు స్పందించి 1991 జూన్‌ ఐదున మధ్యంతర తీర్పు ఇచ్చింది. దీని ప్రకారం మెట్టూరు డ్యాం వద్ద తమిళనాడుకు 205 టీఎంసీల నీటి లభ్యత ఉండాలని స్పష్టంచేసింది. ఏ నెలలో ఎంత నీటి విడుదల ఉండాలో కూడా పేర్కొని, దీని అమలుకు కమిటీని కూడా నియమించింది. ట్రైబ్యునల్‌ 2007 ఫిబ్రవరి ఐదున తుది తీర్పు ఇచ్చింది. దీనిపై 2008 నవంబరు రెండువరకు అభ్యంతరాలను స్వీకరించింది. ఇదే సమయంలో తుది తీర్పును గెజిట్‌లో ప్రకటించకుండా తమిళనాడు, కర్ణాటకలు సుప్రీంకోర్టులో స్పెషల్‌ లీవ్‌ పిటిషన్‌ దాఖలు చేశాయి.   అప్పట్నుంచి సుప్రీంకోర్టులో వాదనలు జరిగాయి. సుధీర్ఘ వాదనల అనంతరం తుది తీర్పు వెలువరించిన సుప్రీం రోజుకు 15 వేల క్యూసెక్కుల నీటిని 10 రోజుల పాటు తమిళనాడుకు విడుదల చేయాలని ఆదేశాలు జారీ చేసింది. ఈ తీర్పును జీర్ణించుకోలేని కర్ణాటకలోని ప్రజలు, రైతు సంఘాలు నీటిని విడుదల చేయరాదంటూ రోడ్డెక్కి ఆందోళనలు నిర్వహించారు. ఇది కాస్తా ఉద్రిక్తమై హింసాత్మక ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. ఈ వివాదాన్ని పరిష్కరించే శక్తి వంద సంవత్సరాల కాలానికే లేకపోయింది కాబట్టి నీటిపైనా వాటా విషయంలో తమిళులది తప్పా, కన్నడీగులది తప్పా అనేది నిర్థారించే శక్తి లేనట్టే..? అలా కాకుండా అర్థం లేని ఆవేశాలు ప్రదర్శించుకోవడం ఇరు రాష్ట్రాలకు మంచిది కాదూ. పరస్పరం సహకరించుకుని సాగాల్సిన వాళ్లు ఇలా విధ్వంసాలు సృష్టించుకోవడం అత్యంత బాధాకరమైన అంశం.

విరాళం కాస్తా వివాదంగా మారుతోంది!

కాంగ్రెస్ కష్టాల్లో వుంది.... 2014లో మోదీ ప్రభంజనం తరువాత ఆ పార్టీ ఎక్కడా కోలుకోలేకపోతోంది! ఎన్నికలు జరిగిన ప్రతీసారీ ఓ రాష్ట్రం హస్తం చేజారిపోతోంది. ఈ రాజకీయ కష్టాలు చాలవన్నట్టు ఇప్పుడు మరో కొత్త కష్టం వచ్చిపడింది! అదే జకీర్ నాయక్ విరాళం!.  జకీర్ నాయక్ ఎవరో తెలుసుగా? పీస్ టీవీ అంటూ ఒక ఛానల్ పెట్టుకుని ఇస్లాం మత ప్రచారం చేస్తుంటాడు ఈ ప్రబోధకుడు. అంతే అయితే ఇంత గొడవ వచ్చేదే కాదు. తన పీస్ టీవీలో తన ఇష్టానుసారం వ్యాఖ్యానాలు చేస్తుంటాడు. ఇతర మతాల్ని వీలైనంత కించపరుస్తుంటాడు. ఇస్లామ్ ని గొప్పగా అభివర్ణిస్తుంటాడు. అసలు జకీర్ నాయక్ ఏ రేంజ్లో ప్రబోధిస్తాడంటే మొన్నా మధ్య బంగ్లాదేశ్ లోని ఢాకాలో ఉగ్రవాదులు తెగబడ్డారు. విదేశీయుల్ని టార్గెట్ చేసి కిరాతకంగా చంపారు! వారికి ప్రేరణ ఈ జకీర్ నాయక్ వారే! ఆయన ఉన్మాద ప్రబోధాలే! జకీర్ నాయక్ బోధనలు ఉగ్రవాదానికి కారణమవుతున్నాయి ఇండియా కాదు... ఇస్లామిక్ దేశమైన బంగ్లాదేశే ఆరోపించింది! అతడిపై చర్య తీసుకోమని ఇండియాని కోరింది కూడా! అప్పుడు రంగంలోకి దిగిన మోదీ సర్కార్ జకీర్ పై కన్నేసింది. అతడి ఇస్లామిక్ రీసెర్చ్ ఫౌండేషన్ సంగతేంటో తరిచి చూసింది. ఇదంతా చూసి బెదిరిపోయిన జకీర్ నాయక్ విదేశాలకు వెళ్లి అక్కడే తలదాచుకున్నాడు! జకీర్ ఉదంతం ఇంత వరకు ఉగ్రవాదానికే పరిమితమైంది. కాని, తాజాగా అతడు 50లక్షల భారీ విరాళం రాజీవ్ గాంధీ ఫౌండేషన్ కు ఇచ్చాడని తెలియటంతో పొలిటికల్ కలరింగ్ వచ్చింది! జకీర్ ప్రసంగాలు యూట్యూబ్ లో చూస్తే ఎవరికైనా అతడు ఎంత కరుడుగట్టిన మత ఛాందసవాదో తెలిసిపోతుంది! అలాంటి వ్యక్తి నడిపే సంస్థ నుంచి రాజీవ్ పేరు పెట్టుకుని సోనియా, రాహుల్, ప్రియాంక గాంధీల నేతృత్వంలో నడిచే సంస్థ విరాళం తీసుకోవటం ఏంటి? తిరిగి ఇచ్చేశామని కాంగ్రెస్ ఇప్పుడు చెబుతున్నా... అసలు ఎందుకు తీసుకున్నారో చెప్పాల్సి వుంది! ఎప్పుడూ హిందూ ఛాందసవాదం, అరెస్సెస్ , వీహెచ్ పీల్ని ఆడిపోసుకునే గాందీలు జకీర్ లాంటి ఇస్లామిక్ మత ఛాందసవాది నుంచి ఛందాలు తీసుకోవచ్చా? ఛాందసవాదం అంటే కేవలం హిందూ మతానికి పరిమితమైందా? ఇస్లామిక్ మత సంస్థలు ఆటోమేటిక్ గా సెక్యులర్ అయిపోతాయా?  ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే, 2011లో జకీర్ నుంచి విరాళం తీసుకుంది కాంగ్రెస్ కు అనుబంధంగా నడిచే రాజీవ్ గాంధీ ఫౌండేషన్. ఆ తరువాతి సంవత్సరం ఇంటలిజెన్స్ రిపోర్ట్స్ ఆధారంగా అతడి పీస్ టీవీని ఇండియాలో బ్యాన్ చేసింది అదే కాంగ్రెస్! కాని, అప్పుడు కూడా జకీర్ విరాళం అతడికి తిరిగి ఇచ్చేయలేదు. ఢాకాలో హేయమైన దాడి జరిగాక 50లక్షలూ తిరిగి ఇచ్చారట!ఎన్నికలు వచ్చినప్పుడల్లా సెక్యులర్ పాఠాలు వల్లించే కాంగ్రెస్ ఇలా అడ్డంగా దొరికిపోవటం మన దేశంలోని రాజకీయ పార్టీల ద్వంద్వ ప్రవృత్తికి తార్కాణం!

సెప్టెంబర్ 10కి.... ఆత్మహత్యకి లింకేంటి?

సెప్లెంబర్ 10.... వాల్డ్ సుయిసైడ్ ప్రివెన్షన్ డే! ఇది కూడా వుందా అని ఆశ్చర్యపోతున్నారా? అప్ కోర్స్, వుంది! నిజానికి సంవత్సరం పొడవునా వచ్చే రకరకాల వింత, విచిత్ర దినాలు, దినోత్సవాల కంటే ఇది ఎంతో ముఖ్యమైంది! అవసరమైంది! అర్థవంతమైంది కూడా! భూమ్మీద ఆత్మహత్య చేసుకునేదెవరు? మనిషే! ఇంకెవరూ సుయిసైడ్ చేసుకోరు! కొన్ని క్రిములు, పురుగులు, జంతువులు ఆత్మహత్యకి పాల్పడతాయని కొందరు చెబుతున్నా... అది చాలా అరుదైన పరిణామం. కాని, మామూలుగా మనకంటే ఎంతో తక్కువ స్థాయి చైతన్యంలో వుండే నూటికి తొంభై తొమ్మిది శాతం జంతువులు ఎట్టి పరిస్థితుల్లోనూ ఆత్మహత్య చేసుకోవు! మనిషి మాత్రం ఆత్మహత్య చేసుకుంటాడు! ఇదే పెద్ద విషాదం...  మనిషి చాలా తెలివైన వాడు. అదే అతని బలం, బలహీనత. తెలివి సరైన దారిలో ముందుకు పోతే రోబోలు మొదలు రాకెట్ల వరకూ ఎన్నిటికో ప్రాణం పోస్తాడు. కాని, అదే తెలివి ఒక్కమారు తప్పుదోవ పట్టిందంటే తన ప్రాణం తానే తీసుకుంటాడు! ఇంకా తెలివి వక్ర మార్గం పట్టిపోతే సాటి మనిషిదే ప్రాణం తీస్తాడు కూడా! ఇలా హత్యకి , ఆత్మహత్యకి పాల్పడే మరే జీవి భూమ్మీద లేదనే చెప్పాలి.... ఎందుకని మనిషి హత్యకి, ఆత్మహత్యకి పాల్పడతాడు? హత్య చేయాలంటే స్వార్థం కట్టలు తెంచుకోవాలి. ఆగ్రహం నరాలు తెంచుకోవాలి. ఇది కొంత క్లియరే. కాని, ఆత్మహత్య చాలా క్లిష్టమైంది. ఒక మనిషి బతకటానికే ఎప్పుడూ ఛస్తుంటాడు. ఎన్నో చేస్తుంటాడు. ఏదైనా చేస్తుంటాడు. కాని, ఒకానొక క్షణంలో అంతా వద్దనుకుని ఉరితాడుకి వేళ్లాడుతాడు. నిద్ర మాత్రలు మింగేస్తాడు. ఇదే ఆత్మహత్యలోని అయోమయం!  ప్రకృతి ప్రతీ జీవికి బతకటం సహజంగా నేర్పిస్తుంది. చిన్న చీమ కూడా కాలి కింద పడితే నలిగిపోయి మళ్లీ తిరిగి లేచి కూర్చునే ప్రయత్నం చేస్తుంది. అక్కడ్నుంచి ముందుకు వెళ్లిపోయి ప్రాణం దక్కించుకునే ప్రయత్నం చేస్తుంది. కాని, కొన్ని లక్షల చీమలకు సమానమైన మనిషి మాత్రం రకరకాలుగా ఆత్మహత్య చేసుకుంటాడు. రకరకాల కారణాలతో తనని తాను అంతం చేసుకుంటూ వుంటాడు! ఈ వైపరిత్యానికి కారణం మనిషిలో వున్న అపారమైన జ్ఞాపకశక్తి! ఇది విచిత్రంగా అనిపించినా నిజం! మనిషికి మతిమరుపు వుంటుంది. అది చాలా ఇబ్బందులకి కారణం. కాని, జ్ఞాపకం అంతకంటే ఎక్కువ ఇబ్బందులు తెచ్చిపెడుతుంది. అసలు మన సమస్యలన్నీ మన ఆలోచనలే కదా! గతం గురించిన మన జ్ఞాపకాలే మన అత్యధిక శాతం దుఃఖాలకి కారణం. ఎప్పుడైతే మనిషి తన జ్ఞాపకాన్ని జయించలేకపోతాడో, ఎప్పుడైతే జరిగిపోయిన దానినే తలుచుకుని తలుచుకుని కుమిలిపోతాడో డిప్రెషన్ వస్తుంది. ఆ డిప్రెషన్ జీవించటం కంటే మరణం మేలనిపించేలా చేస్తుంది! ఇదే లాజికల్ గా మాట్లాడుకున్నప్పుడు మనిసి ఆత్మహత్యకి కారణం! ప్రతీసారి మనిషి గతమే ఆత్మహత్యకి కారణం కాకపోవచ్చు. అప్పుడప్పుడూ భయం, భవిష్యత్ గురించి మనిషి ఊహించుకునే అర్థరహితమైన కల్పనలు... ఇవి కూడా ఆత్యహత్యే శరణ్యం అనిపించేలా చేస్తాయి.  వాల్డ్ సుయిసైడ్ ప్రివెన్షన్ డే అయిన ఇవాళ్ల మనం అర్థం చేసుకోవాల్సింది ఒక్కటే... ఆత్యహత్యకి ఏకైక పరిష్కారం దైర్యం. అది వుంటే ఆత్మహత్య చేసుకునే అవసరం రాదు. అలాగే, ఆత్యహత్య చేసుకుంటారని మనకు అనుమానం వున్న వారికి కూడా ధైర్యం కల్పించటమే అత్యుత్తమం...     

ఆమ్ ఆద్మీ పార్టీలో ఘాటు శృం'కారం'!

ఆప్ తన పేరులోని ఏ, ఏ అనే అక్షరాలకు తగ్గట్టుగానే వ్యవహరిస్తోంది! అడల్ట్స్ ఓన్లీ పార్టీగా మారిపోతోంది. ఈ వ్యాఖ్యలు కొంచెం అతిగా అనిపించినా వెనువెంటనే జరుగుతోన్న పరిణామాలు అలా అనుకునేలా చేస్తున్నాయి. ఆమ్ ఆద్మీ పార్టీలో తాజా కలకలం తెలిసిందేగా! సెక్స్ సీడీలు, లైంగిక వేధింపుల ఆరోపణలు ఆప్ ను రోడ్డుకీడుస్తున్నాయి. అవినీతి అంతం చేస్తామంటూ బరిలోకి వచ్చిన ఆప్ కి మరో గొప్ప ఇంధనం అప్పట్లో జరిగిన నిర్భయ ఉదంతం. ఢిల్లీలో స్త్రీలకు రక్షణ లేదంటూ అరవింద్ కేజ్రీవాల్ నానా యాగి చేశాడు. తాను సీఎం అయితే మహిళలకు ఫుల్ భరోసా అన్నాడు. సీసీ కెమెరాల వంటి బోలెడు హామీలతో హంగామా చేశాడు. కాని, ముఖ్యమంత్రి అయ్యాక ఢిల్లీ పోలీస్ నా చేతిలో లేదని చెప్పటం మినహా ఒక్కసారి కూడా ఢిల్లీలో అత్యాచారాలకి బాధ్యత తీసుకోలేదు.  ఢిల్లీలోని ఆడవాళ్లందర్నీ రక్షించటం మాట అటుంచి కనీసం తన పార్టీలోని స్త్రీలకి కూడా ప్రొటెక్షన్ లేకుండా పోయింది ఆప్ లో. మొన్నటికి మొన్న ఆ పార్టీ మంత్రి... సందీప్ సీడీల్లో సిగ్గులేకుండా దొరికిపోగా... ఆయన మీద వచ్చిన లాంటి ఆరోపణలే ఇంకా చాలా మంది మీద వస్తున్నాయి. అసలు ఆప్ కి ఇలాంటి ఆరోపణలు ఇప్పుడు కొత్తేం కాదు. కొన్ని నెలల కింద పంజాబ్ కి చెందిన ఒక ఆమ్ ఆద్మీ కార్యకర్త తనని పార్టీలోని వారు లైంగికంగా వేధించారని ఆరోపించింది. అంతే కాదు, ఆత్మహత్య కూడా చేసుకుంది. ఇక ఇప్పుడైతే మరీ దారుణంగా ఫిరోజ్ పూర్ మాజీ ఆప్ కన్వీనర్ అమన్ దీప్ కౌర్ 52మంది ఆడవాళ్ల లిస్టు తన వద్ద వుందని ప్రకటించింది. వాళ్లందర్ని అరవింద్ కేజ్రీవాల్ గ్యాంగ్ లోని మగ లీడర్లు లైంగికంగా వేధించారట. ఒకామె అయితే ఇప్పటికే ఆత్మహత్య చేసుకుందని కూడా అమన్ దీప్ కౌర్ చెప్పుకొచ్చింది. మిగిలిన 51మంది పేర్లు త్వరలో బయటపెడతానని హెచ్చరించింది! తమ పార్టీ చీపురు పట్టి అవినీతిని ఊడ్చి పారేస్తుందని ప్రకటించుకున్న ఆప్ అలాంటి గొప్ప పనులేం చేయకపోవగా మరీ దారుణంగా సెక్స్ కుంభకోణాల్లో ఇరుక్కుంటోంది. ఇంత వరకు కాంగ్రెస్, బీజేపి, ఇతర పార్టీలు ఆర్దిక కుంభకోణాలే రుచి చూపించాయి. కాని, ఆప్ పాలిటిక్స్ కి సెక్స్ కోణం ఆవిష్కరిస్తోంది!  ఆప్ పైన ఆరోపణలు వచ్చినంత మాత్రాన అన్నీ నిజం కావాలని లేదు. కాని, మహిళలు వరుసగా బయటకొచ్చి తమపై లైంగిక దాడులు జరిగాయని చెప్పటం చిన్న విషయం కాదు. నిప్పు లేకుండా పొగ వచ్చేస్తోందని అనుకోవటం అమాయకత్వం అవుతుంది. అంతే కాదు, అరవింద్ కేజ్రీవాల్ ఒకప్పటి గురువు అన్నా హజారే కూడా ఆప్ ను తప్పుబట్టాడు. త్వరలోనే అరవింద్ పార్టీపై ఢిల్లీలో ఉద్యమం చేస్తానని ప్రకటించాడు. ఇది ఆమ్ ఆద్మీ ప్రతిష్టకి తీరని దెబ్బ. ఎందుకంటే, అరవింద్ కేజ్రీవాల్ కు చాలా మంది అన్నా హజారే మీద అభిమానంతో కూడా ఓట్లు వేశారు! ఈ సారి వాళ్లు కూడా దూరమయ్యే ప్రమాదం వుంది. మరీ ముఖ్యంగా, అతి త్వరలో రానున్న పంజాబ్ ఎన్నికల్లో ఆప్ కు ఈ సెక్సు కేసుల పాపం ఖచ్చితంగా అంటుకునే సూచనలు కనిపిస్తున్నాయి. చూడాలి మరి... ఇంత దారుణంగా లైంగిక దాడుల ఆరోపణలు ఎదురైన ఆప్ బీజేపికి, అకాళీదల్ కు ఎంత పోటీ ఇస్తుందో!   

పాక్ లో బందీ అయిన 'దేవసేన' కథ!

''మాహిష్మతి ఊపిరి పీల్చుకో! బాహుబలి వచ్చేశాడు!'' అంటుంది దేవసేన! ఒంటి నిండా భారీ ఇనుప గొలుసులతో మాసిపోయిన బట్టలతో అనుష్క పాత్రని ఎవరమైనా ఎలా మరిచిపోగలం? కాని, ఇప్పుడు మాహిష్మతిలోని ఆ దేవసేనలానే పాకిస్తాన్ లోని ఓ దేవసేన గురించి కూడా మనం తెలుసుకోవాలి! అయితే, ఈ పాకీ దేవసేన మనిషి కాదు... మాహిష్మతి ఏంటి, దేవసేన ఏంటి, మనిషి కాకపోవటం ఏంటి అంటారా? మరేం లేదు, విషయం అర్థం కావాలంటే ఇప్పటి పాకిస్తాన్ లోని లాండీ కంటోన్మెంట్ ప్రాంతానికి వెళ్లాలి. అఫ్గానిస్తన్ సరిహద్దు వద్ద వుంటుంది ఈ ఆర్మీ ఏరియా. అయితే, ఇక్కడ ఎక్కువగా వుండేది గిరిజనులు. బ్రిటీషర్లు ఒకప్పుడు ఈ గిరిజనులు తిరుగుబాటు చేయోద్దని అత్యంత దర్మార్గమైన చట్టాల్ని ప్రయోగిస్తుండేవారు. అలాంటి చట్టమే ఫ్ట్రాంటియర్ క్రైమ్స్ రెగ్యులేషన్ లా.  1898లో ... అంటే శతాబ్దం కిందట లాండీ కంటోన్మెంట్ బ్రిటీషర్ల చేతిలో వుండేది. అఖండ భారతంలో భాగమైన ఆనాటి ఆర్మీ ఏరియాని జేమ్స్ స్క్విడ్ అనే అధికారి పాలిస్తుండేవాడు. అతను ఓ రోజు తాగిన మైకంలో తూలుతూ వస్తుండగా అతనిపైకి ఓ మర్రి చెట్టు వచ్చినట్టుగా అనిపించిందట! నిజానికి మద్యం మత్తు, అధికార మత్తు రెండూ ఎక్కువైన బ్రిటీష్ అధికారే చెట్టు మీదకు వెళ్లి ఢీకొట్టాడు. కాని, తప్పు చెట్టే చేసిందనుకుని దానికి శిక్ష విధించాడు! వెంటనే గొలుసులతో బంధించి, ఆ చెట్టు ఖైదీ అని ప్రకటిస్తూ ఓ బోర్డ్ తగించమన్నాడు! రాజు తలుచుకుంటే దెబ్బలకు కరువా అన్నట్టు భారీ గొలుసులతో మర్రి చెట్టును ఖైదు చేశారు! ఇప్పటికీ ఆ దేవసేన లాంటి మర్రి చెట్టు అలానే వుంది! బ్రిటీష్ అధికారి ఎవడో తప్ప తాగి చెట్టును బందిస్తే ఇప్పటి పాకిస్తానీ పాలకులకు ఏం రోగం? వందేళ్ల తరువాతైనా చెట్టుకు తగిలించిన గొలుసులు తీసి దాన్ని బంధ విముక్తం చేయోచ్చు కదా? అలా జరగటం లేదు దాయాది దేశంలో! పాకిస్తాన్ ప్రదాని స్వయంగా 2008లో, 2011లో చెప్పినా కూడా చెట్టును విడుదల చేయలేదట సంబంధిత అధికారులు! ఎందుకంటే, గిరిజనుల్ని అక్రమంగా అరెస్ట్ చేయటానికి ఆనాటి బ్రిటీష్ వారు ఉపయోగించిన ఫ్ట్రాంటియర్ క్రైమ్స్ లా ఇంకా అమలులో వుందట నేటి పాకిస్తాన్ లో! అందుకే, చెట్టుకున్న గొలుసులు ఇష్టానుసారం తొలిగించలేకపోతున్నారట!   బ్రిటీష్ కాలం నాటి అమానుష చట్టాల్ని ఇంకా గిరిజనులపై ప్రయోగిస్తున్న దేశంలో... మర్రి చెట్టును విడిపించే వారెవరుంటారు? అయినా బలూచిస్తాన్ ప్రాంతం మొత్తం వేలాది గిరిజనుల్ని ప్రతీ యేటా నిర్ధాక్షిణ్యంగా చంపేస్తుంటుంది పాక్ మిలటరీ! వాళ్లకు ఈ కదలని , మెదలని మర్రి చెట్టు ఓ లెక్కా! అందుకే, బ్రిటీష్ వాడు వేసి పోయిన గొలుసుల్ని పాక్ అధికారులు బద్ధకంగా అలాగే వుంచేస్తున్నారు. తమ దేశం ఎక్కడ ఆగిపోయిందో వారు చెప్పకనే చెబుతున్నారు!  

వాక్ స్వాతంత్ర్యం... మదర్ థెరిసా కంటే గొప్పదా?

ఈ మద్య కాలంలో పదే పదే వినిపిస్తోన్న అత్యంత వివాదాస్పదమైన అంశం భావ ప్రకటనా స్వాతంత్ర్యం! అది వుందని కొందరు దుర్వినియోగం చేస్తే లేదని కొందరు చాలా బాధపడిపోతుంటారు! మొత్తానికి ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ ప్రెషన్ ఎలాగో ఒకలా వివాదాలకి కారణం అవుతూనే వుంది! రీసెంట్ గా తన వాక్ స్వాతంత్ర్యాన్ని ఇష్టానుసారం వాడిన వివాదాస్పద వ్యక్తి.... మార్కండేయ కట్జూ!. మాజీ న్యాయమూర్తి మార్కండేయ కట్జూ అనగానే మనకు బోలెడు వివాదాలు గుర్తుకు వస్తాయి. ఆయన ఏం మాట్లాడినా వివాదమే. ఇక ఆయన సోషల్ మీడియాలో పోస్టులు దంచుకున్నాడంటే మరింత రచ్చే! ఈ సారి ఆయన టార్గెట్ మదర్ థెరిసా అయింది!. మార్కేండయ కట్జూ ఫేస్బుక్ లో ఓ సుదీర్గమైన పోస్ట్ పెట్టాడు. దాని సారాంశం ఏంటంటే, మదర్ థెరిసాకు సెయింట్ హుడ్ ఇవ్వటం గురించి అందరూ ఎందుకు హంగామా చేస్తున్నారని! అక్కడితో ఆగిపోతే బాగానే వుండేది. కాని, ఆయన మదర్ కు వ్యతిరేకంగా చాలా మాట్లాడాడు. అనేక సాక్ష్యాలతో మదర్ థెరిసా ఒక క్యాథలిక్ ఛాందసవాది అని నిరూపించే ప్రయత్నం చేశాడు! దీనికి నెటిజన్స్ నుంచి రియాక్షన్ ఎలా వుంటుంది అనుకుంటున్నారు? ఊహించినట్టుగానే నానా రభసా అయింది! మదర్ థెరిసా... కట్జూ చెప్పినట్టు క్రిస్టియన్ మిషనరీయా, మత వ్యాప్తికి ప్రయత్నించిందా, ఆమెకు వచ్చిన విరాళాలు ఎక్కడివి, ఆమె భావజాలం మధ్య యుగాల నాటి కరుడుగట్టిన చాందసమా... ఇలాంటివన్నీ ఎప్పుడూ వుండేవే! పైగా అవి వివాదాస్పదం కూడా! కాని, ఇక్కడ ఒక్కటే విచిత్రంగా వుంటోంది... అదే సో కాల్డ్ లిబరల్స్ అని చెప్పుకునే అభ్యుదయవాదుల వాదన! మదర్ థెరిసా గురించి ఎవ్వరు ఏ విమర్శ చేసినా ఆమెని అభిమానిస్తామని చెప్పుకునే కొందరు తీవ్రమైన దాడి మొదలు పెడుతున్నారు. అసలు మదర్ థెరిసాను విమర్శించే హక్కు ఎవ్వరికీ లేదని వారు తేల్చేస్తున్నారు! ఆమె పేదలకు నిస్వార్థంగా సేవ చేసింది కాబట్టి ఏమీ అనకూడదంటారు! ప్రజాస్వామ్య విలువల్ని నమ్మే వారు ఎవ్వరూ దీనికి అంగీకరించరాదు! ఎందుకంటే, మతాన్ని, దేవుడ్ని కూడా విమర్శించటమే ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అన్నది ఆదునిక అభిప్రాయం. మరి అలాంటప్పుడు మదర్ థెరిసా కూడా విమర్శకు అతీతురాలు కాదు కదా! మార్కండేయ కట్జూ తన సుదీర్గమైన పోస్ట్ లో మదర్ థెరిసాను అనేక విధాల ప్రశ్నించాడు. ఆమె నోబుల్ ప్రైజ్ తీసుకుంటూ అబార్షన్లు ప్రపంచ శాంతికి చేటు చేస్తాయని అన్నారంటూ గుర్తు చేశాడు! ఇది చాందసవాదం తప్ప మరేం కాదని తేల్చేశాడు! ఇక వాటికన్ మదర్ కు సెయింట్ హుడ్ ఇవ్వటానికి ఒక అద్భుతం జరిగిందని అంగీకరించింది. బెంగాల్ లోని ఒక మహిళ మదర్ ఫోటో లోంచి ఒక మెరుపు వచ్చి తన ఒంట్లోకి ప్రవేశించిందని చెప్పింది. వెంటనే తనకున్న క్యాన్సర్ పోయిందని ఆమె తెలిపింది. దీన్ని గుడ్డిగా నమ్మిన వాటికన్ మదర్ థెరిసాకు సెయింట్ గౌరవం ఇచ్చేసింది.   అసలు సదరు పేషంట్ కి క్యాన్సర్ లేనే లేదని ఆమె డాక్టర్ చెప్పాడట! కాని, పోప్ డాక్టర్ మాటలు పట్టించుకోలేదు! ఇదంతా మూఢ నమ్మకం అంటాడు కట్జూ! మీడియా కూడా కావాలనే మదర్ గురించిన అనేక అనుమానాల్ని పట్టించుకోకుండా వదిలేసిందని ఆయన ఆరోపించాడు!. అసలు మదర్ థెరిసాకు విరాళాలు ఎక్క్డడ్నుంచి వచ్చాయని కూడా మార్కండేయ కట్జూ ప్రశ్నించాడు. ఎలాంటి దుర్మార్గులు డబ్బులిచ్చినా ఆమె విరాళంగా స్వీకరించిందని అన్నాడు. ఇంతా చేస్తే వేలాది డాలర్ల చందాలు తీసుకున్న ఆమె తగినంతగా పేదలకు, అనాథలకు, అంతిమ ఘడియల్లో వున్న వారికి చేసిందేమీ లేదని పెదవి విరిచాడు! మార్కండేయ కట్జూ మదర్ పై చేసిన వ్యాఖ్యల్ని మనం సమర్థించకపోవచ్చు. లేదా పూర్తిగా ఒప్పుకోకపోవచ్చు. కాని, థెరిసా లాంటి ఒక త్యాగమూర్తిని టార్గెట్ చేస్తే మనసు చివుక్కుమంటుంది. కాని, ఆ కారణం చేత మదర్ థెరిసాను ఎవ్వరూ విమర్శించవద్దు, ప్రశ్నించవద్దు అంటే కూడా సబబు కాదు. ఆమెని మనసారా అభిమానించి ఫాలో అయ్యే వారు ఇది అర్థం చేసుకోవాలి. మదర్ థెరిసా ఎంత గొప్పో... సంస్కారవంతమైన భాష, భావం వాడినంత వరకూ... భావ ప్రకటనా స్వాతంత్ర్యం కూడా అంతే గొప్పా!   

జియో ... జీనే ( నహీ ) దో!

కొన్ని రోజుల కిందటి దాకా ఇండియాలో అందరి నోటా వినిపించిన మాట రియో! ఇప్పుడు అందరూ పలవరిస్తోన్న మాట జియో! ఇంతకీ జియో స్టోరీ ఏంటి? ఆల్రెడీ కొంత వరకూ అందరికీ తెలిసిపోయింది కాని తెర వెనుక కథనమే అందరికీ తెలియటం లేదు! జియో పైకి కనిపించినంత సింపుల్ వ్యవహారం కాదు! లక్షల కోట్ల బిజినెస్ కి ప్రాతిపదిక! అందుకే, ఢిల్లీలోని భారత ప్రభుత్వం మొదలు అందరూ దీంట్లో తలదూర్చాల్సి వస్తోంది! అసలు జియో అనేది మన ఇండియన్ టెలికామ్ ముఖ చిత్రమే మార్చేసే బిగ్ డీల్...  జియో మిగతా డేటా ప్రొవైడరస్ లాంటి ఓ కంపెనీ కాదు. రిలయన్స్ వారి ప్రతిస్ఠాత్మక ప్రాడక్ట్. అందుకే, దీనిపై ఇంత చర్చ జరుగుతోంది. అంతే కాక వినాయక చవితి సందర్భంగా తమ సర్వీసులు మొదలు పెడతామని ప్రకటించిన ముఖేష్ అంబానీ నిర్ద్వంద్వంగా ఇతర సర్వీస్ ప్రొవైడర్స్ పై యుద్ధం ప్రకటించాడు. జియో కస్టమర్స్ అసలు ఎంతసేపు మాట్లాడుకున్నా ఫ్రీ అంటూ దిమ్మతిరిగిపోయే స్టేట్మెంట్ ఇచ్చాడు! కాని, ఇక్కడే అసలు కిటుకు వుంది! జియో మిగతా 4జీ సర్వీసుల్లాంటిది కాదు. ఎయిర్ టెల్, ఐడియా, ఓడాఫోన్ కంపెనీలు ఇచ్చే డేలా సర్వీస్ లో కాల్స్ చేసుకోవటం కుదరదు. కాని, జియో మాత్రం డేలానే కాల్స్ గా మార్చేస్తుంది. అంటే మొబైల్ డేటా ఆప్షన్ అన్ చేసుకుని వున్నప్పుడే జియో లో కాల్స్ మాట్లాడుకోవచ్చు. లేదంటే సపరేట్ గా టాక్ టైం వేసుకుని మాట్లాడుకోటానికి వీలుండదు. దీన్నే ముఖేష్ అంబానీ ఫ్రీ ఔట్ గోయింగ్ కాల్స్ అని కలరింగ్ ఇచ్చాడు. యాక్చువల్లీ అది ఫ్రీ ఏం కాదు. టాక్ టైం బదులు డేటా ఖర్చవుతుంది. అదీ తేడా! చిన్నా చితకా పబ్లిసిటీ స్టంట్లు అన్ని టెలికాం కంపెనీలు వేస్తుంటాయిలే అనుకుని కూడా మనం సరిపెట్టుకోవచ్చు. కాని, జియో అసలు సమస్య ఢిల్లీలో స్థాయిలో వుంది.ఏకంగా ఎన్డీఏ సర్కారే రంగంలోకి దిగి ముఖేష్ అంబానీకి అనుకూలంగా పావులు కదుపుతోందని అంటున్నారు విమర్శకులు.  జియో కొత్తగా మార్కెట్లోకి రావటంతో ఎయిర్ టెల్, ఐడియా, ఓడాఫోన్ లాంటి ఇతర నెటవర్క్ లకి ఇంటర్ కనెక్షన్ యూసేజ్ ఛార్జెస్ ( ఐయుసీ ) చెల్లించాల్సి వుంటుంది. ఐయుసీ అంటే జియో కస్టమర్ తన ఫోన్ నుంచి ఇతర నెట్ వర్క్ ల ఫోన్స్ కి కాలు చేసినందుకు గాను... జియో కంపెనీ ఆ ఇతర నెట్ వర్స్స్ కి పే చేయాల్సిన సర్వీస్ ఛార్జ్! మొదట్లో తన జియో కస్టమర్స్ ఎలాగూ తక్కువ వుంటారు కాబట్టి ఇతర నెట్ వర్క్స్ కి కాల్స్ వెళ్లినప్పుడల్లా భారీగా డబ్బులు కడుతూనే వుండాలి. అయితే, ఇక్కడే అంబానీ తన మనీ పవర్ చూపించాడు! కేంద్రంలో యూపీఏ వున్నా, ఎన్డీఏ వున్నా అంబానీలకు అనుకూలంగానే పని చేస్తుంది కాబట్టి ఇప్పుడున్న సర్కార్ కూడా ముఖేష్ కి అనుకూలంగా ఓ నిర్ణయం తీసుకుంది. జియో ఐయుసీ కింద కట్టాల్సిన ధరల్ని బాగా తగ్గిస్తూ 20శాతం నుంచి 14శాతానికి ట్రాయ్ తగ్గించింది. టెలికామ్ రెగ్యులేటరీ అథారిటీ తీసుకున్న ఈ నిర్ణయం వెనుక కేంద్రం వున్నదనేది బహిరంగ రహస్యమే!  తమకు రావాల్సిన ఇంటర్ కనెక్షన్ యూసేజ్ ఛార్జెస్ కి భారీగా గండి పడటంతో ఎయిర్ టెల్ రైవల్ కంపెనీలు జియో కాల్స్ ను సరిగ్గా కనెక్ట్ చేయకుండా ఇబ్బంది పెట్టాయి. జియ ఫోన్స్ నుంచి ఇప్పటి వరకూ కాల్ చేసిన చాలా మంది యూజర్స్ కి ఇతర నెట్ వర్క్స్ తో మాట్లాడుతుంటే మధ్యలో కట్ అయిపోతున్నాయట. ఇది ఎయిర్ టెల్, ఐడియా లాంటి కంపెనీలు జియోపై కోపంతో చేసిన పనే! తమ కాల్స్ సరిగ్గా కనెక్ట్ అవ్వకపోవటంతో అంబానీ మరోసారి కేంద్రాన్ని కదిలించాడు. ఈ సారి ట్రాయ్ మరీ దారుణంగా ఐయుసీ నే తీసిపారేసింది! అంటే జియో కోసం తమ మౌలిక సదుపాయాలు ఉపయోగించి ఎయిర్ టెల్ లాంటి కంపెనీలు కాల్స్ కనెక్ట్ చేస్తున్నా కూడా ఒక్క పైసా రాదన్నమాట! ఈ పరిణామంతో జియో ప్రత్యర్థి కంపెనీలన్నీ నెత్తీ నోరు బాదుకుంటున్నాయి! జియో కోసం ఏకంగా కేంద్ర ప్రభుత్వమే పావులు కదుపుతున్నప్పుడు సహజంగానే మిగతా కంపెనీలకు చుక్కలు కనిపిస్తున్నాయి. అంతే కాదు, 1.34లక్షల కోట్ల పెట్టుబడితో 10కోట్ల మంది యూజర్స్ టార్గెట్ గా రంగంలోకి దిగిన జియోని ఇప్పుడున్న బడా నెట్ వర్క్ లు ఏ మాత్రం తట్టుకోలేకపోవచ్చు కూడా! ఫలితంగా ముందు ముందు టెలికాం రంగంలో ఎయిర్ సెల్, యూనినార్ వగైరా వగైరా చిన్న చితకా కంపెనీలు కనిపించకపోవచ్చు. జియోలోనో , లేక ఇతర పెద్ద కంపెనీల్లోనూ విలీనం అవ్వొచ్చు. చివరకు, అంబానీ మనీ పవర్ , పొలిటికల్ పవర్ తో మొత్తం రంగమే మోనోపలీ అయిపోవచ్చు! అంటే జియో ఏకచ్ఛాత్రిధిపత్యం వహించటం అన్నమాట! అదే జరిగితే ఇప్పుడు ఇస్తున్న ఆఫర్లు అన్నిటికి పది రెట్లు ఎక్కువ డబ్బులు కస్టమర్ల నుంచి ముక్కు పిండి వసూలు చేసే ప్రమాదం కూడా వుంది! అలా జరగకూడదనే కోరుకుందాం...

ఆ అఫీడవిట్ లో అన్నీ షాకులే!

కొన్ని విషయాలు నేరుగా ఓట్లు, ఎన్నికల ఫలితాలతో ముడిపడి వుండటంతో రాజకీయ పార్టీలు పూర్తిగా మౌనం వహిస్తాయి! అలాంటి వివాదాస్పద అంశమే ముస్లిమ్ లలో వున్న ట్రిపుల్ తలాఖ్, బహుభార్యత్వం పద్ధతులు! ఈ రెండిటిపై సుప్రీమ్ లో విచారణ జరుగుతోంది. అదీ ఓ ముస్లిమ్ మహిళ వేసిన కేసు కారణంగానే. అయితే, ఆల్ ఇండియా ముస్లిమ్ పర్సనల్ లా బోర్డ్ ను వివరణ ఇవ్వవలసిందిగా కోర్టు కోరటం, వాళ్లు అఫీడవిట్ సమర్పించటం ఈ మధ్య జరిగింది. ఇదే పరిణామం హిందూ సంస్థో, సంఘం విషయంలోనూ జరిగి వుంటే ఈ పాటికి మన రాజకీయ పార్టీలు, సెక్యులర్ నేతలు మైకులు చించుకుని ప్రెస్ మీట్లు పెట్టేవారు. కాని, విషయం మైనార్టీలతో ముడిపడి వుండటంతో అందరూ కిమ్మనకుండా వున్నారు. ఇంతకీ ముస్లిమ్ పర్సనల్ లా బోర్డ్ వారు అఫీడవిట్ లో ఏమన్నారు?    సుప్రీమ్ కు సమర్పించిన అఫీడవిట్ లో అనేక అంశాలు వున్నాయి. అందులో షరియా చట్టాన్ని సమర్థిస్తూ మహిళల్ని, మహిళల గౌరవాన్ని కించే పరిచేలా చేసిన వ్యాఖ్యలు కూడా చాలానే వున్నాయి. ప్రధానంగా ముస్లిమ్ పర్సనల్ లా అనేది ఇస్లాం మత గ్రంథాల ఆధారంగా నడిచేదని, దాంట్లో సుప్రీమ్ కలగజేసుకోవద్దని లా బోర్డ్ పెద్దలు అంటున్నారు. ఇది రాజ్యాంగాన్ని పట్టించుకోకపోవటమే అవుతంది. ఎందుకంటే, ఏ మతానికి చెందిన చట్టాలైనా రాజ్యాంగానికి లోబడే వుండాలి. మత గ్రంథాల ఆధారంగా ఏక్షపక్షంగా కొనసాగుతూ వుండటానికి వీలులేదు.  అఫీడవిట్ లో ముస్లిమ్ మత పెద్దలు చేసిన మరో వ్యాఖ్య... బహుభార్యత్వం లేకపోతే వ్యభిచారం పెరిగిపోతుందని వారు చెప్పుకొచ్చారు! అంతే కాదు, ట్రిపుల్ తలాఖ్ లాంటి ప్రమాదకర  ఆచారం కూడా స్త్రీల సంరక్షణకే అంటు వింత వాదం చేశారు. నిజానికి అధికారికంగా ఇస్లామిక్ దేశాలుగా చెలామణి అవుతోన్న అనేక దేశాల్లో కూడా ట్రిపుల్ తలాఖ్ అమలు లేదు. అయినా మన దేశంలో పర్సనల్ లా బోర్డ్ వాళ్లు దాన్ని కొనసాగించాల్సిందే అంటున్నారు. ముస్లిమ్ లలోని మహిళలందర్నీ దెబ్బతీసే ఇలాంటి పద్ధతికి మన రాజకీయ పార్టీలు కూడా వ్యతిరేకంగా గొంతు విప్పకపోవటం ఇక్కడ అసలు విషాదం! హిందువుల్లో వున్న సతీ, బాల్య వివాహాలు, వరకట్న ఆచారం లాంటి ఎన్నో అమానుష పద్ధతుల్ని , సంప్రదాయాల్ని మనం నిషేదిస్తూ వచ్చాం. అలాగే కోట్ల మంది ముస్లిమ్ స్త్రీల సంక్షేమానికి సంబంధించిన ట్రిపుల్ తలాఖ్, బహుభార్యత్వం విషయాల్లో కూడా సుప్రీమ్ సాహసోపేతమైన నిర్ణయం తీసుకోవాలని కోరుకుందాం. అప్పుడే అందుకోసం పోరాడుతోన్న ఎందరో ముస్లిమ్ స్త్రీల ఆరాటానికి అర్థం వుంటుంది!

జడ్జీల నియమాకాల్లో 'న్యాయం' ఎంత?

మన దేశంలో ప్రభుత్వం, పార్లమెంట్, ఐఏఎస్, ఐపీఎస్ అధికారగణం... ఇవన్నీ ఒక ఎత్తు... కోర్టు, జడ్జీలు ఒక ఎత్తు! ఇప్పటికీ జనం మరెక్కడా న్యాయం దొరకకున్నా కోర్టులో దొరుకుతుందని బలంగా నమ్ముతారు! అందుకే, పొలం గట్ల తగాదాల నుంచీ అయోధ్య రామమందిరం సమస్య వరకూ అన్నిటికి కోర్టే శరణ్యం అనుకుంటూ వుంటాం. వ్యక్తిగత గొడవలే కాదు దేశాన్ని , దేశ భవిష్యత్తుని ప్రభావితం చేసే అతి పెద్ద , అతి కీలక సమస్యలు కూడా కోర్టుల ముంగిటకు వచ్చి ఆగుతుంటాయి. ఇక అప్పుడప్పుడూ వార్తల్లో నిలిచే ట్రిపుల్ తలాఖ్ వుండాలా వద్దా, గుళ్లలోకి మహిళలు ప్రవేశించాలా వద్దా, స్వలింగ సంపర్కం వగైరా వగైరా లాంటివి వుండనే వున్నాయి! అసలు ప్రస్తుతం కోర్టులు, జడ్జీలు ప్రభావితం చేయని, చేయలేని రంగమంటూ ఏదీ దేశంలో లేదంటే ఆశ్చర్యమేం లేదు! దేశ భవిష్యత్తు, దేశ పౌరుల భవిష్యత్తు తమదైన రీతిలో నిర్దేశించే ఉన్నత న్యాయస్థానాల జడ్జీల నియామకం ఈ మధ్య పెద్ద గొడవకే కారణమైంది. మోదీ ప్రభుత్వం వచ్చాక ఇప్పటి దాకా నడుస్తోన్న జడ్జీల నియామక విధానం మార్చాలని నిర్ణయించింది. ప్రస్తుతం కొలీజియమ్ పద్ధతి అమలులో వుంది. అంటే సుప్రీమ్ చీఫ్ జస్టీస్ తో సహా మరో నలుగురు సీనియర్ జడ్జీలు కొలీజియమ్ గా ఏర్పడి సుప్రీమ్ కోర్టు జడ్జీల్ని, వివిధ హై కోర్ట్ జడ్జీల్ని ఎంపిక చేస్తుంటారు. కాని, దీనికి బదులుగా నేషనల్ జుడీషియల్ అపాయింట్మెంట్ కమిషన్ ఏర్పాటు చేయాలని ఎన్డీఏ సర్కార్ యోచించింది. ఇలా చేయటం వల్ల కేవలం అయిదుగురు న్యాయమూర్తులు ఇతర న్యాయమూర్తుల్ని నియమించటం కాకుండా మరింత పారదర్శకంగా జడ్జీల ఎంపిక జరుగుతుందని ప్రభుత్వం భావించింది. కొలీజియమ్ వ్యవస్థ రద్దకు సుప్రీమ్ కోర్ట్ చీఫ్ జస్టీస్ టీఎస్ థాకూర్ ససేమీరా అన్నారు. అలాగే చాలా మంది న్యాయమూర్తులు జడ్జీల ఎంపికలో పారదర్శకతకు మార్గం వేసే ప్రయత్నాలకు అడ్డుతగిలారు. అయితే, తాజాగా సుప్రీమ్ కోర్టులో సీనియర్ న్యాయమూర్తుల్లో ఒకరైన జస్టిస్ చలమేశ్వర్ కొలీజియమ్ వ్యవస్థపై సీరియస్ కామెంట్స్ చేశారు. ఆయన సుప్రీమ్ లో ప్రస్తుతం వున్న కొలీజియమ్ లో మెంబర్ కూడా! అయితే, తనతో పాటూ మరో నలుగురు జడ్జీలు కలిసి చేసే ఇతర జడ్జీల నియామకం అస్సలు పారదర్శకంగా లేదని చలమేశ్వర్ తేల్చేశారు. పేరుకి అయిదుగురు సీనియర్ జడ్జెస్ వున్నా ఇద్దరు మాత్రమే పేర్లు నిర్ణయించుకుని మీటింగ్ కి వస్తారని, వాళ్లకు యెస్ గాని, నోగాని చెప్పటం మాత్రమే మిగతా వారు చేయాల్సి వుంటుందని ఆయన మీడియాతో అన్నారు! ఒకవేళ జడ్జ్ గా ఎంపికైన ఒక వ్యక్తి ఎవరైనా అవినీతిపరుడై వుంటే అతడి గురించి వ్యతిరేకంగా మాట్లాడే వీలు కూడా కొలీజీయమ్ లో వుండదని చలమేశ్వర్ ఆరోపించారు. ఇక మీదట కొలీజియమ్ మీటింగ్స్ కి తాను హాజరుకాబోనని సుప్రీమ్ చీఫ్ జస్టిస్ కి రాత పూర్వకంగా తెలిపిన జస్టిస్ చలమేశ్వర్ ఇంకా అనేక ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అసలు కొలీజీయమ్ వ్యవస్థలో జడ్జీల ఎంపిక మాత్రమే జరుగుతుంది తప్ప ఎలాంటి చర్చా, ఎలాంటి స్టేట్మెంట్స్ రికార్డ్ చేయటం లాంటివేవీ వుండవని ఆయన అన్నారు. మొత్తంగా ఎంతో కీలకమైన జడ్జీల నియామకం అత్యంత గోప్యంగా, ఎలాంటి మెరిట్ ఆధారం చేసుకుని జరిపే చర్చా వంటిదేదీ లేకుండానే జరుగుతుందని చలమేశ్వర్ స్పష్టం చేశారు! జస్టిస్ చలమేశ్వర్ జడ్జీల నియామకానికి కమీషన్ ఏర్పాటును సమర్థించిన ఏకైక సుప్రీమ్ జడ్జ్. ఆయనిప్పుడు ఇలా పబ్లిగ్గా కొలీజియమ్ వ్యవస్థను తప్పుబట్టడం పెద్ద దుమారానికే తెర తీసే అవకాశం వుంది. అయితే, జడ్జీల నియామకంలో పాదర్శకత రావాల్సిన అవసరం మాత్రం ఎంతైనా వుంది.

చైనా పక్కలో భారత్ బల్లెం.. వియత్నాం!

మన దేశంలో కంటే ఎక్కువగా విదేశాల్లోనే వుంటాడని విమర్శకులు ఎంతగా వెటకారం చేసినా పట్టించుకోని మోదీ మరోసారి ఫారిన్ టూర్ మొదలెట్టారు. ఈ సారి ఎక్కడికి బయలుదేరారు? చైనా, వియత్నాం దేశాలకు! నిజానికి చైనా, వియత్నాం పాకిస్తాన్, ఇండియా లాంటి దేశాలు! వాటికి ఒకరంటే ఒకరికి పడదు! కాని, ఆ రెండు దేశాలూ ఒకేసారి చుట్టి వచ్చే సంకల్పంతో మన ప్రధాని బయలుదేరారు!   మోదీ చైనా పర్యటన ద్వైపాక్షికం కాదు. జీ 20 సభ్య దేశాల సమావేశానికి ఆయన అటెండ్ అవుతారు. అక్కడ ఇండియాకి సంబంధించిన అనేక అంతర్జాతీయ అంశాల్ని లేవనెత్తే అవకాశం వుంది. కాని, ఈ పర్యటనలో అందరి దృష్టీ ఆకర్షిస్తోంది మాత్రం వియత్నాం పర్యటన. కేవలం ఒక్క రోజు మాత్రమే మోదీ వియత్నాంలో ఆగుతారు. అంతలోనే బిజీ బిజీగా మీటింగ్లు వుంటాయి!   ఇండియన్స్ కి వియత్నాం గురించి నిజంగా పెద్దగా తెలియదనే చెప్పాలి! అంతే కాదు, వాజ్ పేయి సర్కార్ అధికారంలోకి వచ్చే దాకా మన దేశం వియత్నాంని ఏమంత పెద్దగా పట్టించుకున్నది కూడా లేదు. కాని, చైనాతో వియత్నాంకు వున్న శత్రుత్వం కారణంగా మెల్లగా భారత్ ఆ దేశానికి దగ్గరవుతూ వచ్చింది. ఎలాగైతే భారత్ శత్రువైన పాక్ తో చైనా అంటకాగుతుందో... అదే విధంగా చైనాకు చెమటలు పట్టించేందుకు ఇండియా వియత్నాంకు దగ్గరవుతోంది. ఇది డిప్లొమాటిక్ వార్ ల చాలా అవసరం కూడా. అయితే, ఇప్పటికే లేట్ అయిపోయిన ఈ కోణంపై మోదీ సహజంగానే దృష్టి సారించారు...   అంతర్జాతీయ స్తాయిలో భారత్ సత్తాను పెంచే దిశగా కృషి చేస్తున్న మోదీ వియత్నాంను కూడా అందుకే ఎంచుకున్నారు. చైనాను ఢికొట్టే పనిలో ఆయన వియత్నాం పర్యటనకు సిద్ధపడ్డారు. అంతే కాదు, ఇప్పటికే వియత్నాంతో మన విదేశాంగ శాఖ చాలా ఒప్పందాలు చేసుకుంటూ సాగిపోతోంది. వాటిలో రక్షణ పరమైన సామాగ్రి అమ్మకాలు కూడా వున్నాయి. ఇండియా సృష్టించిన బ్రహ్మాస్త్రాం బ్రహ్మోస్ ను కొనేందుకు కూడా వియత్నాం సిద్ధంగా వుంది. అయితే, బ్రహ్మోస్ అమ్మకాల విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే దానిపై చర్చలు జరుగుతున్నాయి. వియత్నాం వద్దకు బ్రహ్మోస్ చేరితే అది చైనాకు తీవ్రమైన ఆందోళనే...   చైనా, వియత్నాం గొడవంతా దక్షిణ చైనా సముద్రం విషయంలోనే వుంది. మన దేశంలోని అరుణాచల్ ప్రదేశ్ తనదంటూ దౌర్జన్యం చేసే చైనా చాలా చిన్న దేశమైన వియత్నాంను కూడా అలాగే బ్లాక్ మెయిల్ చేస్తోంది. సముద్రంలోని కొన్ని దీవులు వియత్నాంకు చెందినవి అయినప్పటికీ చైనా తన సైనిక స్థావరాలుగా వాడేసుకుంటుంది. ఇలాంటి సరిహద్దు సమస్యలతో సతమతం అవుతోన్న వియత్నాం ఆసియాలో రెండో సూపర్ పవర్ అయిన ఇండియా మద్దతు చాలా తీవ్రంగా ఆశిస్తోంది. దాన్ని క్యాష్ చేసుకునే ప్రయత్నమే మోదీ తాజా పర్యటన కూడా!   శత్రువుకు శత్రువు మిత్రుడవుతాడు కాబట్టి... వియత్నాంతో వియ్యం ఆహ్వానించదగ్గ పరిణామమే. చైనా నిలువరించటమే కాకుండా భారత్ ఆర్దిక కోణంలో కూడా వియత్నాంలో పెట్టుబడులు పెట్టి లాభపడితే అది మరింత మేలు చేస్తుంది!