మహాత్ముడితో పుట్టిన మహానుభావుడు!
posted on Oct 2, 2016 @ 1:20PM
మోహన్ దాస్ కరమ్ చంద్ గాంధీ... ఈ పేరుకి ఇండియాలో ఇంట్రడక్షన్ అక్కర్లేదు! మన మనీ నోట్ల మీద మొదలు మనస్సుల్లో దాకా ఆయన అంతటా వుంటారు! మహాత్ముడిగా మనకు తరతరాలకు సరిపడా ప్రేరణనిచ్చారు. అలాగే జాతిపితగా... గాంధీ భారతీయతలో అవిభాజ్యమైన అంతర్భాగం అయ్యారు! అసలు ఒక్కసారి ఆలోచించండి... గాంధీ పేరు చెప్పకుండా ఆధునిక భారత చరిత్ర మీరేం చెబుతారు? కుదరని పని...
అక్టోబర్ రెండు అనగానే మనకు ఠక్కున గాంధీ జయంతి జ్ఞాపకం వస్తుంది. అది సంతోషకరమే! కాని, గాంధీ పుట్టిన రోజునే మరో గాంధేయవాది జన్మించిన సంగతి చాలా మందికి తెలియదు. పైగా గాంధీతో బర్త్ డే షేర్ చేసుకున్న ఆయన నిఖార్సైన గాంధేయవాది కూడా! అసలు ఒక్కమాటలో చెప్పాలంటే... గాంధీ మాటలతో ఏం చెప్పాడో, ఎలా వుండమన్నాడో.. అలా ఆజన్మాంతం ఆచరించిన ఆదర్శ పురుషుడు! అతనే మాజీ భారత ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి!
లాల్ బహదూర్ శాస్త్రి కేవలం మహాత్ముడు పుట్టిన అక్టోబర్ రెండున పుట్టిన వాడు మాత్రమే కాదు. ఆ మహాత్ముడితో సమానమైన మహానుభావుడు కూడా! తన పేరులోని శాస్త్రి ఊరికే కులం ఆధారంగా ఆయన పెట్టుకోలేదు. ఆ శాస్త్రి అన్నది లాల్ బహదూర్ కఠిక దారిద్ర్యాన్ని జయించి సాధించిన విద్యార్హత వల్ల వచ్చింది! అవును, ఆయన చదివిన ఉన్నత చదువుల కారణంగా శాస్త్రి బిరుదు ఆయనకు వచ్చింది!
లాల్ బహదూర్ శాస్త్రి చిన్న నాటి కథనం ఒకటి ప్రచారంలో వుంది. ఆయన స్కూలుకి వెళ్లే కాలంలో నది దాటి వెళ్లాల్సి వచ్చేది. అందుకు పడవ వాడికి రోజుకు కొంత మొత్తం చెల్లించాల్సి వచ్చేది. కాని, చాలా మంది గొప్ప వాళ్లలాగే శాస్త్రిజీ కూడా పుట్టుకతో కఠిక పేదరికం అనుభవించారు. అందుకే ఓ రోజు నది దాటేందుకు పడవ వాడికి ఇవ్వాల్సిన డబ్బులు ఆయన వద్ద లేకపోయాయి. మళ్లీ ఇస్తానంటే నది దాటించే వాడు అవమానకరంగా మాట్లాడాడు. దాంతో ఆత్మాభిమానం కలిగిన లాల్ బహదూర్ శాస్త్రి మళ్లీ ఏనాడూ... ఏళ్ల తరబడి... పడవ ఎక్కనే లేదు! ప్రతీ రోజు నది ఈదుకుంటూ వెళ్లి చదువుకుని వచ్చేవాడు! అంతటి ఆత్మభిమానం , పట్టుదల వున్న వాడు కాబట్టే ఆయన తరువాతి కాలంలో దేశ ప్రధాని కాగలిగారు, పాక్ పీచమణచగలిగారు!
అత్యంత పేద కుటుంబం నుంచి వచ్చిన లాల్ బహదూర్ శాస్త్రి పీఎం అయ్యాక కూడా చాలా సాదాసీదాగా వుండేవారని అంటారు! ఎంతగా అంటే , తన బట్టలు తానే పిండుకునేవారట ఆయన! ఇక నెహ్రు కాలంలో అప్పటికే దెబ్బతిన్న పాకిస్తాన్ తన వక్ర బుద్ది పోనించుకోక దండెత్తి వచ్చింది శాస్త్రిగారి శకంలో కూడా! అప్పడే భీకర యుద్దం జరుగుతుండగా ఆయన జై జవాన్...జై కిసాన్ చారిత్రక నినాదం ఇచ్చారు!
శాస్త్రి జీ ఇచ్చిన స్వేచ్ఛతో తన అస్త్ర, శస్తాలన్నీ బయటకు తీసి విజృంభించింది భారత ఆర్మీ. ఫలితంగా మన సేనలు పాక్ చేతిలో వున్న కార్గిల్ ప్రాంతం స్వాధీనం చేసుకోవటమే కాకుండా లాహోర్, కరాచీల్ని కూడా కంట్రోల్ లోకి తెచ్చుకున్నాయి. అయినా అప్పటి సూపర్ పవర్ రష్యా కొద్దిగా పాక్ వైపు రాజకీయం నడిపి లాహోర్, కరాచీల్ని తిరిగి ఆ దేశానికి ఇప్పించేసింది! మన కార్గిల్ కూడా తిరిగి ఇవ్వాలని సోవియట్ చెప్పింది. అందుకు శాస్త్రి ఎంత మాత్రం ఒప్పుకోలేదు. కాని, అనూహ్య పరిణామాల మధ్య ఆయన రష్యాలోని తాష్కెంట్లో హఠాత్తుగా మరణించారు! దీని వెనుక కుట్ర వుందని భావించే వారు ఇప్పటికీ చాలా మంది వున్నారు.
లాల్ బహదూర్ శాస్త్రి మరణం కొంత మిస్టరీనే అయినా ఆయన జీవితం మాత్రం గొప్ప హిస్టరీ! ఆయన పాక్ పైన తీసుకున్న స్టాండ్ ఇప్పటి మోదీకి కూడా ఇన్ స్పిరేషన్ అనవచ్చు! ఇప్పుడు నమో చేసినట్టే పాకిస్తాన్ ను ఆయన అప్పట్లో గడగడలాడించారు! కాకపోతే, దురదృష్టకరంగా హఠాన్మరణం పాలయ్యారు. అయినా కూడా గాంధీ పుట్టిన తేదీనే పుట్టిన ఆయన గాంధేయ వాదానికి అసలు సిసలు నిదర్శనం! గాంధీయవాదం, అహింస అంటే శత్రవులకి భయపడుతూ, వాళ్లకి లొంగి వుండటం కాదనీ, మనల్ని మనం రక్షించుకుంటూ పక్క వాళ్లని ఇబ్బంది పెట్టకపోవటమేనని.. లాల్ బహదూర్ బహు గొప్ప నిరూపించారు! అదే ఇప్పటికీ, ఎప్పటికీ భారతీయులందరికీ గొప్ప పాఠం!