ఆర్మీని సాక్ష్యాలు కోరేవారు... దేశద్రోహానికి నిలువెత్తు సాక్ష్యాలు!
posted on Oct 6, 2016 @ 5:59PM
కొన్ని సార్లు మన ప్రతి పక్షం కన్నా పాకిస్తానే బెటర్ అనిపిస్తుంటుంది! ఎందుకంటే, పాక్ వెలుపలి శత్రువు. ప్రతిపక్షం అంతర్గత శత్రవు. పాకిస్తాన్ ను తలుచుకుంటే భీకర యుద్ధం చేసి తుడిచి పెట్టేయవచ్చు. కాని, మన దేశ ద్రోహానికి సైతం వెనుకాడని ప్రతి పక్షాన్ని ఏ యుద్ధం చేసినా కూడా తట్టుకోలేము. ఎందుకంటే, మీడియా, మేధావులు, ప్రజాస్వామ్యం ముసుగులో గెరిల్లా పోరాటాలు చేస్తుంటాయి మన ప్రతిపక్ష పార్టీలు.
ఇండియా సర్జికల్ స్ట్రైక్స్ తరువాత ప్రపంచం ఒక్కసారి అలెర్ట్ అయింది. పాక్ కు దిమ్మతిరిగింది. బంగ్లాదేశ్, అఫ్గనిస్తాన్ లాంటి చిన్న దేశాలు మొదలు అమెరికా, రష్యా, జర్మనీ లాంటి సూపర్ పవర్స్ వరకూ అన్నీ మోదీని శభాష్ అన్నాయి! కాని, ఇప్పుడు ఇదే మన నేతల కడుపునొప్పికి కారణమైంది! సర్జికల్ స్ట్రైక్స్ నిజంగా జరిగాయా అంటూ ప్రశ్నించే దాకా పైత్యం ప్రకోపించింది!
సాధారణంగా సర్జికల్ స్ట్రైక్స్ లాంటి రహస్య మిలటరీ ఆపరేషన్స్ ఎవ్వరూ పబ్లిగ్గా చెప్పరు. చెప్పినా వీడియో ఆధారాలు చూపించరు. అందుకే, మన డీజీఎంఓ పాక్ పై దాడి చేసినట్టు ప్రకటించగానే మొత్తం ప్రపంచం మరో ఆలోచన లేకుండా నమ్మేసింది. అఖరుకు పాకిస్తాన్ కూడా మొదట్లో గట్టిగా దాడులు జరగలేదని అనలేకపోయింది! దీనికి కారణం భారత ఆర్మీకి వున్న విశ్వసనీయత. చరిత్రలో మనం వాళ్లు ఎప్పుడూ చేయని దాడులు చేశామని చెప్పుకోలేదు. దాడి చేస్తే దొడ్డి దారిన ఆపరేషన్లు నిర్వహించలేదు. అందుకే, మొత్తం ప్రపంచం ఇండియా మాటని నమ్మింది... కేవలం మన అరవింద్ కేజ్రీవాల్ , అతడి దేశ ద్రోహ బ్యాచీ తప్పా!
తమ ఆధీనంలో వున్న భూభాగంలో భారత్ దాడులు చేసిందని పాక్ ఎలా ఒప్పుకుంటుంది? అంగీకరించలేదు. అది సహజం. పైగా అంతర్జాతీయ మీడియాని తీసుకొచ్చి ఏమీ కాలేదని నమ్మబలికింది. అదీ సహజమే. కాని, ఇక్కడ అసహజం ఏంటంటే, భారతీయ ఓటర్ల మద్దతుతో ఢిల్లీ సీఎం అయిన కేజ్రీ ఇంగితం కోల్పోయి సాక్ష్యాలు అడగటం! చాలా తెలివిగా మోదీని ప్రశంసిస్తూనే పాక్ ను దోషిగా చేసేందుకు ప్రూఫ్స్ కావాలన్నాడు! ఒక సీక్రెట్ మిలటరీ ఆపరేషన్ సాక్ష్యం అడగటం అంటే ఏంటి అర్థం ? మోదీని కార్నర్ చేస్తున్నట్టు కాదు... ఇండియన్ ఆర్మీని అనుమానిస్తున్నట్టు! ఇంత కామన్ సెన్స్ కూడా లేకుండా పోయింది మిష్టర్ ఏకేకి!
అరవింద్ కేజ్రీవాల్ దేశం కోసం పోరాడుతోన్న ఇండియన్ ఆర్మీనే అనుమానించి సాధించింది ఏంటి? మోదీని ఏ మాత్రం తగ్గించలేకపోయాడు! తాను మాత్రం పాకిస్తానీ మీడియా, మేధావులు, జనంలో హీరో అయ్యాడు! అక్కడి సోషల్ సైట్స్ లో గొప్పగా ట్రెండ్ అయ్యాడు! అసలు ఉప్పు, కారం తినే ఒక భారతీయుడికి ఇంతకంటే అవమానకరం ఇంకేం వుంటుంది?
అరవింద్ కేజ్రీవాల్ మోదీని టార్గెట్ చేసి ఎక్కడ మైలేజీ కొట్టేస్తాడోనని 125ఏళ్ల కాంగ్రస్ భయపడింది. వెంటనే వెనకా ముందు ఆలోచించకుండా తానూ సాక్ష్యాలు కోరింది! అంతే కాదు, చిదంబరం లాంటి సీనియర్, మేధావి పంచె ఎగజెక్కుకుని వచ్చి ఆధారాలు కావాలన్నాడు! పనిలో పనిగా కాంగ్రెస్ హయంలో కూడా సర్జికల్ స్ట్రైక్స్ అయ్యాయని సెలవిచ్చాడు. అదే నిజమైతే అప్పుడెందుకు యూపీఏ సాక్ష్యాలు బయటపెట్టలేదు? కాంగ్రెస్ ప్రూఫ్స్ చూపకపోతే దౌత్య నీతి... మోదీ చూపించకపోతే... సర్జికల్ స్ట్రైక్సే అబద్ధం! ఇంతకంటే దుర్మార్గమైన ప్రతిపక్షం ప్రపంచంలో మరెక్కడా వుండదు!
కాంగ్రెస్ లోనే మరో నేత సంజయ్ నిరుపమ్ మరీ నిస్సిగ్గుగా దాడులు జరగలేదని తేల్చేశాడు. అంతా మోదీ సెల్ఫ్ డబ్బా అనేశాడు. ఇలాంటి పనికి మాలిన మాటలు ఎన్నికల సమయంలో బావుంటాయి కాని శత్రు దేశంతో యుద్ధానికి సిద్ధంగా వున్నప్పుడు కాదు! ఇక ఆర్మీ వైపు నుంచీ చూస్తే మన వీర జవాన్లు ఉరికే పీఓకేలోకి పోవటమే కాదు... ఉగ్రవాదుల్ని వేటాడుతూ వీడియో కూడా తీశారు. దాన్ని బయటపెట్టేందుకు తాము ఎప్పుడూ రెడీ అంటున్నారు!
ఒకడు పదో తరగతి పాసై వేరే పని చేయలేని వారు ఆర్మీలో చేరతాడని అంటాడు. ఇంకొకడు ఆర్మీలో చేరి చావమని మేం అడిగామా అంటాడు. ఇలాంటి బరితెగించిన దేశంలో ఆర్మీకి వీడియో ఆధారాలు చూపించుకోవటం తప్ప మరో మార్గం లేదు. కాని, ఇక్కడ అసలు ట్విస్ట్ ఏంటంటే... చిదంబరం అంతటి మొనగాడు, ఏకే ఆంథోని అంతటి ధీరుడు యూపీఏ టైంలో కూడా సర్జికల్ స్ట్రైక్స్ అన్నారు. కాని, అసలేం జరగలేదని తేల్చి చెప్పాడు, అప్పటి డీజీఎంఓ వినోద్ భాటియా. స్వయంగా ఆనాటి ఆర్మీ అధికారే దాడులు జరగలేదని చెప్పాక... కాంగ్రెస్ సర్కార్ తాలూకూ ఉత్తర కుమార ప్రగల్భాలు ప్రత్యేకంగా మాట్లాడుకోవాలా?
ఇప్పుడే కాదు... మన విపక్షాలకు, వాటి నేతలకు , కొందరు మేధావులకు ... గతంలో కూడా మోదీ వ్యతిరేకతకి , దేశ గౌరవానికి మధ్య తేడా తెలియకుండా పోయింది. మోదీ అమెరికా పర్యటించకూడదని కక్ష్యగట్టి ఏకంగా ఒబామానే బతిమాలుకున్నారు! మా దేశం నుంచి మోదీ అనే సాటి భారతీయుడు వస్తాడు... ఆయన్ని మీ దేశంలోకి రానీయకండీ... అంటూ నిస్సిగ్గుగా విజ్ఞప్తి చేసి సంతకాలు పెట్టారు! అలాంటి వారు ఇప్పుడు సాక్ష్యాలు కోరటం... ఆశ్చర్యమేముంది?