మన అమ్మవార్లు రాతి విగ్రహాలేనా?
posted on Oct 9, 2016 @ 5:22PM
శరన్నవరాత్రి ఉత్సవాలు అయిపోవస్తున్నాయి. జనం దసరా కోసం ఉత్సహంగా సిద్ధమైపోతున్నారు. ఈ హడావిడిలో... నిజంగా హిందూ మతంలోని శక్తి ఆరాధన వెనుక వున్న రహస్యం ఏంటి? ఎవరన్నా ఆలోచిస్తున్నారా? సాధారణ జనం పూజలు, పునస్కారాల కోలాహలంలో అసలు మర్మం మరిచిపోతుంటారు. అమ్మవారి అలంకారాలు, కుంకుమ పూజలు, దాండియాలు ఇవన్నీ తప్పు కాకపోయినా, అంతా శాస్త్రబద్ధమే అయినా... మన ఋషులు ఏ మూలమైన ఆలోచనతో శక్తి పూజించటం మొదలుపెట్టారో అది మనం పూర్తిగా పట్టించుకోవటమే లేదు. పైపైన ఆచారాలు, సంప్రదాయాలతో సరిపెట్టేస్తున్నాం...
అమ్మవార్ని అంగరంగ వైభవంగా ఆరాదించటం మనకు ఎవ్వరూ చెప్పక్కర్లేదు. అది ఎలాగూ చేస్తాం. కాని, అందులోని తాత్విక కోణం ఇప్పుడోసారి చూద్దాం. మన వాళ్లు శక్తిని సృష్టికి మూలంగా భావించారు. శక్తి అంటే ఎనర్జీ. ఎనర్జీ లేకుంటే మ్యాటర్ దేనికీ పనికిరాదు. అందుకే, శక్తి లేకుంటే శివుడు సృష్టి చేయలేడంటుంది వేదం. ఆ శక్తికి ప్రతిరూపమే పార్వతి దేవీ. సతీ దేవీ అన్నా, దాక్షాయణి అన్నా, గౌరీ అన్నా అన్నీ ఆమే. శివుడికి అర్థాంగి అయిన ఆ అమ్మ మొత్తం సృష్టిలోని శక్తి. ఆమె వల్లే కణాలు, అణువులు మొదలు అండ, పిండ, బ్రహ్మండాలు నిలిచేది, కదిలేది, వ్యాపించేది, కుంచించుకుపోయేది! అసలు శక్తి ఎప్పుడైతే తనని తాను ఒక దేహం నుంచి ఉపసంహరించుకుంటుందో అప్పుడే ఆ శరీరం శవమైపోతుంది. దానిలోని అప్పటి వరకూ వున్న చూతన్యమే శక్తి! ఆ శక్తి శాశ్వతం అంటుంది సనాతన ధర్మం. అంతే కదా... పదార్థం పుడుతుంది, మరణిస్తుంది. సృజింపబడుతుంది. మాయమైపోతుంది. కాని, సృష్టి, స్థితి, లయాలకి కారణమైన శక్తి శాశ్వతంగా మిగిలే వుంటుంది.
మొత్తం విశ్వాన్ని ఆవరించిన, ఆవహించిన శక్తినే కాదు ఇంకా అనేక ప్రకృతి అంశల్ని కూడా భానతీయ సంస్కృతి స్త్రీగానే భావిస్తుంది. ఎందుకంటే, స్త్రీ మాత్రమే సృష్టికి, పుష్టికి కారణం. అది చంటి బిడ్డైనా, పండు ముసలి అయినా అమ్మ రూపంలోనో, అమ్మవారి రూపంలోనో స్త్రీ నుంచే ప్రతీ జీవి ప్రాణ రక్షణ పొందుతుంది. అందుకే, మన పెద్దలు స్త్రీ ఆరాధనకి ఎనలేని ప్రాముఖ్యత ఇచ్చారు.
మనం జీవిస్తున్న భూమిని కూడా మన వాళ్లు భూమాత అన్నారు. ఎందుకని? భూమి తల్లి లాగే మనకు కావాల్సిన సమస్తం ఇస్తుంది. ఆమె ఇవ్వనిది ఏదీ మనకు లేదు. ఆమె ఇవ్వకుంటే అది లేనట్లే! తినే తిండి, తాగే నీరు, వాడుకునే చెట్లు, చేమలు, కొండలు, లోయలు, గుహలు, ఖనిజాలు అన్నీ భూదేవీ ఇచ్చేవే. అందుకే, భూమిని విశ్వ రూపుడైన విష్ణువుకి భార్య అన్నారు. సహచరి అన్నమాట. పొద్దున్న లేస్తే భూదేవీకి క్షమాపణ చెప్పమని కూడా అంటారు పెద్దలు. అంటే... మనకు సర్వం, సమస్తం ఇచ్చే భూదేవికి మనం కృతజ్ఞతతో వుండాలన్నది భావం అన్నమాట...
శివుడి భార్యలని చెప్పే అన్నపూర్ణా, గంగలు కూడా ప్రకృతి అంశలే! అన్నం పరబ్రహ్మ స్వరూపమని చెప్పే వేదం... ఆ అన్నానికి అధిదేవత అన్నపూర్ణేశ్వరి అంటుంది. అన్నపూర్ణ వద్ద ఆది భిక్షువు పరమశివుడు ఆహారం భిక్షగా స్వీకరిస్తాడు. అంటే అమ్మ అవసరం, అన్నం అవసరం సాక్షాత్తు శివుడికి కూడా వుందని చెప్పటమే దీనిలోని లౌకికమైన భావం. ఇంకా ఆధ్యాత్మిక కోణాలు అనేకం వున్నా... మనిషికి అత్యంత ప్రధానమైన అన్నం స్త్రీ వల్లే సమకూరుతుంది. ఆమె లేకపోతే అఖిల జగాలు ఆకలితో అలమటిస్తాయి....
గంగ అంటే నీళ్లు. భారతీయులు నదుల్ని, సముద్రాల్ని పూజించటం ఈ మధ్య కొందరు మూఢ నమ్మకాలని అనుకుంటున్నారు. కాని, ప్రకృతిలోని నీరు, చెట్టు, చేమా అన్నీ దైవాంశలని భావించటం మహోన్నతమైన ఆధ్యాత్మికత. అది వేల ఏళ్లు పటిష్టంగా వుండటం వల్లే భారతదేశంలోని నదులు, అడవులు, అద్బుత ప్రకృతి సురక్షితంగా వుంటూ వచ్చింది. ఆధునిక కాలంలో ప్రాణాధారమైన నీటిని కూడా ఓ సహజ వనరుగా మాత్రమే భావించి ఇష్టానుసారం దుర్వినియోగం చేసేశారు. దాని ఫలితమే గంగా నది లాంటి నదులు కాలుష్యమయం అయిపోవటం. కాని, గంగను అమ్మగా భావిస్తే , నిజంగా ఆరాధిస్తే వేల ఏళ్లు పవిత్రంగా వున్నట్టే ఇప్పుడూ వుండేవి...
సృష్టిలోని శక్తి, భూమి, అన్నం, నీరు... ఇలాంటి అంశలే కాదు... మనిషికి వ్యక్తిగతంగా అవసరం అయ్యే సహజ శక్తులు కూడా స్త్రీ రూపంలో దర్శించారు మన ఋషులు. అన్ని సుఖాలు, సౌక్యాలు, సంతోషాలకు మూలమైన సంపద, ఐశ్వర్యం లక్ష్మీ దేవీ అన్నారు. ఎంత ఆస్తి, పాస్తులున్నా , ఇంకా ఏం వున్నా జ్ఞానం అవసరం. అది వుంటేనే మనఃశాంతిగా, దైర్యంగా వుండగలిగేది. ఆ జ్ఞానాన్ని కూడా సరస్వతి రూపంలో కొలిచారు భారతీయులు. ఇక డబ్బు, జ్ఞానం లాగే మనిషికి అత్యంత అవసరమైంది ప్రేమ. ఆ ప్రేమకు ప్రతిరూపం శ్రీకృష్ణుని ప్రియురాలైన రాథ.
భారతీయ సంస్కృతి శృంగారాన్ని కూడా ఎప్పుడూ తప్పుగా చూడలేదు. బ్రహ్మచర్యాన్ని బోధించిన మన శాస్త్రాలే రతి దేవీని కూడా ఆరాధించాయి. ఆమె మనుషుల్లోని కోరిక అనే శక్తికి అధిదేవత అన్నాయి. ఇక రంభ లాంటి అప్సరసల్ని అందానికి సంకేతంగా వాడారు. అది కూడా జీవితంలో ఎంతో ప్రధానమైన అంశమని అనేక పురాణ కథల ద్వారా తెలియజేశారు....
ఇలా వేద, పురాణ, ఇతిహాసాల్ని తరిచి చూస్తే మనకు సంతోషానికి అధిదేవతగా సంతోషిమాత, విఘ్నేశ్వరుడి భార్యలుగా సిద్ది, బుద్ది, సుబ్రమణ్యుని దేవేరులుగా శ్రీవల్లి, దేవసేన... అందరూ ప్రకృతి అంశలే! హిందువులు ఎంతో ఉన్నతంగా భావించే గాయత్రి దేవి కూడా సృష్టిలోని సమస్తమైన సాత్విక శక్తికి సంకేతం!
నవరాత్రి ఉత్సవాలు చేసుకుంటూనే మన ఋషులు, మునులు ఎంతో నిగూఢంగా ఆలోచించి ఏర్పాటు చేసిన స్త్రీ దేవతారాధన, శక్తి ఉపాసన ధార్మిక మర్మాల్ని కూడా మనం తెలుసుకోవాలి! అందులోని
తాత్విక రహస్యం అవగాహన చేసుకోవాలి...