రాజకీయ కబేళాలో... భారతీయ గోవు! 

కొందరు మోదీ వ్యతిరేకులు, మరీ ముఖ్యంగా వామపక్ష భావజాలం వున్న వారూ ఈ మధ్య ఓ మాట అంటూ వస్తూన్నారు! ప్రస్తుత భారతదేశంలో మనిషిగా పుట్టటం కన్నా ఆవుగా పుట్టడం బెటర్ అంటున్నారు! దీని వెనుక నేపథ్యం ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు కదా? మోదీ ప్రధాని అయినప్పట్నుంచీ గోవుకి ఎక్కడ లేని రాజకీయ ప్రాముఖ్యం వచ్చేసింది. నిజానికి కేంద్ర ప్రభుత్వం అధికారికంగా గోవధ నిషేధాన్ని తీవ్రంగా అమలు పరుస్తున్న దాఖాలు ఏం లేవు. కాని, ఆవు చుట్టూ వివాదాలు మాత్రం అలుముకుంటున్నాయి. వాటి గో సంబంధమైన పండుగ జరుపుకుంటోన్న ఇవాళ్టి రోజు మనం మాట్లాడుకుని తీరాల్సిందే! కార్తిక శుద్ధ అష్టమిని గోపాష్టమి అంటారు. ఇది మన పండుగల్లో ఒకటి. కాని, ప్రస్తుతం దీని గురించి తెలిసిన వారు చాలా తక్కువ. అసలింతకీ ఈ రోజు ఏమైందంటే, ద్వాపర యుగంలో... శ్రీకృష్ణుడు గోవుల్ని తీసుకుని యుమున తీర ప్రాంతాలకు వెళ్లాడు. అలా మొదటిసారి గోవిందుడు గోపాలుడై బయలుదేరిన రోజే కార్తీక శుద్ధ అష్టమి. దాన్నే గోపాష్టమి అంటారు.  గోపాష్టమి నాడు గోవుల్ని పూజించటం ఎప్పుట్నుంచో కొనసాగుతూ వస్తోంది. అయితే, రాజకీయంగా ఆవు కేంద్ర బిందువైన ఈ తరుణంలో గోపాష్టమి పండుగకి రాజకీయ ప్రాముఖ్యత కూడా ఏర్పడింది. వీహెచ్ పీ లాంటి హిందూ మత సంస్థలు గోపాష్టమిని తమకు వీలైన రీతిలో నిర్వహిస్తూ వస్తున్నాయి. ముందు ముందు ఈ రోజుకి మరింత ఆకర్షణ పెరిగే అవకాశాలే వున్నాయి. అందుకు కారణం సమస్త సనాతన గ్రంథాల్లో ఆవుకు, ఆవు పూజకు వున్న విశిష్టతే! అసలు గో మహిమ ఇప్పటిది కాదు. ఆరెస్సెస్, వీహెచ్ పీ లాంటి సంస్థలు ముస్లిమ్ లను, దళితుల్ని టార్గెట్ చేయటానికి ముందుకు తీసుకొచ్చిన ఎజెండా కూడా కాదు. యుగయుగాలుగా గోవు మనకు మహిమాన్విత జంతువే. అందుకే, గో వధ అన్నిటికంటే మహా పాపం అన్నారు పెద్దలు. కాని, అదే సమయంలో మన సమాజంలో కొందరు గో మాంసం తినటం వివాదాస్పదం అవుతూ వస్తోంది. మరీ ముఖ్యంగా, గో వధ నిషేధం తమ ఎజెండాలో వున్న బీజేపి అదికారంలోకి రావటంతో గోవు మరింత గోలకు కారణం అవుతోంది. అసలింతకీ రాజ్యాంగం ఏం చెబుతోంది?  గో వధ నిషేధించాలన్నది హిందూ మత సంస్థలు, బీజేపి పార్టీ చేస్తున్న రాజకీయ నినాదం మాత్రమే కాదు. రాజ్యాంగం కూడా దేశీయ గో సంతతిని, ఇతర పశువుల్ని కాపాడాలని సూచించింది. కొన్ని రాష్ట్రాలు గో వధ నిషేధం బిల్లు కూడా పాస్ చేశాయి. కాని, అమలులో మాత్రం ఎక్కడా గట్టి ప్రయత్నం జరగటం లేదు. గోవుల అక్రమ రవాణ, దానికి వ్యతిరేకంగా గో సంరక్షకుల ఉద్యమాలు, దాడులు వగైరా వగైరా అన్నీ కలిసి పెద్ద రచ్చకి దారి తీస్తున్నాయి. దాద్రి సంఘటన తరువాత జరిగిన దుమారం ఇందుకు చక్కటి ఉదాహరణ...  గోవుల్ని రక్షించే నెపంతో హిందూ అతి వాదులు ఎవరి మీద చేయి చేసుకున్నా అది సమర్థనీయం కాదు. కాని, అదే సమయంలో అభ్యుదయవాదులు , వామపక్ష భావజాలం వున్న వారు ముస్లిమ్ లను, దళితుల్ని వివాదంలోకి లాగి జాతీయ శ్రేయస్సు దెబ్బ తీయటం కూడా సరి కాదు. గో వధ నిషేదాన్ని అత్యధిక శాతం హిందువుల విశ్వాసానికి సంబంధించిందిగా చూడాలి. అంతే తప్ప అగ్ర వర్ణ హిందువులు, బీసీలు దళితుల మీద చేస్తున్న దాడిగా చూడకూడదు. అలా చిత్రీకరించే కుట్రలు కూడా చేయకూడదు. చాలా దేశాల్లో చాలా విశ్వాసాల ఆధారంగా నిషేధాలు కొనసాగుతుంటాయి. అలాగే భారతదేశంలో ఆవుని చంపకుండా వుండేలా చర్యలు తీసుకుంటే ఉత్తమం. దాని వల్ల దళితులు, ముస్లిమ్ లు, క్రిస్టియన్ల వంటి వారు ఇబ్బంది పడితే వారి సమస్యలు పరిష్కరించాల్సిన బాద్యత ప్రభుత్వాలది. అంతే తప్ప మెజార్జీ ప్రజల మత విశ్వాసాన్ని వ్యక్తిగత స్వేచ్ఛ పేరుతో లెక్కచేయకపోవటం దురుసుతనమే అవుతుంది.  మత సంబంధమైన విశ్వాసం కారణంగానే గో వధ నిషేధం డిమాండ్ వినిపిస్తున్నప్పటికీ ఎన్నో సైంటిఫిక్ స్టడీస్ కూడా దాని అవసరాన్ని నొక్కి చెబుతున్నాయి. గోవులు వాతావరణ సమతుల్యానికి ఉపయోగకరమని చాలా మంది అభిప్రాయపడుతున్నారు. అందులో నిజానిజాలు తెలుసుకునే ప్రయత్నం కూడా గవర్నమెంట్స్ చేయాలి. అంతే కాక, గో మూత్రం, పేడ వంటి వాటికి కూడా ఆరోగ్య సంబంధమైన ప్రాముఖ్యత వుంది కాబట్టి వాటికి మార్కెటింగ్ కల్పించాలి. ఇవే కాక వేలాది హిందూ దేవాలయాల్ని తన ఆధీనంలో వుంచుకున్న దేవాదాయ ధర్మదాయ శాఖ బాధ్యతగా గోవుల్ని సంరక్షించాలి. దాని వల్ల హిందువుల మనో భావాలు కాపాడబడటమే కాక పురాణాల్లో చెప్పినట్లు సమాజానికి, దేశానికి కూడా హితం జరగవచ్చు. శ్రీకృస్ణుడు ఈ దేశంలో దేవుడు. ఆ దేవుడే స్వయంగా గోవులకి కాపరి అయ్యాడు. ఆయన తొలిసారి గోవుల వెంట కదిలిన రోజే ఈ గోపాష్టమి. దీన్ని బట్టే ఇక్కడ యుగయుగాలుగా గోవుకు ఎంత ఉన్నత స్థానం వుందో తెలుస్తోంది. మరి అటువంటి సున్నితమైన అంశాన్ని రాజకీయ పార్టీలు, ఇతర సంఘాలు రాజకీయం చేయకుండా గో వధ నిషేధం అమలు దిశగా అడుగులు వేస్తే ఎంతో బావుంటుంది. అది ఇప్పుడే సాద్యమయ్యేలా కనిపించకున్నా ముందు ముందు జరగాలని కోరుకుందాం...  

'చెత్త' రాజకీయాలకు చిత్తైపోతున్న ఢిల్లీ! 

  దేశ రాజధాని ఢిల్లీలో రాజకీయ కాలుష్యం వుంటుందని అందరికీ తెలుసు! కాని, ఇప్పుడు రాజకీయ కాలుష్యం కన్నా వాయు కాలుష్యం జనాలకి ఊపిరాడనివ్వటం లేదు. దీపావళి తరువాత నుంచీ పరిస్థితి దారుణంగా తయారైంది. ఎంతగా అంటే పాఠశాలలకు తుఫాన్ లు వచ్చినప్పుడు, ఎండలు విపరీతంగా వున్నప్పుడు ఇచ్చినట్లుగా సెలవులు ప్రకటించే దాకా వెళ్లింది! అసలు పిల్లలు స్కూల్స్ కి వెళ్లటం కాదు పెద్ద వాళ్లు ఆఫీసులకి వెళ్లటం కూడా ప్రమాదకరంగానే మారిపోయింది. స్వయంగా సీఎం కే్జ్రీవాల్ అవసరం వుంటే తప్ప బయటకి రాకండని సూచన చేసేశాడు. అదీ సిట్యుయేషన్! దీపావళి తరువాత డిల్లీలో పొల్యూషన్ ఎక్కువైంది అంటే ... ఇదేదో టపాసుల వల్ల వచ్చిపడ్డ ప్రమాదం కాదు. నిజానికి దేశ రాజధానిలో కాలుష్యం అంతా ఇంతా కాదు. సంవత్సరం పొడవునా అక్కడి జనం విషమే పీలుస్తుంటారు. అందుకు కారణాలు బోలెడు. ఇక సంవత్సరానికి ఒక్కసారి వచ్చే క్రాకర్స్ ఫెస్టివల్స్ మరికొంత ఇబ్బంది పెంచుతుంది. కాని, అదే అసలు మూలం కాదు. మరి ఢిల్లీ కాలుష్యానికి అసలు కారణం ఏంటి? కొందరి వాదన ప్రకారం చెత్త! అవును, చెత్తను ఎక్కడికక్కడ కాల్చేయటమే తీవ్రమైన వాయు కాలుష్యానికి దారి తీస్తోందట! మొత్తం వ్యవస్థని ఊడ్చేస్తానని అధికారంలోకి వచ్చిన అరవింద్ కేజ్రీవాల్ కనీసం చెత్త కూడా ఊడ్పించటం లేదు. అక్కడి మున్సిపల్ వర్కర్స్ ఇప్పటికే దఫదఫాలుగా ధర్నాలు చేశారు జీతాల కోసం. కాని, కేజ్రీవాల్ మాత్రం ఎక్కడ ఎన్నికలైతే అక్కడ వాలిపోయి బీజేపిని విమర్శిస్తూ కాలం గడుపుతున్నాడు. తనని తాను మోదీకి పోటీగా ఊహించుకుంటూ సీఎంగా బాధ్యతలు మర్చిపోతున్నాడు. ఏ విమర్శ ఎదురైనా కేంద్ర ప్రభుత్వం తనని పని చేయనీయటం లేదని తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నాడు. ఈ కాలుష్యం విషయంలో కూడా ఢిల్లీ చుట్టూ వున్న హర్యానా, రాజస్థాన్, పంజాబ్ లు వదిలే కలుషిత వాయువుల వల్లే తన రాష్ట్రానికి ఇబ్బందని బాధ్యత రహితమైన కామెంట్ చేశాడు. పైగా చుట్టూ వున్న బీజేపి పాలిత రాష్ట్రాలు చెప్పి అఖిలేష్ పాలిస్తున్న ఉత్తర్ ప్రదేశ్ ఆయన చెప్పలేదు. కేజ్రీవాల్ చేస్తున్న ఈ యాంటీ మోదీ పాలిటిక్స్ ఢిల్లీ సామాన్య జనానికి ప్రాణాంతకంగా మారాయి. కనీసం చెత్త ఎక్కడికక్కడ కాల్చేయటం కాకుండా సిటీ వెలుపలికి తరలించే ఏర్పాట్లు కూడా ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వం చేయటం లేదు.  ఢిల్లీలో కాలుష్యం ఎంతగా వుందంటే ఒక మనిషి రోజంతా అక్కడి రోడ్ల మీద వుంటే 45సిగరెట్లు తాగిన దానితో సమానం అవుతుందట! అసలు హస్తినలో పది నిమిషాలు రద్దీ రోడ్డుపై వుంటే గొంతులో మంట మొదలైపోతుందట! ఇక పదేళ్లకు మించి వుంటే క్యాన్సర్ కొని తెచ్చుకున్నట్టే! ఇంత దారుణ పరిస్థితులు వున్నప్పుడు మరి అక్కడే వున్న కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తోంది? మొత్తం దేశం బాధ్యత మోదీదైనప్పుడు ఢిల్లీ కూడా అందులో భాగమే కదా? కేజ్రీవాల్ తో కయ్యమే ఎన్డీఏ ప్రభుత్వాన్ని వెనక్కి లాగుతోంది. మోదీ సర్కార్ ఏం చేసినా క్రెడిట్ కేజ్రీవాల్ కొట్టేయగలడని దేశ పాలకుల భావన. మొత్తానికి కేంద్రం, కేజ్రీల మధ్యన ఢిల్లీ జనాలు విషం పీల్చి పిప్పిగా మారిపోతున్నారు...  ఢిల్లీ కేవలం ఒక రాష్ట్రమే కాదు. అది దేశానికి రాజధాని. అంటే... ఢిల్లీ దిల్లీ కూడా! మరి అటువంటి గుండె కాయని ఎంత జాగ్రత్తగా చూసుకోవాలి? పైగా అక్కడే ఒక సీఎం, మరో పీఎం కూడా వుండి ఏమీ చేయకపోతే ఎలా? కనీసం చెత్తని తరలించే వ్యవస్థ కూడా ఏర్పాటు చేయని చెత్త పాలన చేస్తూ వుంటే ఎలా? ఈ ప్రశ్నలకి సమాధానాలు జనం ఖచ్చితంగా అడుగుతారు! వచ్చే ఎన్నికల్లో బీజేపి, అంతకంటే ఎక్కువగా ఆప్ జవాబు చెప్పుకోవాల్సి వుంటుంది...       

అందాల ప్రపంచంలో వ్యభిచారం ఓ వికృత సైడ్ ఎఫెక్ట్! 

దీపం అయినా, క్యాండిల్ అయినా తనకు దూరంగా వున్న చోట్లకి వెలుగుని పంచుతుంది. కాని, దగ్గర్లో మాత్రం నల్లటి చీకటి వలయం ఆవహించి వుంటుంది. గ్లామర్ ప్రపంచం కూడా అంతే! దూరం నుంచి చూసే వారికి మిలమిల మెరిసిపోతున్నట్టు కనిపించినా దగ్గరికి వెళ్లిన కొద్దీ చీకటి కోణాలు ఆవిష్కృతం అవుతుంటాయి! మరీ ముఖ్యంగా, గ్లామర్ ప్రపంచంలో సెక్స్ విషయంలో...  సినిమా, టీవీ, మోడలింగ్... ఇవన్నీ గ్లామర్ లోకాలు.అక్కడ అందరూ మేకప్ వేసుకునే వుంటారు. ఆ మేకప్ మాటున ఎవరు బాధితులో, ఎవరు బాధించే వారో అర్థం కాదు. అసలు ఏ బాదా లేన్నట్టు అందరూ నవ్వూతూ మోసగించటం, మోసపోవటం మరో విషాదం! అన్నిటికంటే ముఖ్యంగా గ్లామర్ ఫీల్డ్ లో సెక్స్ చాలా కీలక పాత్ర పోషిస్తుంది. రాజకీయాల్లో డబ్బు ఎంత చక్రం తిప్పుతుందో ఇక్కడ శృంగారం అంతే ప్రభావం చూపుతుంది. అయినా ఎవ్వరూ ఓపెన్ గా మాట్లాడరు. క్యాస్టింగ్ కౌచ్ అనో, సెక్స్ రాకెట్ అనో మీడియా ఎన్ని పేర్లు పెట్టినా అంతా ఓ పబ్లిక్ సీక్రెట్ లాగే మిగిలిపోతుంటుంది...  ఆ మధ్య బాలికా వధూ అనే సీరియల్ లో ప్రదాన పాత్ర పోషించిన ప్రత్యూష ఆత్మహత్య చేసుకుంది. గుర్తుందిగా? డబ్బింగ్ సీరియల్ ద్వారా ఆనంది పాత్రలో ఆమె తెలుగు వారికి కూడా పరిచయమే. కాని, ఈ బుల్లితెర ఆనంది నిజ జీవితంలో మాత్రం ఆనందం కరువైంది. కారణం ఏంటో తెలుసా? వ్యభిచారం! అవును... నిన్న మొన్నటి వరకూ ఆమె తన బాయ్ ఫ్రెండ్ తో గొడవల వల్ల మరణించిందని అందరూ అనుకున్నారు. కాని, దాన్ని నిజం చేస్తూ బయటపడ్డ ఫోన్ కాల్ రికార్డింగ్ అందర్నీ షాక్ కి గురి చేసింది. ఒక టాప్ పొజీషన్లో వున్న నటికి కూడా ఇలాంటి ఒత్తిళ్లు వుంటాయా అని ఆలోచనలో పడేలా చేసింది. ప్రత్యూష, తన బాయ్ ఫ్రెండ్ రాహుల్ రాజ్ సింగ్ తో లాస్ట్ టైం మాట్లాడిన మాటలు గ్లామర్ ప్రపంచం గాయాల్ని పట్టి చూపిస్తాయి. ఆమె అతడితో, తన చేత వ్యభిచారం చేయించి జీవితం నాశనం చేశావని అంది. అంతే కాదు, తన గురించి, తన కుటుంబం గురించి అందరూ దారుణంగా మాట్లాడుకుంటున్నారని వాపోయింది. అసలు ఆమె ఫోన్ కాల్ సారాంశం వింటుంటే ఎవరికైనా మేకప్ మాటున వుండే దారుణమైన కోణాలు కళ్లకు కడతాయి. ఒక్క ప్రత్యూష బెనర్జీ కాదు ఎందరో అమ్మాయిలు నటన ముసుగులో వేశ్యలుగా మారాల్సి వస్తోంది రంగుల ప్రపంచంలో. మోడలింగ్ లోనూ అదే పరిస్థితి. ర్యాంప్ పై నడిస్తే వచ్చే దానికన్నా ఎక్కువ రాత్రి తప్పటడుగులు వేస్తే వస్తుంది. అందుకే, కొందరు గ్లామర్ క్వీన్స్ కావాలని పతనమైతే మరికొందరు తెలిసీ తెలియక, ఇతరుల ఒత్తిళ్లతో ఉబిలో కూరుకుపోతున్నారు. ప్రత్యూషలాగా ప్రియుళ్లు, భర్తలు లేదా మరెవరో దగ్గరి బందువుల చేతిలో బందీలుగా నరకం చూసేవారు బోలెడు మంది. తారా చౌదరి కేసు మొదలు శ్వేతా బసు వరకూ అందాల ప్రపంచంలో అందరివీ ఒకేలాంటి నేపథ్యలే. ఆర్దికంగా ఏ స్థితిలో వున్నా సెక్స్ సంబంధమైన విషయాల్లో మాత్రం అత్యధిక శాతం ఆడవాళ్లు బాధితులుగానే మిగిలిపోతున్నారు. అసలు బయటకి పొక్కకుండా లోలోన మగ్గిపోతున్న సెక్సువల్ ఎక్స్ ప్లాయిటేషన్స్ ఇంకా మరెన్నో! గ్లామర్ వాల్డ్ లో నిత్యం జరిగే బెడ్ రూం క్రైమ్స్ మ్యాగ్జిమమ్ బయటకు రాకపోవటానికి ప్రధాన కారణం ఇక్కడి బాధితులు కూడా దాన్ని తమ ఫీల్డ్ లో సహజమైందిగా భావించటం. శృంగారంతో ఇచ్చిపుచ్చుకోకపోతే ఆఫర్స్ రావనీ, పస్తులు తప్పవని వాళ్లకీ డీపాల్ట్ గా తెలిసిపోయి వుంటుంది. అందుకే, ఎంత వయోలెంట్ ఎక్స్ పీరియన్స్ అయినా సైలెంట్ గా మనసు పొరల్లో దాచేసుకుని భారంగా ముందుకు పోతుంటారు! ప్రత్యూషకు ఎదురైన అనుభవాలు కొత్తవీ కాదు... ఇప్పుడప్పుడే ఆగిపోయేవి కావు. ఒక గ్లామర్ ప్రపంచంలో ఎందరో ప్రత్యూషలు!  

ఆర్కే క్షేమమే... మావోయిస్టుల మార్గం క్షేమమేనా?

ఎన్ కౌంటర్, బూటకపు ఎన్ కౌంటర్... ఈ పదాలు మరోసారి మీడియాలో మార్మోగాయి. అందుక్కారణం ఈ మధ్య జరిగిన ఏవోబీ హింసే! అవును... జరిగింది ఎన్ కౌంటర్ అయినా, బూటకపు ఎన్ కౌంటర్ అయినా ఆంధ్రా, ఒడిషా సరిహద్దు మాత్రం హింసతో అల్లకల్లోలం అయింది! అలాగే, చనిపోయింది మావోలైనా, పోలీసులైనా సామాన్య జనం మాత్రం అయ్యో అనుకోవటం తప్ప చేయగలిగిందేం లేదు. ఎందుకంటే, ఈ అంతర్గత యుద్ధంలో ఏ వైపు వారు చనిపోయినా ప్రాణాలు పోయేది సాటి భారతీయులవే. అంతే తప్ప ఇక్కడెవరూ బద్ధ శత్రువులు లేరు. కేవలం స్వార్థాలు, ఆవేశాలు తెచ్చిపెట్టిన శత్రుత్వం తప్పా! అసలు మావోయిస్టుల చరిత్రలోనే మొన్న జరిగిన ఎన్ కౌంటర్ అంత భారీ నష్టం ఎప్పుడూ జరగలేదంటున్నారు. 30మందికి పైగా ప్రాణ త్యాగం చేశారు. అందులో చాలా మంది కీలక నేతలు కూడా వున్నారు. అన్నిటికంటే మించీ భారత మావోయిస్టుల అధినాయకుడు ఆర్కే పోలీసులకి పట్టుబడాడని హడావిడి నడిచింది. కాని, అంతిమంగా ఆయన క్షేమంగా వున్నాడని వరవర రావు లాంటి వాళ్లు ప్రకటించారు. అయితే, ఇక్కడే మనం కొన్ని కీలకమైన విషయాలు మాట్లాడుకోవాలి! ఏవోబీలో ఎన్ కౌంటర్ జరగగానే ఎప్పటిలానే హక్కుల సంఘాల వాళ్లు, మావోయిస్టు సానుభూతిపరులు రోడ్డెక్కారు. మీడియాలో కలకలం రేగింది. వెంటనే బూటకపు ఎన్ కౌంటర్ మాట కూడా రొటీన్ గా వినిపించింది. కాని, ఈసారి జరిగింది పూర్తిగా బూటకపు ఎన్ కౌంటర్ కాదు. స్వయంగా మావోయిస్టు పార్టీ ప్రతినిధి మీడియాతో ఫోన్ లో మాట్లాడిన దాని ప్రకారం... మావోలు సమావేశం అయిన చోటికి పోలీసులు వచ్చారు. కాల్పులు మొదలయ్యాయి. ఇరు వర్గాలు ఫైరింగ్ చేసుకోగా చాలా మంది చనిపోయారు. సహజంగానే, అత్యాధునిక ఆయుధాలు, శిక్షణ వున్న పోలీసులు పై చేయి సాధించారు... మొత్తానికి బూటకపు ఎన్ కౌంటర్ అనటానికి మాత్రం అస్కారం లేకుండా పోయింది. కాని, అదే సమయంలో, కొందరు మావోల్ని పట్టుబడ్డా కూడా పోలీసులు కాల్చి చంపేశారని ఆరోపిస్తున్నారు నక్సలైట్లు. అదే జరిగితే మానవహక్కుల ఉల్లంఘన కిందకే  వస్తోంది. అసలు పోలీసులు మావోయిస్టుల్ని చంపొచ్చా? కోర్టులు చంపటానికి వీలు లేదనే చెబుతన్నాయి. అయినా అనివార్యంగా జరిగే ఎన్ కౌంటర్లే కాక బూటకపు ఎన్ కౌంటర్లు కూడా ఇప్పటికే బోలెడు సార్లు జరిగాయి. కనుచూపు మేరలో ఆగే సూచనలు కూడా లేవు. ఇందుకు కారణం మావోయిస్టులకు విడుపు లేకపోవటం... పోలీసులు పట్టు వదలకపోవటం! అడవిలో అన్నలకి భూమి లోపలి ఖనిజాలు మొదలు భూమి ఏర్పాటు కావాల్సిన సమ సమాజం వరకూ అన్నీ సమస్యలే. మొత్తం అంతా మారిపోవాలంటారు వారు! అసలు కోట్లాది జనం ఓట్లు వేసి ఎన్నుకుంటున్న ప్రజాస్వామ్య ప్రభుత్వాలే దండగ అంటారు. అలా వారి డిమాండ్లు ఏ లెక్కన చూసినా కూడా ఇప్పటికిప్పుడు తీరేవీ కావు. తీర్చగలిగేవీ కావు. మరో వైపు పోలీసులు తమ డ్యూటీలో భాగంగా మావోల్ని అంతం చేస్తుంటారు. వాళ్ల చేతిలో బలవుతూ కూడా వుంటారు. కాని, వాళ్లకి అసలు ప్రభుత్వాలు ఎందుకని వామపక్ష ఉగ్రవాదుల్ని చంపిస్తున్నాయో తెలుసా? నూటికి నూరు శాతమైతే తెలియదనే చెప్పాలి. తమ బాస్ లు, వారి బాస్ లు చెప్పారు కాబట్టి వేటకి వెళతారు. వేటాడతారు. తామే వేటాడబడుతుంటారు కూడా! మావోయిస్టుల్ని ప్రభుత్వాలు అంతం చేయటం చట్ట రిత్యా, రాజ్యాంగం ప్రకారం తప్పు కావొచ్చేమో కాని... వాటికి అంతకంటే ఎక్కువ అవకాశం వున్నట్లు కూడా కనిపించదు. హింసను నమ్మిన నక్సలైట్లపై నిషేధం ఎత్తి వేసి శాంతి చర్చలు జరిపితే వాళ్లు జనంలోకి దూసుకుపోయే వీలుంది. పేద వర్గాలు వారి హింసా మార్గానికి ఆకర్షితులయ్యే ప్రమాదం వుంది. ఒక విధంగా అడవిలో అన్నల్ని స్వేచ్ఛగా వదలటం అంటే పేదలు, ధనికులు మధ్య అంతర్యుద్ధం జరిగేలాంటి పరిస్థితులు కల్పించటమే. ఇది దేశ అస్థిత్వానికి పెద్ద సవాలు. పేదలు లబ్ధి పొందటం చాలా ముఖ్యమే అయినప్పటికీ హింస ద్వారా అది చేయాలని మావోయిస్టులు విశ్వసించటం అన్ని సమస్యలకి కారణం అవుతోంది. ప్రభుత్వాలు కూడా తమని తాము కాపాడుకుంటూ రాజ్యాంగ వ్యతిరేకమైన హింసకే తెగబడాల్సి వస్తోంది. ఇది ఇరువైపులా ఎవ్వరూ ఆపలేని హింసాత్మక వలయంగా మారిపోయింది...  ఆర్కే ఆచూకీ గురించి ఆందోళన చెందిన వారిలో ప్రముఖంగా వినిపించిన పేరు వరవర రావు. ఆయనకే అడవిలోని పార్టీ వారు ఆర్కే క్షేమ సమాచారం కూడా అందించారు. అలాంటి కమ్యూనికేషన్ వున్న కవులు, మేధావులు, మావోయిస్టు సానుభూతిపరులు అడవిలోని వారికి హింసను నివారిచగలిగే లేదంటే కనీసం తగ్గించగలిగే మార్గాలు సూచించాలి. ఎప్పుడో 1970లలో మొదలు పెట్టిన మావో జెడాంగ్ ప్రేరణ కలిగిన సాయుధ మార్గం ఎంత వరకూ ఫలితాలిచ్చింది? అసలింక మీదట దాని వల్ల ఉపయోగముంటుందా? వంటి ప్రశ్నలు వేసుకోవాలి. ఏ ఉద్యమం అయినా కాలానుగుణంగా పంథా మార్చుకోవటం తప్పు కాదు. అవసరం కూడా.   

మూడు ముళ్లుండవ్... మూడొస్తే విడిపోవచ్చు!

  గౌతమీ కమల్ హసన్ నుంచి విడిపోయింది! ఇది ఇప్పుడు పెద్ద హాట్ టాపిక్! కారణం ఏంటి? దీనిపై బోలెడన్ని విశ్లేషణలు! ఒకరు పాలిటిక్స్ లోకి ఎంట్రీ అంటే... మరొకరు శ్రుతీహసన్ కారణం అంటారు!  కాదు కాదు నా కూతుర్ని చూసుకోటానికి నేను కమల్ కు దూరమయ్యానని గౌతమి అంటుంది. కమల్ హసన్ ఏమో నాకింకా గౌతమి అంటే బోలెడంతా ప్రేమ అంటాడు. ఆమెకు నేనున్నానని పబ్లిగ్గా భరోసా ఇస్తాడు! మధ్యలో శృతీ హసన్ కూడా నాకేం సంబంధం లేదని క్లారిటీ ఇస్తుంది! అసలేం అవుతోంది? మీడియాకి, జనాలకి ఎక్కడలేని ఆసక్తి. కాని, పెద్దగా తెలుసుకోగలిగిందేం లేదు!  గౌతమీ, కమల్ విడిపోవటం వాళ్ల పర్సనల్ ఇష్యూ. దానిపై ఆరా తీయటమే వృథా ప్రయాస. అయితే, వాళ్లు సెలబ్రిటీలు కాబట్టి కొంత ఇంట్రస్ట్ వుండటం సహజమే. కాని, అంతకంటే ఎక్కువ చర్చకు దారితీస్తున్న కారణం... సహజీవనం! గౌతమీ, కమల్ పెళ్లాడలేదు. జస్ట్ ఒకరికి ఒకరు నచ్చారు కాబట్టి కలిసి వుండిపోయారు. దీన్నే మనం సహజీవనం అంటున్నాం. అసలు ఇలా పెళ్లి లేకుండా ఇద్దరు ఒకే ఇంట్లో వుంటారని 30ఏళ్ల కింద ఎవరూ ఆలోచించి వుండరు. అంతకంటే ముందైతే ఊహించి కూడా వుండరు! కాని, ఇప్పుడు గౌతమీ , కమల్ లాంటి పెళ్లికాని భార్య, భర్తలు బోలెడుమంది! సెలబ్రిటీలైతే వారికి పబ్లిసిటీ కూడా ఎక్కువగానే వస్తుంటుంది! ఈ కోవలో మనం ఆసక్తిగా చెప్పుకోవాల్సిన జంట పవన్ , రేణు...  తెలుగు సినిమా హీరోలు తమ లవ్ గురించి బయట చెప్పుకోటానికే నానా ఇబ్బంది పడతారు. కాని, పవన్ కళ్యాణ్ డిఫరెంట్ స్టైల్లో ముందుకు పోయాడు. తాను లవ్ చేసిన రేణుదేశాయ్ ని పెళ్లి చేసుకోకుండానే ఇంట్లోకి ఆహ్వానించాడు. కుడి కాలు పెట్టిన ఆమె ఓ బాబు పుట్టాక తీరిగ్గా పెళ్లి చేసుకుంది. అదీ ప్రజా రాజ్యం పార్టీ పెట్టిన సందర్భంలో ఎదురైన రాజకీయ విమర్శల నేపథ్యంలో చేసుకోవాల్సి వచ్చింది. లేకుంటే పవన్, రేణు మూడు మూళ్లు, ఏడు అడుగుల స్ట్రెయిన్ తీసుకునే వారే కాదు. అయితే, విచిత్రంగా, పెళ్లి చేసుకోక ముందు బాగానే వున్న పవర్ స్టార్, రేణు అగ్ని సాక్షిగా ఒక్కటై అమాంతం విడిపోయారు. ఇప్పుడు పవన్ మరోసారి ఇంకో అమ్మాయితో సహజీవనమే చేస్తున్నాడు! పవన్ రేణు దేశాయ్ లాంటి సినిమా జంటలు ఇంకా చాలా చెప్పుకోవచ్చు. జాన్ అబ్రహాం, బిపాషా మొదలు రణబీర్ , కత్రీనా వరకూ అందరూ హ్యాపీగా కాపురం పెట్టేసిన వారే! పైగా ఈ పెళ్లి కాని వైవ్స్ అండ్ హజ్బెండ్స్ ప్రౌడ్ గా మీడియాకి ఫోజులు, ఇంటర్వ్యూలు కూడా ఇచ్చారు. ప్రభుదేవ , నయనతార లాంటి వాళ్ల సహజీవన కహానీలైతే నానా రచ్చ కూడా అయ్యాయి.  సెలబ్రిటీలు ఇంత దైర్యంగా లివిన్ రిలేషన్ షిప్పులకి ఓటు వేయటానికి కారణం ఏంటి? సహజీవనంలో వున్న లాభాలే! పెళ్లి అంటూ ఒక బాండ్ వుండదు కాబట్టి గౌతమీ, కమల్ హసన్ లా ఎన్ని ఏళ్లు అయ్యాక అయినా విడిపోవచ్చు. కోర్టులకు వెళ్లడాలు, జడ్జ్ లను ఒప్పించడాలు వగైరా వగైరా ఏమీ వుండవు. ఇద్దరూ పరస్పరం ఒప్పుకుని విడిపోవచ్చు. అలాగే, కులాలు, మతాలు, ఆస్తులు, అంతస్థులు లాంటి పట్టింపులు కూడా అడ్డురావు. నచ్చితే కలిసి నడవటమే. నచ్చని రోజు ఎవరి లగేజ్ వారు సర్దుకుని మరో ఇంటికి వెళ్లిపోవటమే. కాని, సహజీవనంలో ఎలాంటి సమస్యలుండవా? ఖచ్చితంగా వుంటాయి! సహజీవనం అంటే సంప్రదాయవాదులు బెంబేలెత్తిపోతారు. వాళ్లు భయపడ్డంత భయపడకపోయినా సమాజంలో ఎదురయ్యే అనుభవాలకు మానసికంగా సిద్ధపడి వుండాలి. ఇప్పటికీ పెళ్లిని సీరియస్ గా తీసుకుని కట్న, కానుకులతో భారీగా చేసుకునే మన సమాజంలో సహజీవనం తప్పే. అలాంటి తప్పు చేశాక అందరూ అనుమానంగా చూసే ప్రమాదం లేకపోలేదు. మరో వైపు సహజీవనం సెలబ్రిటీలకు వర్కవుట్ అయినట్టు అందరికీ వర్కవుట్ అవుతుందని గ్యారెంటీ లేదు. లివిన్ రిలేషన్ షిప్ లో సంతానం కలిగితే వాళ్ల బాధ్యత తరువాత ఎవరిది? జీవితాంతం కలిసుండకుండా మూడ్ ఛేంజ్ కాగానే విడిపోయినప్పుడు పిల్లల్ని తల్లే చూడాలా? ఆర్దికంగా తండ్రి బాద్యత ఎంత? ఒకవేళ అతను పట్టించుకోకపోతే? మళ్లీ కోర్టుకు వెళ్లాల్సి వస్తుంది! ఇలాంటి ప్రాక్టికల్ సమస్యలు చాలా వుంటాయి. పెళ్లిలో వున్న సామాజిక భద్రత స్త్రీకి సహజీవనంలో వుంటుందని గట్టిగా చెప్పలేం...  సహజీవనం వల్ల లాభాలు ఎక్కువున్నా, నష్టాలు ఎక్కువున్నా స్లోగా దాని క్రేజ్ పెరుగుతోందన్నది మాత్రం నిజం. బాగా చదువుకుని బారీ ఉద్యోగాలు చేస్తూ ఇంటికి దూరంగా వుంటోన్న యూత్ చాలా మంది కలిసి కాపురాలు పెట్టేస్తున్నారు. పెళ్లి సంగతి వీలున్పప్పుడు చూసుకుందాం అనుకుంటున్నారు. అమెరికా లాగా అభివృద్ధి కావాలంటే అమెరికా లాగే సంస్కృతిలో మార్పు కూడా అనివార్యం. ఇప్పుడు మనకిష్టం వున్నా లేకున్నా యాక్సెప్ట్ చేయాల్సిందే. కాని, ఈ సహజీవన సంస్కృతి వేల సంవత్సరాల మన కుటుంబ వ్యవస్థని ఎంత మేర దెబ్బతిస్తుందన్నదే పెద్ద ప్రశ్న! దానికి కాలమే సమాధానం...   

కమల్..గౌతమిల దారులు వేరయ్యాయి

అలనాటి అగ్రకథానాయిక గౌతమి నిన్న దక్షిణాది చిత్ర పరిశ్రమలో బాంబు పేల్చారు. ప్రముఖ కథానాయకుడు కమల్‌హాసన్‌తో తన 13 ఏళ్ల సహజీవన బంధాన్ని తెంచుకుంటున్నట్లు ప్రకటించి అందరిని షాక్‌లోకి నెట్టారు. "లైఫ్ అండ్ డెసిషన్స్" పేరుతో తను స్వయంగా రాసిన లేఖను ట్వీట్ చేశారు గౌతమి. నేను మిస్టర్ హాసన్ ఈ రోజు నుంచి విడిపోతున్నాం అనే విషయం చెప్పడానికి చాలా బాధగా ఉంది. మాది 13 ఏళ్ల ప్రయాణం. ఇప్పటి వరకు నా జీవితంలో తీసుకున్న అతి భయంకరమైన నిర్ణయం ఇది. ఒకరితో బంధాన్ని తెంచుకోవడం అంత సులవైన విషయం కాదు. కానీ ఇద్దరి ఆశయాలు, మార్గాలు వేరయినప్పుడు ఎవరికి నచ్చినట్లు వారు ఉండటమే మంచిది. నేను ఈ నిర్ణయానికి రావటానికి చాలా సమయం పట్టింది. ఒకరి సానుభూతి పొందాలనో, ఒకర్ని నిందించాలనో నేను ఈ పని చేయడం లేదు. నా జీవితంలో వచ్చిన మార్పులకు అనుగుణంగా వెళ్లాలని నిర్ణయించుకున్నాను అంటూ ఆ లేఖలో పేర్కొన్నారు.   ఒకప్పుడు తెలుగు, తమిళ భాషల్లో మంచి నటిగా వెలుగొందిన గౌతమి మన తెలుగమ్మాయే. విజయ్ చందర్ దర్శకత్వంలో తెరకెక్కిన "దయామయుడు" అనే సినిమా ద్వారా వెండితెరకు పరిచయమైన గౌతమి అనతికాలంలోనే మిగిలిన దక్షిణాది చిత్రాల్లోనూ అవకాశాలు చేజిక్కించుకుని స్టార్ హీరోయిన్‌గా ఒక వెలుగు వెలిగింది. సినిమాల్లో బిజీగా ఉండగానే 1998లో వ్యాపారవేత్త సందీప్ భాటియాను వివాహం చేసుకున్నారు గౌతమి. 1999లో ఈ దంపతులకు ఒక పాపపుట్టింది. ఆ తర్వాత మనస్పర్థల కారణంగా గౌతమి, సందీప్ భాటియా విడాకులు తీసుకున్నారు. అనంతరం పాప సుబ్బులక్ష్మీతో విడిగా ఉంటున్నారు గౌతమి.   ఇక కమల్ సంగతి చూస్తే..1978లో అలనాటి నృత్యకారిణీ వాణిగణపతిని ఆయన వివాహం చేసుకున్నారు ..పదేళ్లపాటు సజావుగా సాగిన వీరి సంసారంలో కొద్దిపాటి మనస్పర్థలు తలెత్తాయి. అవి చిలికి చిలికి గాలివానగా మారి విడిపోవడం వరకు వచ్చాయి. ఆ తర్వాత కమల్ హిందీ సినిమాల్లో బిజీగా ఉండటంతో ఆ సమయంలో నటి సారికకు బాగా దగ్గరయ్యారు..ఆ చనువు కాస్తా ప్రేమగా మారి వివాహనికి దారి తీసింది. ఈ దంపతులకు కొన్నాళ్లకు శ్రుతీహాసన్ పుట్టగా..1991లో అక్షరా హాసన్ కలిగారు..చివరికి ఈ వివాహం కూడా నిలబడలేదు..2002లో ఈ జంట చట్టపరంగా విడాకులు తీసుకుంది. ఏ గూటి పక్షులు ఆ గూటికే చేరినట్లు సంసార జీవితంలో తీవ్ర ఒడిదుడుకులను ఎదుర్కోన్న కమల్, గౌతమిలు ఒకే చోటికి చేరారు. గౌతమికి కేన్సర్ సోకినప్పుడు కమల్ ఇంకా బాగా దగ్గరయ్యారు. చివరికి ఆ అనుబంధం సహజీవనానికి నాంది పలికింది.   చాలా సందర్భాల్లో తాను ఇలా మీకు కనిపించగలుగుతున్నానంటే అది కేవలం కమల్ గారి వల్లేనని చెప్పుకొచ్చింది గౌతమి. పెళ్లి చేసుకోకపోయినప్పటికి వీరిద్దరూ ఆదర్శవంతమైన జంటగా మెలిగారు. ఆడియో ఫంక్షన్లలోనూ, శుభాకార్యాల్లోనూ కమల్-గౌతమి సందడి చేసేవారు. అలాంటి జంట ఇప్పుడు విడిపోవడం సినీ వర్గాల్లో పెద్ద చర్చకు దారి తీసింది. ఇంతకు ముందు ఎన్నో జంటలు విడిపోయినా అంతగా పట్టించుకోని వారు సైతం అరెరె..అంటున్నారు. అసలు ఈ జంట ఇంత హఠాత్తుగా విడిపోవడానికి కారణమేంటి..అంటే ప్రస్తుతానికి అందరి వేళ్లూ కమల్ గారాలపట్టి శృతిహాసన్‌ వైపే చూపెడుతున్నాయి.   శ్రుతికీ.. గౌత‌మికీ వ‌చ్చిన విబేధాల వ‌ల్లే... క‌మ‌ల్ తో గౌత‌మి విడిపోయింద‌ని గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి. క‌మ‌ల్ హాస‌న్ హీరోగా "శ‌భాష్ నాయుడు" అనే సినిమా తెర‌కెక్కుతోంది. త‌న కెరీర్‌లోనే తొలిసారి నాన్న‌తో క‌ల‌సి ఈ సినిమాలోనే న‌టిస్తోంది శృతి. ఇదే చిత్రానికి గౌత‌మి కాస్ట్యూమ్ డిజైన‌ర్‌గా ప‌నిచేస్తోంది. అయితే కాస్ట్యూమ్స్ విష‌యంలో వ‌చ్చిన విబేధాలు చినికి చినికి గాలివాన‌గా మారిన‌ట్టు అప్ప‌ట్లో వార్త‌లొచ్చాయి. ఈ విష‌యంలో శ్రుతి ఈగో బాగా హ‌ర్ట‌య్యింద‌ని, అప్ప‌టి నుంచీ క‌మ‌ల్‌, గౌత‌మిల జీవితంలో పుల్ల‌లు పెట్ట‌డం మొద‌లెట్టింద‌ని తెలుస్తోంది.  గౌత‌మి అంటే శ్రుతికి ముందు నుంచీ ఇష్టం లేద‌ని, ఈ మ‌ధ్య ఆ వ్య‌తిరేక‌త బాగా పెరిగింద‌ని చెన్నై వ‌ర్గాలు కూడా చెబుతున్నాయి.   క‌మ‌ల్ హాస‌న్‌, శ్రుతిహాస‌న్ ఇద్ద‌రూ తండ్రీ కూతుర్లే అయినా.. పెద్ద‌గా క‌లిసుండేవారు కాదు. ఈ మ‌ధ్య వాళ్లిద్ద‌రి మ‌ధ్య రాపో బాగా పెరిగింది. ఇదే అలుసుగా తీసుకొని గౌత‌మిని దూరం పెట్ట‌డం మొద‌లెట్టింద‌ట శ్రుతి.  అటు శ్రుతికీ, ఇటు గౌత‌మికీ ఏమీ చెప్ప‌లేక క‌మ‌ల్ బాధ ప‌డేవాడ‌ని, ఆ బాధ‌ని దూరం చేయ‌డానికి అన్న‌ట్టు గౌత‌మి క‌మ‌ల్ నుంచి విడిపోవాల‌ని నిర్ణ‌యించుకొన్న‌ట్టు తెలుస్తోంది. అన్ని కలిసి గౌతమి-కమల్‌ల బంధానికి తూట్లు పొడిచాయి. సరిగ్గా పదమూడేళ్ల క్రితం ఉన్న సంధికాలంలోకి మళ్లీ కమల్, గౌతమి చేరుకున్నారు. ఇద్దరు ఇప్పుడు ఒంటరివారు. ఎంతగా పిల్లల తోడుగా ఉన్నా భాగస్వామి లేని జీవితం చుక్కాని లేని నావ వంటిది. క్షణికావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నా అతి త్వరలోనే అసలు విషయం బోధపడుతుంది.  

ఫేక్ ఎన్ కౌంటర్స్ ని జనాలెందుకు వ్యతిరేకించటం లేదు?

మొన్న ఏఓబీ ఎన్ కౌంటర్. నిన్న సిమి ఉగ్రవాదుల ఎన్ కౌంటర్. దేశంలో ఎక్కడ చూసినా హింసే విలయ తాండవం చేస్తోంది! అసలు ఆ మధ్య ఉరీ ఉగ్రదాడితో మొదలైంది రక్తపు క్రీడ. పాకిస్తాన్ నుంచి వచ్చిన టెర్రరిస్టులు మన జవాన్లను పొట్టన బెట్టుకున్నారు. ప్రతీకారంగా ఇండియన్ ఆర్మీ సర్జికల్ స్ట్రైక్స్ చేసింది. ఆ తరువాత ఇక రోజూ సరిహద్దు దద్ధరిల్లిపోతూనే వుంది. పాక్ సైనికులు, ఉగ్రవాదులు ఎంత మంది హతం అవుతున్నారో నిర్ధిష్టంగా తెలియదుగాని మన జవాన్లు మాత్రం పదే పదే బలవుతున్నారు. గాయపడుతున్నారు. ఇది పెద్ద విషాదం...  ఢిల్లీలోని మోదీ ప్రభుత్వం ఉగ్రవాదుల్ని ఎదుర్కొంటుంటే రాష్ట్రాల్లోని భద్రతా దళాలు తీవ్రవాదుల్ని ఎదుర్కోవాల్సి వస్తోంది. వాళ్లు నక్సలైట్స్ కావొచ్చు, లేదా సిమి ఉగ్రవాదులు కావొచ్చు, ఎవరైనా కావొచ్చు. పోలీసులకి మాత్రం కంటి మీద కునుకు వుండటం లేదు. అయితే, ఇక్కడ సమస్యంతా సాటి భారతీయులైన మావోయిస్టుల్ని, సిమి మెంబర్స్ ని పాశవికంగా ఎన్ కౌంటర్ చేయవచ్చా అని! మన రాజ్యాంగం ప్రకారం మాట్లాడుకుంటే అది నిస్సందేహంగా అన్యాయమే. కాని, పోలీసులకి వారి వాదనలు వారికుంటాయి.  ఎప్పటిలాగే ఈ సారి కూడా మావోయిస్లులు హతమవగానే వరవర రావు లాంటి వాళ్లు మీడియా ముందుకొచ్చారు. బూటకపు ఎన్ కౌంటర్ అన్నారు. సామాన్య ప్రజల అభిప్రాయం ఎలా వున్నా మేధావులు, కొంత వర్గం మీడియా చనిపోయిన వారికి మద్దతుగా నిలిచింది. వాళ్లని పోలీసులు ఎలాంటి అరెస్టు, విచారణ వంటివి లేకుండా చంపటం దుర్మార్గం అన్నారు. కాని, ఎప్పటిలాగే పోలీసులు కూడా ఎదురు కాల్పుల వాదన వినిపించారు. మావోయిస్టులు కాల్పులు జరపటంతో తామూ జరిపామన్నది దాని సారాంశం.  ఇక మన ఆంధ్రా, ఒరిస్సా బార్డర్ నుంచి మధ్య ప్రదేశ్ కి వస్తే ... ఇక్కడ ఎనిమిది మంది సిమి ఉగ్రవాదులు జైలులో కాపలా వున్న ఒక పోలీస్ ని చంపి పారిపోయారు. గొంతుకోసి కిరాతకంగా చంపేశారు వారు. కాని, అంతే వేగంగా పోలీసులు వాళ్లని వెదికి పట్టుకుని చంపేశారు. ఇదీ బూటకపు ఎన్ కౌంటరే అంటున్నారు రాజ్యాంగవాదులు. ఓవైసీ మొదలు దిగ్విజయ్ వరకూ చాలా మందే వస్తారు రాజ్యాంగవాదుల కోవలోకి. వీళ్లంతా ఎన్ కౌంటర్ చేసి పోలీసులు ప్రాణం తీయటం చట్ట రిత్యా నేరమని వాదిస్తుంటారు. అది నిజమే కూడా...  చనిపోయింది ఉగ్రవాదులైనా, నక్సలైట్లైనా పోలీసుల కర్కశత్వాన్ని అందరూ ఖండించాల్సిందే. గవర్నమెంటే వెనుకుండి ఎన్ కౌంటర్లు చేయిస్తే అది కూడా తప్పు పట్టాల్సిన విషయమే. కాని, మన దేశంలో నిజంగా ఫేక్ ఎన్ కౌంటర్ జరిగినా ఒక్క సారి కూడా పోలీసులకి కోర్టుల్లో శిక్షలు పడ్డ పాపాన పోలేదు. అందుకే, ఏది నిజమైన ఎన్ కౌంటర్, ఏది ఫేక్ తెలియకుండా పోతోంది.  నిజంగా పోలీసుల మీద కూడా కాల్పులు జరిగి... తమని తాము ఆత్మ రక్షణ చేసుకునే క్రమంలో వాళ్లు కాల్పులు జరిపితే అది వేరే విషయం. ముంబైపైన ఉగ్రవాదుల దాడులు జరిగినప్పుడు అలాంటి ఎన్ కౌంటర్స్ అవుతుంటాయి. కాని, అడవుల్లో జరిగే ఎన్ కౌంటర్స్ లేదా మధ్యప్రదేశ్ లో జరిగిన సిమి ఉగ్రవాదుల ఎన్ కౌంటర్సే అనుమానాలకు తావిస్తుంటాయి. ఇందులో పోలీసులు అస్సలు నష్టపోక పోవటం, లేదంటే చాలా స్వల్ప గాయలు కావటం మాత్రమే వుంటాయి. హతమైన తీవ్రవాదులు మాత్రం దారుణంగా అంతం అవుతారు. ఇది మామూలుగా చూసినప్పుడు తప్పుగానే కనిపిస్తుంది కాని... ఎన్ కౌంటర్ న్యాయాన్ని సమర్థించే వారు కూడా మరో వాదన ముందుకు తీసుకొస్తున్నారు. ఉదాహరణకి అఫ్జల్ గురు కేసునే తీసుకోండి... సాక్షాత్తూ పార్లమెంట్ భవనంపై దాడికి అతను కుట్ర చేశాడని సుప్రీమ్ తీర్పునిచ్చింది. ఉరిశిక్ష వేసింది. అయినా దాన్ని అమలు పరిచినప్పుడు సో కాల్డ్ అభ్యుదయవాదుల నుంచి పెద్ద ఎత్తున వ్యతిరేకత వచ్చింది. యాకుబ్ మెమన్ విషయంలో కూడా అంతే. కసబ్ కి కూడా ఉరి వద్దన్న వాళ్లు మన దేశంలో వున్నారు! ఇవన్నీ ఫేక్ ఎన్ కౌంటర్స్ కు ఒక విధంగా కారణం అవుతున్నాయి... పోలీసులు తీవ్రవాదుల్ని ప్రాణాలకి తెగించి అరెస్ట్ చేస్తే మన కోర్టుల్లో సంవత్సరాల తరబడి విచారణ జరుగుతుంది. చివర్లో ఎంత శిక్ష పడుతుందో తెలియదు. పడ్డా జైళ్లో చివరి దాకా వుంటారా అంటే డౌటే! మసూద్ అజర్ ను వదిలేసినట్టు వదిలేయాల్సి రావచ్చు. ఇక అంతా పూర్తై విషయం ఉరి శిక్ష దాకా వచ్చాక బోలెడు మంది మరణ శిక్ష వద్దంటూ ఉద్యమాలకి తెర తీస్తారు. ఫైనల్ గా యాకుబ్ మెమన్ విషయంలో అయినట్టు... ఒక ఉగ్రవాది అంతిమ యాత్రకు కూడా వేలాది మంది తరలి వస్తారు! ఇలా ఒక ఉగ్రవాది, తీవ్రవాది పోలీస్ కస్టడీలో ఎంత ఎక్కువ కాలం వుంటే అంత పెద్ద హీరోని, రెబెల్ ని చేసే కుట్ర పూరిత సంస్కృతి కూడా మన దేశంలో వుంది. మీడియా, మేధావులు, నేతలు అందరూ దీనికి కారణమే! ఎవరి ఆదర్శం, ఎవరి స్వార్థం వారివి...  మన వ్యవస్థ కసబ్ కు బిర్యానీలు తినిపించి విచారణ జరపటంతోనే సామాన్య జనం కూడా ఎన్ కౌంటర్లు జరిగినప్పుడు పోలీసుల పక్షాన నిలుస్తున్నారు! సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున్న ఫేక్ ఎన్ కౌంటర్స్ కు సమర్థన వస్తోంది. ఈ ఉన్మాద స్థితి పోవాలంటే తీవ్రమైన నేరాలు చేసిన ఉగ్రవాదులు, తీవ్రవాదుల్ని వెంట వెంటనే శిక్షలు అనుభవించేలా చేయగలిగే సిస్టమ్ రావాలి. న్యాయ వ్యవస్థలో వేగం, సంస్కరణలు రావాలి. అప్పుడే ఎన్ కౌంటర్లు తగ్గుముఖం పట్టే అవకాశం వుంటుంది. లేదంటే, ఎన్ కౌంటర్ల రూపంలో బుల్లెట్ల న్యాయమే రాజ్యమేలుతుంది!  

న్యాయం దక్కని... జాతీయ ఐక్యత సాధ్యమేనా?

  అక్టోబర్ 31... జాతీయ ఐక్యతా దినం! ఎందుకో తెలుసా? ఇవాళ్ల సర్దార్ వల్లభ్ భాయ్ పటేల్ జయంతి! అందుకే, జాతీయ ఐక్యత దినోత్సవంగా నిర్ణయించారు! కాని, ఇదే రోజు జాతీయ ఐక్యత గురించి మనకు పెద్ద గుణపాఠం కూడా ఎదురైంది. దాన్నుంచి మనం ఎంత నేర్చున్నాం అన్నది కాలమే నిర్ణయించాలి...   ఒక కాంగ్రస్ ఉప ప్రధాని పుట్టిన రోజే మరో కాంగ్రెస్ ప్రధాని నేలకొరిగిన రోజు కావటం నిజంగా విషాదమే! కాని, అక్టోబర్ 31న అదే జరిగింది. ఇందిరా గాంధీ ఆమె అంగరక్షకుల చేతిలో ఇవాళ్లే అంతమైంది. అలా సటేల్ జయంతి, ఇందిర వర్ధంతి రెండూ ఇవాళ్లే అయ్యాయి. కాని, అక్టోబర్ 31కి అంతకంటే ఎక్కువ ప్రాధాన్యత వుంది. అది ఇద్దరు వ్యక్తులకు సంబంధించిన రోజు కాదు. భారతదేశ జాతీయ ఐక్యత దినోత్సవం! కాని, 1984లో ఇందిర హత్యకు గురైన వెంటనే జరిగింది ఏంటో తెలుసా? దారుణమైన మారణకాండ! అదీ ఒక మైనార్టీ వర్గం మీద! వేల మంది కొన్ని గంటల్లో నేల రాలిపోయారు. అంతకంటే విషాదం, వాళ్లని కాపాడాల్సి వుండాల్సిన వ్యక్తే ... ఒక పెద్ద చెట్టు కూలినప్పుడు చుట్టూ వున్న భూమి కంపిస్తుంది... అనేశాడు దుర్మార్గంగా! ఆయనెవరో కాదు... ఇందిర తరువాత దేశ ప్రధాని అయిన ఆమె కొడుకు రాజీవ్ గాంధీ...    ఇందిరా గాంధీ పంజాబ్ రాజకీయాలకు స్పందించిన తీరు ఆమెకు ప్రాణ గండం తెచ్చిపెట్టింది. అక్కడి వేర్పాటు వాదుల్ని మొదట్లో కాంగ్రెస్ కొంత కాలం వెనకేసుకొచ్చిందంటారు విమర్శకులు. అకాలీదళ్ లాంటి పంజాబీ శక్తుల్ని ఎదుర్కోటానికి వేర్పాటు వాదులు అవసరం అయ్యారట. కాని, తరువాత అదే వేర్పాటువాదులు దేశం నుంచి విడిపోయి ఖలిస్తాన్ ఏర్పాటు చేసుకుంటామంటే ఇందిరా గాంధీకి హింస తప్ప మరో మార్గం లేకపోయింది. దాని ఫలితమే ఆపరేషన్ బ్లూ స్టార్. కాని, పంజాబ్ నుంచి దేశం నుంచి విడిపోకుండా కాపాడిన ఆమె తానే బుల్లెట్లకు బలవ్వాల్సి వచ్చింది. తన స్వంత సిక్కు బాడీ గార్డ్సే ఆమెను కాల్చేశారు.    ఇందిర చనిపోయిన కొన్ని గంటల తరువాత కాంగ్రెస్ కార్యకర్తలు, ఇతర గూండాలు, రౌడీలు తమ రాక్షస రూపం బయటకు తీసుకొచ్చారు. సిక్కుల వల్ల ఆమె చనిపోయారు కాబట్టి దేశ రాజధానిలోని వేలాది మంది సిక్కులకి మరణ శిక్ష వేసేశారు. సజీవంగా తగులబెట్టేశారు. అప్పటి కాంగ్రెస్ నేతలు సజ్జన్ కుమార్, జగదీశ్ టైట్లర్ దగ్గరుండి హత్యలు చేయించారంటారు. కాని, వాళ్లకి ఇంత వరకూ ఎలాంటి శిక్షలూ పడలేదు.   1984లో జరిగిన సిక్కుల ఊచకోతలో అనధికారికంగా 8వేల మంది చనిపోయుంటారని అంచన. కాని, గవర్నమెంట్ ఒప్పుకుంది 2500మంది అని మాత్రమే. అయినా కూడా ఒక మైనార్టీ వర్గమైన సిక్కుల పట్ల అంత హింస జరగటం దారుణమైన విషయం. పైగా గుజరాత్ అల్లర్ల గురించి ఎప్పుడూ మాట్లాడే సెక్యులర్ పార్టీ అయిన కాంగ్రెస్ పాలనలో జరగటం ఇంకా దుర్మార్గం. కాని, ఇదే అక్టోబర్ 31న ఆ చారిత్రక హింస జరిగింది. 3 నవంబర్ వరకూ జరుగుతూనే వుండింది. ఇప్పటికీ తమ ఆప్తుల్ని పొగొట్టుకున్న ఆనాటి సిక్కులకి ఎక్కడా న్యాయం జరగలేదు. సుప్రీమ్ జోక్యం చేసుకున్నా న్యాయం ఇంకా పెండింగ్ లోనే వుంది!   జాతీయ ఐక్యత అంటే అన్ని వర్గాల వారూ పరస్పర విశ్వాసంతో కలిసి వుండటం. మరీ ముఖ్యంగా సిక్కులు, జైనులు, బౌద్ధుల లాగా అత్యల్ప సంఖ్యలో వుంటే వారి భద్రత మరింత ముఖ్యం. ఆ మైక్రో మైనార్టీల సంక్షేమం వల్లే జాతీయ ఐక్యత సాధ్యం అవుతుంది. అంతే తప్ప బీజేపి హిందూత్వ పాలిటిక్స్ చేస్తోంది కాబట్టి సెక్యులర్ పార్టీలన్నీ తాము ముస్లిమ్ , క్రిస్టియన్ల చుట్టూనే తిరుగుతాం అంటే కుదరదు. ఎక్కడ మత ఘర్షణలు జరిగినా ముస్లిమ్ లు చనిపోయారని నిరసనలు చేసే నాయకులు, పార్టీలు, ఉద్యమకారులు, సంఘాలు... సిక్కుల చారిత్రక ఊచకోత గురించి కూడా మాట్లాడాలి. దేశ రాజధానిలో పట్ట పగలు జరిగిన మారణకాండకి తగిన శిక్షలు కోర్టులో అనౌన్స్ అయినప్పుడే జాతీయ ఐక్యత , జాతీయ ఐక్యతా దినోత్సవాలకి ఏదైనా అర్థం వుంటుంది...   

నరకచతుర్ది నాడు... కొత్త వాదనల నరకం!

  దీపావళి అంటే అందరి ముఖాలు వెలిగిపోతాయి. ముఖాలే కాదు ఇళ్లు, ముంగిళ్లు కూడా ధగధగ వెలిగిపోతాయి. అంతటి అందమైన పండగ దీపావళి. అయితే, దీపావళికి ముందు రొజు వచ్చే నరకచతుర్ధశి మాత్రం పదే పదే వివాదాస్పదం అవుతోంది. దీనికి కారణం అర్థం పర్థం లేని అభ్యుదయవాదమే! నరకుడు మావాడంటూ కొందరు బయలుదేరి తమకు తోచింది మాట్లాడుతన్నారు. దానికి మరికొందరు స్పందిస్తున్నారు. మొత్తంగా పండగ చేసుకోవాల్సిన టైంలో సమయం దండగ చేసుకుంటున్నారు...   మన పురాణాల ప్రకారం, నరకచతుర్ధశి నాడు నరకుడ్ని శ్రీకృష్ణుడు సత్యభామా సమేతుడై సంహరిస్తాడు. అతడి పీడ విరగడైనందుకు జనం సంతోషంగా దీపాలు వెలిగించి పండగ చేసుకుంటారు. ఇదే వందల ఏళ్లుగా చెప్పుకుంటూ వస్తున్నాం. కాని, ఈ మధ్య మీడియా విప్లవం వల్ల ఇతర విప్లవాలు కూడా చర్చల రూపంలో సామాన్య జనం లివింగ్ రూంల్లోకి చొరబడుతున్నాయి. పురాణాల్లో, ఇతిహాసాల్లో చెప్పిన దానికి వ్యతిరేకంగా మరో వాదం వినిపించే సమాంతర చరిత్ర గతంలోనూ ప్రచారంలో వుంది. అయితే, కేవలం కొందరు మేధావులు, కొన్ని పత్రికలు, గ్రంథాలు మాత్రానికే పరిమితం అయ్యేది! కాని, ఇప్పుడు 24గంటల న్యూస్ ఛానల్స్ వల్ల ఫేస్ టూ ఫేస్ చర్చలకు, రచ్చలకు దారి తీస్తోంది.   నరకాసురుడు నిజమైన భూమిపుత్రుడని, మూలవాసి అని కొందరు ఉద్యమకారుల వాదన. దీనికి పెద్దగా సైంటిపిక్ ప్రూఫ్ అంటూ ఏమీ వుండదు. ఎందుకంటే, నరకాసురుడే అసలు నిజమైన రాజని ఎక్కడా ఋజువులు లేవు. కల్పిత పాత్ర అయ్యి వుండవచ్చు. అటువంటి ఒక పురాణ పాత్ర రాక్షసుడు కాదు ఇక్కడి మూల వాసి, ఆటవిక రాజు వగైరా వగైరా అనటం అనవసర విజ్ఞానమే అవుతుంది. పైగా ఇలాంటి నరకాసురుడు, మహిషాసురుడు, రావణాసురుడు ... వీళ్లు మావాళ్లు, మీరంతా ఆర్యులు అనటం మరో దారుణం. ఎందుకంటే, ఇప్పటి వరకూ ఆర్యులు దండెత్తి వచ్చారన్న బ్రిటీషు వాళ్ల కాలం నాటి సిద్ధాంతం ఎక్కడా శాస్త్రియంగా నిరూపించబడలేదు. పోనీ అది నిజమే అని నమ్మినా... ఎప్పుడో క్రీస్తు పూర్వం వచ్చిన ఆర్యులు ఈనాటికీ ద్రవిడులు, మూల వాసులు లాంటి వాళ్లతో కలవకుండా అలాగే వుంటారా? ప్రస్తుత భారతదేశంలో ఎవరు ఆర్యులు? ఎవరు మూల వాసులు? ఎలా గుర్తించేది?    పురాణాల్లో నరకాసురుడి జన్మవృత్తాంతం స్పష్టంగానే వుంది. అతను శ్రీకృష్ణుడే మరో అవతారంలో వున్నప్పుడు... అంటే, వరాహ స్వామిగా వున్నప్పుడు భూదేవికి జన్మిస్తాడు. ఒక విధంగా విష్ణువు ఒక అవతారమైన వరాహ స్వామికి కొడుకు, మరో అవతారమైన కృష్ణుడికి శత్రువు... నరకాసురుడన్నమాట! పురాణాల్లో కథనం ఇలా వుంటే ఆధునిక అభ్యుదయవాదులు , చరిత్రకారులు నరకాసురుడ్ని ఈకాలపు దళితులు, గిరిజనులు, అణిచివేయబడ్డవారు... వీరికి ప్రతినిధిని చేయటం... కొంత కుట్రగానే కనిపిస్తోంది. నరకాసురుడిలానే మహిషాసురుడు, రావణాసురుడు కూడా వివాదాస్పదం అవుతున్నారు. మరి, శ్రీకృష్ణుడి చేతిలోనే చచ్చిన కంసుడు కూడా మూలవాసేనా ? అక్కడ లెక్క కుదరదు! ఎందుకంటే, కంసుడు స్వయంగా కృష్ణుడికి మేనమామ!    ఇస్లాం లాంటి మతాల్లో పవిత్ర గ్రంథాలు, వాటిలోని కథల గురించి ఇంత పబ్లిగ్గా చర్చించటమే కుదరదు. కాని, హిందూ మతంలో వున్న స్వేచ్ఛ కారణంగా నానా యాగీ జరిగినా ఎవ్వరూ పట్టించుకోవటం లేదు. అయితే, నిజమో కాదో కూడా తెలియని రాక్షసుల్ని పట్టుకొచ్చి ఇప్పటి పేదలు, తక్కువ కులాల వారు, ఇంకా ఇతర దోపిడీకి గురవుతున్న వారు.... వీళ్లందరికీ అంటగట్టడం... అనవసర ప్రయాసే! దాని వల్ల బాధితులైన వారికి జరిగే మంచంటూ ఏం వుండదు. రాముడ్ని, కృష్ణుడ్ని ద్వేషించటం కన్నా ఆర్దికంగా ఎదగలేకపోతున్న, అంటరానితనానికి గురవుతోన్న వారికి నిజమైన చేయూత ఇవ్వటం ఇప్పుడు తక్షణ అవసరం! మీడియా, మేధావులు దానిపై దృష్టి పెట్టాలి...   

ఈ వజ్రాల వ్యాపారి... నిజంగా వజ్రమే!

  వ్యాపారం అంటే ఏంటి? మనదగ్గర వున్నది అమ్మటం. డబ్బులు సంపాదించటం. ఇంతే! కాని, బిజినెస్ కి చాలా కోణాలుంటాయి. వ్యాపారం మంచిగా చేస్తే కళ. తప్పుగా చేస్తే పీడకల. కాని, దుర్మార్గంగా చేస్తే, వ్యాపారం రక్తపాతం కనిపించని యుద్ధం! అవును, చాలా మంది కార్పోరేట్ వ్యాపారులు అమానుషమైన వ్యాపారం చేస్తుంటారు. తమ లాభాల కోసం లక్షల జీవితాలు నాశనమైనా పట్టించుకోరు. కాలుష్యమైనా కేర్ చేయరు. సంస్కృతి ధ్వంసం అయినా వెనక్కి తగ్గరు. ఇలా బోలెడు అరాచకాలు నిత్యం బడాబడా బిజినెస్ మెన్ చేస్తూనే వుంటారు...    వ్యాపారం చేసే వారి గురించి నెగటివ్ గా చెప్పుకోవాలంటే చాలానే వుంటుంది. కాని, వాళ్ల గురించి పాజిటివ్ గా కూడా మాట్లాడుకోవాలి. ఎందుకంటే, ఒక్క ధీరూ భాయ్ అంబానీనో, ఒక్క రతన్ టాటానో సృష్టించిన ఉద్యోగాలు దేశదేశాల ప్రభుత్వాలు కూడా సృష్టించలేవు. ఒక్క నిజాయితీ గల వ్యాపారవేత్త ఎన్నో జీవితాల్ని, కుటుంబాల్నీ వెలుగులమయం చేయగలుగుతాడు. ఆ కోణంలో వాళ్లది దేశానికి చేసే ఆర్దిక సేవ అనవచ్చు!   మంచి వ్యాపారస్థుడు కాదు... వెరీ వెరీ గుడ్ బిజినెస్ మ్యాన్ అంటే మనం తప్పక చెప్పుకోవాల్సిన వ్యక్తి ... సావ్ జీ ధోలకియా! ఎవరీయన అంటారా? భారతీయ వ్యాపారానికి కాశీ లాంటి సూరత్ నగరంలో ఒక వజ్రాల వర్తకుడు. అయితే, విశేషం ఏంటంటే, గుజరాతీ బిజినెస్ మ్యాన్ కాబట్టి పరమ పిసినారి అనుకోకండి. మహాఆదర్శవంతమైన వ్యాపారి. ఈసారి దీపావళి సందర్భంగా తన ఉద్యోగుల ముఖాల్లో వెలుగులు నింపటానికి ఆయన ఏం చేశారో తెలుసా? అత్యుత్తమ ప్రతిభ, కృషి కనబరిచిన ఎంప్లాయిస్ కి 400ఫ్లాట్లు బోనస్ కింద ఇచ్చాడు. అంతే కాదు, 1260కార్లు కూడా ఇచ్చాడు! బోనస్ గా ఇంటి స్థలాలు, కార్లు అంటే నమ్మబుద్ధికావటం లేదా? అలాంటి నమ్మశక్యం కాని పండగ బహుమతే ఇచ్చాడు ధోలకియా!   సావ్ జీ ధోలకియాది ఖరీదైన వజ్రాల వ్యాపారం కాబట్టి ఇళ్లు, కార్లు బోనస్ గా ఇస్తాడు. అందరూ వ్యాపారస్థులు అలా ఇవ్వాలంటే కుదరదు కదా? కాని, ఎవరికి తగ్గట్టుగా వారు తమ వద్ద ఉద్యోగాలు చేస్తున్న వారి మనసులు ఆనందంగా వుండేలా పండుగ గిఫ్ట్ లు ఇస్తే బావుంటుంది కదా! కంపెనీ సీఈవో అయినా ఇంట్లో పని చేసే మెయిడ్ అయినా... ఊహించని బహుమతి ఒకటి వస్తే ఖచ్చితంగా మురిసిపోతారు. మరీ ముఖ్యంగా, చాలీ చాలనీ జీతాలు సంపాదించుకునే చిరు ఉద్యోగులు ఒక స్వీట్ బాక్స్, నాలుగు ఖరీదైన చాక్లెట్లు వస్తే కూడా జాగ్రత్తగా తమ పిల్లలకి పట్టుకెళతారు! వాళ్లకి ఆ సంతోషం ఇవ్వటమే అసలైన దీపావళి! దీన్ని బాగా అర్థం చేసుకున్నాడు సావ్ జీ ధోలకియా. ఈ యేడే కాదు గతంలోనూ ఆయన దీపావళి బోనస్ లు భారీగా ఇచ్చి పెద్ద మనసు చాటుకున్నాడు...    పోయిన సంవత్సరం ధోలకియా తన హరే కృష్ణ ఎక్స్ పోర్ట్స్ తరుఫున 200ఫ్లాట్లు ఉద్యోగులకి ఇచ్చాడట! 491కార్లు కూడా ఇచ్చాడు! ఇవాళ్ల కోట్ల రూపాయల లాభాన్ని బోనస్ గా ఉద్యోగులకి పంచి పెడుతోన్న ధోలకియా ఒకప్పుడు సాదాసీదా వ్యాపారే. బంధువు వద్ద అప్పు తీసుకుని పెట్టిన పెట్టుబడితో ఏళ్ల తరబడీ కఠిన శ్రమ చేసి వ్యాపారాన్ని అభివృద్ధి చేశాడు. అంతే కాదు, ఈ మధ్యే తన స్వంత కొడుకుని కేవలం 7వేల రూపాయలు ఇచ్చి కేరళలోని కొచ్చీకి పంపాడు. అక్కడ మూడు జతల బట్టలతోనే నివాసముంటూ స్వయంగా ఉద్యోగం వెదుక్కుని జీవితం నెట్టుకొచ్చాడు. అలా చేస్తేనే లైఫ్ అంటే ఏంటో అర్థమవుతుందంటాడు ధోలకియా! ఇలాంటి తెలివే కాదు... మనసున్న వ్యాపారస్థులు ఎంత ఎక్కువైతే దేశం అంత గొప్పగా దీపావళి జరుపుకుంటుంది! అంతే కదా...    

మాకు ముఖ్యం కులం! మేం మూర్ఖులం!

  భారతదేశం ప్రత్యేకత చెప్పమంటే మీరేం చెబుతారు? గంగ నది, హిమాలయాలు, కంచి , మథురై ఆలయాలు, తాజ్ మహల్... ఇలాంటివి చెబుతారు కదా! కాని, నిజంగా మన దేశం ప్రత్యేకత కులం! అవును... కులం భారతదేశంలో తప్ప మీకు మరెక్కడా కనిపించదు. అంతే కాదు, మనోళ్లు కులాన్ని పుట్టగానే పట్టుకుని చచ్చేదాకా వదలరు. చచ్చినా వదలరు. దేశం కాని దేశంలో ఉద్యోగాలు చేసుకోటానికి వలసపోయినా కూడా ... అక్కడికీ కులాన్ని మనసులో కుక్కుకుని తీసుకెళ్తారు. ఒకవేళ మతం మారితే ఆ కొత్త మతంలోకి కూడా మోసుకెళతారు. ఎట్టి పరిస్థితుల్లో కులాన్ని మాత్రం మనసులోంచి, పేరు చివర్లోంచి తీసేయరు! దీన్నే మన రాజకీయ నేతలు కూడా బాగా వాడుకుంటున్నారు...    ఓటర్లకు ఒక బలహీనత వుంటే వాడుకోని పొలిటీషన్ ఎవరు? ఉపయోగించుకోని పార్టీ ఏది? అదే పొలిటీషన్స్, పార్టీలు ఏర్పాటు చేసే ప్రభుత్వాలు మాత్రం... గొప్పగా ఏం ఆలోచిస్తాయి? కులం ఆధారంగా టిక్కెట్లు ఇచ్చి, మ్యానిఫెస్టోలో హామీలు దట్టించి, ఓట్లు అడుక్కుని ఎలాగో పీఠం ఎక్కిన గవర్నమెంట్ పొద్దున్న లేస్తే కులం కులం అంటూనే వుంటుంది. దీనికి ఈ రాష్ట్రం, ఆ రాష్ట్రం అన్న భేదం లేదు. తెలుగు రాష్ట్రాలు మొదలు ఉత్తర్ ప్రదేశ్ లాంటి అతి పెద్ద రాష్ట్రాలు, మణిపూర్, ఢిల్లీ లాంటి అతి చిన్న రాష్ట్రాలు... అన్నీ కులం కోలాహలంతో కళకళలాడిపోతుంటాయి. సెక్రటేరియట్లో సీఎం, రాజ్ భవన్ లో గవర్నర్, అసెంబ్లీలో స్పీకర్, కోర్టుల్లో జడ్జీలు... ఇలా అందరూ కులానికి లోబడే పని చేస్తుంటారు. చేయాల్సి వస్తుంది.    మీడియా కూడా కులం కోణం దొరకగానే కుతూహలంతో కుతకుత ఊడికిపోతుంది. ఏ అగ్రవర్ణ వ్యక్తో, బీసీనో దురదృష్టకరంగా మరణిస్తే ''వ్యక్తి చనిపోయాడంటుంది''. కాని, ఎక్కడైనా దళితుడు నేల రాలితే, వెంటనే, ''దళితుడు చచ్చిపోయాడని'' చెబుతాయి మన పేపర్లు, ఛానల్స్! అసలు దళితుడ్ని మామూలు మనిషిగా చూడటమే మానేశాయి మీడియా సంస్థలు! అగ్రవర్ణాలు దాడి చేసి దళితుడ్ని ఇబ్బంది పెడితే తప్ప మరెప్పుడూ దళితుడ్ని దళితుడు, దళితుడు అంటూ చెప్పాల్సిన అవసరం లేదు. అయినా మన జర్నలిస్టులకి ఆ సోయే వుండదు! ఇక మీడియా లాగే చాలా మంది  మేధావులు కూడా పూనకం వచ్చి ఊగిపోతారు కులం డిస్కషన్ వస్తే!    స్వాతంత్ర్యానికి ముందు మన దేశంలో కులం చేసుకునే వృత్తులకి మాత్రమే పరిమితం అయ్యేది. కాని, ప్రజాస్వామ్యం వచ్చాక ఓట్ల రేసు మొదలయ్యాక కులం అందరికీ ప్రాణంలా మారిపోయింది. రాజ్యాంగం కులాన్ని క్రమంగా ధ్వంసం చేయమని చెబుతున్నా రిజర్వేషన్సు, సంక్షేమ పథకాలు, ఎన్నికల్లో టిక్కెట్లు, విద్యార్థుల హాస్టల్స్ లో రూంలు, యూనివర్సిటిల్లో సీట్లు, అఖరుకు పుణ్య క్షేత్రాల్లో ఉచిత భోజనాలు చేసే సత్రాలు... అన్నీ కులమే ప్రాతిపదికగా నడుస్తున్నాయి! అయినా అందరూ కులం వద్దని స్పీచ్ లు దంచటమే. అందరూ తమ కులం దోపీడికి, వివక్షకి గురవుతుందని వాపోయేవారే! అందరూ వెజిటేరియన్సేగాని... చికెన్ మాత్రం మాయమైందన్నట్టు... ఎవ్వరికీ ఇష్టం లేకున్నా కులం నిక్షేపంగా వుంటోంది! ఎలా?    ప్రస్తుత భారతదేశంలో , ప్రైవేట్ ఉద్యోగాలు చేస్తూ , క్యాంటీన్లలో కలిసి భోజనాలు చేస్తున్న పేద, మధ్యతరగతి జనం మద్య కులం దాదాపుగా లేనేలేదు. వున్నా ఒకర్ని ఒకరు ద్వేషించుకునేటంత, అసహ్యించుకునేటంత లేదు. ఎక్కడో ఇంకా అటరానితనం వున్నా దాన్ని రూపు మాపే ప్రయత్నం చేసిన వాడెవ్వడూ లేడు కాని గంటలు గంటలు చర్చలు మాత్రం చేస్తుంటారు. ఇలా కులం అడ్డుపెట్టుకుని లబ్ధి పొందాలని, ఈగో సాటిస్ ఫై చేసుకోవాలని జనం కొంత మంది కోరుకోవటమే ప్రభుత్వాలకి కూడా కలిసి వస్తోంది. అన్ని కులాల్లో పేదలున్నా... పేదలందరికీ కులం వున్నా... మన గవర్నమెంట్లు మాత్రం ఒక్కో కులానికి ఏరి కోరి కార్పోరేషన్లు పెడుతున్నాయి. అక్కడ కాపు కార్పోరేషన్ తో ఒక కులానికి కాపు కాస్తే... ఇక్కడ బ్రాహ్మణ కార్పోరేషన్ తో బ్రహ్మరథం పట్టే ప్రయత్నం జరుగుతోంది! అసలు ఈ కార్పోరేషన్లు ఎందుకు? కొన్ని కులాలకే ఇస్తే మరి మిగతా కులాలు ఊరుకుంటాయా? ఎప్పుడూ ఏదో ఒక కులం వారొచ్చి పాలకుల్ని దేహి అని అడుగుతూ వుంటే భిక్షలు వేస్తూ వుంటారా? ఇవన్నీ సీరియస్ గా యాన్సర్సు వెతుక్కోవాల్సిన ప్రశ్నలు!   వందల సంవత్సరాలుగా కులం వుంది. అది మనల్ని విభజించింది. వేధించింది. ఇప్పటికైనా మన కార్పోరేషన్ వరాలిచ్చే కపట ప్రభుత్వాలు... ఆ కులాన్ని ధ్వంసం చేస్తే బావుంటుంది. అది మీకు చేతకాకపోతే కులాన్ని కనీసం పట్టించుకోవటం మానేయండి. తమకు వీలైనప్పుడు జనమే కులాన్ని మరిచిపోతారు. అంతేగాని, కులాన్ని బలహీనపరచాల్సిన పాలకులే దానికి వరాల యూరియా వేసి పెంచి పోషించటం ... దారుణం,దుర్మార్గం! ప్రజలకి ఏ మంచి చేయాలనుకున్నా డబ్బున్నవాళ్లు, లేని వాళ్లు అన్న రెండు కులాల్నే దృష్టిలో పెట్టుకోండి. దాని ఆధారంగా అవసరమున్న వారికి అవకాశమున్నంత మేలు చేయండి. ఇలా చేస్తూ వుంటే దేశం తప్పక బాగుపడుతుంది. ఆఫ్ట్రాల్... కులం పట్టించుకోకుండా పని చేసే ఆర్మీ, ఇస్రో లాంటి వ్యవస్థలన్నీ అద్భుతాలు సృష్టిస్తున్నాయి. కులం పోతే దేశం మొత్తం కూడా ఓ అద్భుతం అవుతుంది. ఒకవేళ కులమంటూ వుంటే ... భారతీయ కులం ఒక్కటే వుండాలి! కుల కార్పోరేషన్లు, రిజర్వేషన్లు వుంటే... అవ్వి ఇండియన్స్ అందరికీ చెందాలి! అర్హులందరికీ అందాలి! జై హింద్!   

అక్కడ చంపటమే... చక్కటి వ్యాపారం!

పాకిస్తాన్ అంటే భారతీయులకు కోపం వుండవచ్చు. విసుగు, చిరాకు కూడా వుండవచ్చు. అందుకు కారణం కాశ్మీర్ విషయంలో ఆ దేశం ప్రవర్తించే తీరు. అక్కడ్నుంచి వచ్చే ఉగ్రవాదులు మన దేశంలో చేసే హింస. పాక్ పై మన కోపానికి ఎన్ని కారణాలు వున్నా... మనమే పాకిస్తాన్ పై జాలి కూడా చూపాల్సిన స్థితి దాపురించింది! ఈ మధ్య జరిగిన క్వెట్టా దాడే అందుకు ఉదాహరణ...    పాకిస్తాన్ ఉగ్రవాదుల్ని పెంచి పోషించే దేశమని ఇప్పుడు ప్రపంచమంతా అంగీకరించింది. చైనా తప్ప మరెవరూ పక్క దేశం పక్కన నిలవటం లేదు. కాని, పాకిస్తాన్ కు తాను పెంచి పోషించిన ఉగ్రవాదమే ఇప్పుడు పెద్ద ప్రాణగండంగా మారింది. ఒకప్పుడు భారత్ పై కసితో పాముల్లాంటి టెర్రరిస్టులకి ఆ దేశం పాలు పోసింది. ఇంకా పోస్తూనే వుంది. అది చాలదన్నట్టు అమెరికా దాడులు చేయగానే ఆఫ్గనిస్తాన్ నుంచి తాలిబన్లు వచ్చి తలదాచుకున్నారు. వాళ్లని కూడా మతోన్మాదంతో తనలో కలుపుకుంది. ఇక ఈ మధ్య పాక్ అంతర్గత ఉగ్ర మూకలు కాకుండా అంతర్జాతీయ ఇస్లామిక్ టెర్రరిస్ట్  ఆర్గనైజేషన్ కూడా ఆ దేశంలో జొరబడింది. రోజు రోజుకు ఐఎస్ఐఎస్ ప్రభావం ఎక్కువైపోతోంది పాక్ లో!   బలూచిస్తాన్ లోని క్వెట్టా నగరంలో పోలీస్ ట్రైనింగ్ క్యాంప్ పై మానవబాంబులు దాడి చేశారు. మొత్తం 60మందికి పైగా బలయ్యారు మారణకాండలో. అంతకు రెండితలు తీవ్రంగా గాయపడ్డారు. ఇదంతా చేసింది ఐఎస్. ఆ మతోన్మాద జిహాదీ సంస్థే స్వయంగా ప్రకటించుకుంది. ఇంతకు ముందు కూడా పాక్ లో ఇలాంటి భయంకర దాడులు బోలెడు జరిగాయి. పెషావర్ లో చిన్న పిల్లల్ని కూడా టార్గెట్ చేసి స్కూల్ పై తెగబడ్డారు జిహాదీలు. ఇలా రోజూ నెత్తురోడుతున్నా పాకిస్తాన్ తోక మాత్రం సరిగ్గా మారటం లేదు. ఎన్ని వందల మంది చచ్చినా, ఆర్దిక వ్యవస్థ ఎంత దిగజారినా అంతకంతకూ ఉగ్రవాద ఉబిలో మునిగిపోతోంది. కారణం మతోన్మాదంతో కూడిన స్వార్థమే!   పాకిస్తాన్ లో భారతపై దాడులు చేసేందుకు ఉగ్రవాదుల్ని వేట కుక్కల్ని పెంచినట్టు పెంచుతారు. అయితే, రాను రాను ఈ ఉగ్రవాదం దందా బాగా లాభసాటిగా మారటంతో వాళ్లపై వాళ్లే దాడులు చేసుకుంటున్నారు. కిరాయి ఉగ్రవాదులు పాక్ లో బోలెడు మంది. వాళ్లకి మతోన్మాదం, మత ఛాందసంతో పాటూ డబ్బు కక్కుర్తి కూడా ఎక్కువే. దేశదేశాల్లోంచి వచ్చి పడే విరాళాలతో అక్కడి వందలాది ఉగ్రమూకలు పని చేస్తుంటాయి. వాటి పని పై నుంచి వచ్చే ఆర్డర్స్ అమలు చేయటమే. ఎవర్ని చంపమంటే వార్ని చంపేస్తారు ఈ కిరాయి టెర్రరిస్టులు. షియాలు సున్నీల్ని, బలూచ్ స్వతంత్ర యోధుల్ని, అహ్మదీయ శాఖకు చెందిన ముస్లిమ్ లని, అభ్యుదయ భావాలున్న ఆడవాళ్లని... ఇలా ఎవ్వర్నీ పడితే వార్ని బలి తీసుకుంటారు. అందుకు ఉదాహరణలే క్వెట్టా పోలీస్ క్యాంప్ పై దాడి, పెషావర్ లోని స్కూల్ పైన దాడి, చివరకు, మలాలా లాంటి సాదాసీదా అమ్మాయిలపై కూడా దాడి! మలాలా చదువుకుంటాను అన్నందుకు ఉగ్రవాదులు ఆమెని కాల్చేశారు. అలాగే, ఇంటర్నెట్ లో విపరీతంగా ఎక్స్ పోజింగ్ చేస్తోందని ఒక మోడల్ ని ఆమె బంధువులే కాల్చేశారు! ఇలా పాకిస్తాన్ లో అసలు చట్టం, ప్రభుత్వం భయమే లేదు. ఆ అరాచకత్వమే ప్రపంచానికి పదే పదే దారుణమైన దాడుల రూపంలో కనిపిస్తూ వుంటుంది!    సర్జికల్ స్ట్రైక్స్ దాడుల తరువాత చాలా సార్లు ఇండియన్ ఆర్మీ గట్టి జవాబు ఇస్తోంది పాకిస్తాన్ కు. అందువల్ల కూడా ఆ దేశ సైనికులు కొంత మంది మరణిస్తున్నారు. ఉగ్రవాదుల కోసం తన అధికార ఆర్మీని బలిపెడుతోంది పాకిస్తాన్ మూర్ఖత్వంతో! అయితే, ఇదంతా కేవలం మతోన్మాదంతో మాత్రమే జరగటం లేదు. హింస ఆ దేశంలో ఒక వ్యాపారం అయిపోయింది. అందుకే, ఇటు భారత్ తో శాంతినిగాని, అంతర్గతంగా ప్రశాంతతని, అభివృద్ధినిగాని ఉగ్రవాదులు బతకనివ్వటం లేదు. ఎంత కాలం అంతర్యుద్ధం చెలరేగితే అంత కాలం వాళ్లకి డబ్బులు వస్తుంటాయి. పాక్ ప్రభుత్వానికి అమెరికా, చైనాల నుంచి నిధులు వస్తుంటాయి. వాటితో జల్సాలు చేయటమే వారి లక్ష్యం! కాని, ఉగ్రవాదపు గోతి తొవ్వుకుంటోన్న పాక్ అతి త్వరలో దాంట్లో సమాధి అయ్యే ప్రమాదం ఖచ్చితంగా వుంది...   

ఆశయం మహోన్నతం... ఆచరణ అమానుషం!

మళ్లీ తుపాకులు మోగాయి... మళ్లీ ప్రాణాలు పోయాయి... ఈసారి 28జీవితాలు ఆహుతయ్యాయి! 28కుటుంబాలు అల్లకల్లోలమైపోయాయి! ఒక్కటే తేడా... చనిపోయిన వారు మావోయిస్టులు. ఒక్కసారి చరిత్రలోకి చూస్తే , ఇదే విధంగా, కొన్ని సార్లు పోలీసులు, గ్రేహౌండ్స్ కూడా బలయ్యారు. నష్టం ఏ వైపున జరిగినా చనిపోయేది మాత్రం మనుషులే! సాటి భారతీయులే! అసలు ఏంటి ఈ యుద్ధం? మనతో మనమే చేసుకుంటున్నాం. మనల్ని మనమే చంపుకుంటున్నాం. ఎందుకు?    మన జవాన్లను ఉరిలో పాక్ ఉగ్రవాదులు చంపారు. మళ్లీ మన వారు సర్జికల్ స్ట్రైక్స్ చేసి పాకిస్తాన్ వాళ్లను హతమార్చారు. ఇందులో ఎలాంటి కన్ ఫ్యూజన్ లేదు. ఎందుకంటే, పాకిస్తాన్ శత్రుదేశం. దానికి మన కాశ్మీర్ మీద కన్నుంది. అందుకే, మన ఆత్మ రక్షణ కోసం హింస చేయాల్సి వస్తోంది. ఆ క్రమంలో మన వారు బలవుతున్నారు. పాకీలు కూడా హతమవుతున్నారు. కాని, మావోయిస్టు హింస ఇంత సింపుల్ గా అర్థమయ్యేది కాదు...    మావోయిస్టులు శత్రు దేశం వారు కాదు. వాళ్లు మనలాంటి భారతీయులే. అయినా వాళ్లని ప్రజలెన్నుకున్న ప్రభుత్వాలే నిర్ధాక్షిణ్యంగా పోలీసుల చేత ఎన్ కౌంటర్ చేయిస్తున్నాయి! ఎందుకని? మనతో మనమే యుద్ధం చేసుకోవాల్సిన అగత్యం ఏంటి? దీనికి సమాధానం గన్ను పట్టిన అన్నలే ఇవ్వాలి...    కార్ల్ మార్క్స్ బోధనలతో విప్లవం రావాలనుకుంటుంది కమ్యూనిజం. ఆ కమ్యూనిజానికి హింసాత్మక మార్గాన్ని సూచిస్తుంది మావోయిజం. మావో జడాంగ్ చైనాలో పాటించిన హింసాత్మక తిరుగుబాటు పద్ధతి ఇక్కడ కూడా అమలు చేయాలనుకుంటున్న వాళ్లే మావోయిస్ట్ పార్టీ నేతలు, సైనికులు! మావోల ప్రధాన శత్రువు భారతదేశ ప్రభుత్వం. ప్రజలు ప్రతీ అయిదేళ్లకోసారి ఎన్నుకుంటున్న ప్రభుత్వాలు పెట్టుబడిదారుల చేతుల్లో కీలుబొమ్మలని, పేదల్ని, అణగారిన వర్గాల్ని పట్టించుకోలేదని వారి ఆరోపణ. అది నిజం కూడా. కాని, అసలు సమస్య వారు ఎంచుకున్న పద్ధతిలోనే వుంది! సరైన సమస్య కోసం తప్పుడు సమాధానం మావోయిస్టులు ఆశ్రయించారు...   భారతదేశంలో నిజంగానే బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు దోపిడీకి గురవుతున్నారు. అగ్రవర్ణాల్లోని పేదల పరిస్థితి కూడా దారుణంగానే వుంది. ఇక మైనార్టీల సంగతి సరేసరి. అయినా కూడా జనం పెద్ద ఎత్తున ఎన్నికల వేళ ఓట్లు వేసి ఏదో ఒక పార్టీకో, కూటమికో అధికారం కట్టబెడుతున్నారు. అంటే అత్యధిక శాతం మంది ఇప్పుడున్న వ్యవస్థతో సంతృప్తిగానే వున్నారని అర్థం. కాని, మరింత ఉన్నతమైన జీవన ప్రమాణాల్ని కోరుకుంటున్నారు. ఈ విషయం సరిగ్గా అర్థం చేసుకోని నక్సలైట్లు జనం సంపూర్ణ మద్దతు ఇవ్వని సాయుధ విప్లవానికి మొగ్గు చూపుతున్నారు. ఇక్కడే అన్నలు అడవికి పరిమితం అవ్వాల్సిన అనివార్యత ఏర్పడుతోంది. వాళ్లు ఎంత వరకూ గన్నులు వదలరో అంత వరకూ  మెజార్టీ భారతీయులకి తమ వాదన వినిపించుకునే వీలుండదు. ఎంత వరకూ జనంలో మద్దతు రాదో అంత వరకూ ఎన్ కౌంటర్లు జరుగుతూనే వుంటాయి. అమూల్యమైన విప్లవ వీరుల ప్రాణాలు పోయాక ఎన్ కౌంటర్ బూటకమని ఎంత ప్రకటించినా ఏం లాభం? ఎవరు పట్టించుకుంటారు?    లక్షల మంది సైన్యం, పోలీసులతో, లక్షల కోట్ల బడ్జెట్ తో నడిచే ప్రభుత్వాలు ఎక్కడా... కొన్ని వేల మంది తిండీ, నీరు, నిద్రా లేని విప్లవ వీరులు ఎక్కడా? మావోయిస్టు పార్టీ ఎప్పటికప్పుడు తనకున్న ఈ అల్పమైన బలంతోనే విజయం సాధిస్తానని అనుకోవటం ప్రమాదకరమైన భ్రమ. ఇవాళ్ల కాకపోతే రేపు ప్రజలు ఎన్నుకున్న భారత ప్రభుత్వానిదే పై చేయి అవుతుంది. దానికున్న నైతిక, ఆర్దిక, మానవ బలం అలాంటిది. ఈ విషయాన్ని గుర్తించి మావో అగ్రనేతలు సాధ్యమైనంత త్వరగా ప్రధాన స్రవంతిలోకి రావాలి. ఎన్నికల ద్వారా ప్రజల మద్దతు పొంది తమ ఆలోచనలు అమల్లో పెట్టాలి. అంతే కాని, మంటల్లో దూకే మిణుగురు పురుగుల్లా అనవసరంగా అమాయకుల్ని బలి చేసుకోవద్దు! ఆఫ్ట్రాల్... మావోలు, నక్సలైట్లు లేని కర్ణాటక, తమిళనాడు, గుజరాత్ లాంటి రాష్ట్రాలు అభివృద్ధి చెందటం లేదా? అక్కడ పేదలు ప్రభుత్వంపై తమదైన రీతిలో పోరాటాలు చేయటం లేదా? హింసాత్మక మార్గం మాత్రమే పరిష్కారమా? అసలు... ఇలాంటి సాయుధ పోరాటం... తమ స్వంత ప్రజాస్వామ్య ప్రభుత్వంపై ప్రపంచంలో ఎక్కడైనా విజయవంతం అయిందా? అడవిలో అన్నలే ఆలోచించుకోవాలి....     

సాయిబాబా దైవత్వం... మీడియా ఆరాటం!

ప్రపంచం ఇప్పుడు ఆరు ప్రధానమైన అవసరాలతో నడుస్తోంది! అవ్వి... నింగి, నేల, నీరు, నిప్పు, గాలి, టీఆర్పీలు! అదేంటి పంచభూతాలతో పాటూ టీఆర్పీలు ఎందుకు వచ్చాయి అనుకుంటున్నారా? అవును... ఇండియాలో, మరీ ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో టీఆర్పీలు పంచభూతాలకి తోడైన ఆరో భూతం అయిపోయాయి! అసలు నిజంగా చర్చ జరగాల్సిన అవసరం లేని విషయాలైనా సరే మన ఛానల్స్ పుణ్యామాని రచ్చైపోతున్నాయి! ద్వారకా పీఠాధిపతి వ్యాఖ్యలు, సాయిబాబా దేవుడు కాదు ... ఈ గోల అలాంటిదే!   నిజంగా సాయిబాబా దేవుడా? తాను దేవుడ్ని కాదని సాయిబాబాయే చాలా సార్లు చెప్పారు తమ జీవిత కాలంలో. ఆయన జీవిత చరిత్ర అయిన సాయి సచ్ఛరిత్రలో కూడా ఈ విషయం వుంది! నేను కేవలం దేవుడి సేవకుడ్ని అని మాత్రమే బాబా చెప్పేవారు. కాని, ఇప్పుడు మన మీడియాకి, దాంట్లో చర్చలకు వచ్చే మేధావులకి పదే పదే ఈ సందేహం వస్తోంది! వాదనలు చేయబుద్దేస్తోంది! కారణం... ద్వారకా పీఠాధిపతి స్వరూపానంద స్వామివారు!    శంకరాచార్య స్థాపించిన నాలుగు ఆమ్నాయ పీఠాల్లో ద్వారక కూడా ఒకటి. దానికి సాక్షాత్ ఆదిశకరుల శిష్య పరంపరలో భాగంగా వచ్చిన ప్రస్తుత పీఠాధిపతి స్వరూపానంద. ఈయనలాగే దక్షిణాదిలో శృంగేరి పీఠానికి అధిపతి భారతీర్థ స్వామీ వారు. ఆయన ఏనాడూ ఎటువంటి వివాదంలో కలుగజేసుకోరు. కాని, కాంగ్రెస్ వారితో దగ్గరి సంబంధాలు వున్నాయని బీజేపి వారు ఆరోపించే స్వరూపానంద ... ఎప్పుడూ ఏదో ఒక కాంట్రవర్సీలోనే వుంటూ వస్తున్నారు. ఓ సారి సాయిబాబా ముస్లిమ్ అని, ఆయన దేవుడు కాదని, ఆయన్ని పూజించవద్దని అంటారు. మరోసారి ఆడవాళ్లు శని సిగ్నాపూర్ మూల విగ్రహం దగ్గరికి వెళితే దేశంలో రేపులు పెరుగుతాయని అంటారు. ఇలా ఆయన ఎప్పుడు ఏం మాట్లాడతారో అర్థం కాదు...    స్వరూపానంద స్వామీ సాయిబాబాను టార్గెట్ చేయటం ఇప్పుడు మొదటి సారి జరగలేదు. అయన తనకు వీలున్నప్పుడల్లా శిరీడినాథుడ్ని సాధారణ మానవుడని, పూజించవద్దని, వేద సమ్మతం కాదని చెబుతూనే వున్నారు. ఆయన నోరు తెరిచిన ప్రతీసారీ మన మీడియా నానా హంగామా చేసేస్తుంటుంది. అస్సలు ఒక్కసారి కూడా స్వరూపానంద స్వామి వ్యాఖ్యలకు ఎంత వరకూ ప్రభావం వుంటుందని ఆలోచించదు. నిజానికి 2015లో ఒకసారి ద్వారక పీఠాధిపతి కోర్టుకు లిఖిత పూర్వకంగా రాసి ఇచ్చారు కూడా... సాయిబాబా పై వ్యాఖ్యలు తాను ఎవర్నీ నొప్పించాలని చేసినవి కావని! అయినా ఆయన మళ్లీ మళ్లీ వ్యాఖ్యలు చేస్తూనే వస్తున్నారు. ఛానల్స్ వాళ్లు దాన్ని హిందువుల అతి పెద్ద సంక్షోభంగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారు...    సాయి దైవత్వం మీద ఎవరి అభిప్రాయాలు ఎలా వున్నా బాబా ఇప్పుడు అత్యంత ప్రజాదరణ వున్న దేవుడు. ఆయనకి హిందూ సంప్రదాయం ప్రకారమే పూజలు జరుగుతున్నాయి. జనం విపరీతంగా విశ్వసిస్తున్నారు. ఇటువంటి సమయంలో ఒక పీఠాధిపతి భిన్నమైన అభిప్రాయం వెలిబుచ్చటం మరీ తప్పేం కాదు. ఆయన తన వ్యక్తిగత అభిప్రాయం చెప్పారే తప్ప బలవంతంగా సాయి భక్తుల్ని పూజలు మానేయమని చెప్పటం లేదు. అలా చేసే స్థాయి, స్థితి కూడా ఆయనకు లేవు. అయితే, ఇక్కడ వస్తున్న సమస్యల్లా స్వరూపానంద వ్యాఖ్యల్ని మీడియా హైలైట్ చేయటం! ఊరికే ఒక వార్తగా ఇచ్చి ఊరుకోకుండా మన ఛానల్స్ వాళ్లు సాయి భక్తుల్ని , సాయి వ్యతిరేకుల్ని స్టూడియోల్లోకి పిలిచి కూర్చుండబెడతారు! ఇంకా అరుపులు కేకలతో అరాచకం బయలుదేరుతుంది! అసలు సాయి దేవుడని కోట్లాది మంది జనం నమ్మేశాక టీవీ స్టూడియోల్లో తేలేదేంటి? ద్వారక పీఠాధిపతి తన ముందు మైక్ పెట్టినప్పుడు చెప్పే ఒక్క వాఖ్యం వల్ల ముంచుకొచ్చిన ప్రమాదం ఏంటి? మీడియాకే తెలియాలి...    సాయిని ఎక్కువగా పూజించే మహారాష్ట్ర, తెలంగాణ, అంధ్రప్రదేశ్ లాంటి రాష్ట్రాల్లో ద్వారక పీఠాధిపతి చాలా మందికి తెలియదు. ఈ గొడవ మొత్తం అయ్యాకే ఆయన గురించి తెలిసింది. దీనికి కారణం టీవీలు, పేపర్లు ఆయన వాఖ్యల్ని, ఆయన ఫోటోల్ని విపరీతంగా ప్రచారం చేయటమే. ఆ ఫలితంగా ఎక్కడెక్కడో సాయి భక్తలు ఆవేశానికి, ఆందోళనకి లోనవుతున్నారు. చివరకు, టీవీల వాళ్ల కెమెరాలు పక్కాగా వుంటాయని తేలటంతో ధర్నాలకు దిగిపోతున్నారు. ఇదంతా అసలు ఎవరైనా ప్లాన్ చేసి చేపిస్తున్నారా అన్న అనుమానం కూడా వస్తుంది అప్పుడప్పుడూ!   ఒకవైపు ద్వారక పీఠాధిపతి ఎక్కడో స్టేట్మెంట్ ఇవ్వటం , దానికి వెంటనే సాయి భక్తులు స్పందించటం, మీడియా ఎంటరైపోయి హడావిడి చేసేయటం... ఇంత వ్యవహారం కోఆర్డినేషన్ లేకుండా ఎలా అవుతుంది? బీజేపి అభిమానులు కొందరన్నట్టు నిజంగానే తెర వెనుక ఎవరన్నా వుండి స్వామీజీ చేత మాటలు అనిపించి మీడియాలో తుఫాన్ రాజే్స్తున్నారా? అలా జరగొచ్చు, జరగకపోవచ్చు. కాని, ఒక్కటి మాత్రం నిజం. మరోసారి ద్వారక పీఠాధిపతి సాయి గురించి ఏమైనా మాట్లాడితే టీవీ ఛానల్స్ వారు చర్చలు పెట్టకుంటే చాలా బెటర్. ఎందుకంటే, సాయి దేవుడా కాదా అనే విషయం తేలకపోగా అనేక మంది సాయి భక్తుల హృదయాలు గాయపడుతున్నాయి. కాబట్టి పీఠాధిపతి వారి మాటల్ని ఓ వార్తగా ప్రసారం చేసి ఇతర ముఖ్యమైన అంశాలపై దృష్టి పెడితే చాలా బావుంటుంది. అదే మీడియా బాధ్యత కూడా! ఎవరు దేవుడు, ఎవరు కాదనే విషయం తేల్చాల్సింది ... ఎవరి విశ్వాసం వారిదే!   

ఇప్పుడు సోదంతా సోషల్ మీడియాలోనే!

మన్మథుడు సినిమాలో ఓ సీన్ వుంటుంది... అందులో హీరోయిన్ ఆఫీస్ లోని ఇతర లేడీ ఎంప్లాయిస్ అందరికీ ఏదో మ్యాటర్ చెబుతుంటుంది. అప్పుడే అక్కడికి వచ్చిన హీరో చీవాట్లు పెడతాడు. ఆఫీస్ టైంలో కబుర్లేంటని ఇరిటేట్ అవుతాడు. ఇలాంటి సీన్స్ రియల్ గా కూడా ఆఫీసుల్లో బోలెడు జరుగుతుంటాయి. ఉద్యోగులు కబుర్లతో కాలం గడిపేస్తుంటారు. అది కాస్తా పని మీద ప్రభావం చూపుతుంది. ఇన్ ఛార్జులో, బాస్ లో కేకలేసేస్తుంటారు! కాని, ఇప్పుడు కాలం మారిపోయింది. ముందులా కబుర్లు చెబుతూ కాలం వృథా చేయటం లేదు ఎంప్లాయిస్. అలాగని బుద్ధిగా పని చేసుకుంటున్నారనుకోకండి! ఫేస్బుక్ లో దూరి ప్రపంచంతో కబుర్లు చెప్పేస్తున్నారు...  ఫేస్బుక్, ట్విట్టర్ లాంటి సోషల్ సైట్స్ ఇప్పుడు అందరికీ కామన్ అయిపోయాయి. రోజులో కొంతసేపైనా వాటిల్లోకి లాగిన్ అయ్యి నాలుగు లైక్లు, రెండు కామెంట్స్, ఓ షేర్ చేసి వస్తుంటారు! కాని, కొంత మంది మాత్రం అదే పనిగా ఫేసుల్ని ఫేస్బుక్ లోంచి బయటకు తీయటం లేదట! చూసే వారికి వీరు సీరియస్ గా వర్క్ చేసుకుంటున్నట్టే కనిపిస్తుంది కాని జరిగేది ఏమీ లేదు. ఫేస్బుక్ లో అలా అలా టైం గడిపేస్తుంటారు. ఈ మధ్య డ్యూటీ టైంలో సోషల్ మీడియా చూసే వారి సంఖ్య క్రమంగా పెరిగిపోతోందట. అది కూడా మధ్యాహ్నం భోజనం అయ్యాక చాలా ఎక్కువగా ఫేస్బుక్ లాంటి వాటిల్లో టైంపాస్ చేస్తున్నారట! సగటున రెండున్నర గంటలు ఈ వ్యవహారానికే సరిపోతోంది. అదే ఆపీస్ లో లేని సమయంలో కేవలం గంటన్నర మాత్రమే సోషల్ మీడియా చూస్తున్నారు. సో... చక్కగా పని చేసి సంస్థకి ఉపయోగపడాల్సిన సమయంలో కాలం వృథా చే్స్తున్నారన్నమాట ఉద్యోగులు! ఫేస్బుక్ లాంటి వాటి వల్ల విలువైన సమయం వృథా అవుతోంది కాబట్టి వాట్ని తమ ఆపీసుల్లో నిషేధిస్తే ... అది కూడా వ్యతిరేక ఫలితాలే ఇస్తుందంటున్నారు నిపుణులు. సోషల్ మీడియా అందుబాటులో లేకుంటే ఉద్యోగులు హ్యాపీగా పని చేస్తారని గ్యారెంటీ ఏం లేదు. కాబట్టి ఫేస్బుక్ , ట్విట్టర్ లాంటివి వాళ్లకు అందుబాటులో వుంచుతూనే ఎక్కువ సమయం గడపకుండా చర్యలు తీసుకోవాలంటున్నారు. అంతే కాకుండా ఎవరికి వారు కూడా తమ సోషల్ మీడియా వ్యసనంపై దృష్టి పెట్టాలి. సంస్థకి నష్టం కాకుండా చూడటమే కాక వ్యక్తిగతంగా కూడా మంచి జరుగుతుంది. ఎందుకంటే, సోషల్ మీడియా వల్ల ఎన్ని లాభాలో వ్యసనంగా మారితే అన్ని నష్టాలు కూడా...   

పోలీస్... జనం ఇష్టపడని ఆప్తుడు!

ఈ మధ్య అందరి దృష్టీ ఆర్మీపై పడింది. కారణం ఉగ్రవాదుల దాడి, తరువాత మన వారు విజయవంతంగా చేసిన సర్జికల్ స్ట్రైక్స్. అంతే కాదు, చాలా మంది జవాన్ల కష్టాలు, త్యాగాల గురించి మాట్లాడుకుంటున్నారు. కాని, ఈ సమయంలో మనం మాట్లాడుకోవాల్సిన మరో వ్యవస్థ కూడా వుంది... అదే పోలీస్ వ్వవస్థ! పోలీస్ అనగానే ఆర్మీకి ఇచ్చినంత గౌరవం ఇవ్వరు మన దేశంలో. ఇక కొందరు సో కాల్డ్ మేధావులైతే పోలీసులని నర రూప రాక్షసుల్లా కూడా చూస్తారు! అడవుల్లో గన్నులు పట్టుకుని తిరిగే అన్నలకు మద్దతు తెలిపే పౌర, మానవ హక్కుల సంఘాలు జనం మధ్య వుండే పోలీసులకి ఎట్టి పరిస్థితుల్లో అండగా నిలవవు. నిజానికి నిలవాల్సిన అవసరం కూడా లేదు. ఎందుకంటే, ఆర్మీ లాగే పోలీసులు కూడా దేశం కోసం, ప్రభుత్వం కోసం, ప్రజల కోసం పని చే్స్తున్నారు. వాళ్లు తమ విధుల్లో భాగంగా అనేక సార్లు అమరులు కూడా అవుతుంటారు. అయినా కూడా యుద్ధంలో నేలకొరిగిన ఆర్మీ జవాన్ అంత గౌరవం పోలీసులకి దక్కదు. దానికి కారణం ప్రజల్లో వున్న వివక్ష అని తేల్చేయలేం. పోలీసుల ప్రవర్తన కూడా చాలా సార్లు వారికి చెడ్డ పేరు తెచ్చిపెడుతుంటుంది...  ఒక్కసారి మన సినిమాల్నే తీసుకుంటే... పోలీసు ఎన్ని సినిమాల్లో హీరోగా కనిపిస్తాడో అంతకంటే ఎక్కువ సినిమాల్లో విలన్ గా కనిపిస్తాడు. నిజంగా కూడా కనిపించని నాలుగో సింహాల పరిస్థితి అదే. వాళ్లు లేకుంటే మన సమాజం అల్లకల్లోలంగా మారిపోతుంది. అయినా సరే చాలా సార్లు కొందరు పోలీసులు రాక్షసంగా ప్రవర్తించి డిపార్ట్ మెంట్ మొత్తానికి చెడ్డపేరు తెస్తుంటారు. అంతే కాదు, తమ ప్రవర్తనతో పోలీసులు.. సామాన్యులు భరోసాగా వుండాల్సింది పోయి భయంగా పక్కకు పోయే స్థితి తెస్తున్నారు. ఇలాంటి అంశాల్లో పోలీసుల్ని , పోలీస్ డిపార్ట్ మెంట్ ని సంస్కరించాల్సిన అవసరం వుంది. సామాన్యులతో వారు ప్రవర్తించే తీరు మార్చాల్సిన అవసరం చాలా వుంది. అంతే కాదు, అవినీతి విషయంలో కూడా పోలీసుల్లో చాలా మార్పు రావాల్సి వుంది. పోలీసుల్లో నిజాయితీ పరులు వుండరని ఎవ్వరూ చెప్పకపోయినా చాలా వరకూ కనిపించేది మాత్రం అవినీతిపరులే. హోమ్ గార్డ్ నుంచి డీజీపీ వరకూ అందరి మీదా ఆరోపణలు వస్తూనే వుంటాయి. అయినా కూడా పోలీస్ యూనిఫామ్ కి వుండే దర్పం, శక్తి వల్ల అవన్నీ అణిగిపోతుంటాయి. ఇలాంటి అవినీతి , అరాచక ప్రవర్తనని అరికట్టాల్సి వుంది...  పోలీసుల్లోని చెడు ఎంతో చర్చకొచ్చినా వాళ్ల సమస్యలు మాత్రం అస్సలు బయటకి రావు. అంతా మంచిగా వున్నప్పుడు పోలీసుల్ని ఎంతో విమర్శించిన వాడు కూడా చిన్న సమస్య రాగానే స్టేషన్ కి వెళ్లిపోతాడు. నిత్యం వందల కేసులు పరిష్కరించి పంపే పోలీసులు ఏ ఒక్క చోట సరిగ్గా స్పందించకపోయినా మీడియా వేట కుక్కలా వెంటపడుతుంది. కాని, రోడ్డు మీద కూడలిలో విష వాయువులు పీల్చుకునే ట్రాఫిక్ పోలీస్ మొదలు దట్టమైన అడవుల్లో మావోయిస్టుల మందు పాతరల మధ్య తిరిగే గ్రేహౌండ్స్ వరకూ ఎందరు పోలీసులు ఎన్ని త్యాగాలు చేసిన ఎవ్వరూ పట్టించుకోరు. అధికారిక లెక్కల ప్రకారం ప్రతి ఇద్దరు పోలీసుల్లో ఒకరికి అనారోగ్యం వుంటోందట. తల నొప్పి మొదలు ప్రాణాంతక శ్వాస కోశ వ్యాధుల వరకూ పోలీసులకు వస్తోన్న వ్యాధులు ఎన్నో. కాని, ప్రభుత్వం తరుఫున అందుతున్న సాయం మాత్రం అంతంత మాత్రమే. ఇక పోలీసుల సంఖ్య, కేసుల సంఖ్య రోజు రోజుకు రివర్స్ గా వుంటోంది. కనీసం వారానికి ఒకసారి వీక్లీ ఆఫ్ కూడా వుండని పరిస్థితి వుందంటే పోలీసులకి ఎంతగా శారీరిక , మానసిక ఒత్తిడి వుంటోందో అర్థం చేసుకోవచ్చు!  పోలీస్ సంస్మరణ దినం రోజున సంవత్సరానికి ఒకసారి సెల్యూట్లు చేయటం కాకుండా పాలకులు సీరియస్ గా దృష్టి పెట్టాల్సిన అవసరం వుంది. పోలీసుల సమస్యలు పరిష్కరిస్తూనే వాళ్లని సంస్కరించాల్సిన ఆవశ్యకత వుంది. అలాగే జనంలో కూడా పోలీసుల పట్ల మరింత గౌరవ భావం  రావాలి. దానికంటే ముందు తమ మీద గౌరవం కలిగేలా పోలీసులు ప్రవర్తించాలి. మరీ ముఖ్యంగా, పోలీసు ఉన్నతాధికారులు ప్రజలకు మేలు చేసే చర్యలు చేపట్టాలి.

ఒక్క పెళ్లి... 500కోట్లు గాలిలో!

ఆయనో రాజకీయ నేత. మాజీ మంత్రి కూడా. కాని, అసలు ప్రత్యేకత ఇవేవీ కావు! ఆయన గొప్పతనమంతా ఆయనపై మోపిన కేసులు, ఆరోపణల్లోనే వుంది!ఆయన మిగతా అవినీతిపరులు, అక్రమార్కుల్లా చిన్నా చితకా కుంభకోణాలు చేయలేదు! ఏకంగా భూమినే తవ్వి ... ప్రొక్లెయనర్లకు దొరికినంత దోచుకున్నాడు! అంతా చేసి తన అక్రమ సంపాదనతో తిరుమల వెంకన్న నెత్తిన కోట్లు ఖరీదు చేసే కిరీటం పెట్టాడు! అంతటి గనులు దోచిన ఘనుడాయన! ఇంత చెప్పాక సదరు ఘన పదార్థం పేరు... గాలి జనార్దన్ రెడ్డి అని మీకు మళ్లీ చెప్పాలా? మూడేళ్లు జైల్లో వున్న ఐరన్ బాస్ గోల్డెన్ డేస్ అయిపోయాయని మీరు అనుకుంటున్నారా? దెన్... మీరోసారి గాలి జనార్దన్ తన గారాల పట్టి పెళ్లికి వేయించిన శుభలేఖను చూడాల్సిందే! ఈ మధ్య గాలి జనార్దన్ రెడ్డి లాంటి ధనమున్న వాళ్ల పెళ్లిల్లు మరీ ధనాధన్ గా అవుతున్నాయి! ఆయన ప్రస్తుతం తాను కండిషనల్ బెయిల్ పై బయట వున్నప్పటికీ అన్ కండిషనల్ గా ఖర్చుపెడుతున్నాడు కూతురు పెళ్లికి! తండ్రిగా ఆయన వాత్సల్యం శుభలేఖలోనే తెలిసిపోతోంది. బాక్స్ లాగా వుండే వెడ్డింగ్ ఇన్విటేషన్ తెరవగానే వీడియో మోగిపోతుంది! చిన్న ఎల్సీడీ స్క్రీన్ పై ఆయన, ఆయన భార్య, కూతురు, కొడుకు, కాబోయే అల్లుడు అందరూ కనిపిస్తారు. మాంచి కన్నడ పాట ప్లే అవుతుంది బ్యాక్ గ్రౌండ్లో. శివుడ్ని పూజించటం మొదలు అల్లుడి వెనుక గుర్రాలు పరుగెత్తటం వరకూ... అబ్బో! భీభత్సంగా పిక్చరైజ్ చేశారు... గాలి పాటని! వెడ్డింగ్ ఇన్విటేషన్ కార్డ్ లో ఊరికే మాటలు, ప్రింట్ చేసిన అక్షరాలు కాకుండా ఏకంగా మనుషులే కనిపిస్తూ , సంగీతంతో కలిపి పాట పాడేస్తూ... శ్రావ్యంగా ఆహ్వానిస్తే... ఎవరు మాత్రం ఊరుకుంటారు చెప్పండి? అయినా గాలి జనార్దన్ రెడ్డిగారంతటి మాజీ మంత్రి, ప్రస్తుత అండర్ ట్రయల్, అపర వేంకటేశ్వర భక్తుడు మిమ్మల్ని రమ్మన్నాక మీరు ఊరుకుంటారా? ఆ... ఊరుకుంటారా చెప్పండి? పైగా ఆయన పెళ్లిలో పెట్టబోయే విందు భోజనం... దాన్ని తలుచుకుంటేనే తహతహలాడిపోతారు ఎవరైనా! అలా వుండనుందట! అసలు వంటలు వండటానికి దేశం నలుమూలల నుంచీ వచ్చే వంట వాళ్లే చిన్న చితకా పెళ్లికి వచ్చే అతిథులంత మంది వుంటారట! ఇక అతిథులు ఏ సంఖ్యలో వస్తారో ఆలోచించండి! గాలి జనార్దన్ రెడ్డి ఓ అయిదొందల కోట్లు పెట్టి... పదకొండు రోజుల పాటూ... కూతురు కళ్యాణం చేయటం తప్పంటారా? కానే కాదు! ఆయన ఆ మాత్రం ఖర్చు చేయాల్సిందే. కొడుక్కి వేలాది కోట్లు వారసత్వంగా ఇస్తున్నప్పుడు బిడ్డ కోసం కూడా కనీసం రెండు వందల కోట్లు పెళ్లి సంబరాల్లో వెదజల్లాల్సిందే! అప్పడే గాలి రాజావారి గాంభీర్యం తగ్గకుండా వుంటుంది. అంతే కాదు, గాలి జనార్ధన్ రెడ్డి లాంటి ఇనుప కుబేరులు అప్పుడప్పుడూ ఇలాంటి బంగారు పెళ్లిల్లు తలపెట్టాలి. అదే ప్రపంచంలో వేగంగా దూసుకుపోతున్న మన భారతీయ ఆర్దిక వ్యవస్థకు శ్రీరామ రక్ష! మధ్యలో దేశ ఆర్దిక వ్యవస్థ ఎందుకొచ్చిందీ అంటారా? అయితే ఈ మ్యాజిక్ లాంటి మ్యారేజ్ లాజిక్ వినండి...  ఒక్క గాలి వారే కాదు... మన దేశంలో ఇంకా బోలెడు ఈదురు గాలుల వారూ వున్నారు, నల్ల సొమ్ము పోగేయటం విషయంలో! అందులో కొందరు జగన్నాటక అవినీతి సూత్రధారుల్ని అడ్డుపెట్టకునే కదా మన జనార్దనుడు ఇవాళ్ల ఎల్సీడీ తెరతో పెళ్లి ఆహ్వానాలు పంపే స్టేజీకి వచ్చారు! సరే... అద్భుతమైన ఆ అక్రమార్క త్రివిక్రమావతారం సంగతి ఎలా వున్నా ఇప్పుడు తమ ఇంట్లో మ్యారేజ్ మాత్రం గ్రాండ్ గా చేస్తున్నారట గాలి. బెంగుళూరు రోజుల తరబడి వెలిగిపోనుందట! అసలు ఇలాంటి మహా గ్రాండు పెళ్లిల్లు ఈ మధ్య బాగా ఎక్కువైపోతున్నాయి! ఎవరి రేంజ్ కు తగ్గట్టు వాళ్లు అరేంజ్ చేసుకుంటున్నారు...  ఆ మధ్య ఓ సారి తమిళ సీఎం జయలలిత తన పెంపుడు కొడుకు పెళ్లికి హెలికాప్టర్లు వాడిందట! ఇలాంటి అబ్బురపరిచే పెళ్లి వార్తలు భారతీయులకి అలవాటే. పైగా వీటి వల్ల మార్కెట్ కి, ఆర్దిక వ్యవస్థకి మాంచి లాభం వుండటంతో అందరూ ఎంకరేజ్ కూడా చేస్తుంటారు! ఫలానా వారి పెళ్లిలో వెడ్డింగ్ కార్డ్ ఇలా వుంది, అమ్మాయి పెళ్లి చీర అలా వుంది, అబ్బాయి తలపాగా ఇంకోలా వుంది.... ఇవన్నీ ఇండియన్స్ కి ఎక్కడ లేని ఆసక్తి. అందుకే క్యాష్ చేసుకునే పనిలో మీడియా తలమునకలైపోతుంది! ఒక్క కెమెరా కూడా పెట్టుకోనీయని సానియా మీర్జా పెళ్లినే మనోళ్లు నానా రచ్చ చేసి సంబరం చేసుకున్నారు. మరిక పాటలు పాడి ఆహ్వానిస్తున్న గాలి జనార్దన్ రెడ్డి ఇంట్లోని పెళ్లిని మీడియా ఊరుకుంటుందా? దగ్గరుండి నువ్వు కానియ్ రాజా... అంటూ బాజా, బజంత్రీలు మోగించదు? ఇలాంటి గొప్పోళ్ల ఇళ్లలో పెళ్లి వార్తలు ఇచ్చినప్పుడు వచ్చే టీఆర్పీల కథే వేరు! పెళ్లి భోజనాల విస్తరాకుల్లో కోట్లు ఖర్చు చేసే రిచ్చెస్ట్ పీపుల్స్ మ్యారేజులంటే... అందరికీ పండగే! కారణం పెళ్లి జరిపించే పూజారికి ముట్టే వేలాది రూపాయల దక్షిణ మొదలు బంగారు ఆభరణాలు అమ్ముకునే గోల్డ్ వ్యాపారస్తులకు దక్కే కోట్ల లాభం వరకూ... అన్నీ అద్భుతమే! అన్నీ హంగామానే! అందరికీ లాభమే! ఇక రెగ్యులర్ గా పెళ్లి అంటే వుండే తలంబ్రాలు, బోజనాలు, లైట్లు, కార్లు, ఫంక్షన్ హాలు... ఇవన్నీ కాదు... గాలి జనార్దన్ రెడ్డి వారింట జరగనున్న పెళ్లి లాంటి వాటిలో అయితే ... బాలీవుడ్ తారలు కూడా వెలిగిపోనున్నారట! ఆ... ఏముంది... ఎంత పద్మశ్రీలు, జాతీయ అవార్డులు అందుకున్న వెండితెర వేల్పులైతే మాత్రం ఏంటి? కోట్లతో కొడితే పెళ్లికొచ్చి చిందేయక ఇంట్లో దాక్కుంటారా? తమ సినిమా పాటలకీ ధగధగ మెరిసే చిట్టిపొట్టి డిజైనర్ బట్టలు వేసుకుని బాలీవుడ్ హీరోయిన్స్ ఇలాంటి వేడుకల్లో తందనాలు ఆడకుండా వుంటారా? వాళ్ల డ్యాన్సులు ఈ రకం పెళ్లిల్లలో చీర్ గాల్స్ కి ఎక్కువ... రికార్డింగ్ డ్యాన్సులకి తక్కువా అన్నట్టు వుంటాయి!  అసలు గొప్పోళ్ల మహా గొప్ప బ్లాక్ మనీ మ్యారేజెస్ కి తమనీ అలౌ చేయాలంటున్నారు పొట్ట కూటి కోసం కష్టపడే రికార్డింగ్ డ్యాన్సర్లు. కోట్లు పెట్టి బాలీవుడ్ భామలతో , సినిమా హీరోయిన్లతో , హీరోలతో డ్యాన్సులు చేయించుకున్నట్టే తమతో కూడా నాలుగు చిందులు వేయించుకుంటే తాము బతికేస్తాం కదా అంటున్నారు! ఈ విషయం ఆలోచించాల్సిందే! ఎలాగూ మీడియాలో దుమారంగా మారిపోతున్న ఈ కాలం కోట్ల రూపాయాల పెళ్లిల్లు... ఆచారం, సంప్రదాయం, సంస్కారం, సంస్కృతి ఏం లేకుండా... ఆర్భాటంగా మారిపోయాయి. మరిక రికార్డ్ స్థాయిలో జరిగే సదరు పెళ్లిల్లలో రికార్డింగ్ డ్యాన్సులు వేస్తే మాత్రం అడిగేదెవరు? పైగా ఆ రికార్డింగ్ డ్యాన్సర్లు వస్తే... సంగీత్, మెహందీ లాంటి నార్త్ ఇండియన్ సంబరాలు కూడా తెచ్చి పెట్టుకుంటున్న మనోళ్ల కళా పోషణకి తోడుగా వుంటుంది! పెళ్లి అవ్వాల్సిన వధువు, వరుడు, రెండు కుటుంబాల వాళ్లు ... వచ్చినా రాకున్నా పాడుతుంటారు, ఆడుతుంటారు కదా! ఆళ్లకి జోడీగా వుంటారు పాపం...   ఏది ఏమైనా... గాలి జనార్దన్ రెడ్డి వారు తల పెట్టిన వాళ్లింటి భీభత్సమైన పెళ్లి చక్కగా జరగాలని అందరం కోరుకుందాం! ఎందుకంటే ఇలాంటివి అప్పుడప్పుడూ జరిగితేనే బీరువాల్లో, పరుపుల కింద, ఫామ్ హౌజుల్లో మూలిగే డబ్బుల కట్టలు ఒళ్లు విరుచుకుని బయటకొస్తాయి! నగలమ్ముకునే వాడి దగ్గర నుంచీ తిన్న ప్లేట్లు కడిగే పని వాళ్ల వరకూ అందరికీ సరఫరా అవుతాయి! లేకపోతే నల్లధనంగా ఎక్కడివక్కడే వుండిపోతాయి! అసలు ఇలాంటి వందల కోట్ల రూపాయల స్పెషల్ పెళ్లిల్లని ఆదయ పన్ను మినహాయింపు చట్టం కిందకి తేవాలి ప్రభుత్వం! అప్పుడు జరుగుతాయి అసలు సిసలు పెళ్లిల్లు! ఆ కళ్యాణ వైభోగం చూడటానికి రెండు కళ్లు సరిపోవు! చెప్పుకుంటే రెండు పెదాలు వాచిపోతాయి! ఇండియాలో గ్రాండ్ మ్యారేజెస్, బ్లాక్ మనీ... ఈ రెండింటికి క్రేజు తగ్గటం ఇప్పట్లో అయ్యే పని కాదు! అందుకే, చెమట ఎలాగూ వస్తుందనుకున్నప్పుడు... మాంచి పర్ఫ్యూమ్ అన్నా కొట్టుకోవాలి! ఏమంటారు?      

జడ్జ్ గా రిటైర్ అయ్యాడు... ముద్దాయిగా బోనెక్కనున్నాడు!

జస్టిస్ మార్కండేయ కట్జూ... ఈ పేరు ఇప్పుడు అందరికి బాగా తెలిసిన టైటిల్! అసలు ఒక మాజీ సుప్రీమ్ న్యాయమూర్తి పేరు ఎవ్వరికీ పెద్దగా తెలియదు. తెలిసే ఛాన్స్ కూడా లేదు. ఎందుకంటే, ప్రస్తుతం సుప్రీమ్ న్యాయమూర్తి, ప్రధాన న్యాయమూర్తి... ఇలాంటి వారి పేర్లే పిల్లలు పోటీ పరీక్షల కోసం చదువుకుంటూ వుంటారు. అంతే తప్ప మిగతా వారు ఏ మాత్రం పట్టించుకోరు. కాని, ఆల్రెడీ రిటైర్ అయిపోయిన కట్జూ మాత్రం తెగ పాప్యులర్! ఒక మాజీ జస్టిస్ కి ఇంత సీన్ క్రియేట్ అవ్వటం ఆశ్చర్యకరమే! మార్కేండయ కట్జూ జనం నోళ్లలో నానటానికి అసలు కారణం ఆయన జిహ్వ చాతుర్యం. మరే ఇతర జడ్జీ మాట్లాడనంత పబ్లిగ్గా, డేరింగ్ గా ఈయన మాట్లాడతాడు. అందుకు సోషల్ మీడియాను వేదికగా  ఎంచుకుంటాడు. అది ఎంతటి సున్నితమైన విషయం అయినా, ఎంతటి వివాదాస్సద విషయం అయినా తనకు తోచింది రాసేస్తాడు. ఆయన ఫేస్బుక్ పోస్టుల గురించి రాసుకుంటూ పోతే మరో బుక్కై కూర్చుంటుంది. అంతలా సెన్సేషన్ క్రియేట్ చేశాడు తన ఒక్కో పోస్టుతో! కట్జూ ఈ మధ్య కాలంలో చేసిన వివాదాస్పద పోస్టింగ్ గురించి మాట్లాడుకుంటే ... మదర్ థెరిసా ఒట్టి బోగస్ అన్నాడు! ఆమెకు పోప్ సెయింట్ హుడ్ ఇచ్చిన వేళ చెలరేగిపోయాడు. మదర్ థెరిసా అభిమానులు ఏమనుకుంటున్నారన్న ఆలోచన అస్సలు లేకుండా ఘాటు కామెంట్స్ చేశాడు. థెరిసా మత ప్రచారమే తప్ప నిజమైన సేవ ఏం చేయలేదని, అబార్షన్ వంటి అంశాల విషయంలో క్రిస్టియన్ ఛాందసవాదం కనబరించిందని కుండబద్దలు కొట్టాడు. అక్కడితో ఆగకుండా ఆమెకిచ్చినట్టు తనకు వేలాది డాలర్లు విరాళాలు ఇస్తే తానూ మదర్ థెరిసాలా సేవ చేస్తానని సెటైర్ వేశాడు. మదర్ నే వదలని కట్జూ అరవింద్ ని వదులుతాడా? కేజ్రీవాల్ బుర్రలో ఏమీ లేదని అనేశాడు ఆ మధ్య!ఇలా ముఖ్యమంత్రి, మానవతా మూర్తి అన్న తేడాలేవీ వుండవు కట్జూకి! ఒక మాజీ జస్టిస్ గా తనదైన స్టైల్లో స్పందించే కట్జూ తాజాగా మాత్రం చిక్కుల్లో పడ్డాడు. ఆయన ఓ రేప్ కేసు విషయంలో సుప్రీమ్ తీర్పునే తప్పుబట్టాడు. సౌమ్య అనే అమ్మాయి అత్యాచారానికి, హత్యకి గురైతే నిందితుడికి మొదట మరణ శిక్ష పడింది. కాని, తరువాత అత్యున్నత న్యాయస్థానం జీవిత ఖైదుగా మార్చేసింది. దీన్ని ఫేస్బుక్ లో పబ్లిగ్గా తప్పుబట్టాడు కట్జూ. కోర్టు సరిగ్గా ఆధారాలు అధ్యయనం చేయలేదని రకరకాలుగా ఆరోపణలు చేశాడు. మొత్తానికి ఇప్పుడు ఆ విమర్శలే కోర్టు దృష్టికి వెళ్లాయి. ఏకంగా సుప్రీమ్ కోర్టు ఈయన వ్యవహారాన్ని సుమోటోగా స్వకరించి న్యాయస్థానానికి రావాలని నోటీస్ ఇచ్చింది. త్వరలోనే కట్జూ కోర్టు మెట్లాక్కాల్సి వుంటుంది! కాకపోతే ఈసారి దర్పంగా జస్టిస్ గా కాదు... కోర్టుకు వివరణ ఇచ్చుకోవాల్సిన వాడిగా వెళ్లాల్సి వస్తుంది! మార్కండేయ కట్జూ ఒక మాజీ న్యాయమూర్తి. ఆయన చెప్పే మాటలు నిజమైతే కావొచ్చు. కాని, చెప్పే పద్ధతి అంటూ కూడా ఒకటి వుంటుంది. మదర్ థెరిసా నుంచీ సుప్రీమ్ కోర్టు వరకూ అందరనీ, అన్నిట్నీ విమర్శిస్తే ఎప్పటికైనా కష్టాలు కొనితెచ్చుకున్నట్టే! అదీ ఘాటైన పదజాలాలు వాడుతూ విజృంభిస్తే మరీ ఈజీగా దొరికిపోయే ఛాన్స్ వుంది! మరి ఈ విషయం తాజా సుప్రీమ్ నోటీసుల తరువాత అన్నా అర్థం చేసుకుంటాడో లేదో... వేచి చూద్దాం!  

ఇళ్లలో, ఆఫీసుల్లో, కార్లలో... 'చల్లటి' కుంపట్లు!

మనిసి బలం, బలహీనత రెండూ ఒక్కటే! అదే తెలివి! కేవలం ఆ తెలివి వల్లే మనిషి ఒకప్పుడు గుహల్లో, చెట్టు తొర్రల్లో వుండే వాడు... ఇప్పుడు బిల్డింగ్ లు, బంగళాల్లో వుంటున్నాడు! కాని, అదే (అతి) తెలివి వల్ల ఒకప్పటి మనుషుల కంటే ఆధునిక మానవుడు చాలా ఎక్కువ అశాంతితో జీవిస్తున్నాడు. అన్నీ వున్నా అన్నిటికీ కటకటలాడుతూ బతుకు కొనసాగిస్తున్నాడు...  మనిషికి ఇప్పుడు కావాల్సినంత సాంకేతికత అందుబాటులోకి వచ్చింది. మరీ ముఖ్యంగా, గత రెండు వందల ఏళ్లలో మానవుడు దేన్ని వదల్లేదు. అంతరిక్షంలోకి రాకెట్లు వేసుకుని వెళ్లిపోయాడు. పాతాళంలోకి డ్రిల్లింగ్ చేస్తూ ఏ ఒక్క ఖనిజమూ, నీటి బొట్టూ వదలటం లేదు! మొత్తం ప్రకృతిని ఉన్మాదం ప్రకోపించి విచ్చలవిడిగా వాడేసుకుంటున్నాడు. అసలు మనిషి ఎంతగా స్వార్థ జీవి అయిపోయాడంటే తాను కూడా ప్రకృతిలో భాగమనే విషయమే మరిచిపోయాడు. ప్రకృతిని, భూమిని ధ్వంసం చేస్తే తానూ విధ్వంసం అవుతానని కూడా గ్రహించటం లేదు...  మనిషి తయారు చేసే భారీ రాకెట్లు , అంతరిక్ష నౌకలు మొదలు చిన్న ప్లాస్టిక్ కవర్ వరకూ ప్రపంచానికి హాని చేయనిది ఏది? అన్నీ కాలుష్య కారకాలే! భూ కాలుష్యం, వాయు కాలుష్యం, జల కాలుష్యం సమస్తం కలుషితమే! వీటన్నిటికి మూలమైన కాలుష్యం ఏదో తెలుసా? మనో కాలుష్యం! మనిషి మనస్సు కలుషితం అయిపోయింది. దాని వల్లే మొత్తం విశ్వం కాలుష్యంతో నింపేస్తున్నాడు...  అది కలుషితం అవుతోంది, ఇది కలుషితం అవుతోంది అంటూ శాస్త్రవేత్తలు , ఉద్యమకారులు ప్రతీ రోజూ హెచ్చరిస్తూనే వుండటం ఈ మధ్య సర్వ సాధారణమైపోయింది. ఒక రకంగా గత కొన్నేళ్లుగా కాలుష్యం కూడా సహజమైపోయింది! మనుషులు ఈ కొత్త విషాదానికి అలవాటు పడిపోతున్నారు. ఎన్ని రోగాలు వచ్చినా స్వార్థాన్ని, సుఖాల్ని మాత్రం వదల్లేకపోతున్నారు. ఇందుకు మరో చక్కటి ఉదాహరణ మనం వాడే ఏసీలు, ఫ్రిడ్జ్ లు! చల్లగా గాలినందించే ఏసీలు ఈ మధ్య ప్రతీవారూ వాడేస్తున్నారు. ఏసీలు లేని వారు వచ్చే వేసవి కల్లా ఏసీ బిగించుకోవాల్సిందేనని తెగ తాపత్రయపడుతున్నారు. కాని, ఏసీ బిగించుకోవటం అంటే... మన మెడకు మనమే ఒక చల్లటి ఉరితాడు బిగించుకోవటం! ఇది కాస్త అతిగా అనిపించినా ప్రపంచ వ్యాప్తంగా ఏసీలు చేస్తున్న దారుణం అంతా ఇంతా కాదు. వాటి వల్ల భూమ్మీద ఉష్ణోగ్రతలు క్రమంగా పెరిగిపోతున్నాయి. అందుక్కారణం ఏసీలు వదిలే హైడ్రోఫ్లోరో కార్బన్స్ ( హెచ్ఎఫ్ సీ ). ఏపీల్లో  వాడే హెచ్ఎఫ్ సీ వల్ల మన రూములు, కార్లలో గాలి చల్లగా మారుతుంది. కాని, బయట వున్న వాతావరణం మొత్తం వేడెక్కుతుంది. ఇది ఎంత గణనీయమైన స్థాయిలో జరుగుతోందంటే, ఇప్పటికిప్పుడు అన్ని దేశాలూ మూకుమ్మడిగా ఏసీల వాడకం సగానికి తగ్గిస్తే... వెంటనే 0.5శాతం ఉష్ణోగ్రత భూమ్మీద తగ్గిపోతుందట! ఏసీల కాలుష్యం వల్ల 0.5శాతం ఉష్ణోగ్రత నమోదవుతోందంటే ఎంత తీవ్రంగా మనం వాతావరణం పాడుచేస్తున్నామో అర్థం చేసుకోవచ్చు....  ఏసీల్లాగే రెఫ్రిజిరేటర్లు కూడా చల్లని మంటే! ఆ మంట మన కింద మనమే రాజేసుకుంటున్నాం. మూసున్న ఫ్రిడ్జ్ డోర్ల వెనుక వున్న వస్తవులు, నీళ్లు, ఐస్ క్రీం ... అన్నీ చల్లగా అవుతాయి గాని బయటి ప్రపంచం మాత్రం వేడెక్కిపోతుంది. ఇక్కడా హైడ్రో క్లోరో కార్బన్సే కారణం. పైగా ఫ్రిడ్జ్ ఇరవై నాలుగ్గంటలూ ఆన్ లో వుండే చల్లటి కుంపటి! నిరంతర కాలుష్య యంత్రం కూడా... ఏసీలు, ఫ్రిడ్జ్ లే కాదు ఆఖరుకి హెయిర్ స్ప్రేలు కూడా గాల్లోకి కాలుష్యం వెదజల్లుతున్నాయట!జుట్టు ఎటు దువ్వితే అటు మలగటానికి, సువాసనకి ఈ హెయిర్ స్ప్రేలు వాడతారు. బాడీకి పర్ఫ్యూమ్ ల జుట్టుకి ఇవన్నమాట. కాని, హెయిర్ స్ప్రేర్ కూడా వాతావరణంలోకి హైడ్రోక్లోరో కార్బన్స్ వదులుతుందట! ఇక అటువంటి విషపూరితమైన హెయిర్ స్ప్రేలు మనిషి వెంట్రుకలకి హానికరం అని ప్రత్యేకంగా చెప్పాలా?  ప్రపంచంలో చల్లటి కుంపట్లు రాజేసి భూమిని వేడెక్కిస్తున్న ఘనత అమెరికా, చైనాలదే! ఆ రెండు దేశాల్లోనే అత్యధిక ఏపీలు, రెఫ్రిజిరేటర్లు వాడుతున్నారట. మన ఇండియా లాంటి దేశాలేం వెనుకబడిపోలేదు. ప్రతీ సంవత్సరం లక్షల సంఖ్యలో కొత్త ఏపీలు, ఫ్రిడ్జ్ లు భగ్గున మండిస్తున్నాయి. ఇప్పటికైనా సరే వీటి వాడకం జనం తగ్గించాలి. శాస్త్రవేత్తలు కూడా హానికరం కాని టెక్నాలజీ కనుక్కునే పనిలో పడాలి. అప్పుడే మనకి ఇళ్లలో, ఆఫీసుల్లో, కార్లలో రాజుకున్న చల్లటి కుంపట్ల నుంచి విముక్తి లభించేది!