పిక్చర్ అభీ బాకీ హై... డిసెంబర్ 30 తరువాతే అసలు సినిమా!
ఇప్పుడు ఎవరి నోట్లో విన్నా నోట్ల గోలే! అప్పుడే అటుఇటుగా పది రోజులు కావొచ్చేస్తోంది. 500, 1000 నోట్లు రద్దైపోయాయి. కొత్త నోట్లు రాలేదు. కాని, సామాన్య జనానికి మాత్రం సరికొత్త కష్టాలు వచ్చిపడ్డాయి. బ్యాంకులు, ఏటీఎంల ముందు లైన్లు కూడా మరీ అంతగా తగ్గినట్టు కనిపించటం లేదు. అడుక్కునే వాడి దగ్గర నుంచీ అంబానీ దాకా అందరూ న్యూస్ లో మాత్రం నిలుస్తున్నారు. చాలా మంది వందలు దొరక్క వేల కష్టాలు పడుతుంటే అంబానీలు, గాలి జనార్దన్ లు మాత్రం హ్యాపీగా గడిపేస్తున్నారని వాదనలు గుప్పుమంటున్నాయి. అసలీ ఆర్దిక అల్లకల్లోలానికి మొత్తానికీ ఎవరు కారణం? మోదీ! మరి మోదీ చేసింది ఆమోదించదగిందేనా?
ప్రపంచపు అత్యంత సంపన్నుల్లో ఒకరైన బిల్ గేట్స్ మోదీ నోట్ల రద్దు నిర్ణయం సూపర్ అన్నాడు. ఆయనే కాదు ఇంకా చాలా మంది భేష్ అంటున్నారు. అంతకంటే ఎక్కువ మంది పెద్ద నోట్ల రద్దు పెద్ద పొరపాటు అంటున్నారు. సామాన్యులు కష్టాలు పడుతుంటే నల్లధనం వున్న అసలైన నల్ల మారాజులు సేఫ్ గా వున్నారని కడుపు చించుకుంటున్నారు. నిజంగా ఇప్పుడు మూమూలు జనం పడుతున్న ఇబ్బందులేంటి? ఓ సారి చూద్దామా...
మన దేశంలో మరీ పేద వార్నీ తీసుకుంటే వాళ్లూ ఎప్పుడూ బ్యాంకులు, ఏటీఎంల జోలికి వెళ్లింది లేదు. వాళ్ల రోజు వారీ ఖర్చు ఒక వందని మించటం కూడా గగనమే. అందువల్ల ఈ కఠిక దారిద్ర్యంలో వున్న వారికి మోదీ నిర్ణయం ఎఫెక్ట్ విపరీతంగా వుండదనే చెప్పాలి. వున్నా వాళ్లొచ్చి బ్యాంకులు, ఏటీఎంల వద్ద క్యూ లైన్లలో అయితే నిలబడరు. నిలబడే ఛాన్స్ లేదు. వాళ్ల ఇబ్బంది తగ్గుముఖం పట్టాలంటే ఆ పేదలు ఆధారపడే మధ్య తరగతి వారు టెన్షన్ ఫ్రీ అవ్వాలి. సమస్యంతా వీరికే వచ్చింది. 500, 1000 నోట్లు నెలలో పదే పదే ఉపయోగించేది, ఇప్పుడు ఉపయోగించలేకపోతున్నదీ మిడిల్ క్లాసే. నిత్యావసరాలు కొనుక్కోవటానికి వెళ్లటం మొదలు పెళ్లో, పేరంటమో ఏది అయినా నోట్లు చకచకా బయటకు తీస్తారు మధ్య తరగతి జనం. అందుకోసం ఏటీఎంల వద్ద ప్రత్యక్షమైపోతారు. కాని, ఇప్పుడు మోదీ నిర్ణయం వల్ల ఏటీఎంలు, బ్యాంక్ ల వద్ద క్యూ లైన్లలో గంటల కొద్దీ సమయం నిలబడ్డా రెండు వేలు, నాలుగు వేలకు మించి రావటం లేదు. అందుకే, ఢిల్లీలో కేజ్రీవాల్, మమత బెనర్జీ మొదలు లివింగ్ రూంలో న్యూస్ ఛానల్స్ లోని రిపోర్టర్స్ వరకూ అందరూ హడావిడి చేసేస్తున్నారు. మోదీ తుగ్లక్ అనేదాకా వెళ్లిపోయారు!
మోదీ నిజంగా తుగ్లక్ లాగానే ప్రవర్తిస్తున్నాడా? బహుశా కాదనుకుంటా! ఎందుకంటే, మోదీని విమర్శిస్తున్న వాళ్లు చాలా వరకూ ఆయనకు ఎప్పుడూ బద్ధ శత్రువులుగా వుండేవారే. 2002 గోద్రా అల్లర్ల నుంచి మొదలు నమో పై ఈ వర్గానికి కావాల్సినంత కసి. వారు ఆయన తప్పు చేసినప్పుడు తిడతారు. ఒప్పు చేస్తే మరింత దారుణంగా దాడి చేస్తారు. అది వారి బిజినెస్. ఇక మోదీ వ్యతిరేక బ్యాచ్ తో ఈ నోట్ల రద్దు సమయంలో మరి కొంత మంది కూడా కలిశారు. వాళ్లు భారీగా పెద్ద నోట్లు పోగేసుకున్న మిడిల్ క్లాస్, హయ్యర్ మిడిల్ క్లాస్ లేదంటే రిచ్ క్లాస్ జనాలు. వీళ్ల దగ్గర వున్నది బ్లాక్ మనీ కావొచ్చు, కాకపోవచ్చు. కాని, తమ వద్ద వున్న డబ్బులు వాడలేకపోతున్నాం, క్యూ లైన్లలో నిలబడాల్సి వస్తోంది, రోజు కేవలం 2వేలు, 4వేలు మాత్రమే చేతికొస్తున్నాయి లాంటి ఫ్రస్ట్రేషన్స్ వీళ్ల చేత మోదీని తిట్టిస్తున్నాయి. నిజంగా సామాన్య జనం డబ్బుకి కటకటలాడుతున్నారా అంటే కాదనే చెప్పాలి. ఇంతకు ముందులా ఇప్పుడు డబ్బులు గలగలలాడటం లేదంటే. ఫలితంగా రోడ్డు పై పానీ పూరీ అమ్మే వాడు మొదలు బంగారం షో రూముల్లో వజ్రాల అమ్మకునే వాడిదాకా అందరూ డల్ అయిపోయారు. కాని, మోదీని అభిమానించే ఆయన భక్తులు మొదలు కొంత మంది పెద్ద పెద్ద ఆర్దిక వేత్తల దాకా అందరూ చెబుతోన్నది ఒక్కటే. ఈ ఒత్తిడి ఎల్లకాలం వుండేది కాదు. మెల్లమెల్లగా సడలిపోతుంది. క్రమంగా తగ్గుతూ వచ్చి డిసెంబర్ 30తో అంతం అవుతుంది. అమ్మో అన్ని రోజులా అనిపించవచ్చు కాని కేంద్రం తీసుకుంటోన్న చర్యలతో భారీగా ఖర్చు చేయని మధ్యతరగతి మరో పది రోజుల్లో గాడిలో పడిపోతారు. పెళ్లిల్లు , ఫంక్షన్స్ పెట్టుకున్న వారు ప్రెషర్ భరించాల్సి వచ్చినా అదీ 2016తోనే పూర్తైపోతుంది. కొత్త సంవత్సరం సరికొత్తగా వస్తుంది. నల్లధనం భారీ ఎత్తున మాయమైపోయి నిజమైన ఆర్దిక స్వచ్ఛ్ భారత్ ఆవిష్కరణ జరుగుతుంది. అదెలా తెలియాలంటే ఈ అంకెలు అర్థం చేసుకోవాల్సిందే...
మోదీ ఎందుకని 500, 1000 నోట్లని మాత్రమే రద్దు చేశాడు? అదీ అమాంతంగా? కారణం ఇదే... మన దేశంలో మొత్తం చెలామణిలో వున్న సొమ్ము 17.17లక్షల కోట్లు! అందులో పెద్ద నో్ట్ల వాటా 14.61లక్షల కోట్లు! ఇందులో నవంబర్ 8న రాత్రి 8.30కి మోదీ రద్దు ప్రకటన చేసేప్పటికి బ్యాంకుల వద్ద వున్నది 9.5లక్షల కోట్లు. అంటే ఈ తొమ్మిదిన్నర లక్షల కోట్లు అధికారికం అన్నమాట. మిగిలిన 5.11లక్షల కోట్లు రకరకాలుగా బ్లాక్ డాగ్స్ బ్లాక్ చేసేసినవి! వీటి వల్లే మార్కెట్లో ప్రతీ రేటు పెరిగిపోతూ వస్తోంది. ఇన్ ప్లేషన్ అన్నా, ద్రవ్యోల్బణం అన్నా ఇదే. ధరల పెరుగుదల. కొందరి దగ్గర ఇబ్బడి ముబ్బడిగా దొంగ డబ్బు వుండటంతో వాళ్లు ఇష్టానుసారం కొనుగోళ్లు చేస్తారు. వాళ్ల కోసం సినిమా టికెట్ల రేట్లు మొదలు భూముల రేట్ల దాకా అన్నీ పెరిగిపోతాయి. మరి కేవలం తెల్ల సొమ్ము మాత్రమే వున్న సామాన్యుడి పరిస్థితి ఏంటి? పెరిగిపోతోన్న ధరల్ని వింటూ ఏమీ కొనలేక తెల్ల ముఖం వేయటమే. కాని, ఇప్పుడు మోదీ ఆర్దిక సర్జికల్ స్ట్రైక్స్ లో 5.11లక్షల పరుపుల కింద నుంచి , కప్ బోర్ట్ ల నుంచీ, ఫామ్ హౌజ్ ల నుంచీ, ఆఖరుకు కార్ డిక్కీల నుంచీ బయటకు వస్తాయి! రావాలి! డిసెంబర్ 30 దాని కోసమే ఇచ్చిన గడువు! రాకపోతే నల్ల నక్కల దగ్గర వున్న పాత నోట్లు మూతులు తుడుచుకోటానికి కూడా పనికి రావు. మరి అలా డిసెంబర్ 30నాటికి కూడా అలా బయటకి రాని నల్లధనం సంగతేంటి? ఇటు జనానికి, అటు గవర్నమెంట్ కి కాకుండా పోతుందా? కానే కాదు...
మోదీ పెద్ద నోట్ల రద్దు నిర్ణయం అసలు లాభం 2017 జనవరి ఒకటి నుంచీ మొదలవుతుంది. బ్లాక్ మనీగా వున్న 5.11లక్షల కోట్లలో మహా అయితే 1 లేదా 1.5లక్షల కోట్లు మాత్రమే ఇప్పుడు వైట్ అయ్యే ఛాన్స్ వుంది. మిగతాదంతా దొరల్లా తిరుగుతున్న నల్లధనం దొంగలు తిట్టుకుంటూ, శాపనార్థాలు పెట్టుకుంటూ పారేయాల్సిందే. లేదంటే పాతరేయాల్సిందే. అలా మార్కెట్ నుంచి మాయం అయిన దాదాపు 4లక్షల కోట్లు వృథా మాత్రం కావు. నేరుగా గవర్నెమంట్ ఖాతాలో కొత్త నోట్ల రూపంలో చేరిపోతాయి. ఇదీ అసలు లాభం! ఇంత భారీగా సొమ్ము ప్రభుత్వ ఖాజానాకి చేరాలంటే 5వందలు, వెయ్యి నోట్ల రద్దు తప్ప మరే మార్గం లేదు. అందుకే, మోదీ సాహసం చేసి నల్ల త్రాచుల తలపై కొట్టి వాట్ని పుట్టల్లోంచి బయటకు లాగాడు. ఇప్పుడు ఆ నల్లత్రాచులే ఢిల్లీ నుంచీ గల్లీ దాకా విషం చిమ్ముతున్నాయి. డిసెంబర్ 30వరకూ చిమ్ముతూనే వుంటాయి కూడా!
బ్లాక్ మనీగాళ్లతో పాటూ... మోదీ పాకిస్తాన్ కు, ఎన్జీవోలకు కూడా మైండ్ బ్లాంక్ చేశాడు. అదెలా అంటే ఈ రద్దు నిర్ణయంతో దేశంలోని పాకిస్తానీ ఏజెంట్ల వద్ద మూలుగుతున్న వందల కోట్లు టిష్యు పేపర్స్ అయిపోయాయి. ఆల్రెడీ కాశ్మీర్ లో రాళ్లు రువ్వే ఉద్యమకారులు లేక కర్ఫ్యూ పోయి సాధారణ పరిస్థితులు నెలకొనటం మనం గమనించాలి. ఎలా పాకిస్తానీ పెద్ద నోట్లు మన దేశంలో పెద్ద సమస్యగా మారాయో చాలా మందికి తెలియదు. అసలు పాకిస్తాన్ ఉగ్రవాదులతో కన్నా దొంగ నోట్లతో ఎక్కువ భీభత్సం సృష్టిస్తోంది గత కొన్నేళ్లుగా. ఇప్పుడు దానికి నరేంద్రుడు చెక్ పెట్టినట్టే! అంతే కాదు, ఫారిన్ ఫండ్స్ తో నడుస్తూ ఎన్జీవోలుగా చెప్పుకుంటూ దేశ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్న వేలాది సంస్థలకు కూడా నోట్ల రద్దు నోట్లో మాట లేకుండా చేసేసింది. చీటికీ మాటికీ ప్రభుత్వంపై కోర్టకు వెళ్లే స్చచ్ఛంద సంస్థలు మొదలు మత మార్పిళ్లు, జేఎన్ యూలో ర్యాలీలకు కారణం అయ్యి... ఎన్నో కుట్రలు చేస్తోన్న దుకాణాలన్నీ ఇప్పుడు బంద్ అవుతాయి. కనీసం తగ్గు ముఖం పట్టనన్నా పడతాయి! అంతే కాదు, ఎక్కడో అడవుల్లో వేల కోట్లు దాచేసిన అన్నలు కూడా ఇప్పుడు అయోమయంగా దిక్కులు చూస్తున్నారు. వారి వద్ద వున్న 7వేల కోట్లు విప్లవానికి ఎందుకు పనికి రానీ పేపర్ ముక్కలు అయిపోయాయట! ఇక పైన వారి గన్నులు పేలటం ముందంతా తేలిక కాకపోవచ్చు! ఇలా నల్లధనం మొదలు నల్ల చీకటి ప్రపంచం అరాచకుల వరకూ అందరికీ నానా విధాలుగా చెక్ పెట్టే మోదీ బ్రహ్మాస్త్రామే నోట్ల రద్దు! కాని, ఇందులో జరిగిన కొన్ని లోటుపాట్లే ఇప్పుడే అవకాశవాద రాజకీయ పార్టీలకు అస్త్రాలుగా మారుతున్నాయి....
మోదీ ఆర్దిక సర్జికల్ స్ట్రైక్స్ లో మొదటి తప్పిదం... పెద్ద నోట్లు రద్దు చేయదలుచుకున్నప్పుడు వంద నోట్లు తగినంతగా ఎందుకు అందుబాటులో వుంచుకోలేదు? అలా చేస్తే నల్ల జనాలకు మ్యాటర్ లీకైపోతుంది అనిపిస్తే... కనీసం కొత్త 500, 1000నోట్లు భారీగా ఎందుకు ముద్రించి పెట్టుకోలేదు? ముద్రణకు, తరలింపుకు ఎందుకు తగిన ఏర్పాట్లు చేసుకోలేదు? ఇవన్నిటికంటే అయోమయం కలిగించే విషయం... నల్లధనం పెద్ద నోట్ల వల్ల విజృంభిస్తుందని తెలిసినప్పుడు ఏకంగా 2వేల రూపాయల నోటు ఎందుకు తీసుకొచ్చినట్టు? దాని వల్ల ముందు ముందు నల్లధనం పోగేయటం మరింత ఈజీ అవుతుంది కదా? ఇక టెక్నికల్ గా కొత్త నోట్లు ఏటీఎంల లోంచి రాకపోవటం మరింత ఇబ్బంది పెడుతోంది సామాన్యుడ్ని. కనీసం ఇలాంటి టెక్నికల్ ఇష్యూస్ కూడా ముందుగా ఊహించలేకపోయారు అంటే... ఈ రద్దు వ్యవహారం రహస్యంగా , ఆదరాబాదరాగా చేశారనిపిస్తోంది. అందుకే, ఉద్దేశ్యం మంచిదైనా అమలు అల్లకల్లోలం అయింది! ఇప్పటికైనా మోదీ కామన్ మ్యాన్ కష్టాలు సాధ్యమైనంత త్వరగా తీర్చేస్తే... అప్పుడు దొరలతో, దొంగలతో, దొరల్లా చెలామణి అయ్యే దొంగలతో ఆయన హ్యాపీగా గేమ్ అడుకోవచ్చు. అందుకోసం... ఆల్ ది బెస్ట్ మోదీ జీ!