RSS... దసరా నాడు ప్రారంభమైన దేశభక్తుల ఫ్యాక్టరీ!
posted on Oct 10, 2016 @ 3:37PM
అరెస్సెస్ ... అంటే రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్!ఈ పేరు వినగానే ముందు ఖాకీ నిక్కర్, తెల్ల చొక్కా, చేతిలో కర్రా గుర్తుకు వస్తాయి. కాని, ఆ వెంటనే కాంగ్రెస్, ఎంఐఎం, కమ్యూనిస్టులు, ఇతర సెక్యులర్ పార్టీలు చేసే ఆరోపణలు గుర్తుకు వస్తాయి. దేశంలో ఏ చిన్న మతకలహం జరిగినా ఆరెస్సెస్ కారణం అనే రెడీమేడ్ స్టేట్మెంట్ వాళ్ల దగ్గర వుంటుంది! అసలు తమని తాము సెక్యులర్ నాయకులమని చెప్పుకునే కొందరైతే ప్రతీ దానికి అరెస్సెస్సే మూలమంటారు. ఆ మధ్య ముంబైపై పాకీ ఉగ్రవాదులు ఘోరమైన దాడి చేస్తే కాంగ్రెస్ నాయకుడు దిగ్విజయ్ సింగ్ ఆరెస్సెస్ చేసిందని అన్నాడు! అంతలా ఆరెస్సెస్ పై అవాకులు, చెవాకులు పేలుతుంటారు మన వాళ్లు! కాని, అసలింతకీ ఆరెస్సెస్ అంటే ఏంటి?
ఆరెస్సెస్ గురించి తెలుసుకోటానికి దసర సమయమే చాలా సరైంది! ఎందుకంటే, ఇప్పటికి 92ఏళ్ల కింద సరిగ్గా విజయదశమి నాడే కేశవ్ బలీరామ్ హెడ్గేవార్ ఆరెస్సెస్ ను స్థాపించారు. విజయదశమి నాటి ఆ బీజం నిజంగా విజయవంతమై ఇవాళ్ల ప్రపంచపు అతి పెద్ద స్వచ్ఛంద సంస్థగా రూపుదాల్చింది! చాలా మందికి ఆరెస్సెస్ అంటే మత సంస్థ అన్న ఫీలింగ్ వుంటుంది. కాని, అది నిజం కాదు. హిందూత్వ వినిపించే జనాల సమూహమే అయినప్పటికీ ఆరెస్సెస్ ప్రదానంగా స్వచ్ఛంద సంస్థ. దేశ వ్యాప్తంగా లక్షల మంది స్వయం సేవక్ లు వున్న ఎన్జీవో. ఎక్కడ వరదలొచ్చినా, ఎక్కడ భూకంపం సంభవించినా ఆరెస్సెస్ వాళ్లే ముందుంటారు. అయితే, మరో వైపు ఆరెస్సెస్ మత కలహాలకు కారణమని కూడా పదే పదే వినిపిస్తూ వుంటుంది. కాని, ఇంతవరకూ ఏనాడూ ఆ విషయం నిరూపించబడలేదు...
ఆరెస్సెస్ అధికారికంగా తనని తాను రాజకీయ సంస్థ కాదనే చెప్పుకుంటుంది. అయినా కూడా నాగపూర్ లోని ఆ సంస్థ హెడ్ ఆపీస్ కి ఢిల్లీ పీఠం పై తిరుగులేని ఆధిపత్యం వుందన్నది బహిరంగ రహస్యం. ఆరెస్సెస్ ప్రస్తుత సర్ సంఘ్ చాలక్ మోహన్ భాగవత్ ఫోన్ చేసి పిలిస్తే ప్రధాని మోదీ కూడా వెంటనే ఆయన ముందు వాలిపోతారు. ఇది నిజమే. అయితే అంతకంటే నిజం ఏంటంటే ఏవో కొన్ని సలహాలు, సూచనలు వరకూ మాత్రమే ఆరెస్సెస్ పరిమితం అవుతూ వుంటుంది. అంతే కాని, ఒకప్పటి వాజ్ పేయ్, అద్వానీలు, ఇప్పటి మోదీ తమ సంఘం మనుషులు కాబట్టి నానా యాగీ చేయాలనుకోదు. మరీ ముఖ్యంగా, గత రెండున్నర ఏళ్ల నుంచీ నరేంద్ర మోదీ పీఎం అయ్యాక ఆయన పనుల్లో, నిర్ణయాల్లో ఆరెస్సెస్ పెద్దగా జోక్యం చేసుకోకపోవటం అందరికీ తెలిసిందే. ప్రతి పక్ష నేతలు రొటీన్ గా ఆరెస్సెస్ ను టార్గెట్ చేయటం పెద్దగా పట్టించుకోవాల్సిన విషయం కాదు...
ఒక దేశానికి ప్రధానిని సైతం అందించగలగటం ఒక సంస్థకు మామూలు విషయం కాదు. కాని,ఆరెస్సెస్ 90ఏళ్ల సుదీర్థ ప్రయాణంలో ఆ విజయం సాధించింది. స్వాతంత్ర్యానికి ముందే హిందువుల కోసం, హిందూత్వ భావజాలం కోసం అది ఏర్పడ్డప్పటికీ ఏనాడూ రాజకీయం, అధికారం అన్నవాటికి దగ్గర వెళ్లలేదు. కనీసం ఆరాటపడటం కూడా జరగలేదు. 1981 తరువాత బీజేపీ పూర్తిస్థాయి రాజకీయ పార్టీగా అస్థిత్వంలోకి వచ్చాకే ఆరెస్సెస్ కు రాజకీయ అధికారం కొద్దికొద్దిగా చేరువవుతూ వచ్చింది. అయినప్పటికీ దేశంలోని ఎన్ని రాష్ట్రాల్లో కాషాయ దళం అధికారంలో వున్నా ఏనాడూ ఆరెస్సెస్ మైనార్టీల్ని వేధించటానికి దాన్ని ఉపయోగించుకోలేదు. ఆరోపణలు బోలెడు వున్నా కోర్టుల్లో మాత్రం ఎప్పుడూ, ఎవ్వరూ నిరూపించలేకపోయారు. గాంధీ హత్య మొదలు గోద్రా అల్లర్ల వరకూ ప్రతీ దానికి ఆరెస్సెస్ ను ముందుకు తీసుకురావటం మన దేశంలో పరిపాటినే. కాని, తాజాగా సుప్రీమ్ కోర్టు రాహుల్ గాంధీ చేత ఆరెస్సెస్ కు క్షమాపణ చెప్పించటం వరకూ ఏనాడూ చట్టబద్ధంగా ఈ హిందూ సంస్థని ఎవ్వరూ డికొట్టలేకపోయారు. అయితే, ఆరెస్సెస్ అనుబంధ సంస్థలు వీహెచ్ పీ, బజరంగ్ దళ్, ఇంకా బోలెడు పదే పదే కేసుల్లో ఇరుక్కుంటూ వస్తున్నాయి. వాటికి సంబంధించిన కొందరు కార్యకర్తలు శిక్షలు కూడా అనుభవిస్తున్నారు...
లక్షల మందితో నడిచే ఒక సంస్థ ఆరోపణలు ఎదుర్కోవటం, కేసుల్లో ఇరుక్కోవటం ఆశ్చర్యకరమేం కాదు. పైగా యావత్ రాజకీయ వ్యవస్థ, మేధావులు, మీడియా వంటి అన్నీ అంశాలు వ్యతిరేకంగా వున్నప్పుడు ఇబ్బందులు రావటం మరింత సహజం. అయినా కూడా వందేళ్ల దిశగా పరుగులు పెడుతూ కూడా ఏమాత్రం విచ్ఛిన్నం కాకపోవటం ఆరెస్సెస్ ఘనత. దానిపై మనకు ఎలాంటి అభిప్రాయం వున్నా ఆ సక్సెస్ సీక్రెట్ మాత్రం గుర్తించాల్సిందే. వాళ్ల క్రమశిక్షణని, అంకితభావాన్ని అభినందించాల్సిందే!
దసరా దసరాకు మళ్లీ మళ్లీ భరతమాత సేవకు అంకితమయ్యే ఆరెస్సెస్ స్వయం సేవక్ లు మిగతా ఎలాంటి ప్రేరణా ఇవ్వకున్నా... దేశభక్తి అనే తపన మాత్రం కలిగిస్తారు. అది అందరూ నేర్చుకోవాలి!