ఇంటర్నెట్ లో షాపింగ్... ఇంటికే పార్సిల్... ఇదో కొత్త అడిక్షన్!
posted on Oct 7, 2016 @ 2:45PM
చాలా దేశాల్లో అమ్మే సత్తా వ్యాపరస్థులకి వుంటుంది. కాని, కొనే తాహతూ, ఓపిక జనానికి వుండదు. అందుకే, దేశదేశాల్లో పెద్ద పెద్ద బిజినెస్ ఔట్ లెట్స్ బిచానా ఎత్తేస్తుంటాయి. కాని, ఇండియాలో పరిస్థితి డిఫరెంట్. ఇక్కడ లాసొచ్చి దుకాణాలు మూసుకునే బిజినెస్ మెన్ చాలా మందే వున్నా కోట్లు కొల్లగొడుతున్న తెలివైన కార్పోరేట్స్ కూడా వున్నారు. అసలు మన దేశంలో అమ్మేవాడు అమ్మాలేగాని ఏదైనా కొనటానికి జనం రేడీ.విమానం టిక్కెట్లు కూడా ఓ మంచి ఆకర్షణీయమైన ఆఫర్ ప్రకటించి మార్కెట్లోకి వదిలితే... మన వాళ్లు బస్సు టిక్కెట్లలా కొనేస్తారు! ఇక స్మార్ట్ ఫోన్ల లాంటివైతే పల్లికాయలు కొన్నంత విరివిగా పర్చేస్ చేసేస్తారు! షాపింగ్ పై మనోళ్ల వ్యామోహం అలాంటిది!
ఆహార పదార్థాలు ఏ ఆఫర్ ప్రకటించాల్సిన అవసరం లేకుండానే అమ్ముడుపోతాయి. సమస్యల్లా సుఖాలు, సౌఖ్యాలు, సరసాలకు సంబంధించిన లగ్జరీ, ఫ్యాన్సీ గూడ్స్ తోనే! అందుకే ఆయా వస్తువుల అమ్మకం దార్లు రోజుకో ప్రకటనతో తో ఆకట్టుకుంటుంటారు. నెలకో ప్రకటనతో మైమరిపిస్తుంటారు! ఉదాహరణకి చీరల షోరూం వాళ్లనే తీసుకోండి... ఎవరో ఒక కొత్త హీరోయిన్ని తీసుకొచ్చి రిబ్బన్ కట్టింగ్ చేయించింది మొదలు కస్టమర్స్ జేబులకి బాగానే కటింగ్ పెడుతుంటారు. ఆషాఢం ఆఫర్ అంటారు. దాని వెంటనే శ్రావణం సేల్ అంటారు. ఇలా పన్నెండు నెలలూ నిజం చెప్పో, అబద్ధం చెప్పో అయినకాడికి అమ్మేస్తుంటారు! ఉట్టి చీరలే కాదు దేశం మొత్తంలో బోలెడు వస్తువులు ఈ రకంగానే కంపెనీలు అమ్మేస్తున్నాయి. సబ్బులు, షాంపులు, పర్ఫ్యూమ్ లు వంటి వాటి సంగతైతే సరే సరి!
టీవీలు, పేపర్లు, ఇంటర్నెట్ లో వచ్చే వేలాది యాడ్స్ ని ఒక్కసారి మనసు పెట్టి చూడండి... కట్ డ్రాయర్లు మొదలు కాస్ట్ లీ కార్ల వరకూ అన్నీ దొరికేస్తున్నాయి. బంగారంతో సహా అన్నిట్నీ... మా ప్రాడక్ట్ బంగారం అంటూనే అమ్మేస్తున్నారు జనానికి. ఇక ఇప్పుడు మరో కొత్త మార్కెట్ కూడా కొనుగోలుదారులకి వెర్రిక్కిస్తోంది! అదే ఆన్ లైన్ షాపింగ్...
కాస్త వయస్సు పెరిగిన వాళ్లు కాదుగాని... యూత్ అండ్ టీనేజర్స్ ఎవరి నోట విన్నా ఇప్పుడు ఫ్లిప్ కార్ట్, అమేజాన్ లాంటి పదాలే వినిపిస్తున్నాయి. ఇలాంటి వెబ్ సైట్స్ కూర్చున్న దగ్గర జనానికి వస్తువుల వర్షం కురిపిస్తున్నాయి. వేలాది ప్రాడక్ట్స్, పైగా ఎక్కడికో వెళ్లాల్సిన పని లేదు, ఇంటిలోకే, ఇంటర్నెట్ లోకే వచ్చేస్తాయి! ఇంకేం కావాలి? హాయిగా ఏసీలో కూర్చుని కావాల్సిన ఐటెం ఫోటోలు, ధరలు అన్నీ చూసుకుని కొనుక్కోవచ్చు! అందుకే, భారతీయులు ఇప్పుడు ఆన్ లైన్ సాపింగ్ కు ఎగబడుతున్నారు...
కొన్నాళ్ల కింది వరకూ ఆన్ లైన్ షాపింగ్ అంటే సరైన వస్తువు డెలివరీ అవుతుందో లేదో, రీప్లేస్మెంట్ సమస్యలు వుంటాయి కదా అని భయపడేవారు. కాని, రాను రాను ఆన్ లైన్ సేల్స్ సై నమ్మకం పెరుగుతోంది. అంతే కాదు, ట్రాఫిక్ లో వెళ్లడాలు, షోరూముల్లో గంటల తరబడి సమయం వృథా చేసుకోడాలు, రేట్ల విషయంలో బేరాలు ఆడటాలు... ఇలాంటివేవీ ఆన్ లైన్ షాపింగ్ లో వుండవు. అందుకే, రోజు రోజుకు మరింత ఎక్కువ మంది ఇంటర్నెట్ షాపింగ్ దిశగా వచ్చేస్తున్నారు.
భారతీయులు సంవత్సరం మొత్తం చేసే షాపింగ్ ఒక ఎత్తైతే దసరా టైంలో సృష్టించే కొనుగోలు సునామీ మరో ఎత్తు! బట్టలు, ఎలక్ట్రానిక్ ఉపకరణాలు, బంగారం, వాహనాలు... ఇలా వేట్నీ వదిలిపెట్టరు. మరి ఇంత మంచి బంగారు బాతు లాంటి దసరా సీజన్ని ఆన్ లైన్ రీటైల్ కంపెనీలు ఎలా వదిలిపెడతాయి? రకరకాల పేర్లతో రంగంలోకి దిగాయి! బిగ్ బిలియన్ డేస్ అని ఒక సైట్ వాళ్లు హడావిడి చేస్తుంటే, గ్రేట్ ఇండియన్ సేల్ అంటూ మరో సంస్థ కలకలం సృష్టిస్తోంది! పైగా ఏదో వందల సంఖ్యలో , వేల సంఖ్యలో వస్తువులు అమ్ముకుని సంతృప్తుని పడటం లేదు. కంకణం కట్టుకుని మిలియన్ల కొద్దీ యూనిట్లు అమ్మేస్తున్నాయి ఈ ఆన్ లైన్ కంపెనీలు. ముఖ్యంగా, స్మార్ట్ ఫోన్స్, టీవీల వంటివి ఆకు కూరలు, ఆలుగడ్డల్లా అమ్మేస్తున్నాయి. ఏకంగా కొన్ని గంటల వ్యవధిలో వందల కోట్ల వ్యాపారం చేసేస్తున్నాయి!
ఈ మొత్తం ఇండియన్ ఆన్ లైన్ సేల్స్ అద్భుతం... నిజంగా ఒక ఆశ్చర్యమే! అయితే, ఇది ఒకవైపు మన భారతీయ మార్కెట్ కు వున్న అపారమైన దమ్మును చూపిస్తుంటే... మరో వైపు జనం అవసరం వున్నా లేకున్నా మార్కెట్ మాయలో పడి అవసరం లేని ఉత్పత్తుల్ని కూడా కొనేస్తున్న వైనాన్ని కళ్లకు కడుతుంది! మరీ ముఖ్యంగా, ఇప్పటి ఆల్ న్యూ జనరేషన్ కి ఆన్ లైన్ షాపింగ్... డ్రింకింగ్, స్మోకింగ్, పార్టీయింగ్ లా మరో పోష్ అడిక్షన్ అయిపోయింది!