హోలీ డిప్ మాత్రమే కాదు... హెల్తీ డిప్ కూడా!
posted on Sep 28, 2016 @ 2:26PM
రాముడి వంశంలో భగీరథుడు అనే రాజు. ఆయన తన పూర్వీకులకు పుణ్యగతులు వచ్చేందు కోసం కఠోర తపస్సు చేశాడు! తరువాత ఏమైంది? గంగ భూమ్మీదకి వచ్చింది. ఆ గంగా ప్రవాహం చనిపోయిన వారి బూడిద కుప్పల మీద నుంచి ప్రవహించే సరికి వాళ్లకి ఉర్ద్వలోకాలు ప్రాప్తించాయి! ఈ కథ మనందరికీ తెలిసిందే. దీని కారణంగానే భగీరథ ప్రయత్నం అనే మాట కూడా వచ్చింది!
నిజంగా గంగ పరమ పావనమైందా? బతికున్న వారి, చనిపోయిన వారి పాపాలు అది కడిగేస్తుందా? ఇవన్నీ విశ్వాసాల మీద ఆధారపడ్డవి! కాని, గంగ మిగతా నదుల్లాంటి మామూలు నది మాత్రం కాదన్నది ఇప్పుడు అధికారికం కాబోతోంది! అదెలా అంటారా?
గంగా నది హిందువులకి యుగయుగాలుగా పవిత్రమైంది. అయితే, ఆధునిక కాలంలో అందర్నీ పావనం చేసే గంగకే అపవిత్రత అంటుకుంటోంది. కాలుష్యం కారణంగా గంగ విషపూరితం అవుతోంది. మోదీ సర్కార్ వచ్చాక జలవనరుల శాఖా మంత్రి ఉమా భారతి అత్యంత ప్రతిష్టాత్మకంగా గంగను శుద్ధి చేసే కార్యక్రమం చేపట్టారు! దాని పలితాలు ఎలా వున్నాయో మనకు తెలియదుగాని గంగ మాత్రం గొప్పతనం మరోసారి ఋజువు చేసుకుంది!
గంగా నది మిగతా నదుల్లాంటి మామూలు జలాశయం కాదంటున్నారు ఇన్ స్టిట్యూట్ ఆఫ్ మైక్రోబియల్ టెకాల్నజీ ( ఇంటెక్ ) వారు. ఛంఢీఘడ్ లో వున్న ఈ ప్రభుత్వ రంగ సంస్థ గంగ నీటిపై అధ్యాయనం చేసింది. ఇంటెక్ శాస్త్రవేత్తలు నైరుతీ ఋతు పవనాల ముందు తరువాత గంగా నదిలోని నీటి శ్యాంపుల్స్ సేకరించారు. ఒక్క చోట కాకుండా అనేక చోట్ల గంగలోని నీటిని సేకరించారు. వాటిని ల్యాబ్ లో చెక్ చేస్తే ఆసక్తికర సత్యాలు వెలుగు చూశాయి!
గంగా నది నీటిలో హిమాలయాల నుంచి కిందకు వస్తున్నప్పుడు శాస్త్రవేత్తలకు కొన్ని వైరస్ లు కనిపించాయి. ఇవ్వి మనిషికి మేలు చేసేవి. రకరకాల రోగాలు తెచ్చిపెట్టే బ్యాక్టీరియాని ఈ గంగా నీటిలోని వైరస్ లు హరించి వేస్తాయి! తద్వారా గంగా నది జలం ఎన్ని రోజులైనా పాడవకుండా వుంటుంది! అంతే కాదు, తాగిన వారికి, స్నానం చేసిన వారికి ఎంతో మేలు చేస్తుంది!
క్షయ, టైఫాయిడ్, న్యూమోనియా, క్లోరియా , డీసెంట్రీ, డయేరియా, మెనింజైటిస్ వ్యాధులకు విరుగుడుగా గంగా జలాల్ని వినియోగించవచ్చన్నారు ఇంటెక్ నిపుణులు. ఈ శక్తి గంగా ప్రవాహానికి వుండటానికి కారణం అందులోని ఉపయోగకరమైన వైరస్ లే అంటున్నారు వారు. ముందు ముందు యమునా, నర్మదా నది నీళ్లతో గంగా నది నీళ్లను పోల్చి చూసి మరిన్ని పరిశోధనలు చేస్తామని కూడా చెబుతన్నారు. ఈ పరిశోధనల ఫైనల్ రిపోర్ట్ ఈ సంవత్సరం డిసెంబర్ లోనే ప్రభుత్వం ముందుకు రానుంది!
గంగలో మునిగితే పుణ్యం వస్తుందో లేదో తెలియదుగాని ఆరోగ్యం వస్తుంది. ఇది ఇప్పుడు తాజా ప్రయత్నాలతో నిరూపితమైంది. అంతే కాదు, మన పెద్దలు గంగలో స్నానం తప్పకుండా చేయమని చెప్పింది కూడా ఊరికే కాదని అర్థమవుతోంది! కొందరు ఆధునికులు ప్రచారం చేసినట్టు గంగలో మునగటం అంటే... మన తెలివితేటల్ని గంగపాలు చేయటమేం కాదు! గంగా స్నానం మూఢ నమ్మకం కాదు! అసలది కేవలం హోలీ డిప్ మాత్రమే కాదు... హెల్తీ డిప్ కూడా!