ఇక అందరి కళ్ళు చంద్రుడి పైనే
posted on Jun 3, 2014 7:52AM
కేంద్రంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం, తెలంగాణాలో కేసీఆర్ ప్రభుత్వం ఏర్పాటయిపోవడంతో ఇక అందరి దృష్టి చంద్రబాబుపై పడింది. జూన్ 8న గుంటూరు సమీపంలో గల నాగార్జున విశ్వవిద్యాలయం వద్ద ఆయన ప్రమాణ స్వీకారానికి అన్ని ఏర్పాట్లు చచకా జరిగిపోతున్నాయి. నిన్న తెలంగాణా ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేప్పట్టిన కేసీఆర్ ని, వైకాపా అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డిని, ఇతర పార్టీల నేతలను, ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులను, ప్రధానమంత్రితో సహా కేంద్రమంత్రులను ఆయనే స్వయంగా తన పదవీ ప్రమాణ స్వీకారోత్సవానికి ఆహ్వానిస్తున్నారు.
ఇక చంద్రబాబు మంత్రివర్గంలో ఎంతమంది, ఎవరెవరు మంత్రులుగా ఉంటారనే అంశంపై చాలా జోరుగా చర్చలు సాగుతున్నాయి. రాష్ట్ర విభజన కారణంగా యం.యల్యేల సంఖ్య సగానికి సగం తగ్గిపోయినందున, ఆ నిష్పత్తిలోనే మంత్రుల సంఖ్య కూడా తగ్గిపోతుంది కనుక, మంత్రి పదవుల కోసం పోటీ కూడా చాలా గట్టిగానే ఉంటుంది. అందువల్ల చంద్రబాబుకు మంత్రివర్గం కూర్పు కత్తిమీద సామువంటిదేనని చెప్పవచ్చును. ఇక ఇల్లలకగానే పండగ కాదన్నట్లు,ఎన్నికలలో గెలిచి ప్రభుత్వపగ్గాలు చెప్పట్టగానే సంబరాపడేందుకు ఏమీ లేదు.
ప్రభుత్వ నిర్వహణకు కనీసం సరయిన కార్యాలయం కూడా లేని దుస్థితిలో వేలకోట్ల లోటు బడ్జెట్ తో ఆయన పరిపాలన మొదలుపెట్టబోతున్నారు. పైగా కొత్త రాజధాని నిర్మాణం, రుణాల మాఫీ హామీలు, సంక్షేమ పధకాలు, ఎన్నికలలో వివిధ వర్గాల ప్రజలకు పెన్షన్ల విషయంలో ఇచ్చిన హామీలు అన్నిటికీ ఆయన భారీగా నిధులు సమకూర్చుకోవలసి ఉంది. అందుకు ఆయన మోడీ ప్రబుత్వంపైనే చాలా ఆశపెట్టుకొన్నారు. కానీ కేంద్రంలో మోడీ ప్రభుత్వం కూడా ఇప్పుడే కొత్తగా అధికారం చెప్పటింది గనుక నిధుల విడుదలలో ఆలస్యమయితే అంతవరకు చంద్రబాబు ప్రభుత్వానికి ఆర్ధిక ఇబ్బందులు తప్పవు. అయితే గతంలో కూడా చంద్రబాబు అధికారం చేప్పట్టినపుడు రాష్ట్రంలో ఇటువంటి పరిస్థితులే ఉన్నప్పటికీ ఆయన నెగ్గుకు రాగలిగారు. కనుక ఈసారి మరి కొంచెం కష్టమయినా తప్పకుండా నెగ్గుకు రాగాలరనే నమ్మకం ఉంది.
ఆదాయం లేనప్పుడు ఖర్చులు తగ్గించుకోవడం ద్వారా కొంత ఉపశమనం పొందవచ్చును. కనుక చంద్రబాబు ప్రభుత్వం మొదటి నుండే పొదుపు మంత్రం పాటించడం మేలు. అది తన ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమంతోనే మొదలుపెట్టవచ్చును. ఇక కొన్ని విషయాలలో ప్రధాని నరేంద్ర మోడీని ఆదర్శంగా తీసుకోవడం మంచిది. నరేంద్ర మోడీ ప్రభుత్వ పగ్గాలు చెప్పట్టక మునుపే కొన్ని మంత్రిత్వ శాఖలను విలీనం చేయించి తన మంత్రి వర్గం సైజు కుదించుకొన్నారు. తద్వారా అదనపు భారం తగ్గించుకొన్నారు. మొదటి క్యాబినెట్ సమావేశంలోనే విదేశాలలో మూలుగుతున్న నల్లదనం వెనక్కి రప్పించేందుకు సుప్రీం కోర్టు మాజీ న్యాయ మూర్తి నేతృత్వంలో ‘సిట్’ ను ఏర్పాటు చేశారు. గత ప్రభుత్వం ఏర్పాటు చేసిన అనేక పనికిమాలిన జీ.ఓ.యం.లను రద్దు చేసి అనవసర భారం తగ్గించుకొన్నారు. దేశంలోకి కొత్తగా భారీ ఎత్తున విదేశీ పెట్టుబడులు రావాలంటే వివిధ ప్రభుత్వ శాఖలలో ఫైళ్ళు వేగంగా కదిలి అనుమతులు వేగంగా మంజూరు అవ్వాలి. అందుకే ప్రభుత్వ శాఖలలో ఫైళ్ళకు స్పీడ్ బ్రేకర్స్ వేస్తున్న అధికారులను, నియమావళిని ఒకటొకటిగా సరిచేస్తున్నారు.
అందువల్ల చంద్రబాబు కూడా మోడీ ప్రభుత్వాన్ని ఆదర్శంగా తీసుకొని ముందుకు సాగడం మంచిదే. మంచి పరిపాలనా దక్షుడని పేరుగాంచిన చంద్రబాబు ముందు రాష్ట్ర ప్రభుత్వశాఖలనన్నిటి మధ్య సమన్వయ పరిచి వాటిని నూటికి నూరు శాతం సమర్ధంగా పనిచేయించగలిగితే చాలా వరకు సమస్యలు అధిగమించవచ్చును. అదేవిధంగా రాష్ట్రానికి కొత్త పరిశ్రమలను, ముఖ్యంగా అతితక్కువ కాలంలోనే స్థాపించి, యువతకు ఉపాధి, రాష్ట్రానికి ఆదాయం సృష్టించగల సాఫ్ట్ వేర్ సంస్థలను రప్పించే ప్రయత్నాలు చేస్తే మేలు.