సీమాంద్రా ఛాంపియన్ ఎవరు?
posted on May 15, 2014 @ 12:06PM
ఇటీవల వరుసగా వెలువడిన స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాల సరళిని చూస్తే ఆంధ్రాలో తెలుగుదేశం పార్టీ, తెలంగాణాలో కాంగ్రెస్, తెరాసలలో ఏదో ఒకటి అధికారంలోకి రావచ్చని అర్ధమవుతోంది. ఇవి పట్టణ, గ్రామీణ ఓటర్ల అభిప్రాయాలను సమగ్రంగా ప్రతిబింబించే ఫలితాలు కనుక సార్వత్రిక ఎన్నికల ఫలితాలను అంచనా వేసేందుకు వీటిని ప్రామాణికంగా తీసుకోవచ్చును.
సర్వేలలో సిద్దహస్తుడని పేరుగాంచిన లగడపాటి రాజగోపాల్, తెలంగాణాలో తెరాస, ఆంధ్రాలో తెదేపా పూర్తి మెజార్టీతో అధికారంలోకి రావచ్చని జోస్యం చెప్పారు. ఆయన జోస్యం కూడా ఇంచుమించు స్థానిక సంస్థల ఫలితాలకు అనుగుణంగానే ఉంది. కానీ, నిన్న ఎన్డీటీవీ ఛానల్ ప్రకటించిన సర్వే ఫలితాలలో తెలంగాణా విషయంలో ఏకీభవించినా, ఆంధ్రాలో మాత్రం వైకాపాకి తెదేపాపై స్వల్ప ఆధిక్యత రావచ్చని ప్రకటించింది. తెదేపాకు 75-95అసెంబ్లీ, 13యంపీ సీట్లు, వైకాపాకు 80-100 అసెంబ్లీ, 12యంపీ సీట్లు రావచ్చని ప్రకటించింది.
మొన్న వెలువడిన స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాలకు ఇది పూర్తి భిన్నంగా ఉంది. ఆ ఫలితాలలో తెదేపా పట్టణ ప్రాంతాలతో బాటు గ్రామీణ ప్రాంతాలలో కూడా స్పష్టమయిన ఆధిక్యత కనబరచగా, గ్రామీణ ప్రాంతాలలో తిరుగులేని ఆధిక్యత ప్రదర్శిస్తుందని భావించిన వైకాపా ఆశించినంతగా ఫలితాలు రాబట్టలేకపోయింది. ఏ పార్టీ అయినా అన్ని ప్రాంతాలలో సరిసమానంగా ఓట్లు సాధించగలిగినప్పుడే విజయావకాశాలు ఉంటాయి. కానీ వైకాపాకు రెండు ప్రాంతాలలో ఏ ఒక్క చోట కూడా తెదేపాపై ఆధిక్యత చూపలేకపోయింది.
వరుసపెట్టి జరిగిన మూడు స్థానిక సంస్థ ఎన్నికలలో తెదేపాకే మొగ్గు చూపిన ప్రజలు, సార్వత్రిక ఎన్నికల సమయానికి అకస్మాత్తుగా మనసు మార్చుకొని వైకాపాకు ఓటు వేసి, జగన్మోహన్ రెడ్డికి అధికారం కట్టబెడతారని చెప్పడానికి సహేతుకమయిన కారణాలు కనబడటం లేదు. కానీ తెదేపాకే ఓటేస్తారని చెప్పేందుకు చాలా కారణాలే కనిపిస్తున్నాయి.
స్థానిక సంస్థల ఎన్నికలు జరిగే సమయానికి తెదేపా-బీజేపీల మధ్య ఎన్నికల పొత్తులు కుదరలేదు. అందువల్ల ఆ ఎన్నికలలో పడిన ఓట్లు అన్నీ కూడా కేవలం చంద్రబాబు సమర్ధతకు, తెదేపా జెండాకు పడినవిగానే చెప్పుకోవచ్చును. ఆ తరువాత అనేక రాజకీయ పరిణామాలు జరిగాయని వైకాపా నేత మైసూరా రెడ్డే స్వయంగా చెప్పారు. అయితే అవేవీ వైకాపాకు అనుకూలంగా జరిగినవి కావు.
తెదేపా-బీజేపీలు ఎన్నికల పొత్తులు పెట్టుకొన్నాయి. ప్రధానమంత్రి కాబోతున్న నరేంద్ర మోడీతో కలిసి చంద్రబాబు, పవన్ కళ్యాణ్ విస్తృతంగా ఎన్నికల ప్రచారం చేసి ప్రజలను ఆకట్టుకొన్నారు. రాష్ట్రంలో చంద్రబాబు అధికారంలోకి వచ్చినట్లయితే తాను అన్నివిధాల ఆయనకీ సహకరిస్తానని నరేంద్ర మోడీ స్పష్టంగా ప్రకటించారు. నరేంద్ర మోడీ స్వయంగా జగన్మోహన్ రెడ్డిపై తీవ్ర విమర్శలు గుప్పించడం కాకుండా, తాను ప్రధానమంత్రి అవగానే, ఆయనపై కేసుల విచారణను వేగవంతం చేస్తానని విస్పష్టంగా ప్రకటించారు.
ఇక పవన్ కళ్యాణ్ అడిగిన ప్రశ్నలకు వైకాపా సమాధానాలు చెప్పలేక తడబడి ఎదురుదాడికి దిగి ప్రజలలో మరింత పలుచనయింది. ఇవ్వన్నీ వైకాపాకు ప్రతికూలాంశాలే. అయినప్పటికీ, ప్రజలు ఎటువంటి పాలనానుభావం లేని, అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న జగన్మోహన్ రెడ్డికే అధికారం కట్టబెడతారని ఎన్డీటీవీ ఛానల్ వారు ఊహించడం, ఆనందం కలిగించే ఆ ఊహలలో వైకాపా తేలియాడటం చాలా ఆశ్చర్యంగా ఉంది. ఏమయినప్పటికీ రేపు ఫలితాలు వెలువడగానే ఈ ఊహాగానాలకు కూడా తెరపడి ఎవరు అసలు సిసలయిన ఛాంపియనో తేలిపోతుంది.